సాక్షి, మంచిర్యాల : ఆపద్బంధు పథకం జిల్లా ప్రజలను ఆదుకోలేకపోతోంది. నెల క్రితమే పథకంలో భాగంగా ప్ర భుత్వం రూ.21 లక్షలు విడుదల చేసినా.. పంపిణీకి ఆదేశాలు మాత్రం అందలేదు. దీంతో అధికారులు ట్రెజరీలో భద్రపరిచారు. మరోపక్క ఆలస్యంగా వచ్చిన ఆర్థికసాయమైన తమకెప్పుడు అందుతుందా అని లబ్ధిదారులు
వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రమాదవశాత్తు.. నక్సల్స్ చేతిలో చనిపోయిన నిరుపేద మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆపద్బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది.
18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుంది. దీని కింద మృతుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందుతుంది. దరఖాస్తుదారులు మరణధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్‌కార్డు, పోలీసు ఎఫ్‌ఐఆర్ కాపీ, పంచనామా రిపోర్టుతోపాటు దరఖాస్తు ఫారం భర్తీ చేసి సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి. అక్కడి నుంచి ఆర్‌డీవో, డీఆర్‌వో కార్యాలయాలకు దరఖాస్తు చే రుతుంది. జిల్లా అధికారులు రిపోర్టులను ప్రభుత్వానికి పంపితే.. వారిలో అర్హులకు ఆర్థికసాయం అందుతుంది.
అయితే.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇన్సురెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేస్తూ వచ్చింది. కానీ.. పలు జిల్లాల్లో బీమా కంపెనీలు డబ్బుల చెల్లింపునకు సహకరించకపోవడంతో లబ్ధిదారులకు ఆర్థికసాయం అందడంలో ఆలస్యం అయ్యింది. దీంతో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఇన్సురెన్స్ కంపెనీలతో సంబంధం లేకుండా ఆర్థికసాయం తానే భరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి జిల్లాకు రెండొందల మంది చొప్పున రూ.కోటి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాకు రూ.21 లక్షలు విడుదల చేసింది.
42 మంది లబ్ధిదారులు..!
రోడ్డు, అగ్ని ప్రమాదం, పిడుగుపడి, చెట్టుపై నుంచి పడి, పాము కాటు, కరెంట్ షాక్ వంటి ప్రమాదాల్లో చనిపోయిన వారు ఇప్పటి వరకు జిల్లాలో 42 మంది ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీరికి ఆర్థికసాయం అందించొచ్చని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి నిధులూ విడుదలవడంతో త్వరలోనే ఆర్థికసాయం అందుతుందని లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం దాదాపు అన్ని జిల్లాలకు గత నెల నిధులు కూడా విడుదల చేసింది. అవి జిల్లా ట్రెజరీలకు చేరాయి. అక్కడి నుంచి నేరుగా లబ్ధిదారులకు డీడీల రూపంలో ఆర్థికసాయం అందాల్సి ఉంది.
కానీ ట్రెజరీ డెరైక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రాకపోవడంతో జిల్లాస్థాయిలో ఆర్థికసాయం నిలిచిపోయిందని కలెక్టరేట్‌లోని ఆపద్బంధు సెక్షన్ ఇన్‌చార్జి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆదేశాలు అందిన వెంటనే అర్హులందరికీ ఆర్థికసాయం అందుతుందని.. ఈ విషయంలో ఆందోళన చెందవద్దని లబ్ధిదారులను కోరారు.
ఊరిస్తున్న సాయం
Published Tue, Nov 25 2014 2:17 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement