మావోయిస్టులు వారోత్సవాలు | police high alert in adilabad | Sakshi
Sakshi News home page

మావోయిస్టులు వారోత్సవాలు

Published Thu, Nov 27 2014 2:44 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

మావోయిస్టులు వారోత్సవాలు - Sakshi

మావోయిస్టులు వారోత్సవాలు

మంచిర్యాల సిటీ : డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. బుధవారం మందమర్రిలో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు జిల్లా కార్యదర్శి బండి ప్రకాష్ స్వగ్రామమైన మందమర్రిలోని మున్సిపాలిటీ నోటీసు బోర్డుపై పోస్టర్లు వెలియడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వారోత్సవాలు నిర్వహించాలని జిల్లాలో పనిచేస్తున్న మంగి, ఇంద్రవెల్లి దళాలు నిమగ్నమయ్యాయి.

ఈ రెండు దళాలే కాకుండా జిల్లా కార్యదర్శి ప్రకాష్‌తోపాటు వరంగల్ జిల్లా నుంచి వచ్చిన సాంబయ్యకు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. జిల్లా నుంచి 23 మంది జిల్లా, రాష్ట్ర, కేంద్ర కమిటీలో బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 400 మంది లొంగిపోయారు. 300 మంది ప్రస్తుతం జిల్లాలో సానుభూతిపరులు పనిచేస్తున్నారని నిఘా వర్గాల అంచనా. వారోత్సవాలు జిల్లాలో వీలుకాని నేపథ్యంలో ప్రాణహిత అవతల చేపట్టాలని మావోలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రాణహిత అవతల చేపడితే ఇబ్బంది ఉండదనేది పోలీసుల అభిప్రాయం.

 ఉనికి చాటేందుకు..
 వారోత్సవాలను నేపథ్యంలో జిల్లాలో ఏదో ఒక విధం గా తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. తమ ఉనికిలో భాగం గా పోలీసులకు సమాచారం అందిస్తూ ఇబ్బందికరంగా మారిన ఇన్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వారిని ఈ పాటికే రక్షణ ప్రాంతాలకు తరలించారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పోలీస్ బలగాలు తమ వ్యూహానికి పదునుపెట్టినట్టు తెలిసింది. రెండు సార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నా.. ఈసారి వారోత్సవాల్లో ఎదురుపడితే గురితప్పరాదనే లక్ష్యంతో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.

 కాగా.. జిల్లా కార్యదర్శి బండి ప్రకాష్ స్వస్థలం మందమర్రి పట్టణం. తన సొంత ఊరిలోనే పీఎల్‌జీఏ వారోత్సవాల పోస్టర్లను మంగళవారం రాత్రి వేయించి తన ఉనికిని చాటుకున్నాడు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం, కూరగాయల మార్కెట్టు, కేకే-5 గని ప్రాంతాల్లో వారోత్సవాల పోస్టర్లు వేయడం గమనార్హం. పోస్టరు వెలసిన మార్కెట్టు ప్రాంతం మందమర్రి పోలీస్ స్టేషన్‌కు కేవలం అర కిలోమీటరు దూరంలో ఉండటం ఆశ్చర్య పోవాల్సిన అంశం.

 పీజీఏ టు పీఎల్‌జీఏ..
 పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రతి ఏటా డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదట పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీజీఏ) డిసెంబర్2, 2000 సంవత్సరంలో ప్రారంభించింది. కేంద్ర కమిటీ సభ్యులైన నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వీరి మృతికి సంతాపంగా పీజీఏను ప్రారంభించారు. అనంతరం పీజీఏను సెప్టెంబర్ 21, 2004న పీఎల్‌జీఏగా మార్చారు.

 రాష్ట్ర కమిటీలోకి బండి ప్రకాష్..
 మావోయిస్టు జిల్లా కార్యదర్శిగా, అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న బండి ప్రకాష్‌ను కొత్తగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తీసుకున్నట్లు సమాచారం. పోలీసులకు మింగుడుపడని ప్రకాష్ సింగరేణి గనులపై కొంత మేర పట్టు సాధించాడని, రెండు నుంచి మూడు గనులకు ఒకరిని తన అనుచరులను తయారు చేసుకున్నారని తెలిసింది. వీరంతా గతంలో మావోయిస్టులో పనిచేసి లొంగిపోయిన వారేనని నిఘా వర్గాలకు సమాచారం ఉంది.

 ఎదురుకాల్పుల నుంచి తప్పించుకుని..
 జిల్లాలో మే 24న కాసిపేట మండలం వెంకటాపూర్ శివారు అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున మావోల డంప్ బయట పడింది. జూలై 31న తిర్యాణి-కాసిపేట మండలాల సమీపంలో ఉన్న మంగీ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగడంతో మావోలు తప్పించుకున్నారు. సెప్టెంబర్ 14న తిర్యాణి మండలం పంగిడి మాదారం అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరోసారి మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈ రెండు ఘటనల్లో జిల్లా కార్యదర్శి బండి ప్రకాష్, చార్లెస్, ఆడెల్లు వంటి ముఖ్యమైన నాయకులు తప్పించుకున్నారు.

 ఎవరీ ఆజాద్..?
 జిల్లాపై మరింత పట్టు సాధించడానికి వరంగల్లు జిల్లా కు చెందిన సీనియర్ మావోయిస్టు సాంబయ్య అలియా స్ ఆజాద్ కొత్తగా జిల్లాలో సంచరిస్తున్నట్లు నిఘా వర్గా లు గుర్తించాయి. ఆజాద్ ఎత్తులను చిత్తు చేయడానికి పోలీస్ శాఖ అతని కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. పీఎల్‌జీఏ వారోత్సవాలను జరిపి తీరాల్సిందేనని కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ఆజాద్‌తోపాటు బండి ప్రకాష్‌కు బాధ్యతలు అప్పగించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

 కోల్‌బెల్ట్ ఎమ్మెల్యే సహకారం..
 కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు మావోయిస్టుల అవసరాలను అప్పుడప్పుడు తీరుస్తున్నారని రాష్ట్ర స్థాయి నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని విశ్వనీయ వర్గాల సమాచారం. మావోయిస్టులకు అవసరమైన సామగ్రిని వారి కొరియర్ల ద్వారా అవ సరమైన మేరకు పంపిస్తున్నారని, ఇది గతేడాది నుంచి కొనసాగుతోదని నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. దీనిపై మరింత లోతుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిఘా వర్గాలు విచారణ చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement