చంద్రన్న నేతృత్వంలో ‘మావో’ తెలంగాణ కమిటీ
బండి ప్రకాష్, శివారెడ్డి, చొక్కారావు కీలకం
{పస్తుతం కమిటీలో 80 మంది
సమాచారం సేకరించిన రాష్ట్ర నిఘా వర్గాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (ఎన్‌టీఎస్‌జెడ్‌సీ) తాజాగా తెలంగాణ స్టేట్ కమిటీ (టీఎస్‌సీ)గా మారింది. పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రెటరీగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న దీనికి నేతృత్వం వహిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కమిటీలో ప్రస్తుతం 80 మంది వరకు కేడర్ ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ అడవులు కేంద్రంగా ఖమ్మం జిల్లాపై దృష్టి సారించిన టీఎస్‌సీ ప్రస్తుతం ద్వితీయ స్థాయిలో నేతృత్వం వహించే కేడర్‌ను సమీకరించుకోవడంపై దృష్టి పెట్టింది. ఎన్నికల నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి ముమ్మరంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు కీలక ఆధారాలు సేకరించాయి. ఖమ్మంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లోనూ అవకాశం ఉన్నచోట ఉనికిని ప్రదర్శించాలని టీఎస్‌సీ ప్రయత్నిస్తోంది.
దీనికి చెక్ చెప్పేందుకు నిఘా వర్గాలు సైతం పక్కా వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం వడకాపూర్‌కు చెందిన చంద్రన్న అసలు పేరు పుల్లూరి ప్రసాదరావు. ఈయనకు శంకరన్న, శంకర్రావు, మల్కాపురం భాస్కర్ అనే మారుపేర్లూ ఉన్నాయి. ఎన్‌టీఎస్‌జెడ్‌సీతో పాటు సెంట్రల్ కమిటీకి సెక్రెటరీగా వ్యవహరించిన ఇతడిపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం మదగూడకు చెందిన యాప నారాయణ అలియాస్ లక్ష్మ అలియాస్ హరిభూషణ్, వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలం నార్లపూర్‌కు చెందిన ఇ.శివారెడ్డి అలియాస్ కిరణ్, కల్వపల్లికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాష్ అలియాస్ బండి బడా అలియాస్ క్రాంతి టీఎస్‌సీలో కీలక భూమిక పోషిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం టీఎస్‌సీ దృష్టంతా ఆపరేషన్లు నిర్వహించడం కంటే కేడర్‌ను పెంచుకోవడం పైనే ఉందని చెప్తున్నాయి.