The state Division
-
రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయ గండం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయార్జనలో వెనకడుగేస్తోంది. లక్ష్యం బారెడు కాగా ఆదాయం మూరెడులా ఉంది ఈ శాఖ పరిస్థితి. గతేడాది సంభవించిన హుద్‌హుద్ తుపానుతో పాటు రాష్ట్ర విభజన, శూన్యమాసం వెరసి ఆదాయానికి దెబ్బకొట్టాయి. రియల్ బూమ్ లావాదేవీలు కూడా కొన్ని చోట్ల మందగించడంతో ఆ ప్రభావం లక్ష్యంపై పడింది. 2015-16 మధ్య కాలానికి రిజిస్ట్రేషన్ శాఖ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.102 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం రూ.67 కోట్లే సాధించగలిగాయి. ఏటా రియల్టర్ల భూ క్రయ విక్రయదారుల వల్ల ఆదాయం వస్తున్నా పలు చోట్ల వెలసిన అనధికార లే అవుట్లపై మున్సిపల్, పంచాయతీ అధికారులు కొరడా ఝులిపిస్తుండడంతో లావాదేవీలు నిలిచిపోతున్నాయి. ఇదో కారణం ఆదాయపన్నుశాఖలో మరింత సరళీకృతానికి వీలుగా రిజిస్ట్రేషన్‌శాఖలో జరిగే ప్రతి రూ.5 లక్షల లావాదేవీకి పాన్‌కార్డు జత చేయడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కొన్నిచోట్ల ఇబ్బందులకు గురిచేస్తోంది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఇరువర్గాలూ తమ ఆధార్‌కార్డుల వివరాలు కూడా పొందుపర్చాలని చెబుతుండడం వెనుక ఏదో మతలబు ఉంటుందన్న అనుమానాలు ఆస్తుల క్రయవిక్రయదారుల్లో నెలకుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో 30 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు పాన్ నంబర్ పొందుపర్చడం వల్ల మోసాలకు తావుండదని, ఆదాయం ఏ రూపంలో వస్తుందో, ఏ రూపంలో వెళ్తుందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే చాలా మందికి ఇప్పటికీ ఆధార్, పాన్కార్డుల్లేవ్. ఆధార్ సీడింగ్ శతశాతం పూర్తి చేశామని చెబుతున్నా వాటిల్లోని సాంకేతిక కారణాలు, నిర్లక్ష్యం కారణంగా వేలాది మందికి ఆధార్ కార్డులు ఇప్పటికీ రాలేదు. అలాగే పాన్ కార్డు తీసుకుంటే ముప్పు వాటిల్లుతుందేమోనన్న భయంతో చాలామంది వీటిని తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాగేగ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతీ క్రయ విక్రయం వెనుక ఇప్పటివరకూ డాక్యుమెంట్ రైటర్లు, దళారులే చక్రం తిప్పేవారు. ఇప్పుడా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం పకడ్బందీగా ఆధార్, పాన్ నెంబర్ల నమోదును తప్పనిసరి చేసిందని చెబుతున్నా దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుమానిస్తున్నారు. నిరుద్యోగుల పొట్టకొట్టేందుకు ఇదీ ఓ కారణం కావచ్చుని ఆక్షేపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్, పాన్ నంబర్లు పొందుపర్చడం వల్ల భవిష్యత్తులో ఇరువర్గాల మధ్య విభేదాలు రాకుండా ఉంటాయని, డాక్యుమెంట్ రైటర్లు, బ్రోకర్ల బారిన పడకుండా ఉండొచ్చుని, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందికి రూపాయి కూడా అనధికారికంగా చెల్లించకుండా ఉండేందుకు వీలవుతుందని చెబుతున్నా ఇప్పటికప్పుడు ఇది సాధ్యం కాదని సిబ్బందే చెబుతున్నారు. -
బదిలీలు ఎప్పుడో..
- ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్ - ఇంకా ప్రకటించని ప్రభుత్వం - నెల రోజుల్లో పూర్తరుుతే మేలు - విద్యా సంవత్సరం ప్రారంభమైతే కష్టం.. - డిప్యూటేషన్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు అవసరం అనుకున్న చోటకు అధికారుల బదిలీలు జరుగుతూనే ఉంటారుు. ఎటొచ్చీ ఉద్యోగులు బదిలీ కావాలని కోరుకుంటే మాత్రం కుదరదు. ఇతర సమస్యలు చెప్పి బదిలీ కావడానికి చట్టం ఒప్పుకోదు. సాధారణ బదిలీల కోసం సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడిస్తుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా బదిలీలు నిలిచిపోరుున విషయం విదితమే. ఏప్రిల్ ఆఖరు లేదా మే నెల మొదట్లో సాధారణ బదిలీ విషయమై ప్రభుత్వం ప్రకటన చేయడం ఆనవారుతీ. ఈ తతంగమంతా నెల రోజుల్లో పూర్తరుుతే ఉద్యోగులు వారి పిల్లలను బదిలీ అరుున చోట విద్యా సంస్థల్లో చేర్చుకోవడానికి, ఇతర ప్రత్యామ్నాయూలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. హన్మకొండ అర్బన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సివిల్ సర్వీసు అధికారులు మినహా ఇతర స్థాయి అధికారుల పంపకాలు పూర్తి కాలేదు. దీనికి ప్రభుత్వం గడువు పొడిగించడంతో లెక్కలు ఇప్పట్లో తేలేట్టు లేవు. ఒకవేళ ఇదే కారణంతో సాధారణ బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేయకుండా ఉంటుందా అన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. సాధారణ బదిలీల విషయంలో ప్రభుత్వం నిషేధం ఉన్నా అత్యవసరాలు.. పరిపాలనా సౌల భ్యం పేరుతో సర్దుబాట్లకు అవకాశం కల్పించింది. దీంతో అవసరం అనుకున్న చోటకు అధికారుల బది లీలు జరుగుతూనే ఉన్నారుు. ఎటొచ్చీ ఉద్యోగులు బదిలీ కావాలని కోరుకుంటే మాత్రం కుదరదు.. ఇతర సమస్యలు చెప్పి బదిలీ కావడానికి చట్టం ఒప్పుకోదు. దీంతో వందల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరికే ‘సౌలభ్యం’ బదిలీలపై నిషేధం ఉన్నప్పుడు ఉన్నతాధికారులు పరిపాలనా సౌలభ్యం పేరుతో చేసే బదిలీల్లో కొం దరు ఉద్యోగులకు మాత్రమే న్యాయం జరుగుతోం ది. మారుమూల, ప్రాధాన్యం లేని ప్రాంతంలో పని చేసేవారికి బయటపడే మార్గం ఉండటం లేదు. జిల్లాలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆర్ఐ పోస్టుల కోసం.. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించి ఆర్ఐ పోస్టు విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. నిబంధనల ప్రకారం సీనియర్ అసిస్టెంట్ నుంచి డీటీగా పదోన్నతి పొందడానికి సదరు ఉద్యోగి రెండేళ్ల ఆర్ఐ పీరియడ్ పూర్తి చేసి ఉండాలి. అయితే జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆర్ఐ పోస్టుల్లో ఉన్నవారు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్నారు. మరికొందరు మండలం మారినా ఐదేళ్లకుపైగా ఆర్ఐలుగా కొనసాగుతున్న వారున్నారు. ఉదాహరణకు.. ఆర్ఐ పీరియడ్ పూర్తయిన వారు.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిని మండలాలవారీగా పరిశీలిస్తే.. వరంగల్, పర్వతగిరి, జఫర్‌గఢ్, మంగపేట, పరకాల, రేగొండ, గణపురం, భూపాలపల్లి, తాడ్వాయి, ములుగు, వెంకటాపుర్, నర్సంపేట, దుగ్గొండి, గూడూరు, కొత్తగూడ, చెన్నారావుపేట, ఖానాపురం, మహబూబాబాద్ డివిజన్లో దాదాపు మొత్తం మండలాలు, జనగామ, లింగాలగణపురం, రఘునాథపల్లి, చేర్యాల, నర్మెట, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఉన్న కొందరు ఏఆర్‌ఐలు, కొందరు ఎమ్మారైలు ఈ జాబితాలో ఉన్నారు. సాధారణ బదిలీలు లేకపోవడంతో అధికారులు వీరిని కదిలించడంలేదు. అయితే 2013 సాధారణ బదిలీల సమయంలో చాలామంది పైరవీల వల్ల ఆర్ఐ పోస్టుల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సమయంలో స్థానిక నేతలతో ఉన్నతాధికారులకు చెప్పించడం, లేదా అర్డీఓలతో సిఫార్సు లేఖలు ఇవ్వడం షరా మామూలుగా మారుతోంది. వెరసి నిజాయితీగా ఆర్ఐ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం రావడం లేదు. పదోన్నతుల విషయానికి వచ్చేసరికి తప్పనిసరి కావడంతో నిబంధనలు పక్కన పెట్టి వారిని ఆర్ఐ పోస్టుకు పంపాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీఆర్వోలదీ అదే తీరు.. ఇక వీఆర్వోల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హ న్మకొండ లాంటి మండలాలకు 2009లో వచ్చిన వీ ఆర్వోలు ఇప్పటివరకు కదల్లేదు. ఇంకా చెప్పాలం టే కాస్త ‘రెవెన్యూ’ ఉన్న గ్రామాల్లో వీఆర్వోలు కదలిక లేకుండా ఉన్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట పని చే య డం వల్ల కూడా కొన్నిచోట్ల వీఆర్వోల పరిస్థితి ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి వారిలోనే కొందరు అక్రమ వసూళ్లు, ఏసీబీ దాడు లు, భూముల అన్యాక్రాంతం, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారి జాబితాలో చేరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి మంచి ప్రదేశాలకు వచ్చే అవకాశం తగ్గుతుంది కూడా. త్వరలో ఉత్తర్వులు బదిలీలపై విధి విధానాలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఈ నెలాఖరు వరకు సాధారణ బది లీలకు అవకాశాలు ఉంటాయని సమాచారం. -
స్వార్థపరుల ప్రయోజనం కోసమే రాష్ర్ట విభజన
కలెక్టరెట్: ఆత్మీయ అనుబంధాలను గుర్తు చేస్తున్న పండుగ.. గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సాంప్రదాయం మనది. కష్ట సుఖాలను జీవితంలో చవిచూడాలి. మాధుర్యం, షడ్రుచుల ఉగాది పచ్చడి తెలియ చెప్పే నిజం అదేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రెవె న్యూశాఖ మంత్రి కే.ఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ఢిల్లీ తెలుగు అకాడమీ అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ 27వ ఉగాది వేడుకలు, 2015 పురస్కారాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూ ఇండియా ఎస్యూరెన్సు, ఇండియన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఆయిల్, కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్‌యూడీసీఓ, ఎన్ఎండీసీ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందిచాయి. ఈ సందర్భంగా ప్రముఖులకు ఉగాది పురస్కారాలు (ఉద్యోగ రత్న), అవార్డులు అందజేశారు. అవార్డు పొందిన వారిలో ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి, ఐఎఎస్‌లు దాసరి శ్రీనివాస్‌లు, కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి, ఐటీఐఎల్ సీఎండీ కే.ఎల్ డింగ్ర, మెట్రో ఇండియా సీఎండీ సీఎల్ రాజం, ఎస్బీహెచ్ ఎండీ సంతను ముఖర్జీ, దూరదర్శన్ డెరైక్టర్ శైలజా సుమన్, కరూర్ వైశ్యా బ్యాంక్ సీనియర్ అధికారి కె.వెంకటేశ్వర్లు తదితరులను డిప్యూటీ సీఎం, సినారేలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంటింటా తెలుగు ఆటాపాటా కొనసాగాలని, ప్రతి నోటా తెలుగు వినిపించాలని, ప్రతి ఒక్కరూ తెలుగును అనుసరించాలని ఆకాంక్షించారు. ఎన్ని దేశాలు మారిన ఎలా విడిపోయినా తెలుగు సంస్కృతి, తెలుగు భాషను మరువద్దన్నారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన తెలుగువారిని కొందరు స్వార్థపరులు స్వలాభాల కోసం విడదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎందుకు చేశారో కానీ ఈ రోజు తెలుగువారంతా బాధపడాల్సి వస్తుందన్నారు. ఈ ఉగాది నూతన కొంతమందికి ఆనందంగా ఉంటుందని, కానీ కొంతమందికి విభజన చేదు అనుభవంగా మిగిలిందన్నారు. కలిసి పనిచేసి మంచి ఫలితాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మోహన్‌కందా, ఐఏఎస్‌లు ఎన్.గోపాలకృష్ణ, బీవీ రామారావు, ఆర్‌ఎస్‌జీ రావు, డాక్టర్ జె. చెన్నయ్య, డాక్టర్ ఎన్వీఎల్ నాగరాజు, చొక్కాపు వెంటరమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
భరోసా ఏదీ?
పేద తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచే ‘బంగారు తల్లి’కి భరోసా కరువైంది. ఆడపిల్లలపై వివక్షను రూపమాపేందుకు గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి జిల్లాలో ఆదరణ కరువైంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ‘బంగారు తల్లి’ అమలు ఇలా.. దరఖాస్తు చేసుకున్న వారు 32,008 మొదటి విడ త డబ్బులు అందుకున్న వారు 12,942 అర్హులుగా గుర్తించినా డబ్బులు రానివారు 13,799 ఇంటివద్ద ప్రసవం అయినవారు 3,115 సాక్షి, మహబూబ్‌నగర్: జననీ సురక్ష యోజన, సుఖీభవ, రాజీవ్ విద్యాదీవెన వంటి పథకాలతో సంబంధం లేకుండా బంగారు తల్లి పథకాన్ని రూపొందించారు. జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటివరకు 32,008 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో కేవలం 12,942 మందికి జనన నమోదు సమయంలో ఇచ్చే రూ.2,500 మాత్రమే అందాయి. మిగతా పద్దుల మాటే మరిచారు. ఈ పథకానికి అర్హత సాధించిన 13,799 మంది లబ్ధిదారుల జాబితాను సెర్ప్‌కు పంపించారు. వీరికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. అలాగే ఇంటి వద్ద డెలివరీ జరిగిన 3,115 మంది కూడా డబ్బులు రాలేదు. పది నెలలుగా లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపలేకపోతున్నారు. స్పందన కరువు బంగారు తల్లికి దరఖాస్తు చేసుకున్న వారికి అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రావడంలేదు. అయితే ఈ పథకాన్ని ప్రాథమికంగా నమోదు చేసుకునే వారు మండల సమాఖ్య కోఆర్డినేషన్(ఏపీఎం), మండల సమాఖ్య ప్రతినిధి, సీడీపీఓ అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో వారేమీ చేయలేకపోతున్నారు. అయితే మరికొన్ని చోట్ల బ్యాంకులతో సమస్య తలెత్తింది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా తల్లి ఖాతాలో జమచేస్తారు. ఈ ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుంది. కొన్నిఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లు అధికారుల రికార్డుల్లో పేర్కొంటున్నా వాస్తవానికి చేరడం లేదు. లబ్ధిపొందే తీరు.. ఆడపిల్ల పుట్టగానే జనన నమోదు సమయంలో నెలరోజుల వ్యవధిలోనే రూ.2,500 బ్యాంకు ఖాతాలో జయచేస్తారు. ఆ తర్వాత 1-2 సంవత్సరాల వరకు టీకాల నిమిత్తం ఏడాదికి రూ.వెయ్యి చొప్పున అందనున్నాయి. 3- 5 ఏళ్ల మధ్య సంవత్సరానికి రూ.1,500, 6-10 ఏళ్ల వరకు ఏడాదికి రూ.రెండు వేల చొప్పున అందనుంది. 11-13 ఏళ్లవరకు అంటే ఆరు నుంచి 8వ తరగతి వరకు ఏడాదికి రూ.2,500 అందుతుంది. 14-15 ఏళ్ల వరకు అంటే తొమ్మది, పదో తరగతి చదివే సమయంలో ఏడాదికి రూ.మూడువేల చొప్పున అందనుంది. 16-17 ఏళ్ల వరకు ఇంటర్ చదివే వరకు ఏడాదికి రూ.3,500, 18- 21 ఏళ్ల వరకు గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో ఏడాదికి రూ.4వేల చొప్పున అందుతుంది. ఇలా మొత్తం రూ.55,500 బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా రూపొందించారు. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పాసైతే రూ.50,000, గ్రాడ్యుయేషన్ పాసైతే రూ.లక్ష ఇలా మొత్తం రూ.1,55,000 అదనంగా అందనుంది. మొత్తం మీద బంగారు తల్లికి రూ.రెండు లక్షల మేర లబ్ధి చేకూరనుంది. డిసెంబర్లో డబ్బులు వచ్చే అవకాశముంది బంగారుతల్లి పథకం సంబంధించి డబ్బులు అందని మాట వాస్తవమే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు డబ్బులు రావడంలేదు. అర్హులైన 13వేల మందికి కూడా మొదటి విడతగా అందజేయాల్సిన డబ్బులు రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత విధివిధానాలు ఖరారు కాలేదు. ప్రస్తుతం సభలో బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో బంగారుతల్లి అర్హులకు వచ్చే నెలలో డబ్బులు వచ్చే అవకాశముంది. - చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎవర్ని అడిగినా సమాధానం లేదు బంగారు తల్లి పథకం కోసం ధరకాస్తులు చేసుకుని నాలుగు నెలలు అ వుతున్నా ఇప్పటివరకు ఒక్కపైసా రాలేదు. కా ర్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. పైసలు వస్తాయో రావో కూడా చెప్పడం లేదు. మా మండలంలో 680 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 120మందికి మాత్రమే రూ.2500 చొప్పున అందించారు. - సుమేరా, మానవపాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు బంగారుతల్లి పథకం కింద గ తేడాది నవంబర్ 9న అధికారులు బాండ్ పేపర్ ఇచ్చారు. ఏడాదిగా ఒక్కరూపాయి కూడా అందలేదు. ఐకేపీ అధికారులు బ్యాంకు ఖాతాలో జమ చేశామని చెబుతున్నా.. డబ్బులు మాత్రం రాలేదు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. పాలెం యూబీఐ పరిధిలో బంగారు తల్లి పథకం లబ్ధిదారులకు ఏ ఒక్కరికీ డబ్బులు రాలేదు. - గన్నోజు సుమతి, పాలెం -
పచ్చనోటు.. అక్రమాలకు రూటు
సాక్షి,గుంటూరు రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ల్లో అధికారుల ధనదాహం కారణంగా అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో సరిహద్దు చెక్‌పోస్టులు రెండింటిని ఏర్పాటు చేశారు. ఒకటి నాగార్జునసాగర్, మరొకటి పొందుగల వద్ద ఉంది. ఇక్కడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ క్యాష్ కొట్టిన వాహనాన్ని చెక్ చేయకుండా పంపివేయడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న దందా ఉన్నతాధికారులకు తెలియనీయకుండా కొందరు సిబ్బంది తమదైన శైలిలో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రివేళ వారి ఆగడాలకు హద్దు లేకుండా పోతోందని, దొరికిన కాడికి దోచెయ్ అన్న చందంగా విధులు నిర్వహిస్తున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఇక్కడి తంతు అధికారుల దృష్టికి వెళ్లినా, వారు స్పందించేలోపు వాహనాలు రాష్ట్రం దాటి వెళుతున్నాయి. అసలు లక్ష్యం ఇది... దాచేపల్లి మండలం పొందుగల, నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్ వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల్లో రవాణా, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, పోలీస్ తదితర శాఖలకు చెందిన సిబ్బందిని వాహనాల తనిఖీ కోసం నియమించారు. ఆయా వాహనాల రికార్డులను తనిఖీ చేయడంతో పాటు వాహనంలో వున్న సరకు కూడా పరిశీలించాల్సి వుంది. అనుమానం వున్న వాహనాలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించాలి. మితిమీరిన లోడుతో వచ్చే వాహనాలపై కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వ పన్నుల వసూలు చేపట్టాలి. అలాగే రాత్రింబవళ్లు పటిష్ట నిఘా కొనసాగిస్తూ సమర్థంగా విధులు నిర్వహించాల్సి వుంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీలు, మన జిల్లా నుంచి తరలివెళ్లే బియ్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్ట వచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. సరిహద్దులు దాటుతున్న బియ్యం, ఇసుక బియ్యం, ఇసుక అక్రమ రవాణా వ్యాపారులు, జీరో బిల్ వ్యాపారులు సరిహద్దు చెక్‌పోస్ట్‌లను తమ అక్రమాలకు అడ్డాలుగా మలచుకుంటున్నారు. అక్కడ ఎవరు విధుల్లో వున్నారు. అనే సమాచారాన్ని ముందుగానే సేకరిస్తున్నారు. వారికి అనుకూలమైన వ్యక్తులు వుంటే చాలు. వెంటనే వారి వాహ నాలను హడావుడిగా చెక్‌పోస్ట్‌లను దాటిస్తున్నారు. నిమిషాల వ్యవధిలో బియ్యం, ఇసుక, వంటివి రాష్ట్ర సరిహద్దులు దాటి బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. అక్రమ సరకుతో ఉన్న లారీని చెక్‌పోస్ట్ దాటించినందుకు ప్రతిగా వేలల్లో నగదు చేతులు మారుతున్నట్లు సమాచారం. భారీ వాహనాలు మితి మీరిన లోడుతో వచ్చినా కేసులు నమోదు చేయకుండా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేయకుండా అక్కడి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వాహనాల డ్రైవర్లు బహిరంగంగానే చెబుతున్నారు. సరిహద్దు చెక్‌పోస్ట్‌లపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు జిల్లా నుంచి బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్న బియ్యం,ఇసుక తదితర వాటిని పట్టుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు. -
నవసేన
సాక్షి, సిటీబ్యూరో: జంట కమిషనరేట్ల పరిధిలో ఆదివారం భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. తొమ్మిది మంది కొత్తవారికి పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో ఇద్దరిని సైబరాబాద్‌కు, ఏడుగురిని హైదరాబాద్‌కు కేటాయించారు. ఇక్కడ విధులు నిర్వహించిన 13 మంది ఇతర జిల్లాలకు, డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. జంట కమిషనరేట్లు ఏర్పాటయ్యాక ఇంత పెద్ద సంఖ్యలో ఐపీఎస్‌లు బదిలీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్ర విభజన నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. నగర పోలీసు కమిషనరేట్‌లో శాంతి భద్రతల విభాగానికి చెందిన ఐదుగురు, ట్రాఫిక్ విభాగానికి చెందిన ఇద్దరు ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించారు. సైబరాబాద్‌లో జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్‌తోపాటు ఐదు జోన్లలో కేవలం మాదాపూర్ మినహా మిగిలిన నాలుగు జోన్ల డీసీపీలు విశ్వప్రసాద్, రమేష్‌నాయుడు, ఏఆర్ శ్రీనివాస్, కోటేశ్వరరావులను కదిలించారు. వీరి స్థానంలో కేవలం మల్కాజిగిరి జోన్‌కు మాత్రమే కొత్తగా అధికారిని నియమించారు. బాలానగర్, ఎల్బీనగర్ జోన్లకు అధికారులను నియమించాల్సి ఉంది. జాయింట్ పోలీసు కమిషనర్‌గా వచ్చిన కొత్త అధికారికి శంషాబాద్ జోన్ డీసీపీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. త్వరలో సైబరాబాద్‌కు మరో ముగ్గురు ఐపీఎస్‌లు రావాల్సి ఉంది. ఇంటెలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేసిన డాక్టర్ వి.రవీందర్ తూర్పు మండలం డీసీపీగా బదిలీ అయ్యారు. సమర్ధవంతంగా.. వరంగల్ డీఐజీగా బదిలీ అయిన 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎం.మల్లారెడ్డి సిటీ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం పని చేశారు. నాలుగేళ్ల మూడు నెలల పాటు సేవలందించారు. కడప జిల్లా ఎస్పీగా పని చేస్తూ మల్లారెడ్డి 2010 ఆగస్టులో హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ డీసీపీ-2గా ఏడాదికి పైగా విధులు నిర్వర్తించారు. అక్కడ నుంచి నగర భద్రతా విభాగం (సీఎస్‌డబ్ల్యూ) డీసీపీగా బదిలీ అయ్యారు. ఇక్కడ పని చేస్తుండగానే 2012 జూన్‌లో డీఐజీగా పదోన్నతి పొంది సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్-క్వార్టర్స్ సంయుక్త పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర క్రితం స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. అనేక ఉద్యమాలు, ఉద్రిక్తతలతో పాటు కీలక ఘట్టాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలను సమర్ధవంతంగా పర్యవేక్షించారు. -
రెండు నెలల బడ్జెట్‌కు ఓకే
గవర్నర్ ఆమోదం.. సంచిత నిధి నుంచి వినియోగం డిసెంబర్ 2 వరకు వినియోగించుకునే అవకాశం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ రెండో తేదీ నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు సంచిత నిధి నుంచి రూ.16,890.85 కోట్లు వ్యయం చేయడానికి గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. దీనితో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తరువాత అప్పట్లో గవర్నర్ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు దాదాపు రూ. 26,573 కోట్లను సంచిత నిధి నుంచి వినియోగించుకోవడానికి అనుమతించారు. అక్టోబర్ రెండో తేదీలోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభను సమావేశపరిచి బడ్జెట్‌కు ఆమోదం పొందాల్సి ఉండింది. అయితే విభజన చట్టంలో ఆరు నెలల కాలానికి సంచిత నిధి నుంచి పాలన, వేతనాలు ఇతర వ్యయానికి గవర్నర్ అనుమతిస్తే చాలన్న వెసులుబాటు ఉంది. దీనితో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను వాయిదా వేశారు. రెండు నెలల కాలానికి సంచిత నిధి నుంచి నిధులు తీసుకోవడానికి వీలుగా మంత్రివర్గ సమావేశం లేకుండా.. సర్క్యులేషన్ పద్ధతిలో మంత్రుల వద్ద సంతకాలు తీసుకుని గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. ఈ రెండు నెలల వ్యయానికి గవర్నర్ అనువుతించడంతో ఆర్థిక శాఖ తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
యూనివర్సిటీ క్యాంపస్ : ఎన్నో అవాంతరాలు, అటంకాల అనంతరం గురువారం ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు స్పందన అంతంతమాత్రమే లభించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ అంశం తేలక కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. ఈనెల 31లోపు అడ్మిషన్ల షెడ్యూల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టింది. తొలిరోజైన గురువారం ఒకటి నుంచి ఐదువేల ర్యాంకులు పొందిన విద్యార్థుల ధ్రుపత్రాల పరిశీలన జరిగింది. జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో ఈప్రక్రియను ప్రారంభించారు. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 15 మంది, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో అయిదుగురు, చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏడుగురు మాత్ర మే హాజరయ్యారు. హాజరైన విద్యార్థులకు ధ్రువపత్రాలను పరిశీలించి స్క్రాచ్‌కార్డులు అందజేశారు. వీరు ఆన్లైన్లో లాగిన్ అయి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంది. తొలి ఐదు వేల ర్యాంకులు సాధించినవారిలో చాలామంది ఐఐటిలు, విట్, నిట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరి ఉంటారని అందువల్ల కౌన్సెలింగ్‌కు ఎక్కువ మంది రాలేదని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని హెల్ప్‌లైన్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఎల్ఆర్ మోహన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం 5001 నుంచి 10వేల లోపు ర్యాంకుల వారికి కౌన్సెలింగ్ ఉంటుంది. -
ఆధ్యాత్మిక నగరం.. ఇక విద్యాకేంద్రం
తిరుపతిలో ఐఐటీ, సెంట్రల్ వర్సిటీ, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం మూడు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు కనీసం వెయ్యి ఎకరాల భూమి అవసరం భూమిని అన్వేషించాలని కలెక్టర్‌ను ఆదేశించిన విద్యాశాఖ మంత్రి గంటా! ప్రపంచ చిత్రపటంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రకాశిస్తున్న తిరుపతి ఇక విద్యా కేంద్రంగానూ విరాజిల్లనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతిలో జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుంది. తిరుపతి పరిసర ప్రాంతా ల్లో ప్రతిష్టాత్మక ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), సెంట్రల్ వ ర్సిటీ(కేంద్రీయ విశ్వవిద్యాలయం), ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) సంస్థలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్యాంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధన కేంద్రాలు తెలంగాణలోనే నెలకొల్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జాతీయ విద్య, పరిశోధన కేంద్రాలను సీమాంధ్రలోనూ ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత అప్పటి కేంద్ర మంత్రి జైరాం రమేష్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఐఐటీ, సెంట్రల్ వర్సిటీ, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ మేరకు విభజన బిల్లులో కూడా పొందుపరిచారు. హైదరాబాద్‌లో సెంట్రల్ వర్సిటీ, ఐఐటీని మెదక్ జిల్లా దోమ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో అప్పట్లో ఏర్పాటు చేశారు. ఐఐఎస్ఈఆర్ను ఏర్పాటుచేయకపోవడం గమనార్హం. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకుంది. తిరుపతిలో ఐఐటీ, సెంట్రల్ వర్సిటీ, ఐఐఎస్ఈఆర్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఆ మూడు జాతీయ విద్య, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని అన్వేషించి.. ఈనెల 20లోగా నివేదిక పంపాలని కలెక్టర్ రాంగోపాల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. భూ సేకరణలో అధికార యంత్రాంగం దేవదేవుడు వేంకటేశ్వరుడు కొలువైన తిరుపతికి ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుంది. శ్రీవారు వెలసిన జిల్లాలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ వర్సిటీ, కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం నెలకొల్పారు. తిరుపతిలో చీనీ, నిమ్మ, వరి, చెరకు పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక కొత్తగా మూడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అయితే వీటి ఏర్పాటుకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు లేవు. తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, చంద్రగిరి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూములు లేవు. ఆ ప్రాంతాల్లో డీకేటీ భూములు మాత్రమే ఉన్నాయి. ఆ భూములను రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇదే అంశంపై కలెక్టర్ రాంగోపాల్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ఐఐటీకి 400 ఎకరాలు, సెంట్రల్ వర్సిటీకి 400 ఎకరాలు, ఐఐఎస్ఈఆర్కు 200 ఎకరాల భూమి అవసరమని చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవన్నారు. ఏర్పేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో డీకేటీ భూములను సర్వే చేస్తున్నామని.. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వివరించారు. -
ఖరీఫ్‌లో కష్టాల సేద్యం
సబ్సిడీ వేరుశెనగ విత్తనాల పంపిణీలో వ్యవసాయశాఖ జాప్యం అధిక ధరలకు విత్తనాలు కొంటున్న రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు రాష్ట్ర విభజన, రుణమాఫీ పథకంతో ‘సహకారం’ నిల్ సాక్షి, తిరుపతి: జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతుల అగచాట్లు మొదలయ్యాయి. ఈ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలుగానీ, రుణాలుగానీ అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఖరీఫ్‌లో జిల్లాలో ప్రధాన పంట అయిన వేరుశెనగ విత్తనాలు ఇప్పటి వరకు జిల్లాకు చేరుకోలేదు. ఇంకా కొంత సమయం పడుతుందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సబ్సిడీ విత్తనాల కోసం ఎదురుచూడలేక రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి విత్తన కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతు ల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిన్నటివరకు వేరుశెనగ విత్తనాలు కిలో రూ.33 ఉండగా, శుక్రవారం పది రూపాయలు పెంచి అమ్మకాలు సాగించినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో వేరుశెనగ రైతులు పంటల సాగు ప్రారంభంలోనే పెట్టుబడులపై ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో వేరుశెనగ సాధారణ విస్తీర్ణం 1,36,400 హెక్టార్లు. ఇందుకోసం లక్షా ఐదు వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలు అవసరమవుతాయి. అయితే ఇప్పటివరకు ఒక్క గింజ కూడా పంపిణీ జరగలేదు. విత్తన కాయల రేటుకు సంబంధించి నోడల్ ఏజెన్సీ లు, అధికారుల మధ్య అవగాహన కుదరలేదు. దీంతో సబ్సిడీ విత్తనాల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. ఒక వైపు సీజన్ ముంచుకొచ్చినా అధికారులు మాత్రం రేటు పేరుతో జాప్యం చేస్తున్నారు. జిల్లాలోని పడమటి మండలాల రైతులు మాత్రం సబ్సిడీ విత్తనాల కోసం వేచి చూడకుండా తమ దగ్గర ఉన్న విత్తన కాయలు, ప్రైవేటు వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, కుప్పం తదితర ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. రుతుపవనాలు ప్రవేశించే సమయం ఆసన్నం కావడంతో ఇప్పటికే భూమిలో ఉన్న తేమ ఆరిపోకుండా నాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బ్యాంకులకు వెళితే రైతులపై చిన్నచూపు రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే రైతులపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందు కు రావడం లేదు. దీంతో పాత రుణాలు తీర్చలేక కొత్త అప్పు పుట్టక లబోదిబోమనే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ప్రతిఏటా ఈ పాటికి రుణాల మంజూరు జరిగేది. కానీ ఈ ఏడాది రుణమాఫీ పథకంతో కొత్తగా అప్పులు ఇచ్చేం దుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. కొత్త రుణా ల మంజూరుకు సంబంధించి ఇంకా స్పష్టత రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు. ఈ ఏడాది మార్చి వరకు జాతీయ బ్యాంకులు రూ. 7,660 కోట్ల రుణాలు ఇచ్చాయి. సుమారు ఎనిమిది లక్షల మంది రైతులు ఈ రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి వరకు రూ. 1,500 కోట్లు ఇచ్చారు. వీటి సంగతి తేల్చకుండా కొత్తగా రుణాలు ఎలా ఇస్తామంటూ బ్యాంకులకు వెళ్లిన రైతులను అధికారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సహకారం నిల్ జాతీయ బ్యాంకుల పరిస్థితి అలా ఉంటే సహకార బ్యాంకులు పూర్తిగా చేతులెత్తేశాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఈ ఏడాది ప్రారంభం నుంచే రుణాల మంజూరు నిలిపివేయాలని సహకార బ్యాంకులను ఆప్కాబ్ ఆదేశించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఒక్క రూపా యి కూడా రైతులకు రుణం మంజూరు చేయలేదు. ఈ ఏడాది మార్చి వరకు రూ. 200 కోట్లు స్వల్ప కాలిక రుణాలు, మరో రూ. 70 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేసి ఉన్నారు. ఇవి కాకుండా మరో పది కోట్ల రూపాయలు బంగా రు నగలపై వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆప్కాబ్ ఆదేశాల మేరకు కొత్త రుణాలు ఇచ్చేందుకు సహకార బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. రుణమాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో భారీ మొత్తంలో ఇప్పటికే ఇచ్చిన రుణాల సంగతి తేల్చకుండా కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితిలో సహకార బ్యాంకులు లేవని అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు. ఇన్ని అవరోధాల నడుమ ఖరీఫ్ సీజన్లో రైతుల అవస్థలు దయనీయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. -
రుణమాఫీ మాయ!
కమిటీ ఏర్పాటు నిర్ణయంపై రైతుల్లో గుబులు పంట రుణాలు ఇవ్వడంపై బ్యాంకులకు అందని హామీ కొత్త రుణాలు ఇప్పట్లో లేనట్టేనా? వడ్డీ వ్యాపారస్తుల వైపు రైతుల చూపు పంట రుణాల మాఫీ ప్రశ్నార్థకంగా మారడంతో రైతుల్లో దిగులు పట్టుకుంది. అధికారంలోకి రాగానే పంట రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మిగిలిపోనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పంట రుణాల మాఫీపై ఇదే వైఖరి అనుసరిస్తున్నారని తేటతెల్లమవుతోంది. రుణమాఫీ ఫైల్‌పై కాకుండా ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసేందుకు తీసుకున్న నిర్ణయూనికి సంబంధించిన ఫైల్‌పై చంద్రబాబు తొలి సంతకం చేయడంతో రైతుల ఆశలు ఆవిరైపోయాయి. చిత్తూరు(కలెక్టరేట్): రుణమాఫీ కాగానే బ్యాంకుల నుంచి కొత్త రుణాలు తీసుకుని పంటలు సాగు చేస్తామని భావించిన రైతులు చివరకు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు పెట్టుబడి ఎక్కడ నుంచి తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బంగారు తాకట్టుపై బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులు, ఈ ఏడాది పంట రుణాలు ఎలా చేయాలంటూ మల్లగుల్లాలు పడుతున్నారు. పంట రుణాల మాఫీపై విధి విధానాలు తెలియజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కమిటీ వేసేందుకు నిశ్చయించింది. 15 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 45 రోజుల్లో తుది నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందించనుంది. ఈ తతంగమంతా ఏమిటంటూ రైతులు రగిలిపోతున్నారు. అయోమయంలో కరువు మండలాల రైతులు జిల్లాలో మూడేళ్లుగా ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశెనగ రైతులు నష్టాల ఊబిలో చిక్కుకుపోయారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో జిల్లాలోని 33 మండలాలను అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లోని దాదాపు 80 వేల మంది రైతులు పంట రుణాలు మాఫీ అయితే కొత్త రుణాలు తీసుకోవాలని భావించారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదనే ఆందోళనలో ఉన్నారు. ప్రశ్నార్థకంగా పంట రుణాలు రుణమాఫీతో పాటు పంట రుణాల రీషెడ్యూల్‌పై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు బ్యాంకర్లకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. దీంతో ఈ ఏడాది రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందేది గగనంగా మారనుంది. పంట నష్టపోయిన రైతులు రీషెడ్యూల్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఈ ఏడాది పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రారు. ఒకవేళ పంట రుణాలు రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణాలుగా బ్యాంకర్లు వాటిని పరిగణిస్తారు. ఈ రుణాలు మాఫీకి వర్తించవు. వడ్డీ వ్యాపారుల వైపు రైతుల చూపు బ్యాంకర్లు పంట రుణాలను రీషెడ్యూల్ చేయక పోవ డం, కొత్త రుణాలు ఇవ్వక పోవడంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఏటా 2.2 లక్షల మంది రైతులకు దాదాపు 2 వేల కోట్ల రూపాయలు పంట రుణాలుగా ఇవ్వాలని బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయిస్తారు. అయి తే ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతులకు పంట రుణాలు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత బ్యాంకు అధికారులకు రాలేదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. కమిటీ ఏర్పాటుతో రైతుల్లో ఆందోళన పంట రుణాల మాఫీపై చంద్రబాబు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కమిటీ ఇచ్చే నివేదికల ఆధారంగా ఎంత మంది రైతులకు ఎంత మొత్తం పంట రుణాలు మాఫీ చేస్తారు.. ఆ జాబితాలో తమ పేర్లు ఉంటాయా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని బ్యాంకు అధికారుల గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే 2014 మార్చి నెలాఖరు వరకు వ్యవసాయ, వ్యవసాయేతర, దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలు రూ.7693.75 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా చిన్న, సన్నకారు, మధ్య, పెద్ద రైతులు 8 లక్షల 70 వేల 321 మంది ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 ప్రధాన బ్యాంకుల కింద 478 బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాల కింద 7 లక్షల 55 వేల 270 మంది రైతులు రూ. 5810.84 కోట్లు తీసుకున్నారు. ప్రధానంగా 4 లక్షల 53 వేల 162 మంది రైతులకు నగలు తాకట్టుపై పంట రుణాల కింద రూ. 3486.50 కోట్లు ఇవ్వగా, దీర్ఘకాలిక, స్వల్ప కాలిక (టర్ము) రుణాల కింద 68,671 మంది రైతులకు రూ.1129.75 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా 45 వేల 780 మంది రైతులకు రూ.753.16 కోట్ల రుణాలు ఇచ్చినట్టు బ్యాంకు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. -
అక్కడ మోదం.. ఇక్కడ ఖేదం
రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు భయపడినంతా జరుగబోతోందా? విభజన వల్ల ముందుగా నష్టపోయేది ఉద్యోగులేనంటూ అవి ఆందోళన చెందినట్టే ప్రమాద పరిస్థితులు చుట్టుముడుతున్నాయా? ప్రస్తుత పరిణామాలు ఆ అనుమానాలను బలపరిచేలా ఉన్నాయి. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉద్యోగులు భిన్నమైన పరిస్థితిని చవిచూస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులకు మోదం.. సీమాంధ్ర ఉద్యోగులకు ఖేదం అనే రీతిలో పరిస్థితులు మారాయని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల రెండో తేదీన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ అక్కడి ఉద్యోగులపై ఎనలేని ప్రేమ చూపారు. ప్రమాణ స్వీకారం రోజునే తెలంగాణలో పనిచేసే ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. జీతభత్యాలు, పదోన్నతులు తదితర అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ ఉద్యోగుల్లో ఆనందం ఉప్పొంగింది. ఇటువంటి పరిస్థితిలో ఈ నెల ఎనిమిదిన అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్న చంద్రబాబు ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతారా అనే అనుమానాలు రేగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, దీంతో ఉద్యోగులకు కొత్త రాయితీల మాటెలా ఉన్నా జీతాల చెల్లింపులు సకాలంలో జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల లభ్యతను బట్టే చెల్లింపు! జిల్లాలో సుమారు 35 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరికీ ట్రెజరీ (ప్రభుత్వ ఖజానా) నుంచి జీతాలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర విభజన ప్రక్రియ జూన్ రెండో తేదీతో పూర్తికావడంతో మే నెల జీతాలు సక్రమంగానే వచ్చాయి. ఇప్పుడు లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ జీతాల చెల్లింపు కష్టమేనని ఉద్యోగులు కలవరపడుతున్నారు. జీతాల బిల్లులు ఈ నెల 20న ట్రెజరీకి చేరే అవకాశం ఉండటంతో ఆ రోజు ఉన్న నిధుల లభ్యతను బట్టి చెల్లింపుపై నిర్ణయం ఉంటుందని పలువురు అధికారులు చెబుతున్నారు. జూన్ జీతాలపై నీలినీడలు కమ్ముకోవడంతో ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులకు తగిన హామీ ఇవ్వాల్సి ఉంది. బాబు ఏం చేస్తారో? ఈ నెల ఎనిమిదిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబుపై ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణలో ఉద్యోగులకు కేసీఆర్ వరాలు ఇవ్వడంతో సీమాంధ్ర ఉద్యోగులకు చంద్రబాబు ఎటువంటి వరాలు ఇస్తారోనని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
200 మంది ఉద్యోగులు గాలిలో..
సచివాలయంలో వింత పరిస్థితి వారిని ఏ రాష్ట్రానికి కేటాయించని కేంద్రం సాధారణ పరిపాలన శాఖ నిర్వాకమే కారణం తెలంగాణకు చెందిన వారినీ ఆ రాష్ట్రానికి కేటాయించలేదు హైదరాబాద్:కేం రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల పంపిణీ విషయంలో సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ నిర్వాకం కారణంగా చాలా మంది ఉద్యోగుల పరిస్థితి ఎటూ తేలకుండా గాలిలో ఉన్నట్లుంది .కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన జారీ చేసిన ఉద్యోగుల పంపిణీ ఆదేశాల్లో సచివాలయంలో పనిచేస్తున్న సుమారు 200 మంది అధికారులు, ఉద్యోగుల పేర్లు లేవు. తెలంగాణకు చెందిన ఉద్యోగులను కూడా ఆ రాష్ట్రానికి కేటాయించలేదు. రాష్ట్ర ప్రణాళికా శాఖలో డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారులతో పాటు మొత్తం 30 మంది పరిస్థితి ఇలానే ఉంది. మున్సిపల్ శాఖలోను, అలాగే సచివాలయంలోని పలు శాఖల్లో రికార్డు అసిస్టెంట్లను ఏ రాష్ట్రానికి కేటాయించకుండా వదిలేశారు. దీంతో తెలంగాణకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ విషయంపై ఆర్థిక శాఖను సంప్రదించగా కేంద్రం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని బదులిస్తున్నారు. సర్వీసెస్ అధికారుల నిర్వాకం కారణంగానే ఈ ఉద్యోగులు ఇలా మధ్యస్థంగా మిగిలిపోయారనే విమర్శ వినిపిస్తోంది. కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులు సచివాలయంలో రెగ్యులర్‌గా పనిచేయడానికి వీలుంది. అయితే ఇలాంటి అధికారులు, ఉద్యోగులను డిప్యుటేషన్ పేరుతో సాధారణ పరిపాలన శాఖ కేంద్రానికి జాబితా పంపడం వల్లే ఆ అధికారులు, ఉద్యోగులను పంపిణీ చేయలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్లీ తప్పును సరిచేసి జాబితాను కేంద్రానికి పంపాల్సి ఉందని, అప్పుడే ఆ ఉద్యోగులు, అధికారులను పంపిణీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరికీ పంపిణీ చేయని అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఉంటారనేది ఆంధ్రప్రదేవ్ పునర్ విభజన - 2014 చట్టం చెపుతోంది. సర్వీసెస్ అధికారుల నిర్వాకం వల్లే తెలంగాణ ఉద్యోగులు, అధికారులను ఆ రాష్ట్రానికి పంపిణీ చేయలేదని సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. -
నూతన సర్వర్ ద్వారా రవాణా సేవలు
చిత్తూరు(జిల్లాపరిషత్) న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణా శాఖ సోమవారం నుంచి నూతన సర్వర్ ద్వారా ప్రజలకు సేవలను ప్రారంభించింది. నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇతర సేవలను నూతన సర్వర్ ద్వారా అందించినట్టు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. నూతన రాష్ట్రానికి సం బంధించి ఏపీ జిల్లా సీరీస్ త్వరలో మారుతుందన్నారు. తెలంగాణ రా ష్ట్రానికి ఇచ్చిన టీజీ కోడ్‌ను టీఎస్‌గా మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో కొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకా శం ఉందని ఆయన పేర్కొన్నారు. పాత పర్మిట్లు చెల్లుతాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తీసుకు న్న పర్మిట్లు రెండు రాష్ట్రాల్లో చెల్లుబాటవుతాయని, దీనికి సంబంధించి ప్రభుత్వం జూన్ 1న 46 జీవోను జారీ చేసిందని ఎం.బసిరెడ్డి తెలిపా రు. దీంతో పర్మిట్ ఉన్నంత వరకు రెండు రాష్ట్రాల్లో సంబంధిత వాహనా లు తిరగవచ్చన్నారు. జూన్ 1వ తేదికి ముందు జీవితకాలం పన్ను చెల్లించి న వాహనాలు తెలంగాణలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, తెలంగాణ పరిధిలో చెల్లించిన వారు ఆంధ్రప్రదేశ్‌లో చెల్లించాల్సిన అవసరం లేద ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం దన్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధిం చి ఇప్పుడున్న పర్మిట్లు అలాగే కొనసాగించనున్నట్టు తెలిపారు. నూతన రాష్ట్రంలో జరిగే లావాదేవీలు ఆయా రాష్ట్రాలకు పరిమితం కానున్నాయని, మన రాష్ట్రంలో పర్మిట్ తీసుకున్న వాహనాలు అక్కడకు వెళితే అక్కడ తప్పనిసరిగా పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
నేరం.. కేరాఫ్ విజయవాడ
చెలరేగిపోతున్న దొంగలు అసాంఘికశక్తులకు అడ్డా షెల్టర్‌జోన్‌గా మారుతున్న వైనం మహానగరంగా మారుతున్న వేళ పోలీసులకు పెనుసవాల్ సాక్షి, విజయవాడ : అసాంఘికశక్తులకు విజయవాడ అడ్డాగా మారుతోంది. ఇతర ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాపులు, కిరాయి హత్యలు చేసే ముఠాలకు షెల్టర్‌జోన్‌గా తయారైంది. ఒకప్పుడు రౌడీయిజానికి బెజవాడ రాష్ట్రస్థాయిలోనే పేరుగాంచింది. పోలీసులు తీసుకున్న చర్యలు.. రౌడీల ప్రవర్తనలో వచ్చిన మార్పులు.. ఏదైతేనేం రౌడీయిజం కనుమరుగైంది. ఆ స్థానాన్ని వైట్‌కాలర్ నేరాలు ఆక్రమించాయి. నగర పరిధి విస్తృతంగా పెరిగిన క్రమంలో ఇంటా బయటా చోరీలు, బైక్ దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారిని కిడ్నాప్ చేయాలని పథకం రచించిన ముఠా పోలీసులకు చిక్కడంతో నగరవాసులు మళ్లీ ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అతి పెద్ద నగరంగా అవతరించనున్న విజయవాడకు ఇవన్నీ సవాళ్లేనని చెప్పాలి. కౌన్సెలింగ్‌లతో తెరమరుగు.. విజయవాడ నగరంలో దాదాపు 15 ఏళ్ల క్రితం వరకు రౌడీలు తమ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగించేవారు. పోలీసుల వరుస ట్రీట్మెంట్లు, కౌన్సెలింగ్‌లతో అనేకమంది రౌడీలు తెరమరుగయ్యారు. మరికొందరు జిల్లాను వీడి దూరంగా వెళ్లిపోయారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 20 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 340 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో ఏ ప్లస్ కేటగిరీలో 80 మంది ఉన్నారు. రౌడీషీటర్లు దాదాపు నాలుగేళ్లుగా తమ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కాగా బ్లేడ్‌బ్యాచ్ ముఠాలు, గంజాయి విక్రయించే ముఠాలు ఉన్నాయి. వీరితోపాటు ఇతరప్రాంతాల్లో కిరాయి హత్యలు, దొంగతనాలకు పాల్పడే వారు అనేకమంది నగరాన్ని షెల్టర్‌జోన్‌గా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సింగ్‌నగర్, వాంబే కాలనీ, న్యూరాజరాజేశ్వరీపేట తదితర ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చుకున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బంగారు నగల వ్యాపారిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలుడిమాండ్ చేయాలని చూసిన ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు నేరచరిత్ర లేనప్పటికీ కేవలం డబ్బు ఆశతోనే ఇలా చేశారు. దీన్నిబట్టి చూస్తే నగరంలో నేరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతుంది. విజయవాడ కమిషనరేట్ అయినప్పటికీ నగర పరిధి బాగా పెరగడం, చుట్టూ జాతీయ రహదారులు ఉండడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. కిరాయి హత్యలు, కిడ్నాప్‌లను నియంత్రించడంలో మాత్రం పోలీసులు సఫలీకృతులయ్యారు. ఏడేళ్లుగా ఇలాంటి నేరాలు జరగకపోవడమే దీనికి నిదర్శనం. నిత్యం దొంగతనాలు... నగరంలో దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక చోరీ తప్పక జరుగుతుంది. నగరం నలుదిక్కులా జాతీయ రహదారి ఉండడంతో దొంగతనం చేసిన పదిహేను నిమిషాల్లో దొంగలు నగరం వదిలి పారిపోతున్నారు. ఫలితంగా దొంగతనాల జోరు బాగా పెరిగింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన దొంగల ముఠాలు ప్రస్తుతం నగరంలో స్వైరవిహారం చేస్తున్నాయి. నకిలీ పోలీసుల ముఠాలు కూడా తమ హవా కొనసాగిస్తున్నాయి. నెలకు 200కు పైగా కేసులు.. రెండు నెలలుగా సగటున నెలకు 200కు పైగా దొంగతనాల కేసులు గత నెల 19న కమిషనరేట్ పరిధిలోని కంకిపాడులో పట్టపగలే రెండిళ్లలో చోరీలు జరిగాయి. రెండు లక్షల సొత్తు అదృశ్యమైంది. అదేరోజు ఆటోనగర్‌లో పోలీసులమని చెప్పి నకిలీ పోలీసులు వృద్ధురాలి నుంచి తొమ్మిది కాసుల బంగారం అపహరించారు. గత నెల 21న ఆటోనగర్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న మహిళ నుంచి రూ.40 వేల విలువైన బంగారం అపహరించారు. గత నెల 25న కృష్ణలంక ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి 20 కాసుల బంగారం, 50 వేల నగదు అపహరించారు. ఇలా వరుస దొంగతనాలు జరుగుతున్న క్రమంలో పోలీసులు నాకాబందీ నిర్వహించి తనిఖీలు చేస్తున్నా ఆశించిన మేర ప్రయోజనం కలగడం లేదు. దీనికితోడు పోలీసులే మైకు ప్రచారం నిర్వహించి నగరవాసులను అప్రమత్తం చేస్తున్నారు. -
స్తంభించిన రిజిస్ట్రేషన్లు
నేటితో రెండుగా విడిపోతున్న శాఖ రెండు రాష్ట్రాలకు విడివిడిగా సర్వర్లు రాజధాని అంచనాలతో ‘రియల్’ బూమ్ జిల్లాలో ఊపందు కోనున్న క్రయవిక్రయాలు కైకలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు విడివిడిగా సర్వీసు సర్వర్లు ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు రోజులుగా ఆయా మండలాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో క్రయవిక్రయాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, ఈసీల కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. జిల్లాలో మొత్తం 50 మండలాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. హైదరాబాదు కేంద్రంగా సర్వర్ పనిచేస్తోంది. జూన్ 2న రాష్ట్రం రెండుగా విభజన జరగనుండటంతో నూతనంగా ఏర్పడే ఇరు రాష్ట్రాలకు కొత్త సర్వీసు సర్వర్లు సోమవారం నుంచి విడివిడిగా ఏర్పాటు కానున్నట్లు సమాచారం. రెండుగా విడిపోనున్న సిబ్బంది... విభజన నేపథ్యంలో ఇప్పటి వరకు హైదరాబాదు ప్రధాన కేంద్రంగా జరిగిన రిజిస్ట్రేషన్ సేవలు రెండుగా విడిపోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు సర్వర్లు రానున్నాయి. శాఖాపరమైన విధులు, సిబ్బంది విషయానికి వస్తే సెంట్రల్ సీ అండ్ ఐజీ ఆఫీస్, జోనల్ ఆఫీస్ అనే రెండంచెల విధానంలో రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్ ఐజీ, అడిషనల్ కమిషనర్ ఐజీ, జాయింట్ ఐజీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, సీనియర్ అసిస్టెంట్స్, టైపిస్టు, షరాఫ్, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినెంట్లు కలిపి 3,997 మంది ఈ శాఖలో పనిచేస్తున్నారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయాన్ని రెండుగా విభజించి పదేళ్ల పాటు అదే కార్యాలయాల్లో విడివిడిగా విధులు నిర్వహించనున్నారు. సెంట్రల్ కార్యాలయంలో సిబ్బందిని ఆయా ప్రాంతాల ప్రాతిపాదికన బదలాయిస్తున్నారని, జోనల్ వ్యవస్థలో ప్రాంతాలవారీ బదిలీలపై స్పష్టమైన ఆదేశాలు రాలేదని కార్యాలయ సిబ్బంది ఒకరు తెలిపారు. స్టాంపు డ్యూటీపై గంపెడాశలు... అవశేష ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కారణంగా జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వస్తాయని, ఈ పరిణామం స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కలిసొచ్చే అంశంగా మారుతుందని జిల్లా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు - విజయవాడల మధ్య ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ముందుకు దూసుకుపోతుందని, రాజధాని ప్రభావం కారణంగా క్రయ విక్రయాలు ఊపందుకుంటాయని అందరూ భావిస్తున్నారు. -
రవాణా, వాణిజ్య శాఖల సేవలు నేడు, రేపు బంద్
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ ప్రధానశాఖలైన రవాణా, వాణిజ్య విభాగాలకు సంబంధించిన ప్రజాసేవలు రెండు రోజుల పాటు బంద్ అవుతున్నారుు. నూతన రాష్ట్రం ఏర్పడనున్న సందర్భంగా ఈ రెండు శాఖలు కొత్త సర్వర్ల ద్వారా సోమవారం నుంచి సేవలను నిర్వహించనున్నాయి. ట్రెజరీ అకౌంట్స్‌కు సంబంధించి పాతపద్ధతుల్లోనే సేవలు అందిస్తారని సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడివిడిగా సర్వర్లు రూపొందించి ఉన్నందున మే 31న (శనివారం) ఆన్లైన్ సేవలన్నింటినీ నిలిపివేయాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఎఫ్‌సీలు చేయబోరని జిల్లా రవాణాశాఖ ఉపకమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు కూడా సర్వర్లు పనిచేయవని, ఆదివారం అర్ధ రాత్రి నుంచి నూతన సర్వర్ ఓపెన్ అవుతుందని, సోమవారం యథావిథిగా రవాణా శాఖ సేవలు అందుతాయని చెప్పారు. జూన్ 2వ తేదీ సోమవారమే వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన నూతన సర్వర్ ప్రారంభమవుతుందని, ఇందుకు అనుగుణంగానే జిల్లాలోని వస్త్ర దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు, వారికి కేటాయించిన టిన్ నెంబర్ల ద్వారా లావాదేవీలను జరపాలని చిత్తూరు వాణిజ్య పన్నుల శాఖాధికారులు సూచించారు. ఖజానా శాఖ సేవలను యథావిథిగా అందిస్తుందని ఆ శాఖ ఉపసంచాలకులు పాలేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటివరకు తమకు ఎలాంటి సూచనలు అందలేదని, ఉత్తర్వులు అందేంతవరకు సేవలు యథావిథిగా కొనసాగిస్తామని తెలిపారు. ఉద్యోగులకు జూన్ 1వ తేదీ చెల్లించాల్సిన మే నెల జీతాన్ని ఈ నెల 24వతేదీ నాటికే వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పెన్షన్‌దారులకు పెన్షన్ కూడా అదే రోజుకే వారి ఖాతాల్లో జమచేశామని తెలిపారు. ఇతర లావాదేవీలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు. -
మద్యం సరఫరాకు బ్రేక్
‘విభజన’ నేపథ్యంలో.. జిల్లాలో మూతపడిన లిక్కర్ బేవరేజెస్ జూన్ 7 వరకు అదే పరిస్థితి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు జిల్లాలో అదనంగా 50 వేల కేసుల విక్రయం వైన్, బార్ షాపుల వద్ద నిల్వలు ఫుల్ సాక్షి, విజయవాడ : జిల్లాలో మద్యం సరఫరా నిలిచిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లిక్కర్ బేవరేజెస్‌ను విభజించి ఆదాయ వ్యయాలు, అప్పులు, ఇతర లెక్కలు చూసుకోవటానికి బేవరేజెస్‌కు సెలవులు ప్రకటించారు. దీంతో ఎక్సైజ్ శాఖ, బేవరేజ్ అధికారులు జిల్లాలో మద్యం కొరత తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో వైన్‌షాపులు, బార్లకు నెలవారీగా లెసైన్స్ స్థాయిని బట్టి కేటాయించే దానికంటే అదనంగా కేటాయింపులు జరిపారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో చివరి నెలలో జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా జరిగినట్లయింది. మూడు నెలలుగా వ్యాపారాలూ అంతంతే.. జిల్లాలో 294 వైన్‌షాపులు, 155 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు జిల్లాలో మూడు లక్షల కేసుల మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. దీంతో జిల్లాలో నెలకు సుమారు రూ.105 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతుంటాయి. గడిచిన మూడు నెలలుగా జిల్లాలో మద్యం విక్రయాలు బాగానే జరిగాయి కానీ వ్యాపారాలు ఆశించిన రీతిలో జరగలేదు. ఎన్నికల కోడ్, వరుస ఎన్నికల నేపథ్యంలో పోలీసు, ఎక్సైజ్ అధికారుల తనిఖీలు, దాడులు ముమ్మరంగా సాగాయి. ఈ క్రమంలో వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకోకపోవటంతో ఆశించిన మేరకు వ్యాపారం జరగలేదు. సెలవులతో మరింత ఇబ్బంది... ఈ క్రమంలో ప్రస్తుతం వేసవికాలం కావటంతో మద్యం విక్రయాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు బేవరేజెస్ సెలవులు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల మద్యం కంపెనీల నుంచి వచ్చే మద్యానికి ఏపీ బేవరేజెస్ స్టిక్కర్ల ద్వారా విక్రయాలు జరిపేవారు. జూన్ 2న అపాయింటెడ్ డే కావటంతో రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్ర విభజనకు ముందే బేవరేజస్ను రెండు రాష్ట్రాలకు సమ పద్ధతిలో కేటాయించాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. దీంతో ఈ నెల 27 నుంచి జూన్ 7 వరకు ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విభజన ప్రకియ పూర్తయ్యే వరకు బేవరేజస్ మూసివేయాలని నిర్ణయించి నిల్వలు ఉన్న మద్యాన్ని పూర్తిస్థాయిలో విక్రయించారు. పదిరోజుల పాటు మద్యం సరఫరా ఉండకపోవటంతో అనివార్యంగా కొరత ఏర్పడనుంది. రోజుకి జిల్లాలో సగటున పదివేల కేసుల విక్రయాలు జరగుతుంటాయి. నెలాఖరు కావటం, లెసైన్స్ కాలపరిమితి ముగియనుండటంతో వైన్‌షాపుల్లో దాదాపు 30 శాతం కంటే తక్కువగానే నిల్వలు ఉన్నాయి. ఈక్రమంలో పదిరోజుల విక్రయాలుకు గాను జిల్లాలో లక్ష కేసుల మద్యం అవసరం ఉంది. కాని కొరత నేపథ్యంలో 10 రోజులకు అదనంగా 50 వేల కేసులను మాత్రమే బేవరేజెస్ అధికారులు మంజూరు చేసి వ్యాపారులకు విక్రయించారు. వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు, కేటాయింపులు పదిరోజులకు పూర్తిస్థాయిలో సరిపోయే అవకాశం ఉంది. జిల్లాలోని విజయవాడ, గుడివాడ ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో రెండు బేవరేజ్‌లు ఉన్నాయి. వీటిద్వారా జిల్లాలోని వైన్‌షాపులకు, బార్లకు మద్యం సరఫరా జరుగుతుంది. జిల్లాలో షాపులకు అదనపు నిల్వలు కేటాయించామని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ గోళ్ల జోసఫ్ తెలిపారు. జిల్లాలో పదిరోజులు మద్యం సరఫరా జరిగే అవకాశం లేకపోవటంతో ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. -
విభజన ప్రతిపాదనలకు రేపు ఆమోదం!
కేబినెట్ భేటీని ఏర్పాటు చేసిన గవర్నర్ హాజరుకానున్న సలహాదారులు గురువారమే మరో రెండు కీలక సమావేశాలు హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి గురువారం మూడు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో రెండు సమావేశాలు హైదరాబాద్‌లో మరొకటి ఢిల్లీలో జరగనుంది. విభజనకు ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో సంబంధిత ప్రతిపాదనల ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్ అహ్మద్, ఎ.ఎన్.రాయ్ ఈ భేటీలో పాల్గొంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. పదో షెడ్యూల్లో చేర్చాల్సిన సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఈ భేటీలో అమోదం తెలుపనున్నారు. అలాగే పోలవరం ముంపు ప్రాంతాలను ఖమ్మం జిల్లా నుంచి సీమాంధ్ర జిల్లాలకు మార్చాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలుపనున్నారు. అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించిన మిగతా ప్రతిపాదనలన్నింటికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు పంపాల్సిందిగా గవర్నర్ కార్యాలయం మంగళవారం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో చివరి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని (ఎస్ఎల్బీసీ) సీఎస్ మహంతి గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ ప్రణాళిక అమలు పురోగతిని వివరించనున్నారు. అలాగే జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ రుణాల మంజూరుపై కూడా చర్చించాల్సిందిగా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర విభజన నేపథ్యంలోనూ బ్యాంకర్లు ఎప్పటిలాగానే రెండు రాష్ట్రాల రైతులకు వ్యవసాయ రుణాలను మంజూరు చేయాల్సిందిగా సీఎస్ కోరే అవకాశం ఉంది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉదయం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో సీఎస్ మహంతితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రుణంగా ఇచ్చిన రూ.17 వేల కోట్లను మాఫీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను కోరనుంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో శాంతిభద్రత ల పరిరక్షణకు, ఇతర సందర్భాల్లో కేంద్ర పోలీసు బలగాలను పంపినందున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూ.1,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. విభజన నేపథ్యంలో ఈ రూ.1,000 కోట్లను కూడా మాఫీ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నారు. అలాగే కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందువల్ల రెండు ఆర్థిక సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాష్ట్రానికి, అలాగే రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం చేస్తామని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎంత మేరకు ఆర్థిక సాయం అందిస్తారనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. సీమాంధ్ర రాష్ట్రానికి ఏర్పడే రెవెన్యూ లోటులో ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందనే అంశంపైనా చర్చించనున్నారు. నేడు ఢిల్లీలో కీలక భేటీ రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై చర్చ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఏర్పాటైన రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్తోపాటు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్, సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, కేంద్ర హోం, సిబ్బంది మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు బుధవారం ఉదయం ఢిల్లీలో 10 గంటలకు సమావేశం కానున్నారు. ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల ఖరారు అంశంలో భాగమైన రాష్ట్రపతి ఉత్తర్వులు, అధికరణ 371(డి), సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. తద్వారా స్థూలంగా ముసాయిదా మార్గదర్శకాలపై ఒక అవగాహనకు రానున్నారు. అనంతరం వీటిని ప్రజల ముందు చర్చకు పెడతారు. అభ్యంతరాలు, సూచనలు, సలహాలకు రెండువారాల గడువిస్తారు. ఢిల్లీ సమావేశంలో పాల్గొనేందుకు కమలనాథన్, మహంతి, పీవీ రమేశ్, నాగిరెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల పంపిణీ మార్గదర్శకాల ఖరారుకు ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ కూడా బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఇదిలా ఉండగా ఈ నెల 29, 30న ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్ మహంతి మంగళవారం హైదరాబాద్‌లో తనను కలసిన ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పారు. -
ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు చెల్లింపులు బంద్
28లోగా పాస్ కాని ఉమ్మడి రాష్ట్ర బిల్లులు తెలంగాణ పీఏవోలో చెల్లింపు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చెల్లింపులన్నింటినీ సోమవారం సాయంత్రం నుంచి ఆర్థిక శాఖ నిలుపుదల చేసింది. అత్యంత అత్యవసరం మినహా ఎటువంటి సాధారణ బిల్లుల చెల్లింపులను చేయరు. ఆఖరికి అధికారులు, ఉద్యోగుల టీఏ, డీఏ బిల్లులతో సహా అన్ని రకాల బిల్లుల చెల్లింపులను నిలుపుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఖజానా, ఉప ఖజానా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. మే నెల 21వ తేదీ వరకు వచ్చిన బిల్లులన్నింటినీ ఖజానా కార్యాలయాలు సోమవారం సాయంత్రం వరకు చెల్లింపులను పూర్తి చేశాయి. ఈ నెల 28వ తేదీ నాటికి పాస్ కాని ఉమ్మడి రాష్ట్రంలోని బిల్లులను జూన్ నెలలో ఆడిట్ అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ పీఏవోలు ఆ బిల్లులను స్వీకరించడంతో పాటు చెల్లింపులను చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 నుంచి ఆర్థిక శాఖతో పాటు, ట్రెజరీ అండ్ అకౌంటెంట్ విభాగాలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ప్రస్తుతం నాంపల్లిలోని ఎం.జె. రోడ్డులో గల డెరైక్టర్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ కార్యాలయంలోనే ఈ విభాగాలు పని చేస్తాయి. నగరంలోని ఇన్సూరెన్స్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు పన్నులతో పాటు ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రెజరీ నుంచి నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కార్యకలాపాలను జూన్ 2వ తేదీ నుంచి గన్‌ఫౌండ్రీలో గల ఎస్బీఐ నిర్వహించనుంది. తెలంగాణ ట్రెజరీ కార్యకలాపాలను జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రపతి రోడ్‌లోని ఎస్బీహెచ్, ఉస్మాన్‌గంజ్‌లోని ఎస్బీఐ బ్రాంచ్‌లు నిర్వహిస్తాయి. ఆర్థిక శాఖ జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా వెబ్సైట్లను అమల్లోకి తేనుంది. అలాగే జూన్ 2వ తేదీ నుంచి ట్రెజరీ వెబ్సైట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా పనిచేస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి లీడ్ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లీడ్ బ్యాంకుగా ఆంధ్రా బ్యాంక్ వ్యవహరించనున్నాయి. -
మద్యం లెసైన్సులు 3 నెలల పొడిగింపు!
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ నిర్ణయం హైదరాబాద్: రాష్ట్ర విభజన.. మద్యం దుకాణదారులకు బంపర్ బొనాంజా ఇవ్వబోతోంది. వైన్‌షాపుల లెసైన్స్ గడువు జూన్ 30తో ముగుస్తున్నప్పటికీ.. అదనపు ఫీజు చెల్లించి మరో మూడు నెలల పాటు మద్యం అమ్మకాలు కొనసాగించుకునే వెసులుబాటు రాబోతుంది. జూన్ 2 నుంచి రాష్ట్ర విభజన అధికారికంగా అమలులోకి వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రాలు ఏర్పాటవుతుండటంతో కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. మద్యం లెసైన్సులకు సంబంధించి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పాటించే తుది గడువు ‘జూన్ 30’ లోగా రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొత్త మద్యం విధానాన్ని రూపొందించి అమలు చేయటం కష్టమని అధికార యంత్రాంగం భావిస్తోంది. రెండు రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండే ఎక్సైజ్ శాఖ విషయంలో ప్రస్తుత అధికారులు కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో.. ఈ ఏడాది ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లెసైన్సులనే మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
ఆప్షన్ తెలంగాణే !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారుల్లో ఎక్కువ మంది ‘తెలంగాణ’ కేడర్‌నే ఎంచుకున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపకం చేసే ప్రక్రియలో భాగంగా తమ ప్రాధాన్యతను తెలియజేస్తూ వారు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. జిల్లాలో ఉన్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు తెలంగాణ కేడర్లోనే పనిచేస్తామని సాధారణ పరిపాలనా విభాగానికి సమచారం అందించారు. జిల్లా పోలీస్ బాస్ ఎ.వి.రంగనాథ్, ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ కేడర్‌నే ఎంచుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక ఐఏఎస్‌ల విషయానికి వ స్తే జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌ది నల్లగొండ జిల్లా. ఆయన విద్యాభ్యాసమంతా ఇక్కడే జరిగింది. ఈ పరిస్థితిలో ఆయన కూడా తన ఆప్షన్ తెలంగాణే అని, ఇక్కడే పనిచేస్తానని ప్రభుత్వానికి తెలియజేసినట్టు సమాచారం. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ ఏ కేడర్‌ను ఎంచుకున్నారనే విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఐటీడీఏ పీవో దివ్య తమిళనాడుకు చెందిన అధికారిణి కాగా, కలెక్టర్ ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణకే చెందుతారని అధికారవర్గాలు అంటున్నాయి. ఇక ఐఎఫ్ఎస్ అధికారులుగా ఉన్న కన్జర్వేటర్ ఆనందమోహన్ ఏ కేడర్‌ను ఎంచుకున్నారనేది తెలియాల్సి ఉంది. డీఎఫ్‌వోగా ఉన్న ప్రసాద్ మాత్రం తాను తెలంగాణ కేడర్లోనే పనిచేస్తానని తన ప్రాధాన్యతను ప్రభుత్వానికి తెలియజేశారని సమాచారం. వీరందరినీ తమ ఆప్షన్ తెలియజేయాలని కోరుతూ ప్రభుత్వం ఈనెల 9న సమాచారం పంపి, 16 వరకు గడువిచ్చింది. ఈ గడువులో అధికారులంతా తమ ఆప్షన్‌ను తెలియజేశారు. అయితే, తమ ప్రాధాన్యతను అయితే అడిగారు కానీ... దాని ప్రకారమే పంపకాలు చేస్తారా అనేది అర్థం కావడం లేదని అధికారులంటున్నారు. లాటరీ ద్వారా ఆలిండియా అధికారులను పంపకం చేస్తారని కొందరు చెపుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో తమను ప్రాధాన్యం ఎందుకు అడిగారో అర్థం కావడం లేదని వారంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయిన ‘ఇన్సైడర్స్’కి ఆప్షన్ ఏమీ లేదని, వారు పుట్టిన జిల్లా ఎక్కడ ఉంటే ఆ కేడర్ కిందకు తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి చెందిన ఐటీడీఏ పీవో దివ్య కేడర్ ఎంపిక చేయడంలో ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. ఆమె మాత్రం తెలంగాణ కేడర్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే, ఆలిండియా సర్వీసు అధికారుల పంపకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదని, ఆ మార్గదర్శకాలు ఎలా ఉంటాయో చూస్తేనే కానీ తాము ఏ కేడర్ కిందకు వస్తామో స్పష్టత రాదని కొందరు అధికారులు చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దేశించిన అపాయింటెడ్ డే దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన ఆలిండియా సర్వీసు అధికారులు ఏ కేడర్ కిందకు వస్తారో... ఎవరిని ఏ రాష్ట్రానికి పంపుతారో వేచిచూడాల్సిందే. -
నాలుగు నెలల బడ్జెట్‌కు ఆమోదం
జూన్ 2నుంచి వ్యయానికి గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 34, 595 కోట్లు తెలంగాణకు రూ. 26,516 కోట్లు విభజన ప్రక్రియపై నరసింహన్ సమీక్ష రాష్ర్ట విభజన చట్ట సవరణకు కేంద్రానికి పలు ప్రతిపాదనలు సలహా కమిటీ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ 2 నుంచి నాలుగు నెలల కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన వేర్వేరు బడ్జెట్లను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 34,595 కోట్లు, తెలంగాణకు రూ. 26,516 కోట్లు కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ నిర్వహణకు రెవెన్యూ బడ్జెట్ కింద రూ. 28,626 కోట్లు, ఆస్తుల కల్పనకు రూ. 3,882 కోట్లు కేటాయించారు. బడ్జెట్ లోటును ఆ రాష్ర్ట ప్రభుత్వం రుణాల రూపంలో భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ బడ్జెట్ కింద రూ. 21,295 కోట్లు, ఆస్తుల కల్పన కోసం రూ. 3,046 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ కూడా మిగిలిన నిధులను తెలంగాణ ప్రభుత్వం రుణంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆదివారం రాజ్‌భవన్‌లోని సుధర్మ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితోపాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ నరసింహన్ సమావేశం నిర్వహించారు. ఆరు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఇప్పటికే శాసనసభ ఆమోదించిన విషయం విదితమే. కాగా రాష్ర్టపతి పాలన సందర్భంగా రెండు నెలల బడ్జెట్‌ను వ్యయం చేయగా.. మిగిలిన నాలుగు నెలల కాలానికి ఈ బడ్జెట్‌ను ఇరు రాష్ట్రాలకు గవర్నర్ కేటాయించారు. కాగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ పదిలో ఉన్న 107 సంస్థలకు అదనంగా మరో 38 సంస్థలను చేర్చి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇక కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డుకు సంబంధించిన ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి.. గవర్నర్ దృష్టికి తీసుకుని వచ్చారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న 16 ప్రాజెక్టుల సమాచారాన్ని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చలేదన్నారు. నాగిరెడ్డి చేసిన ప్రతిపాదనను కూడా గవర్నర్ ఆమోదించి.. కేంద్రానికి పంపించారు. ఆ మేరకు చట్ట సవరణ చేయాలని కోరనున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఫైళ్ల విభజన, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని సీఎస్ వివరించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్థిర, చరాస్తుల పంపిణీ కూడా పూర్తయినట్లు తెలిపారు. వాహనాల కేటాయింపు ప్రక్రియ కూడా ముగిసిందన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటైన కమిటీలన్నీ తమ నివేదికలను అందించాయని, వాటిని కేంద్రానికి పంపిస్తున్నట్లు సీఎస్ చెప్పారు. సలహా, అపెక్స్ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు కూడా ఆయన వివరించారు. సలహా కమిటీలకు చైర్మన్‌గా కమలనాథన్ వ్యవహరిస్తారు. సభ్యులుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం, ఆర్థిక, న్యాయ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ శాఖ కార్యదర్శి ఉంటారు. అపెక్స్ కమిటీలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కో చైర్మన్లుగా, ప్రణాళిక, హోం, ఆర్థిక, నీటిపారుల, ఇంధన, ఉన్నత విద్య, పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, రెవెన్యూ విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్ తొమ్మిదిలోని పరిశ్రమలు, కార్పొరేషన్లు.. వాటి విభజన ప్రతిపాదనలను ముగ్గురు నిపుణుల కమిటీకి ఇవ్వాలని సీఎస్ సూచించారు. అఖిల భారత, రాష్ట్ర సర్వీసు అధికారుల సమస్యలను కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రభుత్వ క్వార్టర్ల విభజన కూ గవర్నర్ ఆమోదం తెలిపారు. -
విభజన ప్రతిపాదనలకు నేడు ఆమోదం
గవర్నర్ ఆధ్వర్యంలో కేబినెట్ ప్రత్యేక సమావేశం శాశ్వతంగా భవనాల కేటాయింపు పోలవరం ముంపు ప్రాంతాల్లో మార్పులు షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పదేళ్ల పాటు ప్రస్తుత ప్రవేశ పరీక్షల విధానం పలు విభజన కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రతిపాదనల ఆమోదానికి గవర్నర్ నరసింహన్ ఆదివారం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేబినెట్ సమావేశాన్ని గవర్నర్ ఏర్పాటు చేయడం ఏమిటని ఆశ్యర్యపడుతున్నారా? రాష్ట్రపతి పాలనలో గవర్నర్ సీఎంగా, ఆయన సలహాదారులు మంత్రులుగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే విభజన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపడానికి ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గవర్నర్ సలహాదారులు సులావుద్దీన్ అహ్మద్, ఏ.ఎన్.రాయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పాల్గొంటారు. ఈ సమావేశంలో అన్ని శాఖలకు చెందిన విభజన ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. సచివాలయంతో పాటు రాజధానిలోని ప్రభుత్వ శాఖలు, సంస్థల భవనాలను ఇరు రాష్ట్రాలకు తాత్కాలికంగా కేటాయింపులు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గవర్నర్ నరసింహన్ తాత్కాలిక కేటాయింపులు కాకుండా శాశ్వత కేటాయింపులు చేయాలని నిర్ణయించడంతో జారీ చేసిన జీవోలు ఓపెన్ కాకుండా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచారు. ఆదివారంనాటి సమావేశంలో సచివాలయంతోపాటు పలు శాఖల భవనాలను శాశ్వత కేటాయింపులుగా ఆమోదం తెలుపుతారు. భద్రాచలం డివిజన్లోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. గతంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా జారీ చేసిన జీవోలో మరికొన్ని గ్రామాలను చేర్చాల్సి ఉంది. ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలకు గవర్నర్ నిర్వహించే కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపుతుంది. అలాగే రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లో పదేళ్ల పాటు విద్యా సంస్థల్లో ప్రవేశపరీక్ష ప్రస్తుత విధానంలోనే కొనసాగే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10లో గల సంస్థలను రెండుగా విభజించడంతో పాటు ఏడాది పాటు అవే సంస్థలు ఇరు రాష్ట్రాలకు సేవలందించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పలు శాఖలకు చెందిన విభజన కమిటీల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఫైళ్ల విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఫైళ్ల విభజనతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి కరెంట్ ఫైళ్ల స్కానింగ్ కూడా పూర్తి అయింది. 4.53 కోట్ల పేజీలను స్కానింగ్ చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో 42 వేల ప్రభుత్వ వాహనాలున్నట్లు గుర్తించారు. ఈ వాహనాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. అలాగే చరాస్తులు 4.69 లక్షలు కాగా స్థిరాస్తులు 66 వేలుగా గుర్తించారు. శాఖల విలీనం, విభాగాల కుదింపు ఇరు రాష్ట్రాల సీఎంల ముందు రాష్ట్ర విభజన నేపథ్యంలో శాఖల విలీనం, విభాగాల కుదింపు ప్రతిపాదనలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల ముందు ఉంచాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంత్రుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలను ఒకే శాఖ కింద విలీనం చేయడానికి అధికారులు ప్రతిపాదించారు. అలాగే విభాగాల సంఖ్య కుదింపునకు ప్రతిపాదించారు. కొత్త రాష్ట్రాల్లోని సీఎంల నిర్ణయం మేరకు శాఖల విలీనం, విభాగాల కుదింపు ఆధారపడి ఉంటుంది. ఫైళ్ల విభజన ఇలా... ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఫైళ్లు 15.48 లక్షలు ఆంధ్రప్రదేశ్ ఫైళ్లు 6.46 లక్షలు తెలంగాణ ఫైళ్లు 6.26 లక్షలు రెండు రాష్ట్రాలకు చెందిన ఫైళ్లు 2.76 లక్షలు ఉమ్మడి రాష్ట్రంలో డిస్పోజల్ ఫైళ్లు 28.75 లక్షలు ఆంధ్రప్రదేశ్ ఫైళ్లు 8.93 లక్షలు తెలంగాణ ఫైళ్లు 10.33 లక్షలు రెండు రాష్ట్రాలకు చెందిన ఫైళ్లు 9.49 లక్షలు -
డీఏపై కనికరించని ఆర్థిక శాఖ
గవర్నర్ ఆమోదించినా, పెండింగ్‌లో పెట్టిన అధికారులు జీవో జారీలో జాప్యం బిల్లుల సమర్పణకు గడువు 17 వరకే ఐఏఎస్‌లకు మాత్రం డీఏ వచ్చేసింది హెదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) ఫైలును ఆర్థిక శాఖ తొక్కిపెట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ గవర్నర్ నరసింహన్ ఫైలుపై సంతకం చేశారు. ఇది జరిగి నాలుగు రోజులు గడిచినా, ఆర్థిక శాఖ జీవో జారీ చేయకుండా ఫైలును పెండింగ్‌లో పెట్టింది. వచ్చే నెల 2న రాష్ట్రం రెండుగా విడిపోతున్న నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్‌ను ఈనెల 24నే చెల్లించేందుకు ఆర్థిక శాఖ జీవో కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి జూన్ వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఇవ్వాలన్న ఉద్యోగుల కోరికను ‘సాక్షి’ వెల్లడించింది. దీంతో ఆర్థిక శాఖ 8.56 శాతం డీఏ మంజూరు ఫైలును గవర్నర్‌కు పంపింది. గవర్నర్ వెంటనే దానికి ఆమోదం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, గవర్నర్ సూచన మేరకు ఫైలును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆమోదం కోసం పంపారు. భన్వర్‌లాల్ వెంటనే ఆమోదించారు. ఈ ఫైలు శుక్రవారం ఆర్థిక శాఖకు చేరింది. అప్పటి నుంచి ఆర్థిక శాఖ జీవో జారీ చేయకుండా ఫైలును పెండింగ్‌లో పెట్టింది. మరో పక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపునకు బిల్లుల సమర్పణ గడువు ఈ నెల 17తో ముగుస్తోంది. అంటే గడువు ఇంకా 3 రోజులే ఉంది. ఈలోగా డీఏ జీవోను ఇవ్వకపోతే ఉద్యోగులకు కరువు భత్యం శాతం లెక్కకట్టి బిల్లుల సమర్పణ సాధ్యం కాదు. డీఏ ఇవ్వకపోతే గవర్నర్ సంతకానికి విలువ ఉండదని, ఆ ఉద్దేశంతోనే జీవో జారీ చేయకుండా ఆర్థిక శాఖ జాప్యం చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు డీఏ జీవో జారీ కాకపోతే, వచ్చే నెలలో రాష్ట్ర విభజన జరిగాక సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే డీఏ చెల్లించాల్సి వస్తుంది. అంటే డీఏ మరింత జాప్యమవుతుంది. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని ఉమ్మడి రాష్ట్రంలోనే డీఏ మంజూరుకు వీలుగా వెంటనే జీవో జారీ చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఐఏఎస్ అధికారులకు మాత్రం డీఏ మంజూరయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఐఏఎస్‌లు డీఏ తీసుకోనున్నారు. -
16% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసిక నికరలాభం 16% క్షీణించింది. 2012-13 చివరి త్రైమాసికంలో రూ. 571 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 482 కోట్లకు పడిపోయింది. అభివృద్ధి, పరిశోధన రంగానికి కేటాయింపులు పెంచడమే లాభాలు తగ్గడానికి కారణంగా డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆర్ అండ్ డీ కేటాయింపులు రూ. 233 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు పెంచడంతో ఆ మేరకు లాభాలు తగ్గాయన్నారు. సమీక్షా కాలంలో ఆదాయం 4% పెరిగి రూ. 3,340 కోట్ల నుంచి రూ. 3,481 కోట్లకు పెరిగింది. ఏడాది మొత్తం మీద చూస్తే డాక్టర్ రెడ్డీస్ నికరలాభం రూ. 1,678 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 11,626 కోట్ల నుంచి రూ.13,217 కోట్లకు వృద్ధి చెందింది. గడచిన ఏడాది ఆర్అండ్డీ కేటాయింపులను ఆదాయంలో 6.6 శాతం (రూ.757 కోట్లు) నుంచి 9.4 శాతానికి (రూ.1,240 కోట్లు) పెంచామని, ఈ మొత్తాన్ని ఈ ఏడాది 11 శాతం వరకు పెంచనున్నట్లు సతీష్ తెలిపారు. అంతర్జాతీయంగా ముఖ్యంగా ఉక్రెయిన్, సీఎస్ఐ దేశాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలు వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి సంకేతాలు ఉండటంతో వ్యాపారంలో వృద్ధి బాగుంటుందన్న ఆశాభావాన్ని సతీష్ వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో కొత్తగా మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రూ. 5 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.18 డివిడెండ్‌ను ప్రకటించింది. రాయితీల తర్వాతే పెట్టుబడులు ఈ ఏడాది విస్తరణ కోసం రూ. 1,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రాష్ట్ర విభజన పూర్తయ్యి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడి రాయితీలు ప్రకటించిన తర్వాత ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేది నిర్ణయిస్తామని సతీష్ తెలిపారు. గతేడాది వ్యాపార విస్తరణ కోసం రూ.1,020 కోట్లు వ్యయం చేసింది. చైర్మన్‌గా సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యంలో కీలక మార్పులు జరిగాయి. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ అంజిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సతీష్ రెడ్డి కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. అలాగే ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న అంజిరెడ్డి అల్లుడు జి.వి.ప్రసాద్ ఇక నుంచి సీఈవో, వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ మార్పులపై సతీష్ స్పందిస్తూ ఇవి కేవలం కంపెనీ నిర్వహణ సౌలభ్యం కోసమేనన్నారు. కంపెనీ నిర్వహించే సామాజిక సేవలు, ఫార్మా రంగ అసోసియేషన్లతో తాను కలిసి పనిచేయాల్సి ఉండటంతో రోజువారీ కార్యకలాపాలను ప్రసాద్‌కు అప్పచెప్పినట్లు సతీష్ తెలిపారు. -
ఎక్కడి వారక్కడే అనడం అన్యాయుం
స్థానికత ఆధారంగానే రాష్ట్రస్థాయిఅధికారుల కేటాయింపు చేపట్టాలి తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా తాత్కాలిక కేటాయింపుల్లో రాష్ట్ర స్థాయి అధికారులను ఎక్కడ పని చేస్తున్న వారిని అక్కడే ఉంచాలని పేర్కొంటూ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలతో తెలంగాణ అధికారులకు అన్యాయుం జరుగుతుందని తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. తాత్కాలిక కేటాయింపుల్లోనూ రాష్ట్రస్థారుు అధికారుల విభజన స్థానికత ఆధారంగానే చేపట్టాలని డివూండ్ చేశారు. సోవువారం హైదరాబాద్‌లో విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడుతూ.. ఇరు ప్రాంతాల అధికారుల అభిప్రాయూలను తెలుసుకోకుండా పంపిన ప్రతిపాదనలను తీవ్రంగా ఖండిస్తున్నావున్నారు. సీవూంధ్రులు తెలంగాణలోనే తిష్టవేసేలా ఈ చర్యలకు పూనుకున్నారని, దీనిని ఉద్యోగులు, నేతలు అడ్డుకోవాలని కోరారు. దీనిపై త్వరలో రాజకీయుపార్టీలతో సవూవేశం నిర్వహించి ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపించనున్నట్టు తెలిపారు. ప్రొవిజనల్ అలాట్‌మెంట్‌కు, ఫైనల్ అలాట్‌మెంట్‌కు మధ్య వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చే సరికి పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. పైగా ఫైనల్ అలాట్‌మెంట్‌కు మూడేళ్లు పట్టొచ్చంటూ అధికారులే చెబుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక కేటాయింపుల పేరుతో తెలంగాణలో తిష్ట వేసే పరిస్థితి కల్పిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల పంపిణీ, శాఖల వారీగా పోస్టుల విభజన వివరాలను వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అడిగితే ఎన్నికల కోడ్ ఉందని చెబుతున్నారని, మరోవైపు మాత్రం పోస్టుల భర్తీ, డెప్యుటేషన్లు కొనసాగిస్తున్నారన్నారు. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ వారిని, తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను వారి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. -
రాష్ట్ర విభజనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
త్వరగా స్పందించేలా కేంద్రాన్ని ఆదేశించే అవకాశం! న్యూఢి ల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, మాజీ సీఎం కిరణ్ సహా వివిధ పార్టీల నేతలు రఘురామకృష్ణంరాజు, అడుసుమిల్లి జయప్రకాశ్ తదితరులు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ కేసులో ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే సుప్రీం నోటీసులు జారీ చేసింది. కానీ, సమాధానం చెప్పేందుకు కాలపరిమితి విధించలేదు. దీంతో విచారణ ఆలస్యమవుతుందంటూ పిటిషనర్లు.. సుప్రీంను ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తికి స్పందిం చిన చీఫ్ జస్టిస్.. మే తొలివారంలో విచారిస్తామన్నారు.ఈ క్రమంలో జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఇక్బాల్, జస్టిస్ ఎస్ఏ బాడ్డేలతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టనుంది. కాగా, కేసులో పలు రాజ్యాంగ పరమైన అంశాలుండడంతో రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశముంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం త్వరితంగా సమాధానమిచ్చేలా ఆదేశించే అవకాశమూ ఉంది. -
విజయవాడలోనే ఆర్టీసీ కేంద్ర కార్యాలయం
విద్యాధరపురం స్థలానికి కమిటీ ఆమోదం ఇక్కడే వంద పడకల ఆస్పత్రి, గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం విజయవాడ : రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై నియమించిన నిపుణుల కమిటీ కూడా విజయవాడే సరైన ప్రాంతమని నిర్ణయించింది. దీంతో ఇక్కడ అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించేందుకు ఒక కమిటీ శనివారం నుంచి మూడు రోజులపాటు పర్యటించి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇక్కడి విద్యాధరపురంలో ఉన్న ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఎండీ కార్యాలయాన్ని, గెస్ట్‌హౌస్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లోని తార్నాకలో వంద పడకల ఆస్పత్రి ఉంది. ఇది రాష్ట్ర విభజనలో తెలంగాణకు వెళ్లిపోతుంది. దీంతో ప్రత్యామ్నాయంగా విజయవాడలో వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారు. విద్యాధరపురం వర్క్‌షాప్ వద్ద ఉన్న డిస్సెన్సరీ స్థానంలోనే ఈ ఆస్పత్రి నిర్మించనున్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న పాత బస్టాండ్ స్థలాన్ని కూడా స్వాధీనంలోకి తీసుకుని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని లీజుకిచ్చారు. ఈ వివాదం కోర్టులో ఉంది. రవాణా శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చే ట్రాన్స్పోర్ట్ అకాడెమీని విజయవాడకు సమీపంలోని గన్నవరంలో ఏర్పాటు చేయనున్నారు. గతంలో గన్నవరంలో ట్రాన్స్‌పోర్టు అకాడెమీ కోసం స్థలాన్ని సేకరించారు. అయితే, అది హైదరాబాద్‌కు తరలిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ జోనల్ శిక్షణ కళాశాల నడుస్తోంది. రాష్ట్ర విభజనతో మళ్లీ ఇక్కడే అకాడెమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్టీసీలోని సివిల్ ఇంజినీరింగ్ అధికారులు ఎండీ కార్యాలయం, గెస్ట్‌హౌస్, ట్రాన్స్‌పోర్టు అకాడెమీ, వంద పడకల ఆస్పత్రికి డిజైన్లను తయారుచేసి ఆమోదం కోసం పంపించినట్లు తెలిసింది. వీటికి ఆమోదముద్ర పడితే జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 13,300 బస్సులు, 69 వేల మంది ఉద్యోగులు సీమాంధ్రకు ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 217 డిపోలున్నాయి. 22,222 బస్సులతో లక్షా ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. విభజన పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు 69,600 మంది ఉద్యోగులు వస్తారు. ఈ ప్రాంతానికి 13,300 బస్సులను కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 707 మంది అధికారులు ఉండగా, 413 మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించనున్నారు. -
వేగంగా విభజన ప్రక్రియ
ఢిల్లీలో ప్రత్యూష్‌సిన్హా కమిటీ ముందు హాజరైన సీఎస్ మహంతి అఖిల భారత సర్వీసు అధికారుల విభజన మార్గదర్శకాలపై చర్చ ఏపీ భవన్ విభజనపై ఉన్నతాధికారుల కీలక సమావేశం న్యూఢిల్లీ: రాష్ట్ర విభ జనకు సంబంధించిన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 30 నాటికి అన్ని విభాగాల్లో విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకు అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా విభజనకు సంబంధించి మంగళవారం సైతం ఢిల్లీలో కీలక భేటీలు జరిగాయి. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ఏర్పాటుచేసిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి హాజరై కీలక చర్చలు జరిపారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనేవారి విభజనకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే దిశగా వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కూడా ఉన్నతాధికారులు మరో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఏపీ భవన్ విభజనకు సంబంధించి వారు దాదాపు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క బుధవారం రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ కేంద్ర హోంశాఖ ముందు హాజరై తన కసరత్తును వారికి వివరించనుంది. ఇదిలా ఉండగా నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రత్యూష్ సిన్హాతో పాటు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, పర్యావరణ శాఖ, హోంశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పాల్గొన్నారు. ఈ కమిటీ సుమారు నాలుగు గంటల పాటు రెండు విడతలుగా సమావేశమై అఖిలభారత సర్వీసు అధికారుల విభజన మార్గదర్శకాల తయారీపై కసరత్తు చేసింది. విభజన అనంతరం ఏ రాష్ట్రానికి వెళ్లాలనే విషయంలో తమకు ఆప్షన్లు ఉండాల్సిందేనని అఖిలభారత సర్వీసు అధికారులు ఇప్పటికే స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులకు ఆప్షన్లు ఇవ్వాలా? రోస్టర్ విధానాన్ని అవలంబించాలా? లేక స్థానికత ఆధారంగా నిర్ణయం చేయాలా? అన్న దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుందన్న అంశంపై వివరాలు తెలియరాలేదు. అధికారుల విభజన మార్గదర్శకాల తయారీ పూర్తి కాలేదని, దీనికి మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏపీ భవన్ విభజన కొలిక్కి!: ఇక ఏపీభవన్‌లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, సిబ్బంది, భవనాలు, తదితరాల విభజనకు సంబంధించి ఆర్అండ్బీ శాఖ ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు, జీఏడీ ప్రోటోకాల్ ముఖ్య కార్యదర్శి రమణారెడ్డి, జీఏడీ కార్యదర్శి శివశంకర్, రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. ప్రస్తుతం ఉన్న సీఎం కాటేజ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు, శబరి బ్లాక్‌లో తెలంగాణ ముఖ్యమంత్రికి కాటేజ్‌ను కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏపీభవన్‌లో 30 వాహనాలు ఉండగా వాటిని ఆంధ్రకు 15, తెలంగాణకు 14 చొప్పున పంచారు. అలాగే ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో వాడే రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇరువైపులా ఒక్కోటి చొప్పున, ఇక మిగిలిన మరో వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఏపీభవన్‌లో ప్రస్తుతం ఉన్న క్యాంటీన్, వీఐపీ డైనింగ్ హాల్, అంబేద్కర్ఆడిటోరియాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల విభజన మే 7 తర్వాతే? ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఏపీ భవన్ ఉద్యోగుల విభ జనను ఎలా చేయాలన్నది మే 7 తర్వాతే నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ భవన్లో 31 మంది ఆంధ్రా ప్రాంతం వారు, 11 మంది తెలంగాణవారు, మరో 48 మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. వీరిని స్థానికత ఆధారంగా పంచితే తెలంగాణకు కొరత ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా సింగిల్ పోస్టులన్నీ తెలంగాణకు, డబుల్ పోస్టులున్న చోట్ల సీనియర్లు తెలంగాణకు, జూనియర్లను ఆంధ్రాకు కేటాయించేలా మొదట ఉన్నతాధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. దీనివల్ల కొందరు ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్న దృష్ట్యా సీమాంధ్రలో ఎన్నికలు ముగిసిన అనంతరమే ఉద్యోగుల విభ జన చేపడతారని తెలుస్తోంది. అప్పటివరకు కేవలం పోస్టుల విభజనను పూర్తి చేస్తారని తెలుస్తోంది. -
విభజన కీలకాంశాలపై ఎన్నికల దెబ్బ
ఎన్నికలు పూర్తయ్యాకే ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు వెల్లడి ఎన్నికల అంశాలుగా మారకుండా కేంద్రం జాగ్రత్తలు హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలకాంశాలపై ఎన్నికల దెబ్బ పడింది. కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆ రాష్ట్రంలో కలపడంపై ఇప్పటివరకు స్పష్టతలేదు. ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పనలో అత్యంత వేగంగా పనిచేసిన అధికార యంత్రాంగం వారం నుంచి వేగాన్ని తగ్గించేసింది. ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ముంపు గ్రామాలు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు ఎన్నికల అంశంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణమని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇటీవల రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర మంత్రి జైరాం రమేశ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రత్యేకంగా గవర్నర్ నర్సింహన్‌తో సమావేశమై చర్చించారు. తెలంగాణలో ఈ నెల 30వ తేదీన, సీమాంధ్రలో మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నందున ఆలోగా ఈ అంశాలపై ఎలాంటి నిర్ణయం ప్రకటించినా రాజకీయంగా సమస్యలు తలెత్తుతాయనే అభిప్రాయం కేంద్ర పెద్దల్లో నెలకొంది. అందుకే ఈ అంశాలపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయమూ ప్రకటించకూడదని కేంద్రం నిర్ణయించుకుంది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తే తెలంగాణ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, దీన్ని కేసీఆర్ రాజకీయ అంశంగా మలుచుకుంటారనే అభిప్రాయం ఉంది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వకపోతే సీమాంధ్ర ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని, దీన్ని కొన్ని పార్టీలు ఎన్నికల్లో లబ్ధిపొందడానికి వినియోగించుకుంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలను ఖరారు చేయరాదని కేంద్ర పెద్దలు నిర్ణయించారు.ఇప్పటికే కమలనాధన్ కమిటీ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చింది. తొలుత స్థానికత ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంత రాష్ట్రానికి కేటాయించనున్నారు. అనంతరం చట్టంలో పేర్కొన్న మేరకు ఆయా కేటగిరీల్లో ఉద్యోగులను ఆప్షన్లు కోరనున్నారు. -
రోస్టర్ విధానమే..
ఆలిండియా సర్వీస్ కన్ఫర్డ్ అధికారుల పంపిణీపై సిన్హా కమిటీ నిర్ణయం మే 28 కల్లా ఏ ప్రాంతానికి ఎవరో స్పష్టీకరణ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర క్యాడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు కన్ఫర్డ్ అధికారుల పంపిణీకి రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యూష సిన్హా కమిటీ స్పష్టం చేసింది. రోస్టర్ విధానం వల్ల ఒక ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతంలో పని చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వినతులను కమిటీ ఖాతరు చేయలేదు. అధికారుల పంపిణీపై అభిప్రాయాలు వెల్లడించేందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సంఘాల ప్రతినిధులను ఈ నెల 15న ఆహ్వానించిన ప్రత్యూష సిన్హా కమిటీ వారిని చిన్నచూపు చూసింది. ఈ నేపథ్యంలో సంఘాల ప్రతినిధులు ఢిల్లీ వెళ్లి కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం సహాయ కార్యదర్శిని కలసి వినతి పత్రాలను సమర్పించారు. కన్ఫర్డ్ ఐఏఎస్‌లను సంబంధిత ప్రాంతానికే కేటాయించాలన్న వినతిపై సహాయ కార్యదర్శి స్పందన సంతృప్తికరంగా లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చాలా క్లిష్టతరమైన ఈ అంశంపై నిర్ణయాన్ని తమకే వదిలేయాలని సహాయ కార్యదర్శి స్పష్టం చేశారు. అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి గతంలో ఏర్పడిన రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్నే పాటించాలని ప్రత్యూష సిన్హా కమిటీ నిర్ణయానికి వచ్చింది. డెరైక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే పంపిణీ చేయనున్నారు. కన్ఫర్డ్ అధికారులను మాత్రం ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి పంపిణీ చేయకుండా రోస్టర్ విధానం ద్వారా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ విధానాన్ని తెలంగాణకు చెందిన కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర కమిటీకి తెలియజేసినా స్పందన రాలేదు. ఇక డెరైక్ట్ రిక్రూటీల్లో రాష్ట్రేతరుల పంపిణీని కూడా రోస్టర్ విధానంలోనే చేయనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియను మే నెలాఖరులోగానే పూర్తి చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈమేరకు మే 28వ తేదీ కల్లా అధికారుల కేటాయింపులను కమిటీ పూర్తి చేయనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
చంద్రన్న నేతృత్వంలో ‘మావో’ తెలంగాణ కమిటీ
బండి ప్రకాష్, శివారెడ్డి, చొక్కారావు కీలకం {పస్తుతం కమిటీలో 80 మంది సమాచారం సేకరించిన రాష్ట్ర నిఘా వర్గాలు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (ఎన్టీఎస్జెడ్సీ) తాజాగా తెలంగాణ స్టేట్ కమిటీ (టీఎస్సీ)గా మారింది. పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రెటరీగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న దీనికి నేతృత్వం వహిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కమిటీలో ప్రస్తుతం 80 మంది వరకు కేడర్ ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ అడవులు కేంద్రంగా ఖమ్మం జిల్లాపై దృష్టి సారించిన టీఎస్సీ ప్రస్తుతం ద్వితీయ స్థాయిలో నేతృత్వం వహించే కేడర్‌ను సమీకరించుకోవడంపై దృష్టి పెట్టింది. ఎన్నికల నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి ముమ్మరంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు కీలక ఆధారాలు సేకరించాయి. ఖమ్మంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్లోనూ అవకాశం ఉన్నచోట ఉనికిని ప్రదర్శించాలని టీఎస్సీ ప్రయత్నిస్తోంది. దీనికి చెక్ చెప్పేందుకు నిఘా వర్గాలు సైతం పక్కా వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం వడకాపూర్కు చెందిన చంద్రన్న అసలు పేరు పుల్లూరి ప్రసాదరావు. ఈయనకు శంకరన్న, శంకర్రావు, మల్కాపురం భాస్కర్ అనే మారుపేర్లూ ఉన్నాయి. ఎన్టీఎస్జెడ్సీతో పాటు సెంట్రల్ కమిటీకి సెక్రెటరీగా వ్యవహరించిన ఇతడిపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం మదగూడకు చెందిన యాప నారాయణ అలియాస్ లక్ష్మ అలియాస్ హరిభూషణ్, వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలం నార్లపూర్‌కు చెందిన ఇ.శివారెడ్డి అలియాస్ కిరణ్, కల్వపల్లికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాష్ అలియాస్ బండి బడా అలియాస్ క్రాంతి టీఎస్‌సీలో కీలక భూమిక పోషిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం టీఎస్సీ దృష్టంతా ఆపరేషన్లు నిర్వహించడం కంటే కేడర్‌ను పెంచుకోవడం పైనే ఉందని చెప్తున్నాయి. -
రాష్ట్ర విభజనకు ఓ బ్రోకరే కారణం : దాసరి
-
రాష్ట్ర విభజనకు ఓ బ్రోకరే కారణం... అతనెవరో త్వరలో వెల్లడిస్తా: దాసరి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఓ బ్రోకరే కారణమని మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అతనెవరో త్వరలోనే వెల్లడిస్తాననీ ఆయన పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళి నటించిన ‘బ్రోకర్-2’ సినీ గీతాల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమలో దాసరి మాట్లాడుతూ.. ‘‘నేను చదువుకునే రోజుల్లో బ్రోకర్ అనే మాట చాలా చౌకబారు పదం. కానీ, ఇప్పుడు అది పవిత్రమైన పదంలా తయారైంది. రాజకీయ పార్టీలు మొదలు రాష్ట్రాలను విడగొట్టడం వరకూ బ్రోకర్లు పని చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి గురించి కూడా దాసరి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘తెలుగునాట సినిమా హాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలున్నాయి. దాదాపు 200 దాకా సినిమాలు తొలి కాపీలు వచ్చి, రిలీజుకు నోచుకోకుండా పడి ఉన్నాయి. అసమర్థ ప్రభుత్వాలు, మంత్రుల వల్లే చిన్న సినిమాలకు హాళ్ళు దొరకని దుస్థితి తలెత్తింది. రేపు రానున్న రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రజాభిప్రాయం ప్రకారమే ఉద్యోగుల ‘విభజన’
పంపిణీ మార్గదర్శకాలపై వినతులకు కమల్‌నాథన్ ఆహ్వానం సలహాలు, సూచనల తర్వాతే తుది మార్గదర్శకాలు ఖరారు జిల్లాల ప్రాతిపదికగా ఉద్యోగుల పంపిణీ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పన కమిటీ, ఉద్యోగుల పంపిణీ కమిటీల చైర్మన్ కమల్‌నాథన్... ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. సచివాలయంలోని సి-బ్లాక్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయన ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలే కీలకం. ఆ మేరకే ఉద్యోగులను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ఈ మార్గదర్శకాల రూపకల్పనలో భాగంగా కమల్‌నాథన్ ఇప్పటికే రెండ్రోజుల పాటు ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై, వారి అభిప్రాయాలను తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆయా సంఘాల నుంచి నోట్లను తీసుకున్నారు. ఇంకా ఎవరైనా, ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగ సంఘాలైనా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఉద్యోగులు కానీ తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించడానికి కమల్‌నాథన్ అనుమతించారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలకు వారం రోజుల్లోగా ఒక రూపం ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. మరోసారి మార్గదర్శకాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్రం అభిప్రాయాలను తీసుకోనున్నారు. తొలుత ముసాయిదా మార్గదర్శకాలను ప్రజల ముందు ఉంచి... వారి సలహాలు, సూచనలు స్వీకరించడానికి తగిన గడువు ఇవ్వాలని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో పాటు ఇతర వర్గాల నుంచి వచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే తుది మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉద్యోగుల పంపిణీ ఏ ప్రాతిపదికన చేయాలనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. దీంతో గతంలో రాష్ట్రాల విభజనలో పాటించినట్లే ఇప్పుడు కూడా జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీ చేయాలనే ఆలోచనలో కమల్‌నాథన్ ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగుల పంపిణీలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం అనుసరించనున్న కీలకాంశాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ప్రొవిజినల్ ఉద్యోగుల కేటాయింపును జూన్ 2వ తేదీ కన్నా ముందుగానే కేంద్రం పూర్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగుల కేటాయింపును ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటూ జూన్ 2 తర్వాత కేంద్రం చేస్తుంది. స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్న వారు ఆ రాష్ట్రంలోనే ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రస్థాయి కేడర్‌లోని అధికారులు జోనల్, జిల్లా, డివిజినల్, మున్సిపల్, మండలస్థాయిలో పనిచేస్తున్న వారిని రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర సలహా కమిటీ సిఫార్సుల మేరకు ఇరు రాష్ట్రాలకు రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అధికారం కేంద్రానికి ఉంది. -
‘పవర్’ లేని పవనిజం
అభిమానుల్లో జోష్ ఆశావహుల్లో నీరసం! నిర్వాహకులు ఆశించినంతగా లేని జనం సాక్షి, విశాఖపట్నం : జనసేన పార్టీ అధినేత పవ న్ కల్యాణ్ విశాఖ నగరంలో గురువారం నిర్వహించిన తొలి రాజకీయ సభ ఆశావహుల పాలిట అశనిపాతంగా మారింది. అభిమానుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నించిన ఆయన జనసేన పార్టీ తరఫున రాజకీయరంగ ప్రవేశం చేయాలనుకున్నవారికి మాత్రం షాకిచ్చారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తమ పూర్తి మద్దతుంటుందని చెప్తూనే.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసేది లేద ని, అభిమానులంతా ఎవరికి ఇష్టమున్న నేతకు వారు ఓటేసుకోవచ్చని స్పష్టం చేశారు. పార్టీ ప్రకటన సభ మాదిరిగానే తొలి రాజకీయ బహిరంగ సభను కూడా పవన్ కల్యాణ్ ఒక్కరే నడిపించారు. సుమారు 1.15 గంటలు ప్రసంగించిన ఆయన మళ్లీ కాంగ్రెస్‌పై ఆరోపణాస్త్రాలు సంధించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. అవకాశవాద కాంగ్రెస్ నేతల్ని కూకటివేళ్లతో సహా పెకిలించేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. విభజన సమయంలో ఎమ్మెల్యేలు కావూరి, రాయపాటితోపాటు, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ తీరును తీవ్రంగా ఖండించారు. జన సమీకరణలో మాత్రం నిర్వాహకులు చెప్పిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. అసలే గ్రౌండ్ చిన్నది.. అయినప్పటికీ వేసిన కుర్చీలు మేరకు తప్ప.. మిగిలిన భాగమంతా ఖాళీగా దర్శనమిచ్చింది. సభ కూడా అనుకున్న సమయానికంటే సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమయింది. అభిమానులు మాత్రం పవన్ ప్రసంగాన్ని ఆసాంతం విని కేరింతలు, చప్పట్లతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. అభిమానులు అత్యుత్సాహంపై అక్కడక్కడ పోలీసులు లాఠీలు ఝళిపించాల్సి వచ్చింది. 2014 అడుగుల జెండాను అభిమానులు ఆవిష్కరించారు. -
మెట్రోరైలుకు కదలిక
నాలుగు రూట్లతో ప్రాథమిక నివేదిక రూట్లవారీ భూ సేకరణపై త్వరలో సర్వే సాక్షి, విశాఖపట్నం: మెట్రో రైలు ప్రాజెక్టుపై అధికారుల చర్యలు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖతోపాటు గుంటూరు-విజయవాడ మధ్య కూ డా మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనలున్నాయి. గతంలో ఇవే ప్రాజెక్టులకు కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం నిధులు సమకూర్చే విధంగా నిబంధనలు రూపొందించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు వ్యయంలో ఏకంగా 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించనున్న నేపథ్యంలో ప్రాజెక్టులపై జీవీఎంసీ త్వరితగతిన సన్నద్ధమవుతోంది. నాలుగు రూట్లు గుర్తింపు! విశాఖ సిటీ డెవలప్మెంట్ ప్లాన్(సీడీపీ)లో భాగంగా గతంలోనే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(ఎంఆర్టీఎస్) పేరిట మూడు మెట్రో కారిడార్లను ప్రతిపాదించారు. వీటిని సీడీపీ రెండో దశలో చేపట్టాలనుకున్నారు. ఇందులో పాతపోస్టాఫీసు నుంచి హనుమంతవాక(8 కి.మీ.), ఆశీలుమెట్ట నుంచి లంకెలపాలెం(15 కి.మీ.), కాన్వెంట్ కూడలి నుంచి పెందుర్తి(20 కి.మీ.) కారిడార్ల ప్రతిపాదనలున్నాయి. ఈలోగానే కేంద్రం మెట్రో రైలు ప్రాజెక్టుతో ముందుకు రావడంతో ఆ ప్రతిపాదనలు మరుగునపడి కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. 20-25 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు కారిడార్లకు ప్రాథమిక సర్వేలు చేశారు. ప్రయాణికులు, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే నాలుగు మార్గాలను ఎంపిక చేశారు. జనాభా, జనసాంద్రత అంచనాలు జీవీఎంసీలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీల విలీనానికి ముందున్న అంచనాల మేరకు జనాభా, జన సాంద్రత వివరాలను జీవీఎంసీ తన ప్రాథమిక నివేదికలో పొందుపరిచింది. జిల్లాలోని మొత్తం ట్రాఫిక్ రద్దీలో 59 శాతం జీవీఎంసీ పరిధిలోనే నెలకొంది. దీని మేరకు మెట్రోరైలు ప్రాజెక్టుపై అధికారులు ముందుకెళ్లారు. కానీ ప్రస్తుతం ఈ అంచనాల్లో మార్పులు తప్పనిసరికానుంది. స్థల సేకరణ, స్టాప్‌లపై సర్వే! జీవీఎంసీ ప్రతిపాదించిన నాలుగు రూట్లలో ఒకదానిని నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ఏజెన్సీ ఖరారు చేయనుంది. లో కార్బన్ మొబిలిటీ, ట్రాఫిక్ రద్దీ ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది. మెట్రోరైలు మార్గంపై నిర్ణయానికొచ్చాక.. నెల రోజుల వ్యవధిలో ఆ మార్గంలో ఎంత స్థలం సేకరించాల్సి ఉంటుంది? స్థలాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కేటగిరీ ఎంతెంత? కిలోమీటర్‌కో స్టాప్ చొప్పున ఎక్కడెక్కడ వాటిని ఏర్పాటు చేయాలన్నదానిపై సర్వే చేపట్టి, సమగ్ర నివేదిక రూపొందించాల్సి ఉంది. గత ప్రతిపాదనల మేరకు కిలోమీటర్‌కు రూ.185 కోట్లు మేర వ్యయ అంచనాలున్నాయని, ప్రాజెక్టు తుది రూపుకొచ్చేసరికి ఈ వ్యయం కిలోమీటర్‌కు రూ.215-220 కోట్లు మధ్య ఉండవచ్చని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ తెలిపారు. -
నేత యువకుడైతే ఇక దూకుడే..
ఐదేళ్లపాటు అభివృద్ధి పనులకు కోడ్ ఆటంకాలుండవు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు మంచి అవకాశం ఇక మిగిలింది సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయ్.. మున్సిపల్ ఎన్నికలు కావొస్తున్నాయ్ జెడ్పీటీసీ ఎన్నికలూ ఇప్పుడే ఉన్నాయ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోబోతున్నాం ఐదేళ్లపాటు ఎన్నికలు, కోడ్ బాధలు ఉండవు సంక్షేమ రాజ్యం రావడమే దానికి సమర్థ నేతను ఎన్నుకోవడవే తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. కొత్త రాష్ట్రాల నవనిర్మాణం కోసం సరి‘కొత్త’ ప్రణాళికలు.. నవతరం నాయకత్వం అవసరం. ఇదే సందర్భంలో ఇరు ప్రాంతాలకు మంచి అవకాశమూ లభించింది... రెండు కొత్త రాష్ట్రాల్లో రానున్న ఐదేళ్లూ ఎన్నికలే ఉండవ్! ‘కోడ్’కూతలు అసలే ఉండవ్! గతంలో ఆర్నెల్లు, ఏడాదికోసారి వచ్చే ఎన్నికల సందర్భాలు తెలుగు ప్రజలకు సుపరిచితం. అయితే పదేపదే వచ్చే ఎన్నికల పేరుతో ఇక అభివృద్ధి పనులను నిలిపివేసే ఛాన్స్ ఎంత మాత్రమూ లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ.. ఆ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికే పూర్తవుతుంది. ఆ లోపే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముగుస్తాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ లెక్కన రెండు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలకు వచ్చే అయిదేళ్లపాటు ఎన్నికల గొడవ ఉండదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదైనా కారణాలతో కూలిపోయి.. ఆ సమయంలో ఇంకొక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేని పరిస్థితులు తలెత్తితే తప్ప వచ్చే ఐదేళ్ల పాటు ఎన్నికలుండవు. ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న విచిత్రమైన పరిస్థితితో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రభుత్వా లు సామరస్యంగా పరిష్కరించుకోవలసిన అంశాలెన్నో ఉన్నాయి. అయితే సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడితేనే ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవడానికి వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఓటర్ల ముందున్న ప్రధాన బాధ్యత సుస్థిర, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే. ఇచ్చిన హామీలు, కొత్త రాష్ట్రాల అవసరాలను గుర్తించడం, సంక్షేమ రాజ్యం నిర్మించడంలో విశ్వసనీయత, మాట పై నిలబడగలిగే నేతను ఎన్నుకోవడం ద్వారానే రెండు రాష్ట్రాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించగలుగుతారు. ఆధునిక పోకడలను అందిపుచ్చుకుని అభివృద్ధి ఎజెండాతో ఉరకలెత్తే నాయకుడికి పట్టం కట్టాల్సి ఉంది. ఇలాగైతేనే ఇరు ప్రాంతాలూ పురోగతి సాధిస్తాయి. -
‘ఫలితాల’కు ముందే పూర్తిచేయాలి
మే 15వ తేదీ కల్లా విభజన పని పూర్తి చేయాలి జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాల్లోనూ పథకాలు, కార్యక్రమాలు, సేవలు సజావుగా కొనసాగాలి అధికారులతో సమీక్షలో నరసింహన్ ఆదేశం హదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లోను మే 15వ తేదీ కల్లా పూర్తి చేయాల్సిందిగా గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయని, ఆ తరువాత విభజన ప్రక్రియ కొనసాగేందుకు రాజకీయ ఒత్తిడిలు వస్తాయని, ఉద్యోగులు కూడా దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. కాబట్టి విభజనకు సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను మే 15వ తేదీకల్లా పూర్తి చేయాలని నిర్దేశించారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై గవర్నర్ శనివారం రాజభవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, విభజన అపెక్స్ కమిటీ చైర్మన్ ఎస్.పి.టక్కర్, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డి, పి.వి.రమేశ్, సాంబశివరావు, రామకృష్ణారావులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే జూన్ రెండో తేదీన.. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సేవలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ప్రధానంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సరుకులు సరఫరా, వివిధ రకాల పింఛన్ల పంపిణీ, విత్తనాల సరఫరా రెండు రాష్ట్రాల్లో యధావిధిగా కొనసాగాలని.. ఇందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్, స్టాంపులు - రిజిస్ట్రేషన్లు, రవాణా, మద్యం, గనుల ద్వారా వచ్చే పన్నుల ఆదాయాలకు సంబంధించి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం పేరుతో టిన్ నెంబర్లను తయారు చేయటంతో పాటు తెలంగాణ రాష్ట్రం పేరుతో రశీదులను, అవసరమైన నోటిఫికేషన్లను, రబ్బరు స్టాంపులను సిద్ధం చేయాలని గవర్నర్ సూచించారు. జూన్ రెండు నుంచి ఈ-సేవ, మీ-సేవలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో యధావిధిగా కొనసాగాలని, ఇందుకు అవసరమైన రశీదులను తెలంగాణ పేరుతో తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర విభజనలో ఆస్తులు, ఆప్పుల పంపిణీ పెద్ద సమస్య ఉండదని, అకౌంటెంట్ జనరల్ సూచన మేరకు ఇరు రాష్ట్రాల సంచిత నిధికి నిధులు జమ అవుతాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు గవర్నర్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన వివిధ కమిటీల పనితీరును అపెక్స్ కమిటీ చైర్మన్ టక్కర్ గవర్నర్‌కు వివరించారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించి కేంద్రం ఇంకా కమిటీని ఏర్పాటు చేయకపోవడం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్ల విభజనతో పాటు విభజను సంబంధించి ప్రతి పనినీ పద్ధతి ప్రకారం, పారదర్శకంగా మే రెండో వారానికల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్, ఇతర సీనియర్ అధికారులకు గవర్నర్ సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సోమవారం ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, శిక్షణ సంస్థలు, ఇంధన రంగాలపై గవర్నర్ సమీక్షిస్తారని సీఎస్ మహంతి తెలిపారు. పునర్ వ్యవస్థీకరణ విభాగం అధికారుల్లో మార్పులు రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ విభాగం అధికారుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విభాగం నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావును తప్పించారు. కొత్తగా ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు చోటు కల్పించారు. ఈ విభాగానికి టక్కర్‌ను చైర్మన్‌గాను, సభ్యులుగా వి.నాగిరెడ్డి, పి.వి.రమేశ్, ఎన్. శివశంకర్, కౌముది, ఆర్.జి కలఘట్గిలను, కన్వీనర్‌గా జయేశ్ రంజన్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల పంపిణీ సున్నిత సమస్య ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ చాలా కీలకాంశంగా మారనుందనే అభిప్రాయం గవర్నర్ సమీక్షలో వ్యక్తమైంది. ఉద్యోగుల పంపిణీ, ఏ ప్రాంతానికి చెందిన రాష్ట్ర కేడర్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు, మార్గదర్శకాలు తదితర అంశాలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు 84,200 ఉండగా వాటిలో 56 వేల పోస్టుల్లో మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నారని, మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని వివరించారు. తెలంగాణలో పుట్టిపెరిగి తెలంగాణలో పనిచేస్తున్న వారి సంఖ్య, అలాగే సీమాంధ్రలో పుట్టిపెరిగి తెలంగాణలో పనిచేస్తున్న వారి సంఖ్యను కూడా రమేశ్ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీ జరగాల్సి ఉన్నప్పటికీ గతంలో ఏర్పడిన రాష్ట్రాల విభజన సందర్భంగా రెండు లేదా మూడేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులు, అలాగే భార్య - భర్త కేసుల్లో ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుం దన్నారు. ఈ రెండు రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 45 శాతం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. లెక్కలను పరిశీలించిన గవర్నర్ కూడా ఇది చాలా సున్నితమైన, సమస్యాత్మక అంశంగా మారనుందని, ఈ విషయంలో లెక్కలను ఒకటికి రెండు సార్లు సరిచూడాలని నిర్దేశించారు. ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను కమల్‌నాథన్ కమిటీ రూపొందించే మార్గదర్శకాల ఆధారంగా చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో రాజీపడ రాదని స్పష్టంచేశారు. -
ఏ ప్రాంత విద్యుత్ ఆ ప్రాంతానికేనా?
రాష్ట్ర విభజన అనంతరం ఏ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఆ ప్రాంతానికే సరఫరా కానుందా? ఈ ప్రశ్నకు అవుననే జవాబు లభిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం కూడా జెన్కోకు చెందిన ప్లాంట్లతో డిస్కంలు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కొనసాగుతాయని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో స్పష్టం చేసింది. అయితే ఈ పీపీఏలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదముద్ర వేయాల్సి ఉండగా ఇప్పటివరకు పడలేదు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో కోడ్ దృష్ట్యా పీపీఏలకు ఇప్పట్లో ఈఆర్సీ ఆమోదముద్ర వేసే అవకాశం కూడా లేదు. దీంతో రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడి విద్యుత్ అక్కడే సరఫరా అవుతుందని, ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందనే చర్చ ఇంధనశాఖలో జోరుగా సాగుతోంది. తాజాగా పీపీఏలు కుదిరినా.. రాష్ర్టంలో జెన్కోకు థర్మల్ (బొగ్గుతో నడిచే) ప్లాంట్లతో పాటు జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. జెన్కోకు చెందిన ప్రతి ప్లాంటుతో రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పతి 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుంటాయి. ఈ విధంగా కుదుర్చుకున్న పీపీఏల కాలపరిమితి 2002లో కొన్ని ప్లాంట్లకు, 2010లో మరికొన్ని ప్లాంట్లకు ముగిసింది. దీంతో తాజాగా పీపీఏలు జరిగారుు. అయితే వీటికి అధికారికంగా ఈఆర్సీ ఆమోదముద్ర పడలేదు. మొత్తం 8,924.86 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వివిధ జెన్కో విద్యుత్ ప్లాంట్ల పీపీఏలకు ఇప్పటివరకు ఆమోదం లభించలేదు. రాష్ట్ర విభజన జరిగే జూన్ 2వ తేదీలోగా ఈఆర్సీ ఆమోదం లభించే పరిస్థితి లేదని ఇంధనశాఖ వర్గాలంటున్నారుు. ప్రస్తుత పీపీఏల ప్రకారం తెలంగాణలోని డిస్కంలు సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు 61.93 శాతం మేరకు విద్యుత్ సరఫరా అవుతుంది. మిగతాది ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్కు సరఫరా అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2,282.5 మెగావాట్లు ఉండగా, ఆంధ్రా ప్రాంతంలో 2,810 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో జల విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2,541.8 మెగావాట్లు కాగా, ఆంధ్రా ప్రాంతంలో మాత్రం 1,287.6 మెగావాట్లు మాత్రమే. తెలంగాణలో జల విద్యుత్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కేవలం 2-3 నెలలు మాత్రమే పూర్తిస్థాయిలో ఉంటుంది. అది కూడా వర్షాలు పడితేనే. అందువల్ల ఆయూ ప్రాంతాల్లో ప్లాంట్లు ఉత్ప త్తి చేసే విద్యుత్ పీపీఏలు లేని కారణంగా ఎక్కడిదక్కడే సరఫరా అరుుతే తెలంగాణకు విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిస్కంల వారీగా కేటాయింపు శాతాలు.. డిస్కం కోటా (శాతాల్లో) సీపీడీసీఎల్ 46.06 ఎన్పీడీసీఎల్ 15.87 ఎస్పీడీసీఎల్ 22.27 ఈపీడీసీఎల్ 15.80 ఇవీ ఆమోదముద్ర పడని కొన్ని ప్లాంట్లు ప్లాంటు పేరు సామర్థ్యం (మెగావాట్లలో) వీటీపీఎస్, విజయవాడ 500 కేటీపీపీ, వరంగల్ 500 కొత్తగూడెం స్టేజ్-6, ఖమ్మం 500 ఆర్టీపీపీ-వైఎస్సార్ జిల్లా 630 -
చీటర్లు, లూటర్లెవరో ప్రజలు తేలుస్తారు
రాష్ట్ర విభజన వ్యవహారంలో చీటర్లు (మోసగాళ్లు), లూటర్లు (దోపిడీదారులు) ఎవరో ప్రజలే తేలుస్తారని బీజేపీ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సాఫీగా, ఒక పద్ధతి ప్రకారం జరగలేదని చెప్పడమే పాపమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వాలంటూనే సీమాంధ్ర సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావించడం నేరమా? అన్నారు. ప్రాంతానికో మాట మాట్లాడి, పూటకో డ్రామా అడిన వారి సంగతేమిటో తేల్చే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని ప్రధానిని చేసేందుకు బీజేపీకి, ఆ పార్టీ మద్దతుదార్లకు (వారెవ్వరో స్పష్టంగా చెప్పలేదు) ఓటేయాలని అభ్యర్థించారు. ‘మోడీని ప్రధానిని చేద్దాం’ నినాదంతో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో డాక్టర్ రామారావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యతో పాటు బీజేపీ జాతీయ కోశాధికారి పీయుష్ గోయల్, అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ఉభయ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కె.హరిబాబు, జి.కిషన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎన్.రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు నరేంద్ర మోడీపై రాసిన పాటల క్యాసెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... 2009లో చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కల్పించిందని, దాని కొనసాగింపుగా జరిగిన ఉద్యమంలో వేయి మందికి పైగా అమరులయ్యారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2014 సాధారణ ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయమే రెండేళ్ల కిందటే తీసుకొని ఉంటే ప్రస్తుత పరిస్థితి నెలకొని ఉండేది కాదన్నారు. విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంలో తమ పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, అద్వానీలతో పాటు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ సమయంలో ఏమి చేయాలని నాలుగు రోజులు నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. తెలంగాణ రావాలి, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలనడం ఏవిధంగా ద్రోహమో చెప్పాలన్నారు. బాగో, జాగో అంటూ సీమాంధ్రుల్లో భయాందోళనలు సృష్టించారని, వాటిని పారదోలేందుకు ప్రధానితో ప్రకటన చేయించిన ఏకైక వ్యక్తిని తానేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను గానీ, తన కుమార్తె గానీ పోటీ చేయబోమని ప్రకటించారు. కొందరు మళ్లీ రాష్ట్రాన్ని కలుపుతామనడంపై స్పందిస్తూ, ఇదేమైనా పాతాళ భైరవి సినిమానా? అని ఎద్దేవా చేశారు. పీయుష్ గోయల్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రధానైతే పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యమన్నారు. హైదరాబాద్‌కు మజ్లిస్ పార్టీయే ప్రధాన సమస్యని కిషన్‌రెడ్డి అన్నారు. హరిబాబు మాట్లాడుతూ సీమాంధ్రకు ప్యాకేజీ బీజేపీ కృషేనని చెప్పారు. -
చంద్రబాబు పిరికిపంద: కిరణ్
రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలకు ఎన్నికల్లో లెంపకాయ కొట్టాలని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విభజించిన కాంగ్రెస్‌కు, విభజనకు అంగీకరిస్తూ రెండుసార్లు లేఖలిచ్చిన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. ఆదివారం విశాఖ బీచ్‌రోడ్‌లో విద్యార్థి సంఘం నాయకులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. అంతకుముందు జై సమైక్యాంధ్ర పార్టీ గుర్తు ‘పాదరక్షలు’ను ఒక చిన్నారితో ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర తమ నినాదం కాదని, విధానమని చెప్పారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు తన జిల్లా వాసేనని, తన తండ్రే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించారని కిరణ్ పేర్కొన్నారు. తరువాత టీడీపీలో చేరి మామకు వెన్నుపోటుపొడిచి అధికారాన్ని చేజిక్కించుకుని పాలనాదక్షుడనే ముసుగులో అధికారం కోసం అవాస్తవాలు, అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన ద్వారా ఇరు ప్రాంతాలు నష్టపోతాయని తెలిసీ తెలంగాణకు అనుకూలంగా రెండుసార్లు లేఖలిచ్చిన బాబు పాలనాదక్షుడెలా అవుతాడని ప్రశ్నించారు. తెలంగాణలో ఓట్లు పోతాయన్న భయంతో అసెంబ్లీలో విభజనపై ఒక్కసారి కూడా మాట్లాడలేని పిరికిపంద చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ సబ్బం హరి, మాజీమంత్రి పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఏమున్నాయ్.. ఎంతున్నాయ్!
రాష్ట్ర విభజన పర్వం జోరందుకుంది. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ తేదీని ముందస్తుగా ఖరారు చేసిన ప్రభుత్వం.. ఆ లోపు ఆస్తుల పంపకాల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు వేగిరం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ఆయా విభాగాల నుంచి ఆస్తుల వివరాలు సేకరిస్తోంది. శాఖాపరమైన ఆస్తులు, భూములు తదితర వివరాలు పంపించాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాల కోసం ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించిన ప్రభుత్వం వాటిని జిల్లా అధికారులకు పంపించింది. నిర్దేశిత నమూనాలో పూర్తి వివరాలు పంపించాలని స్పష్టం చేసింది. దీంతో అధికారులు ఆయా వివరాలను క్రోడీకరించి పంపే పనిలో నిమగ్నమయ్యారు. ప్రొఫార్మాలో ఏముంది? : విభజనకు సంబంధించి జిల్లాలకు పంపించిన ప్రొఫార్మాలో కీలకాంశాలున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని ఆస్తుల పంపకం జరిపే అవకాశం ఉంది. ప్రస్తుత రాజధాని చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నందున విలువైన ఆస్తులు జిల్లాలోనే ఉన్నాయి. ఉన్నతాధికారులు పంపిన ప్రొఫార్మా ప్రకారం.. అటవీ భూముల వివరాలు, ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. శాఖలవారీగా సొంత భవనాలు, ఇతర స్థిరాస్తులతో పాటు చరాస్తుల వివరాలూ సమర్పించాలి. కార్యాలయాల్లోని ఫర్నిచర్ మొదలు ప్రతి వస్తువు వివరాలు సమర్పించే విధంగా ప్రొఫార్మాలో నిర్దేశించారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి యూనిట్ల వివరాలు కూడా ఇవ్వాలని నిర్దేశించారు. ఈ లెక్కన కెమికల్ ల్యాబ్‌లు, ఉత్పత్తి కేంద్రాలు తదితర వివరాలు కూడా సమర్పించాల్సి ఉంది. -
‘పరీక్షా’ కాలం
ఒకేసారి మూడు ఎన్నికలు విద్యార్థులకు విషమ పరీక్షే సమైక్య ఉద్యమంతో రోజులతరబడి జరగని తరగతులు వరుస ఎన్నికలతో నేతలు, పార్టీలకూ కీలక పరీక్షే అవును.. ఇది నిజంగా పరీక్షా కాలమే. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు.. రాజకీయ నేతలు.. పార్టీలకు కీలక పరీక్షలు ఒకేసారి వచ్చాయి. తమ భవితకు, ఉన్నత చదువుల మెట్టు ఎక్కేందుకు విద్యార్థులకు పదోతరగతి పరీక్ష.. బిడ్డల జీవితాలపై ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులకూ ఇది అగ్ని పరీక్ష.. పదవుల కుర్చీ ఎక్కేందుకు నేతల జాతకాలకు ఎన్నికల పరీక్ష.. మనుగడ కోసం రాజకీయ పార్టీలకు ఇదే కీలక పరీక్ష.. ఇలా అందరికీ ఒకేసారి పరీక్షా కాలం ముంచుకొచ్చింది. సాక్షి, మచిలీపట్నం : మరోసారి ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఈసారి మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మూడూ ఒకేసారి రావడం.. అదీ విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థులకు మాత్రం ఇది విషమ పరీక్షేనని చెప్పొచ్చు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సార్వత్రిక ఎన్నికలు ఏ మాత్రం అవరోధం కాకూడదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావించారు. అయినా వారి ఆశలు ఫలించలేదు. ఇప్పుడు పదో తరగతి పరీక్షలు, ఎన్నికలు పోటీపడి మరీ జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో అటు విద్యార్థులు, ఇటు రాజకీయ నాయకులు భవిత కోసం ఈ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు. ఏడాదంతా అవాంతరాలే... ఈ ఏడాదంతా విద్యార్థులకు అవాంతరాలే ఎదురయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది రాష్ట్ర విభజన నేపథ్యంలో పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమం సాగింది. దాదాపు వంద రోజులకు పైగా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. ఫలితంగా విద్యాసంస్థలు మునుపెన్నడూ లేని విధంగా రోజులతరబడి మూతపడ్డాయి. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని తీవ్రంగా నష్టపోయారు. ప్రైవేటు క్లాసులు పెట్టినా సిలబస్ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. అరకొర చదువులతోనే పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిన దుస్థితి దాపురించింది. దీనికితోడు కరెంటు కోతలు, ఎన్నికల వాతలు విద్యార్థుల ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. విద్యార్థులందరికీ ఇబ్బందికరమే... ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో సుమారు 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. మార్చి 12 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న లక్షా 30 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ఈ నెల ఆరో తేదీ నుంచి జరుగుతున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు పూర్తయిన తరువాత జిల్లాలో ఎంసెట్, ఐసెట్, ఎడ్ సెట్ (బీఈడీ), డైట్ సెట్ (డీఈడీ), సీప్ (పాలిటెక్నిక్ ఎంట్రన్స్), జామ్ (ఇంజినీరింగ్ తరువాత కోర్సు), భాషా పండితులకు పండిట్ ఎంట్రన్స్ టెస్ట్ వంటి వరుస పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల భవితకు పరీక్షలు ఎన్నికల సమయంలోనే జరగడం ఇబ్బందికరమేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. పార్టీలకూ పెద్ద పరీక్షే... జిల్లాలో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించడంతో విజయవాడతో పాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మున్సిపాలిటీలు, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు నంగర పంచాయతీలు పరీక్షకు సిద్ధమయ్యాయి, ఒక కార్పొరేషన్లో 59 మంది కార్పొరేటర్లు, ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 218 మంది కౌన్సిలర్లు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో పదవీయోగం కోసం పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులు అప్పుడే వ్యూహరచనలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో మే ఏడో తేదీన జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం రాజకీయ పార్టీలకు పెద్ద పరీక్షగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేని దుస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీకి వలస వెతలు తీవ్రమయ్యాయి. సమైక్యాంధ్ర చాంపియన్‌గా నిలిచిన వైఎస్సార్సీపీ జిల్లాలో ధీమాగా ఎన్నికల పరీక్షలకు సిద్ధమైంది. వరుస పరీక్షల్లో విజేతలెవరనేది ఫలితాల వరకు ఎదురుచూడాల్సిందే మరి. -
బెజవాడ రానున్న జైరాం రమేష్
బెజవాడ రానున్న జైరాం రమేష్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం నేతల హాజరుపై అనుమానాలు సాక్షి, విజయవాడ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉండేదెవరో, పోయేదెవరో మంగళవారం తేలిపోయే అవకాశముంది. కేంద్ర మంత్రి, రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ మంగళవారం విజయవాడకు రానున్నారు. ఆయన కాంగ్రెస్ జిల్లా, నగర నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎంతమంది నాయకులు వస్తారనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. పార్టీలో కొనసాగాలనుకునేవారు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉండగా, గోడ దూకేవారు ఈ సమావేశానికి వచ్చే అవకాశం కనపడటం లేదు. ఇప్పటికే దయనీయం... ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైంది. సీమాంధ్ర ప్రజల అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంతో ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొంది. రెండు పార్లమెంట్ స్థానాలకు కూడా ఈసారి కొత్త అభ్యర్థులను చూసుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిపోవడంతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి కొత్త పార్టీ పెట్టించే దిశలో పావులు కదుపుతున్నారు. ఆయన జైరాం రమేష్ పెట్టిన సమావేశానికి వచ్చే సూచనలు కనపడటం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి రంగంలోకి వస్తారో.. మాటకు కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉంటారో చూడాల్సి ఉంది. మరోవైపు మచిలీపట్నం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాడిగ రామకృష్ణ ఈసారి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన కూడా సమావేశానికి హాజరయ్యే పరిస్థితి లేదు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. మంత్రి కొలుసు పార్థసారథి కూడా దాదాపు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినట్లే ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగుదేశంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాజధానిలో చంద్రబాబునాయుడు సారథి చేరిక అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. మిగిలినవారిదీ అదే దారి... మరోవైపు పామర్రు శాసనసభ్యుడు డీవై దాస్ బాపట్ల తెలుగుదేశం ఎంపీగా రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకోగా తిరువూరు శాసనసభ్యురాలు దిరిశం పద్మజ్యోతి తిరుపతి ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీకి దిగేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున మిగిలిన సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు కూడా వేరే పార్టీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి తాను పార్టీ మారడం లేదని చెబుతున్నా కాంగ్రెస్‌లో ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో విలీనమైన విజయవాడ తూర్పు, పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి రవి, వెల్లంపల్లి శ్రీనివాసరావులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొంటున్నారు. విజయవాడ తూర్పు సీటుకు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ నుంచి పోటీ ఉండటంతో యలమంచిలి వేరే పార్టీలవైపు చూస్తున్నట్లు సమాచారం. వెల్లంపల్లి శ్రీనివాసరావు మాత్రం తాను జైరాం రమేష్ మీటింగ్‌కు వస్తున్నట్లు నగర నాయకులకు చెప్పినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ స్థానానికి మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) కుమారుడు అవినాష్‌ను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో అవినాష్ పేరు జిల్లా మొత్తం తెలియడంతో ఆయనను పోటీలోకి దింపడం ద్వారా గెలవకపోయినా రాజకీయంగా బలపడవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఆయన రెండురోజుల క్రితం ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి వెళ్లిపోయేవారు వెళ్లిపోతే యువరక్తం పోటీకి సిద్ధంగా ఉందని ప్రకటించారు. మంగళవారం సమావేశానికి ఎంతమంది వస్తారన్న దాన్నిబట్టి పార్టీలో మిగిలేదెవరో తెలుస్తుందని నాయకులు చెబుతున్నారు. -
నేతల్లో గుబులు
నోటిఫికేషన్ వస్తే ప్రాణసంకటమే ఎమ్మెల్యే అభ్యర్థుల శిరోభారమే కొద్ది గంటల్లో తేలనున్న నిర్ణయం సాక్షి, మచిలీపట్నం/ విజయవాడ : మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడితే తమకు ప్రాణసంకటమేనని వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తాయని భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలు సుప్రీంకోర్టు అక్షింతలతో ముందుకు జరిగాయి. సోమవారం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓడితే అసెంబ్లీ సీటు పోవడమే కాకుండా గెలుపుపై కూడా అనుమానాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వారిలో గుబులు మొదలైంది. డివిజన్ రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో తమ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో అభ్యర్థుల వేటలో పడ్డారు. రిజర్వేషన్ల ప్రకటనతో అప్పటి వరకూ డివిజన్ అధ్యక్షులుగా, అభ్యర్థులుగా రంగంలో ఉన్నవారి బదులు ఆయా రిజర్వేషన్ల ఆధారంగా కొత్త వారిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సగం డివిజన్లు మహిళలకు రిజర్వు కావడంతో మహిళా అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టారు. కాంగ్రెస్ నేతల్లో అయోమయం... అధికార పక్ష ంలో పూర్తి అయోమయం నెలకొంది. అసలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉండాలా లేదా అన్న విషయం తేల్చుకోలేని స్థితిలో ఉండగా మున్సిపల్ ఎన్నికలు వారిపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. వారు ఎటూ తేల్చుకోలేని స్థితిలో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో మాజీ కౌన్సిలర్లు కొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాజకీయ నాయకుల హడావుడి... పురపాలక సంఘాలకు రిజర్వేషన్లు ప్రకటించటంతో రాజకీయ నాయకుల్లో హడావుడి ప్రారంభమైంది. సాధారణ ఎన్నికల సమయంలో పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నాయకులు తమ అనునయులతో చర్చలు ప్రారంభించారు. ప్రస్తుతం శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే పురపాలక సంఘాల ఎన్నికలు వస్తే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తలనొప్పులు ఖాయం. కౌన్సిలర్లకు సీట్లు కేటాయించే సమయంలో సముచిత నిర్ణయం తీసుకోకుంటే సీటు ఆశించి భంగపడినవారు ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. వీటన్నింటిని సరిదిద్దుకోవాలంటే నాయకులకు తలబొప్పి కట్టడం ఖాయం. రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం పురపాలక సంఘాల ఎన్నికలు జరిగితే ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తే తరువాత జరిగే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో అదే పార్టీని ఆదరించే అవకాశం ఉందని, ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై కచ్చితంగా పడుతుందని ఆ పార్టీ నాయకులు మధనపడుతున్నారు. -
జిల్లాలో పరిస్థితి ఇదీ..
విజయవాడలో వెంకయ్య చక్కర్లు సీమాంధ్రులను సాంత్వనపరిచేందుకు యత్నం కాంగ్రెస్‌ను ఎండగట్టాలంటూ పార్టీ శ్రేణులకు ఉద్బోధ సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించే విషయంలో కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ రెండూ సమాన పాత్ర పోషించాయి. విభజన జరగదంటూ సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రజల్ని మభ్యపెడితే, విభజన చివరి అంకంలో సీమాంధ్రకు అండగా ఉన్నట్లు బీజేపీ నేతలు నటించి నిండా ముంచారు. ఈ రెండు ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కటి నిజాయితీగా వ్యవహరించినా.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తపనతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యేవని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు సీమాంధ్రులంతా కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని ఛీత్కరించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టి ఓట్లు దండు కోవడానికి రెండు పార్టీలు సిద్ధమవు తున్నాయి. ఈ విషయంలో బీజేపీ ఒకడుగు ముందుగా ఉంది. రాజకీయ రాజధాని నుంచి.. కోస్తా జిల్లాల రాజకీయ రాజధాని విజయవాడ నుంచే సీమాంధ్రులకు సాంత్వన వచనాలు పలికేందుకు బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు రెండు రోజులుగా ప్రయత్నించారు. ఆయన విజయవాడలో మకాంవేసి ఇక్కడి ప్రజలకు జరిగిన నష్టం గురించి చెబుతూ.. ఈ ప్రాంతానికి న్యాయం చేసేందుకు తాము చేసిన ప్రయత్నాలను వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ 13 జిల్లాల నేతలతోనే కాకుండా.. ఈ ప్రాంత కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, విలేకరులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అంది స్తామంటూ హామీలు గుప్పించారు. బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీని ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఆయనతో ఈ ప్రాంత అభివృద్ధికి స్పష్టమైన హామీ ఇప్పిస్తామంటూ వెంకయ్య ప్రకటించారు. కాంగ్రెస్‌దే తప్పంటూ.. ప్రస్తుతం కాంగ్రెస్‌ను సీమాంధ్రులు చీదరించుకుంటున్న నేపథ్యంలో వారిని తమకు అనుకూలంగా మలచుకోవాలని వెంకయ్య పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. పార్టీ కార్యకర్తల సమావేశం, 13 జిల్లాల కార్యవర్గ నేతల సమావేశంలోనూ ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనన్న అంశం ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలని సూచించారు. బీజేపీ గురించి ప్రజలు ప్రశ్నిస్తే.. ఆదినుంచి బీజేపీ విభజనకు సిద్ధంగానే ఉందని, చివర్లో రాజ్యసభలో తాను పట్టుబట్టడం వల్లనే సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ దక్కిందన్న అంశాన్ని ప్రజలకు వివరించాలంటూ నేతలకు పాలి‘ట్రిక్స్’ నేర్పారు. టీడీపీతో పొత్తులపై ఆరా! ఎన్నికల పొత్తు ఉన్నా, లేకపోయినా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వెంకయ్య పార్టీ శ్రేణులకు సూచిస్తూనే.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి ఏమేరకు ఉపయోగం ఉంటుందని పార్టీ శ్రేణులను ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం వెంకయ్య తొలిసారిగా జరిపిన పర్యటన ఆ పార్టీకి ఏమేరకు లాభిస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. -
కేపిటల్ సిటీ
భవిష్యత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా విశాఖ నగరం రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తితో చిగురిస్తున్న కొత్త ఆశలు రాయితీలతో తరలిరానున్న కంపెనీలు ఐటీ, ఫార్మా, చమురు, పోర్టులు, సినీ, ఉత్పత్తి రంగాలకు ఊపు సాక్షి,విశాఖపట్నం: రాష్ట్ర విభజన బాధిస్తున్నా తాజాగా వినిపిస్తున్న మాటలు విశాఖకు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. అన్ని వనరులూ ఉండి వెనుకబడిన ఈ పారిశ్రామిక నగరానికి మంచిరోజులొస్తున్నాయి. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నగరమైన విశాఖ అభివృద్ధిలో సింగపూర్, మలేషియాలను తలదన్నుతూ పోటీ ఇచ్చే రీతిలో ఎదగడానికి అవకాశాలు కనిపిన్నాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో విశాఖ ముందంజలో ఉంటుందని ఆసోచామ్ సర్వే కూడా ఇదే అంశాన్ని తేటతెల్లం చేసింది. సీమాంధ్రకు ప్రత్యేకహోదా నేపథ్యంలో పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ప్రధాన కేంద్రంగా విశాఖ ఎదుగుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇవీ ఆశారేఖలు.. సింగపూర్‌ను పోలిన వనరులు..సౌకర్యాలు విశాఖలోనూ ఉన్నాయి..చుట్టూ సముద్రం.. భారీ నౌకలుకూడా వచ్చే అవకాశమున్న రెండు రేవులు..చమురు కంపెనీలు ... 24గంటల విదేశీ కార్గో ఎగుమతులు...ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలు...వేలకోట్ల ఫార్మా ఎగుమతులు..ఖండాలు దాటుతోన్న ఐటీ సేవలు..షిప్‌యార్డు ...ఏడాదిపొడవునా బారులు తీరే పర్యాటకులు.. 21లక్షల జనాభా..550 కిలోమీటర్ల విస్తీర్ణం.. ఇప్పుడు సింగపూర్ తరహాలో విశాఖ అభివృద్ధి చెందడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన తర్వాత వర్తించే ప్రత్యేకహోదా మన నగరానికి కొంత ఊపును తీసుకురానుంది. కొత్త రంగాలలో పెట్టుబడులకు ఆస్కారమేర్పడనుంది. ఇప్పుడున్న కంపెనీలు విస్తరణతోపాటు కొత్తవి,అంతర్జాతీయస్థాయి కంపెనీలు క్యూ కట్టనున్నాయి. నగరంలో 90 ఫార్మా కంపెనీలున్నాయి. దివీస్, రెడ్డి ల్యాబ్స్,కొర్నియాస్,లీఫార్మా, అమెరికాకు చెందిన హోస్పిరా,జపాన్‌కు చెందిన ఈజాయ్,జర్మనీకి చెందిన ఫార్మా జెల్ కంపెనీలు 50వరకు భారీ ప్లాంట్లు నెలకొల్పాయి. రానురాను పెరుగుతున్న ఫార్మా కంపెనీలు,కొత్త యూనిట్ల కారణంగా ఎగుమతులు రెండేళ్లలో రూ.15నుంచి నూ.20వేల కోట్లకుపైగానే పెరగవచ్చు. విశాఖలో 70కిపైగా ఐటీ కంపెనీలు,నాలుగు ఎస్ ఈజెడ్లున్నాయి. 10,200మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, టర్నోవర్ రూ.1450కోట్లు. అయితే ఇప్పుడు ప్రత్యేకహోదా కారణంగా భారీస్థాయిలో పన్నుల మినహాయింపు లభిస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. కొత్త కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఐటీ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. . విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ ఐటీ రాజధానిగా ఎదగడానికి అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఐటీఐఆర్ వేగంగానే మంజూరు కావచ్చు. ప్రస్తుతం ఎస్‌ఈజెడ్‌ల్లో పనిచేస్తోన్న ఐటీ కంపెనీ భూములను డీ-నోటిఫై చేయడంలేదు. ఐటీ కంపెనీల ఆదాయంపై ప్రభుత్వం 18% మ్యాట్ పన్ను వసూలు చేస్తోంది. ప్రత్యేక హోదాతో కొత్త కంపెనీలకు ఈ సమస్యలు ఉండకపోవచ్చు. దీంతో వచ్చే కొన్నేళ్లలో 50కంపెనీలకుపైగా ఇక్కడ పెరగడానికి అవకాశాలున్నాయి. విశాఖనుంచి కాకినాడకు పీసీపీఐఆర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇందులో చమురు అధారిత కంపెనీలు భారీగా రానున్నాయి.సముద్రతీరానికి సమీపాన వచ్చే ఈ కారిడార్‌కు ఇకపై మంచి డిమాండ్ ఏర్పడనుంది. పదిమండలాల్లో విస్తరించనున్న ఈజోన్‌లో వివిధ కంపెనీలు రానున్నాయి..పీసీపీఐఆర్ కంపెనీలకు పన్నురాయితీలు వర్తిస్తుండగా,ఇప్పుడు ప్రత్యేక హోదాతో జోన్‌కు మరింత డిమాండ్పెరగనుంది. ప్రత్యేకహోదా కారణంగా పన్ను రాయితీలు పెరగనున్నందున అన్నిరకాల వ్యాపార,వాణిజ్యవర్గాలు విశాఖను గమ్యస్థాన నగరంగా ఎంచుకుంటాయని నిపుణుల అంచనా.అందుకే హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ,ఫార్మా,ఉక్కు,చమురు కంపెనీలు ఇకనుంచి విశాఖలోనూ ప్రధానసంస్థలు ప్రారంభించే అవకాశం ఏర్పడనుంది. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడకు వీటిని తరలించే యోచనలో ఉన్నారు. ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టు కూడా వచ్చే వీలుంది.ప్రస్తుత ఎయిర్‌పోర్టు నేవీ నియంత్రణలో ఉంది. 24గంటలూ విమాన సౌకర్యం ఇటీవలే కలిగింది. భవిష్యత్తులో విదేశాలకు విమానసర్వీసులు నడిపే వీలున్నందున వేరేచోట ప్రత్యామ్నాయ విమానాశ్రయం పెరగడానికి అవకాశాలున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి ఎగుమతులకు ఎయిర్ కార్గో సౌకర్యంలేదు. ప్రత్యేకహోదా ఫలితంగా పన్నుల రాయితీ పెరగడం తదితర కారణాలతో కొత్త కంపెనీలు వచ్చే వీలుంది. వైజాగ్,గంగవరం పోర్టులకు తోడు నక్కపల్లి,భీమిలిలోను పోర్టులు రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విభజన కారణంగా సీమాంధ్రకు కొత్త ఐఐటీ,ఐఐఐటీల మంజూరుకు వీలున్నందున విశాఖలోనూ దీనిఆధారంగా కంపెనీలు పెరిగేవీలుంది. అభివృద్ధికి ఇదే సరైన సమయం విభజన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల పెట్టుబడులు భారీ స్ధాయిలో విశాఖపట్ననికి ఖచ్చితంగా రానున్నాయి. విడిపోయిన తరువాత ఆంప్రదేశ్‌కు రాజదాని విశాఖ అయినా కాకాపోయినా అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిశ్రమలు నిర్వహిస్తున్న వ్యాపారుల్లో అధికశాతం సీమాంధ్రులే. ఇప్పుడు వీరందరు విశాఖపై చూస్తున్నారు.పెట్రో కారిడర్ల అనూహ్యంగా విదేశీ కంపెనీలు కూడా పన్ను రాయితీ కోసం ఇక్కడకు వస్తారు. రైల్వే అనూహ్య ప్రగతి సాధించనుంది. రైల్వేజోన్ రావడం మరింత సులువవుతుంది. - జి.సాంబశివరావు చైర్మన్, సిఐఐ, విశాఖపట్నం -
విభజన పాపం వారిదే
టీడీపీ, కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోనియా, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మ దహనం తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలదేనని వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. చట్టసభల్లో విభజన బిల్లుకు ఆమోదం తెలపడంతో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో గురువారం చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట కూడలివద్ద ఆందోళన నిర్వహించారు. తెలుగు జాతి విచ్ఛిన్నానికి కారకులైన సోనియా, సహకరించిన బాబు, వెంకయ్యనాయుడుల దిష్టి బొమ్మలను తగుల బెట్టారు. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయిస్తే చంద్రబాబు, వెంకయ్యనాయుడు సహకరించారని ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడటం వల్లే తెలుగు జాతికి ఈ దుస్థితి పట్టిందన్నారు. రెండుకళ్ల సిద్ధాంతం పేరుతో తెలుగు జాతిని నిలువునా చీల్చేందుకు కారకుడయ్యాడని చంద్రబాబుపై మండిపడ్డారు. ఆరు నెలల ఉద్యమంలో చంద్రబాబు ఏనాడూ సమైక్యం అనలేదని గుర్తుచేశారు. సమైక్యం అంటే బీజేపీతో పొత్తు కుదరదని చంద్రబాబు భావించారేమో అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ చొక్కారెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ దామినేటి కేశవులు, గోవిందరెడ్డి, మండల కన్వీనర్ ఉపేంద్రరెడ్డి, చిన్నీయాదవ్, శ్రీరాములు, అజయ్‌కుమార్‌రెడ్డి, రామస్వామి, రఘు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఆదాయానికి సెగ
విభజన ఎఫెక్ట్ పలు రంగాలపై ప్రభావం అంతటా అనిశ్చితి.. స్తబ్ధత పడిపోయిన ఆదాయం జీహెచ్ఎంసీ, రిజిస్ట్రేషన్లు, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధాని నగరంలోని పలు ప్రభుత్వ ముఖ్య విభాగాల్లో స్తబ్ధత నెలకొంది. విభజన నిర్ణయం, అనంతర రాజకీయ పరిణామాలతో అనిశ్చితి రాజ్యమేలుతోంది. పాలన, నిర్వహణ వంటివి కుంటుపడ్డాయి. ముఖ్య విభాగాల ఆదాయం అనూహ్యంగా పడిపోయింది. రాష్ట్ర విభజన రగిల్చిన సెగ.. ఆదాయానికి పొగబెడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, రిజిస్ట్రేషన్లు, ఆర్టీసీ వంటి విభాగాలు ఆదాయం తగ్గడంతో కుదేలవుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నగరాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రాజెక్టులు చేపట్టడానికి ఆటంకంగా మారింది. గ్రేటర్లో గతంలో రియల్ వ్యాపారం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తారస్థాయిలో జరగగా, కేంద్రం తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం వెలువరించినప్పటి నుంచీ ఇవి మందగించాయి. స్థిరాస్తుల విలువలు తగ్గుముఖం పట్టాయి. ఇళ్లు, ఫ్లాట్లు కొందామనుకునే వారు ధరలు మరింత తగ్గుతాయనే ఆశతోనూ, అమ్మాలనుకునే వారు పెరగకపోతాయా అనే ధోరణితో వేచిచూడటం మొదలుపెట్టారు. దీంతో అమ్మకాలు, కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. రిజిస్ట్రేషన్లపైనే కాక ఇది స్టీలు, ఫర్నిచర్, ఇంటీరియర్స్ తదితరాలతో పాటు మార్కెట్, రవాణా తదితర రంగాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. ఆయా విభాగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ‘రిజిస్ట్రేషన్’కు గడ్డుకాలం మహా నగరం పరిధిలోని రిజిస్ట్రేషన్ల విభాగంలో దస్తావేజుల నమోదు తగ్గిపోయింది. విభజన ప్రకటన స్థిరాస్తి రంగాన్ని గడ్డుకాలంలోకి నెట్టింది. ఇళ్లు, భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు బ్రేక్ పడింది. భూములు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడంతో పాటు ధరలూ పడిపోయాయి. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం 60 శాతానికి పడిపోయింది హైదరాబాద్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం జనవరి-2014 నాటికి రూ.651.69 కోట్ల లక్ష్యానికి రూ.394.76 కోట్ల ఆదాయమే లభించింది రంగారెడ్డి జిల్లాలో రూ.1809.76 కోట్ల లక్ష్యానికి రూ.1138.96 కోట్ల ఆదాయం వచ్చింది నష్టాల‘బాట’లో సిటీ బస్సు ఏ రోజుకారోజు రోడ్డెక్కితే తప్ప మనుగడలేని ‘ప్రగతి రథచక్రం’ ఈ ఏడాది తీవ్ర నష్టాలనే చవిచూసింది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం గణనీయంగా తగ్గాయి. సంస్థాగత నష్టాలను అధిగమించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా.. రాజకీయ పరిణామాలు సంస్థ ప్రగతిపై ప్రభావం చూపాయి. కొనాళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఆర్టీసీ ఇప్పటి వరకు రూ.40.50 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయింది రోజూ 35 లక్షల మంది ప్రయాణికులతో కిక్కిరిసి తిరిగే సిటీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఒక్కోసారి 32 లక్షలకు పడిపోతోంది గతంలో 67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, ప్రస్తుతం 65కి తగ్గింది శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో నడిచే పుష్పక్‌లు, సిటీలో తిరిగే ఏసీ బస్సులూ ఆర్టీసీకి నష్టదాయకంగానే మారాయి గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం ఆర్టీసీకి రూ.2.70 కోట్ల ఆదాయం లభిస్తోంది. బంద్‌లు, సమ్మెలు తదితర అనిశ్చితి కొనసాగిన రోజుల్లో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నష్టం వాటి ల్లిందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌కు తగ్గిన ఆదాయం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగానికి భవన నిర్మాణ అనుమతులు, బెటర్మెంట్ ఫీజులు, ఇతరత్రా రూపేణా గత ఆర్థిక సంవత్సరం రూ. 515 కోట్ల మేర ఆదాయం వస్తే, ఈ ఆర్థిక సంవత్సర ం ఇప్పటికి రూ. 235 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు నెలలో ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుండగా మహా అంటే రూ. 50 కోట్లు వస్తే గగనమే భవన నిర్మాణ అనుమతుల కోసం 2012-13లో ఒక్క ఎల్బీనగర్ సర్కిల్లోనే 4550 దరఖాస్తులు రాగా, జీహెచ్ఎంసీకి రూ. 37,45,53, 277 ఆదాయం లభించింది. అదే 2013 నుంచి ఇప్పటి వరకు కేవలం 2560 దరఖాస్తులు రాగా, రూ.23,30,67,514 ఆదాయమే లభించింది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బహుళ అంతస్తుల భవనాల కోసం నెలకు సగటున 160 ఫైళ్లు వచ్చేవి. ప్రస్తుతం వందకన్నా తగ్గాయి. గతంలో వీటి అనుమతుల ద్వారా నెలకు సగటున రూ. 30 కోట్లు రాగా, ప్రస్తుతం రూ. 20 కోట్లు మాత్రమే వస్తున్నాయి. -
విభజన నిర్ణయంతోనే గడ్డుకాలం
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ అధిష్టానవర్గం అనాలోచితంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు బుధవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకుడు ఎన్ఎల్.నరేంద్రబాబు, కార్యదర్శి రామినీడి మురళీ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలను పిలిపించి గోప్యంగా సమావేశమయ్యారు. పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవటంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయిందన్నారు. పార్టీని పెద్దనాయకులే నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీలు అధికంగా ఉన్నా ప్రాతినిధ్యంలో మాత్రం తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఎస్సీ కార్యకర్తలు పరిశీలకుల దృష్టికి తీసుకొచ్చారు. ఓట్లు మావి, సీట్లు మీవా అంటూ ప్రసాద్ అనే కార్యకర్త పరిశీలకులను ప్రశ్నించారు. పార్టీ నాయకుల్లో లోపం ఉందే కానీ కార్యకర్తల్లో కాదని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గాల వారి జరిగిన పరిశీలకుల సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను కార్యకర్తలు వివరించారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల పేర్ల పరిశీనలో మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, మంత్రి పార్థసారథి, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఎంవీవీ కుమార్‌బాబు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శోభన్‌బాబు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిత్వానికి సంబంధించి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొండి కృష్ణ, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఎంవీవీ కుమార్‌బాబు, కాంగ్రెస్ నాయకులు చలమలశెట్టి ఆదికిరణ్, బలగం విజయశేఖర్, జన్ను రాఘవ, సోడిశెట్టి బాలాజీరావు, డాక్టర్ రాధికమాధవి, గుమ్మడి విద్యాసాగర్ పేర్లను పరిశీలకుల దృష్టికి కార్యకర్తలు తీసుకువచ్చారు. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి సారథికి ఎంపీ టికెట్ ఇస్తే నియోజకవర్గంలో ఆయన సతీమణి కమల పేరును ప్రతిపాదించారు. దేవభక్తుని సుబ్బారావు, అన్నె చిట్టిబాబు పేర్లను కార్యకర్తలు సూచించారు. గుడివాడ నియోజకవర్గానికి పిన్నమనేని వెంకటేశ్వరరావు, పుప్పాల ఆంజనేయులు, అవనిగడ్డకు మండలి బుద్ధప్రసాద్, గన్నవరం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, పామర్రుకు డీవై దాసు, కాటం రాజేష్ పేర్లను కార్యకర్తలు పరిశీలకుల వద్ద ప్రస్తావించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు బోడపాటి బాబూరావు, కూనపరెడ్డి వెంకటేశ్వరరావు, గుమ్మడి విద్యాసాగర్, సోడిశెట్టి బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నిస్తేజం
=జిల్లా పార్టీలో నిరుత్సాహం =ఎన్నికల్లో పోటీ చేయడానికీ విముఖత =పార్టీ మారేందుకు సిద్ధపడుతున్న వైనం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి నాయకులు సిద్ధం కావడం లేదు. రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కన్నా, ఇతర పార్టీలను ఆశ్రయించడం మేలని ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. 1983లో ఎన్టీ. రామారావు పార్టీ స్థాపించినపుడు కూడా ఇంతటి నిస్తేజాన్ని ఎదుర్కొనలేద ని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డీలాపడగా, సమైక్యాంధ్ర వ్యవహారం తో పూర్తిగా కనుమరుగయింది. జిల్లాలో పార్టీ నాయకుల సందడి ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి తిరుపతికి వస్తే తప్ప, కాంగ్రెస్ నాయకులు ఇంటి నుంచి కదలడం లేదు. పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చినా, వారిలో అంతో ఇంతో కదలిక ఉండేదని పలువురు అంటున్నారు. జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినా ప్రయోజనం లేని స్థితికి చేరుకుంది. ఆయన తన గెలుపునకు సోపానంగా, పీలేరును మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారు. జిల్లా నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని ఊరించి, చేయిచ్చారు. మరోపక్క చిరంజీవి వర్గం కూడా పార్టీలో ఎటువంటి సందడి చేయడం లేదు. తిరుపతి నగరంలో పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి కూడా లేని స్థితి వచ్చింది. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి కూడా జిల్లా కార్యవర్గం గురించి ఆలోచించడం లేదు. వారితో సమావేశాలు ఏర్పాటు చేయడం, మరో రెండు నెలల్లో రానున్న ఎన్నికలకు సంబంధించి, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటివరకు తిరుపతి నుంచి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ వచ్చిన ఎం.వెంకటరమణకు పలు పార్టీల నుంచి ఆహ్వానం లభిస్తున్నట్లు తెలిసింది. -
రాష్ట్ర విభజనపై సీఎం వాదన సరైందే
కూసుమంచి, న్యూస్‌లైన్: రచ్చబండలో సీఎం ఫ్లెక్సీలు చించటం, తగులబెట్టటం ఏంటి నాన్సెన్స్..ఇది శోచనీయం.. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనే ప్రభుత్వ సారధి, ఆయనకు రెండు ప్రాంతాల ప్రయోజనాలు చూడాల్సిన బాధ్యత ఉంది... రాష్ట్ర విభజనపై సీఎం వాదనలో తప్పేం లేదు, సీఎం క్రమశిక్షణ కలిగిన నాయకుడు’- అంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌నుంచి జిల్లా పర్యటనకు వచ్చిన రేణుకాచౌదరికి జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆమె పైవిధంగా స్పందించారు. సీఎం సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడుతున్నారు... తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నప్పుడు ఆయనకు ఈలెక్కలు గుర్తుకు రాలేదా అంటూ విలేకరులు ప్రశ్నించగా నాడు ఆయన కూడా ఆత్మహత్యలు వద్దని అప్పీలు చేశారుగా, సీఎం ఏప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు..రెండు ప్రాంతాలకు సమన్యాయం గురించి మాట్లాడుతున్నారే తప్ప మరోలా కాదు అంటూ రేణుకాచౌదరి బదులిచ్చారు. ఒక సమస్య వలన మరో సమస్య తలెత్తకూడదనేది సీఎం ఆలోచనని అన్నారు. సీఎం రాష్ట్ర విభజనపై తలెత్తే సమస్యలను ముందుంచుతున్నారు.. ఆయనను కేంద్రం సీఎంగా నియమించింది తన భాధ్యతను తాను నిర్వర్తించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. ‘జిల్లా ఆడబిడ్డగా భద్రాచలం నుంచి గడ్డిపోచను కూడా పోనివ్వను..ఖబడ్దార్’ అంటూ ఈ సందర్భంగా రేణుకాచౌదరి అన్నారు. భద్రాద్రి రాముడు ఆశీస్సులతో, కాంగ్రెస్ కార్యకర్తల అండతో భద్రాచలాన్ని కాపాడేందుకు పోరాడతానని అన్నారు. నేను జిల్లా ఆడబిడ్డగా జిల్లాకోసం పోరాడుతున్నా ..నాకు అడ్డుచెప్పేవారు ఉంటే ముందుకు రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రేస్ నాయకులు సోమ్లా నాయక్, అయితం సత్యం, పోరిక లక్ష్మీబాయి, రాయల నాగేశ్వరరావు, పరుచూరి మురళీకృష్ణ , కొరివి వెంకటరత్నం, పోటు లెనిన్ తదితరులు పాల్గొన్నారు. -
రగిలిన సమైక్య సెగ
గుంటూరు, న్యూస్‌లైన్ :విభజన నిర్ణయంపై గుంటూరు జిల్లా జనం గొల్లుమంది. రోడ్లుపైకొచ్చి నిరసన తెలిపింది. ఆందోళనలతో అట్టుడికించింది. ఇదేం న్యాయమంటూ నిగ్గదీసి అడుగుతోంది. నినాదాలతో హోరెత్తించింది. తమ భూములు ఎడారిగా మార్చేస్తారా అంటూ నిలదీస్తోంది. తమ పిల్లల భవిష్యత్తేమిటని ఆగ్రహంతో ఊగిపోతోంది. నోరైనా మెదపని నేతల ఇళ్లను ముట్టడించింది. ఫ్లెక్సీలు తగులబెట్టి తమ గుండె మంటలు దింపుకునే యత్నం చేసింది. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు స్పందించింది. 72 గంటల బంద్‌లో రెండో రోజైన శనివారం సైతం జనజీవనాన్ని స్తంభింపజేసింది.తెలంగాణకు అనుకూలంగా రూపొందించిన నోట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో రెండో రోజు బంద్ విజయవంతమైంది. అదే విధంగా ఏపీఎన్జీవోలు ఇచ్చిన 48గంటల బంద్ పిలుపుపైనా ఆ వర్గాలు బంద్‌కు సహకరించాయి. మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి కన్నా నివాసాన్ని ముట్టడించారు. గుంటూరు నగరంలో కేంద్ర, రాష్ట్ర ’ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రైవేటు హాస్పిటల్స్, పెట్రోలు బంకులు, సిని మా థియేటర్లు, చివరకు ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. రవాణావ్యవస్థ స్తంభించిపోయింది. మాచ ర్ల, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. బాపట్ల పట్టణం లో రాస్తారోకో చేపట్టారు. తెనాలిలో జీజీహెచ్ సిబ్బంది అత్యవసర సేవలు నిలిపివేసి ఆందోళన చేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. రేపల్లె, వినుకొండలో పాసింజర్ రైళ్లను సమైక్య వాదులు నిలిపి రైల్‌రోకో నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, సీఈసీ సభ్యుడు కోన రఘుపతి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజైన శనివారం కొనసాగింది. మంగళగిరిలో కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో బంద్ జరిగింది. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రిరాజశేఖర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూయించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై ద్విచక్రవాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కేంద్రపాలక మండలిసభ్యులు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి, నడికుడి గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. పొన్నూరులో పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ, వేమూరు నియోజకవర్గంలోని వేమూరు, భట్టిప్రోలు, చుండూరు మండలంలో పార్టీ సమన్వయకర్త మేరుగ నాగార్జున , వినుకొండలో పార్టీ సమన్వయకర్త నన్నపనేని సుధ, నరసరావుపేటలో పార్టీ సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తెనాలిలో గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. గుంటూరు నగరంలో నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు సమన్వయకర్తలు షేక్‌షౌకత్, నసీర్ ఆధ్వర్యంలో బంద్, నిరసన కార్యక్రమాలు జరిగాయి. బాపయ్య మృతికి సంతాపాలు.. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు తీసుకున్న రెవెన్యూ ఉద్యోగి అచ్యుతాన బాపయ్య శవయాత్రను ఏపీ ఎన్జీవోలు గుంటూరు నగరంలో భారీగా నిర్వహించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. సమైక్యాంధ్ర జెండాలతో మృతదేహం వద్ద నివాళి అర్పించారు. -
ప్రజాపోరాటాలకు అండగా ఉంటాం
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రజాపోరాటాలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ చెప్పారు. ప్రజల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు, త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలనే లక్ష్యంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ రెండో తేదీ నుంచి సమన్యాయయాత్రకు శ్రీకారం చుడతారని రఘురాం చెప్పారు. సమైక్యవాదులకు సంఘీభావం తెలిపేందుకు షర్మిల ఈ యాత్ర చేపడుతున్నారని తెలిపారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున యాత్రను మొదలుపెట్టి 13 జిల్లాల్లో విస్తృత్తంగా పర్యటిస్తారని పేర్కొన్నారు. శాంతియుత పంథాలో ప్రజాపోరాటాన్ని సాగించేలా, రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేలా షర్మిల యాత్ర కొనసాగుతుందని వివరించారు. కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సాగిస్తున్న నీచ రాజకీయాలకు కోట్లాదిమంది తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రఘురాం ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారకాంక్షతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేస్తోందని, రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి సహించలేని కాంగ్రెస్.. ఆ పార్టీని రాజకీయంగా అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బందులు పెడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం జరగాలనే లక్ష్యంతో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేసిన ఆమరణదీక్షను సైతం పోలీసులు అక్రమంగా భగ్నం చేశారని మండిపడ్డారు. అదే సమయంలో.. అదే ప్రాంతంలో టీడీపీ నేతల దీక్షను భగ్నంచేసిన పోలీసులు వారిని ప్రత్యేకంగా అంబులెన్స్‌లో తరలించి ప్రత్యేక గదిలో చికిత్స చేశారని చెప్పారు. వైఎస్ విజయమ్మను మాత్రం పోలీసు వ్యాన్‌లో తరలించి, ఆస్పత్రిలోని సాధారణ వార్డులో చికిత్స నిర్వహించడం సమంజసమా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీని అధికార పార్టీ టార్గెట్ చేసిందని, అయినప్పటికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమాత్రం భయపడకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ క్యాడర్‌ను నడిపిస్తున్నారని స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయని వైఎస్ జగన్‌ను 15 నెలలకు పైబడి జైలులో ఉంచారని, అయినా ఆయన ప్రజల ప్రయోజనాలకోసం జైలు నుంచే పోరాటాలకు సిద్ధపడి ఆమరణ దీక్ష చేస్తున్నారని వివరించారు. బాబూ నోరువిప్పవేం? రాష్ట్రం రావణకాష్టంలా మారినా చంద్రబాబు నోరువిప్పడం లేదని రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంపై ప్రతిపక్ష నేత హోదాలో ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో మిలాఖత్ అయిన చంద్రబాబు నోరువిప్పితే తనపై కేసులు పెడతారనే భయంతోనే మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో ఇన్నిన్ని ఆందోళనలు, ఉద్యమాలు సాగుతుంటే చంద్రబాబు మాత్రం ఏమీపట్టనట్టు వ్యవహరిస్తూ జాతీయ వ్యవహారాలపై మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు. -
ప్రజాపోరాటాలకు అండగా ఉంటాం
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రజాపోరాటాలకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ చెప్పారు. ప్రజల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు, త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలనే లక్ష్యంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ రెండో తేదీ నుంచి సమన్యాయయాత్రకు శ్రీకారం చుడతారని రఘురాం చెప్పారు. సమైక్యవాదులకు సంఘీభావం తెలిపేందుకు షర్మిల ఈ యాత్ర చేపడుతున్నారని తెలిపారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున యాత్రను మొదలుపెట్టి 13 జిల్లాల్లో విస్తృత్తంగా పర్యటిస్తారని పేర్కొన్నారు. శాంతియుత పంథాలో ప్రజాపోరాటాన్ని సాగించేలా, రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేలా షర్మిల యాత్ర కొనసాగుతుందని వివరించారు. కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సాగిస్తున్న నీచ రాజకీయాలకు కోట్లాదిమంది తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రఘురాం ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారకాంక్షతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేస్తోందని, రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి సహించలేని కాంగ్రెస్.. ఆ పార్టీని రాజకీయంగా అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బందులు పెడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం జరగాలనే లక్ష్యంతో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేసిన ఆమరణదీక్షను సైతం పోలీసులు అక్రమంగా భగ్నం చేశారని మండిపడ్డారు. అదే సమయంలో.. అదే ప్రాంతంలో టీడీపీ నేతల దీక్షను భగ్నంచేసిన పోలీసులు వారిని ప్రత్యేకంగా అంబులెన్స్‌లో తరలించి ప్రత్యేక గదిలో చికిత్స చేశారని చెప్పారు. వైఎస్ విజయమ్మను మాత్రం పోలీసు వ్యాన్‌లో తరలించి, ఆస్పత్రిలోని సాధారణ వార్డులో చికిత్స నిర్వహించడం సమంజసమా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీని అధికార పార్టీ టార్గెట్ చేసిందని, అయినప్పటికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమాత్రం భయపడకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ క్యాడర్‌ను నడిపిస్తున్నారని స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు చేయని వైఎస్ జగన్‌ను 15 నెలలకు పైబడి జైలులో ఉంచారని, అయినా ఆయన ప్రజల ప్రయోజనాలకోసం జైలు నుంచే పోరాటాలకు సిద్ధపడి ఆమరణ దీక్ష చేస్తున్నారని వివరించారు. బాబూ నోరువిప్పవేం? రాష్ట్రం రావణకాష్టంలా మారినా చంద్రబాబు నోరువిప్పడం లేదని రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంపై ప్రతిపక్ష నేత హోదాలో ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో మిలాఖత్ అయిన చంద్రబాబు నోరువిప్పితే తనపై కేసులు పెడతారనే భయంతోనే మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో ఇన్నిన్ని ఆందోళనలు, ఉద్యమాలు సాగుతుంటే చంద్రబాబు మాత్రం ఏమీపట్టనట్టు వ్యవహరిస్తూ జాతీయ వ్యవహారాలపై మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు. -
తమ్మిలేరుపై విభజన గ్రహణం
చింతలపూడి, న్యూస్‌లైన్ : పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు రిజర్వాయర్ భవిష్యత్ రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ప్రశ్నార్థకంగా మారంది. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు పదేళ్లుగా క్రమేపీ తగ్గుతోంది. మెట్ట రైతుల కల్పతరువుగా ఉన్న ఈ రిజర్వాయర్‌కు శాశ్వతంగా సాగునీటి జలాలను అందించే మాట అటుం చితే.. తాజా పరిస్థితులు తమ్మిలేరు ప్రాజెక్ట్ ఉనికికే ప్రమాదం తెచ్చేలా కనిపిస్తున్నాయి. తమ్మిలేరు భవిష్యత్ ఏమిటనే ఆందోళన రైతుల్లో నెలకొంది. 40 ఏళ్ల క్రితం తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మించగా, 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చింతలపూడి రాగా, ప్రాజెక్ట్ దుస్థితిని స్థానిక ప్రజాప్రతి నిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వైఎస్ ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను ఈ ప్రాజెక్ట్‌కు మళ్లించడం ద్వారా చింతల పూడి నియోజకవర్గంలో అదనంగా మరో 35 వేల ఎకరాలను సాగులోకి తెచ్చేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఆయన మరణించాక, ఇంది రాసాగర్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. తమ్మిలేరుకు శాశ్వత సాగు జలాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మెట్ట ప్రాంత రైతుల ఆశలు ఎండమావిగా మారారుు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే గోదావరి జలాల తరలింపు అసలు సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు పరిధిలోని సాగునీటిని వినియోగించుకునే విషయమై గతంలో అనేకసార్లు ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల రైతుల మధ్య వివాదాలు, ఘర్షణలు తలెత్తారుు. ఆంధ్రా కాలువ ద్వారా తమ్మిలేరుకు వచ్చే వరద నీటిని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచి అక్కడి ప్రజాప్రతి నిధులు అడ్డుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాశ్వతంగా వరద నీరు రాకుండా తెలంగాణ రైతులు అడ్డుకుంటారని జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ్మిలేరు ప్రాజెక్ట్ స్వరూపమిదీ ఖమ్మం జిల్లా పోతువారిగూడెం ప్రాంతంలో పుట్టిన ఈ వాగు వందల మైళ్లు ప్రయాణించి ఏలూరు వద్ద తూర్పు, పశ్చిమ తమ్మిలేరులుగా విడిపోయి కొల్లేరులో కలుస్తోంది. ఏలూరును వరద ముంపు నుంచి రక్షిం చేందుకు చింతలపూడి మండలం యర్రంపల్లి సమీపంలో నాగిరెడ్డిగూడెం వద్ద ఒక జలాశయాన్ని, కృష్ణా జిల్లా మంకొల్లు గ్రామం వద్ద గోనెల వాగు స్టోరేజి ట్యాంక్ నిర్మించేందుకు అంచనాలను రూపొందించారు. ఆ ప్రతిపాదనలలో భాగంగా 1962 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 1969లో రూ.2.70 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ వ్యయం పెరగడంతో 1974లో ఈ మొత్తాన్ని రూ.5.11 కోట్లకు పెంచారు. అయితే ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఖర్చు మొత్తం రూ.7.55 కోట్లకు చేరుకుంది. రిజర్వాయర్ ఎగువ భాగంలో 20,230 ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్లే ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు తమ్మిలేరు నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడి సాగవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తలార్లపల్లి, యర్రంపల్లి, యడవల్లి, కల్యాణంపాడు, తువ్వచెలక రాయుడుపాలెం గ్రామాలకు చెందిన 475 ఎకరాల పల్లం భూములకు, 3,769 ఎకరాల మెరక భూములకు నీరు సరఫరా అవుతోంది. కృష్ణాజిల్లాలో పోలవరం, చాట్రాయి, తుమ్మగూడెం, మంకొల్లు, సోమవరం గ్రామాలలో 1,855 ఎకరాల పల్లం భూములకు, 3,070 ఎకరాల మెరక భూములకు సాగునీరు దీనిద్వారానే అందుతోంది. తెలంగాణ ప్రకటనతో ఈ రెండు జిల్లాల్లోని వేలాది మంది రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇందిరా సాగర్‌ను పూర్తిచేయాలి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంతో పాటు, వైఎస్ రాజశేఖరరెడ్డి కలలుగన్న ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం త్వరగా పూర్తిచేయాలి. తద్వారా తమ్మిలేరుకు సాగునీరు అందించాలి. వేలాది మంది రైతుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న తమ్మిలేరు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల వట్టిపోయే ప్రమాదం ఉంది. సీమాంధ్ర రైతుల వాణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తాం. విభజనను అడ్డుకుంటాం. తమ్మిలేరును ర క్షించుకుంటాం. రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవాలి. - మద్దాల రాజేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, చింతలపూడి -
రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ
సాక్షి, తిరుపతి: తెలంగాణ విడిపోతే రాయలసీమకు తాగునీరు లభించే అవకాశాలు ఉండవని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ తిరుపతిలో శనివారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడు తూ తెలంగాణ ఏర్పడితే కష్ణానదిపై వారు ఆనకట్ట కట్టుకుని, దిగువ ప్రాంతానికి నీళ్లు వదలరని, జిల్లా ప్రజలు దాహంతో అలమటించి పోవాల్సి ఉంటుందని చె ప్పారు. కష్ణా జలాలు కండలేరుకు వచ్చి, అక్కడ నుంచి తిరుపతికి తెలుగు గంగ కాలువ ద్వారా రావాల్సి ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లా దొంగలు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు కలిసి సొంత జిల్లాకు ఇంత అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నదీ జలాల ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలలు ఫలించవని గుర్తు చేశారు. కష్ణ, తుంగభద్ర డ్యామ్‌లను మ్యూజియంల్లా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆం దోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నిలువునా చీ ల్చుతారనే విషయాన్ని ముందుగానే గ్రహిం చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పదవులను కూడా లెక్కచేయకుండా రాజీనామాలు సమర్పించారని తెలిపారు. అయితే చిత్తూరు జిల్లా ద్రోహులైన కిరణ్, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి గుమ్మడికాయల్లా తలలు ఊపి వచ్చేశారని ఎ ద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల గుండెలను చీల్చడానికి కూడా కుమ్మక్కు రాజకీయాలు నడిపారని భూమన విమర్శించారు. పార్టీ నాయకుడు ఎస్కె.బాబు మాట్లాడుతూవిభజనను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోమని అన్నారు. మైనారిటీల విభాగం కన్వీనర్ షఫీ అహ్మద్ ఖాద్రీ మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకున్నాక, ముఖ్యమంత్రి తొమ్మిది రోజులు దొం గలా దాక్కున్నారని విమర్శించారు. న్యాయవాదుల విభాగం నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రానికి అహర్నిశలు కషి చేస్తామన్నారు. పార్టీ నాయకుడు దుద్దేల బాబు మాట్లాడుతూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ సమైక్య రాష్ట్ర ఉద్యమాన్ని తుం గలో తొక్కి, సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారని ఆరోపించారు. ఎంవీఎస్.మణి వందన సమర్పణ చేయగా, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, రైతు నాయకుడు ఆదికేశవరెడ్డి, కేతం రామారావు, ముద్రనారాయణ, పార్టీ 25, 26, 28 వార్డుల నాయకులు పాల్గొన్నారు. -
11వ రోజు అదే హోరు... అదే జోరు
ఇంతవరకూ విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఉద్యమంలో పాల్గొని ముందుకు నడిపించగా ఇప్పుడు వివిధ వృత్తుల వారు ఆ బాధ్యతను తమ భుజానికెత్తుకున్నారు. విభజన ద్రోహులకు రజకులు ‘రేవు’పెట్టగా, వాహన మెకానిక్‌లు బైక్‌లతో పాటు సమైక్యద్రోహుల బుర్రలను రిపేర్ చేస్తామని చెబుతున్నారు. విభజన యోచన విరమించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మీ పదవులు తిరుక్షవరమవుతాయని క్షురకులు హెచ్చరిస్తున్నారు. వృత్తిదారులు ఉద్యమంలోకి రావడంతో ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది. విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా 11వ రోజు శనివారం కూడా ఆంధ్రరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఉద్యమాలు కొనసాగాయి. సమైక్యవాదానికి మద్దతుగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. పలు వృత్తి సంఘాల నేతృత్వంలో ప్రధాన రహదారులపై తమ వృత్తులను చేస్తూ సమైక్యవాదానికి మద్దతు పలికారు. విజయనగరంలో ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మికి మరో మారు సమైక్యసెగ తగలింది. పార్లమెంట్ సమావేశాల నుంచి విజయనగరం వచ్చిన ఆమెను జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు నిలదీశారు. ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ఆమె పట్టణానికి వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు, ఎంపీ డీసీసీ దీక్షా శిబిరం వద్దకు చేరుకోగానే దూసుకు వెళ్లారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. రాజీనామాలు చేస్తే పార్లమెంట్లో సమైక్యవాణి వినిపించలేమని, అందుకే రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆమె మాటలు నమ్మని ఎన్జీఓలు పెద్దపెట్టున నినాదాలు చేసి అక్కడి నుంచి వెనుదిరిగారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మయూరి జంక్షన్ వద్ద సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్దిష్టిబొమ్మలను పాములతో కాటువేయించి సర్పదండన శిక్ష విధించారు. జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులంతా జై సమైక్యాంధ్ర నినాదాలతో కూడిన ప్లకార్డులతో ప్రధాన రహదారుల్లో స్కేటింగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 20 మంది ఉద్యోగులు, కార్మికుల అర్ధనగ్నంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ ఉద్యమ పోరాట సమితి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కోట జంక్షన్ నుంచి గంటస్తంభం వరకు ర్యాలీ సాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించగా ఉదయం గురాన అయ్యలు నేతృత్వంలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించిన అనంతరం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద దహనం చేశారు. డీసీసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట కార్యకర్తలు సామూహిక అర్ధ శిరోముండనం చేసుకున్న అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు విగ్రహానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు క్షీరాభిషేకం చే శారు. ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్అండ్బీ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. స్థానిక దాసన్నపేట సర్కిల్ కార్యాలయం వద్ద గల విద్యుత్ భవనం దగ్గర విద్యుత్ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సుమారు 300 మంది విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలతో విజయనగరం- శ్రీకాకుళం హైవేను దిగ్బంధించారు. సమైక్యవాదానికి మద్దతుగా పట్టణంలోని లెటరింగ్ ఆర్టిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ కేంద్రమైన నెల్లిమర్లలో ఉపాధ్యాయులు సమైక్యాంధ్రకు మద్దతుగా మీనా ప్రపంచం మీడియా కాన్ఫరెన్స్‌ను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. స్థానిక ఆర్ఓబీ వద్ద రాస్తారోకో చేపట్టారు. భోగాపురం మండలంలో గుడివాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. సాలూరులో సమైక్యాంధ్ర కోసం జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. బొండపల్లిలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. చీపురుపల్లిలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో మూడురోడ్ల జంక్షన్ వద్ద కర్రలు కోస్తూ నిరసన వ్యక్తం చేయగా.. రజక సంఘం సభ్యులు ప్రధాన రహదారిపై చాకిరేవు పెట్టి దుస్తులు ఉతికి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అదేవిధంగా మెకానిక్ వర్కర్స్ బైక్ ర్యాలీ, వంటా-వార్పు చేసిన అనంతరం ప్రధాన రహదారిపై బైక్ రిపేరింగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎస్.కోటలో దారగంగమ్మ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక దేవీజంక్షన్లో దుస్తులు ఉతికి నిరసన చేపట్టారు. గజపతినగరంలో నాలుగురోడ్ల జంక్షన్ వద్ద నాయీబ్రాహ్మణులు రోడ్డుపైనే క్షౌరవృత్తి చేసి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు టెలికాన్ఫరెన్స్‌ను బహిష్కరించి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బొండపల్లిలో సమైక్యాంధ్రకు మద్దతుగా బైక్ ర్యాలీ జరిగింది. బొబ్బిలిలో షటిల్ క్రీడాకారులంతా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై షటిల్ ఆడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు బేబినాయన పాల్గొని సంఘీభావం తెలిపారు. బాడంగి మండలం ఆకులకట్టలో సర్పంచ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సీతానగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాది మందితో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. -
12 నుంచి ఆర్టీసీ బస్సులన్నీ బంద్ రైళ్లు.. కిటకిట..
సాక్షి, గుంటూరు : గడచిన వారం రోజుల నుంచి రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ టికెట్లు అయిపోయాయి. నెల రోజుల వరకూ ప్రధాన రైళ్లలో బెర్తులు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు గత్యంతరం లేని స్థితిలో తత్కాల్ టికెట్లపై ఆధారపడుతున్నారు. వారంరోజుల నుంచి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు తగ్గాయి. మూడు జిల్లాల్లోనూ నాలుగైదు రోజులపాటు బస్సులు డిపోల నుంచి బయటకురాలేదు. ఈ క్రమంలో వివిధ రకాల పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇదే జరిగితే గుంటూరు నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, పుట్టపర్తి, శ్రీశైలం వంటి దూరప్రాంతాలకు బస్సులు నడిచే ప్రసక్తే లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణాల వైపు మొగ్గుతున్నారు, ఒకవేళ రాస్తారోకోలు జరిగినా రైలు ప్రయాణం సురక్షితంగా ఉంటుందన్న అభిప్రాయంతో ఎక్కువమంది ఉద్యోగులు, వ్యాపారులు ముందస్తుగా రైలు టికెట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. వారంరోజుల నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లలోనూ బెర్తులు నిండిపోయాయి. గుంటూరు మీదగా నడిచే నారాయణాద్రి, విశాఖ, చెన్నై, కొచ్చిన్, ఫలక్‌నుమా, జన్మభూమి, నర్సాపూర్, ప్రశాంతి, వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లకు రిజర్వేషన్ టికెట్లు దొరకడం కష్టమైంది. స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు ఫస్ట్‌క్లాస్ ఏసీ టికెట్లు కూడా పూర్తయ్యాయి. ప్రశాంతి, ఫలక్‌నుమా, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లకు వెయిటింగ్ లిస్టు దాటి రిగ్రెట్ సమాచారం వస్తోంది. ఒక్కో ట్రైన్లో వెయిటింగ్ లిస్టు చాంతాడంత కనిపిస్తోంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవులు కావడంతో షిర్డీ, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాలని రెండురోజుల ముందు రిజర్వేషన్ టికెట్ల కోసం బండెడు ఆశతో కౌంటర్లకు వెళ్లిన ప్రయాణికులకు వెయిటింగ్లిస్టులు వెక్కిరించాయి. గురువారం రాత్రి గుంటూరు నుంచి ప్రయివేటు బస్సుల్లో ఆయా ప్రాంతాలకు ప్రయాణంచేశారు. ఇదే సరైన సమయంగా భావించిన ప్రయివేట్ ట్రావెల్స్ యజమానులు హైటెక్ బస్ చార్జీలను పెంచి వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేని స్థితిలో ప్రయాణికులు వీటినే ఆశ్రయిస్తున్నారు. తత్కాల్ టికెట్లకు డిమాండ్.: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వేరేమార్గం లేక తత్కాల్ టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. గుంటూరు అరండల్‌పేటలోని రైల్వే రిజర్వేషన్ కార్యాలయంలో రోజూ ఉదయం 10 గంటలకు సాధారణ రిజర్వేషన్ టికెట్ కౌంటర్ల కంటే తత్కాల్ టికెట్ కౌంటర్లే కిటకిటలాడుతున్నాయి. ఇవి కూడా అందనివారు ప్రయాణాలను వాయిదా వేసుకోలేక బాడుగ కార్లు బుక్ చేసుకుంటున్నారు. -
సమైక్య ఉద్యమం అదే జోరు
సాక్షి, గుంటూరు : రాష్ట్ర విభజనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కూడా సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగాయి. మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట, తెనాలిలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులో సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ నేతలు స్థానిక హిందూ కశాశాల సెంటర్లో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి సమైక్య నినాదాలు చేశారు. పలు విద్యార్థి సంఘాలు రోడ్లపై సమైక్య ప్రదర్శన చేశాయి. నవోదయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లక రాజు ఆమరణ నిరాహార దీక్షను సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, సమైక్యాంధ్ర జేఏసీ గౌరవ అధ్యక్షులు ఆచార్య పి. నరసింహారావు, జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ తదితరులు నిమ్మరసం అందించి విరమింపజేశారు. సత్తెనపల్లిలో ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. చిలకలూరిపేట రూరల్ గంగన్నపాలెంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నేతృత్వాన భారీ ర్యాలీ, మానవహారం జరిగింది. వినుకొండలో ముస్లింలు ప్రదర్శన నిర్వహించి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్శింగ్ సిబ్బంది వేర్వేరుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ పతాకాలు పట్టుకుని నిరసన తెలిపారు. జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో.. తెనాలిలో జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాన్ని రోజుకోరీతిగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ దిష్టిబొమ్మలకు అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించారు. సమైక్యాంధ్ర బలహీన వర్గాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్లో సిటీబస్సులను అడ్డగించారు. మంగళగిరిలో విద్యార్థి జేఏసీ సభ్యులు మోకాళ్లతో నడిచి వినూత్నంగా నిరసన తెలిపారు. రేపల్లెలో వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ చేపట్టాయి. గుంటూరులో బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరండల్‌పేట స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆందోళనకారులను వదిలేశారు. -
పండుగనాడూ ఆగని ఉద్యమ జ్వాల
సాక్షి, రాజమండ్రి : పండుగైనా పోరు ఆగలేదు. తొమ్మిదోనాడు కూడా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింది. రంజాన్ సందర్భంగా శుక్రవారం ఆందోళనలకు జేఏసీ విరామం ప్రకటించడంతో దుకాణాలు తెరుచుకున్నాయి. బస్సులు కూడా తిరిగాయి. కానీ నిరసనలు కొనసాగాయి. ముస్లింలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో సమైక్య నినాదం మార్మోగింది. ఆర్యవైశ్యులు, రిక్షా కార్మికులు, ఉపాధి సిబ్బంది వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రిక్షావాలాల సమైక్య నినాదం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పిఠాపురం, సీతానగరంలలో రిక్షా కార్మికులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. పిఠాపురంలో రిక్షాలతో ర్యాలీ చేశారు. మానవహారం నిర్వహించి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు పాల్గొన్నారు. రాజమండ్రిలో.. రాజమండ్రిలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట అన్ని విభాగాల జేఏసీల సమాఖ్య చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరాయి. పలువురు న్యాయవాదులు దీక్షల్లో పాల్గొన్నారు. బార్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నిరశన దీక్షలు కొనసాగుతున్నాయి. గౌతమీఘాట్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించి కోటగుమ్మం వద్ద పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాజమండ్రి రూరల్ నియోజక వర్గం కడియంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ల ర్యాలీ జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరాయి. కాతేరులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోలో ఆ పార్టీ నాయకుడు, సినీ నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం సమైక్య నినాదం కాకినాడలో ఆర్యవైశ్య సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. రామారావుపేటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. రాజోలులో ఆర్యవైశ్య సంఘం సభ్యులు ర్యాలీలు చేశారు. కాకినాడ కొత్తపేట చేపల మార్కెట్ నుంచి మహిళలు మెయిన్‌రోడ్డు మీదుగా సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర సాగించి బాలాజీ చెరువు సెంటర్లో అంత్యక్రియలు చేశారు. డీఎంఅండ్ హెచ్ఓ కార్యాలయం ముందు వైద్య ఆరోగ్య ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజూ కొనసాగాయి. రోటరీ క్లబ్ సభ్యులు లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమ బాటలో... పెద్దాపురంలో చేనేత కార్మికులు, రైతులు వేర్వేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. సామర్లకోటలో ఎమ్మార్పీస్ కార్యకర్తలు ప్రదర్శన జరిపారు. తునిలో ఆటోవర్కర్ల సంఘం ప్రతినిధులు ఆటోలతో ర్యాలీ చేసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై కబడ్డీ ఆడారు. ఏలేశ్వరంలో మండల టైలర్స్ యూనియన్ సభ్యుల ర్యాలీ జరిగింది. ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షలు ఆరో రోజు కొనసాగాయి. అన్నవరం, ప్రతిపాడు మండలాల్లో కేబుల్ ఆపరేటర్లు, శంఖవరంలో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. రౌతులపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. జేఏసీ ఆధ్వర్యంలో జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొనసాగుతున్న నిరవధిక దీక్ష శిబిరాన్ని మంత్రి తోట నరసింహం సందర్శించారు. రాజానగరం వద్ద గైట్ విద్యార్థులు జాతీయ రహదారిని ముట్టడించి నినాదాలు చేశారు. రాజానగరంలో అడుసుమిల్లి రమేష్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. మంత్రి తోట నరసింహం అతడిని పరామర్శించారు. కోరుకొండలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ చేశారు. లక్ష్మీనరసింహ తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో మేస్త్రుల ర్యాలీ జరిగింది. అనపర్తిలో తెలుగుదేశం ర్యాలీలో నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో మండపేటలో కలువపువ్వు సెంటర్లో వంటా వార్పు జరిగింది. రాయవరంలో జేఏసీ సభ్యులు ప్రజలకు గులాబీలు పంచారు. కపిలేశ్వరపురంలో నిర్మాణ రంగ కార్మికులు ర్యాలీ చేశారు. కె.గంగవరం మండలం పామర్రులో స్థానికులు వంటా వార్పు నిర్వహించారు. రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ బైక్ ర్యాలీ రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తొమ్మిదో రోజు దీక్షలలో 28వ డివిజన్ మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పార్టీ యువనేత జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఏవీ అప్పారావు రోడ్లో యువకులు మోకాళ్లపై నడుస్తూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఆందోళనబాటలో ముస్లింలు రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు ఇతర కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ముస్లింలు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. రంగంపేటలో ముస్లింలు సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర విభజన యత్నాలకు నిరసనగా రంపచోడవరంలో జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింల నిరసన ప్రదర్శన జరిగింది. రావులపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రదర్శనలో పలువురు ముస్లింలు పాల్గొన్నారు. మామిడికుదురులో ముస్లింలు రాస్తారోకో చేశారు. కోనసీమలో నిరసనలు అమలాపురంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల డ్రైవర్లు, క్లీనర్ల సంఘం ఆధ్వర్యంలో 150 బస్సులతో భారీ ర్యాలీ జరిగింది. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్రామాల్లో జేఏసీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు సాగాయి. గడియార స్తంభం సెంటర్ వద్ద ఆర్టీసీ ఉద్యోగ సంఘం ఎన్ఎంయూ రిలే దీక్షలు శుక్రవారం ఏడో రోజుకు చేరాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, నియోజక వర్గ కో ఆర్డినేటర్లు మిండగుదిటి మోహన్, చింతా కృష్ణమూర్తి, ఇతర పార్టీల నేతలు మద్దతు పలికారు. ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట జేఏసీ నిర్వహిస్తున్న శిబిరంలో బార్ అసోసియేషన్ సభ్యులు, ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లు, మేట్లు పాల్గొన్నారు. కొత్తపేటలో గంగిరెద్దుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల పేర్లతో ప్లకార్డులు కట్టి ఊరేగించారు. ఆలమూరులో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బ్యాక్‌వాక్ చేశారు. అయినవిల్లి మండలం సిరిపల్లి, ఎన్. పెదపాలెం గ్రామాల్లో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మ తగులబెట్టారు. మామిడికుదురు మండలం పాశర్లపూడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా కొండాలమ్మ ట్రాక్టర్ నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో రాజోలు మండలం తాటిపాక రేవు వరకూ ట్రాక్టర్ల ప్రదర్శన జరిగింది. ట్రాక్టర్లో కేసీఆర్ దిష్టిబొమ్మ ఉంచి డప్పులతో ఊరేగించారు. అంబాజీపేట మండలంలో జర్నలిస్టుల నిరసన ప్రదర్శన జరిగింది. మలికిపురంలో ఎస్సీ సంక్షేమసంఘ సభ్యులు నిరాహార దీక్షలను ప్రారంభించారు. రాజోలు మండలం గొంది లో వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నేటినుంచి మంత్రి భార్య నిరవధిక దీక్ష తన భార్య సరస్వతి (వాణి) శనివారం నుంచి సమైక్యాంధ్ర పరిరక్షణ నినాదంతో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్టు మంత్రి తోట నరసింహం ప్రకటించారు. కాకినాడలో ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో రాజీనామా సమర్పించిన అనంతరం మంత్రి తోట శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు. సామర్లకోట రైల్వే స్టేషన్, జగ్గంపేట, దోసకాయలపల్లి గ్రామాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగానే తాను పదవికి రాజీనామా చేశానన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేస్తానని, అవసరమైతే జిల్లా జేఏసీకి నాయకత్వం వహిస్తానని పేర్కొన్నారు. -
అదే జోరు.. అదే పోరు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉద్యమకారుల జోరు మరింత పెరిగింది. వారి డిమాండ్‌కు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తలొగ్గారు. శ్రీకాకుళం, టెక్కలి, ఆమదాలవలస, పలాస ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, కొర్ల భారతి, బొడ్డేపల్లి సత్యవతి, జుత్తు జగన్నాయకులు, ఎమ్మెల్యీ పీరుకట్ల విశ్వప్రసాద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కిరణ్‌కు రాజీనామాలు సమర్పించారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. కొనసాగిన ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు శుక్రవారం రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. సోనియాగాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని విద్యుత్ ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జర్నలిస్ట్ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాయి. పలు కళాశాలల ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డుల ఉద్యమం చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లిం సోదరులు జామియా మసీదు నుంచి వైఎస్ఆర్ కూడలి వరకూ ర్యాలీగా తరలివచ్చి మానవహారం నిర్వహించారు. ఎస్టీ వసతిగృహ విద్యార్థులు సూర్యమహల్ కూడలి నుంచి వైఎస్ఆర్ కూడలి మీదుగా పొట్టిశ్రీరాములు కూడలి వరకూ ర్యాలీ జరిపారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో డేఅండ్‌నైట్ కూడలి వద్ద విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు మానవహారం చేపట్టారు. పీఎస్ఎన్ఎం స్కూల్ నుంచి డేఅండ్‌నైట్ కూడలి వరకు 60 అడుగుల త్రివర్ణపతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, మహేష్‌బాబు ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో సూర్యమహల్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. పాలకొండలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ కార్యకర్తలు కళ్లకు నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. ఎన్ఎంయూ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి రాస్తారోకో చేశారు. భామినిలో టీడీపీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వీరఘట్టం మండలం తెట్టంగి జంక్షన్లో గ్రామస్తులు రాస్తారోకో చేసి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలాసలో సిక్కోలు ధూమ్‌ధామ్ పలాస- కాశీబుగ్గ పట్టణంలో ఉద్యమకారులు ‘సిక్కోలు ధూమ్‌ధామ్’ కార్యక్రమాన్ని చేపట్టా రు. పలాస ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ర్యాలీ నిర్వహించా రు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కేసీఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆమదాలవలసలో వంటావార్పు ఆమదాలవలసలో సమైక్యాంధ్ర రక్షణ సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. సరుబుజ్జిలి సెంటర్లో యువకులు రోడ్డును దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. ఇచ్ఛాపురంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. సోంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. ఉద్యమంపై విద్యార్థుల ప్రచారం ఎచ్చెర్లలో అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి సమైక్యాంధ్ర ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. టెక్కలి, సంతబొమ్మాళి, నందిగాంల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. టెక్కలిలో జర్నలిస్టులు సమైక్యాంధ్ర చిత్రపటాలను పంపిణీ చేశారు. రాజాంలో బంద్ విజయవంతం రాజాంలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అన్నివర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 2,500 మంది జ్యూట్‌మిల్లు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో పలు చోట్ల సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించారు. అనంతరం వాటిని దహనం చేశారు. పాతపట్నంలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరాయి. కొత్తూరు మండలం బలద, కౌలస్యపురం, నివగాంలలో బంద్ విజయవంతమైంది. వారణాసి- పర్లాఖిమిడి రోడ్డు మధ్యలో ట్రాక్టర్ తొట్టెలను అడ్డుపెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బలదలో కేసీఆర్, సోనియాలకు పిండప్రదానం చేశారు. ఎల్‌ఎన్‌పేట యువ కులు ఏపీ రోడ్డుపై ధర్నా చేశారు. -
ఉద్యమ సత్తా రాజీనామా బాట
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్య ఉద్యమ సత్తా ఏమిటో తెలిసొచ్చింది.. పది రోజుల తర్వాత ప్రజల మనోగతమేమిటో మన ప్రజాప్రతినిధులకు అవగతమైంది. రాజీనామాలు చేయక తప్పదని అర్థమైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర పరిరక్షణకు జిల్లాలో మహోద్ధృతంగా సాగుతున్న ఉద్యమానికి వెరచి అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దిగివచ్చారు. తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాజీనామా లేఖలను స్పీకర్‌కు కాకుండా ముఖ్యమంత్రికి శుక్రవారం సమర్పించారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి, పలాస ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, బొడ్డేపల్లి సత్యవతి, కొర్ల భారతి, జుత్తు జగన్నాయకులుతోపాటు ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ తమ పదవులకు రాజీనామా చేశారు. గత పదిరోజులుగా ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నా.. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నా నాన్చుడు ధోరణి అవలంభించిన ఈ నేతలు.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజీనామా చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఇన్నాళ్లు రాజీనామాలు చేయకుండా, ఉద్యమానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించడానికి సమైక్యవాదులు కార్యాచరణ రూపొం దించారు. దీంతో వారికి రాజీనామా చేయకతప్పలేదు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు రెండు రోజుల క్రితమే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు పెరిగింది. ముఖం చూపని మంత్రులు జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు ఉండగా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఉద్యమానికి ముందే రాజీనామా చేశారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అనర్హతకు గురయ్యారు, మిగిలిన ఎనిమిది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఐదుగురు రాజీనామా చేశారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులుతోపాటు మంత్రులుగా ఉన్న రాజాం, పాతపట్నం ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, శత్రుచర్ల విజయరామరాజులు రాజీనామాలకు ఇప్పటికీ వెనకాడుతున్నారు. ప్రజల మనోభావాలను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉద్యమాలకు భయపడి ప్రజలకు దూరంగా ఉంటున్నారు. పది రోజుల నుంచి నియోజకవర్గాలకే రావడంలేదు. ఇద్దరూ వలస వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారే కావడంతో స్థానికంగా నివాసం ఉండటం లేదు. ఒకరు ఒడిశాలో ఉంటుంటే, మరొకరు విశాఖపట్నంలో ఉంటున్నారు. సమైక్యాంధ్ర ఆందోళనకు మద్దతుగా రాజీనామాలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేస్తామని ఆందోళనకారులు వీరిని హెచ్చరిస్తున్నారు. రాజాంలో కాంగ్రెస్ నేతలకు ఎదురు దెబ్బ మంత్రి కోండ్రు నియోజకవర్గమైన రాజాంలో సమైక్య ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి అనుచరులకు పరాభవం జరిగింది. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, వైఎస్ఆర్సీపీ, టీడీపీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యేకంగా ఒక బ్యానర్ తయారుచేసుకొని ర్యాలీలో కలిసిపోయారు. అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు ప్రయత్నించగా ఉద్యమకారులు అడ్డుకున్నారు. ‘మీకు మాట్లాడే అర్హత లేదు, ఉద్యమం నుంచి వెళ్ళిపోవాలంటూ’ నినాదాలు చేశారు. నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నించినా వినకపోగా మంత్రికి, కాంగ్రెస్‌కు, సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము మంత్రి కోండ్రు మురళి ఆదేశాల మేరకు ఉద్యమంలోకి వచ్చామని కాంగ్రెస్‌వారు చెప్పడంతో ఆందోళకారులు మరింత రెచ్చిపోయారు. మాయమాటలు చెప్పుకుంటూ ఎంతకాలం తిరుగుతారని నిలదీశారు. ఇదిలా ఉండగా శుక్రవారం కూడా జిల్లాలో అన్ని చోట్లా నిరసన ప్రదర్శనలు జరిగాయి. శ్రీకాకుళంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. నరసన్నపేటలో కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. ఎచ్ఛెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు వినూత్న రీతిలో ఆందోళన సాగిస్తున్నారు. నిరాహార దీక్షలు చేపట్టారు. చర్చా గోష్టులు నిర్వహిస్తున్నారు. ఆమదాలవలస, పాలకొండ, పలాస తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు, మానవహారాలు, రోడ్లపైనే వంటావార్పులు చేపట్టారు. -
కొత్త నోటిఫికేషన్లు ఇప్పట్లో లేనట్లే
శ్రీకాకుళం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: వేలాది కొలువులు.. వరుసగా నోటిఫికేషన్లు.. చకచకా ఖాళీల భర్తీ ప్రక్రియ.. సర్కా రు చర్యలతో నిరుద్యోగుల్లో తొణికిసలాడిన ఉత్సాహం ప్రస్తుత పరిణామాలతో ఉడిగిపోయింది. రాష్ట్ర విభజన ప్రకటన.. దానికి నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో వెల్లువెత్తుతున్న నిరసనలు, రాష్ట్ర సచివాలయంలోనూ ఉద్యోగుల నిరసనలతో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతున్న పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సంది గ్ధంలో పడింది. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు వెలువడి దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తి కాగా.. మరికొన్ని నోటిఫికేషన్లు త్వరలో వెలువడాల్సి ఉంది. వేలాది ఉద్యోగాలు భర్తీ కానుండటంతో కోటి ఆశలతో వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ కేంద్రాల్లో చేరిన నిరుద్యోగులను ఈ పరిణామా లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్, ఇంకా పలు శాఖల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న, దానికి సిద్ధంగా ఉన్న జిల్లాకు చెందిన అభ్యర్థులు అందుకోసం హైదరాబాద్‌తోపాటు రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణా జిల్లా అవనిగడ్డ తదితర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. 2677 వరకు పంచాయతీ కార్యదర్శి పోస్టులతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, ఎస్సై, కానిస్టేబుల్, జూని యర్ లెక్చరర్స్ పోస్టుల నియామక పరీక్షలతోపాటు డీఎస్సీకి సిద్ధమయ్యేందుకు రెండు నెలల క్రితమే జిల్లా నుంచి సుమారు మూడువేల మంది నిరుద్యోగులు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఉన్న ప్రముఖ కోచింగ్ సెం టర్లకు వెళ్లారు. మరికొన్ని వేలమంది శ్రీకాకుళంలోనే శిక్షణ పొందుతున్నారు. మంచి తరుణమని భావించారు...కానీ.! సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా నోటిఫికేషన్లు వెలువడుతాయని అంతా భావించారు. ఇప్పట్లో ఉద్యోగం సాధించకుంటే వయోపరిమితి దాటిపోయే వారైతే కొండంత ఆశతో భారమైనా ఖర్చులకు వెనుకాడకుండా పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందుకు దూరాభారం వెళ్లారు. ఉద్యోగస్థాయిని బట్టి కోచింగ్ ఫీజులు 15 నుంచి 30 వేల రూపాయల వరకు చెల్లించారు. ఇక శిక్షణ పొందే ప్రాంతాల్లో రెండు మూడు నెలలపాటు ఉండాల్సి రావడంతో వసతి, భోజన ఖర్చులకు మరికొన్ని వేలు ఖర్చవుతాయి. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడవచ్చన్న ఆశతో వీటన్నింటినీ భరించినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వీరి ఆశలను కూల్చేసింది. రాష్ట్ర విభజన, సమైక్యాంద్ర ఉద్యమాల నేపథ్యంలో ఇప్పటికే కొనసాగుతున్న నియామకాలతోపాటు కొత్తగా వెలువడాల్సిన నోటిఫికేషన్ల పరిస్థితి డోలాయమానంలో పడింది. ఏపీపీఎస్సీ ప్రకటన కూడా నిరుద్యోగుల్లో ఆందోళన పెంచింది. విభజన నేపథ్యంలో నియామకాల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు కొత్తగా ఎలాంటి నోటిఫికేషన్లనూ విడుదల చేయబోమని ఆ సంస్థ తేల్చిచెప్పింది. ఇప్పట్లో దీనిపై స్పష్టత ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దీంతో డీలాపడిన ఉద్యోగార్థులు ఇంకా శిక్షణల పేరుతో అక్కడే ఉంటే తడిసిమోపెడు అవుతుందన్న ఉద్దేశంతో ఇంటిముఖం పడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉంటున్న వారు మాత్రం మిణుకుమిణుకుమంటున్న ఆశతో శిక్షణను కొనసాగిస్తున్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన : జోరు తగ్గని పోరు
బొబ్బిలి, న్యూస్‌లైన్ : అందరి లక్ష్యం ఒక్కటే... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం చాలని కోరుతూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడే ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. విద్యార్థులు, వివిధ సం ఘాల నాయకులు ఉదయూనికే రోడ్లపై వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం కూడా సమైక్యవాదుల నిరసనలు మిన్నంటారుు. సమైక్యాంధ్రకు మద్దతుగా బొబ్బిలిలో జేఎసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా కేం ద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాలో కంటే సీమాంధ్రలోనే అభివృద్ధి లేదని తేల్చి చెప్పిందన్నా రు. అప్పటివరకు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామని చెప్పిన తెలంగాణావాదులు కమిటీ నివేదిక తరువాత స్వరం మార్చి సెంటిమెంట్ ను గౌరవించాలని డిమాండ్ చేశారన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా రాజకీ య లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేయడం దారుణమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, విద్యార్థులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రాణాలు పోయినా రాష్ట్ర విభజనకు ఒప్పుకోకూ డదన్నారు. సమైక్యవాదానికి తూట్లు పొడిచిన నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయు డు మాట్లాడుతూ ఆంధ్రుల అందరి శ్రమ వల్ల హైదరాబాద్ ఏర్పడిందన్నారు. హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ టి. రామ్మూర్తి, ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు సీహెచ్ మహందాత పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బైక్ ర్యాలీ కొత్తవలస : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మండలంలోని వైఎస్సార్ సీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తవలస జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చింతలదిమ్మ,అగ్నిమాపక కేంద్రం, ముసిరాం, వియ్యంపేట, దేవా డ మీదుగా కొత్తవలస రైల్వేస్టేషన్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కర్రి శ్రీను, నాయకులు మేళాస్త్రి అప్పారావు, వై. మాధవరావు, నంబారు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నా రు. అలాగే జేఏసీ ఆధ్వర్యంలో కొత్తవలస నుంచి బైక్ ర్యాలీ చేశారు. కొత్తవలస జంక్షన్లో ప్రారం భమైన ర్యాలీ చింతలదిమ్మ, అగ్నిమాపక కేంద్రం,తుమ్మికాపల్లి, దేవాడ, రా మలింగపురం, చీడివలస, గొల్లలపాలెం, రాజపాత్రునిపాలెం మీదుగా కొత్తవలస రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లాలం రాధాకృష్ణ, నా యుడు, బి. తారకేశ్వరరావు, వెంకటనాయుడు, రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణా ఇస్తే మన్యసీమ ఇవ్వాల్సిందే సాలూరు రూరల్ : తెలంగాణ విభజన జరిగితే గిరిజనులకు ప్రత్యేక మన్యసీమ రాష్ట్రం ఇవ్వాల్సిం దేనని సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి లక్ష్యం ఒక్కటేనన్నారు. రాష్ట్ర విభజనలో సోనియాగాంధీ, ఆ పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.రాష్ట్రం ముక్కలైతే గిరిజనుకు రాజ్యాంగబద్ధంగా వ చ్చిన హక్కులను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను వేరు చేసి ప్రత్యేక మన్యసీమ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ‘చాకిరేవు’తో వినూత్న నిరసన గౌరీపురం (శృంగవరపుకోట రూరల్) : సమైక్యాంధ్రకు మద్దతుగా కిల్తంపాలెం పంచాయతీ గౌరీపురం గ్రామస్తు లు విశాఖ-అరుకు ప్రధాన రహదారిపై శుక్రవారం ఉద యం 8 నుంచి 10 గంటల వరకు ‘చాకిరేవు’ కార్యక్రమా న్ని చేపట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువస్నేహ యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంద న్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల వెంకటరాము(శ్రీను),సెంట్రల్ బ్యాం క్ డెరైక్టర్ ఐ. రామరాజు, మాజీ సర్పంచ్ సుంకరి ఈశ్వరరావు, యువస్నేహ యువజన సంఘ సభ్యులు జి. మోహనరావు, కె. నూకరాజు, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ వల్లే రాష్ట్ర విభజన : కోలగట్ల విజయనగరం ఫోర్ట్ : తెలుగుదేశం పార్టీ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని డీసీసీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ బంద్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే దుకాణాలను, పెట్రోల్ బంక్‌లను, వాణిజ్య సమూదాయిలను మూయించారు. ఆర్టీసీ బస్సులు,లారీలను కూడా నిలిపివేశారు.అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ జంక్షన్ మీదుగా కోట మూడు లాంతర్లు వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం నిర్వహించి చంద్ర బాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ మరో స్వాంత్రంత్య్ర ఉద్యమంలా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చేలా ఆయూ పార్టీల నాయకులు అధిష్టానాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నశ్రీను, యడ్ల ఆదిరాజు, తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కురుపాం : సమైక్యాంధ్రకు మద్దతుగా కురుపాం మండల కేంద్రంలో అన్ని పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే వీటీ జనార్దన థాట్రాజ్,మాజీ ఎమ్మెల్యే ని మ్మక జయరాజ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ రహ దారి పై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే జనార్దన థాట్రాజ్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా పార్టీ ఇచ్చిన సూచనలు మేర కు ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పటికే తన రాజీ నామాను స్పీకర్‌కు అందించినట్టు తెలిపారు. ప్రజాభిప్రా యం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే జయమణి వాహనాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు బెలగాం : సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఎత్తున మోటారు బైక్ ర్యాలీ నిర్వహిం చారు. పరిరక్షణ సమితి నాయకులు ముందుగా నిర్ణయిం చిన ప్రకారం పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి ఇం టిని ముట్టడించాలని అనుకున్నప్పటికీ ఎమ్మెల్యే స్థానికం గా పార్టీ కార్యాలయంలో ఉంటున్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లారు. ఇంతలో ఎమ్మెల్యే వాహనం పాత బస్టాండ్ సమీపంలోకి రావడంతో సమైక్యవాదులంతా ఎమ్మెల్యే వా హనాన్ని అడ్డుకుని, ఎమ్మెల్యే రాజీనామా చేయాలం టూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జయమణి వాహనం దిగి తన రాజీనామా పత్రాన్ని చూపించారు. తాను ఈ నెల 6వ తేదీనే హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజీనామా పత్రాన్ని అందజేశానని తెలిపారు. ప్రాణాలు అర్పించి అయినా సమైక్యాంధ్రా కో సం పోరాడతానని తెలిపారు. కార్యక్రమంలో సమైక్యాం ధ్ర పరిరక్షణ సమితి చైర్మన్ జి.లక్ష్మునాయుడు, కో ైచె ర్మన్ జి.శ్రీరామ్మూర్తి, కార్యదర్శి జీవీఆర్ కిశోర్, మీడియా కన్వీనరు సామల సింహాచలం, నాయకులు జక్కు రామి నా యుడు, పక్కి గోపాలకృష్ణ, మురళీ, టీవీ నాయుడు, వెంకటరావు, ధనుంజయనాయుడు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కొవ్వొత్తుల ర్యాలీ నేడు విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్టు చెప్పారు. ఆదివారం జాతీయ రహదారి దిగ్బంధం, సోమవారం మోటారు బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో నాయకులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. -
దశ దిశలా... ఉద్యమ జ్వాల
ఉద్యమ జ్వాల దశదిశలా వ్యాపించింది. విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళనలు జిల్లా వ్యాప్తంగా పదో రోజు కూడా కొనసాగాయి. అన్ని వర్గాల ప్రజలూ వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ వృత్తుల వారు తమ సత్తా చూపుతున్నారు. ఇంత ఉద్ధృతంగా ఉద్యమ సెగలు రగులుతున్నా చీమకుట్టినట్టయినా లేని ప్రజాప్రతినిధులను రోడ్ల మీద నిలదీస్తున్నారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు. విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమం జిల్లాలో ఉప్పెనలా ఎగసిపడుతోంది. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ ప్రజలు చేయి చేయి కలిపి స్వచ్ఛందంగా ఆందోళనలు చేపట్టారు. ఎక్కడికక్కడ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే జయమణి వాహనాన్ని అడ్డుకున్న సమైక్యవాదులు, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాను రాజీనామా చేశానని, ఆ పత్రాన్ని పీసీసీ అధ్యక్షునికి పంపించాని ఆమె చెప్పడంతో వారు శాంతించి, వాహనానికి దారిచ్చారు. విజయనగరం పట్టణంలోని ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు పట్టణంలోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పాటించడంతో పాటు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్ని సంస్థల యజమానులు, సిబ్బంది మయూరి జంక్షన్ వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 5 గంటల నుంచే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులపైకి వచ్చి బంద్ పాటించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం వినూత్న రీతిలో ప్రదర్శన చేపట్టారు. జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు నేతృత్వంలో సోనియా, రాహుల్‌గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దున్నపోతులతో తొక్కిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కోట జంక్షన్లో ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక మయూరి జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సమైక్యవాదులంతా సమైక్యమే ముద్దు... విభజన వద్దు అంటూ నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగులు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ భవనం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కొనసాగాయి. రిలే దీక్షల్లో పి. విద్యాసాగర్, ఎన్. సూర్యనారాయణ, వి.ఎ.వి. శర్మ, కే.దాలిరాజు, పి.శ్రీను, ఎ. శ్రీనివాస్ పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో 300 మంది విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయనగరం- శ్రీకాకుళం మార్గంలో రాస్తారోకో చేశారు. శ్రీ పైడిమాంబ యువజన సమరాంగణ కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కళాకారులంతా కత్తులు, కర్రలతో యుద్ధ విన్యాసాలు చేస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా అన్ని ప్రధాన కూడళ్లలో కళాకారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పీడబ్ల్యూ టింబర్ మర్చంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మర్చంట్స్, సిబ్బంది భారీ ర్యాలీగా కోట జంక్షన్ వరకు వచ్చి అక్కడ మానవహారం చేపట్టిన అనంతరం కేసీఆర్, సోనియాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వాహనాలకు జై సమైక్యాంధ్ర నినాదంతో కూడిన స్టిక్కర్లను అతికిస్తూ నిరసన చేపట్టారు. పట్టణంలోని మొబైల్స్ దుకాణాల యజమానులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్ల నియోజక వర్గంలో సమైక్యవాదుల ఆందోళన హోరెత్తింది. నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు నాలుగు మండలాల్లోనూ తీవ్రస్థాయిలో సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. నియోజక వర్గ కేంద్రమైన నెల్లిమర్లలో 200 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి విజయనగరం - పాలకొండ రహదారిని దిగ్బంధించారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు చెప్పులు వేసి ఊరేగించారు. కర్రలతో కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పతివాడ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. వంటావార్పు కార్యక్రమం చేపట్టిన సమైక్య వాదులు రోజంతా రోడ్డుపైనే గడిపారు. పూసపాటిరేగ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై సమైక్యవాదులు ఆందోళన చేపట్టి రహదారిని దిగ్బంధించారు. డెంకాడ, భోగాపురం మండల కేంద్రాల్లో కూడా సమైక్యవాదుల నిరసనలు మిన్నంటాయి. చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. గరివిడిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గరివిడి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గరివిడి-చీపురుపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో, వంటావార్పు చేశారు. జేఏసీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఓబీ జంక్షన్లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.ఎస్.కోటలో జేఏసీ నేతృత్వంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఎల్ఐసీ ఏజెంట్లు శుక్రవారం నిరాహార దీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులు పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. ఎస్.కోట మండలం గౌరీపురంలో విశాఖ - అరుకు రోడ్డుపై పలువురు నిరసనకారులు వంటావార్పు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రామభద్రాపురం రోడ్డులో విద్యార్థులు ర్యాలీ చేపట్టగా, కొటారుబిల్లి జంక్షన్, తాటిపూడిలలో యువకుల బైక్ ర్యాలీ నిర్వహించారు. బొబ్బిలిలో సమైక్యాంధ్ర సాధన సమితి ఆధ్వర్యం తలపెట్టిన బొబ్బిలి బంద్ విజయవంతమైంది. కాంగ్రెస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, పట్టణంలోని దాదాపు 40 సంఘాల వారు దీనిలో పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్‌కృష్ణరంగారావు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా ప్రధాన రహదారిపై వంటావార్పు చేశారు. బొబ్బిలి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల నిరాహారదీక్ష చేపట్టగా రాముడువలసలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మల దహనం చేశారు. రామభద్రపురం మండల కేంద్రంతో పాటు బూసాయవలస, ఆరికతోటల్లో వంటావార్పులు చేసి ఉద్యమకారులు తమ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మత్య్సకారులు, ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్, సైకిల్ మెకానికల్ వర్కర్స్, కల్లుగీత కార్మికులు సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేశారు. సాలూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించగా , ముస్లింలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే జయమణిని సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించాలని సమైక్యాంధ్రా పర్యవేక్షణ పోరాటసమితి చుట్టుముట్టింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముస్లింలు మౌన ప్రదర్శన చేపట్టగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటవార్పు నిర్వహించారు. -
సమైక్యాంధ్ర ఉద్యమాలు వల్ల స్తంభించిన పాలన
ఏలూరు, న్యూస్‌లై న్ : సమైక్యాంధ్ర కోసం చేపట్టిన ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతుండటంతో జిల్లాలో పరిపాలనా వ్యవస్థ స్తంభించింది. 10 రోజులుగా ఉద్యోగులు సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో పనిచేసేవారు లేక కార్యాలయూలు వెలవెలబోతున్నాయి. జూన్ నెలాఖరు నుంచి పంచాయతీ ఎన్నికల కోడ్ అమలు కావడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పడకేశాయి. మరోవైపు గోదావరి వరదలతో కీలక శాఖల అధికారులు సహా య, పునరావాస కార్యక్రమాలపై దృష్టి సారించాల్సి వచ్చింది. దీంతో సుమారు నెలరోజులపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. గతనెల 30న రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటించడంతో ఆరోజు సాయంత్రం నుంచే ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకూ వారంతా పోరుబాటలోనే ఉన్నారు. దీంతో అన్ని కార్యాలయాల్లో పరిపాలన కుంటుపడింది. రెవెన్యూ, పశుసంవర్థక, నీటి పారుదల, వ్యవసాయ, విద్యా శాఖలకు చెందిన ఉద్యోగులంతా ఎడతెగకుండా ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సైతం నాలుగు వారాల నుంచి జరగటం లేదు. నిలిచిపోయిన రుణాలు సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో బ్యాం కుల వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభిం చిపోయాయి. నిరసనకారులు ఎక్కడికక్కడ బ్యాంకులను మూయించివేస్తున్నారు. మరోవైపు రుణాల పంపిణీ ఎక్కడిక్కడే నిలిచి పోయింది. వ్యవసాయానికి సంబంధించి ఈ ఖరీఫ్‌లో రూ.2,450 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు కేవలం రూ.2,150 కోట్లను మాత్రమే బ్యాంకర్లు అందజేశారు. ఇంకా రూ.300 కోట్లు పంపిణీ చేయూల్సి ఉంది. కౌలుదారులకు ఈ సీజన్లో రూ.150 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.53.04కోట్లు మాత్రమే ఇచ్చారు. గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసే విషయంలోనూ జాప్యం జరుగుతోంది. మొత్తం రూ.129 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయూల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.92 కోట్లు మాత్రమే అందాయి. ఇంకా రూ.37 కోట్లను పంపిణీ ఎలా చేయాలో అర్థంకాక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందటం గగనంగా మారింది. ఆగస్టు 15 వేడుకలపైనా ప్రభావం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈ నెల 13 నుంచి ఎన్జీవోలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. వీఆర్వో, గ్రామకార్యదర్శి స్థాయి నుంచి అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పోరుబాట పట్టనున్నారు. ఈ పరిస్థితి ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం సందర్భంగా రుణాలు అందించే పరిస్థితి ఉండకపోవచ్చని యంత్రాంగం చెబుతోంది. -
పెరుగుతున్న రిలే దీక్షా శిబిరాలు
సాక్షి, ఏలూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమాలు శుక్రవారం పదో రోజుకు చేరుకున్నాయి. ప్రజలంతా అకుంఠిత దీక్షతో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక శుక్రవారం ఐదుగురు గుండె ఆగి మరణిం చారు. రిలే నిరాహార దీక్షలు ఉధృతమవుతున్నాయి. పది రోజులుగా కొన్ని సంఘాలు దీక్షలు కొనసాగిస్తుంటే.. ప్రతి రోజూ కొత్తగా మరి కొందరు దీక్షలు ప్రారంభిస్తున్నారు. పెరవలిలో నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెంలో దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సందర్శించారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఉంగుటూరు సర్పంచ్, 14 మంది వార్డు సభ్యులు రిలే దీక్షలు చేపట్టారు. పాలకొల్లులో దీక్షల్లో ఎమ్మెల్యే ఉషారాణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భీమవరంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. డాక్టర్ పీఆర్కే వర్మ రూ.15 వేల నగదును జేఏసీకి విరాళంగా అందించారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఏడవ రోజుకు చేరుకున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో శ్రీకృష్ణదేవరాయ సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు. మంత్రి పితాని సత్యనారాయణ ఎట్టకేలకు ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆచంట, మార్టేరు, పెనుగొండలో దీక్షలు చేస్తున్న సమైక్యవాదులను కలిసి సంఘీభావం తెలిపారు. పాలకొల్లులో దీక్షా శిబిరాన్ని మంత్రి పితాని, నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరు రఘురామకృష్ణంరాజు సందర్శించి ఉద్యమకారులకు మద్దతు ప్రకటించారు. 13నుంచి ఉద్యోగుల సమ్మె సమైక్యాంధ్ర కోరుతూ ఈనెల 13నుంచి జిల్లాలోని ఉద్యోగులంతా సమ్మెకు దిగుతారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ శుక్రవారం ఏలూరులో ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని సోనియాగాంధీ ప్రకటించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ డ్రామాలకు స్వస్తి పలకకపోతే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాంతా ల్లోని 13 జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారులు ఈనెల 13 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారని ది ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు టి.యోగానందం ప్రకటించారు. కదం తొక్కిన ముస్లింలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జిల్లాలోని ముస్లింలంతా ఎక్కడికక్కడ ప్రదర్శనలు నిర్వహించారు. ఏలూరు కర్బలా మైదానంలో రంజాన్ నమాజ్ చేసిన అనంతరం ముస్లింలు పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి మానవహారం నిర్వహించారు. రంజాన్ శుభాకాంక్షలను సైతం ‘జై సమైక్యాంధ్ర’ అంటూ చెప్పుకున్నారు. కొయ్యలగూడెం మండలంలో ముస్లింలు ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్ల బాలరాజు పాల్గొని యూపీఏ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తణుకు నరేంద్ర సెంటర్లో సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రోజువారీ కూలీలు సైతం శుక్రవారం పనులు మానుకుని ఉద్యమంలో పాల్గొన్నారు. లారీలు, ప్రైవేటు బస్సులు, ఆటోల యాజమాన్యాలు ఆయూ వాహనాలను వీధుల్లో తిప్పి ఆందోళన చేపట్టారు. నాయీ బ్రాహ్మణులు చెవిలో పువ్వు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. నిడదవోలు పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 400మంది డ్వాక్రా మహిళలు ర్యాలీ నిర్వహిం చారు. నిడదవోలు మండలం మునిపల్లిలో వైఎస్సార్ సీపీ కన్వీనర్ ఎస్.రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిం చారు. జంగారెడ్డిగూడెంలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. మేము సైతం అంటూ హిజ్రాలు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆచంటలో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఫొటోగ్రాఫర్లు నిరసన దీక్షలో పాల్గొన్నారు. పెనుగొం డలో దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు వైఎస్సార్ సీపీ నాయకుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మద్దతు తెలిపారు. పాలకొల్లులో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జిల్లా రైస్‌మిల్లర్స్ సంఘం గాంధీబొమ్మల సెంటర్లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించింది. ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, రెల్లి సంక్షేమ సంఘం, బండ్లు, రైస్‌మిల్లు కార్మికులు భారీప్రదర్శన నిర్వహించారు. ఆందోళనల్లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొన్నారు. భీమవరంలో పతంజలి యోగ మిత్రమండలి సభ్యులు రోడ్లపై యోగాసనాలు వేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు గ్రంధి శ్రీనివాస్ తదితరులు కబడ్డీ ఆడారు. పాతపాటి సర్రాజు, వేగేశ్న కనకరాజు సూరి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సమైక్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు సోనియా భజన చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ నాయకుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు భీమవరంలో దుయ్యబట్టారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేశారు. -
రాష్ట్రంలో పులులు.. ఢిల్లీలో పిల్లులు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు నోరు మెదపలేదు. సోనియాగాంధీ నిర్వహించిన సమావేశాల్లో పెదవి విప్పలేదు. విభజన నిర్ణ యం ప్రకటించిన తొమ్మిది రోజుల తర్వాత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవేశంతో ఊగిపోతున్నారు. దీని వెనుక ఆంతర్యమేమిటో ప్రజలందరికీ తెలుసు’ అని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ పులులుగా తిరిగే కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో పిల్లులుగా ఉంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అంశంలో ముఖ్యమంత్రి గందరగోళంలో పడి ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉన్నారన్నారు. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్ హయాంలో తెలంగాణ, సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన నాయకులే లేరని గుర్తు చేశారు. వైఎస్ మరణం తర్వాతే రాష్ర్ట విభజన కోసం ఉద్యమాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పే మాటలు వినడం తప్ప ఎదురు చెప్పలేని రాష్ట్ర ఎంపీలు, మంత్రులు ఇక్కడ ఉద్యమాలు చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఉంటే, ఆ పార్టీ నాయకులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గంటా శ్రీనివాసరావు రాజకీయ లబ్ధి కోసమే నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేశారని విమర్శించారు. గంటాకు చిత్తశుద్ధి ఉంటే తన రాజీనామాను ఆమోదించుకుని జిల్లాలోని అన్ని పార్టీలు, ఇతర సంఘాలను కలుపుకుని ఉద్యమించాలన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించగానే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చెప్పారు. ఉద్యమాల పేరుతో రాజకీయం చేసేవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏయూ జేఏసీ ఈ నెల 14న నిర్వహించే సింహగర్జనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ ఉద్యమాలు చేస్తుండడంతో గంటా తన బృందంతో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేశారని విమర్శించారు. అన్ని పార్టీల నాయకులు, సంఘాలను ఆహ్వానించకుండా సొంత వ్యక్తులతో జేఏసీ ఏర్పాటు చేయడం తన రాజకీయ భవిష్యత్ కోసమేనని ధ్వజమెత్తారు. నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణగదొక్కడానికి ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. పోలీస్ కమిషనర్ తెలంగాణ అధికారి కావడం వల్ల పోలీస్ బలగాలతో ఉద్యమాన్ని అణిచివేస్తున్నారన్నారు. ఉన్నతాధికారిగా సమైక్యావాదుల ఆందోళన అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఉత్తర, గాజువాక నియోజక వర్గ సమన్వయకర్తలు జి.వి.రవిరాజు, తిప్పల నాగిరెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, లీగల్‌సెల్ కన్వీనర్ కాళీదాసురెడ్డి పాల్గొన్నారు. -
అల్లరిమూకలపై పోలీసుల దృష్టి
బొబ్బిలి, న్యూస్‌లైన్: బొబ్బిలి పట్టణంలో బుధవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన అల్లరి మూకలపై పోలీసులు దృష్టి సారించారు. బాడంగి మండలం గదబవలస గ్రామానికి చెందిన వాసిరెడ్డి గణేశ్ బుధవారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కి సమైక్యాంధ్ర నినాదాలు చేశాడు. దీంతో ఆ సమైక్యావాదిని కిందికి దించేందుకు ఇటు పోలీసులు, అటు రాజకీయ పార్టీల నాయకులు నానా హైరానా పడ్డారు. చివరకు వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు సంఘటనా స్థలానికి వచ్చిన తరువాత ఆయనపై ఉండే గౌరవంతో గణేశ్ కిందకు దిగాడు. ఆ సమయంలో ఇంకా యువకుడు మీదనే ఉన్నాడని అటు పోలీసులు, ఇటు మీడియాను దుర్భాషలాడుతూ పట్టణానికి చెందిన కొంత మంది అల్లరిమూకలు బొబ్బిలి యువత పేరుతో విధ్వంసానికి పాల్పడ్డారు. రోడ్డుమీద టైర్లు కాల్చి, కనపడినవన్నీ ధ్వంసం చేస్తూ వీరంగం వేశారు. ఓ ప్రైవేటు హోటల్ అద్దాలు పగలగొట్టగా, పత్రికా కార్యాలయాల బోర్డులు, డీఎస్పీ కార్యాలయం బోర్డులు ధ్వంసం చేసి నిప్పంటించారు. ఆ వీరంగానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాంప్లెక్స్ నుంచి కోర్టు జంక్షన్ వరకు రోడ్లపై టైర్లకు నిప్పంటించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఈ విధ్వంసం జరగడంతో పోలీసులు ప్రత్యేక దళాలను రంగంలోకి దించారు. దాంతో దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. 24 మం దిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది మద్యం సేవించి దుస్తులు విప్పి రౌడీల్లా తిరుగుతున్నవారే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిపై కేసులు నమోదు చేస్తున్నామని, వీరి వెనుక ఎవరి హస్తముందో ఆరా తీస్తున్నట్లు డీఎస్పీ ఫల్గుణరావు తెలిపారు. గురువారం కొం తమంది రైలురోకో చేయడానికి నిర్ణయించగా, బుధ వారం నాటి ఉద్రిక్తత దృష్ట్యా డీఎస్పీ వారితో చర్చించి శుక్రవారానికి వాయిదా వేశారు. గురువారం పట్టణానికి అదనపు బలగాలను తీసుకువచ్చారు. కాంప్లెక్సు, రైల్వేస్టేషను, నాలుగు రోడ్ల కూడలి వద్ద వీరిని ఏర్పాటు చేశారు. రాస్తారోకో, ధర్నా, ఆందోళన చేస్తున్న వారిఅసలు రంగేమిటో, ఏ సంస్థల ఆధ్వర్యంలో వారం తా నిరసన తెలుపుతున్నారో వంటి వివరాలను పోలీసు లు సేకరిస్తున్నారు. ఆందోళనలు చేసే వారు ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని, అదుపు తప్పి ఎవరు ఎక్కువగా విధ్వంసాలకు పాల్పడినా వారిపై చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. -
12 అర్ధరాత్రి నుంచి రెవెన్యూ సేవలు బంద్
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా జిల్లాలో రెవె న్యూ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టనున్నారు. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్న ట్టు సీమాంధ్ర రెవెన్యూ ఉద్యోగులు సీసీఎల్ఏ కు నోటీసు అందజేసిన విషయం విదితమే. దీని లో భాగంగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు ఆధ్వర్యంలో గురువారం నాయకులు కలెక్టర్ కాంతి లాల్ దండేను కలిసి సమ్మె గురించి వివరించారు. అంతే కాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా తాము చేపడుతున్న పోరాటానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమ్మెలో అటెండర్ నుంచి తహశీల్దార్ వరకు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలు మూతపడనున్నా యి. దీనిని దృష్టిలో పెట్టుకొని కార్యాలయాల తాళాలను స్వాధీనం చేసుకునేలా ఆర్డీవోలకు ఆదేశాలివ్వాలని ఉద్యోగులు కలెక్టర్‌ను కోరా రు. అలాగే వీఆర్ఏ, వీఆర్ఓలు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 12 నుంచి రెవెన్యూ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలి... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగులు ఈ నెల 12 నుంచి చేపట్టనున్న సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం నిర్భయంగా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగవలసిన పరిస్థితి లేదన్నారు. ఉద్యోగం, వేతనాలకు ఎటువంటి నష్టం ఉండదని వారు చెప్పారు. ప్రధానంగా మంత్రులు బొత్స, కిశోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయరామరాజులు సమైక్యాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ఒకవేళ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసినప్పటికీ పదవులు పోవని తెలిసినా ఎందుకు రాజీనామా చేయడం లేదని వారు ప్రశ్నించారు. రాష్ర్టం ముక్కలవుతున్నా బొత్స కుటుంబానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కనీసం పార్లమెంట్లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకోలేని స్థితిలో ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ఉండడం జిల్లా ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. ఇటువంటి ప్రజా ప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు సిద్ధం కావాలన్నారు. అందరినీ విడదీయాలని చూసే బొత్స తన కుటుంబాన్ని ఎందుకు విడదీయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రొంగలి ఎర్రినాయుడు, గౌరీ శంకర్, షేక్ ఇబ్రహీం, సి.హెచ్.లక్ష్మణప్రసాద్, పార్వతీపురం డివి జన్ అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ విజయవంతం
కళలకాణాచిగా, విద్యల కేంద్రంగా బాసిల్లిన జిల్లా ఇప్పుడు పోరు గడ్డగా మారింది. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా, ఏ ఆందోళనా జరగని విధంగా... జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. పల్లె, పట్టణం, ఏజెన్సీ, మైదాన ప్రాంతం అన్న తేడా లేకుండా అంతా ఉద్యమమయంగా మారింది. చిన్నా, పెద్దా ముసలీముతక అన్న వయో భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విభజనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పురుషులు, మహిళలు, హిజ్రాలు అన్న తారతమ్యం చూపకుండా పోరుజెండా చేతబూని రణక్షేత్రంలో కదంతొక్కుతున్నారు. విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సమైక్యమే మా నినాదం అంటూ జిల్లా ప్రజలంతా 9వ రోజూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తం గా పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేశారు. పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోట జంక్షన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను పాడిపై పెట్టి తమ సంప్రదాయాల ప్రకారం శవయాత్ర నిర్వహంచి, అంత్యక్రియలు జరిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరే కిస్తూ సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసేందుకు కుట్రపన్నిన సమైక్యద్రోహులంటూ సోనియా, రాహుల్‌గాంధీలతో పాటు దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్, బొత్స దిష్టిబొమ్మలను శూలాలతో పొడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్రలోని రాజకీయ పార్టీల నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో 400 మంది విద్యుత్ ఉద్యోగులు దాసన్నపేట విద్యుత్ భవనం నుంచి రింగ్‌రోడ్డు, బాలాజీ జంక్షన్, మయూరి జంక్షన్, కలెక్టర్ ఆఫీసు, కన్యకాపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం, మూడులాంతర్లు, కోట మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా విద్యుత్ భవనం వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారం కొనసాగాయి. ఈ రిలే దీక్షల్లో టి.గంగునాయుడు, జి.రాజశేఖర్, ఎస్.వి.ఎస్. రామకృష్ణ, టి.వి.వి మురళీకృష్ణ, ఎస్.శ్రీనివాస్, డి.సత్యనారాయణలు పాల్గొన్నారు. కణపాక చైతన్య యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద 100 మంది విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టణంలోని కాగడాల ప్రదర్శన నిర్వహించి నిరసన చేపట్టారు. స్థానిక కోట జంక్షన్ నుంచి మూడులాంతర్లు జంక్షన్, మెయిన్‌రోడ్, గంటస్తంభం జంక్షన్ మీదుగా ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆటోవాలాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. సుమారు 100 ఆటోలతో పట్టణమంతా ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద బొత్స దిష్టిబొమ్మను దహనం చేయగా, కోట జంక్షన్ వద్ద ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయగా ఆర్టీసీ ఉద్యోగులు కాంప్లెక్స్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డీసీసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. అక్కడ రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమం చేపట్టి సహపంక్తి భోజనాలు చేశారు. నెల్లిమర్లలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన నెల్లిమర్లలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయించారు. రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మలను దహనం చేశారు. భోగాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై వంటా వార్పు చేశారు. దీంతో ఇరువైపులా ఎనిమిది కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సవరవిల్లి, జమ్మయ్యపేట పాఠశాలల విద్యార్థులు రోడ్లపై బైఠాయించగా, ఎన్జీవో ఆధ్వర్యంలో 16 నంబర్ జాతీయ రహదారిపై సహపంక్తి భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాస్పత్రి వద్ద వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు చేశారు. చీపురుపల్లి మండల నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శ వయాత్ర చేశారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల తరగతులు బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు భరతమాత వేషధారణతో ర్యాలీ చేస్తూ నిరసన చేయగా రెడ్డిపేట, రేగిడిపేట, కొత్తపేట, విజయరామపురం పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆధ్వర్యంలో రాస్తారో కో చేపట్టారు. మందిరివలస గ్రామానికి చెందిన 300 మంది యువత చీపురుపల్లి వరకు పాదయాత్రగా వచ్చి కుక్కల మెడ లో కేసీఆర్ అని రాసి ఉన్న బోర్డులను వేలాడదీశారు. ఎస్.కోట దేవిబొమ్మ జంక్షన్లో బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థునిల ఆటపాటలతో నిరసన చేపట్టగా.. స్థానిక పుణ్యగిరి పీజీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలకు విద్యార్థులు విశాఖ, అరుకు రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించి దేవీబొమ్మ జంక్షన్లో రాస్తారోకో చేసి ట్రాఫిక్‌ను నిలుపుదల చేశారు. స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన ఎన్ఎంయూ కార్మికులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన 26 మంది కార్మికులు సమైక్యాంధ్రకు మద్ధతుగా నిరాహార దీక్ష చేశారు. గంట్యా డ మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. పాతబొబ్బిలిలో బళ్లవేషాలు ప్రదర్శించారు. సాము గరిడీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. తాండ్ర పాపారాయుడు విద్యా సంస్థల విద్యార్థులు తాండ్రపాపారాయుడు వేషధారణలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. రామభద్రపురం మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం జరిగింది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాకపోకలు నిలిచిపోయాయి. సాలూరులో ప్రైవేట్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించగా స్థానిక కోర్టు నుంచి బోసుబొమ్మ జంక్షన్ వరకు న్యాయవాదుల బైక్ ర్యాలీ చేపట్టారు. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, బస్సులను అడ్డుకున్నారు. గరుగుబిల్లి రహదారిపై సమైక్యాంధ్రవాదులు ధర్నా నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేయగా జియ్యమ్మవలస పెదమేరంగి జంక్షన్లో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. -
రాజకీయ కుట్రతోనే రాష్ట్ర విభజన
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయం రాజకీయ కుట్రతో జరిగిందని, దీనిని ఉపసంహరించుకోకుంటే ఢిల్లీ నేతలకు బుద్ధి చెబుతామని సమైక్యాంధ్ర ఉద్యమకారులు హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడదీయడం తగదంటూ పలు సంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఇలా అన్నివర్గాల వారు జిల్లా వ్యాప్తంగా గురువారం ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. సోనియాగాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారికి కర్మకాండలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంద్ర ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయూలని డిమాండ్ చేశారు. = జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాల యం ఎదురుగా, పొట్టిశ్రీరాములు కూడలి వద్ద మానవహారాలు నిర్వహించారు. అక్కడే పలువురు శిరోముండనం చేరుుంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు హనుమంతు సాయిరాం, కిల్లారి నారాయణరావు, శోభారాణి, సాగర్, బాలకృష్ణ, ఎ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రధానరోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణతోపాటు సుమారు 1500 మంది పాల్గొన్నా రు. విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజకీయ కుట్రతోనే రాష్ట్ర విభజనకు పాల్పడ్డారని శ్రీకాకుళం బ్రాహ్మణ సంఘం సభ్యులు ధ్వజమెతారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో కళకళలాడాలని, సమైక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద వారు హోమం నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సంఘం, పలు పార్టీల నేతలు వైఎస్సార్ కూడలి నుంచి ర్యాలీగా డే అండ్ నైట్ కూడలి వద్దకు చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు గుమ్మా నాగరాజు, తెన్నేటి విక్రమశర్మ, శ్రీధర్‌శర్మ, కిరణ్‌శర్మ, ప్రభాకరశర్మ, తెన్నేటి అనిల్‌కుమార్, గంటా శ్రీనివాసశర్మ, ఎస్.రామ్మూర్తి, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ, పార్టీ నేతలు అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, కోరాడ రమేష్, సిరాజుద్దీన్, టీడీపీ నేతలు కింజరాపు రామ్మోహననాయుడు, గుండ అప్పలసూర్యనారాయణ, మాదారపు వెంకటేష్, వివిధ సంఘాల ప్రతినిధులు జామి భీమశంకర్, ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. = ఎచ్చెర్లలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గుంట తులసీరావు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలవారు కలసి చర్చావేదిక నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో జేఏసీ గా ఏర్పడి పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, వైఎస్ఆర్సీపీ నేతలు వరుదు కళ్యాణి, దుప్పల రవీంద్ర, బొడ్డేపల్లి పద్మజ, అంధవరపు సూరిబాబు, కేవీవీ సత్యనారాయణ, టీడీపీ నేతలు కింజరాపు రామ్మోహనరావు, చౌదరి బాబ్జి, లోక్‌సత్తా నేత కొత్తకోట పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. = రాజాంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఐకేపీ స్వయంశక్తి మహిళా సంఘాల సభ్యులు అంబేద్కర్ కూడలి వద్ద ర్యాలీ నిర్వహించారు. సంతకవిటి మండలంలో సోనియాగాంధీ, కేసీఆర్‌ల చిత్రపటాలకు చెప్పులదండ వేసి ఊరేగించా రు. గుళ్లసీతారాంపురంలో కొంతమంది సమైక్యవాదులు శిరోముండనం చేయించుకున్నారు. రోడ్డుమీద గ్రామస్థులు, యువత వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రాజాంలో బంద్నిర్వహించనున్నారు. = నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కూరగాయల వర్తక సంఘం, నాయూబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ లు, మానవహారాలు నిర్వహించారు. అనంత రం సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. = పాలకొండలో అన్ని కళాశాలల విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలతో డివిజన్ కేంద్రం హోరెత్తింది. పోలీస్‌స్టేషన్ జంక్షన్లో న్యాయవాదులు, రాజకీయపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింప చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు. భామినిలో సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. శుక్రవారం నుంచి నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. వీరఘట్టం మండలం వండువ సెంటర్లో విద్యార్థు లు, గ్రామస్తులు సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి దహనం చేశారు. వీరఘట్టం మేజర్ పంచాయతీలో టీడీపీ ఆధ్వర్యంలో బంద్‌ను నిర్వహించి వంటా, వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ సిబ్బంది, రెవెన్యూ, అంగన్వాడీ, స్వయంశక్తి సంఘాలు సంయుక్తంగా ర్యాలీ నిర్వహిం చాయి. సీతంపేటలో స్వయంశక్తి సంఘాల మహిళలు ర్యాలీ చేశారు. = పాతపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేశారు. ఈ దీక్షకు వైఎస్సార్ సీపీ నాయకుడు కలమట వెంకటరమణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్య ఉద్యమానికి కనీసం మద్దతు తెలపకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం భావ్యం కాదన్నారు. అనంతరం మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కనిపించడం లేదని, ఆచూకీ తెలపాలని కోరుతూ పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. = ఆమదాలవలసలో నేతాజీ యువజన సంఘం, ఐకేపీ ఉద్యోగులు ర్యాలీలు జరపగా తిమ్మాపురం వద్ద గ్రామస్తులు రోడ్డును దిగ్బం ధించారు. సరుబుజ్జిలి మండలం షళంత్రిలో రోడ్డుపై వంటావార్పు చేసి భోజనాలు చేశారు. = టెక్కలి మండలం తలగాం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. టెక్కలి పట్టణంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీ లు నిర్వహించి మానవహారాలు చేపట్టారు. = ఇచ్ఛాపురంలో జాతీయ రహదారిపై ఐకేపీ మహిళలు రాస్తారోకో నిర్వహించారు. సోంపేట మండలంలోని కొర్లాం వద్ద జాతీయ రహదారిపై స్వయంశక్తి సంఘాలు రాస్తారోకో నిర్వహించారుు. దీంతో వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయూరుు. = పలాసలో సమైక్యవాదులు కదం తొక్కారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు, ప్రెస్‌క్లబ్ సభ్యులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించారు. ఐకేపీ మహిళలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సా ర్ విగ్రహం నుంచి విద్యార్థులు ర్యాలీ నిర్వహించి కాశీబుగ్గ బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం సోనియా దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి తాడుతో ఉరివేశారు. ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కణితి విశ్వనాథం, పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, పలాస పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావు, వైశ్యరాజు రాజు, కె.పి.నాయుడు, చౌదిరి, విజయ్, హనుమంతు మనోహర్, బమ్మిడి కృష్టారావు, కూన మోహనరావు, తమ్మినాన సుధాకర్, బమ్మిడి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలే సమైక్యాంధ్ర ఉద్యమ సారథులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో సకల జనోద్యమంగా మారింది. అన్నివర్గాల ప్రజలు ఎక్కడిక్కడ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. రాస్తారోకోలు, మానవహారాలతో నిరసన తెలుపుతున్నారు. సోనియాగాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేసి కర్మకాండ నిర్వహిస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు పలు సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ రాష్ర్ట నేత ధర్మాన కృష్ణదాస్ అందరికంటే ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని వివిధ కులాలు, ఉద్యోగ సంఘాలవారు నేరుగా ఉద్యమ బాట పడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వారు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు నేత లు మద్దతు పలుకుతున్నారు. ఉద్యమంలో అగ్రభాగాన ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో సమైక్యాంధ్ర జేఏసీ అగ్రభాగాన ఉంది. గురువారం శ్రీకాకుళం పట్టణంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపింది. ఉద్యమకారులు మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలు, కాలినడకన ర్యాలీలో పాల్గొన్నారు. డే అండ్ నైట్ జంక్షన్లో ఉద్యమకారులు నినాదాలు చేసి నిరసన తెలిపారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. రోడ్డుపై వంటావార్పు చేసి భోజనాలు చేశారు. తెలంగాణ ప్రకటన వెలువడిన రోజు నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. విద్యుత్, జిల్లా పరిషత్, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల ఉద్యోగులు కూడా దీక్షలు చేపట్టారు. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ నేతలు సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతమవుతుండటంతో కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలోని 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నీలకంఠంనాయుడు ఒక్కరే రాజీనామా చేయడంతో మిగిలినవారు కూడా అదే బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావును ధర్మసందేహం ఇంకా వీడినట్లు లేదు. వెంటనే రాజీనామా చేయాలని పార్టీలోని ముఖ్యనాయకులంతా పట్టుబట్టడంతో ఆయన కూడా నేడో రేపో రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజీనామా చేసి ఉద్యమబాట పట్టకుంటే వారి ఇళ్లను ముట్టడించడంతోపాటు ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేసేందుకు సమైక్య వాదులు వ్యూహం రూపొందిస్తున్నారు. ఉద్యమంలో ముందున్న వైఎస్ఆర్ సీపీ సమైక్య ఉద్యమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముందున్నారు. అందరికంటే ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నరసన్నపేటలో జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన పాలు పంచుకుంటున్నారు. సమైక్య ఉద్యమ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల కన్వీనర్ల ఆధ్వర్యం లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్య మం ఈ నెల 12 నుంచి మహోద్యమంగా మారుతుందని నేతలు చెబుతున్నారు. సమ్మెకు పిలుపునిచ్చిన ఎన్జీవోలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ధర్మాన ప్రద్మప్రియతోపాటు అంధవరపు సూరి బాబు, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు. అడపాదడపా కనిపిస్తున్న టీడీపీ నేతలు ఆందోళనల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడక్కడ, అడపాదడపా కనిపిస్తున్నారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో బ్రాహ్మణులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలతోపాటు టీడీపీవారు కూడా పాల్గొన్నారు. టీడీపీ నాయకులు మాటలకే పరిమితమవుతున్నారని, పెద్దగా ఆందోళనల్లో పాల్గొనటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఐక్య ఉద్యమానికి విద్యార్థులు సన్నద్ధం జిల్లాలో ఇకముందు ఐక్యంగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రణాళిక రూపొం దించారు. ఇప్పటివరకు ఎవరికివారు నేరుగా ఆయా పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. ఇకమీదట ఐక్యంగా ఉద్య మ పథంలో నడవాలని నిర్ణయించారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీలో ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. కమిటీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చా వేదికలు ఏర్పాటు చేసి వివిధ పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులతో మాట్లాడించి అందరినీ చైతన్యవంతం చేస్తున్నారు. -
ఫ్యాక్షన్ గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతం
సాక్షి, నరసరావుపేట : జిల్లాలో ఎన్నికలు వాయిదా పడిన 12 పంచాయతీల్లో గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 11, గుంటూరు డివిజన్లో ఒక పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. పల్నాట ప్రాంతంలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో సైతం పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికారులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పల్నాడులోని మొత్తం 11 పంచాయతీల్లో 25,002 ఓటర్లకు 20,786 ఓట్లు పోలయి సగటు పోలింగ్ 83.14 శాతంగా నమోదైంది. ఉదయం 9 గంటలకు 36.6 శాతం,11 గంటలకు 74.5 శాతం నమోదైంది. రొంపిచర్ల మండలం ముత్తనపల్లిలో అత్యధికంగా 96.22శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంలో 32.16 శాతం నమోదైంది. గత నెల 31న జరిగిన ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎత్తుకెళ్లి బావిలో పడవేసిన విషయం విదితమే. దీంతో ఈ ఐదు వార్డులకు ఎన్నికలు వాయిదా వేసిన జిల్లా కలెక్టర్ గురువారం తిరిగి ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. కేవలం టీడీపీ మద్దతుదారులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనడంతో ఆ గ్రామ పంచాయతీ టీడీపీకి దక్కింది. ఫ్యాక్షన్ గ్రామాలుగా ముద్ర పడిన రొంపిచర్లలో 91.16 శాతం, నాదెండ్ల మండలం తూబాడులో 92.5 శాతం, వెల్దుర్తి మండలం కండ్లకుంటలో 90.3 శాతం, శిరిగిరిపాడులో 85 శాతం పోలింగ్ నమోదైంది. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో చిన్నపాటి సంఘటన కూడా లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ హవా.: పల్నాడులో ఎన్నికలు జరిగిన 11 పంచాయతీల్లో రొంపిచర్ల, ఇక్కుర్రు, తూబాడు, కండ్లకుంట, ఊడిజెర్ల, గోగులపాడులలో వైఎస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. పెదరెడ్డిపాలెం,శిరిగిరిపాడు గ్రామాల్లో తెలుగుదేశం బలపరచిన అభ్యర్థులు, అందుగులపాడు,ముత్తనపల్లిలలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. సారంగపల్లి అగ్రహారంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. గుంటూరు డివిజన్లోని గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. -
పార్టీలన్నీ కలసి ‘సమైక్య రాజకీయ జేఏసీ’గా ఆవిర్భావం
సాక్షి, గుంటూరు : సమైక్యాంధ్ర ఉద్యమ వేడి రాజుకుంది. రాష్ట్ర పరిరక్షణే ధ్యేయంగా ఐక్య ఉద్యమానికి పూనుకున్నారు. రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, చిరువ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్మికులు, కూలీలు, లాయర్లు, వైద్యులు, వృద్ధులు, విద్యార్థులు ఇలా అంతా సమైక్యాంధ్ర సాధనకు పోరుబాటన సాగుతున్నారు. భారీ ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలతో సమైక్య నినాదాన్ని జిల్లా అంతటా మార్మోగిస్తున్నారు. యూపీఏ అధినేత్రి సోనియగాంధీ నాయకత్వాన కాంగ్రెస్ తీసుకున్న తెలంగాణ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్వత్రా కదం తొక్కుతున్నారు. సమైక్యాంధ్రను పరిరక్షించుకునే పోరాటంలో అలుపెరగక శ్రమిస్తున్నారు. ఇక నుంచి జిల్లాలో జరిగే సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ పార్టీలు తమ జెండాల్ని, అజెండాల్ని పక్కనబెట్టి ఒకే గొడుగు కింద పనిచేయాలని నిర్ణయించారు. అంతా ‘సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ’ వేదికగా ఉద్యమించాలని నిర్ణయించారు. రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు నేతృత్వాన గురువారం గుంటూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన సమైక్య ఉద్యమంలో భాగంగా గురువారం గుంటూరులో ఏఈఎల్సీ ఆధ్వర్యాన క్రైస్తవులు, పాస్టర్లు స్థానిక లాడ్జి సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు భారీ ర్యాలీ చేశారు. నరసరావుపేట మల్లమ్మ సెంటర్లో ముస్లింలు మానవహారం నిర్వహించారు. గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల, బాపట్లలో ఆర్టీసీ డిపోల ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విద్యార్థుల రక్తదానం... తెనాలిలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. సత్తెనపల్లిలో కృష్ణవేణి, ఎస్వీ ఆర్ డిగ్రీ కళాశాల, అన్నం గురవమ్మ కృష్ణమూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గుంటూరు - మాచర్ల ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి సోనియా, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినదిస్తూ కబడ్డీ ఆడి తమ నిరసన తెలియజేశారు. రక్షా యూత్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి తాలూకా సెంటర్లో ఆర్జీఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల రెండోరోజు దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రారంభించారు. అక్కడే జీపులు, కార్ల ర్యాలీ జరిగింది. వినుకొండలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. వేమూరులో వ్యవసాయశాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి, ఆందోళన చేశారు. బాపట్లలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఖాజీపాలెంలో బంద్ జరిగింది. బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పాతబస్టాండ్ సెంటర్లో కళాజాత కార్యక్రమంలో వినూత్నంగా నిరసన తెలియజేస్తూ ర్యాలీ చేశారు. ప్రైవేటు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో... సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులుతో పాటు వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, రాతంశెట్టి రామాంజనేయులు, క్రోసూరి వెంకట్, కసుకుర్తి హనుమంతరావు, పోలూరి వెంకటరెడ్డి, ఫ్రొఫెసర్ ఎన్. శామ్యూల్ తదితర నేతలు గుంటూరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూసివేయించారు. ప్రైవేటు ఎలక్ట్రిక్ సౌండ్స్ అసోసియేషన్, ఫొటోగ్రాఫర్స్ సంఘం, ది గుంటూరు జిల్లా ఇంజినీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ తదితర సంఘాల నేతృత్వంలో భారీగా నిరసన కార్యక్రమా లు జరిగాయి. తాడికొండలో రైతు సమాఖ్య, లాంలో చలపతి కళాశాల విద్యార్థులు, అమరావతిలో విద్యార్థి జేఏసీ రాస్తారోకోలు చేశారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మిక యూనియన్లు కార్పొరేషన్ ఎదుట ధర్నా, డప్పు వాయిద్యాలతో నృత్య ప్రదర్శన, కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలో శుక్ర,శనివారాల్లో శాంతి యుతంగా నిరసన తెలిపే కార్యక్రమాల్ని మాత్రమే నిర్వహించాలని సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్. శామ్యూల్ పిలుపునిచ్చారు. -
రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక ఆగుతున్న గుండెలు
సాక్షి, ఏలూరు: రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతుంటే తెలుగువారంతా విలవిల్లాడుతున్నారు. రాష్ట్రం ముక్కలవుతుంటే తట్టుకోలేక కొందరి గుండెలు ఆగిపోతున్నాయి. విడిపోయి బతకలేమని, తమ ప్రాణ త్యాగంతోనైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమంటూ మరికొందరు ఆత్మ బలిదానం చేస్తున్నారు. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశంతో.. కన్నీళ్ల నుంచి జనించిన తెగింపుతో.. జై సమైక్యాంధ్ర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జనం గొంతెత్తి నినదిస్తున్నారు. ఎన్ని రోజులైనా, మరెన్ని కష్టాలెదురైనా విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో నడుస్తున్న సమైక్య ఉద్యమ ఆందోళనలు బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. అన్నివర్గాల ప్రజలు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు, విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, పీసీసీ సభ్యుడు కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఒకే రోజు నలుగురు మృతి.. పెయింటర్ ఆత్మబలిదానం రాష్ట్ర విభజనను తట్టుకోలేక బుధవారం ఒక్కరోజే ఐదుగురు గుండెపోటుతో మరణించగా ఓ పెరుుంటర్ ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. ఇరగవరం మండలం కాకిలేరులో దిగుమర్తి రాజీవ్‌గాంధీ (24)అనే పెయింటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తిలి మండలం గుమ్మంపాడులో వినుకొండ వెంకటసుబ్బమ్మ అనే మహిళ (54), ఉండి గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీను (31), పెంటపాడు మండలం రామచంద్రపురానికి చెందిన మేనేటి కోటేశ్వరరావు(61), ఉంగుటూరు మండలం నారాయణపురంలో తాపీ కార్మికుడు కర్రి నాగరాజు(35) గుండెపోటు గురైతో మృతిచెందారు. ‘అందాల రాక్షసివే.. గుండెల్లో గుచ్చావే’ ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో సోనియాగాంధీని రాక్షసిగాను, కేసీఆర్‌ను మహిళగానూ చిత్రీకరించిన ఫ్లెక్సీలతో ప్రదర్శనలు చేశారు. ఆ ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. కేసీఆర్, సోనియాల దిష్టి బొమ్మలను దహనం చేశారు.వైఎస్సార్ సీపీ నాయకులు గుడిదేసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. జిల్లాలోని విద్యుత్ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాయి. కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిన్నారులు భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, శివాజీ వేషధారణలతో ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు. రైతాంగ సమాఖ్య ర్యాలీ భారీ నిర్వహంచింది. తెలుగుతల్లి చిత్ర పటం వద్ద సావిత్రి భూదేవ సేవా సంఘం 108 కొబ్బరి కాయలు కొట్టి నిరసన తెలిపింది. ఫైర్‌స్టేషన్ సెంటర్లో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు, వసంతమహల్ సెంట ర్లో గాయత్రి పురోహితుల సంఘం, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ది పశ్చిమగోదావరి జిల్లా అధీకృత ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన బైక్‌లు, ట్రాక్టర్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించగా, లారీలు, టాటా మ్యాజిక్, జీప్‌లు, కార్ల సంఘాలు కూడా ర్యాలీ నిర్వహించా యి. దీంతో ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి పాతబస్టాండ్ వరకు రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. వంటా వార్పులు.. నిరసన దీక్షలు పాలకొల్లు నియోజకవర్గంలో అనేకచోట్ల వంటావార్పు నిర్వహించారు. యలమంచిలి మండలం చించినాడలో రిలే నిరహారదీక్షలు ప్రారంభించారు. తణుకులో కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు వాహనాన్ని అడ్డుకుని వైఎస్సార్సీపీ నాయకులు ఘెరావ్ చేశారు. ఆచంట, వ ల్లూరు, పెనుగొండ, మార్టేరు సెంటర్లలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆచంటలో జేఏసీ నాయకులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో మంత్రి పితానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమైక్యవాదులతో మంత్రి తనయుడు వెంకట్ వాగ్వివాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడిలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. కొవ్వూరు సంస్కృత పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పటం ఆకారంలో కూర్చుని సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు. బంద్ విజయవంతం నిడదవోలు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. గణేష్ చౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు మూడవ రోజుకు చేరుకన్నాయి. కైకరంలో జాతీయ రహదారిపై వికలాంగులు రాస్తారోకో చేశారు. భీమవరం ప్రకాశం చౌక్ నిరసనలతో హోరెత్తింది. ఉండి మండలం మహదేవపట్నం, కాళ్ల మండలం పెద అమిరంలో రహదారులను దిగ్బంధించి రాస్తారోకో నిర్వహించారు. సోనియా, కేసీఆర్‌లకు పిండ ప్రదానం చేశారు. ఆకివీడులో ఆందోళనకారులు రిలే నిరాహార దీక్షలతోపాటు రాష్ట్రానికి, దేశానికి పట్టిన కీడు పోవాలని వేద పండితులతో అగ్ని హోమాన్ని నిర్వహించారు. -
సమైక్యాంధ్రకు ‘పశ్చిమ’లో మిన్నంటుతున్న నిరసనలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వేలాది మందితో ఉప్పు సత్యాగ్రహం.. వెల్లువెత్తిన విదేశీ వస్త్ర బహిష్కరణ.. సహాయ నిరాకరణ.. పన్నుల చెల్లింపు నిరాకరణ.. ఇవన్నీ దేశ స్వాత్రంత్య ఉద్యమం నాటి ఘట్టాలు. 70 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనల్ని అప్పటి తరం వాళ్లు చెబుతున్నా.. ఆ ఘట్టాలకు సంబంధించిన వివరాలను చదువుతున్నా శరీరం రోమాంఛితమవుతుంది. ‘అబ్బా.. అప్పట్లో ఉద్యమాలు అలా జరిగేవా.. అప్పటి ప్రజలు అంతటి పోరాట పటిమ కలిగి ఉండేవారా.. అలాంటి ఆందోళనలు ఈ తరాల వారికి సాధ్యమేనా.. వారి నిబద్ధత ప్రస్తుత సమాజానికి సాధ్యమేనా’ అనే ప్రశ్నలెన్నో ఉద్భవిస్తాయి. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం జిల్లాలో వెల్లువెత్తుతున్న ఉద్యమాలు ఆ ప్రశ్నలను పటాపంచలు చేస్తున్నాయి. పైగా ఆ కాలంలో మహా నాయకులెందరో ముందుండి చైతన్యం రగిలించారు. స్వాతంత్య్ర ఉద్యమాల్ని ముందుకు నడిపించారు. ఇప్పుడు అలాంటి నాయకులెవరూ లేరు. కానీ.. సామాన్య జనమే ఉద్యమపథంలో ఉరకలు వేస్తున్నారు. భావోద్వేగాలు రగిలినప్పుడు ఉద్యమాలు వాటికవే పుడతాయనడానికి సమైక్యాంధ్ర ఉద్యమ పోరాటం ఓ గొప్ప ఉదాహరణగా కనిపిస్తోంది. ఈ అభిప్రాయూన్ని వ్యక్తం చేస్తున్నది సాదాసీదా జనం కాదు. సాక్షాత్తు మేధావులు చెబుతున్న మాట ఇది. ఖాకీ కవాతుల్ని తోసిరాజని... రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు పోలీసులు చేసిన కవాతులు.. పారామిలటరీ బలగాల హడావుడి సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో చేష్టలుడిగి చూస్తున్నారుు. జిల్లా చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా, ఎవరూ ఊహించని స్థాయిలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ విస్తరిస్తోంది. తొమ్మిది రోజుల క్రితం రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది మొదలు ఇప్పటివరకూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆందోళనలు నిరంతరాయంగా మిన్నంటుతూనే ఉన్నాయి. ఎవరి ప్రోద్బలం లేకుండానే.. ఎవరూ నాయకత్వం వహించకుండానే ప్రజలు స్వచ్ఛం దంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తుండటం మేధావుల్ని సైతం ఆశ్చర్చ చకితుల్ని చేస్తోంది. ఇక్కడి ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా రాష్ట్రాన్ని విడగొడుతున్నారనే సరికి ఒక్కసారిగా అన్ని వర్గాలవారు తమంతట తాముగా రోడ్లపైకి వస్తుం డటం ఆశ్చర్యపరుస్తోంది. విభజన ప్రకటనకు ముందు రోడ్లపై పోలీసులు చేసిన కవాతులు, పారామిలటరీ బలగాల హడావుడి ఉద్యమం ధాటికి కనుమరుగయ్యూరుు. పోలీ సులు కూడా ఏంచేయలేక అచేతనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వినాయక చవితి, దసరా ఉత్సవాలకు ప్రతి వీధి నుంచి నిమజ్జనాల ఊరేగింపులు రోడ్లపైకి వచ్చినట్లుగా ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నా రుు. ఉద్యమకారులు ప్రధాన కూడళ్లకు చేరుకుంటున్నారు. పల్లెలు సైతం తొలి రోజునుంచే ఉద్యమబాట పట్టారుు. వినూత్నానికే వినూత్నం ఉద్యమం అంటే ఒక ప్రదర్శన.. ఒక ధర్నా.. ఒక బహిరంగ సభ.. రాస్తారోకో వంటి పద్ధతులు మాత్రమే ఉంటాయని అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ వినూత్న నిరసనలూ చూస్తుంటాం. కానీ సమైక్య ఉద్యమంలో చేస్తున్నన్ని వినూత్న ఆందోళనలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న పెద్దలు చెబుతున్నారు. దిష్టిబొమ్మల దగ్ధాలు, వంటా వార్పు నుంచి పిండ ప్రదానాలు, హోమాలు, శవయాత్రలు, మానవహారాలతోపాటు రోడ్లపై ఆటలు ఆడి తమ నిరసన తెలుపుతున్నారు. తొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమంలో పాల్గొనని రంగం లేదంటే నమ్మక తప్పదు. ప్రతి అసోసియేషన్ సమైక్య ఉద్యమంలో పాల్గొనడం తమ బాధ్యతగా భావిస్తోంది. వ్యక్తి నుంచి సంఘం వరకూ.. యువకులు, విద్యార్థులు ఉద్యమానికి కొండంత అండగా నిలబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో కార్యరంగంలోకి దిగారు. రైతులు, కార్మికులతోపాటు రిక్షా కార్మికులు, తోపుడు బళ్లు, ఇస్త్రీ బళ్లు, జట్టు కూలీలు, మేదరులు ఒకటేమిటి చివరకు హిజ్రాలు సైతం సమైక్య ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వ్యాపారులు షాపులు మూసివేసి షట్టర్లకు సమైక్యాంధ్రకు మద్దతుగా ఫ్లెక్సీలు వేలాడదీశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఏలూరు ఆర్‌ఆర్‌పేట మొత్తం నిర్మానుష్యంగా మారి ప్రతి షాపు ఎదుటా ఈ ఫెక్ల్సీలే కనబడుతున్నాయి. తోపుడు బండిపై పళ్లు అమ్ముకునే వ్యక్తి సైతం సమైక్యాంధ్ర నినాదాన్ని ఒక అట్టముక్కపై రాసి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడంటే ఉద్యమం ఎంత లోతుల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. కార్లు, ఆటోలు, రిక్షాలపైనా సమైక్యాంధ్ర స్టిక్కర్లే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ జేఏసీలు ప్రారంభంలో ఎవరికివారే విడిగా చేసిన ఉద్యమాలు రెండు మూడు రోజుల్లోనే ఒకే గొడుకు కిందకు వచ్చాయి. పట్టణాల్లో జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఏలూరులో 60కిపైగా సంఘాలున్న జేఏసీ సమావేశమై వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది. తాడేపల్లిగూడెం, భీమవరం జేఏసీలు తమ కార్యక్రమాలను ప్రకటించాయి. మిగిలిన పట్టణాలతోపాటు చాలా మండల కేంద్రాల్లోనూ జేఏసీలు ఉద్యమాలకు పకడ్బందీగా రూపకల్పన చేసి అమలు చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు కూడా తమ గ్రామాల్లో ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. స్వాతంత్య్రోద్యమం ఎలా జరిగిందో తాము చూడలేదు కానీ.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం అందుకు తీసిపోదని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యమ కేంద్రాలుగా భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం జిల్లాలో సమైక్య ఉద్యమానికి ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ ఉదయం నుంచి రాత్రి వరకూ ఆందోళనలతో హోరెత్తుతోంది. ప్రతిరోజూ ఈ సెంటర్లో 12 నుంచి 15 వరకూ ఆందోళనలు జరుగుతున్నాయి. లారీ, ట్యాక్సీ, జీపు, ట్రాక్టర్ల ఓనర్లు, వర్కర్లు, కళాకారులు, రైతాంగ సమాఖ్య, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, విద్యుత్, హాస్టల్ ఉద్యోగులతోపాటు ఇతర రంగాలకు చెందిన 23 సంఘాలు బుధవారం ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఆందోళనలు జరపాయంటే ఉద్యమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భీమవరం ప్రకాశం చౌక్‌లోనూ నిత్యం 15కిపైగా ఆందోళనలు జరుగుతున్నాయి. సమైక్య నినాదంతో ఈ సెంటర్ దద్ధరిల్లుతోంది. తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో కూడా ప్రతిరోజూ పదికిపైగా ఆందోళనలు నమోదవుతున్నాయి. ఇక మిగిలిన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ నిరసనలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. మారుమూల గ్రామాలు సైతం సమైక్యాంధ్ర కోసం పోరుబాట పట్టాయి.