గుంటూరులో సమైక్యాంధ్ర జేఏసీ ధర్నా
Published Thu, Aug 8 2013 2:41 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
పాఠశాలలో ఆడుతూ పాడుతూ అక్షరాలు నేర్వాల్సిన చిన్నారి రోడ్డుపైకి వచ్చి సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుంది. పాఠాల్లో చదువుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నారన్న ఆందోళన నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల్లో కనిపించింది. హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుని ఇన్నాళ్లూ అభివృద్ధిపై కన్న కలల్ని యూపీఏ ఛిద్రం చేసిందని సీనియర్ సిటిజన్‌లు ఆవేదన చెందుతున్నారు. ఇదే అభిప్రాయాలతో వైద్యులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు ఇలా అందరూ సమైక్యాంధ్ర విభజనపై కదం తొక్కుతున్నారు.. రాజకీయ సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఐక్యంగా అడుగులేస్తుండగా, ప్రజాసంఘాలు తమ ఉద్యమ పంధాను వీడనాడకుండా నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
సాక్షి, గుంటూరు : సమైక్య ఉద్యమ ఆందోళనలతో బుధవారం కూడా జిల్లా అట్టుడికింది. మున్సిపల్ ఉద్యోగుల పెన్‌డౌన్ సమ్మె కొనసాగుతుంది. తాడేపల్లిలో మున్సిపల్ ఉద్యోగులు శిరోముండన చేయించుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు రెండోరోజుకు చేరాయి. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకర్లు, పారిశుద్ధ్య ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా తరువాత ఆటాపాటా కార్యక్రమం నిర్వహించారు.
విజ్ఞాన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ నుంచి హిందూకళాశాల సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్, అంబేద్కర్ సెంటర్‌లో రాస్తారోకో, ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి శంకర్‌విలాస్ సెంటర్‌లో ధర్నా చేస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకుని అరండల్‌పేట స్టేషన్‌కు తరలించారు. ఎంపీ రాయపాటి యువసేన కార్యకర్తలు నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూయించారు.
గుంటూరులో సీమాంధ్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ సమావేశం..
విభజనకు నిరసనగా సీమాంధ్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ బుధవారం గుంటూరులోని ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో సమావేశమైంది. మొత్తం 13 జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఆ సంస్థ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని నిర్ణయించారు. ఇక ఏపీఎన్జీవో సంఘం పిలుపుమేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది విధులు బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాపరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరు మిర్చి యార్డులో కొనుగోళ్లు నిలిపివేసిన కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లు, హమాలీలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. హిందూ కళాశాల సెంటర్‌లో నవోదయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లక విజయరాజు ఆమరణ నిరాహార దీక్షబూనారు. తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు తోపుడుబండ్లతో ర్యాలీ జరిగింది.
టీడీపీ డ్రామాలాడుతోంది.. ఎమ్మెల్యే మస్తాన్‌వలి
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి తన అనుచరులతో హిందూకళాశాల సెంటర్‌లోని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద కొంతసేపు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ విభజనకు అనుకూలంగా అందజేసిన లేఖను బహిరంగపరిచారు. సమైక్య ఉద్యమంలో టీడీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు.
దీక్షా శిబిరాన్ని సందర్శించిన మర్రి రాజశేఖర్...
చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ సందర్శించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమ ర్యాలీ జరిగింది. సత్తెనపల్లి, పెదకూరపాడు, మంగళగిరిలలో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ, జిల్లావ్యాపార సంఘాల ఆధ్వర్యంలో యూపీఏ అధినేత్రి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెనాలిలో జర్నలిస్టు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహూల్‌గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లకు సమాధులు కట్టారు. వారి చిత్ర పటాలను దహనం చేశారు. రేపల్లెలో వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ చేపట్టాయి. కోర్టు ఉద్యోగులు విధులు బహిష్కరించారు.
Advertisement
Advertisement