ఏ ప్రాంత విద్యుత్ ఆ ప్రాంతానికేనా?
రాష్ట్ర విభజన అనంతరం ఏ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఆ ప్రాంతానికే సరఫరా కానుందా? ఈ ప్రశ్నకు అవుననే జవాబు లభిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం కూడా జెన్‌కోకు చెందిన ప్లాంట్లతో డిస్కంలు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కొనసాగుతాయని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో స్పష్టం చేసింది.
అయితే ఈ పీపీఏలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదముద్ర వేయాల్సి ఉండగా ఇప్పటివరకు పడలేదు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో కోడ్ దృష్ట్యా పీపీఏలకు ఇప్పట్లో ఈఆర్‌సీ ఆమోదముద్ర వేసే అవకాశం కూడా లేదు. దీంతో రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడి విద్యుత్ అక్కడే సరఫరా అవుతుందని, ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందనే చర్చ ఇంధనశాఖలో జోరుగా సాగుతోంది.
తాజాగా పీపీఏలు కుదిరినా..
రాష్ర్టంలో జెన్‌కోకు థర్మల్ (బొగ్గుతో నడిచే) ప్లాంట్లతో పాటు జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. జెన్‌కోకు చెందిన ప్రతి ప్లాంటుతో రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పతి 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుంటాయి. ఈ విధంగా కుదుర్చుకున్న పీపీఏల కాలపరిమితి 2002లో కొన్ని ప్లాంట్లకు, 2010లో మరికొన్ని ప్లాంట్లకు ముగిసింది. దీంతో తాజాగా పీపీఏలు జరిగారుు. అయితే వీటికి అధికారికంగా ఈఆర్‌సీ ఆమోదముద్ర పడలేదు. మొత్తం 8,924.86 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వివిధ జెన్‌కో విద్యుత్ ప్లాంట్ల పీపీఏలకు ఇప్పటివరకు ఆమోదం లభించలేదు.
రాష్ట్ర విభజన జరిగే జూన్ 2వ తేదీలోగా ఈఆర్‌సీ ఆమోదం లభించే పరిస్థితి లేదని ఇంధనశాఖ వర్గాలంటున్నారుు. ప్రస్తుత పీపీఏల ప్రకారం తెలంగాణలోని డిస్కంలు సీపీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌కు 61.93 శాతం మేరకు విద్యుత్ సరఫరా అవుతుంది. మిగతాది ఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌కు సరఫరా అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2,282.5 మెగావాట్లు ఉండగా, ఆంధ్రా ప్రాంతంలో 2,810 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో జల విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2,541.8 మెగావాట్లు కాగా, ఆంధ్రా ప్రాంతంలో మాత్రం 1,287.6 మెగావాట్లు మాత్రమే. తెలంగాణలో జల విద్యుత్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కేవలం 2-3 నెలలు మాత్రమే పూర్తిస్థాయిలో ఉంటుంది.
అది కూడా వర్షాలు పడితేనే. అందువల్ల ఆయూ ప్రాంతాల్లో ప్లాంట్లు ఉత్ప త్తి చేసే విద్యుత్ పీపీఏలు లేని కారణంగా ఎక్కడిదక్కడే సరఫరా అరుుతే తెలంగాణకు విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిస్కంల వారీగా కేటాయింపు శాతాలు..
డిస్కం కోటా (శాతాల్లో)
సీపీడీసీఎల్ 46.06
ఎన్‌పీడీసీఎల్ 15.87
ఎస్‌పీడీసీఎల్ 22.27
ఈపీడీసీఎల్ 15.80
ఇవీ ఆమోదముద్ర పడని కొన్ని ప్లాంట్లు
ప్లాంటు పేరు సామర్థ్యం (మెగావాట్లలో)
వీటీపీఎస్, విజయవాడ 500
కేటీపీపీ, వరంగల్ 500
కొత్తగూడెం స్టేజ్-6, ఖమ్మం 500
ఆర్‌టీపీపీ-వైఎస్సార్ జిల్లా 630