- 122 ఫీడర్లలో బ్రేక్‌డౌన్
- పలుచోట్ల ముందస్తు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్
వర్షాల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. అనేక చోట్ల సరఫరాకు తీవ్ర ఆంటకం ఏర్పడింది. కొన్ని చోట్ల ముందస్తుగా నిలిపివేశారు. అన్ని జిల్లాల్లోనూ డిమాండ్ గణనీయంగా తగ్గింది. దీంతో ఏపీ జెన్‌కో పరిధిలోని కొన్ని థర్మల్ యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేశారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 149 మిలియన్ యూనిట్లకు చేరింది. గత రెండు రోజులుగా ఇది 125 నుంచి 130 మిలియన్ యూనిట్ల మేర ఉంటోంది. బుధవారం డిమాండ్ ఏకంగా 118 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. కృష్ణపట్నంలో ఒక యూనిట్‌నే గా నడుపుతున్నారు.
నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్లలో, ఆర్టీపీపీలో ఒక యూనిట్‌లో ఉత్పత్తి ఆపివేశారు. వర్షాలు తగ్గినా ఇప్పటికిప్పుడు డిమాండ్ పెరిగే అవకాశం లేదని అధికారవర్గాలు అంటున్నాయి. పట్టణాలు, నగరాల్లో పెద్దగా సరఫరాకు ఇబ్బందులు లేకున్నా, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల వరకూ వరద నీరు వచ్చే ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ తీగలు కిందకు వంగి, పోల్స్ కూలిపోయే ప్రమాదం ఉన్న చోట్ల కూడా సరఫరా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. బుధవారం సాయంత్రానికి 122 ఫీడర్ల పరిధిలో బ్రేక్‌డౌన్స్ నమోదయ్యాయి.
ఫలితంగా దాదాపు 2.44 లక్షల విద్యుత్ వినియోగదారులకు సరఫరాలో ఆంటకం ఏర్పడింది. ఈ ప్రభావం తూర్పుగోదావరి, విశాఖ, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా కన్పిస్తోంది. నెల్లూరు జిల్లాలో దాదాపు 120 గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆపివేశారు. ఇదిలా ఉంటే, దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్ళను కూడా 50 శాతం మేర తాత్కాలికంగా తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పవన విద్యుత్ 50 మెగావాట్ల వరకూ పెరిగినట్టు అధికారులు తెలిపారు. వరదల తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.