హైదరాబాద్‌ను వీడని జడివాన
లోతట్టు ప్రాంతాలు జలమయం.. జంట జలాశయాలకు ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో వరుసగా ఐదో రోజూ కురిసిన భారీ వర్షంతో గ్రేటర్ హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. జన జీవనం స్తంభించింది. గోతుల మయంగా మారిన రహదారులపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. నాలాలు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో పలు బస్తీల వాసులు ఇబ్బంది పడ్డారు. నాగోల్ ఓపెన్ నాలాలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు జారిపడి క్రాంతికుమార్ (27) అనే యువకుడు గల్లంతయ్యాడు.
నేరేడ్‌మెట్ రామకృష్ణా నగర్‌లో కృష్ణరాజన్ (40) అనే వ్యక్తి ఇంట్లోకి చేరిన వర్షపు నీటిలో జారిపడి ఊపిరాడక మృతి చెందారు. మెట్టుగూడలో ఓ పాత ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొత్తపేట, చైతన్యపురి ప్రాంతాల్లో విద్యుత్ స్తంభం, తీగలు తెగిపడడంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లలోకి నీరు వచ్చి చేరుతోంది. గురువారం గండిపేటలో ఐదడుగులు, హిమాయత్‌సాగర్‌లో మూడు అడుగుల నీటి మట్టం పెరిగినట్లు జలమండలి అధికారులు తెలిపారు.