ఆధ్యాత్మిక నగరం.. ఇక విద్యాకేంద్రం
- తిరుపతిలో ఐఐటీ, సెంట్రల్ వర్సిటీ, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
- మూడు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు కనీసం వెయ్యి ఎకరాల భూమి అవసరం
- భూమిని అన్వేషించాలని కలెక్టర్‌ను ఆదేశించిన విద్యాశాఖ మంత్రి గంటా!
ప్రపంచ చిత్రపటంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రకాశిస్తున్న తిరుపతి ఇక విద్యా కేంద్రంగానూ విరాజిల్లనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతిలో జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుంది. తిరుపతి పరిసర ప్రాంతా ల్లో ప్రతిష్టాత్మక ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), సెంట్రల్ వ ర్సిటీ(కేంద్రీయ విశ్వవిద్యాలయం), ఐఐఎస్‌ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) సంస్థలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్‌లో ప్రకటించారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్యాంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధన కేంద్రాలు తెలంగాణలోనే నెలకొల్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జాతీయ విద్య, పరిశోధన కేంద్రాలను సీమాంధ్రలోనూ ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత అప్పటి కేంద్ర మంత్రి జైరాం రమేష్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఐఐటీ, సెంట్రల్ వర్సిటీ, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ మేరకు విభజన బిల్లులో కూడా పొందుపరిచారు. హైదరాబాద్‌లో సెంట్రల్ వర్సిటీ, ఐఐటీని మెదక్ జిల్లా దోమ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో అప్పట్లో ఏర్పాటు చేశారు. ఐఐఎస్‌ఈఆర్‌ను ఏర్పాటుచేయకపోవడం గమనార్హం. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకుంది.
తిరుపతిలో ఐఐటీ, సెంట్రల్ వర్సిటీ, ఐఐఎస్‌ఈఆర్‌ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఆ మూడు జాతీయ విద్య, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని అన్వేషించి.. ఈనెల 20లోగా నివేదిక పంపాలని కలెక్టర్ రాంగోపాల్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
భూ సేకరణలో అధికార యంత్రాంగం
దేవదేవుడు వేంకటేశ్వరుడు కొలువైన తిరుపతికి ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుంది. శ్రీవారు వెలసిన జిల్లాలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ వర్సిటీ, కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం నెలకొల్పారు. తిరుపతిలో చీనీ, నిమ్మ, వరి, చెరకు పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేశారు.
ఇక కొత్తగా మూడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అయితే వీటి ఏర్పాటుకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు లేవు. తుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, చంద్రగిరి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూములు లేవు. ఆ ప్రాంతాల్లో డీకేటీ భూములు మాత్రమే ఉన్నాయి.
ఆ భూములను రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇదే అంశంపై కలెక్టర్ రాంగోపాల్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ఐఐటీకి 400 ఎకరాలు, సెంట్రల్ వర్సిటీకి 400 ఎకరాలు, ఐఐఎస్‌ఈఆర్‌కు 200 ఎకరాల భూమి అవసరమని చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవన్నారు. ఏర్పేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో డీకేటీ భూములను సర్వే చేస్తున్నామని.. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వివరించారు.