మూడుకు చేరిన ఉద్యమ మృతుల సంఖ్య
Published Wed, Aug 7 2013 3:30 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
బలిజిపేట, న్యూస్‌లైన్:రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సాగుతున్న యజ్ఞంలో మరో గుండె సమిధ అయింది. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో గులిపల్లి యుగంధర్ అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో జిల్లాలో సమైక్యాంధ్ర కోసం మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. జిల్లా ప్రజలు విభజన వార్తను తట్టుకోలేకపోతున్నారు. ఒకవైపు బాధను భరి స్తూ, మరో వైపు పోరు బాటలో సాగుతున్న పలువురి గుండెలు అలిసిపోతున్నాయి...
విభజన తప్పదేమోనన్న బెంగతో అలిసిన గుండెలు ఆగిపోతున్నాయి. మరికొందరు ఆత్మ బలిదానాలకు సిద్ధమవుతున్నారు. గంట్యాడ మండలం తాటిపూడి గ్రామానికి చెందిన హోంగార్డ్ తమటపు శ్రీనివాసరావు విభజన ప్రకటన వెలువడిన తరువాత గత మంగళవారం ఆత్మబలిదానం చేసుకున్నారు. అదేరోజు పలువురు వికలాంగులు ఆత్మహత్యాయత్నం చేశారు. జామిలోని బీసీ కాలనీకి చెందిన గొర్లె ఎర్నాయుడు అనే యువకుడు తీవ్ర మనస్థాపంతో ఆదివారం మృతి చెందాడు. ఇలా రోజురోజుకూ మృతుల సంఖ్య పెరగడంతో జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఊరిపి పోయే వరకూ ఆగని పోరు....
పోరుబాటలో ఉండగానే అతని ఊపిరి ఆగింది. ఆందోళన నిర్వహిస్తున్న చోటే గాంధీ విగ్రహం సాక్షిగా ఉద్యమం కోసం, రాష్ట్రప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. సమైక్య రాష్ట్రం కోసం నినాదాలు చేస్తూ బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో గులిపల్లి యుగంధర్(55) అనే రైతు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తమ ప్రయత్నాలు వృథా అవుతాయేమోనని, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసేస్తారేమోనన్న బెంగతో ఆ గుండె ఆగిపోయింది. యుగంధర్ గతంలో కూడా పలు ఆందోళనల్లో చురుకుగా పాల్గొనేవారు.
పెళ్లింట చావుబాజా
మంగళవాయిద్యాలు వినిపించవలసిన చోట చావుబాజా మోగింది. ఈ నెల 14న రెండో కుమార్తె వివాహం చేసేం దుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ ఎంతో సందడిగా ఉన్న ఆ ఇల్లు శోకసంద్రంగా మారింది. ఒక వైపు ఆ పనుల్లో తనమునకలై ఉంటూనే వారం రోజులుగా ఆయన క్రమం తప్పకుండా ఆందోళనలో పాల్గొంటూ, దీని కోసం అందర్నీ సమాయత్తంచేస్తున్నారు. పెదపెంకి గ్రామంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకుడు ఈర్ల సంజీవినాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంగళవారం బస్టాండ్‌లో రాస్తారాకో, గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ ఆందోళనలో గ్రామానికి చెందిన గులిపల్లి యుగంధర్ రోజూలాగే పాల్గొన్నారు. నినాదాలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
అందరూ దగ్గరకు వచ్చి ఏమైందోనని చూసినలోపే ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో ఉద్యమంలో పాల్గొన్నవారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె స్వాతికి ఈ నెల 14న పెళ్లి జరగనుంది. ఈ సమయంలో కుటుంబం పెద్దదిక్కు పోవడంతో వారందరూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ గతేంకావాలని వారు గుండెలు బాదుకుంటున్నారు. యుగంధర్ మృతిపట్ల గ్రామానికి చెందిన సర్పంచ్ గులిపల్లి చిన్నమ్మడు, పెద్దలు గులిపల్లి చిరంజీవులు, గులిపల్లి అప్పలనాయుడు, కాశీనాయుడు, ఉపాధ్యాయులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement