అల్లరిమూకలపై పోలీసుల దృష్టి
Published Fri, Aug 9 2013 2:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
బొబ్బిలి, న్యూస్‌లైన్: బొబ్బిలి పట్టణంలో బుధవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన అల్లరి మూకలపై పోలీసులు దృష్టి సారించారు. బాడంగి మండలం గదబవలస గ్రామానికి చెందిన వాసిరెడ్డి గణేశ్ బుధవారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కి సమైక్యాంధ్ర నినాదాలు చేశాడు. దీంతో ఆ సమైక్యావాదిని కిందికి దించేందుకు ఇటు పోలీసులు, అటు రాజకీయ పార్టీల నాయకులు నానా హైరానా పడ్డారు. చివరకు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు సంఘటనా స్థలానికి వచ్చిన తరువాత ఆయనపై ఉండే గౌరవంతో గణేశ్ కిందకు దిగాడు. ఆ సమయంలో ఇంకా యువకుడు మీదనే ఉన్నాడని అటు పోలీసులు, ఇటు మీడియాను దుర్భాషలాడుతూ పట్టణానికి చెందిన కొంత మంది అల్లరిమూకలు బొబ్బిలి యువత పేరుతో విధ్వంసానికి పాల్పడ్డారు.
రోడ్డుమీద టైర్లు కాల్చి, కనపడినవన్నీ ధ్వంసం చేస్తూ వీరంగం వేశారు. ఓ ప్రైవేటు హోటల్ అద్దాలు పగలగొట్టగా, పత్రికా కార్యాలయాల బోర్డులు, డీఎస్‌పీ కార్యాలయం బోర్డులు ధ్వంసం చేసి నిప్పంటించారు. ఆ వీరంగానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాంప్లెక్స్ నుంచి కోర్టు జంక్షన్ వరకు రోడ్లపై టైర్లకు నిప్పంటించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఈ విధ్వంసం జరగడంతో పోలీసులు ప్రత్యేక దళాలను రంగంలోకి దించారు. దాంతో దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. 24 మం దిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది మద్యం సేవించి దుస్తులు విప్పి రౌడీల్లా తిరుగుతున్నవారే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిపై కేసులు నమోదు చేస్తున్నామని, వీరి వెనుక ఎవరి హస్తముందో ఆరా తీస్తున్నట్లు డీఎస్‌పీ ఫల్గుణరావు తెలిపారు.
గురువారం కొం తమంది రైలురోకో చేయడానికి నిర్ణయించగా, బుధ వారం నాటి ఉద్రిక్తత దృష్ట్యా డీఎస్‌పీ వారితో చర్చించి శుక్రవారానికి వాయిదా వేశారు. గురువారం పట్టణానికి అదనపు బలగాలను తీసుకువచ్చారు. కాంప్లెక్సు, రైల్వేస్టేషను, నాలుగు రోడ్ల కూడలి వద్ద వీరిని ఏర్పాటు చేశారు. రాస్తారోకో, ధర్నా, ఆందోళన చేస్తున్న వారిఅసలు రంగేమిటో, ఏ సంస్థల ఆధ్వర్యంలో వారం తా నిరసన తెలుపుతున్నారో వంటి వివరాలను పోలీసు లు సేకరిస్తున్నారు. ఆందోళనలు చేసే వారు ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని, అదుపు తప్పి ఎవరు ఎక్కువగా విధ్వంసాలకు పాల్పడినా వారిపై చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
Advertisement
Advertisement