వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో బొత్స, సోనియా, కేసీఆర్ చిత్రపటాలకు పిండప్రదానం
Published Thu, Aug 8 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో మిన్నంటుతున్న ఉద్యమ సెగలు కాంగ్రెస్ నాయకులకు, సమైక్యానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నినవారికి గుబులు పుట్టిస్తున్నాయి. ప్రతి పల్లెలో ఆందోళన కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. వీధివీధిలో సమైక్య నినాదం హోరెత్తుతోంది. ప్రతిరోజూ వినూత్న తరహాలో ఉద్యమాలు చేపడుతూ ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎత్తు బ్రిడ్జి వద్ద వంటా-వార్పు కార్యక్రమం చేపట్టిన అనంతరం కేసీఆర్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సోనియా, బొత్స చిత్రపటాలకు పిండ ప్రదానం చేశారు.
విజయనగరం విద్యుత్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా విద్యుత్ ఉద్యోగుల సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో దాసన్నపేట విద్యుత్ భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాసోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను మరుగుతున్న నూనెలో దించి కుంబీపాకం శిక్ష విధించారు. ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ రికగ్నైజ్డ్ పాఠశాలల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితో పాటు 50 స్కూల్ బస్సులతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. డీసీసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హోమం నిర్వహించగా... టీడీపీ ఆధ్వర్యంలో మెసానిక్ టెంపుల్‌లో రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీసీ కాలనీవాసులు జిల్లా కోర్టు వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
మహిళలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా రహదారి పైకి వచ్చి వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. పలువురు మహిళలు కబడ్డీ ఆడగా, యువకులు రహదారిపైనే క్రికెట్ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీరకట్టులో ఉన్న ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో స్పందించిన ఎస్పీ ప్రత్యేక బలగాలను తీసుకువెళ్లి ఉద్యమకారులను చెదరగొట్టారు. మునిసిపల్ ఉపాధ్యాయ, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తూ వీధుల్లో తిరిగారు. ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ జెండాలు చేతబూని మానవహారం నిర్వహించారు.
భోగాపురం మండలంలో మహరాజుపేట జంక్షన్ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై వేలాది మంది ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు రోడ్లపైనే వంటా-వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చీపురుపల్లి పట్టణంలోని శివరాం రోడ్డులో సోనియా దిష్టిబొమ్మకు శ వయాత్ర, దహన సంస్కారం చేశారు. విజయనగరం - పాలకొండ ప్రధాన రహదారిపై మధ్యాహ్నం 12.30 గంటలకు వందలాది మందికి ప్రధాన రహదారిపై భోజనాలు వడ్డించారు. పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చీపురుపల్లి వరకు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
నెల్లిమర్లలో వైద్యవిద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టి, దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎస్.కోటలో దేవి జంక్షన్ వద్ద విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. గజపతినగరంలో నాలుగు రోడ్ల జంక్షన్‌వద్ద ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు రోడ్డుమీదే విద్యాబోధన చేశారు. పురిటిపెంట గ్రామం న్యూకాలనీకి చెందిన పి.రాము అనే సమైక్యవాది భవానీమాలతో విజయవాడకు కాలి నడకన బయలుదేరారు.బొబ్బిలిలో వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు ఆధ్వర్యంలో వంటా-వార్పు కార్యక్రమం చేపట్టారు. సాలూరు, పార్వతీపురం, పెద్దపెంకి, సీతానగరం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కురుపాంలో కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఇంటి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే
సమైక్య వాదానికి కట్టుబడి మూడు రోజుల క్రితమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు ఆ పత్రాన్ని పంపినట్టు నెల్లిమర్ల ఎమ్మె ల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రకటించారు. రాష్ట్ర విభజన విషయం లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు భోగాపురం మండలంలో మహరాజుపేటజంక్షన్ వద్ద ఆయన తెలిపారు.
Advertisement
Advertisement