11వ రోజు అదే హోరు... అదే జోరు
Published Sun, Aug 11 2013 2:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
ఇంతవరకూ విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఉద్యమంలో పాల్గొని ముందుకు నడిపించగా ఇప్పుడు వివిధ వృత్తుల వారు ఆ బాధ్యతను తమ భుజానికెత్తుకున్నారు. విభజన ద్రోహులకు రజకులు ‘రేవు’పెట్టగా, వాహన మెకానిక్‌లు బైక్‌లతో పాటు సమైక్యద్రోహుల బుర్రలను రిపేర్ చేస్తామని చెబుతున్నారు. విభజన యోచన విరమించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మీ పదవులు తిరుక్షవరమవుతాయని క్షురకులు హెచ్చరిస్తున్నారు. వృత్తిదారులు ఉద్యమంలోకి రావడంతో ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది.
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా 11వ రోజు శనివారం కూడా ఆంధ్రరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఉద్యమాలు కొనసాగాయి. సమైక్యవాదానికి మద్దతుగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. పలు వృత్తి సంఘాల నేతృత్వంలో ప్రధాన రహదారులపై తమ వృత్తులను చేస్తూ సమైక్యవాదానికి మద్దతు పలికారు.
విజయనగరంలో ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మికి మరో మారు సమైక్యసెగ తగలింది. పార్లమెంట్ సమావేశాల నుంచి విజయనగరం వచ్చిన ఆమెను జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు నిలదీశారు. ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ఆమె పట్టణానికి వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు, ఎంపీ డీసీసీ దీక్షా శిబిరం వద్దకు చేరుకోగానే దూసుకు వెళ్లారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. రాజీనామాలు చేస్తే పార్లమెంట్‌లో సమైక్యవాణి వినిపించలేమని, అందుకే రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు.
అయితే ఆమె మాటలు నమ్మని ఎన్జీఓలు పెద్దపెట్టున నినాదాలు చేసి అక్కడి నుంచి వెనుదిరిగారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మయూరి జంక్షన్ వద్ద సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్‌దిష్టిబొమ్మలను పాములతో కాటువేయించి సర్పదండన శిక్ష విధించారు. జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులంతా జై సమైక్యాంధ్ర నినాదాలతో కూడిన ప్లకార్డులతో ప్రధాన రహదారుల్లో స్కేటింగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 20 మంది ఉద్యోగులు, కార్మికుల అర్ధనగ్నంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ ఉద్యమ పోరాట సమితి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కోట జంక్షన్ నుంచి గంటస్తంభం వరకు ర్యాలీ సాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించగా ఉదయం గురాన అయ్యలు నేతృత్వంలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించిన అనంతరం వైఎస్‌ఆర్ జంక్షన్ వద్ద దహనం చేశారు. డీసీసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట కార్యకర్తలు సామూహిక అర్ధ శిరోముండనం చేసుకున్న అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు విగ్రహానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు క్షీరాభిషేకం చే శారు. ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్‌అండ్‌బీ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. స్థానిక దాసన్నపేట సర్కిల్ కార్యాలయం వద్ద గల విద్యుత్ భవనం దగ్గర విద్యుత్ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సుమారు 300 మంది విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలతో విజయనగరం- శ్రీకాకుళం హైవేను దిగ్బంధించారు.
సమైక్యవాదానికి మద్దతుగా పట్టణంలోని లెటరింగ్ ఆర్టిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ కేంద్రమైన నెల్లిమర్లలో ఉపాధ్యాయులు సమైక్యాంధ్రకు మద్దతుగా మీనా ప్రపంచం మీడియా కాన్ఫరెన్స్‌ను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. స్థానిక ఆర్‌ఓబీ వద్ద రాస్తారోకో చేపట్టారు. భోగాపురం మండలంలో గుడివాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. సాలూరులో సమైక్యాంధ్ర కోసం జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. బొండపల్లిలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. చీపురుపల్లిలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో మూడురోడ్ల జంక్షన్ వద్ద కర్రలు కోస్తూ నిరసన వ్యక్తం చేయగా.. రజక సంఘం సభ్యులు ప్రధాన రహదారిపై చాకిరేవు పెట్టి దుస్తులు ఉతికి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అదేవిధంగా మెకానిక్ వర్కర్స్ బైక్ ర్యాలీ, వంటా-వార్పు చేసిన అనంతరం ప్రధాన రహదారిపై బైక్ రిపేరింగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఎస్.కోటలో దారగంగమ్మ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక దేవీజంక్షన్‌లో దుస్తులు ఉతికి నిరసన చేపట్టారు. గజపతినగరంలో నాలుగురోడ్ల జంక్షన్ వద్ద నాయీబ్రాహ్మణులు రోడ్డుపైనే క్షౌరవృత్తి చేసి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు టెలికాన్ఫరెన్స్‌ను బహిష్కరించి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బొండపల్లిలో సమైక్యాంధ్రకు మద్దతుగా బైక్ ర్యాలీ జరిగింది. బొబ్బిలిలో షటిల్ క్రీడాకారులంతా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై షటిల్ ఆడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు బేబినాయన పాల్గొని సంఘీభావం తెలిపారు. బాడంగి మండలం ఆకులకట్టలో సర్పంచ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సీతానగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాది మందితో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
Advertisement