వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ విజయవంతం
Published Fri, Aug 9 2013 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
కళలకాణాచిగా, విద్యల కేంద్రంగా బాసిల్లిన జిల్లా ఇప్పుడు పోరు గడ్డగా మారింది. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా, ఏ ఆందోళనా జరగని విధంగా... జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. పల్లె, పట్టణం, ఏజెన్సీ, మైదాన ప్రాంతం అన్న తేడా లేకుండా అంతా ఉద్యమమయంగా మారింది. చిన్నా, పెద్దా ముసలీముతక అన్న వయో భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విభజనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పురుషులు, మహిళలు, హిజ్రాలు అన్న తారతమ్యం చూపకుండా పోరుజెండా చేతబూని రణక్షేత్రంలో కదంతొక్కుతున్నారు.
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సమైక్యమే మా నినాదం అంటూ జిల్లా ప్రజలంతా 9వ రోజూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తం గా పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేశారు. పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోట జంక్షన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను పాడిపై పెట్టి తమ సంప్రదాయాల ప్రకారం శవయాత్ర నిర్వహంచి, అంత్యక్రియలు జరిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరే కిస్తూ సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసేందుకు కుట్రపన్నిన సమైక్యద్రోహులంటూ సోనియా, రాహుల్‌గాంధీలతో పాటు దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్, బొత్స దిష్టిబొమ్మలను శూలాలతో పొడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్రలోని రాజకీయ పార్టీల నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో 400 మంది విద్యుత్ ఉద్యోగులు దాసన్నపేట విద్యుత్ భవనం నుంచి రింగ్‌రోడ్డు, బాలాజీ జంక్షన్, మయూరి జంక్షన్, కలెక్టర్ ఆఫీసు, కన్యకాపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం, మూడులాంతర్లు, కోట మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
అదేవిధంగా విద్యుత్ భవనం వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారం కొనసాగాయి. ఈ రిలే దీక్షల్లో టి.గంగునాయుడు, జి.రాజశేఖర్, ఎస్.వి.ఎస్. రామకృష్ణ, టి.వి.వి మురళీకృష్ణ, ఎస్.శ్రీనివాస్, డి.సత్యనారాయణలు పాల్గొన్నారు. కణపాక చైతన్య యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద 100 మంది విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టణంలోని కాగడాల ప్రదర్శన నిర్వహించి నిరసన చేపట్టారు. స్థానిక కోట జంక్షన్ నుంచి మూడులాంతర్లు జంక్షన్, మెయిన్‌రోడ్, గంటస్తంభం జంక్షన్ మీదుగా ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆటోవాలాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. సుమారు 100 ఆటోలతో పట్టణమంతా ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద బొత్స దిష్టిబొమ్మను దహనం చేయగా, కోట జంక్షన్ వద్ద ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయగా ఆర్టీసీ ఉద్యోగులు కాంప్లెక్స్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డీసీసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. అక్కడ రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమం చేపట్టి సహపంక్తి భోజనాలు చేశారు. నెల్లిమర్లలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన నెల్లిమర్లలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయించారు. రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మలను దహనం చేశారు. భోగాపురంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై వంటా వార్పు చేశారు. దీంతో ఇరువైపులా ఎనిమిది కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సవరవిల్లి, జమ్మయ్యపేట పాఠశాలల విద్యార్థులు రోడ్లపై బైఠాయించగా, ఎన్జీవో ఆధ్వర్యంలో 16 నంబర్ జాతీయ రహదారిపై సహపంక్తి భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాస్పత్రి వద్ద వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు చేశారు.
చీపురుపల్లి మండల నాయీబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శ వయాత్ర చేశారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల తరగతులు బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు భరతమాత వేషధారణతో ర్యాలీ చేస్తూ నిరసన చేయగా రెడ్డిపేట, రేగిడిపేట, కొత్తపేట, విజయరామపురం పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆధ్వర్యంలో రాస్తారో కో చేపట్టారు. మందిరివలస గ్రామానికి చెందిన 300 మంది యువత చీపురుపల్లి వరకు పాదయాత్రగా వచ్చి కుక్కల మెడ లో కేసీఆర్ అని రాసి ఉన్న బోర్డులను వేలాడదీశారు. ఎస్.కోట దేవిబొమ్మ జంక్షన్‌లో బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థునిల ఆటపాటలతో నిరసన చేపట్టగా.. స్థానిక పుణ్యగిరి పీజీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలకు విద్యార్థులు విశాఖ, అరుకు రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించి దేవీబొమ్మ జంక్షన్‌లో రాస్తారోకో చేసి ట్రాఫిక్‌ను నిలుపుదల చేశారు. స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన ఎన్‌ఎంయూ కార్మికులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన 26 మంది కార్మికులు సమైక్యాంధ్రకు మద్ధతుగా నిరాహార దీక్ష చేశారు. గంట్యా డ మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది.
పాతబొబ్బిలిలో బళ్లవేషాలు ప్రదర్శించారు. సాము గరిడీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. తాండ్ర పాపారాయుడు విద్యా సంస్థల విద్యార్థులు తాండ్రపాపారాయుడు వేషధారణలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. రామభద్రపురం మండల కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం జరిగింది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాకపోకలు నిలిచిపోయాయి. సాలూరులో ప్రైవేట్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించగా స్థానిక కోర్టు నుంచి బోసుబొమ్మ జంక్షన్ వరకు న్యాయవాదుల బైక్ ర్యాలీ చేపట్టారు. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, బస్సులను అడ్డుకున్నారు. గరుగుబిల్లి రహదారిపై సమైక్యాంధ్రవాదులు ధర్నా నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేయగా జియ్యమ్మవలస పెదమేరంగి జంక్షన్‌లో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
Advertisement
Advertisement