సమైక్య ఉద్యమం మరింత ఉద్ధృతం
Published Wed, Aug 7 2013 3:22 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతంగా మారుతోంది. అగ్నిపర్వతాలు బద్ధలై వ్యాపిస్తున్న లావాలా సలసలకాగుతూ...సెగలుకక్కుతూ అన్ని వర్గాలకు వ్యాపిస్తోంది. దీంతో అన్ని ఊళ్లు పోరుబాట పడుతున్నాయి. తాటాకు మంటలా చప్పున చల్లారిపోతుందని భావించిన నేతలకు...చింతనిప్పు లా రాజుకుంటున్న పోరు కుంపటి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రజాప్రతినిధుల రాజీ‘డ్రామా’లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోరాటాన్ని నీరుగార్చడానికి యత్నిస్తున్న కొన్ని అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొడుతూ ప్రజలే ఉద్యమానికి సారథ్యం వహించి ముందుకు నడిపిస్తున్నారు. దీంతో నాయకులు తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానైనా వారిని అనుసరించవలసి వస్తోంది. అన్నివర్గాల ప్రజలు మంగళవారం కూడా స్వచ్ఛందంగా రహదారుల పైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. హిజ్రాలు కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
విజయనగరం నుంచి కొత్తవలస వెళ్లే దారిలో అలమండలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బొత్స, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు దహనం చేస్తుండగా ఉద్రేకానికిలోనైన డొంకాడ అప్పలనాయుడు అనే యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్యహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీనిని గమనించిన స్థానికులు అడ్డుకుని నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కురుపాం నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్ ఇంటిని 30 మంది హిజ్రాలు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటిని ఎన్జీవోలు ముట్టడించారు. మంత్రి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని, ఎమ్మెల్సీ స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో వైఎస్‌ఆర్ సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బేబినాయన ఆధ్వర్యంలో 13 అడుగుల యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించి దహనం చేశారు.
విజయనగరంలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ నుంచి గంటస్తంభం వరకు నిరసన ర్యాలీ చేపట్టి మంత్రి బొత్స దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్, దిగ్విజయ్ సింగ్, షిండే, సోనియా, రాహుల్ గాంధీల మాస్కులు ధరించిన యువకులను సంకెళ్లతో బంధించి ఊరేగింపుగా తీసుకువచ్చిన అనంతరం వారిని ఉరి తీసినట్టు నటిస్తూ నిరసన వ్యక్తంచేశారు. విశాఖ రేంజ్ డీఐజీ పి.ఉమాపతిని పట్టణ న్యాయవాదులు ఘెరావ్ చేశారు. అంతకుముందు జిల్లా కోర్టు ముందు న్యాయవాదులంతా మానవహారంగా ఏర్పడి వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. విశాఖ నుంచి విజయనగరం వస్తున్న డీఐజీ వాహనాన్ని జిల్లా కోర్టు ప్రాంగణం ముందు అడ్డగించారు.
వెంటనే ఆయన తన వాహనం నుంచి బయటకు వచ్చారు. సమైక్యాంధ్రాకు మద్దతు పలకాల్సిందిగా ఆయనను న్యాయవాదులు కోరగా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. డీసీసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్, అయినాడ జంక్షన్లవద్ద ఆందోళనలు చేశారు. నిరసనకారులు రోడ్లపై ఆటాపాటా నిర్వహించారు. పెదమజ్జిపాలెంకు చెందిన యువకులు సమైక్యాంధ్రను కోరుతూ 24 కిలోమీటర్లు పరుగుపందెం నిర్వహించారు. లక్కిడాం గ్రామానికి చెందిన యువకులు కొటారుబిల్లి కూడలిలో రాస్తారోకో చేపట్టారు. అలాగే నరవ, రామవరంలలో కూడా రాస్తారోకో నిర్వహించారు. గంట్యాడ, చీపురుపల్లి, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల్లో ఉపాధ్యాయులు ఆందళోనల్లో పాల్గొన్నారు. చీపురుపల్లి మూడురోడ్ల జంక్షన్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు క్షవరం చేయించుకుని తమ నిరసనను తెలిపారు.
ఎస్‌కోటలో ఏడో రోజు మంగళవారం కూడా రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున సమైక్యాంధ్రకు మద్దతుగా 150 ఆటోలతో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. స్థానిక వివేకానంద విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సాలూరులో పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బోసు బొమ్మ కూడలిలో వంటా-వార్పు నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులు ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. బొబ్బిలి వర్తక సంఘం ఆధ్వర్యంలో బొబ్బిలి బంద్ కార్యక్రమం జరిగింది. అలాగే వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు దీక్షలు, బొబ్బిలి యువత ఆధ్వర్యంలో రైలురోకో కార్యక్రమాన్ని చేపట్టారు. పార్వతీపురంలో కూడా ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. పాఠశాలలను మూసివేసి బంద్ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్సు జంక్షన్‌లో మోటారు వాహనాల యూనియన్, లారీ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు.
నిరసనకారులపై కాంగ్రెస్ నాయకుల దాడి..?
విజయనగరం పట్టణంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్న నిరసనకారులపై పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు తెలిసింది. ఉద్యమంలో భాగంగా విద్యార్థులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్దకు చేరుకుని బొత్స డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. అక్కడే రిలే దీక్షలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాల విని జీర్ణించుకోలేక వారిపై దాడి చేసినట్టు తెలిసింది. పట్టణానికి చెందిన శ్రీను అనే నాయకుడు ఇద్దరు యువకులపై చేయిచేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ విజయోత్సవమా...? సమైక్య ఉద్యమమా...? అర్థంకాక స్థానికులు విమర్శలు గుప్పించారు.
Advertisement
Advertisement