పెరుగుతున్న రిలే దీక్షా శిబిరాలు
Published Sat, Aug 10 2013 2:16 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
సాక్షి, ఏలూరు : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమాలు శుక్రవారం పదో రోజుకు చేరుకున్నాయి. ప్రజలంతా అకుంఠిత దీక్షతో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక శుక్రవారం ఐదుగురు గుండె ఆగి మరణిం చారు. రిలే నిరాహార దీక్షలు ఉధృతమవుతున్నాయి. పది రోజులుగా కొన్ని సంఘాలు దీక్షలు కొనసాగిస్తుంటే.. ప్రతి రోజూ కొత్తగా మరి కొందరు దీక్షలు ప్రారంభిస్తున్నారు. పెరవలిలో నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెంలో దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సందర్శించారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఉంగుటూరు సర్పంచ్, 14 మంది వార్డు సభ్యులు రిలే దీక్షలు చేపట్టారు. పాలకొల్లులో దీక్షల్లో ఎమ్మెల్యే ఉషారాణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
భీమవరంలో రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. డాక్టర్ పీఆర్‌కే వర్మ రూ.15 వేల నగదును జేఏసీకి విరాళంగా అందించారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఏడవ రోజుకు చేరుకున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో శ్రీకృష్ణదేవరాయ సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు. మంత్రి పితాని సత్యనారాయణ ఎట్టకేలకు ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆచంట, మార్టేరు, పెనుగొండలో దీక్షలు చేస్తున్న సమైక్యవాదులను కలిసి సంఘీభావం తెలిపారు. పాలకొల్లులో దీక్షా శిబిరాన్ని మంత్రి పితాని, నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరు రఘురామకృష్ణంరాజు సందర్శించి ఉద్యమకారులకు మద్దతు ప్రకటించారు.
13నుంచి ఉద్యోగుల సమ్మె
సమైక్యాంధ్ర కోరుతూ ఈనెల 13నుంచి జిల్లాలోని ఉద్యోగులంతా సమ్మెకు దిగుతారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ శుక్రవారం ఏలూరులో ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని సోనియాగాంధీ ప్రకటించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ డ్రామాలకు స్వస్తి పలకకపోతే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాంతా ల్లోని 13 జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారులు ఈనెల 13 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారని ది ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు టి.యోగానందం ప్రకటించారు.
కదం తొక్కిన ముస్లింలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జిల్లాలోని ముస్లింలంతా ఎక్కడికక్కడ ప్రదర్శనలు నిర్వహించారు. ఏలూరు కర్బలా మైదానంలో రంజాన్ నమాజ్ చేసిన అనంతరం ముస్లింలు పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి మానవహారం నిర్వహించారు. రంజాన్ శుభాకాంక్షలను సైతం ‘జై సమైక్యాంధ్ర’ అంటూ చెప్పుకున్నారు. కొయ్యలగూడెం మండలంలో ముస్లింలు ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్ల బాలరాజు పాల్గొని యూపీఏ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తణుకు నరేంద్ర సెంటర్‌లో సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రోజువారీ కూలీలు సైతం శుక్రవారం పనులు మానుకుని ఉద్యమంలో పాల్గొన్నారు. లారీలు, ప్రైవేటు బస్సులు, ఆటోల యాజమాన్యాలు ఆయూ వాహనాలను వీధుల్లో తిప్పి ఆందోళన చేపట్టారు.
నాయీ బ్రాహ్మణులు చెవిలో పువ్వు, నోటికి నల్ల రిబ్బన్‌లు కట్టుకుని నిరసన తెలిపారు. నిడదవోలు పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 400మంది డ్వాక్రా మహిళలు ర్యాలీ నిర్వహిం చారు. నిడదవోలు మండలం మునిపల్లిలో వైఎస్సార్ సీపీ కన్వీనర్ ఎస్.రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిం చారు. జంగారెడ్డిగూడెంలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. మేము సైతం అంటూ హిజ్రాలు ఉద్యమంలో పాల్గొన్నారు. ఆచంటలో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఫొటోగ్రాఫర్లు నిరసన దీక్షలో పాల్గొన్నారు. పెనుగొం డలో దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు వైఎస్సార్ సీపీ నాయకుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మద్దతు తెలిపారు. పాలకొల్లులో ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జిల్లా రైస్‌మిల్లర్స్ సంఘం గాంధీబొమ్మల సెంటర్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించింది. ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, రెల్లి సంక్షేమ సంఘం, బండ్లు, రైస్‌మిల్లు కార్మికులు భారీప్రదర్శన నిర్వహించారు.
ఆందోళనల్లో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొన్నారు. భీమవరంలో పతంజలి యోగ మిత్రమండలి సభ్యులు రోడ్లపై యోగాసనాలు వేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు గ్రంధి శ్రీనివాస్ తదితరులు కబడ్డీ ఆడారు. పాతపాటి సర్రాజు, వేగేశ్న కనకరాజు సూరి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సమైక్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు సోనియా భజన చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ నాయకుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు భీమవరంలో దుయ్యబట్టారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేశారు.
Advertisement