ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు చెల్లింపులు బంద్ | Joint state   Payments to government shutdown | Sakshi
Sakshi News home page

ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు చెల్లింపులు బంద్

Published Tue, May 27 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

Joint state    Payments to government shutdown

28లోగా పాస్ కాని ఉమ్మడి రాష్ట్ర బిల్లులు తెలంగాణ పీఏవోలో చెల్లింపు

 హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చెల్లింపులన్నింటినీ సోమవారం సాయంత్రం నుంచి ఆర్థిక శాఖ నిలుపుదల చేసింది. అత్యంత అత్యవసరం మినహా ఎటువంటి సాధారణ బిల్లుల చెల్లింపులను చేయరు. ఆఖరికి అధికారులు, ఉద్యోగుల టీఏ, డీఏ బిల్లులతో సహా అన్ని రకాల బిల్లుల చెల్లింపులను నిలుపుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఖజానా, ఉప ఖజానా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.

మే నెల 21వ తేదీ వరకు వచ్చిన బిల్లులన్నింటినీ ఖజానా కార్యాలయాలు సోమవారం సాయంత్రం వరకు చెల్లింపులను పూర్తి చేశాయి. ఈ నెల 28వ తేదీ నాటికి పాస్ కాని ఉమ్మడి రాష్ట్రంలోని బిల్లులను జూన్ నెలలో ఆడిట్ అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ పీఏవోలు ఆ బిల్లులను స్వీకరించడంతో పాటు చెల్లింపులను చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

జూన్ 2 నుంచి ఆర్థిక శాఖతో పాటు, ట్రెజరీ అండ్ అకౌంటెంట్ విభాగాలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ప్రస్తుతం నాంపల్లిలోని ఎం.జె. రోడ్డులో గల డెరైక్టర్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ కార్యాలయంలోనే ఈ విభాగాలు పని చేస్తాయి. నగరంలోని ఇన్సూరెన్స్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు పన్నులతో పాటు ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రెజరీ నుంచి నిర్వహించాలి.

ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కార్యకలాపాలను జూన్ 2వ తేదీ నుంచి గన్‌ఫౌండ్రీలో గల ఎస్‌బీఐ నిర్వహించనుంది. తెలంగాణ ట్రెజరీ కార్యకలాపాలను జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రపతి రోడ్‌లోని ఎస్‌బీహెచ్, ఉస్మాన్‌గంజ్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లు నిర్వహిస్తాయి.  ఆర్థిక శాఖ జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా వెబ్‌సైట్లను అమల్లోకి తేనుంది. అలాగే జూన్ 2వ తేదీ నుంచి ట్రెజరీ వెబ్‌సైట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా పనిచేస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి లీడ్ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లీడ్ బ్యాంకుగా ఆంధ్రా బ్యాంక్ వ్యవహరించనున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement