ఉద్యోగుల రిటైర్మెంట్‌లపై సర్కారు బెంబేలు
ఐదేళ్లలో 44 వేల మందికి తక్షణ బెనిఫిట్ల కింద రూ. 20 వేల కోట్లు చెల్లించాల్సి ఉండటమే కారణం
ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెలా రూ.350 కోట్లు సగటున పడనున్న భారం..
ఇది ప్రతి సంవత్సరం పెరిగే అవకాశం
రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61కి పెంచిన గత సర్కార్
ఫలితంగా 2021–24 వరకు నాటి ప్రభుత్వానికి ఉపశమనం
ఆ తర్వాత నుంచి ఉద్యోగ విరమణలు మళ్లీ మొదలు
ఎలా గట్టెక్కాలోనని తల పట్టుకుంటున్న ప్రభుత్వం
ప్రస్తుతం మెడికల్ బిల్లులు, సరండర్ లీవ్‌ల చెల్లింపూ గగనమే
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదలుకొని రానున్న ఐదేళ్లలో ఏకంగా 44 వేల మంది ప్రభుత్వ ఉద్యో గులు రిటైర్ కానున్నారు. వీరికి రిటైర్‌మెంట్ బెనిఫిట్ల కింద సగటున రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా మారనుంది..’ఇది ఇటీవల 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలోని ఓ ప్రధాన అంశం. ఆర్థిక శాఖ లెక్క ప్రకారం రానున్న ఐదేళ్ల కాలంలో ఖజానాపై దాదాపు రూ.20 వేల కోట్ల భారం పడనుందని అంచనా.
అంటే సరాసరి నెలకు రూ.350 కోట్ల పైచిలుకు రిటైర్‌మెంట్ బెనిఫిట్ల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు రిటైర్‌మెంట్లు లేకపోవడం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మళ్లీ రిటైర్‌మెంట్లు ప్రారంభం కావడం, అప్పటి నుంచి ఉన్న భారం ఒక్కసారిగా మీద పడడంతో ఎలా నెట్టుకురావాలో అర్థం కాక ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది.
పదవీ విరమణ వయసు పెంపుతో..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్లు జరగలేదు. దీంతో వారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్లు చెల్లించే అవసరం పడలేదు. ఆ తర్వాత నుంచి రిటైర్‌మెంట్లు మొదలవగా ఈ ఏడాది డిసెంబర్ వరకు మొత్తం 7,995 మంది రిటైరవుతారని చెబుతున్నారు.
వీరికి తక్షణ బెనిఫిట్ల కోసం రూ.3,200 కోట్ల వరకు అవసరం కాగా సరిగ్గా చెల్లించలేని పరిస్థితి ఉంది. పైగా ఇక నుంచి ఈ భారం ప్రతి యేటా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కనీసం నెలకు రూ.350 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,800 కోట్లు అవసరం అవుతాయని, రానున్న ఐదేళ్ల కాలంలో సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు.
ఏమేమి చెల్లించాలి?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైరైన తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్లు చాలానే ఉంటాయి. వారి మూల వేతనానికి అనుగుణంగా హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, డీఏలను కలుపుకొని లెక్కించిన వేతనానికి 10 రెట్లు ఆర్జిత సెలవుల (లీవ్ శాలరీ) రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీవ్ శాలరీల మొత్తం ఒక్కో ఉద్యోగికి సగటున రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీంతో పాటు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమ్యుటేషన్ రూపంలో మరో రూ.20 లక్షలు చెల్లించాలి.
ఈ లెక్కల ప్రకారం చూస్తే కనీసం రూ.40 లక్షలు ఒక్కో ఉద్యోగికి చెల్లించాలన్న మాట. రానున ఐదేళ్లలో అంటే 2028 నాటికి రిటైర్ అయ్యే సంఖ్య నెలకు 10 వేలకు చేరుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అప్పుడు నెలకు కనీసం రూ.400 కోట్లు (అప్పటికి) అవసరమని అంచనా.
గడ్డు పరిస్థితుల్లో ఖజానా
రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి ప్రకారం మార్చి నెల నుంచి రిటైరైన వారికి బెనిఫిట్లు చెల్లించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. సరెండర్ లీవ్స్ లాంటి చెల్లింపులు కూడా గగనమవుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించింది. 2022 జూలై డీఏ ప్రకటించినా మరో నాలుగు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్‌ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు వారి జీఎల్‌ఐతో పాటు జీపీఎఫ్‌లపై వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈ చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖ తలలు పట్టుకుంటోంది.
తమ బిల్లుల కోసం ఉద్యోగులు రోజూ సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. రిటైర్‌మెంట్‌కు మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళతాయని, ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వ వీలును బట్టి ఆర్థిక అంశాలను సర్దుబాటు చేసుకుని ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment