Employees Retirement Age
-
వామ్మో.. 61 ఏళ్లు.. సర్కారు బెంబేలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదలుకొని రానున్న ఐదేళ్లలో ఏకంగా 44 వేల మంది ప్రభుత్వ ఉద్యో గులు రిటైర్ కానున్నారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద సగటున రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా మారనుంది..’ఇది ఇటీవల 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలోని ఓ ప్రధాన అంశం. ఆర్థిక శాఖ లెక్క ప్రకారం రానున్న ఐదేళ్ల కాలంలో ఖజానాపై దాదాపు రూ.20 వేల కోట్ల భారం పడనుందని అంచనా. అంటే సరాసరి నెలకు రూ.350 కోట్ల పైచిలుకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మళ్లీ రిటైర్మెంట్లు ప్రారంభం కావడం, అప్పటి నుంచి ఉన్న భారం ఒక్కసారిగా మీద పడడంతో ఎలా నెట్టుకురావాలో అర్థం కాక ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పదవీ విరమణ వయసు పెంపుతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగలేదు. దీంతో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించే అవసరం పడలేదు. ఆ తర్వాత నుంచి రిటైర్మెంట్లు మొదలవగా ఈ ఏడాది డిసెంబర్ వరకు మొత్తం 7,995 మంది రిటైరవుతారని చెబుతున్నారు. వీరికి తక్షణ బెనిఫిట్ల కోసం రూ.3,200 కోట్ల వరకు అవసరం కాగా సరిగ్గా చెల్లించలేని పరిస్థితి ఉంది. పైగా ఇక నుంచి ఈ భారం ప్రతి యేటా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కనీసం నెలకు రూ.350 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,800 కోట్లు అవసరం అవుతాయని, రానున్న ఐదేళ్ల కాలంలో సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. ఏమేమి చెల్లించాలి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైరైన తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్లు చాలానే ఉంటాయి. వారి మూల వేతనానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలను కలుపుకొని లెక్కించిన వేతనానికి 10 రెట్లు ఆర్జిత సెలవుల (లీవ్ శాలరీ) రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీవ్ శాలరీల మొత్తం ఒక్కో ఉద్యోగికి సగటున రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీంతో పాటు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమ్యుటేషన్ రూపంలో మరో రూ.20 లక్షలు చెల్లించాలి. ఈ లెక్కల ప్రకారం చూస్తే కనీసం రూ.40 లక్షలు ఒక్కో ఉద్యోగికి చెల్లించాలన్న మాట. రానున ఐదేళ్లలో అంటే 2028 నాటికి రిటైర్ అయ్యే సంఖ్య నెలకు 10 వేలకు చేరుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అప్పుడు నెలకు కనీసం రూ.400 కోట్లు (అప్పటికి) అవసరమని అంచనా. గడ్డు పరిస్థితుల్లో ఖజానా రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి ప్రకారం మార్చి నెల నుంచి రిటైరైన వారికి బెనిఫిట్లు చెల్లించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. సరెండర్ లీవ్స్ లాంటి చెల్లింపులు కూడా గగనమవుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించింది. 2022 జూలై డీఏ ప్రకటించినా మరో నాలుగు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు వారి జీఎల్ఐతో పాటు జీపీఎఫ్లపై వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈ చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖ తలలు పట్టుకుంటోంది. తమ బిల్లుల కోసం ఉద్యోగులు రోజూ సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. రిటైర్మెంట్కు మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళతాయని, ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వ వీలును బట్టి ఆర్థిక అంశాలను సర్దుబాటు చేసుకుని ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సాక్షి, అమరావతి: జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంపై రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయం వద్ద రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సమానంగా జిల్లా గ్రంథాలయ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం సీఎం గొప్ప మనస్సుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వెన్నుదన్నుగా ఉంటామని గ్రంథాలయ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పూర్ణమ్మ, కార్యదర్శి రవికుమార్, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు పాల్గొన్నారు. -
ఏపీ: ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్ జారీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం సంతకం చేశారు. కాగా ఇటీవల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. చదవండి: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స -
‘రిటైర్మెంట్’ పెంపు.. ఐఆర్‌పై చర్చ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం కీలక కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరిగే మంత్రివర్గ భేటీలో వివిధ ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. చాలా రోజుల తర్వాత జరుగుతున్న మంత్రివర్గ సమావేశం కోసం ప్రభుత్వం భారీ అజెండాను సిద్ధం చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఫిబ్రవరి 22న చివరిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరగడంతో దాదాపు 9 నెలలుగా రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంది. పలు కీలక అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. తాజాగా మంగళవారం నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశం ముందు పెండింగ్ ప్రతిపాదనలతోపాటు కొత్త ప్రతిపాదనలను ఉంచాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి డజనుకుపైగా అంశాలను ప్రభుత్వం మంత్రివర్గం ముందు ఉంచబోతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం పెంపు, ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో టీఎంసీ నీరు తరలింపు, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ తదితర ప్రధాన అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 22 కొత్త జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం భూముల కేటాయింపు ప్రతిపాదనలను ప్రభుత్వం కేబినెట్ ముందుంచనుంది. అలాగే రుణ ఉపశమన కమిషన్ చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి. ఇక కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన పూర్తికాకపోవడంతో ఈ కేబినెట్ సమావేశంలో పెట్టే అవకాశం లేకుండా పోయింది. కొత్త మున్సిపల్ చట్టం సిద్ధమైనా మంత్రివర్గ సమావేశంలో పెట్టడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం నుంచి చివరి నిమిషంలో పిలుపు వస్తే కొత్త మున్సిపల్ చట్టాలను కేబినెట్ ముందు ఉంచి ఆమోదించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శారదా పీఠానికి కోకాపేటలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవన్నీ కేబినెట్ ఎజెండాలో ఉండబోతున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రకటన! ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం మంత్రివర్గ సమవేశంలో చర్చించి కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలా లేక ఫిట్మెంట్ వర్తింపజేయాలా అనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ మంత్రివర్గం సమావేశమై అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి దృష్టి మంగళవారం జరగనున్న కేబినెట్ భేటీపై కేంద్రీకృతమై ఉంది. మధ్యంతర భృతితోపాటు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచే అంశంపై మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశముందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యంతర భృతి ప్రకటన/పీఆర్సీ అమలులో జాప్యంపట్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్ల జేఏసీ కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై మంత్రివర్గంలో తప్పకుండా చర్చించవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. మధ్యంతర భృతి చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కసరత్తు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
పదవీ విరమణ @ 60
-
పదవీ విరమణ @ 60
► ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ► ఏపీ తరహాలో రెండేళ్లు పెంచాలని ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లు ► రెండేళ్లలో లక్ష మందికిపైగా రిటైర్ కానున్న ఉద్యోగులు ► రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులతో ఖజానాపై ఆర్థిక భారం ► ఏటా రూ.5 వేల కోట్లు అవసరం ► రెండేళ్లకు పెంచితే ఆ మేరకు ఆదా చేయొచ్చని ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్ల పాటు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లతోపాటు విరమణ ప్రయోజనాల చెల్లింపులు ఆర్థికంగా భారంగా మారటంతో సర్కారు ఈ దిశగా మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు 58 ఏళ్ల గరిష్ట వయో పరిమితి అమల్లో ఉంది. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీ ఉద్యోగుల పదవీ కాల పరిమితిని 60 ఏళ్లకు పెంచింది. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ రెండేళ్ల వెసులుబాటు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు పదో పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పట్నుంచి రిటైరయ్యే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రయోజనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఖజానాపై ఆర్థిక భారం పెరిగిపోయిందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 3.50 లక్షల మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లోగా 60 వేల మంది ఉద్యోగులు రిటైరవుతారని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 1.20 లక్షలకు చేరుతుందని ప్రభుత్వ వర్గాలు లెక్కలేస్తున్నాయి. రిటైరయ్యే ఉద్యోగులకు చెల్లించే ప్రయో జనాలకు ఏటా దాదాపు రూ. 5 వేల కోట్లు కావాలి. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రయోజనాలేంటి? రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచితే ఒనగూరే ప్రయోజనాలను ప్రభుత్వం విశ్లేషించుకుంటోంది. దీంతో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఉద్యోగుల ఖాళీలు ఏర్పడే పరిస్థితిని నివారించే వీలుందని అంచనా వేసింది. మరోవైపు రిటైర్మెంట్ ప్రయోజనాలకు చెల్లించే నిధులు ఆదా చేసి.. అభివృద్ధి సంక్షేమ పనులకు మళ్లించే వెసులుబాటు లభిస్తుందని యోచిస్తోంది. దీంతోపాటు ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా ఇప్పటివరకు ఉన్న గుర్తింపు కొనసాగుతుందని భావిస్తోంది. అదే సమయంలో రిటైర్మెంట్ వయో పరిమితి పెంచితే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెల్లుబికుతుందనే కోణంలోనూ ఆరా తీస్తోంది. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తే.. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటంతో కొత్త ఉద్యోగావకాశాలకు గండి పడింది. దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అంతమేరకు కొత్త పోస్టులు లేకుండా పోయాయని నిరుద్యోగులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచితే మరో రెండేళ్ల పాటు రిక్రూట్మెంట్లు ఆగిపోయే ప్రమాదముంది. దీంతో నిరుద్యోగుల నుంచి మరింత ఆందోళన వ్యక్తమవుతుందా? అయినా ఉద్యోగుల ప్రయోజనాలు, ఆర్థిక అవసరాల దృష్ట్యా వయో పరిమితి పొడిగించాలా? అని సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. దశల వారీగా రిక్రూట్మెంట్లను కొనసాగించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాలని యోచిస్తోంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై మూడు నెలల కిందటే ఆర్థిక శాఖ సీఎంకు ఫైలు పంపిందని, దానిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అధ్యాపకులకు 62 ఏళ్లు! యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆరా తీయటంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం యూనివర్సిటీ అధ్యాపకులకు 60 ఏళ్ల వయో పరిమితి ఉంది. తమ సర్వీసును 62 ఏళ్ల వయో పరిమితికి పెంచాలని కొంతకాలంగా అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితి అమల్లో ఉంది. దీంతో యూనివర్సిటీ అధ్యాపకులకు 62 ఏళ్ల వరకు పరిమితిని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సంబంధిత ప్రతిపాదనల ఫైలుతో పాటు విజ్ఞప్తులను పంపించాలని ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది. -
న్యాయవ్యవస్థ ఉద్యోగులకు 60 ఏళ్లు వర్తింపెలా..?
బాధ్యతలను రూల్ కమిటీకి అప్పగించిన హైకోర్టు సీజే కొందరు ఉద్యోగులతో చర్చలు జరిపిన కమిటీ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు అజమాయిషీలో పని చేసే న్యాయవ్యవస్థ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచే విషయంపై అధ్యయనం చేసే బాధ్యతలను ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన రూల్ కమిటీకి ప్రధాన న్యాయమూర్తి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఉన్న ఈ రూల్ కమిటీ, హైకోర్టు అజమాయిషీలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగుల విభజన ఓ కొలిక్కి రాగా, న్యాయవ్యవస్థ ఉద్యోగుల విభజన మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. హైకోర్టుతో పాటు రంగారెడ్డి, నాంపల్లి, సికింద్రాబాద్ కోర్టుల్లో సీమాంధ్రకు చెందిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంది. అయితే ఉమ్మడి హైకోర్టుతో పాటు, న్యాయవ్యవస్థ ఉద్యోగుల విభజన జరగలేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పదవీ వివరణ వయసు పెంపును ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ మొత్తం వ్యవహారాన్ని రూల్ కమిటీకి ప్రధాన న్యాయమూర్తి నివేదించారు. ఇందులో భాగంగా కమిటీ కొందరు ఉద్యోగులతో గురువారం మాట్లాడింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు కొందరు 60 ఏళ్ల పెంపును వ్యతిరేకించినట్లు సమాచారం. ఉమ్మడి హైకోర్టులో ఉద్యోగుల విభజన జరగనందున, సీమాంధ్రకు చెందిన ఉద్యోగులకు 60 ఏళ్ల పెంపును వర్తింప చేస్తే, దాని ప్రభావం తమ పదోన్నతులపై పడుతుందని, దీంతో తమకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు కమిటీ ముందు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో రూల్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుదనే దానిపై న్యాయవ్యవస్థ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లా కోర్టులకు వర్తమానం... ఉద్యోగ విరమణ వయసు పెంపుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపింది. దీంతో ఆయా జిల్లాల్లోని న్యాయవ్యవస్థ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఆయా జిల్లాల జడ్జీలకు కలిగినట్లయింది. ఈ పెంపు ఆదేశాలు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, కడప తదితర జిల్లాల్లో అమలు చేయని విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవ్యవస్థ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎం.రమణయ్య నేతృత్వంలోని ప్రతినిధులు ఇటీవల ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ అన్ని జిల్లాల కోర్టులకు పంపారు. దీనిపై సంఘం చైర్మన్ రమణయ్య, కన్వీనర్ వై.సుబ్బారెడ్డి, కోశాధికారి గోపీనాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ డి.ఆనందరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
రిటైరయ్యే వారి ఆప్షన్లు తరువాత చెపుతాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60కి పెంచడంతో ఉద్యోగుల ఆప్షన్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. త్వరలో పదవీ విరమణ చేసే ఉద్యోగులందరూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తామని ఆప్షన్ ఇస్తే చిక్కులు వస్తాయని భావిస్తోంది. దీంతో రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలనే అంశాన్ని మినహాయించాలని కమలనాథన్ కమిటీని కోరింది. ఈ అంశంపై అభిప్రాయాన్ని తరువాత తెలియజేస్తామని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆమోదిస్తూ శనివారం వెనక్కు పంపించారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అపాయింటెడ్ నుంచి ఉన్న ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లను తీసుకోవాలని, ఆపన్లను పరిగణనలోకి తీసుకునే ఉద్యోగుల కేటాయింపులు చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ సమస్య కారణంగా శుక్రవారం లేదా శనివారం విడుదల కావాల్సిన ముసాయిదా మార్గదర్శకాలు నిలిచిపోయాయి. మరోవైపురిటైరయ్యే ఉద్యోగుల నుంచి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనే విషయాన్ని తరువాత చెబుతూ మిగతా అంశాలపైముసాయిదా మార్గదర్శకాల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడాఇందుకు అంగీకరించిన పక్షంలో ఆ ఒక్క అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలపై కమలనాథన్ కమిటీ ముసాయిదా మార్గదర్శకాలను సోమలేదా మంగళవారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది. లేదంటే ముసాయిదా మార్గదర్శకాల విడుదలలో మరింత జాప్యం ఖాయం. ఉమ్మడిరాష్ట్రంలో ఈ ఏడాదితో పాటు వచ్చే రెండేళ్లలో 38 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.