'గ్రూప్‌–1'పై ఆదుర్దా.. ఆందోళన.. | Supreme Court will hear petition on postponement Group-1 mains | Sakshi
Sakshi News home page

'గ్రూప్‌–1'పై ఆదుర్దా.. ఆందోళన..

Published Mon, Oct 21 2024 1:29 AM | Last Updated on Mon, Oct 21 2024 4:38 AM

Supreme Court will hear petition on postponement Group-1 mains

గ్రూప్‌–1 మెయిన్స్‌పై పట్టువీడని సర్కారు, అభ్యర్థులు

వాయిదా కోసం అభ్యర్థులు,నిరుద్యోగుల డిమాండ్‌.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం 

తమకు అన్యాయం జరుగుతుందంటూ మళ్లీ రోడ్డెక్కిన అభ్యర్థులు 

అశోక్‌నగర్‌ చౌరస్తాలో ఆందోళన.. వారు ప్రెస్‌మీట్‌ పెట్టకుండా అడ్డుకున్న పోలీసులు 

గాందీభవన్‌ ముట్టడికి అభ్యర్థుల ప్రయత్నం.. అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలింపు 

అభ్యర్థులకు బాసటగా ప్రతిపక్షాలు.. వాయిదా వేస్తే నష్టమేంటనే ప్రశ్నలు

అన్యాయం జరగకపోతే ఆందోళనలను ఎందుకు అణచివేస్తున్నారన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

భేషజాలకు పోకుండా వాయిదా వేయాలని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ 

ఎవరికి నష్టం జరగదని టీపీసీసీ చీఫ్‌గా భరోసా ఇస్తున్నానన్న మహేశ్‌గౌడ్‌ 

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ 

పరీక్షల వాయిదాపై పిటిషన్‌ను నేడు విచారించనున్న సుప్రీంకోర్టు

‘‘మేం రాజకీయాలకు అతీతం.. మా చివరి అవకాశాన్ని వృ«థా చేయకండి. ఆర్థికంగా, మానసికంగా నష్టపోయి ఉన్న మా బాధ వినండి. పరీక్షలు వాయిదా వేయండి’’.. 
– ఇదీ నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన 

‘‘అంతా సవ్యంగానే ఉంది. జీవో 29 విషయంలో గానీ, మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల విషయంలోగానీ నిరుద్యోగులకు ఎలాంటి నష్టం లేదు. అపోహలకు పోకుండా పరీక్షలు రాయండి. అన్ని ఏర్పాట్లు చేశాం’’.. 
– ఇదీ పరీక్షలు నిర్వహించేయాలన్న ఆదుర్దాలో రాష్ట్ర ప్రభుత్వం సూచన.

సాక్షి, హైదరాబాద్‌: .. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల విషయంలో ఇరుపక్షాలు పట్టువీడని పరిస్థితి. పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు ఓ వైపు ఆందోళనలను కొనసాగిస్తుండగానే.. మరోవైపు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసేసింది. జీవో 29 కారణంగా రిజర్వుడ్‌ కేటగిరీల వారికి నష్టం జరుగుతుందని అభ్యర్థులు మొత్తుకుంటుంటే.. అలాంటిదేమీ లేదంటూ ప్రభుత్వం ముందుకెళుతోంది. 

ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయాల్సిందేనంటూ ఆదివారం నిరుద్యోగులు, అభ్యర్థులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ చౌరస్తాలో బైఠాయించినా.. గాందీభవన్‌ ముట్టడికి ప్రయత్నించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కనీసం అభ్యర్థులు ప్రెస్‌మీట్‌ పెట్టి తమ ఆవేదన చెప్పుకొనేందుకు కూడా అనుమతించలేదు. 

ప్రతిపక్షాల మద్దతుతో.. 
ఆందోళన తెలుపుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులకు ప్రతిపక్షాలు బాసటగా నిలిచాయి. గ్రూప్‌–1 పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ నిరుద్యోగ యువతకు చెప్పిందేమిటి? కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు చేస్తోందేమిటని నిలదీశారు. 

ఇక బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోవడం ఎందుకని, పరీక్షలను వాయిదా వేసి తప్పులను సరిదిద్దితే వచ్చిన నష్టమేంటని నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతుగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్పందించారు. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో ఏ ఒక్క వర్గానికీ నష్టం జరగలేదని, భవిష్యత్తులోనూ నష్టం జరగకుండా చూస్తానని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో భరోసా ఇస్తున్నానని ప్రకటించారు. 

ఇక నిరుద్యోగుల ఆందోళనలను పట్టించుకోకుండా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) సోమవారం నుంచి గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో.. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకంటూ పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేడు సుప్రీంకోర్టులో విచారణ 
గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. అటు విద్యార్థుల ఆందోళన, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య.. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement