గ్రూప్‌–1 అభ్యర్థుల ఆందోళన­.. ముట్టడి.. ఉద్రిక్తం! | Group-1 candidates Protest at secretariat with support BJP BRS | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 అభ్యర్థుల ఆందోళన­.. ముట్టడి.. ఉద్రిక్తం!

Published Sun, Oct 20 2024 12:37 AM | Last Updated on Sun, Oct 20 2024 7:41 AM

Group-1 candidates Protest at secretariat with support BJP BRS

వేలాదిగా సచివాలయం వద్దకు చేరుకున్న గ్రూప్‌–1 అభ్యర్థులు

వారికి బీజేపీ, బీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాల నేతల మద్దతు 

సర్కారు తీరుకు నిరసనగా తొలుత అశోక్‌నగర్‌ వద్ద ధర్నా..

అనంతరం భారీ ర్యాలీగా సచివాలయానికి.. ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం 

దాటుకుని సచివాలయానికి చేరుకున్న గ్రూప్‌–1 అభ్యర్థులు 

గేటు వద్ద బైఠాయించి ఆందోళన.. రెండు గంటలపాటు ఉద్రిక్తత 

ముఖ్యమంత్రి రేవంత్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. 

పరీక్షల రీషెడ్యూల్‌కు, జీవో 29 రద్దు కోసం డిమాండ్‌ 

రేపటి నుంచే మెయిన్స్‌ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని, జీవో 29ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లతో అభ్యర్థులు శనివారం చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేల మంది అభ్యర్థులు, వారికి మద్దతుగా వచ్చిన వారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సచివాలయం వైపు దూసుకువచ్చారు. 

పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించడంతో.. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో ఉన్న అభ్య­ర్థులు, నిరుద్యోగులు ముందుకు దూసుకెళ్లి, సచివాలయం గేటు వద్ద భైఠాయించారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మరిన్ని బలగాలను రంగంలోకి దింపి.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా.. 
గ్రూప్‌–1 మెయిన్స్‌ రీషెడ్యూల్, జీవో 29 రద్దు డిమాండ్లతో అభ్యర్థులు నాలుగైదు రోజులుగా ఆందోళన­లు చేస్తుండటం తెలిసిందే. ప్రతీరోజు అశోక్‌నగర్‌ చౌరస్తాలో ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం, పరీక్షలు సమీపించడంతో.. సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం వరకు అశోక్‌నగర్‌లోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన అభ్యర్థులు.. ఆ తర్వాత ఒక్కసారిగా సచివాలయం ముట్టడికి బయలుదేరారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ తదితరులతోపాటు ఆయా పార్టీలు, విద్యార్థి సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు మద్దతుగా ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పోలీసులు ముందే మోహరించినా.. 
సచివాలయం ముట్టడికి బయలుదేరిన గ్రూప్‌–1 అభ్యర్థులను అడ్డుకునేందుకు పోలీసులు ముందుగానే మోహరించారు. అశోక్‌నగర్‌ నుంచి అభ్యర్థులు ర్యాలీగా బయలుదేరగా.. అడుగడుగునా చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అభ్యర్థులు, వారికి మద్దతుగా వచ్చినవారు భారీ సంఖ్యలో ఉండటంతో.. పోలీసుల ప్రయత్నం విఫలమైంది. 

చాలా మంది అభ్యర్థులు సచివాలయం గేటు వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. సీఎం రేవంత్‌ డౌన్‌డౌన్, వి వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం జీవో 29 తెచ్చి రిజర్వేషన్లు అమలు కాకుండా అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన పోలీసులు.. అభ్యర్థులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. బైఠాయించినవారిని బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. 

తక్కువ సంఖ్యలో వ్యాన్లు ఉండటంతో అభ్యర్థులను తరలించడం పోలీసులకు కష్టతరమైంది. మరోవైపు అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలతోపాటు విద్యార్థి సంఘాల కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో.. దాదాపు రెండున్నర గంటల పాటు ఆందోళన కొనసాగింది. 

బీఆర్‌ఎస్‌ నేతలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్‌లను పోలీసులు బలవంతంగా వ్యాన్‌ ఎక్కించి బండ్లగూడకు తరలించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య పలుమార్లు తోపులాట జరిగింది. దీనితో సచివాలయం పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. 

బీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీ.. 
గ్రూప్‌–1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మద్దతు పలికారు. అశోక్‌నగర్‌ చౌరస్తాలో నిరసనలో, సచివాలయం ముట్టడికి చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు శ్రీనివాస్‌గౌడ్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, దాసోజు శ్రవణ్, ముఠాగోపాల్‌ తదితరులు కూడా ముట్టడిలో పాల్గొని మద్దతు ప్రకటించారు. అశోక్‌నగర్‌ చౌరస్తా నుంచి ర్యాలీ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ కట్టమైసమ్మ ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు అందులో కలిశారు. 

ఈ సమయంలో అప్పటికే ర్యాలీలో ఉన్న బీజేపీ నేతలు వారిని అడ్డుకుని.. ‘బీఆర్‌ఎస్‌ నేతలు గోబ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలు లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. 

బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులను బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 



గ్రూప్‌–1పై అభ్యర్థుల డిమాండ్లు ఇవీ.. 
రెండేళ్ల క్రితం ఇచ్చిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను జీఓ 55 ద్వారా చేపడతామని కమిషన్‌ ప్రకటించింది. కానీ ఈ ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌లో జీఓ 29 ద్వారా ఎంపిక చేస్తామని కమిషన్‌ పేర్కొంది. ఈ జీఓ 29 ద్వారా రిజర్వేషన్‌ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 

⇒ గ్రూప్‌–1 ఉద్యోగాల అర్హత పరీక్షలకు అభ్యర్థులంతా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా సన్నద్ధమయ్యారు. అయితే ప్రశ్నపత్రాల రూపకల్పనలో తెలుగు అకాడమీ పుస్తకాలకు బదులు ఇతర సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. 

⇒ గ్రూప్‌–1 ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఎస్టీ రిజర్వేషన్లను తొలుత 6శాతంగా, ఆ తర్వాత 10శాతంగా పేర్కొనడాన్ని ఆక్షేపిస్తున్నారు. 

⇒ పరీక్షల సన్నద్ధతకు సమయం కావాలని, పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు. 
⇒ గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్, పరీక్షలపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. తీర్పులు వచ్చే వరకు పరీక్షలు నిర్వహించొద్దని మరికొందరు డిమాండ్‌ చేస్తున్నారు. 

రేపటి నుంచే మెయిన్స్‌.. పకడ్బందీగా ఏర్పాట్లు 
ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు కలిపి మొత్తం 46 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును.. విస్తృతస్థాయిలో సీనియర్‌ అధికారులతో పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు పరీక్షల నిర్వహణను, బందోబస్తును పర్యవేక్షించాలని ఆదేశించింది. 

ప్రతి పరీక్ష హాల్, చీఫ్‌ సూపరింటెండెంట్‌ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పరీక్ష తీరును పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం నుంచి కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఇక సహాయకుల (స్క్రైబ్‌) సాయంతో పరీక్ష రాయనున్న దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా సమయం కేటాయిస్తున్నట్టు కమిషన్‌ ప్రకటించింది. స్క్రైబ్‌ల సాయంతో పరీక్షలు రాసేవారికి ప్రత్యేకంగా 4 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement