Group-1 Mains Exam
-
గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం.. పోలీసుల పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో యధావిధిగా పరీక్షలు జరగనున్నాయి. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. సమయం మించిపోవడంతో చివరి నిమిషంలో అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలకు పరుగులు తీశారు. తొలిరోజు జనరల్ ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. అభ్యర్థులను, వారి హాల్ టికెట్లను, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ రోజు నుంచి ఈనెల 27 వరకు పరీక్షలు జరగనున్నాయి. 563 పోస్టుల భర్తీ కోసం జరుగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కోసం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలో 46 కేంద్రాలు ఏర్పాటు చేశారు.మరోవైపు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, పదుల సంఖ్యలో వాహనాలను ఉంచారు. నందినగర్ ప్రాంతమంతా పోలీసు బలగాలతో నిండిపోయింది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతల నివాసద్దం పోలీసులు పహారా కాస్తున్నారు. నేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.కాగా గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, జీవో 29పై రద్దు విషయంలో అభ్యర్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ నేతలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై.. నేతల ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
'గ్రూప్–1'పై ఆదుర్దా.. ఆందోళన..
‘‘మేం రాజకీయాలకు అతీతం.. మా చివరి అవకాశాన్ని వృ«థా చేయకండి. ఆర్థికంగా, మానసికంగా నష్టపోయి ఉన్న మా బాధ వినండి. పరీక్షలు వాయిదా వేయండి’’.. – ఇదీ నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన ‘‘అంతా సవ్యంగానే ఉంది. జీవో 29 విషయంలో గానీ, మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల విషయంలోగానీ నిరుద్యోగులకు ఎలాంటి నష్టం లేదు. అపోహలకు పోకుండా పరీక్షలు రాయండి. అన్ని ఏర్పాట్లు చేశాం’’.. – ఇదీ పరీక్షలు నిర్వహించేయాలన్న ఆదుర్దాలో రాష్ట్ర ప్రభుత్వం సూచన.సాక్షి, హైదరాబాద్: .. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల విషయంలో ఇరుపక్షాలు పట్టువీడని పరిస్థితి. పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు ఓ వైపు ఆందోళనలను కొనసాగిస్తుండగానే.. మరోవైపు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసేసింది. జీవో 29 కారణంగా రిజర్వుడ్ కేటగిరీల వారికి నష్టం జరుగుతుందని అభ్యర్థులు మొత్తుకుంటుంటే.. అలాంటిదేమీ లేదంటూ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయాల్సిందేనంటూ ఆదివారం నిరుద్యోగులు, అభ్యర్థులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ చౌరస్తాలో బైఠాయించినా.. గాందీభవన్ ముట్టడికి ప్రయత్నించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కనీసం అభ్యర్థులు ప్రెస్‌మీట్ పెట్టి తమ ఆవేదన చెప్పుకొనేందుకు కూడా అనుమతించలేదు. ప్రతిపక్షాల మద్దతుతో.. ఆందోళన తెలుపుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులకు ప్రతిపక్షాలు బాసటగా నిలిచాయి. గ్రూప్–1 పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ నిరుద్యోగ యువతకు చెప్పిందేమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు చేస్తోందేమిటని నిలదీశారు. ఇక బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోవడం ఎందుకని, పరీక్షలను వాయిదా వేసి తప్పులను సరిదిద్దితే వచ్చిన నష్టమేంటని నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో ఏ ఒక్క వర్గానికీ నష్టం జరగలేదని, భవిష్యత్తులోనూ నష్టం జరగకుండా చూస్తానని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో భరోసా ఇస్తున్నానని ప్రకటించారు. ఇక నిరుద్యోగుల ఆందోళనలను పట్టించుకోకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సోమవారం నుంచి గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో.. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకంటూ పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు సుప్రీంకోర్టులో విచారణ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. అటు విద్యార్థుల ఆందోళన, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య.. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. -
గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన.. ముట్టడి.. ఉద్రిక్తం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, జీవో 29ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లతో అభ్యర్థులు శనివారం చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేల మంది అభ్యర్థులు, వారికి మద్దతుగా వచ్చిన వారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సచివాలయం వైపు దూసుకువచ్చారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించడంతో.. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో ఉన్న అభ్యర్థులు, నిరుద్యోగులు ముందుకు దూసుకెళ్లి, సచివాలయం గేటు వద్ద భైఠాయించారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మరిన్ని బలగాలను రంగంలోకి దింపి.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా.. గ్రూప్–1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు డిమాండ్లతో అభ్యర్థులు నాలుగైదు రోజులుగా ఆందోళనలు చేస్తుండటం తెలిసిందే. ప్రతీరోజు అశోక్‌నగర్ చౌరస్తాలో ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం, పరీక్షలు సమీపించడంతో.. సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం వరకు అశోక్‌నగర్‌లోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన అభ్యర్థులు.. ఆ తర్వాత ఒక్కసారిగా సచివాలయం ముట్టడికి బయలుదేరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులతోపాటు ఆయా పార్టీలు, విద్యార్థి సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు మద్దతుగా ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు ముందే మోహరించినా.. సచివాలయం ముట్టడికి బయలుదేరిన గ్రూప్–1 అభ్యర్థులను అడ్డుకునేందుకు పోలీసులు ముందుగానే మోహరించారు. అశోక్‌నగర్ నుంచి అభ్యర్థులు ర్యాలీగా బయలుదేరగా.. అడుగడుగునా చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అభ్యర్థులు, వారికి మద్దతుగా వచ్చినవారు భారీ సంఖ్యలో ఉండటంతో.. పోలీసుల ప్రయత్నం విఫలమైంది. చాలా మంది అభ్యర్థులు సచివాలయం గేటు వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. సీఎం రేవంత్ డౌన్‌డౌన్, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం జీవో 29 తెచ్చి రిజర్వేషన్లు అమలు కాకుండా అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన పోలీసులు.. అభ్యర్థులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. బైఠాయించినవారిని బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. తక్కువ సంఖ్యలో వ్యాన్లు ఉండటంతో అభ్యర్థులను తరలించడం పోలీసులకు కష్టతరమైంది. మరోవైపు అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతోపాటు విద్యార్థి సంఘాల కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో.. దాదాపు రెండున్నర గంటల పాటు ఆందోళన కొనసాగింది. బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్‌లను పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించి బండ్లగూడకు తరలించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య పలుమార్లు తోపులాట జరిగింది. దీనితో సచివాలయం పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ.. గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అశోక్‌నగర్ చౌరస్తాలో నిరసనలో, సచివాలయం ముట్టడికి చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్‌గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, దాసోజు శ్రవణ్, ముఠాగోపాల్ తదితరులు కూడా ముట్టడిలో పాల్గొని మద్దతు ప్రకటించారు. అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ర్యాలీ లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు అందులో కలిశారు. ఈ సమయంలో అప్పటికే ర్యాలీలో ఉన్న బీజేపీ నేతలు వారిని అడ్డుకుని.. ‘బీఆర్ఎస్ నేతలు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ నేతలు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులను బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రూప్–1పై అభ్యర్థుల డిమాండ్లు ఇవీ.. ⇒ రెండేళ్ల క్రితం ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను జీఓ 55 ద్వారా చేపడతామని కమిషన్ ప్రకటించింది. కానీ ఈ ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్లో జీఓ 29 ద్వారా ఎంపిక చేస్తామని కమిషన్ పేర్కొంది. ఈ జీఓ 29 ద్వారా రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ⇒ గ్రూప్–1 ఉద్యోగాల అర్హత పరీక్షలకు అభ్యర్థులంతా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా సన్నద్ధమయ్యారు. అయితే ప్రశ్నపత్రాల రూపకల్పనలో తెలుగు అకాడమీ పుస్తకాలకు బదులు ఇతర సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. ⇒ గ్రూప్–1 ఉద్యోగ నోటిఫికేషన్లో ఎస్టీ రిజర్వేషన్లను తొలుత 6శాతంగా, ఆ తర్వాత 10శాతంగా పేర్కొనడాన్ని ఆక్షేపిస్తున్నారు. ⇒ పరీక్షల సన్నద్ధతకు సమయం కావాలని, పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు. ⇒ గ్రూప్–1 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్, పరీక్షలపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. తీర్పులు వచ్చే వరకు పరీక్షలు నిర్వహించొద్దని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. రేపటి నుంచే మెయిన్స్.. పకడ్బందీగా ఏర్పాట్లు ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు కలిపి మొత్తం 46 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును.. విస్తృతస్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు పరీక్షల నిర్వహణను, బందోబస్తును పర్యవేక్షించాలని ఆదేశించింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పరీక్ష తీరును పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఇక సహాయకుల (స్క్రైబ్) సాయంతో పరీక్ష రాయనున్న దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా సమయం కేటాయిస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. స్క్రైబ్‌ల సాయంతో పరీక్షలు రాసేవారికి ప్రత్యేకంగా 4 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. -
TG గ్రూప్-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
Updatesసచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తతపోలీసులు, గ్రూప్-1 అభ్యర్థుల మధ్య తోపులాటగ్రూప్-1 వాయిదా వేయాలంటూ ఆందోళనజీవో 29 రద్దు చేయాలంటూ డిమాండ్బీజేపీ నేత బండి సంజయ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్గ్రూప్-1 అభ్యర్థులతో సచివాలయానికి వెళ్తుండగా అరెస్ట్సచివాలయం వైపు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్, దాసోజు శ్రవణ్‌లు అరెస్టుబండి సంజయ్‌ను బీజేపీ ఆఫీస్‌కు తరలించిన పోలీసులుసచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరింపుసచివాలయం గేట్లు మూసేసిన పోలీసులుఅంతకుముందు హైదరాబాద్ అశోక్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ మద్దతు పలికారు. వారిని పరామర్శించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్‌కు ర్యాలీగా బయల్దేరారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గ్రూప్-1 బాధితులకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు చెప్పేందుకే సచివాలయానికి వెళ్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి తీరుతామని చెప్పారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్‌నగర్ చౌరస్తాకు ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు. తక్షణమే జీవో 29ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులను ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అశోక్ నగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
గ్రూప్-1: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 పంచాయితీ మళ్లీ హైకోర్టుకు చేరింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.కాగా ఈనెల 15న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ముగ్గురు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. దీంతో మెయిన్స్ పరీక్షల నిర్వహణపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.సుప్రీంలోనూ పిటిషన్తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థి పీ రాంబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ప్రిలిమ్స్ నుంచి మెయిన్ ఎగ్జామినేషన్‌ను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అందరికీ వర్తింపజేయాలని కోరారు. ఓపెన్ కేటగిరీలో అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ విద్యార్థుల సంఖ్యను రిజర్వ్ కేటగిరి నుంచి మినహాయించవద్దని తెలిపారు. రిజర్వేషన్ కేటగిరి విద్యార్థుల పై ఇది ప్రభావం చూపుతుందని, సుప్రీంకోర్టు గత తీర్పులకు ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు.అక్టోబర్ 21న మెయిన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో ఈ కేసును త్వరగా విచారణ చేయాలని కోరారు. మెయిన్స్ ఎగ్జా మ్స్‌పై స్టే విధించకుండా ఈ కేసు పై నవంబర్ 20వ తేదీన తుది విచారణ జరపడం వల్ల విద్యార్థులకు అన్యాయమని అన్నారు. త్వరగా విచారణకు స్వీకరించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మెన్షన్ చేశారు. అయితే సోమవారం విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం తెలిపింది.కాగా ఈనెల 15న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈనెల 21 నుంచి 27 వరకు యథావిధిగా మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యర్థులు మళ్లీ కోర్టు మెట్లెక్కడంతో.. మెయిన్స్ పరీక్షల నిర్వహణపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.మరోవైపు జీవో 29 రద్దుతోపాటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సంబంధిత అభ్యర్థులు గురువారం హైదరాబాద్‌లో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. గాంధీనగర్‌లోని కెనరాబ్యాంకు సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యానంలో వారంతా ఆందోళన చేపట్టారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి వారిని అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 31 వేల మంది వరకు క్వాలిఫై అయితే.. 34 వేల మందిని మెయిన్స్ పరీక్షలను ఎలా అనుమతిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్-1పై న్యాయస్థానాల్లో ఉన్న కేసులు కొలిక్కివచ్చాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్
-
TG: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్షలు ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు టీజీపీఎస్సీ పరీక్షల తేదీలను వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.కాగా, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ శుక్రవారం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఇక, మెయిన్స్ పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో నిర్వహించనున్నారు. -
2018 గ్రూప్–1 మెయిన్స్‌కు మాన్యువల్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ (2018 నోటిఫికేషన్) సమాధాన పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేయిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మూడు నెలల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనంపై హైకోర్టు తీర్పును గౌరవిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 190 అసిస్టెంట్ ఇంజనీర్, 670 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల సంఖ్య పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇది పూర్తి కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రూప్–1లో ఇంటర్వ్యూల రద్దుకు జీవో వచ్చిందని.. దాని అమలుపై ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనంతోనే పారదర్శకత, నిష్పాక్షికత ముందుగా నోటిఫికేషన్లో పేర్కొనకుండా డిజిటల్ మూల్యాంకనం ఎలా చేయిస్తారని మాత్రమే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ఈ విధానాన్ని తప్పుపట్టలేదని చెప్పారు. ఇకపై ముందుగానే ప్రకటించి డిజిటల్ మూల్యాంకనం చేపట్టవచ్చని సూచించిందన్నారు. రానున్న నోటిఫికేషన్లన్నిటికీ డిజిటల్ మూల్యాంకనాన్నే అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి అధిక వ్యయమైనా పారదర్శకత, నిష్పాక్షికతతోపాటు అర్హులైన అభ్యర్థులకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. గ్రూప్–1 మెయిన్స్‌కు డిజిటల్ మూల్యాంకనం చేపడుతున్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనకపోయినా.. పరీక్షలకు ముందు నుంచే అభ్యర్థులకు తెలియజేస్తూ వచ్చామని గుర్తు చేశారు. దీన్ని అభ్యర్థులెవరూ వ్యతిరేకించకపోగా స్వాగతించారన్నారు. అయితే.. గ్రూప్–1 మెయిన్స్‌లో ఎంపిక కాని కొందరు డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుపడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో డిజిటల్ మూల్యాంకనం సివిల్స్‌లో విజయం సాధించిన కొందరు గ్రూప్–1లో ఎంపిక కాలేదని.. డిజిటల్ మూల్యాంకనంలో లోపాలున్నందు వల్లే ఇలా జరిగిందనే వాదన తప్పన్నారు. సివిల్స్‌లో ఐపీఎస్‌లుగా ఎంపికైనవారు తర్వాత ఐఏఎస్ కోసం మళ్లీ సివిల్స్ రాస్తే ప్రిలిమ్స్ కూడా ఉత్తీర్ణులు కాని సందర్భాలు అనేకమున్నాయన్నారు. అభ్యర్థి ఆరోజు పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగానే ఎంపికవ్వడం ఆధారపడి ఉంటుందని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనం ఎంతో శాస్త్రీయ విధానంలో జరిగిందన్నారు. ఏపీపీఎస్సీ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. గత 18 నెలల్లో కరోనా సమయంలోనూ 32 నోటిఫికేషన్లలోని 4 వేల పోస్టుల్లో 3 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పోస్టులు భర్తీ చేయలేదన్నారు. మిగిలిన పోస్టుల్లోనూ 450 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేక ఖాళీగా మిగిలిపోయాయన్నారు. మరో 550 పోస్టులు కోర్టు కేసులతో భర్తీ కాలేదని తెలిపారు. వరుసగా కొత్త నోటిఫికేషన్లు విడుదల కొత్తగా పలు పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. ఇప్పటికే పలు పోస్టుల నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని పోస్టులతో ఒకేసారి క్యాలెండర్‌ను ప్రకటించడం సాధ్యం కాదని వివరించారు. ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నందున పరీక్ష కేంద్రాల అందుబాటు, ఇతర విభాగాల పరీక్షల తేదీలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. -
నేటి నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 20 వరకు ఏడు సెషన్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తొలిసారిగా ట్యాబ్ ఆధారిత ఆన్లైన్ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందించనున్నారు. ఈ పరీక్షలకు 9,679 మంది దరఖాస్తు చేసుకోగా 8,099 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు అధికారిక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును కూడా వెంట తెచ్చుకోవాలి. కోవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థులను లోపలకు అనుమతిస్తారు. అభ్యర్థులు మాస్కులు, గ్లవుజ్‌లు ధరించడంతోపాటు శానిటైజర్‌ను తెచ్చుకోవాలి. సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అభ్యర్థులు తమ సీట్ల వద్ద ఏర్పాటు చేసిన ట్యాబులను పరీక్షకు ముందు ప్రకటించే పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేసి ప్రశ్నపత్రాలను చూడొచ్చు. ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఉంటాయి. అభ్యర్థులు తాము ఎంచుకున్న మాధ్యమంలో అన్ని పేపర్లను రాయాల్సి ఉంటుంది. రోజూ ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆలస్యంగా వచ్చే వారి కోసం మరో 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు స్పష్టం చేశారు. -
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు 14 నుంచి యథాతథం
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి యథాతథంగా జరగనున్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీ వరకు రోజూ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు మొత్తం 9,678 మంది హాజరు కానున్నారు. ఈ పరీక్షలను నవంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించేలా ఏపీపీఎస్సీ ఇంతకు ముందు షెడ్యూల్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఐదు ప్రశ్నలకు సంబంధించి లోపాలు ఉండడంతో కోర్టు చేసిన సూచనల ప్రకారం ఏపీపీఎస్సీ వాటిని పునః పరిశీలన చేయించింది. ఈ పరిశీలన అనంతరం కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు కూడా మెయిన్స్ రాసేందుకు అవకాశం ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పుపై జోక్యానికి నిరాకరణ ఐదు ప్రశ్నలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులకు నివేదించి, సరైన జవాబులను పరిశీలించి, వాటి ఆధారంగా తిరిగి మెరిట్ జాబితాను తయారు చేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ కొందరు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. ప్రశ్నలు, జవాబుల ప్రామాణికతను తేల్చాల్సింది నిపుణులే తప్ప, న్యాయస్థానాలు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. ట్యాబ్‌బేస్డ్ విధానంపై డెమో వీడియో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలను పంపిణీ చేయనున్నారు. అభ్యర్థులకు ప్రశ్నపత్రాన్ని ట్యాబ్ (ఎలక్ట్రానిక్ డివైస్) ద్వారా ఇస్తారు. ఇది తెలుగు, ఇంగ్లిష్‌లలో ఉంటుంది. అభ్యర్థులు క్వాలిఫయింగ్ పేపర్లయిన తెలుగు, ఇంగ్లిష్ మినహా మిగతా పేపర్లకు సమాధానాలను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలలో వారు ఎంచుకున్న భాషలో రాయవచ్చు. పరీక్ష పూర్తయిన అనంతరం అభ్యర్థులు ఆన్సర్ బుక్‌ను, ట్యాబ్‌ను తాము కూర్చున్న టేబుల్‌పై ఉంచడమో, లేదా ఇన్విజిలేటర్‌కు అందించడమో చేయాలి. వాటిని ఎవరూ బయటకు తీసుకువెళ్లరాదు. ట్యాబ్‌బేస్డ్ పరీక్ష విధానంపై డెమో వీడియో కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. -
సంస్కరణల దిశగా ఏపీపీఎస్సీ
సాక్షి, అమరావతి: వివిధ పోటీ పరీక్షల నిర్వహణలో సంస్కరణల దిశగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(ఏపీపీఎస్సీ) అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీ వంటి వాటికి తావు లేకుండా ప్రింటింగ్ విధానానికి స్వస్తి పలుకుతోంది. పరీక్షలకు హాజరయ్యే వారికి ఆన్లైన్లో ట్యాబ్‌ల ద్వారా ప్రశ్న పత్రాలను విడుదల చేయనుంది. రానున్న గ్రూప్–1 మెయిన్స్ నుంచే దీనికి శ్రీకారం చుడుతోంది. ఇందుకు సంబంధించి యూజర్ మాన్యువల్‌ను తాజాగా విడుదల చేసింది. ట్యాబ్‌ల ద్వారా విడుదలయ్యే ప్రశ్నపత్రాన్ని ఎలా ఓపెన్ చేయాలో అందులో వివరించారు. కొద్దికాలంక్రితం జరిగిన ఏపీపీఎస్సీ సమావేశంలో.. సంస్కరణల్లో భాగంగా చేపట్టాల్సిన అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నపత్రాల విడుదల నిర్ణయాన్ని ఫిబ్రవరి 4 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నుంచి అమల్లో పెడుతున్నారు. అంతా ట్యాబ్‌ల ద్వారానే.. ►గ్రూప్–1 అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాక పరీక్ష సమయానికి ముందు వారికి ట్యాబ్‌లను అందిస్తారు. వారికి నిర్దేశించిన పాస్వర్డ్ ద్వారా అది తెరుచుకుంటుంది. ►ఆన్లైన్లో పరీక్ష సమయానికి ముందు వారి ట్యాబ్‌లలో ప్రశ్నపత్రాలు అప్లోడ్ అవుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి మాత్రమే ఈ ప్రశ్నలు ట్యాబ్‌లలో ఓపెన్ అవుతాయి. అంతకుముందు వారు తెరిచినా పరీక్ష సమయం వరకు ప్రశ్నపత్రం రాదు. ►ప్రశ్నలు కూడా జంబ్లింగ్‌లో ఉంటాయి. పరీక్ష ముగింపు సమయానికి ‘పాప్స్‌అప్’ మెసేజ్ ట్యాబ్‌లో కనిపిస్తుంది. ఓకే నొక్కిన అనంతరం అభ్యర్థులు ట్యాబ్‌ను అక్కడే పెట్టి పరీక్ష హాలునుంచి బయటకు వెళ్లాలి. ►ఆన్లైన్లో ప్రశ్నపత్రాల విడుదల బాధ్యతను విశ్వసనీయత కలిగిన ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలకు ఏపీపీఎస్సీ అప్పగిస్తోంది. ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, కార్యదర్శి సహా ఏ ఒక్కరికీ ఈ ప్రశ్నల గురించిన సమాచారం తెలియకుండా వ్యవహారమంతా అత్యంత గోప్యతతో కొనసాగనుంది. డిజిటల్ మూల్యాంకనం దిశగా చర్యలు గ్రూప్–1 మెయిన్స్‌లో అభ్యర్థుల సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇకపై ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా డిజిటల్ మూల్యాంకనానికి ఏపీపీఎస్సీ చర్యలు చేపడుతోంది. ►ఆ మేరకు అభ్యర్థుల సమాధానాల పత్రాలను స్కాన్ చేయించి కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. ►మూల్యాంకనంలో పాల్గొనేవారి మూడ్‌ను బట్టి మార్కులకు ఆస్కారం లేకుండా ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో ఏయే పాయింట్లుండాలి? వాటికి ఎన్నెన్ని మార్కులు వేయాలి? అన్నది ముందుగానే నిపుణుల ద్వారా నిర్ణయిస్తారు. వాటిని ప్రశ్నలవారీగా పొందుపరుస్తారు. ►ఆయా ప్రశ్నలకు వేసే మార్కులి్న.. ఏ కారణంతో అన్ని వేయాల్సి వచి్చందో కూడా మూల్యాంకనదారు తన రిమార్కును పొందుపర్చాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకతకు వీలేర్పడనుంది. ►సమాధాన పత్రాలను ముందు ఇద్దరితో మూల్యాంకనం చేయిస్తారు. వారిచ్చే మార్కుల మధ్య 50 శాతం, అంతకుమించి వ్యత్యాసం ఉంటే మూడో నిపుణుడి ద్వారా మూల్యాంకనం చేయించనున్నారు. ►మూల్యాంకన సమయంలోనే ఆన్లైన్లో మార్కులు నమోదు చేయిస్తారు. ఆటోమేటిగ్గా కౌంటింగ్ అవుతుంది. దాన్ని తిరిగి ఎవరూ మార్పు చేసేందుకు వీలుండదు. హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు.. ఈసారి మెయిన్స్ పరీక్షలకు హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాలని కమిషన్ నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు ఆప్షన్లలోనూ మార్పులు చేసింది. పోటీ పరీక్షల కోసం వేలాదిమంది హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నందున వారందరికీ ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. -
మా జీవితాలతో ఆడుకుంటున్నారు
విశాఖ జిల్లాలో గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన పరీక్ష రాయనివ్వలేదని కన్నీటి పర్యంతం ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవలోని ఏక్యూజే డిగ్రీ కళాశాల కేంద్రంగా శనివారం నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష సందర్భంగా గందరగోళం నెలకొంది. పేపర్ లీకైందన్న ప్రచారంతో తొలత అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. అయితే పరీక్ష ప్రారంభమైన అనంతరం సుమారు 40 మంది విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. అధికారులు బయోమెట్రిక్ తీసుకోకుండా కాలయాపన చేసి సమయం అయిపోయిందంటూ పరీక్ష రాయనీకుండా పోలీసులతో బయటకు గెంటేశారని వారు ఆరోపించారు. పరీక్ష కేంద్రంలో పేపర్ లీకైందని, మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ తమకు న్యాయం కావాలంటూ కళాశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు. గంట పాటు పరీక్ష రాసిన అనంతరం తమను బయటకు గెంటి వేశారంటూ కొంత మంది కన్నీటి పర్యంతమయ్యారు. మొదట రోజు పరీక్ష రాస్తుండగా మధ్యలో బయోమెట్రిక్‌ని తీసుకున్నారని, కానీ ఈ రోజు తమ జీవితాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులు గొడవ చేయకుండా అక్కడి నుంచి పంపేశారు. అయితే ఆన్లైన్లో ద్వారా ప్రశ్న పత్రాలు కేంద్రంలోనే ముద్రించి అభ్యర్థులకు అందించడం వలన పేవర్ లీక్‌కు ఆస్కారం లేదని అధికారులు కొట్టి పారేస్తున్నారు. మెయిన్స్ రెండో పేపర్‌కు ఈ కేంద్రంలో 1417 మంది హాజరు కావాల్సి ఉండగా శనివారం 760 మంది వచ్చారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఉదయం 9 గంటలకు తమకు కేటాయించిన పరీక్ష హాలుకు హాజరై బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది. -
సెప్టెంబర్ 13 నుంచి గ్రూపు-1 మెయిన్స్
టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2011 గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఆ పరీక్షకు సంబంధించి 140 పోస్టులు తెలంగాణకు వచ్చాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటి భర్తీకి మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 13 నుంచి 23వరకు పరీక్షలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 312 పోస్టుల భర్తీకి 2011లో అప్పటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తరువాత ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే గ్రూపు-1 ప్రిలిమ్స్ కీలో ఆరు తప్పులు దొర్లాయని, వాటి వల్ల తాము నష్టపోయామని, మెయిన్స్‌కు అర్హతను కోల్పోయామని పేర్కొంటూ పలువులు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట ట్రిబ్యునల్, ఆ తరువాత హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్లింది. చివరకు సుప్రీంకోర్టులో 150 ప్రశ్నల్లో ఆరు తప్పులు దొర్లినట్లు తేలింది. అయితే అప్పట్లో తప్పులు దొర్లాయని అభ్యర్థులు పేర్కొన్నా.. అప్పటి ఏపీపీఎస్సీ పట్టించుకోకుండా మెయిన్స్ నిర్వహించి, ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. ప్రస్తుతం ఆ మెయిన్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన జరిగినందున 172 పోస్టులకు ఆంధ్రప్రదేశ్‌లో, 140 పోస్టులకు తెలంగాణలో వేర్వేరుగా మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమోదం తెలపాలని టీఎస్పీఎస్సీ.. ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఆమోదించడంతో వచ్చే నెలలో పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక అప్పట్లో గ్రూపు-1 ప్రిలిమ్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల తోపాటు 6 ప్రశ్నలను తొలగించగా అదనంగా అర్హత పొందే అభ్యర్థులతో ఈ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టింది. అర్హులకు సంబంధించిన వివరాలు, జాబితాలను అందజేయాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీని కోరింది. అవి త్వరలోనే టీఎస్పీఎస్సీకి అందనున్నాయి.