2018 గ్రూప్‌–1 మెయిన్స్‌కు మాన్యువల్‌ మూల్యాంకనం | Manual evaluation for 2018 Group-1 Mains | Sakshi
Sakshi News home page

2018 గ్రూప్‌–1 మెయిన్స్‌కు మాన్యువల్‌ మూల్యాంకనం

Published Tue, Oct 5 2021 4:35 AM | Last Updated on Tue, Oct 5 2021 4:35 AM

Manual evaluation for 2018 Group-1 Mains - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్‌–1 మెయిన్స్‌ (2018 నోటిఫికేషన్‌) సమాధాన పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేయిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు. మూడు నెలల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు గ్రూప్‌–1 మెయిన్స్‌ డిజిటల్‌ మూల్యాంకనంపై హైకోర్టు తీర్పును గౌరవిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 190 అసిస్టెంట్‌ ఇంజనీర్, 670 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల సంఖ్య పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇది పూర్తి కాగానే వెంటనే నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. గ్రూప్‌–1లో ఇంటర్వ్యూల రద్దుకు జీవో వచ్చిందని.. దాని అమలుపై ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని తెలిపారు.  

డిజిటల్‌ మూల్యాంకనంతోనే పారదర్శకత, నిష్పాక్షికత 
ముందుగా నోటిఫికేషన్‌లో పేర్కొనకుండా డిజిటల్‌ మూల్యాంకనం ఎలా చేయిస్తారని మాత్రమే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ఈ విధానాన్ని తప్పుపట్టలేదని చెప్పారు. ఇకపై ముందుగానే ప్రకటించి డిజిటల్‌ మూల్యాంకనం చేపట్టవచ్చని సూచించిందన్నారు. రానున్న నోటిఫికేషన్లన్నిటికీ డిజిటల్‌ మూల్యాంకనాన్నే అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి అధిక వ్యయమైనా పారదర్శకత, నిష్పాక్షికతతోపాటు అర్హులైన అభ్యర్థులకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. గ్రూప్‌–1 మెయిన్స్‌కు డిజిటల్‌ మూల్యాంకనం చేపడుతున్న విషయాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొనకపోయినా.. పరీక్షలకు ముందు నుంచే అభ్యర్థులకు తెలియజేస్తూ వచ్చామని గుర్తు చేశారు. దీన్ని అభ్యర్థులెవరూ వ్యతిరేకించకపోగా స్వాగతించారన్నారు. అయితే.. గ్రూప్‌–1 మెయిన్స్‌లో ఎంపిక కాని కొందరు డిజిటల్‌ మూల్యాంకనాన్ని తప్పుపడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని పేర్కొన్నారు.  

శాస్త్రీయ విధానంలో డిజిటల్‌ మూల్యాంకనం 
సివిల్స్‌లో విజయం సాధించిన కొందరు గ్రూప్‌–1లో ఎంపిక కాలేదని.. డిజిటల్‌ మూల్యాంకనంలో లోపాలున్నందు వల్లే ఇలా జరిగిందనే వాదన తప్పన్నారు. సివిల్స్‌లో ఐపీఎస్‌లుగా ఎంపికైనవారు తర్వాత ఐఏఎస్‌ కోసం మళ్లీ సివిల్స్‌ రాస్తే ప్రిలిమ్స్‌ కూడా ఉత్తీర్ణులు కాని సందర్భాలు అనేకమున్నాయన్నారు. అభ్యర్థి ఆరోజు పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగానే ఎంపికవ్వడం ఆధారపడి ఉంటుందని తెలిపారు. డిజిటల్‌ మూల్యాంకనం ఎంతో శాస్త్రీయ విధానంలో జరిగిందన్నారు. ఏపీపీఎస్సీ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. గత 18 నెలల్లో కరోనా సమయంలోనూ 32 నోటిఫికేషన్లలోని 4 వేల పోస్టుల్లో 3 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పోస్టులు భర్తీ చేయలేదన్నారు. మిగిలిన పోస్టుల్లోనూ 450 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేక ఖాళీగా మిగిలిపోయాయన్నారు. మరో 550 పోస్టులు కోర్టు కేసులతో భర్తీ కాలేదని తెలిపారు. 

వరుసగా కొత్త నోటిఫికేషన్లు విడుదల 
కొత్తగా పలు పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు. ఇప్పటికే పలు పోస్టుల నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని పోస్టులతో ఒకేసారి క్యాలెండర్‌ను ప్రకటించడం సాధ్యం కాదని వివరించారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నందున పరీక్ష కేంద్రాల అందుబాటు, ఇతర విభాగాల పరీక్షల తేదీలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement