హాల్ టిక్కెట్లను చూపిస్తున్న అభ్యర్థులు
విశాఖ జిల్లాలో గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన
పరీక్ష రాయనివ్వలేదని కన్నీటి పర్యంతం
ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవలోని ఏక్యూజే డిగ్రీ కళాశాల కేంద్రంగా శనివారం నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష సందర్భంగా గందరగోళం నెలకొంది. పేపర్ లీకైందన్న ప్రచారంతో తొలత అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. అయితే పరీక్ష ప్రారంభమైన అనంతరం సుమారు 40 మంది విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. అధికారులు బయోమెట్రిక్ తీసుకోకుండా కాలయాపన చేసి సమయం అయిపోయిందంటూ పరీక్ష రాయనీకుండా పోలీసులతో బయటకు గెంటేశారని వారు ఆరోపించారు.
పరీక్ష కేంద్రంలో పేపర్ లీకైందని, మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ తమకు న్యాయం కావాలంటూ కళాశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు. గంట పాటు పరీక్ష రాసిన అనంతరం తమను బయటకు గెంటి వేశారంటూ కొంత మంది కన్నీటి పర్యంతమయ్యారు. మొదట రోజు పరీక్ష రాస్తుండగా మధ్యలో బయోమెట్రిక్‌ని తీసుకున్నారని, కానీ ఈ రోజు తమ జీవితాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులు గొడవ చేయకుండా అక్కడి నుంచి పంపేశారు.
అయితే ఆన్‌లైన్‌లో ద్వారా ప్రశ్న పత్రాలు కేంద్రంలోనే ముద్రించి అభ్యర్థులకు అందించడం వలన పేవర్ లీక్‌కు ఆస్కారం లేదని అధికారులు కొట్టి పారేస్తున్నారు. మెయిన్స్ రెండో పేపర్‌కు ఈ కేంద్రంలో 1417 మంది హాజరు కావాల్సి ఉండగా శనివారం 760 మంది వచ్చారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఉదయం 9 గంటలకు తమకు కేటాయించిన పరీక్ష హాలుకు హాజరై బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది.