తర్లువాడలో తన మామిడి తోటలో రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్
ఆయనకు 67 ఏళ్లు. తలపండిన రైతు, అంతకుమించిన శాస్త్రవేత్త. చదివింది 8వ తరగతే. అయినా.. జ్ఞాన సంపన్నుడు. పురుగులను అరికట్టే బవేరియా బాసియానా అనే శిలీంద్రాన్ని 44 ఏళ్ల క్రితం ఆయన గుర్తించే నాటికి దాని గురించి శాస్త్రవేత్తలకే తెలీదు. అప్పటి నుంచి జీవన పురుగుమందు(బయో పెస్టిసైడ్)లను సొంతంగా తయారు చేసుకొని మిరప, పత్తి, మామిడి తదితర పంటలపై వాడుతున్నారు. అనేక సరికొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. దేశ విదేశీ యూనివర్సిటీలతో కలసి సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో శాస్త్రజ్ఞులతో కలిసి 3 పరిశోధనా వ్యాసాలు ప్రచురించిన ఘనాపాటి ఆయన. ప్రకృతి వ్యవసాయానికి బయో పెస్టిసైడ్స్ ఎంతో అవసరమంటున్న విలక్షణ రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్‌పై ప్రత్యేక కథనం.
స్వీయ అనుభవ జ్ఞానంతో వ్యవసాయ రంగంలో అద్భుత ఆవిష్కరణలు వెలువరిస్తున్న తపస్వి కొంగర రమేష్. వ్యవసాయ కుటుంబంలో ఆయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో. రైతు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నది విశాఖ జిల్లా ఆనందాపురం మండలం తర్లువాడలో. సొంతంగా తయారు చేసుకున్న జీవన పురుగుమందులతో మిరప, పత్తి, మామిడి వంటి పంటలను సాగు చేయటంతో పాటు.. అనేక విశిష్టమైన వంగడాలకు రూపుకల్పన చేసి భళా అనిపించుకుంటున్నారు.
ఎంతకాలమైనా నిల్వ ఉండే, అత్యంత తీపి, సువాసన కలిగిన మామిడి వంగడాలు.. విలక్షణమైన మిరప వంగడం.. ఆవులకు ప్రాణాంతకమైన బ్రూస్‌లోసిస్ వ్యాధిని హోమియో వైద్యంతో తగ్గించడం.. ఇవీ రైతు శాస్త్రవేత్తగా రమేష్ సాధించిన కొన్ని విజయాలు. బయో పెస్టిసైడ్స్‌పై ఆయన సుదీర్ఘకాలంగా చేస్తున్న పరిశోధనల గాథ ఆసక్తిదాయకం..
‘బవేరియా’ అప్పటికి ఎవరికీ తెలీదు
సొంత పొలంలో పత్తి తదితర పంటల ఆకులు తినే పురుగుల్ని చంపుతున్న బవేరియా బాసియానా అనే శిలీంధ్రాన్ని 1978లో 22 ఏళ్ల యువ రైతుగా రమేష్ తొలుత గుర్తించారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో లెక్కలేనన్ని పక్షులు మత్యువాత పడ్డాయి. పురుగులను తినే పక్షులు లేనందున వాటి సంఖ్య ఉధృతంగా పెరిగిపోయింది. ఒక పొలం నుంచి మరో పొలంలోనికి పురుగుల మంద గొర్రెల మందలా వచ్చేవి. ఏమి చేయాలో పాలుపోని ఆ దశలో.. కొన్ని పురుగులు సహజసిద్ధంగా చనిపోతున్నట్లు ఆయన గమనించారు. ఒక్కోసారి గుంపులో 90% పురుగులు చనిపోతూ ఉండేవి. చనిపోయిన పురుగులపై బూజు మాదిరిగా పేరుకొని ఉండేది.
ఏదో ఒక ఫంగస్ ఈ పురుగులను చంపగలుగుతోందని రమేష్ గమనించారు. ఆ ఫంగస్‌ను తిరిగి వాడుకొని పురుగులను చంపగలమా? అన్న జిజ్ఞాస కలిగింది. ఫంగస్ సోకి చనిపోయిన పురుగులను బాపట్ల వ్యవసాయ కళాశాల, గుంటూరు లాం ఫారం, హైదరాబాద్‌లోని ఇక్రిశాట్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు యూపీలోని పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు. ఆరేళ్లపాటు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలిసి వివరించినా దీనిపై వారు సరైన అవగాహనకు రాలేకపోయారని రమేష్ తెలిపారు. రమేష్ మాత్రం పట్టువీడలేదు. ప్రయత్నం మానలేదు.
చివరికి 1984లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల వ్యవసాయ కళాశాలలో పాథాలజిస్టు డాక్టర్ మొహిద్దీన్ దీన్ని ఇంగ్లాండులోని మైకలాజికల్ సొసైటీకి పంపంగా.. ఇది పురుగుల పాలిట మృత్యుపాశం వంటి ‘బివేరియా బాసియానా’ అనే శిలీంధ్రం అని వెల్లడైంది.
ఆ తరువాత కాలంలో శాస్త్రజ్ఞుల సూచనలతో రమేష్ స్వయంగా పరిశోధనలు చేపట్టారు. చనిపోయిన పురుగుపై నుంచి సేకరించిన ఈ ఫంగస్‌ను వేరు చేసి, తన వ్యవసాయ అవసరాల మేరకు శుద్ధమైన బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని అభివృద్ధి చేయటం, పంటలపై వాడి ఫలితాలు సాధించడం నేర్చుకున్నారు.
అతి తక్కువ ఖర్చుతో బవేరియా బాసియానా వంటి జీవన పురుగుమందులను పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తెస్తే రసాయనిక పురుగుమందుల అవసరం లేకుండా చేయవచ్చని రమేష్ భావించారు.
1987లో రాజేంద్రనగర్‌లో జరిగిన పత్తి శాస్త్రవేత్తల జాతీయ సదస్సులోనూ బవేరియా బాసియానాపై లోతైన పరిశోధనలు చేస్తే జల్లెడ పురుగులు, తెల్లదోమ ఆట కట్టించవచ్చని సూచించినా ఎవరికీ పట్టలేదు. అయినా రమేష్ తన పరిశోధనలు కొనసాగించారు.
రూ. 200 ఖర్చుతో పురుగులకు చెక్
బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్ వంటి శిలీంధ్రాలను శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసుకుని జాగ్రత్తగా వినియోగిస్తే ఎకరాకు సుమారు రూ. 200 ఖర్చుతోనే మిర్చి, పత్తి, మామిడి, కూరగాయ పంటల్లో పురుగుల బెడదను తప్పించుకోవచ్చని రమేష్ అంటున్నారు.
మిరప తదితర పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్ల తామర (బ్లాక్ త్రిప్స్)పై బవేరియా బాసియానా పని చేస్తున్నట్లు కొందరు రైతులు చెబుతున్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర రకాల ఫంగస్‌లతో కలుషితమై ప్రతికూల పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో ఇలాంటి బయో ఫెస్టిసైడ్‌ను వాడిన అనుభవం రైతులకు లేనందున శాస్త్రజ్ఞులు సరైన విధానాలను రైతులకు వివరించాలన్నారు.
ఏ స్ట్రెయిన్? ఏ పురుగు?
బవేరియా బాసియానా శిలీంద్రానికి సంబంధించి అనేక స్ట్రెయిన్లు ఉంటాయి. ఏ స్ట్రెయిన్ ఏ పంటపై, ఏయే పురుగులపై పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్థానికంగా పరిశోధనలు చేసి, జీవన పురుగుమందులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీవన ఎరువులపై పరిశోధనలు కొంత మెరుగ్గా జరుగుతున్నప్పటికీ.. జీవన పురుగుమందులపై పరిశోధనలు మన దేశంలో చురుగ్గా జరగటం లేదని రమేష్ తెలిపారు. బవేరియా శిలీంధ్రం అనేక దేశాల్లో 200 వరకు పురుగుల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్నదని రమేష్ తెలిపారు.
16 మందికి డాక్టరేట్లు
ఆంధ్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ తర్లువాడలోని తన క్షేత్రంలో పత్తి పంటపై బవేరియా ప్రభావంపై చింతా విశ్వేశ్వరరావు సహకారంతో పరిశోధనలు కొనసాగించారు. ఈ పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్స్‌లో రమేష్ ముఖ్య పరిశోధకుడిగా 3 పరిశోధనా పత్రాలు అచ్చయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 16 మంది శాస్త్రవేత్తలకు డాక్టరేట్లు వచ్చాయి. ఈ పరిశోధనలు అడకమిక్ స్థాయిలోనే ఆగిపోయాయి. బవేరియాకు చెందిన 4–5 స్ట్రెయిన్లను వేరు చేసి యూనివర్సిటీలో భద్రపరచటం సాధ్యపడిందే తప్ప.. వాటిని విస్తృతంగా రైతుల దగ్గరకు తీసుకెళ్లటం సాధ్యపడలేదని రమేష్ తెలిపారు. జర్మనీ శాస్త్రవేత్తలు తమ కాకుమాను పొలంలో నుంచి మట్టి నమూనాలు సేకరించి తీసుకువెళ్లి ఈ ఫంగస్‌ను వాడుతున్నా తెలిపారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో వైజాగ్‌లోని గీతం విశ్వవిద్యాలయంతో కలసి రమేష్ పరిశోధనలు చేశారు. గీతం యూనివర్సిటీ తన పేరుతో పేటెంట్‌కు దరఖాస్తు చేయబోగా, రమేష్ పేరును మొదటి ఆవిష్కర్తగా పెట్టాలని నాబార్డ్ సూచించింది. అయితే, వారు అంగీకరించకపోవటంతో వారితో నాబార్డ్ నిధులు ఇవ్వటం నిలిపివేసింది.
నూనెతో కలపి చల్లాలి
బవేరియా బాసియానా వంటి శిలీంధ్రాలతో తయారు చేసిన జీవన పురుగుమందులను సాయంత్రం పూట, తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నీటిలో కాకుండా ఏదో ఒక నూనె (ఎకరానికి 2 లీ.)లో శిలీంధ్రాన్ని కలిపి హెలీస్ప్రేయర్/డ్రోన్‌తో సాయంకాలం పూట పిచికారీ చేయాలని రమేష్ సూచిస్తున్నారు. రైతులు నీటితో కలిపి చల్లుతున్నారని, నీటి తేమ ఆరిపోతే శిలీంద్రపు బీజాలు చనిపోయి పురుగులపై ప్రభావం చూపలేకపోవచ్చు. అందుకని ఏదో ఒక నూనెలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం బాగుంటుందన్నారు.
నిద్రాణంగా ఉండే శిలీంద్రపు బీజాలకు తేమ తగిలితే జర్మినేట్ అవుతాయని, ఆ తర్వాత కొద్ది గంటల వరకే బతికి ఉంటాయి. ఆ లోగానే పురుగు వాటిని తినటం లేదా దాని శరరీంపై ఇవి పడటం జరిగితే.. ఆ శిలీంద్రం పురుగు దేహంలో పెరిగి దాన్ని చంపగలుగుతుంది. అందుకు రెండు–మూడు రోజుల సమయం పడుతుంది. నూనెతో కలిపి చల్లితే బీజాలు వారం, పది రోజుల పాటు గింజగానే ఉంటాయని.. పురుగులు ఈ బీజాలను తిన్నా, వాటి శరీరానికి తగిలినా చాలు. (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!)
శిలీంధ్రం బారిన పడిన చనిపోయిన తర్వాత 5 రోజుల్లోనే ఒక పురుగులో కోట్ల కొలదీ శిలీంధ్రపు బీజాలు పెరిగి, గాలి ద్వారా వ్యాపించి, పురుగులను నాశనం చేస్తాయి. ఇందువల్లనే జీవన పురుగుమందులు రసాయన పురుగు మందుల్లా వెంటనే కాక రెండు రోజుల తర్వాత ప్రభావం చూపుతాయి. రీసైక్లింగ్ పెస్టిసైడ్‌గానూ పనిచేస్తాయి. రైతులు చల్లిన గంటలోనే ఫలితం ఆశిస్తున్నారు తప్ప తర్వాత రోజుల్లో ఏమి అవుతుందో గమనించడం లేదని, ఈ విషయమై రైతుల్లో అవగాహన కలిగించాలని రమేష్ సూచిస్తున్నారు. జీవన పురుగుమందుల వల్ల పర్యావరణానికి, మనుషులకు, ఇతర జీవులకు ఎటువంటి సమస్యా ఉండదు.
– గేదెల శ్రీనివాసరెడ్డి, సాక్షి, తగరపువలస, విశాఖ జిల్లా
ప్రకృతి వ్యవసాయానికి తప్పనిసరి అవసరం
రైతులకు మోయలేని ఆర్థిక భారంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న రసాయనిక పురుగుమందులకు ఎన్నో విధాలుగా చక్కటి ప్రత్యామ్నాయం జీవన పురుగుమందులే. బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్, వర్టిసెల్ల లకాని వంటి శిలీంధ్రాలతో కూడిన జీవన పురుగుమందులపై ప్రభుత్వం విస్తృతంగా పరిశోధనలు జరపాలి. ఏయే పురుగులపై ఏయే స్రెయిన్లు పనిచేస్తున్నాయో నిర్థారించాలి. వ్యవసాయ వర్సిటీ నిపుణుల పర్యవేక్షణలో జీవన పురుగుమందులను ప్రభుత్వమే ఉత్పత్తి చేయించి రైతులకు అందుబాటులోకి తేవాలి. నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి రైతులను ముందుగా చైతన్యవంతం చేయాలి. ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి బయో పెస్టిసైడ్స్ తప్పనిసరి అవసరం.
– కొంగర రమేష్, నవనీత ఎవర్‌గ్రీన్స్, తర్లువాడ, విశాఖ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment