బర్మా బ్లాక్ రైస్ రకం పంటతో సతీష్
ఓ పల్లెటూరి కుర్రోడు బతుకు తెరువు కోసం పట్టణానికి వెళ్లాడు.. ఓ కంపెనీలో చేరి చీకూ చింతా లేకుండా కాలం గడిపేస్తున్నాడు.. ఆర్థికంగా అంతా బాగుంది. కానీ ఏదో వెలితి.. జీవితం యాంత్రికంగా సాగుతున్నట్టు ఫీలింగ్. పుట్టినూరులోనే వ్యవసాయం చేసి ఏదో సాధించాలి. ఎవరూ చేయని విధంగా సొంతంగా సాగు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి.. ఇదే ఆలోచన ఆ యువకుడిని తాను పనిచేస్తున్న కంపెనీకి రాజీనామా ఇచ్చేలా చేసింది. రైతు బిడ్డగా కొత్త జీవితం ప్రారంభించాలనే తపన ఎన్నో ప్రయోగాలకు ఉసిగొల్పింది. రైతుగా ఆరేళ్ల ప్రయాణం కోటీశ్వరుడిని చేయకపోయినా మానసిక సంతృప్తినిచ్చిందంటాడా యువ కర్షకుడు.
సాక్షి, విశాఖపట్నం(కోటవురట్ల): తంగేడు గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన ఒబ్బులరెడ్డి సతీష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం విశాఖలో ఓ కార్ల షోరూమ్‌లో చేరాడు. రెండేళ్లు పనిచేశాక సంతృప్తి కలగకపోవడంతో రైతు బిడ్డగానే ప్రయాణం కొనసాగించాలన్న ఆలోచనతో తిరిగి సొంతూరు చేరుకున్నాడు. తనకున్న రెండెకరాల పొలంలో వరిలో కొత్త వంగడాలను సాగు చేయడం ప్రారంభించాడు. ఇందుకు అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సహకారం లభించింది. దాంతో జిల్లాలో ఎక్కడా లేని వరి రకాలు పండించాలనే తపన కొత్త ప్రయోగాలకు దారితీసింది. సాగులో భారీ లాభాలు రాకపోయినా వచ్చిన ఫలసాయాన్ని చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందంటాడు సతీష్.
సుగర్ పేషెంట్లు, బాలింతలకు ఉపయోగపడే నవారా వరి పంట
ప్రయోగాలకు తన సొంత భూమి సరిపోకపోవడంతో లీజుకు 4 ఎకరాలు తీసుకున్నాడు. అందులో చిరుధాన్యాలు, కొత్త రకాలు పండిస్తూ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎరువులు వేయకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తూ వచ్చిన పంటను కొంత భాగం పెట్టుబడి కోసం అమ్ముకుని.. మరికొంత భాగాన్ని మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులకు ఉచితంగా ఇస్తాడు. ‘ఇవి వాడి చూడండి.. ఆరోగ్యం బాగుంటుందం’టూ వారిని ప్రోత్సహిస్తాడు. ఈ ఏడాది నవారా, బర్మా బ్లాక్ రైస్, మైసూరు మల్లిక, సిద్ధ సన్నాలు, ఆర్‌ఎన్నార్ 15048 రకాలను రెండున్నర ఎకరాల పరిధిలో సాగు చేశాడు. వీటన్నిటినీ కేవలం ఎద పద్ధతిలోనే సాగు చేసినట్టు సతీష్ తెలిపాడు. ఇలా సాగు చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఫలసాయం వచ్చినట్టు సతీష్ తెలిపాడు.
నవారా బియ్యంతో చక్కని ఆరోగ్యం
నవారా రకం.. 120 రోజుల్లో ఫలసాయం వస్తుంది. దీనికి ఎకరాకు రూ.9 వేలు పెట్టుబడి కాగా ఈ బియ్యం సుగర్ పేషెంట్లు, బాలింతలకు మంచిదని సతీష్ తెలిపాడు. బ్లాక్ రైస్, మైసూరు మల్లిక, సిద్ధ సన్నాలు రకాలు 150 రోజులకు, ఆర్‌ఎన్నార్ 15048 రకం 120 రోజుల్లోనే ఫలసాయం వస్తుందని తెలిపాడు. తనకు వ్యవసాయంలో చోడవరానికి చెందిన పూసర్ల రామారావు అనే రైతు ఆదర్శమని, కొత్త వంగడాలు, తనకు ఆసక్తి కలిగిన రకాలు ఆయన దగ్గర నుంచే తీసుకొచ్చి సాగు చేస్తున్నట్టు తెలిపాడు. ఇక అనకాపల్లిలో ఉన్న డాట్ సెంటర్ నుంచి వ్యవసాయ శాస్త్రవేత్త ప్రదీప్ సలహాలు, సూచనలు ఇస్తుంటారని యువ రైతు సతీష్ తెలిపాడు.
మానసిక సంతృప్తినిస్తోంది..
ఓ కారుల షోరూమ్‌లో మంచి ఉద్యోగమే చేసేవాడిని. కానీ సంతృప్తి లేక మానేసి సొంతూరికి వచ్చేసి వ్యవసాయం చేస్తున్నాను. ఆరేళ్లుగా వ్యవసాయంలో ఉన్నా. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. మా గురువు పూసర్ల రామారావు, అనకాపల్లి డాట్ సెంటర్ నుంచి శాస్త్రవేత్త ప్రదీప్ సలహాలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. చాలా మంది రైతులు నా దగ్గరకొచ్చి బర్మా బ్లాక్, నవారా రకాలు కొని పట్టుకెళుతుంటారు. విత్తనాలకు మాత్రమే ఇస్తా. మిగతా వాటిని నా సరదా కొద్దీ పంచుతా.
– ఒబ్బులరెడ్డి సతీష్, రైతు, తంగేడు
Comments
Please login to add a commentAdd a comment