సాక్షి, అమరావతి: ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కమిషనర్ నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ పొలంబాట పట్టనున్నారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించాలన్న సంకల్పంతో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రతి సీజన్‌లో వారానికి 2 రోజుల పాటు, రోజుకు 2 గ్రామాల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి మంగళ, బుధవారాల్లో తలపెట్టే ఈ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారు.
పరిశోధన కేంద్రాలు, కేవీకేల శాస్త్రవేత్తలనూ భాగస్వాములను చేస్తున్నారు. మండలాల వారీగా షెడ్యూల్ ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉదయం రైతు క్షేత్రాల్లో పర్యటించి పంటల స్థితిగతులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఆర్బీకేలో రైతులతో సమావేశమవుతారు. సీజన్ ముగిసే వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాకో కో–ఆర్డినేటర్‌ను నియమిస్తున్నారు. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు మండల స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంతో పాటు వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడం, సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందించడం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment