తగరపువలస(భీమిలి): నారాయణరాజుపేట.. నియోజకవర్గంలోనే అతి చిన్న పంచాయతీ. భీమిలి మండల శివారులో ఉంది. పంచాయతీలో ఎనిమిది వార్డులు, 402 మంది ఓటర్లు. విస్తీర్ణంలోనే కాకుండా ఆర్థికంగా కూడా బాగా వెనుకబడిన పంచాయతీ. బయట ప్రపంచానికి అంతగా పరిచయంలేని ఈ గ్రామంలో బాందేపురం సంతోష్‌కుమార్ సెంటు భూమి లేని కుటుంబంలో జన్మించాడు. ఎంఏ, బీఈడీ వరకు చదువుకున్నాడు.
ఉద్యోగంలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లో ఏపీసీఎన్‌ఎఫ్‌లో భాగమైన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్‌లో మూడేళ్లు పనిచేశాడు. గతేడాది ఆగస్టులో ప్రమాదం జరగడంతో ఇంటికే పరిమితమయ్యాడు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంలో ఇచ్చిన శిక్షణ ఊరికే కూర్చోనివ్వలేదు.
రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. అందులో ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు సాధిస్తున్నాడు. సోనామసూరి వేసి గట్లపై అంతరపంటలుగా బంతి, కంది చెట్లను వేయడం ద్వారా వరిని పురుగుల బెడద నుంచి కాపాడటమే కాకుండా అదనపు ఆదాయం పొందుతున్నాడు. సాధారణ వ్యవసాయంలో రైతులు ఎకరాకు రూ.25–30 వేలు ఖర్చు చేసి 25 బస్తాల ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. వీళ్లు పురుగుల నివారణకు రూ.2 వేల నుంచి 5 వేలు, ఎరువుల కోసం రూ.4 వేల నుంచి 8 వేలు ఖర్చు చేస్తున్నారు.
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో సంతోష్‌కుమార్ ఎకరాకు కేవలం రూ.13వేల ఖర్చుతో 28 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. ఈయన పురుగు మందులు, ఎరువుల స్థానంలో జీవామృతం, ఘనామృతం, నీమాస్త్రం, మీనామృతం, బీజామృతం, ఇంగువ ద్రావణం, పుల్లటి మజ్జిగ, అగ్ని అస్త్రాలకు కేవలం రూ.2వేల ఖర్చుతో సొంతంగా తయారు చేసుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాడు. వీటి తయారీకి కూడా నాసిరకం బెల్లం, పిండి తక్కువ ఖర్చుతో వినియోగిస్తున్నాడు. అంతేకాకుండా వ్యవసాయాధికారుల ప్రశంసలు అందుకుని తోటి రైతులకు మార్గదర్శిగా సాగుతున్నాడు. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే.. వ్యవసాయం చేస్తున్నాడు.
ఎం.ఎ.బీఈడీ చేసిన ఏ కుర్రాడైన ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలని అనుకుంటాడు. ఆ రంగంలో భావిభారత పౌరులను తీర్చిదిద్ది సంతృప్తి పడాలని భావిస్తాడు. అయితే నారాయణరాజుపేటకు చెందిన రైతు బాందేపురం సంతోష్‌కుమార్ దీనికి పూర్తి భిన్నం. సొంతంగా సెంటు భూమి లేకపోయినా ఆదర్శరైతుగా మారాడు. ఏపీసీఎన్‌ఎఎఫ్‌లో పనిచేసిన కాలంలో సంపాదించిన జ్ఞానంతో పొలంబాట పట్టాడు. కౌలుకు తీసుకున్న పొలంలో వ్యవసాయం మొదలుపెట్టాడు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ అద్భుతాలు సాధిస్తున్నాడు.
పక్షి స్థావరాలు.. పసుపు డబ్బాలు..గట్లపై పంటలు
పంటలో పచ్చ, తెల్లదోమల నివారణకు పసుపు డబ్బాలు వేలాడదీయాలి. ఇవి వీటికి ఆకర్షింపబడి అంతమవుతాయి. అలాగే నారును నాటిన 30 రోజుల నుంచి గింజ పాలుపోసే వరకు పక్షుల కోసం స్థావరాలు ఏర్పాటు చేయాలి. ఇవి పంటలను నాశనం చేసే పురుగులను తినివేస్తాయి. గట్లపై బంతి, కంది వంటి పంటలు వేయడం వలన ఎరపంటలుగా ఉపయోగపడి పక్క పొలాల నుంచి పురుగు బెడద తగ్గుతుంది. దీని వలన అదనపు ఆదాయం కూడా లభిస్తుంది.
సాగులో వినియోగించేవి ఇవే..
జీవామృతం: 200 లీటర్ల నీటికి 2 కిలోల పెసర/కంది/శనగ పిండి, 2 కిలోల బెల్లం పొడి, 5–10 కిలోల నాటు ఆవుల పేడ, 10 లీటర్ల గోమూత్రం, అరకిలో పుట్టమన్ను కలిపి సూర్యరశ్మి తగలకుండా నాలుగు రోజలు ఉదయం, సాయంత్రం కలుపుతూ పులియబెట్టాలి. దీనికి అయ్యే ఖర్చు కేవలం రూ.50. ఇలా పంట కాలంలో ఆరుసార్లు తయారు చేస్తాడు. దీనికి కూడా డ్రమ్ములు కాకుండా రూ.20 పాలిథిన్ కవర్లు ప్రతి మడి వద్ద కర్రల సాయంతో ఏర్పాటు చేస్తాడు. పొలానికి నీరు పెట్టినప్పుడు వినియోగిస్తున్నాడు.
మొదటి రకం ఘన జీవామృతం: 200 కిలోల పేడ, 2 కిలోల పిండి, 2కిలోల బెల్లం, అరకిలో పుట్టమన్ను, తగినంత గోమూత్రం కలిపి ఉండలుగా చేసి ఏడు రోజులు నీడలో ఆరబెట్టి పొడి చేసి పంటలో చల్లుకోవాలి. దీనికి అయ్యే ఖర్చు రూ.100. ఈ మిశ్రమాన్ని ఎకరాకు మూడుసార్లు వినియోగించుకోవచ్చు.
రెండో రకం ఘనజీవామృతం: ట్రాక్టర్ పశువుల గత్తం(సొంత పశువుల నుంచి 2500 కిలోలు), 400 లీటర్ల జీవామృతం కలిపి వారంరోజులు నిల్వ చేసుకుంటే పంటకు కావలసినంత పోషకాలు తయారవుతాయి. దీనికయ్యే ఖర్చు కేవలం రూ.300. జీరో బడ్జెట్‌తో అందరూ సాగుచేయవచ్చు
ప్రస్తుతం రైతులు తెలియక మితిమీరి రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వలన భూమి సారం, ప్రాణుల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. జీరో బడ్జెట్‌తో అందరూ మనకు అందుబాటులో ఉన్న వనరుల ద్వారా తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. భీమిలి వ్యవసాయాధికారులు నాకు అవసరమైన సూచనలు చేసి ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా నాట్లు సమయంలో చిగుళ్లు తుంచి ఉడుపు చేయడం వలన కాండం తొలిచే పురుగులు నివారించవచ్చు. ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఉపాధ్యాయవృత్తిలో చేరాలనుంది. నాకు సాగులో మా కుటుంబ సభ్యులు సహకరించవలన ఖర్చు బాగా తగ్గుతుంది.
– సంతోష్‌కుమార్, రైతు, నారాయణరాజుపేట, భీమిలి మండలం
విత్తనశుద్ధికి బీజామృతం
20 లీటర్ల నీటిలో 10 లీటర్ల గోమూత్రం చేర్చి ఇందులో 5 కిలోల పేడను మూట కట్టి 12 గంటలు వేలాడదీయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి 50 గ్రాముల సున్నం చేర్చి ఇందులో విత్తనాలు ముంచి గంటసేపు ఆరబెట్టాలి.
పురుగుల నివారణకు..
నీమాస్త్రం: 100 లీటర్ల నీటిలో 2 కిలోల పేడ, 5–10 లీటర్ల గోమూత్రం, 5–10 కిలోల వేపాకు ముద్ద కలిపి రెండు రోజులు పులియబెడితే 8 ట్యాంకులు వస్తుంది. దీనిని ఆకుమడికి 15 రోజుల్లో అయిదు లీటర్లు, మిగిలినది పంట ఉడిచిన 15, 20, 50 రోజుల్లో పిచికారీ చేసుకోవాలి. దీనికయ్యే ఖర్చు సున్నా. అగ్ని అస్త్రం: 10 లీటర్ల నీటిలో 5 కిలోల వేపాకు ముద్ద, కిలో పొగాకు, అరకిలో వంతున జిల్లేడు ఆకులు, వెల్లుల్లి ముద్ద, 2 కిలోల పచ్చిమిర్చి కలిపి నాలుగు పొంగులు వచ్చే వరకు మరిగించాలి. రెండు రోజులు నిల్వ ఉంచి వడకట్టి పురుగు ఉధృతిని బట్టి ట్యాంకు నీటిలో 300–700 ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అన్నిరకాల గొంగళి పురుగుల నివారణకు వాడతారు. దీనికయ్యే ఖర్చు రూ.120. అన్ని రకాల తెగుళ్లకు పుల్లటి మజ్జిగ: నాలుగు లీటర్ల గేదె మజ్జిగను వారంరోజులు పులియబెట్టి వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, పొడ తెగులును నివారించవచ్చు.
తెగుళ్లు ఎక్కువగా ఉంటే ఇంగువ ద్రావణం: 50 గ్రాముల ఇంగువను 5 లీటర్ల నీటిలో కలిపి మరిగించి పది రోజులు ఉంచాలి. దీనికి 100 ఎంఎల్ కుంకుమ రసం చేర్చి చల్లుకోవాలి.
తెగుళ్ల నివారణకు టానిక్ మీనామృతం: కిలో బెల్లం, 2 కిలోల చేపల వ్యర్థాలు లీటర్ నీటిలో చేర్చి రెండు వారాలు ఉంచి చల్లుకుంటే పంటకు మంచి టానిక్‌గా పనిచేస్తుంది. దీనికయ్యే ఖర్చు రూ.10.
Comments
Please login to add a commentAdd a comment