దేశ జనాభాలోని అత్యధికులు ఇంకా వ్యవసాయ రంగంలోనే ఉండిపోవడం, వారి ఆదాయాలు నామమాత్రం కావడం దురదృష్టకరం. కానీ, ఈ ప్రతికూ లతలోనే, మెరుగైన ఉపాధి కల్పనకు, డిమాండ్ పెంపుదలకు అవకాశాలను వెతుక్కోవచ్చు. 60 శాతం వ్యవసాయ ఆధారిత గ్రామీణ జనాభా ఆదాయా లను పెంచగలిగితే, అది దేశీయంగా మెజారిటీ జన సామాన్యం కొనుగోలు శక్తిని పెంచుతుంది.
ఉదాహరణకు బాగా ఆదాయం వచ్చిన ఒక పసుపు రైతు... కారు, బైకు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తే, ఆ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుదల దేశంలోని నగర ప్రాంతాలలో కూడా పారిశ్రామిక రంగానికి ఊతాన్నిచ్చి, తద్వారా నగరాలలో కొత్త ఉపాధి కల్పనకూ, డిమాండ్ పెరుగుదలకూ కారణం కాగలదు.
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. 2018 డిసెంబర్ నాటికే 45 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉందని జాతీయ నమూనా సర్వే గణాంకాలు వెలుగు చూశాయి. ఈ కారణాల చేతనే 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 22 శాతం (అంతకు ముందటిసంవత్సరం కంటే) అంటే, 46 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అదే కాలంలో స్టాక్ మార్కెట్‌లోకి వచ్చిన పెట్టుబడులను కూడా కలి పితే, దేశంలోకి వచ్చింది 70.97 బిలియన్ డాలర్లు.
అంతకు ముందరి సంవత్సరంలో ఈ మొత్తం 84.83 బిలియన్ డాలర్లు. ఇది, దేశీయంగా డిమాండ్ తగ్గుదలను సూచిస్తోంది. మరో పక్కన, భారతదేశం నుంచి విదేశాలకు పెట్టుబడులుగా వెళ్ళిన మొత్తం 2023లో, దానికి ముందరి సంవత్సరం కంటే 50 శాతం మేరన అంటే, 23.50 బిలియన్ డాలర్లకు మందగించింది. ఇది, అంతర్జాతీయంగా డిమాండ్ పతనాన్ని సూచి స్తోందని రిజర్వు బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి.
స్థూలంగా మనం గమనించవలసిన మరో అంశం కూడా ఉంది. అంతర్జాతీయంగా ప్రజల కొనుగోలు శక్తి పతనం కంటే, మన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి పతనం మరింత అధికం. దీనికి తార్కా ణం, 1992 – 2012 కాలంలో, సరుకుల వ్యాపారంలో మన దేశం తాలూకు లోటు (ఎగుమతి, దిగుమతుల మధ్యన వ్యత్యాసం) సాలీన సగటున కేవలం 11 బిలియన్ డాలర్లు ఉండగా, అది ప్రస్తుత దశాబ్ద కాలంలో సాలీన సగటున 150 బిలియన్ డాలర్లకు పెరిగింది. దేశం ఎగుమతి చేస్తోన్న దాని కంటే, దిగుమతి చేసుకుంటోన్న సరుకుల విలువ పెరిగిపోయింది.
దేశ స్థూలజాతీయ ఉత్పత్తిలో సరుకు ఉత్పత్తిరంగం వాటాను పెంచడం కోసం, 2014 సెప్టెంబర్‌లో ఆరంభమైన ‘మేకి¯Œ ఇండియా’ కార్యక్రమం విఫలం అయ్యింది. ఈ పథకం ఆరంభం తర్వాత,దేశంలో సరుకు ఉత్పత్తిరంగం ఎదగకపోగా, మరింత కుంచించుకుపోయింది. 2019లో ఉత్పత్తిని పెంచేందుకు కార్పొరేట్లకు ప్రోత్సాహకం పేరిట, 32 నుంచి 22% మేరకు తగ్గించిన కార్పొరేట్ పన్ను రేటు కూడా పెట్టుబడులను పెంచ లేకపోయింది. దీనితో పాటుగా 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పేరిట పి.ఎల్.ఐ. పథకాన్ని తెచ్చింది.
14 రంగాల కార్పొరేట్ ఉత్పత్తి సంస్థలకు ఈ పథకం కింద రాయితీలు ఇస్తోంది. అయినా, కేవలం 2, 3 పారిశ్రామిక రంగాలలో మాత్రమే కొద్ది మేరకు పెట్టుబడులు పెరిగాయి. ఈ పథకం కాస్తంత సానుకూల ఫలితాన్ని సాధించింది అనుకున్న స్మార్ట్ ఫోన్ల రంగంలో కూడా 2023 జూలై నాటికి వరుసగా రెండు త్రైమాసికాలలో ఎగు మతులు పతనం అయ్యాయి.
మరో పక్కన దేశీయ సేవారంగం పరిస్థితి కూడా అంతంత మాత్రమే. సేవా రంగంలోని కీలక విభాగాలైన ఐటీ, బీపీఓ రంగా లలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలలో, 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి ఉద్యో గుల సంఖ్య, అంతకు ముందరి కాలం కంటే తగ్గిపోయింది. ఇక, మిగిలింది దేశీయ వ్యవసాయ రంగం.
నేడు, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్న వారి సంఖ్య 48.3%.ఎంతో కొంత వ్యవసాయం ఆధారంగా జీవించే వారిని కూడా కలిపితే ఇది 60% అవుతుంది. ప్రస్తుతం, గ్రామీణ రైతు కుటుంబ నెలవారీ సగటు ఆదాయం 10,218 రూపాయలు మాత్రమే. ఇది జాతీయ తలసరి సగటు ఆదాయం అయిన 10,495 రూపాయలకంటే తక్కువ. ఈ 60% జనాభా ఆదాయాలను పెంచగలిగితే, అది దేశీయంగా మెజారిటీ జన సామాన్యం కొనుగోలు శక్తిని పెంచుతుంది. మరి వ్యవసాయ ఆదాయాల పెంపుదలకు చేయవలసింది ఏమిటి?
దీనికి ఒకటే జవాబు. వ్యవసాయదారులకు, వారి ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం. ‘గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇ¯Œ క్యుబేటర్’ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు, మన దేశ గ్రామీణ యువ జనులలోని 70– 85% మంది తక్కువ నిపుణతలు అవసరమైన చిన్న సరుకు ఉత్పత్తి రంగంలోనూ లేదా రిటైల్ రంగంలోనూ ఉపాధిని కోరుకుంటున్నారు.
అంటే, వారు లాభసాటిగా లేని వ్యవసాయం నుంచి బయట పడాలనుకుంటున్నారు. కానీ, వారిలోని 60% మంది ఉపాధి కోసం తమ గ్రామాన్ని విడిచి వెళ్ళాలని కోరుకోవడం లేదు. కోవిడ్ అనంతర కాలంలో నగర ప్రాంత కార్మికులలోని పెద్ద విభాగం తిరిగి తమ గ్రామాలకు వెళ్ళిపోయింది. నేడు నగర ప్రాంతా లలో ఉపాధి అవకాశాలు బలహీనంగా ఉండడంతో, వీరిలోని అత్య ధికులు తిరిగి నగరాలకు వచ్చేందుకు సిద్ధంగా లేరు.
గ్రామీణ రైతాంగ ఆదాయాలు పెరిగితే, అది దేశీయంగాడిమాండ్ కల్పనను ఏ విధంగా తేగలదనేదానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. 2006–07లో నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట బాగా పండింది. ఆ సంవత్సరంలో అంతర్జాతీయంగా కూడా భారీగా ధర పలికింది. ఫలితంగా, పసుపు రైతులు చాలామంది సొంతిళ్లు నిర్మించుకున్నారు. కార్లు, బైకులు కొనుక్కున్నారు. టీవీలు, ఫ్రిజ్‌లవంటి గృహోపకరణాలు కొనుగోలు చేశారు. ఇక్కడ గమనించవలసింది, రైతుకు గనుక మంచి ఆదాయం ఉంటే... సిమెంట్, స్టీలు, వాహనాలు, గృహోపకరణాల వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగు తుంది.
ఈ పారిశ్రామిక సరుకుల ఉత్పత్తి కేంద్రాలుగా నగరాలుఉంటాయి. కాబట్టి, గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుదల దేశంలోని నగర ప్రాంతాలలో కూడా పారిశ్రామిక రంగానికి ఊతాన్నిచ్చి, తద్వారా నగరాలలో కొత్త ఉపాధి కల్పనకూ, డిమాండ్ పెరుగుదలకూ కారణం కాగలదు. ప్రస్తుత స్థితిలో దేశ జనాభాలోని కేవలం 20–30% మంది కొనుగోలు శక్తిపై ఆధారపడి ఉన్న మార్కెట్ కంటే, 60%మంది జనాభా తాలూకు కొనుగోలు శక్తి దేశీయ మార్కెట్‌కూ, ఉపాధి కల్పనకూ అత్యుత్తమమైన స్థితిగా ఉండగలదు.
కానీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్ధతు ధరకు చట్టబద్ధతను కల్పించేందుకు సిద్ధంగా లేదు. 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత, గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకమైన, నగర ప్రాంత కార్పొ రేట్లకు అనుకూలమైన విధానాలు అమలయ్యాయి. ఈ విధానాల సారాంశం: రైతాంగ ఉత్పత్తులకు ధరలను తక్కువ స్థాయిలోనేఉంచడం. ఎందుకు? తద్వారా నగర ప్రాంతాలలో నిత్యావసర ధర లను తక్కువ స్థాయిలో ఉంచొచ్చు.
దీని వలన, ఈ కార్పొరేట్లపై నగర ప్రాంతాల ఉద్యోగులు, కార్మికుల నుంచి అధిక వేతనాల కోసం డిమాండ్లు ఉండవు. వ్యవసాయం లాభసాటిగా ఉంటే, గ్రామీణ యువజనులు ఉపాధి కోసం నగరాల బాట పట్టరు. అంటే, నగర ప్రాంతాలలో కార్మికుల సప్లై తగ్గి కొరత ఏర్పడుతుంది. దాని వలన, వారికి డిమాండ్ పెరిగి కార్పొరేట్లు ఎక్కువ జీతాలతో పనిలో పెట్టు కోవాల్సి వస్తుంది. నగరాలకు నిరంతర కార్మికుల సరఫరా కోసం వ్యవసాయాన్ని నష్టాలలోనే ఉంచాలి.
ఇప్పుడిప్పుడే కనీసం ఆలోచనల రూపంలో భిన్నమైన వాదనలు వినపడుతున్నాయి. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహా దారు అనంత నాగేశ్వర¯Œ ఇలా పేర్కొన్నారు: అంతర్జాతీయంగా వృద్ధి మందగిస్తోన్న దృష్టా ్య మనం ఏ రంగాన్ని కూడా తక్కువగా చూడగల స్థితిలో లేము. వ్యవసాయం కూడా ఆర్థిక వృద్ధికి చోదకశక్తిగా ఉండాలి. అంటే, వ్యవసాయాన్ని తిరిగి మరలా ‘ఆకర్షణీయంగా’ చేయగలగాలి.
ఉదాహరణకు, నేడు బ్రెజిల్‌లో యువజనులు, గతంలో కంటే ఎక్కు వగా వ్యవసాయంలో భాగం పంచుకుంటున్నారు. కాబట్టి, ప్రస్తుత ఆర్థిక సంక్షోభ కాలంలో వ్యవసాయ ఆధారిత సరికొత్త నమూనాని విస్తృతంగా ప్రజల్లో చర్చకు పెట్టాలి. ఇది మాత్రమే దేశీయ నిరు ద్యోగం, కొనుగోలు శక్తి పతనాలకు పరిష్కారంగా ఉండగలదు.
- వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు , మొబైల్: 98661 79615
- డి. పాపారావు
Comments
Please login to add a commentAdd a comment