గ్రామస్తులంతా కలిశారు.. దుక్కిటెద్దులు కొనిచ్చారు  | Villagers Bought And Given Bulls To Farmer In Station ghanpur | Sakshi
Sakshi News home page

గ్రామస్తులంతా కలిశారు.. దుక్కిటెద్దులు కొనిచ్చారు 

Published Tue, Jan 4 2022 4:43 PM | Last Updated on Tue, Jan 4 2022 4:44 PM

Villagers Bought And Given Bulls To Farmer In Station ghanpur - Sakshi

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌: దుక్కిటెద్దులే ఆ రైతుకు జీవనాధారం. పొలాలు దున్నేందుకు వాటితో కూలికి వెళ్తే గానీ కుంటుంబాన్ని పోషించుకోలేడు. అలాంటి ఆ దుక్కిటెద్దులు వారం రోజుల కిందట కుంటలో మునిగి మృత్యువాతపడ్డాయి. దీంతో ఆ రైతు పరిస్థితి దీనస్థితికి చేరుకుంది. ఈ సంగతిని ఆ గ్రామ యువత వాట్సాప్‌లో పోస్ట్‌ చేయగా.. స్పందించిన గ్రామస్తులు తలా కొంత పోగుచేసి రెండు దుక్కిటెద్దులను కొని రైతుకు అందజేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తానేదార్‌పల్లిలో సోమవారం జరిగిన ఈ సంఘటన ఆ గ్రామస్తుల ఔదార్యాన్ని చాటుతోంది.

గ్రామానికి చెందిన వంగపండ్ల రాజుకు 30 గుంటల భూమి ఉండగా, తన రెండు దుక్కిటెద్దులతో పొలాలు దున్నేందుకు కూలి కింద వెళ్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. వారం రోజుల కిందట ఓ రైతు బురద పొలం దున్నేందుకు దుక్కిటెద్దులతో కూలికి వెళ్లిన రాజు సాయంత్రం వాటిని కడిగేందుకు గ్రామంలోని కుంటలోకి వాటిని తోలాడు. రెండు ఎద్దులు అందులో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాయి. దీనిపై స్పందించిన 30 మంది గ్రామస్తులు చందా వేసుకుని రూ.65 వేలతో ఆ రైతుకు మళ్లీ రెండు దుక్కిటెద్దులను కొనిచ్చారు. దీంతో రాజు సంతోషం వ్యక్తం చేస్తూ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement