station ghanapur
-
BRS: రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు
సాక్షి,గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం(ఏప్రిల్14) భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఈ భేటీ సందర్భంగా రాజయ్యకు స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్‌కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాజయ్యకు కేసీఆర్ సూచించారు. కాగా, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ సీటును కేసీఆర్ రాజయ్యకే ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో సుధీర్‌కుమార్‌కు కేటాయించారు. అయినా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఇంఛార్జ్ బాధ్యతల కోసం రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. కవితతో ముగిసిన కేటీఆర్ ములాఖత్ -
కడియంకే టికెట్.. ఘన్‌పూర్‌లో ఉత్కంఠ!
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు మాత్రమే డిప్యూటీ సీఎంలుగా అయ్యారు. వారిద్దరు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి. వీళ్లిద్దరూ ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ నువ్వా-నేనా అనే స్థాయిలో పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాలు : సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న అధిష్టానం స్టేషన్ ఘనపూర్ విషయంలో తన మాట తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో టీడీపీ నుండి కడియం శ్రీహరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత BRSలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఏమ్మెల్సిగా ఉప ముఖ్యమంత్రిగా ( విద్యాశాఖ మంత్రి) పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. అనతి కాలంలోని పదవి పొగొట్టుకుని ఆయన స్థానంలో కడియం శ్రీహారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి మద్య అధికార పార్టీ బిఆర్ఎస్లో టిక్కెట్ వార్ సాగుతుంది. చివరికి ఈ వార్‌లో కడియాన్ని టికెట్ వరించింది. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, అభివృద్దికి నోచుకోకపోవడం. ధళితబందు పథకంలో కమీషన్ల దందా సాగడం, భూసమస్యలు పరిష్కారం కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులకు లభించకపోవడం ప్రధాన పార్టీలోని అభ్యర్థులు : బీఆర్ఎస్ కడియం శ్రీహరి (కన్ఫాం) కాంగ్రెస్ (ఆశావాహులు) సింగపురం ఇందిరా దొమ్మాటి సాంబయ్య బొల్లెపల్లి కృష్ణ బీజేపీ (ఆశావాహులు) డాక్టర్ విజయరామారవు మాదాసు వెంకటేష్ బోజ్జపల్లి సుభాస్ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్సీ ఓటర్లు ఆతర్వాత బిసి ఓటర్లు అధికంగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజకవర్గం రెండు జిల్లాల కలయికతో ఉంటుంది. జనగామతోపాటు హన్మకొండ జిల్లాలో నియోజకవర్గం ఉంది. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం (చిలుపూరు గుట్ట) సీతారామచంద్రస్వామి ఆలయం (జీడికల్) మల్లన్న గండి రిజర్వాయర్, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్, కిలా షాపూర్, జఫర్గడ్, తాటికొండ కోటలు, కాకతీయుల నాటి 500 పిల్లర్ టెంపుల్ (నిడిగొండ రఘునాథపల్లి మండలం) (పర్యాటకం) ఆకేరు వాగు(ఉప్పుగల్, జాఫర్గడ్ మండలం) -
కాంగ్రెస్‌కు ఆ జిల్లాలో అభ్యర్థుల కరువు.. సొంత పార్టీలో లేకపోతేనేం..
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈసారి అధికారంలోకి వస్తామనే ధీమా కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది. కాని అన్ని చోట్లా సరైన అభ్యర్థులు దొరకాలిగా? అందుకే గెలుపు గుర్రాల అన్వేషణ ప్రారంభించారు. సొంత పార్టీలో లేకపోతే పక్క పార్టీల వారికి గాలం వేస్తున్నారట పీసీసీ నేతలు. ఇంతకీ ఓరుగల్లులో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది?.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నడూ లేనివిధంగా ఐక్యతా రాగం వినిపిస్తోంది. నాయకుల మధ్య విభేదాలు ఎన్ని ఉన్నా..అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ కలిసికట్టుగా పనిచేసి గెలుద్దామన్న ఆలోచనలు కనిపిస్తున్నాయనే చర్చ అయితే సాగుతోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాలని అక్కడి నేతలు పట్టుదలతో ఉన్నారు. ఇంటిలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌కే అనుకూల పరిస్థితులున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ నాయకత్వం కూడా దీనిపై విభేదించడంలేదని, అయినప్పటికీ కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ఉండబోవని బీఆర్ఎస్ నాయకలు చెబుతున్నారు. కాని గులాబీ పార్టీ శిబిరంలో ఆందోళన కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను..11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం సొంతంగా చేయించుకున్న సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. భూ దందాలు, బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్లకు ఎమ్మెల్యేలు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చదవండి: రేపు వరంగల్‌లో బీజేపీ సన్నాహక సమావేశం.. ఆ నేతలు కలిసి పనిచేసేనా? కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీకే ఎమ్మెల్యేలు పరిమితం అవుతున్నారన్న విమర్శలు బాగా ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమకు ఆదాయాన్ని అందించేవారికే అపాయింట్మెంట్ ఇస్తూ.. ఎక్కువ సమయం వారికే కేటాయిస్తున్నారన్న చర్చ బలంగా నడుస్తోంది. పైగా ప్రతీ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్లో అంతర్గత కుమ్మలాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేతల తీరు ఇలాగే కొనసాగితే జిల్లాలో పరిస్థితి చేజారే ప్రమాదం ఉందని పలు సర్వేల ద్వారా బీఆర్ఎస్ అధిష్టానానికి స్పష్టంగా అర్థమైనట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని ఉన్న బలమైన నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నర్సంపేట, మహబూబాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలతో చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీకి చాలా మంది నాయకులున్నట్లు తెలుస్తోంది. పై మూడు సెగ్మెంట్లలో చర్చలు సఫలమైతే వారు త్వరలోనే హస్తం పార్టీలో చేరతారని అంటున్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని ప్రజలు విశ్వసిస్తున్నందున, నాయకులంతా ఐక్యంగా ఉంటూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలని హైకమాండ్ నేతలకు సూచించిందని సమాచారం. -
‘ఒళ్లు దగ్గర పెట్టుకో..’ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్
సాక్షి, జనగామ: స్టేషన్ ఘనపూర్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజయ్య మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ గడ్డ నీ అడ్డా జాగిరి కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చిల్లర పనులు చిలిపి చేష్టలు పనికిరావన్నారు. ‘తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకునే రాజయ్య, దేశంలో బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం ఘనత ఆయనదే. రాజయ్య తప్పు చేస్తూ తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన అవినీతిపై ఆధారాలు బయటపెడితే గ్రామాల్లో తిరగలేడు. నేను మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అన్ని మూసుకొని ఉంటున్నాను. మోసం చేసే అలవాటు, వెన్నుపోటు పొడిచే ఉద్దేశం నాకు లేదు. కేసీఆర్ నాయకత్వంలో వారి ఆదేశం మేరకు స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. రాజయ్యకు సూటిగా సవాల్ చేస్తున్నాను. స్టేషన్ ఘనపూర్ నీ అడ్డ అయితే పార్టీ ప్రస్తావన లేకుండా స్వచ్ఛంద సంస్థతో సర్వే చేపిద్దాం. ప్రజలు రాజయ్యను కోరుకుంటున్నారా.. శ్రీహరిని కోరుకుంటున్నారా? సర్వే రిపోర్ట్ తేల్చుతుంది. సర్వే రిపోర్టుకు కట్టుబడి ఉంటావా? నా సవాల్‌కు స్పందించు. డొంక తిరుగుడు సమాధానంతో తప్పించుకునే పరిస్థితి వద్దు. నా సవాల్‌కు సిద్ధం కాకపోతే ఎక్కడైనా నా ప్రస్తావన తీసుకురావద్దని వార్నింగ్ ఇస్తున్నా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజయ్య వ్యవహారంపై ఉమ్మడి జిల్లా మంత్రులు, హనుమకొండ జనగామ జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. పార్టీ అధిష్టానం అన్ని గమనిస్తోందని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కు.ని. ఆపరేషన్లు వికటించి మరో ఇద్దరు మృతి.. హైవేపై భారీ బందోబస్తు -
గ్రామస్తులంతా కలిశారు.. దుక్కిటెద్దులు కొనిచ్చారు
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: దుక్కిటెద్దులే ఆ రైతుకు జీవనాధారం. పొలాలు దున్నేందుకు వాటితో కూలికి వెళ్తే గానీ కుంటుంబాన్ని పోషించుకోలేడు. అలాంటి ఆ దుక్కిటెద్దులు వారం రోజుల కిందట కుంటలో మునిగి మృత్యువాతపడ్డాయి. దీంతో ఆ రైతు పరిస్థితి దీనస్థితికి చేరుకుంది. ఈ సంగతిని ఆ గ్రామ యువత వాట్సాప్‌లో పోస్ట్ చేయగా.. స్పందించిన గ్రామస్తులు తలా కొంత పోగుచేసి రెండు దుక్కిటెద్దులను కొని రైతుకు అందజేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్‌పల్లిలో సోమవారం జరిగిన ఈ సంఘటన ఆ గ్రామస్తుల ఔదార్యాన్ని చాటుతోంది. గ్రామానికి చెందిన వంగపండ్ల రాజుకు 30 గుంటల భూమి ఉండగా, తన రెండు దుక్కిటెద్దులతో పొలాలు దున్నేందుకు కూలి కింద వెళ్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. వారం రోజుల కిందట ఓ రైతు బురద పొలం దున్నేందుకు దుక్కిటెద్దులతో కూలికి వెళ్లిన రాజు సాయంత్రం వాటిని కడిగేందుకు గ్రామంలోని కుంటలోకి వాటిని తోలాడు. రెండు ఎద్దులు అందులో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాయి. దీనిపై స్పందించిన 30 మంది గ్రామస్తులు చందా వేసుకుని రూ.65 వేలతో ఆ రైతుకు మళ్లీ రెండు దుక్కిటెద్దులను కొనిచ్చారు. దీంతో రాజు సంతోషం వ్యక్తం చేస్తూ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
జనగామ: ఏసీ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, జనగామ: జనగామ జిల్లాలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో ఫ్లైఓవర్ ఎక్కుతుండగా ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ప్రయాణికులందరిని కిందకు దింపేశాడు. దీంతో బస్సులో ప్రాయణిస్తున్న 29 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. -
ప్రజాసేవకు పదవులు అవసరం లేదు: కడియం శ్రీహరి
సాక్షి, జనగామ: ప్రజా సేవ చేయడానికి పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కడియం శ్రీహరి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నియోజకవర్గానికి రావడానికి ఎవరి లైసెన్స్, అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని ధ్వజమెత్తారు. తనకి రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు పదవి ఉన్నా, లేకున్నా అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యం అన్నారు. ప్రజలకు మేలుచేసే పనులు ఎవరు చేసిన స్వాగతించి, అభినందించాలని పిలుపునిచ్చారు. పార్టీకి కట్టుబడి మాత్రమే ఉంటామని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి నిజాయితీగా పని చేస్తాడని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటాడని ప్రజల్లో తనకు గుర్తింపు ఉందన్నారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదుల పట్ల అవగాహన లేని వారు హడావుడి చేయడం విడ్డురంగా ఉందని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. చదవండి: కేసీఆర్ వరంగల్ పర్యటన: ఆ రోజు ఏం జరిగింది? కూకట్పల్లి: ఆట మధ్యలో ఫోన్ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య -
‘ఆధార్’ మోసగాడి అరెస్ట్
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్(వరంగల్) : ఆధార్ కార్డుల్లోని పేర్లు మారుస్తామని, తాను కలెక్టరేట్ నుంచి వచ్చానని నమిలిగొండ గ్రామస్తులను మోసం చేసిన ఆలువాల వినయ్కుమార్ని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వరబాబు తెలిపారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని బ్యాంక్ ఖాతాలలో వేస్తామని గ్రామస్తుల నుంచి ఆధార్‌కార్డు నంబర్లు, వేలిముద్రలు తీసుకుని దాదాపు రూ.2.60లక్షలు కాజేశాడని తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ వివరాలను వెల్లడించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని నెక్కొండ మండలం సీతాపురం గ్రామానికి చెందిన అలువాల వినయ్‌కుమార్ ఈ ఏడాది బీటెక్ పూర్తి చేశాడు. తమ గ్రామానికి చెందిన సం«ధ్యారాణిని చిల్పూరు గుట్ట వద్ద కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ఒక రూం అద్దెకు తీసుకుని ఓ ప్రైవేటు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైమ్ మినిష్టర్ గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎంజీడీఐఎస్ఏ)లో గ్రామాల్లోని యువతకు కంప్యూటర్‌పై అవగాహన, శిక్షణ కల్పించేందుకు అందులో విలేజ్ లెవల్ ఎంట్రప్రీనియర్గా చేరాడు. రెండు నెలల క్రితం పీఎంజీడీఐఎస్ఏ ప్రోగ్రాంలో భాగంగా చిల్పూరు మండలం నష్కల్‌లో పనిచేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాధించాలని.. ఆ ప్రోగ్రాంను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సాధించాలనే ఆలోచనతో ఆన్‌లైన్‌ను ఉపయోగించి దగా చేయాలనే ఆలోచనతో నమిలిగొండ గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఆధార్ నంబర్లు, వేలిముద్రలతో వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను తన ఖాతాలోకి మార్చుకునే అవకాశం ఆన్లైన్లో ఉందని తెలుసుకుని ముందుగా గ్రామ సర్పంచ్‌ను కలిశాడు. తాను జనగామ కలెక్టరేట్ నుంచి వచ్చానని, ఆధార్ కార్డులలో జిల్లా పేరు మారుస్తామని, తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సాయం డబ్బులు మీ ఖాతాలలో పడుతాయని సర్పంచ్‌తో నమ్మబలికాడు. అది నమ్మిన సర్పంచ్ మరుసటి రోజు ఉదయం గ్రామంలో డప్పు చాటింపు వేయించాడు. ల్యాప్‌టాప్, ఫింగర్ ప్రింట్ డివైసర్తో గ్రామానికి వచ్చిన ఆ మోసగాడు ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు ల్యాప్‌టాప్‌లో బయోమెట్రిక్ ద్వారా వారి ఆధార్ కార్డుల వివరాలు, వేలిముద్రలు తీసుకుని ఆన్లైన్లో డిజీపే యాప్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం రూ.2,59,500 డ్రా చేశాడు. బాధితులైన గ్రామస్తుల్లో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతా నుంచి రూ.600 నుంచి రూ.1000 వరకు అక్రమంగా కామన్ సర్వీస్ సెంటర్ నుంచి అతడి ఖాతాలోకి మార్చుకున్నాడు. ఖాతాల నుంచి డబ్బులు కట్ అయిన విషయం మెస్సేజ్‌ల ద్వారా తెలుసుకున్న బాధితులు సర్పంచ్‌ను సంప్రదించగా సర్పంచ్ ఆ హైటెక్ మోసగాడికి ఫోన్ చేశారు. అయితే అతను ఈ నెల 9న వస్తానని, అప్పటివరకు ఆగండని బుకాయించాడు. అది నమ్మిన వారు అతను రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల «ఫిర్యాదు మేరకు సీఐ రాజిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపెండ్యాలలో అదుపులోకి.. ఈ క్రమంలో అతడిని చిన్నపెండ్యాలలో స్థానిక ఎస్సై రవి ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైటెక్ మోసగాడిని విచారించగా నేరం అంగీకరించాడని, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. నిందితుడు మోసం చేసిన రూ.2,59,500లతో పాటు ల్యాప్‌టాప్, ఫింగర్ ప్రింట్ డివైసర్ను రికవరీ చేయడం జరిగింది. కోర్టులో విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరస్తుడు తన ఖాతాలోకి మార్చుకున్న డబ్బుల వివరాల ఆధారంగా బాధితులకు డబ్బులు తిరిగి అందేలా చూస్తామన్నారు. కేవలం వారం రోజుల లోపులోనే నిందితుడిని పట్టుకున్న సీఐ రాజిరెడ్డి, ఎస్సై శీలం రవియాదవ్‌ను, కానిస్టేబుళ్లు అనిల్, నవీన్, కుమార్‌లను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా వారిని ఫోన్లో సీపీ, డీసీపీ అభినందించినట్లు తెలిపారు. -
దేవుడికే శఠగోపం
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ : అక్రమార్కులు దేవుడికే శఠగోపం పెట్టారు. సుమారుగా రూ. కోటిన్నర విలువ చేసే ఎకరం దేవాలయ స్థలాన్ని నిసిగ్గుగా కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించారు. వాటిల్లో ఇప్పుడు నిర్మాణాలు చేపట్టారు. కబ్జా వెనుక ‘పెద్దల’ హస్తం ఉండడంతో అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. ఐదేళ్లుగా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇదీ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రం బస్టాండ్ సమీపంలోని శ్రీ తిరుమలనాథస్వామి దేవస్థానం భూముల పరిస్థితి. భూముల కబ్జాపై ప్రత్యేక కథనం.. స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రం బస్టాండ్ సమీపంలోని శ్రీ తిరుమలనాథస్వామి దేవస్థానం ఉంది. సర్వేనెంబర్ 641లో మూడెకరాల 29 గుంటల దేవాలయ భూమి ఉంది. 1999 సంవత్సరంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రెండెకరాల భూమిని ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఇంకా ఎకరం 29 గుంటల భూమి దేవాలయానికి ఉండాలి. దీనిపై ఐదేళ్ల క్రితం కొందరు అక్రమార్కుల కన్నుపడింది. దీంతో ‘పెద్దల’ సహకారంలో ఆక్రమణకు పూనుకున్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల అండదండలు, ఆర్థిక పలుకుబడితో అక్రమ పట్టాలు సృష్టించారు. యథేచ్చగా అమ్మకాలు చేపట్టారు. వాటిలో ప్రస్తుతం నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 40 గుంటలలోపు భూమి మాత్రమే ఉంది. అధికారులు సర్వేలతో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తే ఉన్న భూమి కూడా దక్కదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆలయభూమిలో సగం వరకు అన్యాక్రాంతం కాగా అందులో ఇప్పటికే పలువురు భవనాలు నిర్మించారు. సర్వేలతో కాలయాపన దేవస్థాన భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని భక్తులు, స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ చౌరస్తా నుంచి తిరుమలనాధస్వామి దేవస్థానం వరకు దేవాదాయ శాఖ అధికారులు గతంలో పలుమార్లు సర్వే చేశారు. ఏడాదిన్నర క్రితం తిరిగి సర్వే చేసిన అధికారులు దేవస్థాన భూమి వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. హద్దులుగా కనీలను నాటించారు. అయితే కొందరు కనీలను తొలగించి బాటగా చేశారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి దేవస్థాన భూములను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయ భూములను పరిరక్షించాలి తిరుమలనాధ దేవస్థాన భూములను పరిరక్షించాలి. ఇప్పటికే దేవస్థాన భూములు సగం వరకు అన్యాక్రాంతమయ్యాయి. అధికారులు ప్రత్యేక చొరవతో పనిచేయాలి. అన్యాక్రాంతమైన దేవస్థాన భూములను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి. -కుంభం కుమారస్వామి, దేవస్థాన చైర్మన్ -
యాత్ర సినిమా టికెట్లు పంపిణీ చేసిన అభిమాని
చిల్పూరు: యాత్ర సినిమా విడుదల సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన వైఎస్ఆర్ అభిమాని కల్లూరి శరత్ శుక్రవారం 150 టికెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ఆర్ అంటే అభిమానమని తెలిపారు. యాత్ర సినిమా విడుదల సందర్భంగా తన శక్తి మేరకు ఉచితంగా సినిమా టికెట్లను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను తిలకించి ఆదరించాలన్నారు. -
విలక్షణ తీర్పునకు వేదిక స్టేషన్..
చిల్పూరు /స్టేషన్‌ఘనన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ చరిత్ర ఘనంగానే ఉంది. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది. విలక్షణ తీర్పు, రాజకీయాలకు పురిటిగడ్డగా పేరొందింది. ఇక్కడ నమోదైన రికార్డును ఇంతవరకూ ఎవరూ అధిగమించలేదు. అందుకు నిదర్శనం దేశంలోనే సంచలం సృష్టించే విధంగా 1952లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్నికల్లో అప్పటి స్టేషన్‌ఘన్‌పూర్ తాలుడాలోని చిన్నపెండ్యాల గ్రమానికి చెందిన పెండ్యాల రాఘవరావు హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభలకు,వరంగల్ పార్లమెంట్ మూడు స్థానాల నుంచి పోటీ చేసి మూడు స్థానాల్లో గెలుపొందారు. ఇప్పటికీ ఆయన రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు. అంచనాలకు అందకుండా... ఇక్కడి ఒటర్లు నేతల అంచనాలకు అందకుండా విలక్షణ తీర్పునిస్తుంటారు. జిల్లాలు, మండలాలల పునర్విభజనలో భాగంగా రెండేళ్ల క్రితం డివిజన్ కేంద్రంగా ఏర్పడిన ఘన్పూర్ విద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ది దిశగా నడుస్తుంది. ఘన్పూర్, శివునిపల్లి జంట పట్టణాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళశాలలతో ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ది చెందుంతోంది. ఇక్కడ నుంచి గెలిచిన వారికి ఉన్నత పదవులను అందించి నియోజకవర్గంగా ఘన్‌పూర్‌కు ప్రతేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి గెలిచిన హయగ్రీవాచారి, గోక రామస్వామి, విజయరామరావు, కడయం శ్రీహరి, డాక్టర్ రాజయ్య మంత్రులుగా పనిచేశారు. డాక్టర్ రాజయ్య, కడియం శీహరిలు డిప్వూటీ సీఎంలుగా పని చేశారు. కడియం ఆపద్దర్మ డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తున్నారు. 1957లో నిమోజకవర్గ ఏర్పాటు... 1957లో ఘన్పూర్, ధర్మసాగర్, జఫర్గడ్ మండలాలతో జనరల్‌గా నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో కాంగ్రెస్ నుంచి బేతి కేశవరెడ్డి, 1962లో సీపీఐ అభ్వర్థి మెహన్రావు, 1967 లో స్వతంత్ర్య అభ్యర్థి తోకల లక్ష్మారెడ్డి, 1972లో కాంగ్రెస్ నుంచి హయగ్రీవాచారి గెలుపొందారు.1978లో ఘన్పూర్ ఎస్సీ రిజర్వ్డ్ నియాజకవర్గంగా ఏర్పడ్డాక కాంగ్రెస్ నుంచి గోక రామస్వామి, 1985లో నూతనంగా ఏర్పడిన టీడీపీ నుంచి బొజ్జపల్లి రాజయ్య గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నుంచి ఆరోగ్యం,1994,1999లో కడియం శ్రీహరి వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి గలిచి ఉమ్మడి రాష్ట్ర్రంలో వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్,టీఆర్ఎస్ పోత్తులో భాగంగా టీఆర్ఎస్కు చెందిన గుండె విజయరామారావు గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఉప ఎన్నికలు... 2008లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వైరుధ్వాల మధ్య ఉపఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో టీడీపీ నుంచి కడియం శీహరి గెలుపొందారు. అదేవిధంగా 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కడియం శీహరిపై డాక్టర్ రాజయ్య టీఆర్ఎస్ నుంచి భారీ మెజారిటితో గెలుపొంది మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గ పునర్విభజన.. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథాపల్లి. లింగాలఘనపురం, జఫర్గడ్, ధర్మసాగర్ ఐదు మండలాలతో ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ టి.అంజయ్య కడియం శ్రీహరిపై గెలుపొందారు. 2014లో సాధారణ ఎన్నికల్లో భాగంగా డాక్టర్ అంజయ్య గెలుపొందడంతో ఉప ముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొన్ని నెలల పాటు పనిచేశారు. మండలాలు ఇలా.. ఘన్పూర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు,జఫర్గడ్, రఘునాథపల్లి, లింగాల ఘనపురం,ధర్మసాగర్,వేలేరు మండలాలున్నాయి. కాగా ఓటర్ల పరంగా చూస్తే ఐనవోలు, కాజిపేట మండలాల్లోని కొన్ని గ్రామాలు నియోజకవర్గంలో చేరాయి. పట్టించుకుంటానని అన్నోళ్లకే ఓటేశా.. గాయల్లా తమని పట్టించుకుంటానని మాటిచ్చినోనికే ఓటేశాము. డబ్బులు,తాగుడు తెలియదు. ఓటేయడానికి సద్దులు కట్టుకుని పోయెటొళ్లం గిప్పడు ఓటు కోసం అందరు డబ్బులు ఇస్తాండ్రు. యెవరికి ఏయాల్నో తెలుస్తలేదు. -పులి రాజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్ సద్వినియోగం చేసుకుంటా... ఈసారే ఓటు హక్కు వచ్చింది. ప్రజలను పట్టించుకునే వారు.. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేసే వారికే ఓటు వేస్తా.పూర్తి స్థాయిలో ఆలోచించి నా ప్రథమ ఓటును మంచి వారికి వేసి సద్వినియోగం చేసుకుంటా. -చిలగాని అశిక, విద్యార్థిని,శివునిపల్లి -
కేటీఆర్ సమక్షంలోనే రాజయ్యకు పంచ్
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: తన కుమార్తెకు టిక్కెట్ రాలేదన్న అసంతృప్తితో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎట్టకేలకు మౌనం వీడారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టిక్కెట్ తన కుమార్తె కావ్యకు ఇవ్వకపోవడంతో కొంతకాలంగా అంటిముట్టనట్టు వ్యవహరించిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ పాల్గొన్న ఈ సభలో కడియం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి లేదు, సమ్మతి లేదంటూనే రాజయ్యకు చురకలు అంటించారు. ‘నేను నియోజకవర్గానికి రాకపోవడంతో అలిగానని బహుశా మీరంతా అనుకుంటున్నారేమో. నేను నిజంగా చెబుతున్నా రాజయ్య అప్పుడప్పుడు నా పట్ల తప్పుగా ప్రవర్తించినా నేను ఎన్నడూ అలా ప్రవర్తించలేదు. రాజయ్య నా తమ్ముడు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు. రాజయ్యను తప్పకుండా మనమందరం గెలిపించుకోవాలి. భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాల’ని కడియం శ్రీహరి అన్నారు. -
కిరణ్‌కుమార్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్
-
ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం...
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: సీల్డ్ కవర్ సీఎం కావాలా, సింహం లాంటి కేసీఆర్ కావాలో తేల్చుకోవాలని ఓటర్లను తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. తోడు దొంగలైన కాంగ్రెస్, టీడీపీ జట్టు కట్టి సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నాయని విమర్శించారు. రైతులను రాబందులుగా కాల్చుకుతిన్న ఈ రెండు పార్టీలు ఒక్కటైయ్యాయని, తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పట్లో తేలేది కాదన్నారు. ‘వాళ్లు సీట్లు పంచుకునే లోపు మనం స్వీట్లు పంచుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్నివర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎవరు చేయనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోపే విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాకపోయివుంటే ఇవన్నీ జరిగేవా అని ప్రశ్నించారు -
బస్సులో నుంచి పడి ప్రయాణికుడి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు నుంచి పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన వెంకటయ్య కూలి (48)నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం గూడూరుకు వెళ్లిన ఆయన రాత్రి తిరిగి ఆర్టీసీ బస్సులో సముద్రాలకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఫుట్‌బోర్డు వద్ద ఉన్న ఆయన సముద్రాల స్టేజీ సమీపాన ఉన్న పెట్రోల్‌బంక్ వద్ద ప్రమాదవశాత్తు బస్సు నుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రావుల నరేందర్ తెలిపారు. చెరువులో పడి పశువుల కాపరి.. జఫర్‌గఢ్: చెరువులో పడి పశువుల కాపరి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జఫర్‌గఢ్ గ్రామ శివారు వడ్డెగూడేనికి చెందిన కత్తుల సోమయ్య (63) అనే వ్యక్తి పశువులను కాస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. రోజు వారీగా సోమయ్య ఉదయాన్నే గ్రామానికి చెందిన గేదెలను తొలుకుని గ్రామ చివర ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో పశువులు మేస్తూ చెరువు అవతలి గట్టుకు వెళ్లాయి. ఇది గమనించిన సోమయ్య వాటిని పక్కకు తొలుకొచ్చేందుకు చెరువులోకి దిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా, మృతదేహాన్ని ముదిరాజ్ కులస్తుల సాయంతో బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. -
వాళ్లకు ఓటడిగే హక్కు లేదు..
* కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపండి * వరంగల్ ఉపఎన్నిక ప్రచార సభలో వైఎస్ జగన్ పిలుపు * ఎన్నికల హామీలన్నీ అటకెక్కించారు.. చేతగాని పాలన సాగిస్తున్నారు * విడతలుగానే రుణమాఫీ అని ఎన్నికల ముందు చెప్పారా? * అపరాధ వడ్డీలు కట్టడానికే సరిపోతున్న మాఫీ సొమ్ములు * అన్నదాతల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా..? * కొత్తగా ఒక్క 108 అంబులెన్సు కొన్నారా? * గతేడాది ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకే దిక్కులేదు * 79 రోజులుగా ఆశవర్కర్లు నిరాహారదీక్ష చేస్తున్నా పట్టదా? * ఏడాదిన్నరలో 396 ఇళ్లు కట్టడమే కేసీఆర్ ఘనత * ఏడాదికి 10 లక్షల ఇళ్లు కట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్ఆర్ * ఈ పాలనలో నింగినంటిన నిత్యావసరాల ధరలు.. * విలువలు, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ మాదే * ఓటడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఉంది.. * వరంగల్ ఉప ఎన్నిక ప్రచారానికి తెర వరంగల్ నుంచి సాక్షిప్రతినిధి: ‘రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ మాదే. ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 18 నెలలకు పైగా అవుతోంది. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. వాగ్దానాలు చేశారు. 18 నెలల పాలన ఎలా సాగింది? ఆప్పుడిచ్చిన హామీలు ఏమైనా నెరవేరాయా? ఒక్కసారి పరిశీలించిన తరువాత మనం ఈ ఉప ఎన్నికలో ఓటు వేద్దాం. మనం వేస్తున్న ఈ ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సరైన సమాధానం వస్తే ఆయనకే మద్దతు తెలుపుదాం. ఒకవేళ ఆయన నుంచి సరైన సమాధానం రాకపోతే ఆయన్ను బంగాళాఖాతంలో కలిపేందుకు ముందడుగు వేయాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం గురువారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ముగించారు. స్టేషన్ ఘన్పూర్ బస్టాండ్ చౌరస్తాకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఒక్క అంబులెన్సు కూడా కొనలేదు.. ‘పేదవాడు అప్పులపాలు కావడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయని వైఎస్ఆర్ భావించేవారు. హఠాత్తుగా ఏదైనా పెద్ద జబ్బు చేసినపుడు ఆ పేదవానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. దాన్నుంచి బైటపడడానికి గాను ఎంత వడ్డీ అయినా పరవాలేదని చెప్పి లక్షలు అప్పుచేసి వైద్యం చేయించినపుడు ఆ పేదవాడు అప్పులపాలైపోతాడు. వారికి ఆ పరిస్థితి రాకూడదని భావించిన వైఎస్ఆర్ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. 108కి ఫోన్‌చేస్తే 20నిమిషాల్లోనే పేదవాని ఇంటికి అంబులెన్సు వచ్చి రోగిని తీసుకెళ్లి పెద్దాసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించే పథకం అది. వైఎస్ఆర్ మనకు దూరమైపోయి ఆరేళ్లవుతోంది. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎనిమిదేళ్లవుతోంది. ఇన్నేళ్లయి నా ఇవాళ్టికి కూడా ఒక్క కొత్త అంబులెన్సును ఎందుకు కొనలేకపోయారు? ఇప్పటికీ అవే పాతబడ్డ అంబులెన్సులు. వాటి కి కనీసం టైర్లు కూడా మార్చలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెరగడం లేదు. దాంతో వాళ్లు సమ్మె చేస్తున్న పరిస్థితి. వారిని పట్టించుకునే నాథుడే లేడు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలని కేసీఆర్‌ను అడగండి. మీ పరిపాలన ఇంత దారుణంగా ఉందని ఆయనకు చెప్పండి. ఫీజు రీయింబర్స్మెంట్ గతేడాది బకాయిలకే దిక్కులేదు.. పేదవాని బిడ్డ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ వంటి పెద్ద చదువులు చదివినప్పుడే పేదరికం పోతుందని వైఎస్ఆర్ ఆలోచించారు. పెద్ద చదువుల కోసం పేదవాడు అప్పులపాలు కారాదన్న ఆలోచనతో ఆయన ఫీజు రీయిం బర్స్మెంట్ పథకాన్ని అమలుచేశారు. ఈ పథకం కింద గతఏడాది (2014-15)కి రూ.2,452 కోట్లు అవసరం ఉంటే వాటిలో కేవలం 922 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 1,530 కోట్లు బకాయిలున్నాయి. ఈ ఏడాది కాలేజీలు మొదలై ఇప్పటికే ఐదునెలలు గడచిపోయాయి. కాలేజీల్లో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం పూర్తయి సర్టిఫికెట్లు అడిగితే విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇదేం పరిపాలన కేసీఆర్‌గారూ అని గట్టిగా నిలదీయండి. వాళ్లకు ఓటడిగే హక్కు లేదు.. టీఆర్ఎస్ పాలించడం చేతకాని పార్టీ కనుక దానికి ఓటేయవద్దు. కాంగ్రెస్ అత్యంత నీచమైన పార్టీ. అవసరమైతే దండలేస్తారు. అవసరం తీరాక బండలేస్తారు. బతికినంత కాలం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వైఎస్ఆర్పై ఎలాంటి అభాండాలు వేశారో, ఆయన కుటుంబాన్ని ఎలా జైలుపాలు చేశారో మీ అం దరికీ తెలుసు. నాయకుడినే ఇబ్బందిపెట్టిన పార్టీకి ప్రజలు ఓ లెక్కా? ఎవరో సచిన్ పైలట్ అట. ఆయన వచ్చి మన దగ్గర మీటింగులు పెడుతున్నారు. ఆయనకు తెలుగువస్తుం దా? ఇలాంటి తెలుగు మాట్లాడలేని, తెలుగు అర్ధం చేసుకోలేని వాళ్లు మన దగ్గరకు వచ్చి మీటింగులు పెడితే వారిని చూసి మనం ఓటె య్యాలంట. బీజేపీకి ఓటేయమని చంద్రబాబు అడిగితే.. ఆంధ్రలో దారుణమైన అబద్ధాల పాలన సాగిస్తున్న విషయం గుర్తుచేయండి. వెన్నుపోటు, అబద్ధాలు, మోసం పునాదుల పైనే ఆయన పాలన సాగిస్తున్న విషయం చెప్పండి. విభజన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చని బీజేపీకి ఎందుకు ఓటేయాలని అడగండి. ఈ నాయకులకు బుద్ధి రావాలంటే, వారు నేలమీద నడవాలంటే మీ ఓటు ద్వారానే సాధ్యమౌతుంది. ఇప్పటికీ వైఎస్ఆర్ను గుం డెల్లో పెట్టుకున్న మీ అందరినీ ఓటడిగే హక్కు మాకే ఉంది. విలువలు, విశ్వసనీయత ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పార్టీ అభ్యర్థికి అఖండ విజ యం చేకూర్చండి.’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష నాయకుడు పాయం వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం సమన్వయకర్త తలశిల రఘురాం, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారె డ్డి మహేందర్, రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, డాక్టర్ పి. ప్రపుల్లారెడ్డి, గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బీ. రఘురాంరెడ్డి, జి. రాంభూపాల్‌రెడ్డి, బిమయ్యగౌడ్, సంపత్, సలీం సంతోశ్‌రెడ్డి, సుమిత్‌గుప్తా, బీష్వ రవీందర్, అమర్నాథ్రెడ్డి, సంజీవరావు, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బీ శ్రీనివాసరావు, అజయ్‌వర్మ, నర్రా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఆశ వర్కర్ల గోడు పట్టదా? ఆశవర్కర్లు 79 రోజు లుగా సమ్మె చేస్తున్నారు. నెలకు రూ.500 నుంచి రూ.1000 సంపాదించే ఆశావర్కర్లు కిలో కందిపప్పు రూ.230, కిలో టమోటా రూ.50 లకు కొని ఎలా బతగ్గలరు అన్న ఆలోచన చేయలేని అధ్వాన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. పత్తిని సీసీఐ కొనుగోలు చేయడంలేదు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,500 కూడా దక్కడం లేదు. వైఎస్ హయాంలో పత్తి క్వింటాల్‌కు రూ.6,700 పలికిన విషయాన్ని కేసీఆర్‌కు గుర్తుచేయం డి. ప్రతి దళితునికి మూడెకరాలు ఇస్తానన్న కేసీఆర్ 18 నెలల్లో 1,600 ఎకరాలు పంచారు. వైఎస్ఆర్ ఐదేళ్లలో 20.60 లక్షల ఎకరాలు పంపిణీ చేసిన విషయం తెలియజేయండి. ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎన్నికలకు ముందు బ్యాంకు రుణాలు కట్టొద్దన్నారు. పంటరుణాలన్నీ మాఫీ అన్నారు. అధికారంలోకి వచ్చాక నాలుగు విడతల్లో రుణమాఫీ అం టున్నారు. మాట ఇచ్చి వెనక్కు తగ్గినందునే ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. రుణాలు రెన్యువల్ కాకపోవడంతో పంటల బీమా కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందువల్లే ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాలుగువిడతలుగా రుణమాఫీ చేస్తానని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని కేసీఆర్‌ను నిలదీయండి. వైఎస్ దేశంతో పోటీ పడ్డారు, మరి మీరు? అధికారంలోకి వస్తే రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 18 నెలల కాలంలో ఆయన కట్టించిన ఇళ్లు కేవలం 396. అదే వైఎస్ఆర్ హయాంలో ఏడాదికి 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కట్టిస్తే వైఎస్ఆర్ ఒక్కరే మన రాష్ర్టంలో 48 లక్షల ఇళ్లు కట్టించి దేశంతో పోటీ పడ్డారు. 18 నెలల్లో 396 ఇళ్లు కట్టించి అదేదో గొప్పగా చేసినట్లు పేపర్లలో రాయించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని కేసీఆర్‌ను గట్టిగా అడగండి. బుట్ట పట్టుకొని మార్కెట్‌కు ఎపుడన్నా వెళ్లారా? ఎపుడన్నా మార్కెట్‌కు వెళ్లారా.. సరుకులు కొన్నారా అని కేసీఆర్‌ను అడగండి. కిలో కందిపప్పు రూ.230 ఉంది. గత ఏడాది రూ.90కే వచ్చేది. కిలో మినప్పప్పు రూ. 170 నుంచి 200 ఉంది. గతేడాది రూ.85 ఉం డేది. ఉల్లిపాయలు రూ.40 పలుకుతున్నాయి. గతేడాది రూ.22కే దొరి కేవి. టమోటా కేజీ రూ. 45 నుంచి 50 ఉన్నాయి. గతేడాది రూ.14 మాత్రమే. ఇలా ధరలన్నీ ఆకాశాన్ని అంటుతుంటే ఎలా కొనాలి? ఎలా బతకాలి కేసీఆర్‌గారూ.. ఇదేనా మీరు ప్రభుత్వం నడిపేతీరు అని నిలదీయండి. ఒకవైపేమో రైతుకు కనీస మద్దతు ధర దొరకడం లేదు. -
కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపండి...
-
కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపండి...
వరంగల్ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేందుకు ముందడుగు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ ఎన్నికల ప్రచార సభలో గురువారం ఆయన మాట్లాడుతూ....వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు తీసుకు వచ్చారో కేసీఆర్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుల ఆత్మహత్యలకు కారణమెవరో నిలదీయాలన్నారు. లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని, అయితే ఇంతవరకూ ఎన్ని రుణాలను మాఫీ చేశారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేస్తామంటున్నారని, ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. విడతల వారీగా కేసీఆర్ ఇచ్చే మొత్తంలో మూడొంతులు వడ్డీకే పోతోంది. ఇంకో వైపు రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్య ప్రజలు ఏం కొనేటట్లు లేదని వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... *వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో పత్తి క్వింటాల్‌కు రు.6,700 పలికింది. *ఇప్పుడు రూ.3 వేలు కూడా పలకడం లేదు. * రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు 4 విడతల్లో మాఫీ చేస్తామంటున్నారు. * ఏడాది క్రితం కందిపప్పు రూ.90 ఉంటే... ఇప్పుడు రూ.230 అయింది. * పెసరపప్పు రూ.85 నుంచి రు.200 అయింది. *టమాటాలు కేజీ రూ.14 నుంచి రూ.45 అయింది. * 18 నెలల్లో ఎన్ని ఇళ్లు కట్టించారో కేసీఆర్‌ను అడగండి. * వైఎస్ఆర్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. * కేసీఆర్ ఇప్పటివరకూ 394 ఇళ్లు మాత్రమే కట్టించారు. * ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. * ఇప్పటివరకూ ఎంతమందికి ఇచ్చారో కేసీఆర్‌ను అడగండి. * కేసీఆర్ కేవలం 1600 ఎకరాలు ఇచ్చి చేతలు దులపుకున్నారు. *వైఎస్ఆర్ పేదలకు 20 లక్షల 66 ఎకరాల భూమి పంపిణీ చేశారు. * పేదలు పెద్ద చదువులు చదవాలని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు? *కానీ కేసీఆర్ సర్కార్ గతేడాది బకాయిలే రూ.1530 కోట్లు చెల్లించలేదు. *పేదవారి వైద్య సేవల కోసం 108 వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు. *వైఎస్ఆర్ కొన్న అంబులెన్స్‌లు తప్ప... ఈ ప్రభుత్వం ఒక్క కొత్త అంబులెన్స్ కొనలేదు. *ఈ పాలకులకు బుద్ధి రావాలంటే రాజన్న రాజ్యం రావాలి. * కాంగ్రెస్ అంత అన్యాయమైన పార్టీ ఎక్కడా ఉండదు * ప్రాణాలు లెక్కచేయక వైఎస్ఆర్ ...కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే జగన్ పార్టీ విడిచిపెట్టాక వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ జైలుకు పంపింది. * కాంగ్రెస్ పార్టీకి విలువలు, విశ్వసనీయత లేదు. * చంద్రబాబు పాలన అంతా అబద్ధాలు, మోసం, వెన్నుపోటు. * అధికారంలోకి వచ్చి 18 నెలులు అయినా, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒక్క హామీ నెరవేర్చలేదు. *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉంది. *వైఎస్ఆర్ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి మేలు చేశారు. *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓటు వేసి గెలిపించండి. *ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. -
రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ నాయకుడైనా అడుగుపెడితే ఊరుకోనన్నారు. ఏదైనా నియోజకవర్గ ఇంచార్జీ, ఎమ్మెల్యేకు తెలిసే... జరగాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజయ్య.. అవినీతి ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తానన్నారు. మరోవైపు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని చెప్పటం విశేషం. కాగా తనను పదవి నుంచి తప్పించటంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారన్నారు. -
రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు