దేవుడికే శఠగోపం | Fraudsters Eye On Temple Land In Warangal | Sakshi
Sakshi News home page

దేవుడికే శఠగోపం

Published Mon, Jul 15 2019 9:14 AM | Last Updated on Mon, Jul 15 2019 9:16 AM

Fraudsters Eye On Temple Land In Warangal - Sakshi

ఘన్‌పూర్‌ శ్రీతిరుమలనాథ దేవస్థానం

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌ : అక్రమార్కులు దేవుడికే శఠగోపం పెట్టారు. సుమారుగా రూ. కోటిన్నర విలువ చేసే ఎకరం దేవాలయ స్థలాన్ని నిసిగ్గుగా కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించారు. వాటిల్లో ఇప్పుడు నిర్మాణాలు చేపట్టారు. కబ్జా వెనుక ‘పెద్దల’ హస్తం ఉండడంతో అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. ఐదేళ్లుగా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇదీ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రం బస్టాండ్‌ సమీపంలోని శ్రీ తిరుమలనాథస్వామి దేవస్థానం భూముల పరిస్థితి. భూముల కబ్జాపై ప్రత్యేక కథనం..

స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రం బస్టాండ్‌ సమీపంలోని శ్రీ తిరుమలనాథస్వామి దేవస్థానం ఉంది. సర్వేనెంబర్‌ 641లో మూడెకరాల 29 గుంటల దేవాలయ భూమి ఉంది. 1999 సంవత్సరంలో ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రెండెకరాల భూమిని ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఇంకా ఎకరం 29 గుంటల భూమి దేవాలయానికి ఉండాలి. దీనిపై ఐదేళ్ల క్రితం కొందరు అక్రమార్కుల కన్నుపడింది. దీంతో ‘పెద్దల’ సహకారంలో ఆక్రమణకు పూనుకున్నారు.

అధికారుల, ప్రజాప్రతినిధుల అండదండలు, ఆర్థిక పలుకుబడితో అక్రమ పట్టాలు సృష్టించారు. యథేచ్చగా అమ్మకాలు చేపట్టారు. వాటిలో ప్రస్తుతం నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 40 గుంటలలోపు భూమి మాత్రమే ఉంది. అధికారులు సర్వేలతో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తే ఉన్న భూమి కూడా దక్కదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆలయభూమిలో సగం వరకు అన్యాక్రాంతం కాగా అందులో ఇప్పటికే పలువురు భవనాలు నిర్మించారు. 

సర్వేలతో కాలయాపన
దేవస్థాన భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని భక్తులు, స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ చౌరస్తా నుంచి తిరుమలనాధస్వామి దేవస్థానం వరకు దేవాదాయ శాఖ అధికారులు గతంలో పలుమార్లు సర్వే చేశారు. ఏడాదిన్నర క్రితం తిరిగి సర్వే చేసిన అధికారులు దేవస్థాన భూమి వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. హద్దులుగా కనీలను నాటించారు. అయితే కొందరు కనీలను తొలగించి బాటగా చేశారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి దేవస్థాన భూములను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

ఆలయ భూములను పరిరక్షించాలి
తిరుమలనాధ దేవస్థాన భూములను పరిరక్షించాలి. ఇప్పటికే దేవస్థాన భూములు సగం వరకు అన్యాక్రాంతమయ్యాయి. అధికారులు ప్రత్యేక చొరవతో పనిచేయాలి. అన్యాక్రాంతమైన దేవస్థాన భూములను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి.   -కుంభం కుమారస్వామి, దేవస్థాన చైర్మన్‌ 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement