చిన్న, సన్నకారు మహిళా రైతులు సంఘటితమైతే ఆర్థికాభివృద్ధితో పాటు మంచి ఆహారం కూడా మారుమూల గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందనటానికి శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం ఓ తాజా ఉదాహరణ. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం ముసలిరెడ్డిగారిపల్లి కేంద్రంగా 2014లో ఈ సొసైటీ ఏర్పాటైంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం ఈ సొసైటీకి ఆది నుంచి అండగా నిలుస్తోంది. మల్లేపల్లి తదితర పరిసర గ్రామాలకు చెందిన 301 మంది సన్న, చిన్నకారు మహిళా రైతు కుటుంబాలలో ఆర్థిక, ఆహార భద్రతా వెలుగులు నింపుతున్న ఈ సొసైటీకి సీనియర్ ఎన్‌పిఓపి సర్టిఫైడ్ సేంద్రియ రైతు వడ్డెమాని మల్లేశ్వరమ్మ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. చదువు లేకపోయినా.. కఠోర శ్రమ, పట్టుదలతో సొసైటీ వార్షిక వ్యాపారాన్ని రూ.65 లక్షలకు పెంచగలిగిరామె. ఆమె కృషిని ‘నాబార్డు’ మెచ్చింది. నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ బాబు.ఎ., మార్కెటింగ్, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి చేతుల మీదుగా ఇటీవల విజయవాడలో ఉత్తమ మహిళా రైతు పుస్కారాన్ని మల్లేశ్వరమ్మ అందుకోవటం విశేషం.
సేంద్రియ సేద్యం ఇలా..
మల్లేశ్వరమ్మ, చంద్రశేఖరరెడ్డి దంపతులు ముసలిరెడ్డిగారిపల్లి పరిసరాల్లోని 4 చోట్ల ఉన్న 9 ఎకరాల వారసత్వ భూముల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. 2 ఎకరాల్లో మూడేళ్ల క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో అంతరపంటగా సాగు చేస్తున్న పత్తి ప్రస్తుతం కోతకు వచ్చింది. గతంలో వేరుశనగ తదితర ఆహార పంటలనే వేసే వారమని, అడవి పందుల బాధ పడలేక పత్తి వేశామని ఆమె తెలిపారు. ఆగస్టు ఆఖరుకు పత్తి తీత పూర్తవుతుంది. సగటున చెట్టుకు 35 కాయలు వచ్చాయి. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు.
ఈ రెండెకరాల్లో పత్తికి ముందు పెసర, మినుము సాగు చేశారు. మరో రెండెకరాల్లో పూర్తిగా పత్తి సాగు చేస్తున్నారు. 4 ఎకరాలను బొప్పాయి నాటడానికి సిద్ధం చేశారు. ఊరికి ఆనుకొని ఉన్న ఎకరంలో 32 రకాల కూరగాయలను ఇటీవలే విత్తామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సిఎస్‌ఎ క్షేత్ర సిబ్బంది తోడ్పాటుతో ఏ పంటైనా సేంద్రియంగానే సాగు చేస్తుండటం విశేషం. మూడేళ్లకోసారి దిబ్బ ఎరువు వేస్తారు. ప్రతి ఏటా టైప్ 2 ఘనజీవామృతం, వేపపిండి, కానుగ పిండి ఎరువుగా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి ద్రవ జీవామృతం, దశపర్ణి కషాయం, వేపనూనె పిచికారీ చేస్తున్నారు.
గుంటక, సైకిల్ వీడర్‌తో కలుపు సమస్యను కొంత మేరకు అధిగమిస్తున్నారు. ఈ 9 ఎకరాలు మెయిన్ కేసీ కెనాల్‌కు దగ్గర్లో ఉండటంతో భూగర్భ జలానికి కొదువ లేవు. ఒకే బోరుతో నీటిని తోడుతూ భూగర్భ పైపు లైను ద్వారా నాలుగు పొలాల్లోని పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. పెసర, మినుము, ధనియాలు, వాము, ఆవాలు, పత్తి, కంది, వేరుశనగ, గోధుమ తదితర పంటలు సీజన్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నారు. సేంద్రియంగానే సంతృప్తికరమైన దిగుబడులు తీస్తున్నామని మల్లేశ్వరమ్మ వివరించారు.
48 మందికి సేంద్రియ సర్టిఫికేషన్
శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘంలో దాదాపు 11 గ్రామాలకు చెందిన 301 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 48 మంది సేంద్రియ సేద్యం చేస్తున్నారు. మల్లేశ్వరమ్మ సహా పది మంది ఎన్‌పిఓపి థర్డ్‌పార్టీ సేంద్రియ సర్టిఫికేషన్ పొందారు. విదేశాలకూ ఎగుమతి చేయొచ్చు. మరో 40 మంది పీజీఎస్ సర్టిఫికేషన్ పొందారు.
రైతులకు విత్తనాలు తదితర ఉత్పాదకాలను తెప్పించి తక్కువ ధరకు సొసైటీ అందిస్తుంది. దీనితో పాటు కొర్రలు, అండుకొర్రలు, వేరుశనగలు, తెల్లజొన్న, గోధుమలు, ధనియాలు, కందులు, పెసలను సుమారు 15 క్వింటాళ్ల వరకు సభ్య రైతుల నుంచి కొనుగోలు చేసి సొసైటీ నిల్వ చేసి, ఏడాది పొడవునా శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రుణం తీసుకోకుండా సొసైటీ సొంత డబ్బుతోనే పరిమితంగా కొంటున్నామన్నారు. మల్లేశ్వరమ్మ తన సొంత ఇంటిలోనే కొన్ని గదులను కేటాయించి సొసైటీ ముడి ధాన్యాలను నిల్వ చేశారు.
చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను మరపట్టే యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. డిమాండ్ మేరకు ధాన్యాలను శుద్ధి చేయించి సరసమైన ధరకు విక్రయిస్తున్నారు. కందులను సంప్రదాయ పద్ధతుల్లో పప్పుగా తయారు చేస్తున్నారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పురుగు సమస్య ఉండదని తెలిపారు. ఇరుగు పొరుగు గ్రామాల వాళ్లు కూడా వచ్చి కొనుక్కెళ్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉన్న కొందరికి కూడా పంపుతున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు.
సోలార్ డ్రయ్యర్లతో ఒరుగులు, పొడులు
టొమాటోలు, నిమ్మకాయల వంటి పంటలకు మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, సోలార్ డ్రయ్యర్ల ద్వారా ఒరుగులు తయారు చేసి విక్రయించడం ఈ సొసైటీ చేస్తున్న మరో మంచి పని. రహేజా సోలార్ స్టార్టప్ సంస్థ 3 టన్నుల సామర్థ్యం గల 6 సోలార్ డ్రయ్యర్లను ఈ సొసైటీకి సిఎస్‌ఎ ద్వారా 80% సబ్సిడీపై 5 నెలల క్రితం అందించింది. గతంలో టొమాటో ఒరుగులు తయారు చేసి కిలో రూ. 340కి అమ్మినట్లు మల్లేశ్వరమ్మ తెలిపారు. 20 కిలోల టొమాటోలను ఎండబెడితే కిలో ఒరుగులు వస్తాయి.
రెండోరకం టొమాటోలు కిలో రూ. 8 చొప్పున కొని ఎండబెట్టి రహేజా సంస్థకే అమ్మామని తెలిపారు. ఇప్పుడు నిమ్మకాయల ఒరుగులు చేస్తున్నారు. 11 కిలోలకు 1 కిలో ఒరుగులు వస్తున్నాయి. ధర రూ.340కి అమ్ముతున్నారు. కరివేపాకు, మునగాకులను సైతం ఈ డ్రయ్యర్లలో ఎండబెట్టి పొడులను ఆర్డర్లపై సరఫరా చేస్తున్నామని ఆమె వివరించారు. సొసైటీ పనులు చేసే మహిళా సభ్యులకు వేతనానికి అదనంగా రోజుకు రూ. 5లను వారి పేరున భవిష్యనిధిగా జమ చేస్తున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. ఈ మహిళా రైతుల సహకార సంఘం సేవలు మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆశిద్దాం.
మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి ఉంది పజలకు ఆదాయం ఉంది, డబ్బుంది. కానీ, మంచి ఫుడ్డు లేదు. ఈ ఆలోచనతోనే సేంద్రియ ఆహారాన్ని పండించి అందించాలన్న ఆలోచన వచ్చింది. రసాయనాల్లేకుండా పండించిన రాగి సంగటి, కొర్రన్నం, సింగిల్ పాలిష్ బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు ఇంటిల్లపాదీ తింటున్నాం. దీని వల్ల మా ఆరోగ్యం ఎంతో బాగుంది. మా ఊళ్లో వాళ్లు 60% మా దగ్గర కొంటారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో 18 కుటుంబాలకు కూడా పార్శిల్ ద్వారా పంపుతున్నాం. మా కుటుంబానికి, ప్రజలకు కూడా మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి చాలా ఉంది. ఈ కీర్తి చాలు.
– వడ్డెమాని మల్లేశ్వరమ్మ (62815 06734), అధ్యక్షులు,
శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం,
ముసలిరెడ్డిగారిపల్లి, వేంపల్లె మం., వైఎస్సార్ కడప జిల్లా.
– పంతంగి రాంబాబు,
సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment