Organic farming methods
-
హైబ్రీడ్ రకాల సాగుకే మొగ్గుచూపుతున్న అన్నదాతలు
-
పుష్ప శ్రీవాణి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వ్యవసాయం
-
మల్లేశ్వరమ్మ సహకార వెలుగులు
చిన్న, సన్నకారు మహిళా రైతులు సంఘటితమైతే ఆర్థికాభివృద్ధితో పాటు మంచి ఆహారం కూడా మారుమూల గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందనటానికి శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం ఓ తాజా ఉదాహరణ. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం ముసలిరెడ్డిగారిపల్లి కేంద్రంగా 2014లో ఈ సొసైటీ ఏర్పాటైంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం ఈ సొసైటీకి ఆది నుంచి అండగా నిలుస్తోంది. మల్లేపల్లి తదితర పరిసర గ్రామాలకు చెందిన 301 మంది సన్న, చిన్నకారు మహిళా రైతు కుటుంబాలలో ఆర్థిక, ఆహార భద్రతా వెలుగులు నింపుతున్న ఈ సొసైటీకి సీనియర్ ఎన్‌పిఓపి సర్టిఫైడ్ సేంద్రియ రైతు వడ్డెమాని మల్లేశ్వరమ్మ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. చదువు లేకపోయినా.. కఠోర శ్రమ, పట్టుదలతో సొసైటీ వార్షిక వ్యాపారాన్ని రూ.65 లక్షలకు పెంచగలిగిరామె. ఆమె కృషిని ‘నాబార్డు’ మెచ్చింది. నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ బాబు.ఎ., మార్కెటింగ్, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి చేతుల మీదుగా ఇటీవల విజయవాడలో ఉత్తమ మహిళా రైతు పుస్కారాన్ని మల్లేశ్వరమ్మ అందుకోవటం విశేషం. సేంద్రియ సేద్యం ఇలా.. మల్లేశ్వరమ్మ, చంద్రశేఖరరెడ్డి దంపతులు ముసలిరెడ్డిగారిపల్లి పరిసరాల్లోని 4 చోట్ల ఉన్న 9 ఎకరాల వారసత్వ భూముల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. 2 ఎకరాల్లో మూడేళ్ల క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో అంతరపంటగా సాగు చేస్తున్న పత్తి ప్రస్తుతం కోతకు వచ్చింది. గతంలో వేరుశనగ తదితర ఆహార పంటలనే వేసే వారమని, అడవి పందుల బాధ పడలేక పత్తి వేశామని ఆమె తెలిపారు. ఆగస్టు ఆఖరుకు పత్తి తీత పూర్తవుతుంది. సగటున చెట్టుకు 35 కాయలు వచ్చాయి. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ రెండెకరాల్లో పత్తికి ముందు పెసర, మినుము సాగు చేశారు. మరో రెండెకరాల్లో పూర్తిగా పత్తి సాగు చేస్తున్నారు. 4 ఎకరాలను బొప్పాయి నాటడానికి సిద్ధం చేశారు. ఊరికి ఆనుకొని ఉన్న ఎకరంలో 32 రకాల కూరగాయలను ఇటీవలే విత్తామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సిఎస్ఎ క్షేత్ర సిబ్బంది తోడ్పాటుతో ఏ పంటైనా సేంద్రియంగానే సాగు చేస్తుండటం విశేషం. మూడేళ్లకోసారి దిబ్బ ఎరువు వేస్తారు. ప్రతి ఏటా టైప్ 2 ఘనజీవామృతం, వేపపిండి, కానుగ పిండి ఎరువుగా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి ద్రవ జీవామృతం, దశపర్ణి కషాయం, వేపనూనె పిచికారీ చేస్తున్నారు. గుంటక, సైకిల్ వీడర్‌తో కలుపు సమస్యను కొంత మేరకు అధిగమిస్తున్నారు. ఈ 9 ఎకరాలు మెయిన్ కేసీ కెనాల్‌కు దగ్గర్లో ఉండటంతో భూగర్భ జలానికి కొదువ లేవు. ఒకే బోరుతో నీటిని తోడుతూ భూగర్భ పైపు లైను ద్వారా నాలుగు పొలాల్లోని పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. పెసర, మినుము, ధనియాలు, వాము, ఆవాలు, పత్తి, కంది, వేరుశనగ, గోధుమ తదితర పంటలు సీజన్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నారు. సేంద్రియంగానే సంతృప్తికరమైన దిగుబడులు తీస్తున్నామని మల్లేశ్వరమ్మ వివరించారు. 48 మందికి సేంద్రియ సర్టిఫికేషన్ శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘంలో దాదాపు 11 గ్రామాలకు చెందిన 301 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 48 మంది సేంద్రియ సేద్యం చేస్తున్నారు. మల్లేశ్వరమ్మ సహా పది మంది ఎన్‌పిఓపి థర్డ్‌పార్టీ సేంద్రియ సర్టిఫికేషన్ పొందారు. విదేశాలకూ ఎగుమతి చేయొచ్చు. మరో 40 మంది పీజీఎస్ సర్టిఫికేషన్ పొందారు. రైతులకు విత్తనాలు తదితర ఉత్పాదకాలను తెప్పించి తక్కువ ధరకు సొసైటీ అందిస్తుంది. దీనితో పాటు కొర్రలు, అండుకొర్రలు, వేరుశనగలు, తెల్లజొన్న, గోధుమలు, ధనియాలు, కందులు, పెసలను సుమారు 15 క్వింటాళ్ల వరకు సభ్య రైతుల నుంచి కొనుగోలు చేసి సొసైటీ నిల్వ చేసి, ఏడాది పొడవునా శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రుణం తీసుకోకుండా సొసైటీ సొంత డబ్బుతోనే పరిమితంగా కొంటున్నామన్నారు. మల్లేశ్వరమ్మ తన సొంత ఇంటిలోనే కొన్ని గదులను కేటాయించి సొసైటీ ముడి ధాన్యాలను నిల్వ చేశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను మరపట్టే యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. డిమాండ్ మేరకు ధాన్యాలను శుద్ధి చేయించి సరసమైన ధరకు విక్రయిస్తున్నారు. కందులను సంప్రదాయ పద్ధతుల్లో పప్పుగా తయారు చేస్తున్నారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పురుగు సమస్య ఉండదని తెలిపారు. ఇరుగు పొరుగు గ్రామాల వాళ్లు కూడా వచ్చి కొనుక్కెళ్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉన్న కొందరికి కూడా పంపుతున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సోలార్ డ్రయ్యర్లతో ఒరుగులు, పొడులు టొమాటోలు, నిమ్మకాయల వంటి పంటలకు మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, సోలార్ డ్రయ్యర్ల ద్వారా ఒరుగులు తయారు చేసి విక్రయించడం ఈ సొసైటీ చేస్తున్న మరో మంచి పని. రహేజా సోలార్ స్టార్టప్ సంస్థ 3 టన్నుల సామర్థ్యం గల 6 సోలార్ డ్రయ్యర్లను ఈ సొసైటీకి సిఎస్ఎ ద్వారా 80% సబ్సిడీపై 5 నెలల క్రితం అందించింది. గతంలో టొమాటో ఒరుగులు తయారు చేసి కిలో రూ. 340కి అమ్మినట్లు మల్లేశ్వరమ్మ తెలిపారు. 20 కిలోల టొమాటోలను ఎండబెడితే కిలో ఒరుగులు వస్తాయి. రెండోరకం టొమాటోలు కిలో రూ. 8 చొప్పున కొని ఎండబెట్టి రహేజా సంస్థకే అమ్మామని తెలిపారు. ఇప్పుడు నిమ్మకాయల ఒరుగులు చేస్తున్నారు. 11 కిలోలకు 1 కిలో ఒరుగులు వస్తున్నాయి. ధర రూ.340కి అమ్ముతున్నారు. కరివేపాకు, మునగాకులను సైతం ఈ డ్రయ్యర్లలో ఎండబెట్టి పొడులను ఆర్డర్లపై సరఫరా చేస్తున్నామని ఆమె వివరించారు. సొసైటీ పనులు చేసే మహిళా సభ్యులకు వేతనానికి అదనంగా రోజుకు రూ. 5లను వారి పేరున భవిష్యనిధిగా జమ చేస్తున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. ఈ మహిళా రైతుల సహకార సంఘం సేవలు మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆశిద్దాం. మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి ఉంది పజలకు ఆదాయం ఉంది, డబ్బుంది. కానీ, మంచి ఫుడ్డు లేదు. ఈ ఆలోచనతోనే సేంద్రియ ఆహారాన్ని పండించి అందించాలన్న ఆలోచన వచ్చింది. రసాయనాల్లేకుండా పండించిన రాగి సంగటి, కొర్రన్నం, సింగిల్ పాలిష్ బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు ఇంటిల్లపాదీ తింటున్నాం. దీని వల్ల మా ఆరోగ్యం ఎంతో బాగుంది. మా ఊళ్లో వాళ్లు 60% మా దగ్గర కొంటారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో 18 కుటుంబాలకు కూడా పార్శిల్ ద్వారా పంపుతున్నాం. మా కుటుంబానికి, ప్రజలకు కూడా మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి చాలా ఉంది. ఈ కీర్తి చాలు. – వడ్డెమాని మల్లేశ్వరమ్మ (62815 06734), అధ్యక్షులు, శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం, ముసలిరెడ్డిగారిపల్లి, వేంపల్లె మం., వైఎస్సార్ కడప జిల్లా. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
తూములూరు రుచులు ఊరు
మొదట అక్కడ సేంద్రియ వ్యవసాయం మొదలైంది. తర్వాత స్త్రీలు సేంద్రియ తినుబండారాలు మొదలుపెట్టారు. రేకుల షెడ్డే వారి వంటశాల. అరవై పైబడిన బసవ పూర్ణమ్మ వారి మేస్త్రి. రాగి లడ్డు, జొన్నలడ్డు, నల్ల అరిసెలు, నువ్వుండలు... ఆ కారం... ఈ పచ్చడి... ఎక్కడా రసాయనాల ప్రస్తావన ఉండదు. ఆముదం, కాటుక, కుంకుమ కూడా తయారు చేస్తున్నారు. వీరికి ఆర్డర్లు భారీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న ఊరు స్త్రీల వల్ల కరకరలాడుతోంది. కళకళలాడుతోంది. 2018లో మొదలైంది ఈ కథ. ‘అమ్మా... మేము పండిస్తున్న సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ వస్తోంది. కాని ఇవే సేంద్రియ పదార్థాలతో చిరుతిండ్లు చేయించి అమ్మమని అందరూ అడుగుతున్నారు. నువ్వు తయారు చేస్తావా?’ అని అడిగాడు అవుతు వెంకటేశ్వర రెడ్డి తన తల్లి బసవ పూర్ణమ్మతో. ఆమెకు పల్లెటూరి పిండి వంటలు చేయడం వచ్చు. పండగలకు పబ్బాలకు పల్లెల్లో ఎవరు మాత్రం చేయరు? ‘అదెంత పనిరా చేస్తాను’ అంది. అలా గుంటూరు జిల్లాలోని కొల్లిపరకు ఆనుకుని ఉండే తూములూరు అనే ఊళ్లో సేంద్రియ చిరుతిళ్ల తయారీ మొదలైంది. బసవ పూర్ణమ్మ ఇంటిలో వేపచెట్టు కింద ఉండే పశువుల కొట్టాం కాస్తా వంటల షెడ్డుగా మారింది. ఊళ్లో వంటలు చేయడం ఆసక్తి ఉన్న స్త్రీలకు ఇదొక ఉపాధిగా ఉంటుందని వారిని తోడుకమ్మని ఆహ్వానించింది బసవ పూర్ణమ్మ. అలా ‘విలేజ్ మాల్’ అనే బ్రాండ్‌తో ‘కొల్లిపర మండల వ్యవసాయదారుల సంఘం’ అనే లేబుల్ కింద తూములూరు చిరుతిండ్ల తయారీ మొదలైంది. రసాయనాలు లేని తిండి ‘మా అబ్బాయీ, ఇంకొంత మంది రైతులు 2015 నుంచి కొల్లిపర చుట్టుపక్కల ఊళ్లలో సేంద్రియ పద్ధతిలో వరి, పసుపు,అరటి, నిమ్మ పండించడం మొదలుపెట్టారు. వీళ్లకు ‘గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం’ అనే సంఘం ఉంది. రైతులంతా కలిసి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ పంటను మంచి రేటుకు అమ్ముతున్నారు. ఆ సమయంలోనే మార్కెట్లో కల్తీ నూనెలతో, పిండ్లతో తయారై వస్తున్న పిండి వంటలు తినలేక సేంద్రియ పిండివంటల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మా అబ్బాయి ప్రోత్సాహంతో రంగంలోకి దిగాను. మొదట వేరుశనగ ఉండలు చేశాం. నిడదవోలు, మాండ్య లాంటి చోట్ల నుంచి సేంద్రియ బెల్లం తెప్పించి చేశాం. రుచి భలే ఉండటంతో డిమాండ్ వచ్చింది. అలా ఒక్కోటి పెంచుకుంటూ వెళ్లాం. ఇవాళ 30 రకాల చిరుతిళ్లు తయారు చేస్తున్నాం’ అని చెప్పింది బసవపూర్ణమ్మ. రాగిలడ్డు, జొన్న లడ్డు, నల్లబియ్యం అరిసెలు, నువ్వుండలు, పప్పుండలు, జంతికలు, కొబ్బరి లడ్డు, చెక్కలు ఇవి కాకుండా కరివేపాకు కారం, మునగాకు కారం వీరు తయారు చేస్తున్నారు. ఇక మామిడి, గోంగూర పచ్చడి గుంటూరు జిల్లా ప్రత్యేకం. అవీ చేస్తున్నారు. ‘సేంద్రియ నూనె పేరుతో అమ్ముతున్న నూనెలు కూడా కరెక్ట్‌గా లేవు. చాలా నూనెలు ట్రై చేసి రాజస్థాన్‌లో ఒక చోట నుంచి మంచి సేంద్రియ నూనె తెప్పించి ఈ పిండివంటలకు వాడుతున్నాం’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. ఆమె అజమాయిషీలో సాగే వంటశాలకు వెళితే చెట్టు కింద కట్టెలపొయ్యి మీద ఆముదం గింజలు కుతకుత ఉడికిస్తుంటారు కొందరు. వరండాలో జీడిపాకం ఆరబెట్టి, ఉండలు చుడుతుంటారు కొందరు. చిరుధాన్యాలతో లడ్డూలు, నల్లబియ్యంతో అరిసెలు చేస్తారు మరికొందరు. అంతా కళకళగా ఉంటుంది. ఆముదం, కుంకుమ ‘మార్కెట్లో సిసలైన ఆముదం దొరకడం లేదు. మా చిన్నప్పుడు ఎవరి ఆముదం వారే తయారు చేసుకునేవాళ్లం. అందుకనే ఆముదం కూడా తయారు చేస్తున్నా. లీటరు 800 పెట్టినా ఎగరేసుకుని పోతున్నారు. పసుపు నుంచి కుంకుమ తయారు చేసే పద్ధతి ఉంది. అలా స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తున్నా. ఆముదం గింజల నుంచే కాటుక తయారు చేయవచ్చు. అదీ చేస్తున్నా. మా చిరుతిండ్ల కంటే వీటిని ఎక్కువమంది మెచ్చుకుని కొనుక్కుంటున్నారు’ అని తెలిపింది బసవపూర్ణమ్మ. ఈ మొత్తం పనిలో పదిహేను మంది ప్రత్యక్షంగా మరో పదిహేనుమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కోటి టర్నోవర్‌కు... వచ్చే మార్చికంతా కోటి టర్నోవర్‌కు ఈ పిండి వంటల పరిశ్రమ చేరుకోవచ్చని అంచనా. తూములూరు పిండి వంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా కేంద్రాల్లో అమ్ముడుపోతున్నాయి. కొందరు సరుకు తీసుకుని తమ బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటున్నారు. సరుకు రవాణ మొత్తం ఆర్.టి.సి. కార్గొ మీద ఆధారపడటం విశేషం. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సంఘం నగరాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో తూములూరు పిండివంటల స్టాల్ కచ్చితంగా ఉంటోంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిర్వహించే సమావేశాలకూ ఈ పిండివంటలనే ఆర్డరు చేస్తున్నారు. ‘ఈ రోజుల్లో ఆడవాళ్లకు పిండివంటలు చేసుకోవటం కష్టమవుతోంది. దీనికితోడు రసాయన అవశేషాలు లేని ఆహారపదార్థాలు దొరకటం దుర్లభంగా తయారైంది. అందుకే మాకు డిమాండ్ వస్తోంది. మరింతమంది రైతులను కలుపుకుని సేంద్రియ పంటలతో పిండివంటలను పరిశ్రమ స్థాయికి చేర్చాలనే ఆలోచన సంఘ సభ్యుల్లో ఉంది. అప్పుడు మా వంటశాలను విస్తరించాల్సి వస్తుంది’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
16న సేంద్రియ కూరగాయల సాగుపై శిక్షణ
సేంద్రియ వ్యవసాయ విధానంలో కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఫిబ్రవరి 16 (ఆదివారం)న గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజాకృష్ణారెడ్డి, సేంద్రియ రైతు శివనాగమల్లేశ్వరరావు(గుంటూరు జిల్లా) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255 సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై 5 రోజుల శిక్షణ సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.), గ్రామీణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార నిబంధనలపై ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు సి.ఎస్.ఎ. ఈడీ డా. జీవీ రామాంజనేయులు తెలిపారు. వివరాలకు: 85006 83300 -
17న సేంద్రియ సాగులో చీడపీడల నివారణపై శిక్షణ
గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు ‘సేంద్రియ సాగులో చీడపీడల నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టల వాడకం–ఉపయోగాల’పై ఉద్యాన శాఖ ఏడీ రాజా కృష్ణారెడ్డి, ఖాజా రహమతుల్లా శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666 జలసంరక్షణ, బోరు రీచార్జ్ పద్ధతులపై శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోర్లను రీచార్జ్ చేసుకునే పద్ధతి సహా వివిధ జల సంరక్షణ పద్ధతులపై డిసెంబర్ 16న స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు, రైతు బృందాలు, వ్యక్తులకు సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వాటర్ అండ్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సురన ఆడిటోరియంలో శిక్షణ ఇవ్వనుంది. భూగర్భ జల సంరక్షణలో అపారమైన అనుభవం కలిగిన జలవనరుల ఇంజినీరు ఆర్. వి. రామమోహన్ శిక్షణ ఇస్తారు. జలసంరక్షణలో అనుభవాలను పంచుకునే ఆసక్తి గల వారు కూడా సంప్రదింవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కువ మంది ఆసక్తి చూపితే విజయవాడలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు రామ్మోహన్ తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 040–27014467, e-mail: wlfoundation@outlook.com. 16న చిరుధాన్య వంటకాల తయారీపై శిక్షణ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా స్థానం(కేంద్ర ప్రభుత్వ సంస్థ)లోని న్యూట్రిహబ్‌లో ఈ నెల 16న ‘కుకింగ్ విత్ మిల్లెట్స్’ శిక్షణ ఇవ్వనున్నారు. చిరుధాన్యాల ఆహారోత్పత్తుల ప్రయోజనాలను తెలియజెప్పడంతో పాటు చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు, చిరుతిండ్లను తయారు చేయడంపై గృహిణులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, పాకశాస్త్రనిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఫీజు రూ. 1,500. రిజిస్ట్రేషన్లు, ఇతర వివరాలకు.. 94904 76098. -
సిమ్లా ఆపిల్‌కు సేంద్రియ సొబగులు!
మట్టిపై మమకారం ఉంటే చాలు నేలతల్లి సిరులు కురిపిస్తుందనటానికి ఆయన జీవితం ప్రత్యక్ష ఉదాహరణ. సేంద్రియ పద్ధతుల్లో కౌలు వ్యవసాయం చేస్తూ లాభాలనార్జిస్తున్నారు పురుషోత్తమరావు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆపిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సేంద్రియ సేద్య పద్ధతుల ద్వారా పరిష్కరించారు. ఆ తర్వాత అక్కడ కౌలుకు తీసుకున్న తోటలో సేంద్రియ ఆపిల్ సాగు చేపట్టారు. చేసే పనిపై చెదరని మక్కువ ఉంటే.. ఆ పనే మనిషిని ఉన్నత శిఖరాలు అధిరోహింపచేస్తుందనటానికి సేంద్రియ రైతు వెలది పురుషోత్తమరావు జీవితమే ఉదాహరణ. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఆయన స్వగ్రామం. 1983లో వ్యవసాయంలోకి అడుగుపెట్టిన ఆయన తొలుత రంగారెడ్డి జిల్లాలో పదెకరాలు కౌలుకు తీసుకొని కూరగాయలు సాగు చేశారు. నాణ్యమైన వంగ దిగుబడి తీసి ఉత్తమ రైతు అవార్డు(1993) పొందారు. బంగాళ దుంప సాగుపై ఆసక్తితో సిమ్లాలోని కేంద్రియ బంగాళ దుంప పరిశోధనా స్థానం(సీపీఆర్ఐ)లో జరిగే సదస్సులకు తరుచూ హాజరయ్యేవారు. ఆ విధంగా 2006లో అక్కడి ఆపిల్ రైతులతో పరిచయమైంది. పురుషోత్తమరావు సూచించిన సేంద్రియ సేద్య పద్ధతులతో ఆపిల్ రైతులు వేరుకుళ్లు సమస్యను అధిగమించారు. మండీ జిల్లా మహోగ్ గ్రామానికి చెందిన రాజేష్ ఠాకూర్ అనే ైరె తు ఐదెకరాల ఆపిల్ తోట (800 చెట్లు)లో దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. 2000వ సంవత్సరం వరకు ఏడాదికి 10 వేల బాక్సుల (బాక్సు- 22 కేజీలు) వరకు వచ్చిన దిగుబడి 2006 నాటికల్లా 3 వేల బాక్సులకు త గ్గింది. అప్పటికే ఆ ప్రాంతంలో రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉంది. ఒక్కో ఆపిల్ చెట్టుకు 2 కిలోల కాల్షియం అమ్మోనియం నైట్రేట్ వేసేవారు. దీంతో భూమిలోని సేంద్రియ పదార్థం క్షీణించింది. రాజేష్ ఠాకూర్ కోరిక మేరకు 2006 నుంచి ఆ తోటలో పురుషోత్తమరావు ప్రకృతి పద్ధతుల్లో సాగు ప్రారంభించారు. పంచగవ్య, జీవామృతం, ‘ఇసుక యూరియా’లతో కూడిన మిశ్రమాన్ని ఆపిల్ చెట్లకు వేయడం, జీవామృతాన్ని పిచికారీ చేయడంతో మంచి ఫలితాలొచ్చాయని పురుషోత్తమరావు తెలిపారు. చెట్లు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకున్నాయని, ప్రకృతి సాగుతో ఖర్చు తగ్గిందన్నారు. 2010 నాటికల్లా రాజేష్ తోటలో దిగుబడి మళ్లీ 10 వేల బాక్సులకు చేరింది. తర్వాత అక్కడి ఇతర రైతులకూ శిక్షణ ఇచ్చారు. తదనంతరం పురుషోత్తమరావు మండీ జిల్లాలోని సెరీ బంగ్లాలో ఐదెకరాల ఆపిల్ తోటను కౌలుకు తీసుకొని సాగు చేయనారంభించారు. అధిక సాంద్ర పద్ధతి(ఎకరానికి 1,250 చెట్లు)ని చేపట్టడంతో దిగుబడి 20 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. పరాయి రాష్ట్రంలో సేంద్రియ సేద్య బావుటాను ఎగుర వేయడంతోపాటు.. స్వరాష్ట్రంలోని విశాఖ జిల్లా లంబసింగిలో సీసీఎంబీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆపిల్ సాగుకూ ఆయన తోడ్పాటునందిస్తున్నారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్