సిమ్లా ఆపిల్‌కు సేంద్రియ సొబగులు!
మట్టిపై మమకారం ఉంటే చాలు నేలతల్లి సిరులు కురిపిస్తుందనటానికి ఆయన జీవితం ప్రత్యక్ష ఉదాహరణ.
సేంద్రియ పద్ధతుల్లో కౌలు వ్యవసాయం చేస్తూ లాభాలనార్జిస్తున్నారు పురుషోత్తమరావు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఆపిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సేంద్రియ సేద్య పద్ధతుల ద్వారా పరిష్కరించారు.
ఆ తర్వాత అక్కడ కౌలుకు తీసుకున్న తోటలో సేంద్రియ ఆపిల్ సాగు చేపట్టారు.
చేసే పనిపై చెదరని మక్కువ ఉంటే.. ఆ పనే మనిషిని ఉన్నత శిఖరాలు అధిరోహింపచేస్తుందనటానికి సేంద్రియ రైతు వెలది పురుషోత్తమరావు జీవితమే ఉదాహరణ. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఆయన స్వగ్రామం. 1983లో వ్యవసాయంలోకి అడుగుపెట్టిన ఆయన తొలుత రంగారెడ్డి జిల్లాలో పదెకరాలు కౌలుకు తీసుకొని కూరగాయలు సాగు చేశారు. నాణ్యమైన వంగ దిగుబడి తీసి ఉత్తమ రైతు అవార్డు(1993) పొందారు. బంగాళ దుంప సాగుపై ఆసక్తితో సిమ్లాలోని కేంద్రియ బంగాళ దుంప పరిశోధనా స్థానం(సీపీఆర్‌ఐ)లో జరిగే సదస్సులకు తరుచూ హాజరయ్యేవారు. ఆ విధంగా 2006లో అక్కడి ఆపిల్ రైతులతో పరిచయమైంది. పురుషోత్తమరావు సూచించిన సేంద్రియ సేద్య పద్ధతులతో ఆపిల్ రైతులు వేరుకుళ్లు సమస్యను అధిగమించారు.
మండీ జిల్లా మహోగ్ గ్రామానికి చెందిన రాజేష్ ఠాకూర్ అనే ైరె తు ఐదెకరాల ఆపిల్ తోట (800 చెట్లు)లో దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. 2000వ సంవత్సరం వరకు ఏడాదికి 10 వేల బాక్సుల (బాక్సు- 22 కేజీలు) వరకు వచ్చిన దిగుబడి 2006 నాటికల్లా 3 వేల బాక్సులకు త గ్గింది. అప్పటికే ఆ ప్రాంతంలో రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉంది. ఒక్కో ఆపిల్ చెట్టుకు 2 కిలోల కాల్షియం అమ్మోనియం నైట్రేట్ వేసేవారు. దీంతో భూమిలోని సేంద్రియ పదార్థం క్షీణించింది. రాజేష్ ఠాకూర్ కోరిక మేరకు 2006 నుంచి ఆ తోటలో పురుషోత్తమరావు ప్రకృతి పద్ధతుల్లో సాగు ప్రారంభించారు. పంచగవ్య, జీవామృతం, ‘ఇసుక యూరియా’లతో కూడిన మిశ్రమాన్ని ఆపిల్ చెట్లకు వేయడం, జీవామృతాన్ని పిచికారీ చేయడంతో మంచి ఫలితాలొచ్చాయని పురుషోత్తమరావు తెలిపారు.
చెట్లు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకున్నాయని, ప్రకృతి సాగుతో ఖర్చు తగ్గిందన్నారు. 2010 నాటికల్లా రాజేష్ తోటలో దిగుబడి మళ్లీ 10 వేల బాక్సులకు చేరింది. తర్వాత అక్కడి ఇతర రైతులకూ శిక్షణ ఇచ్చారు. తదనంతరం పురుషోత్తమరావు మండీ జిల్లాలోని సెరీ బంగ్లాలో ఐదెకరాల ఆపిల్ తోటను కౌలుకు తీసుకొని సాగు చేయనారంభించారు. అధిక సాంద్ర పద్ధతి(ఎకరానికి 1,250 చెట్లు)ని చేపట్టడంతో దిగుబడి 20 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. పరాయి రాష్ట్రంలో సేంద్రియ సేద్య బావుటాను ఎగుర వేయడంతోపాటు.. స్వరాష్ట్రంలోని విశాఖ జిల్లా లంబసింగిలో సీసీఎంబీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆపిల్ సాగుకూ ఆయన తోడ్పాటునందిస్తున్నారు.
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్