కరువు కాలపు క్రాంతిదర్శి! | Drought-day visit of light! | Sakshi
Sakshi News home page

కరువు కాలపు క్రాంతిదర్శి!

Published Tue, Jan 19 2016 2:16 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కరువు కాలపు క్రాంతిదర్శి! - Sakshi

కరువు కాలపు క్రాంతిదర్శి!

* థాయ్‌లాండ్ పంట ‘ఆపిల్ బేర్’ సాగుతో అధికాదాయం
* మూడున్నర ఎకరాల తోట.. రోజుకు 3 టన్నుల దిగుబడి
* అరగంట డ్రిప్ నీటితోనే అద్భుత ఫలితాలు..

కరువు కసిగా కోరలు చాస్తున్నప్పుడు.. కర్షకుడే తన సేద్య వ్యూహాన్ని సరికొత్తగా తిరగ రాసుకోవాలి. సేద్యానికి కొత్త ఊపిరిపోసే పంటల కోసమో.. పండ్ల తోటల కోసమో ప్రపంచమంతా వెతకాలి. అంతేకాదు.. ప్రతి నీటి బొట్టునూ అపూర్వ సామర్థ్యంతో వినియోగించుకుంటూనే.. స్థిరంగా నికరాదాయాన్నిచ్చే సరికొత్త వంగడాలను ఆవిష్కరించుకోవాలి. ఈ చారిత్రక అవసరాన్ని సకాలంలో గుర్తించిన వారే క్రాంతిదర్శి. ఆ కోవకు చెందిన సృజనాత్మక కృషీవలుడే గుంటక కృష్ణారెడ్డి. థాయ్‌లాండ్‌కు చెందిన ‘ఆపిల్ బేర్’తోపాటు అనేకానేక సరికొత్త ఉద్యాన పంటలపై ఆయన దృష్టి సారించారు.

మార్కెట్‌లో అమ్ముడుపోయే కొత్త పంటలను, బెట్టను తట్టుకునే ఉద్యాన పంటలను ఎంచుకోవడం కృష్ణారెడ్డిని కరువు కాలపు విజేతగా నిలబెట్టాయి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపిల్ బేర్‌ను ‘తెలంగాణ ఆపిల్’గా గుర్తించి ప్రోత్సహిస్తోంది!

 
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు సమీపంలోని చెర్లపల్లికి చెందిన రైతు గుంటక నాగిరెడ్డి కుమారుల్లో చిన్నవాడు కృష్ణారెడ్డి. డిగ్రీ వరకు చదువుకొని సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైన  కొద్ది రోజులకే ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. ఆది నుంచీ ఉద్యాన పంటలపై ఆసక్తి కలిగిన ఆయన న్యూజిలాండ్‌లో ఉద్యాన తోటల కంపెనీలో పని చేశారు. తదనంతరం కొంతకాలం పాటు ఆస్ట్రేలియా వెళ్లి.. అనేక ఉద్యాన తోటల సాగులో అనుభవం గడించిన తర్వాత 2004 అక్టోబర్‌లో స్వస్థలానికి తిరిగొచ్చారు.

తండ్రి పంచి ఇచ్చిన 18 ఎకరాల పొలంలో సేద్యం ప్రారంభించారు. బోర్లు తప్ప మరో నీటి వనరు లేదు. బోరులో ఇంచ్ నీరు మాత్రమే పడ్డాయి. ఇంత తక్కువ నీటితో ఏం పంటలు పండిస్తాం? ఏం ఆదాయం వస్తుంది? ఈ పరిస్థితుల్లో వ్యవసాయం కొనసాగించాలంటే తక్కువ నీటితో అధికాదాయాన్నిచ్చే పంటలపై దృష్టి సారించడం ఒక్కటే మార్గమని తలచిన కృష్ణారెడ్డి దేశాటన ప్రారంభించారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొన్నిచోట్ల 2 వేల అడుగుల లోతు నుంచి ఇంచ్ నీటిని తోడి లేదా ట్యాంకర్లతో నీరు తెచ్చి దానిమ్మ తోటలు పెంచి, దేశంలోకెల్లా నాణ్యంగా, అధిక దిగుబడి తీయడం ఆయనను ఆకర్షించింది. అంతే.. పదెకరాల్లో 5 వేల దానిమ్మ మొక్కలు నాటారు.

ఢిల్లీ ఐఐటీ నిపుణుల సలహా మేరకు 25 లక్షల లీటర్ల వాటర్ పాండ్ నిర్మించడం ద్వారా నీటి ఇబ్బందులను అధిగమించారు. దానిమ్మ ఎడారి పంట. దీనికి కొద్ది నీరైనా చాలునంటారాయన. ఆ ధైర్యంతోనే 2005 నాటికి 18 ఎకరాల్లోనూ దానిమ్మ తోట వేశారు. నాలుగైదేళ్లు గడిచేటప్పటికి దానిమ్మ చెట్టుకు 50-60 కిలోల వార్షిక దిగుబడి సాధించారు. పన్నెండేళ్ల పాటు అధిక ఫలసాయాన్నిచ్చిన దానిమ్మతోట 2014 నుంచి మెత్తబడింది. కాండానికి పగుళ్లు రావడం వంటి సమస్యలు రావడంతో కృష్ణారెడ్డి క్రమంగా దానిమ్మ తోటను తీసేస్తూ.. ఇతర పంటల వైపు దృష్టి సారించారు. దానిమ్మ సాగులో ఆయనకున్న పట్టు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు వందలాది మంది రైతుమిత్రులను సంపాదించి పెట్టింది. రోజూ ఉదయం 2 గంటలు వాట్సప్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తుంటారు.
 
నూరేళ్ల పంట ‘ఆపిల్ బెర్’!

వాతావరణ సారూప్యతల వల్ల థాయ్‌లాండ్‌లోని ఉద్యాన పంటలు మనకు నప్పుతాయని కృష్ణారెడ్డి గ్రహించారు. రెండేళ్ల క్రితం ఆ దేశానికి వెళ్లి ఉద్యాన తోటలు పరిశీలించి.. తెలంగాణ, రాయలసీమ వంటి కరువు ప్రాంతాల్లోనూ కనీస దిగుబడినిచ్చే మేలైన పంటలేమి ఉన్నాయో శోధించి.. తొలుత ఆపిల్ బెర్‌ను ఎంపిక చేశారు. 80 ఆపిల్ బెర్ మొక్కలు తెచ్చి దానిమ్మ చెట్ల మధ్యలో నాటారు. దానిమ్మ తోట నరికేసేటప్పటికి ‘ఆపిల్ బెర్’ చేతికి అందివచ్చింది. ఇప్పుడు మూడున్నర ఎకరాల్లో కృష్ణారెడ్డి ఆపిల్ బెర్ సాగు చేస్తున్నారు.

సాళ్ల మధ్య 13 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరంలో నాటారు. డ్రిప్ ద్వారా తగుమాత్రంగా నీటిని, ద్రవరూప ఎరువులను అందిస్తున్నారు. 1,300 మొక్కలు నాటగా.. ఆడవి పందుల దెబ్బకు 300 మొక్కలు పాడయ్యాయి. ఇది మూడో ఏడాది. రోజుకు 3 టన్నుల ఆపిల్ బెర్ దిగుబడి వస్తోంది. దీనికి చీడపీడల బెడద చాలా తక్కువ. మందులను రెండుసార్లు పిచికారీ చేస్తే చాలు. వందేళ్ల వరకు ఈ తోట దిగుబడినిస్తుందని కృష్ణారెడ్డి తెలిపారు. నాటిన 6 నెలలకు పూత పూస్తుంది. మరో మూడున్నర నెలలకు కాయలు కోతకు వస్తాయి. కాయ 90-130 గ్రాముల వరకు పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు ఆపిల్ బెర్ రకాలున్నాయి.  
 
కిలో ఆపిల్ బెర్ ధర రూ. 25
గ్రీన్ ఆపిల్‌ను థాయ్ లోకల్ రేగుతో గ్రాఫ్టింగ్ చేయడంతో ఆపిల్ బేర్ రుచిలో, పోషక విలువలలో ఆపిల్‌కు తీసిపోదు. గుండె, కిడ్నీ, లివర్ ఆరోగ్య పరిరిక్షణకు ఉపకరిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం తినదగినది. ఎన్ని కాయలు తిన్నా మొహం మొత్తనిది కావడంతో ఆపిల్ బెర్‌కు మంచి మార్కెట్ ఉందని కృష్ణారెడ్డి అన్నారు. కిలో రూ. 25 చొప్పున.. పది కిలోల అట్టపెట్టెల్లో పెట్టి విక్రయిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, విజయవాడ మార్కెట్లకు పంపుతున్నారు.
 
మెట్ట పొలాల్లో ఆపిల్ బేర్‌ను సాగు చేయడానికి ఎకరానికి రూ. 30 వేల వరకు మూల పెట్టుబడి అవుతుందని.. ఎంత కాదన్నా కిలో ధర రూ. 3 నుంచి 10 వరకు ఉంటుందని.. కనీసం రూ. 20 వేల నుంచి 50 వేల వరకు నికరాదాయం వస్తుందని కృష్ణారెడ్డి చెబుతున్నారు. పోషణ, నీటి యాజమాన్యం బాగుంటే ఆపిల్ బేర్ దిగుబడి చెట్టుకు తొలి ఏడాది 10-15 కిలోలు, రెండో ఏడాది 100 కిలోలు, 3వ ఏడాది 100-150 కిలోల వరకు వస్తుంది. డ్రిప్ ద్వారా కూడా నీరివ్వలేని కరువు పరిస్థితులొచ్చినా చెట్టుకు ఏడాదికి కనీసం 50 కిలోల దిగుబడైనా వస్తుందని ఆయన అన్నారు. రైతు తోటను కౌలుకిచ్చుకున్నా మంచి ఆదాయం వస్తుందన్నారు. అందువల్లనే ఈ పంటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఆపిల్’గా ప్రకటించి ప్రోత్సహిస్తోందన్నారు.
 
తోట ఒకటే.. సీజన్లు రెండు..
ఆపిల్ బెర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఏడాదిలో రెండు సీజన్లలో పంట తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చని కృష్ణారెడ్డి వివరించారు. తోటలో ఉన్న సగం చెట్ల నుంచి జూన్ - ఆగస్టు నెలల్లో, మిగతా సగం చెట్ల నుంచి జనవరి - మార్చి నెలల్లో పంట తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చన్నారు. మామిడి వంటి తోటల్లో ఇలాంటి సదుపాయం ఉండదని, దేశవ్యాప్తంగా ఒకే సీజన్‌లో దిగుబడి వస్తుంది కాబట్టి రైతుకు గిట్టుబాటు కాదన్నారు. ఆపిల్ బెర్ పంట పూర్తయిన తర్వాత చెట్టు మొదలును 1-2 అడుగుల ఎత్తున పూర్తిగా నరికేయాలి. తర్వాత పెరిగే పిలకల్లో 4 కొమ్మలను నిలువుగా పెరగనివ్వాలి. ఆ కొమ్మలకే పూలు, కాయలు వస్తాయి. మొదలు నరికేసిన 9 నెలల్లో కాయలు కోతకు వస్తాయి.
 
డ్రిప్ నీరు ఒకే చోట ఇవ్వాలి..
కృష్ణారెడ్డి సాగు పద్ధతి సునిశిత పరిశీలనతో కూడి ఉంటుంది. దానిమ్మ.. మిరప.. పసుపు.. ఆపిల్ బేర్.. పంట ఏదైనా రైతు విజయం సాధించాలంటే నీటి యాజమాన్యమే కీలకమని ఆయన అంటారు. పంట పాడైనా, బాగున్నా అందుకు కారణం నీటి యాజమాన్యమే. ముఖ్యంగా డ్రిప్ ద్వారా తోటలకు నీరందించేటప్పుడు.. మొదట్లో ఎక్కడైతే డ్రిప్పర్ నీటిని వదులుతుందో.. చెట్టు తన పీచు వేళ్ల(సక్కర్ జోన్)ను ఆ ప్రాంతంలో విస్తరింపజేస్తుంది. అదే చోట, నిర్ణీత సమయానికి నీటి కోసం వేళ్లు ఎదురుచూస్తుంటాయి. అందువల్ల డ్రిప్ లైను అటూ ఇటూ కదిలిపోకుండా 20 అడుగులకో చోట యాంకిల్ పైపులతో కట్టి ఉంచడం ముఖ్యం.
 
రోజుకు చెట్టుకు 4 లీటర్ల నీటితోనే..
చెట్టు వద్ద భూమిలో పీచు వేళ్లు అల్లుకొని ఉన్న 8 అంగుళాల లోతు మట్టి తడిస్తే చాలు. తల్లి వేరు దిగినంత 10 అడుగుల లోతు వరకు నీటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ అవగాహనతోనే కృష్ణారెడ్డి ప్రత్యేక డ్రిప్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు  ఫామ్‌పాండ్‌లో నిల్వచేసుకున్న నీటిని.. రోజూ ఉదయం అరగంట సేపు చెట్టుకు 4 లీటర్ల చొప్పున అందిస్తున్నారు. కరెంటు ఉండి, నీరు అందుబాటులో ఉంటే .. సాయంత్రం పూట మరో అరగంట నీటిని ఇస్తున్నారు.

సాధారణ డ్రిప్‌తో ఖర్చయ్యే నీటిలో సగం నీటితోనే కరువు కాలంలోనూ ఆపిల్ బేర్ తోటను కాపాడుకోగలుగుతున్నారు.
 కృష్ణారెడ్డి ప్రస్తుతం 60% సేంద్రియ పద్ధతిలో, 40% రసాయనిక పద్ధతిలో తోటకు ద్రవరూపంలో పోషకాలను అందిస్తున్నారు. పండ్లకు సరైన సేంద్రియ మార్కెట్ అభివృద్ధి చెందితే.. పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి మంచి దిగుబడులు పొందడానికి ఇబ్బందేమీ లేదని ఆయన అన్నారు.
 
బండి ఎరువుతో 10 బండ్ల ఎరువు తయారీ
పశువుల ఎరువును నేరుగా పొలంలో వేయకుండా.. దాన్ని పది రెట్లు పెంపొందించి వాడుకునే పద్ధతిని కృష్ణారెడ్డి అనుసరిస్తున్నారు. నాణ్యమైన బండి పశువుల ఎరువును సేకరించి, దానితో 3 నెలల్లో స్వల్ప ఖర్చుతో పది బండ్ల ఎరువును తయారు చేస్తున్నారు. ఒక పొర పశువుల ఎరువు వేసి, దానిపైన డీ కంపోజ్డ్ బ్యాక్టీరియా చల్లి, దానిపైన ఒక పొర చెరువు మట్టి, చేను మట్టి.. ఇలా పలు వరుసలుగా వేస్తూ.. 3 నెలల్లో పుష్కలంగా సూక్ష్మజీవరాశి కలిగిన సేంద్రియ ఎరువును తయారు చేసి పంటలకు వాడుతున్నారు.

ఇలా చేస్తే పంట భూమిలో స్వల్ప కాలంలోనే హ్యూమస్ (జీవనద్రవ్యం) వృద్ధి చెంది భూమి సారవంతమవుతుందని, ఆ పంట కాలంలోనే దిగుబడుల పెంపునకు ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు వినూత్నంగా, బహుముఖ వ్యూహంతో ముందడుగేసే రైతే నిలబడగలుగుతాడు. రైతులోకానికే వెలుగుబాటను చూపగలుగుతాడు.. అటువంటి ధన్యజీవి గుంటక కృష్ణారెడ్డి.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఫొటోలు : పోల్కంపల్లి గాండ్ల నాగరాజు
 
ఇక ‘లోగాన్’ పండ్ల సాగు
నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో పండే పండ్ల తోటల రకాలపై నిరంతరం అధ్యయనం చేస్తున్న కృష్ణారెడ్డి మరికొన్ని థాయ్‌లాండ్ వంగడాలపై దృష్టి కేంద్రీకరించి రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. లోగాన్ పండ్ల తోటను రెండెకరాల్లో సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు.
 
లోగాన్: నాటిన రెండేళ్లకు దిగుబడి వస్తుంది. సపోట, కివీ పండ్ల రుచి కలగలిసి ఉంటుంది.  మార్కెట్ ధర కిలో రూ. 200. రైతుకు నికరంగా రూ. 20 వచ్చినా చాలు.
 
ఆల్‌టైమ్ గుచ్ఛా లెమన్ : నిమ్మ సాధారణంగా మూడున్నరేళ్లకు కాపుకొస్తుంది. ఇది ఏడాదిన్నరలోనే కాపుకొస్తుంది. కిలో రూ. 40 వరకు ధర పలుకుతుంది.
 
జామ.. థాయ్ బిగ్ బాస్: అర కిలో వరకు బరువు పెరుగుతుంది. తియ్యగా ఉంటుంది. విత్తనాలు తక్కువ. కిలో పెరిగే రకమూ ఉంది. కానీ జనం కొనరు.
 
థాయ్ మునగ: అధిక దిగుబడినిస్తుంది. కాయలో గుజ్జు బాగా ఉంటుంది. ఏడాదిన్నరలో పూర్తిస్థాయి దిగుబడినిస్తుంది. కిలో రూ. 40 వరకు ఉంటుంది.
 
థాయ్ బ్లాక్ జామున్: 60 గ్రా. బరువు పెరుగుతుంది. 3 ఏళ్లకు దిగుబడినిస్తుంది. 10 అడుగులు పెరిగిన చెట్టు పిలక కత్తిరించి, కొమ్మలను తాళ్లతో లాగి కట్టాలి.
 
హార్టికల్చరే మెట్ట రైతు కల్చర్ కావాలి!
పత్తి వంటి సీజనల్ పంటలకన్నా నీటి ఎద్దడిలోనూ కనీస భరోసా ఇవ్వగలిగిన పండ్ల తోటల సాగుతోనే మెట్ట ప్రాంత రైతులకు శాశ్వతంగా మేలు జరుగుతుంది. బెట్టను తట్టుకొని కనీస దిగుబడినిచ్చే థాయ్‌లాండ్‌కు చెందిన పండ్ల తోటల సాగు తెలంగాణ, రాయలసీమ రైతులకు చాలా అనువైనవని అనుభవం ద్వారా తెలుసుకున్నాను.

ఆపిల్ బేర్‌ను రెండేళ్లు సాగు చేసి అన్ని విషయాలూ ఆకళింపు చేసుకున్న తర్వాతే రైతులకు సిఫారసు చేస్తున్నాను. త్వరలో రెండెకరాల్లో లోగాన్ పండ్ల తోట నాటబోతున్నాను. నీరు, డబ్బు తక్కువగా ఉన్న రైతులు కూడా ఆత్మహత్యల బారిన పడకుండా భరోసాతో బతకాలి. నేనున్నా లేకున్నా నేను పరిచయం చేసిన పంటలు రైతులకు అండగా ఉండాలి. అదే నా లక్ష్యం.
 - గుంటక కృష్ణారెడ్డి (96663 28231), చెర్లపల్లి, జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement