
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో యధావిధిగా పరీక్షలు జరగనున్నాయి. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. సమయం మించిపోవడంతో చివరి నిమిషంలో అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలకు పరుగులు తీశారు. తొలిరోజు జనరల్ ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. అభ్యర్థులను, వారి హాల్ టికెట్లను, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ రోజు నుంచి ఈనెల 27 వరకు పరీక్షలు జరగనున్నాయి. 563 పోస్టుల భర్తీ కోసం జరుగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కోసం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలో 46 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మరోవైపు హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, పదుల సంఖ్యలో వాహనాలను ఉంచారు. నందినగర్ ప్రాంతమంతా పోలీసు బలగాలతో నిండిపోయింది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నేతల నివాసద్దం పోలీసులు పహారా కాస్తున్నారు. నేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

కాగా గ్రూప్-1 మెయిన్స్ వాయిదా, జీవో 29పై రద్దు విషయంలో అభ్యర్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ నేతలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై.. నేతల ఇంటి వద్ద భారీగా మోహరించారు.

Comments
Please login to add a commentAdd a comment