ఆర్థిక అంశాల పరిశీలన ఏదైనా ఆ తరువాతే..
ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీకి స్పష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
కొన్నాళ్లుగా వివిధ శాఖల ఆదాయం తగ్గింది
ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది
ఆదాయం పెంచుకునేందుకు సహకరించండి
ఆర్థికేతర సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతాం..
డీఏలు ఇచ్చే అంశంపై ఆలోచన చేస్తాం
317 జీవో సమస్యలను పరిష్కరిస్తామని హామీ
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి భట్టి సారథ్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు
దీపావళి తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. వచ్చే మార్చి 31 వరకు ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడులు చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని.. దీనికి సంబంధించి మంత్రులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు.
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)
ఆందోళన బాట పడతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులతో సీఎం రేవంత్ గురువారం సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి జేఏసీ నుంచి హాజరైన 36 మందికి మాట్లాడే అవకాశం కల్పించారు. వారు చెప్పిన అంశాలు, సమస్యలను విన్నారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ 15 నిమిషాల పాటు మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు.
డీఏలపై ఆలోచన చేస్తాం..
ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలని సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కనీసం మూడు డీఏలను వెంటనే ఇవ్వాలని.. 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏలపై ప్రకటన చేయాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని, ఏమాత్రం వీలైనా ఎంతో కొంత న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లులు, నగదు రహిత ఆరోగ్య కార్డుల జారీ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని తెలిపారు. డీఏల విషయంలో ప్రభుత్వానికి ఒకట్రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరారు.
317 జీవో సమస్యలను పరిష్కరిస్తాం..
స్థానిక జిల్లాలకు ఉద్యోగుల బదిలీ కోసం తీసుకొచ్చిన 317 జీవోతో ఏర్పడ్డ సమస్యలను పరిష్కారిస్తామని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికను శుక్రవారం ఉద్యోగ ప్రతినిధుల ముందే తెరుస్తామని చెప్పారు. అందులోని అంశాలను పరిశీలించి, తగిన సలహాలు ఇస్తే.. సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
భట్టి నేతృత్వంలో మంత్రుల కమిటీ..
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులతో కమిటీ వేస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. దీపావళి పండుగ తర్వాత ఈ కమిటీ సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతుందని.. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని తెలిపారు. సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి జనరల్ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కో–చైర్మన్ చావా రవితోపాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎంకు సమస్యలు వివరించాం
ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులంతా సీఎంతో నేరుగా మాట్లాడారు. అన్ని సమస్యలను ఆయన ముందు పెట్టారు. తొలి సమావేశం సుహృద్భావ వాతావరణంలోనే జరిగింది. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నాం.
– మారం జగదీశ్వర్, జేఏసీ అధ్యక్షుడు
కనీసం రెండు డీఏలైనా ఇవ్వాలి
తక్షణమే రెండు డీఏలైనా ఇస్తే ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కుదురుతుంది. ప్రతీ దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వంతో కలసి ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగులు అన్నివేళలా కృషి చేస్తారు.
– చావా రవి, జేఏసీ కో–చైర్మన్
కొంత సానుకూలం
సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. ప్రభుత్వం మార్చి 31 వరకూ సమయం కావాలని కోరింది. ఇది న్యాయమైన కోరికే. అయితే, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల విషయంలో కనీసం రెండు ఇవ్వడానికి కేబినేట్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం.
– పింగిలి శ్రీపాల్‌రెడ్డి, జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్
సీపీఎస్ వెంటనే రద్దు చేయాలి
ప్రభుత్వంపై నయాపైసా భారం పడని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలి. సీపీఎస్‌తో రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తోంది. భవిష్యత్తులోనూ ఇది అధిక భారంగా మారుతుంది. కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఈ విధానాన్ని రద్దు చేశాయి. రాష్ట్రంలోనూ సీపీఎస్‌ను రద్దు చేస్తే ఎల్బీ స్టేడియంలో రెండు లక్షల కుటుంబాలతో ధన్యవాదాలు తెలుపుతాం.
– సీఎంకు సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ వినతి
పరిస్థితి బాగోలేదు.. సహకరించండి!
ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని, వాటిని పరిష్కరించేందుకు తమకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ తెలిపారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉందని.. కొన్నాళ్లుగా వివిధ శాఖల ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు.
వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆర్థిక అంశాల్లో తమపై ఒత్తిడి తేవొద్దని కోరారు. ఆర్థిక అవసరాలు లేని బది లీలు, పాలనాపరమైన అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment