Joint state
-
‘డీఎస్సీ’ బాధితులకు న్యాయం చేసేదెప్పుడు?
* సీఎం చెప్పినా పడని అడుగులు * ఉద్యోగాల కోసం 6,900 మంది నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో అడుగు ముందుకు పడటం లేదు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చి ఏడాదిన్నర దాటినా.. శాఖల పరిశీలన పేరుతో కాలయాపన జరుగుతోంది. గతేడాది జనవరిలో కేసీఆర్ వరంగల్‌లో పర్యటించిన సమయంలో 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఆ తరువాత జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 1998 డీఎస్సీలో నష్టపోయిన వారితో పాటు 2012 వరకు నిర్వహించి 5 డీఎస్సీల్లో నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి కూడా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అది ఇంతవరకు ఆచరణ కు నోచుకోలేదు. దీంతో ఉద్యోగాల కోసం 6,900 మంది విద్యా శాఖ చుట్టూ తిరుగుతున్నారు. సుప్రీంకోర్టు వరకూ.... 1998లో చేపట్టిన 40 వేల టీచర్ పోస్టుల భర్తీలో అనేక అక్రమాలు జరిగాయి. దీనిపై వరంగల్, కరీంనగర్, ఖమ్మ ం, నల్గొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని స్పష్టం చేసినా ఆచరణకు నోచుకోవడం లేదు. -
వలసదారులు అనడానికి వీల్లేదు
- ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవారు ‘వలసదారులు’ కారు - ఏపీలో స్థానికత ఉండి.. తిరిగొచ్చినవారు వలసదారులు కారు - ఆ పేరుతో వారి కుల ధ్రువీకరణలను తిరస్కరించరాదు: హైకోర్టు సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో స్థానికత ఉన్న వారు రాష్ట్ర విభజన తరువాత ఏదో ఒక రాష్ట్రంలో స్థానికుడిగా ఉండేందుకు నిర్ణయించుకోవచ్చునని, అలాంటి వారిని స్థానికులుగానే పరిగణించి, వారికి సామాజిక రిజర్వేషన్లను సైతం వర్తింపచేయాలని ఎన్టీఆర్ వైద్య వర్సిటీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో కలిసున్న వారు రాష్ట్ర విభజన తరువాత ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళితే దానిని ‘వలస’ అని, అలా వెళ్లిన వారిని ‘వలసదారులు’ అని అనడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఒక రాష్ట్రం ఒక వ్యక్తిని ఎస్సీ, ఎస్టీ, బీసీగా గుర్తించినంత మాత్రాన మరో రాష్ట్రం కూడా ఆ వ్యక్తిని అదే వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించాల్సిన అవసరం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. నేను స్థానికేతరురాలినా? ఏపీకి చెందిన తన తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణకు వచ్చారని, తరువాత బదిలీపై తిరిగి ఏపీకి వెళ్లారని, ఈ నేపథ్యంలో ఎంసెట్ ప్రవేశాల సందర్భంగా తనను స్థానికేతరురాలిగా పరిగణిస్తూ, బీసీ-ఏ కింద రిజర్వేషన్లు కల్పించేందుకు నిరాకరిస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొడ్డేపల్లి జోత్స్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనలతో మిరియాల ప్రియదర్శిని, మరికొంత మందీ వేర్వేరుగా పిటిషన్లు చేశారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాది తడ్డి నాగేశ్వరరావు తన వాదనలు వినిపించారు. వలసదారుడు అనడానికి వీల్లేదు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరిస్తూ... ఏపీ, తెలం గాణలు రెండుగా విడిపోయిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో స్థానికుడిగా ఉన్న వ్యక్తి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని స్థానికుడిగా ఉండేందుకు ఎంచుకోవచ్చనీ, ఆ వ్యక్తిని ఒక రాష్ట్రం నుంచి ‘వలస’ వచ్చారని గానీ, ‘వలసదారుడు’ అని గానీ చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదంది. ఇక రెండో క్లిష్టమైన అంశానికి వస్తే... ఈ వ్యాజ్యాల్లో కొందరు పిటిషనర్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జన్మించారు. వారికి అక్కడి అధికారులే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వారు ఇప్పుడు తిరిగి వారి సొంత ప్రాంతాలకే వెళుతున్నారు. ఇలా ఒక ప్రాంతంలో స్థానికత ఉండి.. మరో ప్రాంతంలో పెరిగి.. తిరిగి స్థానికత ఉన్న ప్రాంతానికి వెళుతుంటే అటువంటి వారిని వలసదారులుగా పేర్కొంటూ వారికి గతంలో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలను తిరస్కరించడానికి వీల్లేదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. పిటిషనర్లను స్థానికులుగానే పరిగణిస్తూ వారికి ఆ మేర రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. -
తెలంగాణ దేవాలయాలకు అన్యాయం
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు: సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని దేవాలయాలు, వాటి విశిష్టతను అప్పటి పాలకులు కనుమరుగు చేశారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పుష్కరాలకు సైతం ప్రాధాన్యం లేకుండా చేశారని, అప్పుడు జరిగిన అన్యాయాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సరిదిద్దుతోందని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్లలో కృష్ణా పుష్కరాలను సీఎం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అలంపూర్‌లోని హరిత అతిథి భవనంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఏకైక శక్తిపీఠమైన జోగుళాంబ దేవాలయాన్ని తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. జోగుళాంబ దేవాలయ విస్తరణకు కొన్ని ఆటంకాలు ఉన్నాయని, వాటిపై కేంద్రంతో మాట్లాడి ఆలయాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. జోగుళాంబ తల్లి చల్లని ఆశీస్సులతో ప్రత్యేక తెలంగాణ సుసాధ్యమైందన్నారు. ఏటా 5 వేల నుంచి 10 వేల మంది దేవి ఉపాసకులు ఈ ప్రాంతానికి వస్తారని, అందుకు తగినట్లు వసతి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ్నుంచే పాదయాత్ర ప్రారంభించానని, ఈ ప్రాంత రైతులకు గతంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేందుకు ఆర్డీఎస్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. కాగా అలంపూర్‌లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సీఎంను కలసి వినతిపత్రం సమర్పించారు. అలంపూర్‌పై వరాల జల్లు అలంపూర్‌కు తక్షణం 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రెండ్రోజుల్లో దీనిపై విధి విధానాలు ఖరారు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు. ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కోరగా.. ఆర్టీసీ ఇప్పటికే రూ.200 కోట్ల నష్టంలో ఉందని, కొత్త డిపోపై హామీ ఇవ్వలేనన్నారు. కంట్రోలింగ్ పాయింట్ లేదా మినీ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్‌లో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, బాల్‌రాజు, మాజీ ఎంపీ మందా జగన్నాథం, టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ రాములు ఉన్నారు. -
సెప్టెంబర్ 13 నుంచి గ్రూపు-1 మెయిన్స్
టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2011 గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఆ పరీక్షకు సంబంధించి 140 పోస్టులు తెలంగాణకు వచ్చాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటి భర్తీకి మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 13 నుంచి 23వరకు పరీక్షలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 312 పోస్టుల భర్తీకి 2011లో అప్పటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తరువాత ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే గ్రూపు-1 ప్రిలిమ్స్ కీలో ఆరు తప్పులు దొర్లాయని, వాటి వల్ల తాము నష్టపోయామని, మెయిన్స్‌కు అర్హతను కోల్పోయామని పేర్కొంటూ పలువులు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట ట్రిబ్యునల్, ఆ తరువాత హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్లింది. చివరకు సుప్రీంకోర్టులో 150 ప్రశ్నల్లో ఆరు తప్పులు దొర్లినట్లు తేలింది. అయితే అప్పట్లో తప్పులు దొర్లాయని అభ్యర్థులు పేర్కొన్నా.. అప్పటి ఏపీపీఎస్సీ పట్టించుకోకుండా మెయిన్స్ నిర్వహించి, ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. ప్రస్తుతం ఆ మెయిన్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన జరిగినందున 172 పోస్టులకు ఆంధ్రప్రదేశ్‌లో, 140 పోస్టులకు తెలంగాణలో వేర్వేరుగా మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమోదం తెలపాలని టీఎస్పీఎస్సీ.. ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఆమోదించడంతో వచ్చే నెలలో పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక అప్పట్లో గ్రూపు-1 ప్రిలిమ్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల తోపాటు 6 ప్రశ్నలను తొలగించగా అదనంగా అర్హత పొందే అభ్యర్థులతో ఈ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టింది. అర్హులకు సంబంధించిన వివరాలు, జాబితాలను అందజేయాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీని కోరింది. అవి త్వరలోనే టీఎస్పీఎస్సీకి అందనున్నాయి. -
ఉమ్మడి చట్టాల స్వీకరణ గడువు జూన్ 2
లేదంటే చెల్లుబాటు కావు : సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలను అన్వయించుకునేందుకు గడువు ముంచుకొస్తుంది. పునర్విభజన చట్టం ప్రకారం ఈ ఏడాది జూన్ రెండో తేదీలోగా అప్పటి చట్టాలను తెలంగాణ ప్రభుత్వం దత్తత తీసుకోవాలి. లేని పక్షంలో వాటన్నింటినీ బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి కొత్తగా చట్టాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఇప్పటివరకు ఏయే చట్టాలను యథాతథంగా అన్వయించుకున్నారు.. వేటి స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి.. ఇంకా ఎన్ని చట్టాలను దత్తత తీసుకోవాల్సి ఉందో.. పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని అన్ని శాఖలకు సూచించారు. అన్ని శాఖలు వీటిని పరిశీలించి సమగ్రంగా ప్రతిపాదనలన్నీ ఒకే ఫైలుగా పంపించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అన్వయించుకోవాల్సిన మిగిలిన చట్టాల ప్రతిపాదనలన్నింటినీ మే 31లోగా సమగ్రంగా పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. పునర్విభజన చట్టంలోని 101 సెక్షన్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను నిర్దేశించిన గడువులోగా చట్టసభల అనుమతి, ఆమోదం లేకుండానే కొత్త రాష్ట్రం యథాతథంగా, లేదా స్వల్ప మార్పులతో దత్తత తీసుకునే వెసులుబాటు ఉంది. లేకుంటే వీటన్నింటినీ చట్టసభల అనుమతితో కొత్త చట్టాలుగా రూపొందించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
ఏపీ నుంచి టీఎస్‌కు వాహన రిజిస్ట్రేషన్
ఆన్లైన్లో సులువుగా మార్చుకునేలా కొత్త సాఫ్ట్వేర్ ♦ ఈ నెలాఖరు నుంచి ప్రక్రియ మొదలయ్యే అవకాశం ♦ ఆర్థిక భారం వాహనదారులపైనే సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ పరిధిలో ఏపీ సిరీస్‌తో ఉన్న దాదాపు 74 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్‌ను మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వాహనదారులే నేరుగా ఆన్లైన్ ద్వారా రాష్ట్ర, జిల్లా కోడ్లను సులువుగా మార్చుకునేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నారు. కొత్త విధానంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ పాతదే ఉండనుండగా... స్టేట్ కోడ్, జిల్లా కోడ్లు మారనున్నాయి. విభజన తర్వాత తెలంగాణ రవాణాశాఖ జిల్లాలకు కొత్త కోడ్లను కేటాయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ రిజిస్ట్రేషన్ సిరీస్ వాహనదారులు ఆన్లైన్లో మార్పు చేసుకుని కొత్త నంబర్ ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త నంబర్ సిరీస్‌కు సంబంధించి ఆర్సీ కార్డును ఇంటికి పంపుతారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాహనదారుడే ఖర్చు భరించాలి. ఆన్లైన్లో మార్పుచేర్పుల ప్రక్రియకు రూ. 100 వరకు సర్వీసు చార్జీతోపాటు కొత్త ఆర్సీ కార్డు తయారీకి అయ్యే చార్జీని కూడా వారే చెల్లించాలి. అలాగే కొత్త రిజిస్ట్రేషన్ ప్లేటుకు సంబంధించి తప్పనిసరిగా హై సెక్యూరిటీ ప్లేటు బిగించుకోవాల్సిందే. గతంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు ఉన్నవారు కూడా మళ్లీ రెండోసారి ఈ ఖర్చు భరించాల్సి రానుంది. వెరసి ద్విచక్ర వాహనదారులకు దాదాపు రూ. 450 వరకు, కార్లకు అది మరో రూ. 200 అదనంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో విధివిధానాలు జారీ అవుతాయని అధికారులు చెబుతున్నారు. టీఎస్ రిజిస్ట్రేషన్ సిరీస్ అమలులోకి రాకముందు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్ సిరీస్‌ను ఏపీ నుంచి టీఎస్‌లోకి మార్చేందుకు గత ఏడాదే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా దానికి సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలపై స్పష్టత ఇవ్వకపోవటంతో ఆ ప్రక్రియ మొదలు కాలేదు. -
నిరీక్షణ ఫలించింది...
♦ సత్ప్రవర్తన కలిగిన 251 మంది ఖైదీల విడుదల ♦ గవర్నర్ ఆమోదంతో విముక్తి సాక్షి, హైదరాబాద్: క్షమాభిక్ష కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఖైదీల నిరీక్షణ ఫలించింది. సత్ప్రవర్తన కలిగిన 251 మంది ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి క్షమాభిక్ష ఖైదీలు విడుదలయ్యారు. ఐదేళ్ల తర్వాత క్షమాభిక్షకు నోచుకుని ఖైదీలు విడుదల కావడంతో అన్ని జైళ్ల వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. విడుదలైన వారిలో 190మంది జీవిత ఖైదీలు, 61 మంది సాధారణ ఖైదీలు ఉన్నారు. అత్యధికంగా వరంగల్ కారాగారం నుంచి 70 మంది విడుదలయ్యారు. చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 48మంది, చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం (ఓపెన్‌జైలు)-39, చంచల్‌గూడ-9, మహిళా జైలు చంచల్‌గూడ-26, సంగారెడ్డి-6, మహబూబ్‌నగర్-7, నల్లగొండ-6, వరంగల్-70, ఆదిలాబాద్-8, నిజామాబాద్-17, కరీంనగర్-7, ఖమ్మం-8 మంది విడుదలయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే ప్రథమం ఉమ్మడి రాష్ట్రంలో 17సార్లు క్షమాభిక్ష ప్రసాదించారు. మాజీ సీఎం ఎన్టీఆర్ హయాంలో, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. వైఎస్ మరణానంతరం చివరగా 2011లో కొన్ని నేరాలకు మినహాయింపు ఇచ్చి కొంతమంది ఖైదీలను మాత్రమే క్షమాభిక్షపై విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్షమాభిక్ష ఖైదీలు విడుదల కావడం ఇదే ప్రథమం. -
ఏప్రిల్‌లో సాధారణ బదిలీలు?
కొద్ది రోజులు నిషేధం సడలించే యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై కొద్దిరోజుల పాటు నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉద్యోగుల బది లీలపై నిషేధం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా ఈ నిషేధం అమల్లో ఉంది. దీంతో వివిధ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు వివిధ కారణాలతో తమను బదిలీ చేయాలని కోరుతూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. వ్యక్తిగత అభ్యర్థనలతో నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మంత్రులపై ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు సాధారణ బదిలీలలకు అవకాశం కల్పించాలని ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కనీసం వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్న భార్యాభర్తల బదిలీలకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో కొద్ది రోజులు నిషేధం సడలించి కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలి స్తోంది. అందుకే ముఖ్యమంత్రి తుది నిర్ణయం మేరకు ఏప్రిల్‌లో బదిలీల కౌన్సెలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశముందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది సైతం ఏప్రిల్‌లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రతిపాదనను ప్రభుత్వం చివరి నిమిషంలో తోసిపుచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య విభజన ప్రక్రియ పూర్తి కాకపోవటం, అన్ని శాఖల మధ్య ఉద్యోగుల కేటాయింపు కసరత్తు జరుగుతుండటంతో బదిలీలపై వెనక్కి తగ్గింది. రెండ్రోజుల కిందట టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, హమీద్ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి మరోమారు బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, గృహ నిర్మాణ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఉద్యోగుల బదిలీలతో పాటు హెల్త్‌కార్డుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు తీరని అన్యాయం
సంగారెడ్డి మున్సిపాలిటీ : ఉమ్మడి రాష్ర్టంలో ఎక్కువగా నష్టపోయింది మెదక్ జిల్లాయేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ రాజమణి అధ్యక్షతన నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉండగా మైనర్ ఇరిగేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 100 కోట్లు ఇవ్వాలని అడిగేతే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జిల్లాకు చెందినవారు కావడం, తాను ఇరిగేషన్ శాఖకు మంత్రిగా ఉండటంతో ప్రాజెక్టులకోసం అధిక నిధులు కేటాయించామన్నారు. జిల్లాలో 7972 చెరువులు ఉన్నాయని వాటిలో మొదటి విడత మిషన్ కాకతీయ కార్యక్రమంలో 1630 చెరువుల పూడికతీత పనులు చేపట్టడం జరిగిందన్నారు. రెండో విడతలో సైతం 1760 చెరువుల్లో పూడిక తీసేందుకు గాను 230 చెరువులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని వెంటనే పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు సూచించారు. జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు సింగూర్ ఉన్నా ప్రయోజనం లేదని, ఈ ప్రాజెక్టుకు వచ్చే వరద నీటికి అడ్డుగా 44 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించారని దీంతో సింగూర్‌కు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇందుకోసమే సీఎం కేసీఆర్ గోదావరి జాలాలను ఎనిమిది ఎత్తిపోతల ద్వారా సింగూర్‌కు తీసుకవచ్చేందుకు రూ.12 వేల కోట్లు కేటాయించారన్నారు. ఖేడ్ ప్రాంతంలోని పంటల సాగుకోసం గట్టులింగంపల్లి వద్ద 20 వేల ఎకరాలకు సాగునీరందిచేందుకు గాను ఒక ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. గోదావరిలో 200 టీఎంసీల నీరు వృధాగా కలుస్తున్నాయని అందుకు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. గణపూర్ అయకట్ట ఎత్తు పెంచేందుకు ఇప్పటికే నిధులు మంజూరై టెండర్ దశలో ఉన్నాయని, నల్లవాగు ప్రాజెక్టు అభివృద్ధికి రూ.17 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ అవసరమైన చోట లిఫ్టులను నిర్మించేలా మధుర కన్సల్టెంట్ ప్రతిపాదనలు చేయలేదని, వాటిని పూర్తిగా మార్చి ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల సూచనల మేరకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖలో రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని స్వాహా చేసిన విషయమై పత్రికల్లో వార్తలు వచ్చినా స్పందించకపోతే ఎలా అంటూ కొల్చారం జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ నివేదికను ఇన్చార్జి జేడీ కరుణకర్ రెడ్డి వివరిస్తుండగా శ్రీనివాస్‌రెడ్డి రైతుల సొమ్మును మింగిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జెడ్పీ సీఈఓ వర్షిణి వివరణ ఇస్తూ ఇప్పటికే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో జిన్నారం జెడ్పీటీసీ మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనులు ఎలా ఉన్నా చెరువులు కుంటలు కబ్జాకు గురవుతున్నాయని, ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదనగా కలెక్టర్ రోనాల్డ్ రాస్ స్పందిస్తూ ఇప్పటికే కొన్ని అక్రమ నిర్మాణలను కూల్చి వేయడం జరిగిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యే పి.బాబూమోహన్, మహిపాల్‌రెడ్డి, రామలింగారెడ్డి పాల్గొన్నారు. పీఎంకేఎస్‌వై ప్రణాళికలు తప్పుడ తడక జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల తయారీపై రూపొందించిన ప్రణాళికలు తప్పుల తడకగా ఉండటంతో సంబంధిత కన్సల్టెంట్పై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. శనివారం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా సమావేశం ప్రారంభానికి ముందు మధుర కన్సల్టెంట్ సంస్థ వారు పీఎంకేఎస్‌వై (ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన) కింద జిల్లాలో మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం తయారు చేసిన ప్రణాళికలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగు నీరు ఇస్తున్నాం..దీంతో పాటు పెద్దశంకరంపేటలో సైతం సాగు నీరు ఇస్తున్నా అక్కడి చిన్నతరహా ప్రాజెక్టుల పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 2948 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్లు లెక్కలు చూపారని అది వాస్తవం కాదన్నా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సన్మానం ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఖేడ్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎం.భూపాల్‌రెడ్డిని జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ముందు మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జెడ్పీ సీఈఓ వర్షిణి సన్మానం చేశారు. -
వీసీల నియామకాలను రాజకీయం చేయొద్దు
- కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా చట్ట సవరణ సరికాదు: హైకోర్టు - వీసీల నియామకాలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయి - మధ్యంతర ఉత్తర్వులు జారీ.. తదుపరి విచారణ 23కు వాయిదా సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ల(వీసీ) నియామకాలను రాజకీయ నియామకాలుగా చేయడం ఎంత మాత్రం సబబు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాన్ని అన్వయించుకుంటే దానికి శాసన వ్యవస్థ ద్వారా మాత్రమే సవరణలు చేయాలి తప్ప.. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కాదని పునరుద్ఘాటించింది. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో చేపట్టబోయే వైస్ చాన్స్లర్ల నియామకాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ అంశాన్ని వీసీల నియామకపు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 23న కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్టసవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? లేదా? అన్న విషయంపై తుది విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో 29, జీవో 38ను సవాలు చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ డి.మనోహర్‌రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. యూజీసీ పే స్కేళ్లను సవరించి వాటిని 2014 నుంచి వర్తింపచేసేందుకు జారీ చేసిన ఉత్తర్వులనూ సవాలుచేశారు. ఈ వ్యాజ్యాలను సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆర్డినెన్స్ తేవడంలో అర్థమేంటి? పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఏపీలోని చట్టాన్ని అన్వయింప చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ చట్టానికి ఉత్తర్వు ద్వారా సవరణ తెచ్చింద న్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీలకు గవర్నర్ చాన్స్‌లర్‌గా ఉండే వారని, ఇప్పుడు దాన్ని సవరించిందని తెలిపారు. ఇందుకు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఇది కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగో వ్యాజ్యమని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తమకున్న అధికారం మేరకే వ్యవహరించామని వివరించారు. ఈ సందర్భంగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు విషయంలో మొదట జారీ చేసిన జీవో 207ను రద్దు చేసి.. మరో ఆర్డినెన్స్ జారీ చేయడంలో అర్థమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. మేయర్ ఎన్నికల సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ జీవో రద్దు చేసి ఆర్డినెన్స్ తెచ్చాం తప్ప మరే ఉద్దేశం లేదని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అలాగే దేశంలో చాలా వర్సిటీలకు చాన్స్లర్లుగా గవర్నర్లు లేరని చెప్పారు. కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా చట్ట సవరణ వివాదం పదేపదే తలెత్తుతోందని, అందువల్ల అన్ని వ్యాజ్యాలపై తుది విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ రోజున ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు ఆర్డినెన్స్‌ను తమ ముందుంచాలని ఏజీకి తేల్చి చెప్పింది. -
నాబార్డు నిధులతో నాటకం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ (నాబార్డు) రుణాలు దుర్వినియోగమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవటం అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ నిధులు పక్కదారి పట్టాయని గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశాలిచ్చింది. నాబార్డు రుణాలు సద్వినియోగమయ్యాయా.. లేదా.. జిల్లాల వారీగా వీటిని ఏయే పనులకు ఖర్చు చేశారు.. వాటి పురోగతి ఎలా ఉంది. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. రైతుల రుణమాఫీలో అక్రమాలు జరిగాయని, రూ.వెయ్యి కోట్లు పక్కదారి పట్టినట్లు ఆడిట్ పరిశీలన, ఆర్థిక శాఖ విచారణలో వెలుగులోకి వచ్చింది. అదే తరహాలో నాబార్డు రుణాల పరిశీలనతో తేనెతుట్టె కదులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు నుంచి సాధారణ పనులకు రూ.వె య్యి కోట్లు, గిడ్డంగుల నిర్మాణానికి రూ. వె య్యి కోట్లు ప్రభుత్వం రుణంగా స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాబార్డు నుంచి తీసుకున్న నిధులను సరిగా వినియోగించలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకు ఈ నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో నాబార్డు, ఆర్థిక శాఖ అధికారులు విచారణకు రంగం సిద్ధం చేశారు. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించి వాస్తవాలు వెలికి తీయాలని నిశ్చయించారు. మంగళవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావు, నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ హరీష్ జావా బృందం ఇక్కడ పర్యటించనుంది. -
కల్యాణలక్ష్మికి ప్రాచుర్యమేది?
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకంలో భాగంగా అన్ని కులాల్లో ఉన్న పేద వర్గాలకు పెళ్లి చేసుకునే సమయంలో ప్రభుత్వం నుండి కొద్దిమేర ఆర్థిక సహాయం లభించేది. రాష్ట్రాల విభజనతో తెలంగాణలో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడి పాత పథకాలను రద్దు చేసి కొన్ని కులాలకే పరిమితమయ్యే కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. రూ.2,00,00 ఆదాయం లోపు ఉన్న పేద వర్గాలకు మైనార్టీ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు రూ.51,116లు నజరానాగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు కానీ, ఈ పథకానికి సరైన ఆదరణ లభించడంలేదు. వేల మంది దరఖాస్తు చేసుకున్నా సరైన సమయంలో వారికి అందడంలేదు. కొందరి ‘0’ బ్యాలెన్స్ ఖాతాలకు ఇవి పడటంలేదు. సేవింగ్ ఖాతాలున్న వారికే ఈ స్కీం వర్తిస్తుందని అధికారులు మెలికలు పెడుతున్నారు. బడ్జెట్లో ఈ పథకానికి డబ్బులు కేటాయించినా శాఖల నిర్వాహకులు, అధికారుల మధ్య సమన్వయం లేక ఈ పథకానికి కేటాయించిన డబ్బులు మురిగిపోతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ పథకానికి సరైన అధికారులను కేటాయించి, దరఖాస్తు చేసుకున్న వారికి సరైన సమయంలో డబ్బులు అందేలా ఈ పథకాన్ని అన్ని కులాల పేద వర్గాలకు విస్తరించేలా, ఈ పథకాన్ని అన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే ఈ పథకానికి సరైన అవకాశం ఇచ్చినట్లవుతుంది. - జైని రాజేశ్వర్‌గుప్త కాప్రా, హైదరాబాద్ -
హైకోర్టు విభజనతోనే తెలంగాణకు న్యాయం
- కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ కాజీపేట: ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనతోనే తెలంగాణ ప్రజలు సార్వభౌమత్వాన్ని అనుభవించగలుగుతారని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. కాజీపేట తారాగార్డెన్ కాళోజీ ప్రాంగాణంలోని ఆచార్య బియాల జనార్ధన్ హాల్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వేదికపై ఆదివారం తెలంగాణ వికాస సమితి ప్రథమ వార్షికోత్సం జరగింది. సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాల ఫలితంగా దక్కిన రాష్ట్ర ఆవిర్భా ఉత్సవం కొంతమంది కారణంగా తెలంగాణ వాసులకు దక్కకుండా పోతుందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతానికి ఏదో నష్టం జరిగిపోతుందని సీమాంధ్ర పాలకులు చేసిన వ్యాఖ్యలు తప్పని ఏడాది టీఆర్ఎస్ పాలన నిరూపించిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రజల ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనమని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా చూడడం తెలంగాణ వాదులకు నైతికవిజమని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన హైకోర్టు విభజన జరుపకపోవడంతో రెండు రాష్ట్రాల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని.. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. హైకోర్టులు స్థానికంగా ఉండాలని ప్రజలు కోరుకోవడం ఒక హక్కు అని అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసిఆర్ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. జిల్లా పరిషత్ చెర్మైన్ గద్దెల పద్మ మాట్లాడుతు అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్య అందరిపై ఉందన్నారు. సభ అధ్యక్షుడు, వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయాయే తప్ప మనుసులు ఎప్పటికి కలిసి ఉంటాయని అన్నారు. కవి, రచయిత నందిని సీదారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి, ఒంగోలు జిల్లా వాసి డాక్టర్ కోయి కోటేశ్వర్రావు తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. కార్యక్రమంలో వికాస సమితి జిల్లా అధ్యక్షుడు జి.చంద్రశేఖర్, రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ ఎ.శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, డాక్టర్ బ్రహ్మం, ప్రొఫెసర్ వినయ్‌బాబు, పరాంకుషం, వేణుగోపాలస్వామి పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ కవులు, కళాకారులు వేదికపై చేసిన ఆట, పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. -
‘రుణ’రంగం..!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రుణాల పంపిణీ ఇప్పటికీ తేలలేదు. దాదాపు రూ.30 వేల కోట్ల అప్పులపై తెలంగాణ, ఏపీల మధ్య పీటముడి పడింది. రాష్ట్ర విభజన ముందు వరకు సమైక్య రాష్ట్రానికి రూ. 1.78 లక్షల కోట్ల అప్పు ఉంది. గత బడ్జెట్ నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులను పంపిణీ చేసింది. పక్కాగా ఉన్న ఆడిట్ లెక్కల ప్రకారం రూ.1.48 లక్షల కోట్ల అప్పులు పంపిణీ చేయగా, రూ.30 వేల కోట్ల అప్పుల పంపకం పూర్తి కాలేదు. ప్రస్తుతం వీటికి వడ్డీని ఏపీ సర్కారే చెల్లిస్తోంది. నాబార్డు, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి వివిధ పథకాలకు విడుదలైన నిధులు, మౌలిక సదుపాయాలకు జైకా విడుదల చేసిన నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణకు రాష్ట్రానికి మంజూరైన నిధుల విషయంలోనే గందరగోళం నెలకొంది. వీటిలో తెలంగాణ ప్రాంతానికి ఎంత ఖర్చు చేశారు.. ఏపీలోని జిల్లాలకు ఎంత కేటాయించారనే అంశంపై మల్లగుల్లాలు తొలగిపోలేదు. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదిదాటినా ఈ వివాదం సమసిపోలేదు. ఆర్టీసీది ఒక మచ్చుతునక... మిగులు అప్పును అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయం రికార్డుల ఆధారంగా పంచుకోవాలా? లేక తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థలకు సంబంధించి ఆస్తులు, అప్పుల విభజనకు నియమించిన షీలా బిడే కమిటీ సూచనల మేరకు పంచాలా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు ఆస్తులు, అప్పులు, పెట్టుబడుల వివరాలన్నీ తమకు తాముగా సిద్ధం చేసుకున్నాయి. ఉమ్మ డి రాష్ట్రంలో జమా ఖర్చుల వివరాలన్నీ ఏజీ కార్యాలయం రికార్డు చేసింది. ఏజీ రికార్డులే అప్పుల పంపిణీకి కీలకంగా మారాయి. కానీ, కొన్ని సంస్థల్లో ప్రభుత్వం చూపిస్తున్న పెట్టుబడుల లెక్కల్లో తేడాలుండటంతో వివాదాస్పదమైంది. ఉదాహరణకు ఆర్టీసీ లాంటి సంస్థకు ఉమ్మడి ప్రభుత్వం వివిధ రూపాల్లో దాదాపు రూ. 5 వేల కోట్లు కేటాయించినట్లు ఏజీ రికార్డులు చెబుతున్నాయి. కానీ తమకు ఉమ్మడి రా ష్ట్రం కేవలం రూ.2 వేల కోట్లే కేటాయిం చిందని, మిగతా చెల్లింపులన్నీ బకాయిలని ఆర్టీసీ లెక్కలు వేలెత్తి చూపుతున్నాయి. దీంతో మిగతా రూ.3 వేల కోట్లను రుణంగా పరిగణిం చాలా? లేదా? అనేది చిక్కుముడి. ఆర్టీసీ తరహాలో మిగతా సంస్థల్లోనూ ఇలాంటి తేడాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సరిచూసుకోవాలి ప్రధానంగా తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థల పెట్టుబడులు, ఖర్చుల వివరాల్లోనే ఈ గందరగోళం ఉంది. అందుకే ఏజీ రికార్డుల్లో ఉన్న రుణాలు నిజంగా పంపిణీ అయ్యాయా? గ్రాంట్లుగా మంజూరయ్యాయా? లేక సర్కారు రుణంగా ఇస్తే సంస్థలు గ్రాంట్లుగా చూపించుకున్నాయా? అనేది సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన అప్పును ఏజీ రికార్డుల ప్రకారం పంచాలంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇది సరికాదంటూ తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. సంస్థల దగ్గరున్న రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. లేకుంటే షీలాబిడే కమిటీ సైతం భవిష్యత్తులో ఈ విషయాన్ని వేలెత్తి చూపుతుందని తెలంగాణ వాదిస్తోంది. అప్పుల వడ్డీల భారం పడుతుండటంతో పాటు.. వడ్డీల చెల్లింపుల విషయంలోనూ రుణాలిచ్చిన సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో వీలైనంత త్వరగాఅప్పులు పంచుకోవాలని రెండు రాష్ట్రాల అధికారులు సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చారు. వచ్చే వారం వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏకాభిప్రాయం కుదరకపోతే కేంద్రం జోక్యం చేసుకొని ఏజీని రంగంలోకి దింపే అవకాశముంది. -
పాలమూరు, డిండిలో ఉల్లంఘనలు లేవు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడటం లేదని, ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్న ఈ ప్రాజెక్టులను అర్థవంతంగా పూర్తి చేసే కసరత్తు మొదలుపెట్టామని రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ కార్యదర్శికి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయనకు ఈ రెండు ప్రాజెక్టులపై స్పష్టతనిస్తూ నాలుగు పేజీల లేఖ రాశారు. కృష్ణాలో 70 టీఎంసీల నీటి వినియోగంకోసం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టు 8న అప్పటి ప్రభుత్వం జీవో 72ను, అలాగే 30 టీఎంసీల నీటి వినియోగంకోసం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై7న ఇచ్చిన జీవో 159లను ఉమ్మడి రాష్ట్రంలోనే ఇచ్చిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. కరువు పీడిత ప్రాంతాలైన మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించేందుకు పాలమూరు ఎత్తిపోతలు, ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటున్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సురక్షిత నీటిని అందించేందుకు డిండి ప్రాజెక్టును తలపెట్టినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పరిపాలనా అనుమతులు మంజూరైన ఈ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్‌లోని ప్రాంతాలకు నీరిచ్చే స్వేచ్ఛ తమకుందని స్పష్టం చేశారు. బచావత్ అవార్డు ప్రకారం నికర, మిగులు జలాలను ఉపయోగించుకొనే స్వేచ్ఛ సైతం తమకుందని లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టులకు చట్టబద్ధమైన వ్యవస్థల నుంచి అవసరమైనప్పుడు తగిన సమయంలో అన్ని రకాల అనుమతులు తీసుకుంటామని వివరించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చట్టంలోని 84(8)ఏ నిబంధన ప్రకారం బోర్డు కేవలం నీటి సరఫరాను నియంత్రిస్తుంది తప్పితే, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించింది కాదన్నారు. ట్రిబ్యునట్ చేసిన కేటాయింపులు, ప్రస్తుతం చేసుకున్న అంత ర్రాష్ట్ర ఒప్పందాలను గౌరవించాలని ఇప్పటికే రెండు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని గుర్తుచేస్తూ, నికర, మిగులు జలాల్లో ఉన్న హక్కుల మేరకే నీటిని వాడుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు. పాలమూరుపై మంత్రి సమీక్ష.. కాగా ఇదే విషయమై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు గురువారం అధికారులతో సమావేశమయ్యారు. ఏపీకి పాలమూరు -రంగారెడ్డి విషయమై లేఖ రాసిన విధంగానే కేంద్రానికి అన్ని రకాల ఆధారాలతో లేఖ పంపాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలో అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియను వేగిరం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఆదివాసీలను ముంచడం సరికాదు
- పోడు భూములు లాక్కొనేందుకే హరితహారం - తుడుందెబ్బ నేత పోదెం బాబు - ములుగులో ర్యాలీ.. ఆర్డీ కార్యాలయ ముట్టడి ములుగు : ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం పేరు మీద తెలంగాణ నాయకులు ఆదివాసీలను ఆంధ్ర ప్రాంతానికి బలిస్తే.. నేడు తెలంగాణ ప్రభుత్వం కంతనపల్లి, మణుగూరు థర్మల్ ప్రాజెక్టు, కుంటాల హైడల్ ప్రాజెక్టు, ఇచ్చంపల్లి ప్రాజెక్టులతో ఆదివాసీలను ముంచడం సరికాదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు పోదెం బాబు అన్నారు. ఈ మేరకు సమితి ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయంతో జీవిస్తున్న ఆదివాసీల భూములను ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కొని మొక్కలు నాటేందు కు అణచివేత చర్యకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు తహసీల్దార్లు ఏజె న్సీ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని, ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలం రవికుమార్ ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏటూరునాగారం మండలాన్ని స్వయం ప్రతిపత్తి గల ఆదివాసీ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తుడుందెబ్బ ములుగు డివిజన్ కమిటీ అధ్యక్షుడు ముద్దెబోయిన రవి డిమాండ్ చేశారు. ఆ తర్వా త తమ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. సంఘం నేతలు తాటి హన్మంతరావు, ఆగబోయిన రవి, కోరగట్ల లక్ష్మణ్‌రావు, నాలి సారయ్య, పులిసె బాల క్రిష్ణ, జివ్వాజి రవి, వట్టం నాగరాజు, కొండ నాగరాజు పాల్గొన్నారు. -
తెలంగాణకూ నాబార్డు
రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా కార్యకలాపాలు సీజీఎంగా సత్యనారాయణ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించిన జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ప్రాంతీయ కార్యాలయాన్ని గురువారం విభజించి తెలంగాణ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక నుంచి రెండు రాష్ట్రాల్లో నాబార్డు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహించనుంది. తెలంగాణ నాబార్డుకు చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా వి.వి. సత్యనారాయణను నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీజీఎంగా పనిచేసిన జీజీ మెమ్మేన్ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. మరికొద్ది రోజుల్లో ఉద్యోగులను విభజించనున్నారు. నాబార్డు జాతీయ బ్యాంకు అయినందున ఆస్తుల పంపకం అనేది ఉండదు. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యాల ప్రకారం నడుచుకుంటుంది. రెండు కార్యాలయాలు కూడా ప్రస్తుతం హైదరాబాద్ (ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో) కార్యాలయంలోనే కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక రుణ లక్ష్యం రూ. 10 వేల కోట్లు... గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు చెల్లింపులపై సమీక్షించిన నాబార్డు ఆ వివరాలను ఇద్దరు సీజీఎంలు వి.వి.సత్యనారాయణ,జీజీ మెమ్మేన్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2015-16 సంవత్సరానికి తెలంగాణలో రూ. 10 వేల కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ఏపీ లోనూ అంతే సంఖ్యలో రుణాలు ఇస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో రూ. 14,074 కోట్ల రుణ లక్ష్యం కాగా రూ. 16,183 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయకు ప్రాధాన్యం ఇస్తున్నందున ఆర్ఐడీఎఫ్ సాయంగా దానికి రూ. 360 కోట్లు మంజూరు చేశామన్నారు. గోదాముల నిర్మాణానికి నాబార్డు రూ. 972 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీల్లో తరగతి గదులు, ల్యాబ్స్, హాస్టళ్ల సదుపాయాల కోసం రూ. 295 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆర్ఏజీల ఏర్పాటు... వ్యవసాయం, రైతులు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాంతీయ సలహా గ్రూపుల (ఆర్ఏజీ)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు, ఆదర్శ రైతు సంఘాలు, ఎన్జీవోలతో కలసి ఫోరమ్ ఏర్పాటు చేశామని సీజీఎంలు పేర్కొన్నారు. తెలంగాణలో 2,670, ఏపీలో 6,922 రైతు క్లబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. 2015-16లో ప్రాధాన్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అగ్రి టర్మ్ లెండింగ్ ద్వారా వ్యవసాయ రంగంలో మూలధన ఏర్పాటుకు దృష్టిసారిస్తామని తెలిపారు. పథకాలను ప్రారంభించి, అమలుపరుస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లో సాగు, తాగునీరు, పొడి, తడి నిల్వలు, గ్రామీణ పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ యంత్రాంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇ-పోర్టల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ తమ పాధాన్యమని సీజీఎం సత్యనారాయణ అన్నారు. పాలీహౌస్‌లకు సాయం చేస్తామన్నారు. -
ప్రజలను జాగృతపరిచేవి కళలే
ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులకు అన్యాయం డిప్యూటీ సీఎం రాజయ్య రవీంద్రభారతిలో అక్కినేని మీడియా అవార్డ్స్ ప్రదానం సాక్షి మీడియా ప్రతినిధులకు రెండు అవార్డులు సాక్షి, సిటీబ్యూరో: కళలు ఎప్పుడో ఒకప్పుడు ప్రజలను జాగృతం చేస్తుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత సినీ దిగ్గజం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి సందర్భంగా అక్కినేని మీడియా అవార్డ్స్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులు వివక్షతకు గురయ్యారన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి మాట్లాడుతూ మీడియా అవార్డ్సు ప్రదానం మంచిని ప్రభావితం చేసే కార్యక్రమమన్నారు. అనంతరం శృతిలయ, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కినేని మీడియా అవార్డులను సాక్షి టీవీకి చెందిన బి.కల్పనకు, సాక్షి ఫిలిమ్ రిపోర్టర్ ఎస్.నాగేశ్వరరావు, ఎక్స్‌ప్రెస్ టీవీ నుంచి భవన, ఈటీవీ2 నుంచి సతీష్‌తోపాటు పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు, శృతిలయ నిర్వాహకులు ఆర్ఎన్ సింగ్, ఆమని, దళిత సేవా అధ్యక్షులు జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇరు రాష్ట్రాలకు పోస్టుల కేటాయింపు
58:42 నిష్పత్తిలో కేటాయించిన కమలనాథన్ కమిటీ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కమలనాథన్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సలహా కమిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సంఖ్యపై అనుమానాలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే ఈ నెల 10వ తేదీలోగా కమిటీకి ఇవ్వాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నాటికి ఆయా విభాగాల అధిపతులు ఇచ్చిన సమాచారం మేరకు కమలనాథన్ కమిటీ ఉద్యోగుల సంఖ్యను నిర్ధారించింది. ఇందులో అటెండర్, టైపిస్ట్ స్థాయి ఉద్యోగి నుంచి మొదలుకొని రాష్ట్ర ఉన్నతస్థాయి పోస్టుల వరకు కేటాయింపు జరిగింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, చివరి గ్రేడ్, ఎయిడెడ్, గ్రూప్-1 తదితర స్థాయి పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ నోటి ఫికేషన్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పోస్టుల సంఖ్య 11,78,398 కాగా.. వీటిలో 2,36,763 ఖాళీలున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో వీటిని ఇరు రాష్ట్రాలకు ఖాళీ పోస్టులతో సహా కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు 6,80,516 పోస్టులు దక్కగా.. వాటిలో 1,38,747 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఏపీకి నికరంగా 5,41,769 మంది ఉద్యోగులను కేటాయించినట్లయింది. ఇక తెలంగాణకు 4,97,882 పోస్టులను కేటాయించింది. అందులో 98,016 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. అంటే ఖాళీలు పోను తెలంగాణకు నికరంగా 3,99,866 మంది ఉద్యోగులు వచ్చారు. ఖాళీగా ఉన్న పోస్టులను ఇరు రాష్ట్రాలు భర్తీ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ ఇటీవలే మార్గదర్శకాలను ఖరారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నోటిఫై చేసిన ఉద్యోగుల సంఖ్యపై అభ్యంతరాలను ఆయా శాఖాధిపతులకు తెలియజేయాలని తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై పూర్తి స్పష్టత వచ్చినట్లయింది. పూర్తి సమాచారాన్ని ‘ఏపీ రీఆర్గనైజేషన్ పోర్టల్’లో చూడొచ్చు. -
తెలంగాణకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలేవీ?
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కే దక్కాయి. ఉన్నత విద్యలో ఉత్తమ ప్రమాణాల కోసం కేసీఆర్ ప్రభుత్వం సత్వరమే తెలంగాణలో కనీసం నాలుగు చోట్ల వీటిని ఏర్పర్చాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయంపాలన మొదలయింది. ఇప్పుడు ప్రభుత్వ రెసిడెన్షియల్ (ఆశ్రమ) విద్యావిధానంపై దృష్టి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో అందించే విద్య ఉన్నత ప్రమాణాలతోపాటు, ఉచితంగా విద్యాబోధన, వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తుండడంతో పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలు వీటిపై మక్కువ చూపుతున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదువు అంటే లక్షల్లో ఖర్చవుతోంది. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటైతే పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలకు కల్పతరువులుగా మారతాయి.. తొలి పాఠశాల తెలంగాణలోనే... ఉమ్మడి రాష్ట్రంలో 1972లో ఆశ్రమ పాఠశాల విద్యావిధానానికి నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా సర్వేలులో తొలి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. దీనికి సర్వోదయ ట్రస్ట్ భూమిని, భవనాలను విరాళంగా ఇచ్చింది. తొలిదశలో పాఠశాలలు ప్రారంభించిన ప్రభుత్వం ఆ తరువాత జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలలు 58 (వీటిలో మైనారిటీల పాఠశాలలు 7), జూనియర్ కళాశాలలు నాలుగు (వీటిలో మైనారిటీ-2) ఉన్నాయి. మొత్తంగా 20 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఏపీలో ఏర్పర్చిన రెండు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 1,296 మంది ఉంటే వీరిలో 545 మంది తెలంగాణ విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఒక్కటీ లేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీలో 2 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మొదలయ్యాయి. తొలిదాన్ని 1972లో కర్నూలులో ప్రారంభించారు. 1969, 1972లో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ, జైఆంధ్ర) ఉద్యమాల నేపథ్యంలో మూడు ప్రాంతాల విద్యార్థులు కలసి విద్యనభ్యసించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. 1982 సెప్టెంబర్ 1న గుంటూరు జిల్లాలోని విజయపురి సౌత్ (నాగార్జునసాగర్)లో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. వీటిలో 42:36:22 ప్రకారం మూడు ప్రాంతాల విద్యార్థులకు ప్రవేశాలు లభించేవి. విభజన తరువాత ఈ రెండూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాయి. తెలంగాణకు ఇలాంటి విద్యాసంస్థ ఒక్కటీ లేదు. రాష్ట్రస్థాయి సంస్థలో చదివినందువల్ల వీటిలో చదివిన తన విద్యార్థుల్ని తెలంగాణ ప్రభుత్వం స్థానికులుగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఏడాది నుంచి చదివే తెలంగాణ విద్యార్థులు ఈ రెండు కళాశాలల్లో ఎక్కడ చదివినా మరో రాష్ర్టంలో చదివినట్లే అవుతుంది. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు ప్రవేశాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందుకే తెలంగాణ సర్కారు సొంత రాష్ట్రంలో నాలుగు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలి తెలంగాణకు ఎంతో ఉపయుక్తం ప్రస్తుతం తెలంగాణలో కొత్తవాటితో కలిపి 126 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇవికాక ప్రైవేటులో 944 కాలే జీలు నడుస్తున్నాయి. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో నియ మించే బోధకులకు ఉన్నత విద్యార్హతలు ఉంటాయి కాబట్టి ఉన్నత ప్రమాణాలకు అక్కడ బీజం పడుతుంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం సత్వరమే కొత్తగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. సివిల్ సర్వీసులు, గ్రూప్స్ వంటి వాటికి ఎంపికయ్యే అభ్యర్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల నుంచే వస్తుంటారు. కాబట్టి తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నత ప్రమాణాలతో ఉత్తీర్ణులై, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడానికి రెసిడెన్షియల్ కాలేజీలు నిచ్చెనలా ఉపయోగపడతాయి. నవీన కోర్సులతో ఏర్పాటు మేలు ఈ కళాశాలల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులను బట్టి నవీన కోర్సులతో ఏర్పాటు చేయడం ముఖ్యం. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఆధునికంగా వై-ఫై, ఇ-లైబ్రరీ అందుబాటులో ఉంచి, చక్కటి ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలి. ఈ కళాశాలల్లో చదివిన వారికి అక్కడే ప్లేస్‌మెంట్‌తో పాటు పీజీ, ఆ తరువాత సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తే అద్భుత ఫలితాలు సాధించడానికి వీలవుతుంది. ఉన్నత ప్రమాణాలకు నెలవుగా ఉన్న సిల్వర్ జూబిలీ, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీల తరహాలో వీటి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. కె. బాలకిషన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ -
రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లు?
వరంగల్, ఖమ్మం, గోదావరిఖని, మంచిర్యాలలో ఏర్పాటు సీఎం అనుమతి రాగానే అమల్లోకి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు కానున్నాయి. వరంగల్, ఖమ్మం, మంచిర్యాల, గోదావరిఖనిలలో వీటి ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేసింది. జనాభా పెరగడంతో, శాంతిభద్రతలను, నేరాలను నియంత్రణ చేయడం భవిష్యత్తు లో కష్టమవుతుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేశారు. వరంగల్‌లో పోలీసుకమిషనరేట్ను ఏర్పాటు చేయాలనేది ఉమ్మడిరాష్ట్రంలోనే ప్రతిపాదించారు. విభజన అనంతరం మిగిలిన ప్రాంతాల్లో కమిషనరేట్లు తప్పనిసరి అనే భావన సీఎం కేసీఆర్‌కు ఉందని పోలీసువర్గాలు తెలిపాయి. దీంతో విధివిధానాలు, మౌలిసదుపాయాలు, పోలీసుఅధికారులు, సిబ్బంది సంఖ్య తదితర అంశాలతో కమిషనరేట్ల ప్రతిపాదనలను డీజీపీ అనురాగ్‌శర్మ సిద్ధం చేశారని తెలిసింది. కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈమేరకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
జిల్లా పరిషత్‌కు ‘ఖజానా’ షాక్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ యంత్రాంగానికి ఖజానాశాఖ షాకిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు చేసిన ఎన్నికల నిధులను విడుదల చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం పాత బిల్లుల మంజూరు కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు వెచ్చించిన నిధులను సమకూర్చుకునేందుకు.. నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్‌లలోని సాధారణ నిధులను వాడుకుంటోంది. జిల్లావ్యాప్తంగా మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4.30 కోట్లను కేటాయించింది. దీంట్లో సుమారు రూ.3.60 కోట్లు విడుదల చేసింది. అయితే, ఈ సొమ్మును మే నెలాఖరులోపు వినియోగించుకోవాలని నిర్దేశించింది. జూన్ 2 అపాయింటెడ్ డే కావడంతో ఆ లోపే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన పద్దులను తొలగించి.. జీరో పద్దులను తెరవాలని ప్రభుత్వం సూచించింది. మే రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ జిల్లా పరిషత్ అధికారులు బిల్లుల సమర్పణలో జాప్యం చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఇతర జిల్లాల నుంచి వ చ్చిన ఎంపీడీఓలు.. అదే నెల 24న సొంత జిల్లాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఎన్నికల నిర్వహణా వ్యయానికి సంబంధించిన బిల్లులు/క్లెయిమ్‌లు ట్రెజరీలకు చేరడంలో ఆలస్యమైంది. కొత్త ఎంపీడీఓలు బాధ్యతలు స్వీకరించిన అనంతరం 30వ తేదీన బిల్లులు ప్రతిపాదించినప్పటికీ, వాటిని ఖజానాశాఖ అనుమతించలేదు. జూన్ 2న రాష్ట్రం లాంఛనంగా విడిపోవడంతో ఉమ్మడి రాష్ర్టంలో ఖర్చుచేసిన బిల్లులు మంజూరు చేసేదిలేదని ట్రెజరీ శాఖ కొర్రీ పెట్టింది. ఈ పేచీ తో ఎన్నికలకు వ్యయం చేసిన సుమారు రూ.60 లక్షల నిధుల విడుదల నిలిచిపోయింది. ఎన్నికల నిధుల విడుదలకు రాష్ట్ర విభజన ఆంక్షలు వర్తించవని తొలుత ఖ జానా శాఖ చెప్పడంతోనే బిల్లుల సమర్పణలో జాప్యం జరిగిందని, ఇప్పుడు ఆ శాఖ మాటమార్చడం దారుణమని అంటోంది. ఎన్నికల నిర్వహణలో వినియోగించుకున్న సేవలకుగానూ చెల్లించాల్సిన నిధులను మండల పరిషత్‌లలోని జనరల్‌ఫండ్స్‌తో సర్దుబాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆయా మండలాల్లో అత్యవసర పనుల నిర్వహణకు నిధులు అందుబాటులో లేకుండా పోయాయని జిల్లా పరిషత్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణకు నిర్ధేశించిన నిధులపై ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించడం సరికాదని, ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు. -
మహిళలపై అకృత్యాల్లో ఉమ్మడి ఏపీ టాప్
తాజాగా విడుదలైన ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి 2013లో మహిళలపై జరిగిన నేరాల కేసులు 32,809 హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించిన 2013 గణాంకాల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2012 నాటి లెక్కలతో పోలిస్తే... మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు ప్రతి అంశంలోనూ పెరుగుదల నమోదైంది. 2012లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు వ్యతిరేకంగా సంబంధించి 28, 171 కేసులు నమోదు కాగా... 2013 నాటికి ఆ సంఖ్య 32,809కి చేరింది. 2012లో దేశంలోనే అత్యధిక కేసులతో ప్రథమ స్థానంలో నిలిచిన పశ్చిమ బెంగాల్ 2013లో 29,826 కేసులతో రెండో స్థానానికి వచ్చింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10.59 శాతం కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే రాష్ట్రంలోనే రిజిస్టరయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాది కాలంలో 1,635 అత్యాచారాలు (2012లో 1,341), 1,595 కిడ్నాప్‌లు (2012లో 1,403), 492 మంది వరకట్న వేధింపుల మరణాలు (2012 లో 504) నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో సగానికిపైగా పరిచయస్తులు, బంధువులవల్లే జరిగినవని ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీలపై దాడుల్లో నాలుగో స్థానం ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల నమోదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ (7078), బీహార్ (6,721), రాజస్థాన్ (6,475) తరవాత ఆంధ్రప్రదేశ్‌లో 3,270 కేసులు నమోదయ్యాయి. -
ఏడాదికి 1000 కోట్లు
మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యం జిల్లాలో 234 వైన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం గత ఏడాది కంటే మూడు షాపులు అదనం నాలుగు కేటగిరీలుగా లెసైన్‌స ఫీజులు ఏజెన్సీలో ప్రత్యేక మార్గదర్శకాలతో 19 దుకాణాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : మద్యం అమ్మకాల ద్వారా ఈ సంవత్సరం(2014-15)లో ప్రభుత్వం జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా 234 మద్యం దుకాణాలు (వైన్ షాపులు) ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలోని విధానానికి మార్పులు చేస్తూ కొత్త విధానం రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం... జిల్లాకు సంబంధించి ప్రత్యేక గెజిట్‌ను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొత్త షాపులను కేటాయించింది. గత ఏడాది జిల్లాలో 231 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయిరచగా... ఈ సారి మూడు షాపులు అదనంగా ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం వైన్ షాపుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు షాపులు మిగిలిపోయూయి. వాటిని ఈ ఏడాది మన జిల్లాకు కేటాయించారు. జిల్లాలో గత ఏడాది దరఖాస్తులు రాకుండా మిగిలిపోయిన భూపాలపల్లిలోని మూడు షాపులను కేసముద్రం, తొర్రూరు, మరిపెడకు... పరకాల షాపును వర్ధన్నపేటకు కేటాయించారు. లెసైన్స్ ఫీజు ద్వారా రూ.93 కోట్లు జనాభా ప్రాతిపదికన జిల్లాలో ఏర్పాటు చేయనున్న వైన్ షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.32.5 లక్షల లెసైన్స్ ఫీజు మద్యం దుకాణాలు 86, రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజు దుకాణాలు 84, రూ.42 లక్షల ఫీజు దుకాణాలు 24, రూ.68 లక్షల చొప్పున లెసైన్స్ పీజుల చెల్లించే మద్యం దుకాణాలు 40 ఉన్నాయి. జిల్లాలో ఏర్పాటు చేయనున్న 234 వైన్ షాపులకు లెసైన్స్ రూపంలోనే రూ.93.59 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఈ వైన్ షాపుల లెసైన్స్ కోసం చేసే దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉంది. భారీగా రానున్న దరఖాస్తులతో ఈ మొత్తం కూడా భారీగానే ఉండనుంది. ఈ షాపుల ఏర్పాటు తర్వాత విక్రయించే మద్యంతో ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆదాయం తీరు చూసినా... ఇదే పరిస్థితి కనిస్తోంది. 2013-14 ఎక్సైజ్ సంవత్సరంలో మద్యం విక్రయాలపై నెలకు సగటున రూ.75 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదిలో రూ.900 కోట్లు వచ్చినట్లు అధికాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇది వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏజెన్సీలో 19 షాపులు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో వైన్ షాపుల ఏర్పాటుకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి. మన జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో 19 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటూరునాగారం, ములుగు, గూడూరు ఎక్సైజ్ విభాగాల పరి ధిలోకి వచ్చే మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు గ్రామసభల తీర్మానం తప్పనిసరి. మద్యం దుకాణం ఏర్పాటుకు ఇబ్బంది లేదని గ్రామసభ తీర్మానం చేస్తేనే అక్కడ వైన్ షాపు ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. ఏజెన్సీలో వైన్ షాపు ల లెసైన్స్‌లను అక్కడి స్థానికలకే ఇస్తారు. ఐటీడీఏ పరిధిలో వైన్ షాపుల లెసైన్స్ కోసం దరఖాస్తు చేసే వారు స్థానికత, కులం సర్టిఫికెట్లు జత చేయాలి. వీటిని ప్రమాణికంగా తీసుకుని లాటరీలో దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వ గెజిట్ ప్రకారం ప్రకారం జిల్లాలో మొత్తం 234 వైన్ షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టింది. కొత్త విధానంలోనూ మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ పద్ధతినే అవలంబించనున్నారు. మద్యం దుకాణాల లెసైన్స్ పొందాలనుకునే వారు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.25 వేలుగా నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు ఫొటోలు, లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా చెల్లించాలి. ఇది గరిష్టంగా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్ హాల్లో లాటరీ విధానం ద్వారా వైన్ షాపులను కేటాయించనున్నారు. ఒకరు ఎన్ని షాపులకు... ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా... లాటరీలో ఒక షాపు దక్కితే అక్కడితోనే సరిపెడతారు. మిగిలిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. లాటరీలో వైన్ షాపు దక్కిన వారు వెంటనే లెసైన్స్ ఫీజులో మూడో వంతు చెల్లించాలి. -
సాకారమైన కల
‘‘ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు ఓటముల ప్రసక్తి పక్కనబెట్టాలి.’’ మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన ఘట్టం చరిత్ర పుటలలో చోటు చేసుకుంది. చాలా ఏళ్లుగా నలుగు తూ వచ్చిన సమస్యకు ‘ముగింపు’ దొరికింది. పడింది ‘శుభం’ కార్డా, కొత్త సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం. దాన్ని కాలమే తేలుస్తుంది. ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పడినప్పుడు ఇలాగే సందేహించినవారున్నారు. వారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం కూడా తగదు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు ఓటముల ప్రసక్తి పక్కనబెట్టాలి. ఇంత కాలం జరిగింది యుద్ధమూ కాదు, ఆటా కాదు. ఉభయప్రాంతాల ప్రజల ఆకాంక్షకు వ్యక్తీకరణ. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేశారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం లేదు. ఇకనుంచయినా, రెండు ప్రాంతాల ప్రజలు రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ ప్రాంతాల సత్వర అభివృద్ధిలో స్వయంగా భాగస్వాములు కావాలి. నిజమే. సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 1969 నాటి ఆందో ళనతో పోలిస్తే మొత్తం మీద శాంతియుతంగా జరిగిందని దానికి నాయకత్వం వహించిన వాళ్లు చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది యువకులు చేసిన బలిదానాల మాటేమిటి? ప్రాంతీయంగా విడిపోయినా మానసికంగా కలిసివుందామని కోరుకునే వారి నడుమ రాజకీయులు తమ స్వార్థం కోసం రగల్చిన సంఘర్షణల మాటేమిటి? ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల మానసిక క్లేశాలకు ఖరీదు కట్టే షరాబులు దొరకరు. అందు చేత అలాంటి వారికి సాంత్వన కలిగించడం తెలంగాణ నాయకుల ప్రథమ కర్తవ్యం. ప్రజల మనసులకు తగిలిన గాయాలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. వాటిని తమ మాటలు, చేతలతో మరింత ముదిరేలా చేసి వ్రణాలుగా తయారు చేయకపోతే అదే పదివేలు. దాదాపు అరవై ఏళ్లు కలసి మెలసి ఉండి విడిపోయే తరుణంలో బాధప డని వారు ఉండరు. విడిపో వడం తప్పనిసరి అయినప్పుడు కలిసివున్నప్పటి రోజుల్లోని అనుబంధాలను గుర్తు చేసుకొని వాటిని పదిలపరచుకోవడం, పెంచుకోవడం విజ్ఞుల లక్షణం. మరో వారం తిరగగానే తెలుగు ప్రజల చరిత్రలో ఇంకో నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతోనే మరో కొత్త రాష్ట్రం రూపుదిద్దుకో బోతోంది. తెలంగాణకు, వడ్డించిన విస్తరి మాదిరిగా అన్ని హంగులతో కూడిన రాజధాని నగరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం అన్నీ మొదలు పెట్టి వేగంగా సాగాలి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల దూరదృష్టి లోపం కారణంగా అభివృద్ధి హైదరాబాద్, దాని చుట్టుపక్కల కేంద్రీకృతమైంది అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, విద్య, వైద్యాలయాలు అన్నీ ఒక్కచోటునే మఠం వేశాయి. చదువుల కోసం, వైద్యం కోసం, ఉద్యోగాలు, ఉపాధిల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ రావడానికి అలవాటు పడిన వారికి ఇప్పుడు ఇబ్బందే. సీమాంధ్ర ప్రాంతం నూతన ప్రభుత్వ వ్యవస్థకు ఎదురయ్యే తొలి సవాలు ఇదే. అభివృద్ధి బంతి ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహించే వారి కోర్టులో ఉంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. మరో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. ఉన్న వ్యవధానం చాలా తక్కువ. ఐదేళ్ల పుణ్యకాలం ఇట్టే గడిచిపోతుంది. కాబట్టి లేనిపోని గిల్లికజ్జాలతో, ఆరోపణలు ప్రత్యారోపణలతో అనుదినం పొద్దుపుచ్చకుండా, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ, సత్వర కార్యాచరణకు నడుం కట్టాలి. మాటలు చెప్పి, గీతలు గీసి విభజించినంత సులభం కాదు, కొత్త రాష్ట్రాలను తీర్చిదిద్దడం. పెనుభారంతో కూడిన ఈ బాధ్యతను రెండు ప్రభుత్వాలు అత్యంత శ్రద్ధాసక్తులతో, నిష్టతో నిర్వహించ గలిగితేనే రెండు ప్రాంతాలకు ఫలితాలు సిద్ధిస్తాయి. లేకుంటే పాఠ్య పుస్తకాల్లో మ్యాపులుగా మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు మిగిలిపోతాయి. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు చెల్లింపులు బంద్
28లోగా పాస్ కాని ఉమ్మడి రాష్ట్ర బిల్లులు తెలంగాణ పీఏవోలో చెల్లింపు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చెల్లింపులన్నింటినీ సోమవారం సాయంత్రం నుంచి ఆర్థిక శాఖ నిలుపుదల చేసింది. అత్యంత అత్యవసరం మినహా ఎటువంటి సాధారణ బిల్లుల చెల్లింపులను చేయరు. ఆఖరికి అధికారులు, ఉద్యోగుల టీఏ, డీఏ బిల్లులతో సహా అన్ని రకాల బిల్లుల చెల్లింపులను నిలుపుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఖజానా, ఉప ఖజానా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. మే నెల 21వ తేదీ వరకు వచ్చిన బిల్లులన్నింటినీ ఖజానా కార్యాలయాలు సోమవారం సాయంత్రం వరకు చెల్లింపులను పూర్తి చేశాయి. ఈ నెల 28వ తేదీ నాటికి పాస్ కాని ఉమ్మడి రాష్ట్రంలోని బిల్లులను జూన్ నెలలో ఆడిట్ అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ పీఏవోలు ఆ బిల్లులను స్వీకరించడంతో పాటు చెల్లింపులను చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 నుంచి ఆర్థిక శాఖతో పాటు, ట్రెజరీ అండ్ అకౌంటెంట్ విభాగాలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ప్రస్తుతం నాంపల్లిలోని ఎం.జె. రోడ్డులో గల డెరైక్టర్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ కార్యాలయంలోనే ఈ విభాగాలు పని చేస్తాయి. నగరంలోని ఇన్సూరెన్స్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు పన్నులతో పాటు ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రెజరీ నుంచి నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కార్యకలాపాలను జూన్ 2వ తేదీ నుంచి గన్‌ఫౌండ్రీలో గల ఎస్బీఐ నిర్వహించనుంది. తెలంగాణ ట్రెజరీ కార్యకలాపాలను జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రపతి రోడ్‌లోని ఎస్బీహెచ్, ఉస్మాన్‌గంజ్‌లోని ఎస్బీఐ బ్రాంచ్‌లు నిర్వహిస్తాయి. ఆర్థిక శాఖ జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా వెబ్సైట్లను అమల్లోకి తేనుంది. అలాగే జూన్ 2వ తేదీ నుంచి ట్రెజరీ వెబ్సైట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా పనిచేస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి లీడ్ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లీడ్ బ్యాంకుగా ఆంధ్రా బ్యాంక్ వ్యవహరించనున్నాయి. -
ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి జీతం
సాక్షి, కాకినాడ : తెలంగాణ తో కూడిన ఆంధ్రప్రదేశ్‌తో సీమాంధ్ర ఉద్యోగులకు తొంబైతొమ్మిదీ పాయింటు తొమ్మిది తొమ్మిది శాతం రుణం తీరిపోయింది. 23 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మన జిల్లాలోని ఉద్యోగులు మే నెలకు సంబంధించి చిట్టచివరి జీతం అందుకున్నారు. ఈ నెల 24వ తేదీ ఆఖరి గడువు కావడంతో ఇంతవరకూ అందిన నివేదికల ఆధారంగా మొత్తం రూ.172 కోట్లు జిల్లాకు వచ్చింది. ఖజానా కార్యాలయంలో ఈ మేరకు జమ కావడంతో అంచెలంచెలుగా ఆయా ఉద్యోగుల ఖాతాల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా జీతాలు జమవుతాయి. వివరాల్లోకి వె ళితే జిల్లాలో పెన్షనర్లు 38 వేల మంది ఉండగా వారికి దాదాపు రూ.40 కోట్లు వచ్చాయి. అలాగే ప్రభుత్వోద్యోగులు అంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు వెరసి జిల్లాలో 56 వేల మంది వున్నారు. వీరికోసం ప్రత్యేకించి రూ.132 కోట్లు వ చ్చాయి. వెరసి రూ.172 కోట్లు వారివారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మొత్తం నడుస్తున్న మే నెలకు సంబంధించిన జీతం,పెన్షన్ల తాలూకు సొమ్ము కాగా ఇంకా ఏమైనా మిగిలివుంటే అవి కూడా ఇవ్వడానికి ఈ నెల 26 వ తేదీ గడువు పొడిగించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిప్రకారం ఇంక్రిమెంట్లు, పే రివిజన్ తాలూకు హెచ్చుతగ్గులు ఇతర బకాయిలేమైనా వుంటే అవీ వెరసి ఇవ్వాల్సిన బకాయిలు జూన్ 1వ తేదీకి సంబంధించిన ఒక్క రోజుకు చెందిన వేతనాలు, పింఛన్లు చెల్లించాల్సి ఉందన్నారు.ఇంకెంత రావాలో అంత మొత్తం చెల్లించేందుకు పై గడువు ఇచ్చినట్టు జిల్లా ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక సంఘాల(జేఏసీ)ప్రతినిధులు పితాని త్రినాథరావు, బూరిగ ఆశీర్వాదం ‘సాక్షి’ కి శనివారం రాత్రి తెలిపారు. హెల్తు అసిస్టెంట్లకు శుభవార్త ఇదిలావుండగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్టు హెల్తు అసిస్టెంట్ల బకాయి జీతాలు దాదాపు రూ.5 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినందుకు జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌గా పూర్వపు జిల్లా కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హెల్తు అసిస్టెంట్ల పోరాటం వృధా కాలేదని, వారి బాధలు పెద్ద మనసుతో అర్ధం చేసుకున్నారని ఉన్నతాధికారులను జేఏసీ తరపున ప్రత్యేకంగా కొనియాడుతూ శనివారం రాత్రి తీర్మానం చేశారు. -
ఖజానా కార్యాలయాలు కిటకిట
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘సమైక్య’ బొక్కసానికి త్వరలో గడువు ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే సమీపిస్తున్న నేపథ్యంలో ఆలోపు ఉమ్మడి రాష్ట్రం ఖాతా నుంచి ఇరుప్రాంతాలకు సంబంధించిన చెల్లింపులు వీలైనంత త్వరితగతిన పూర్తిచేయాలని సర్కారు భావించింది. దీంతో ఈ నెల 25వ తేదీ నాటికి ఉద్యోగుల జీతాలతో సహా అన్ని రకాల చెల్లింపులు చేపట్టేందుకు యంత్రాం గం చర్యలు వేగిరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 21లోగా అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు ఖజానా అధికారులకు చేరవేస్తే.. ఆ ప్రకారం చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తారని ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో బిల్లుల సమర్పణకు దిగిన అధికారులు గడువులోగా ప్రక్రియ పూర్తిచేశారు. బిల్లుల సమర్పణకు బుధవారం ఆఖరు తేదీ కావడంతో అధికారుల్లో హడావుడి మరింత పెరిగింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కార్యాలయ నిర్వహణ తదితర బిల్లులతో సహా.. తాజా బిల్లులన్నీ కట్టకట్టి ఖజానా అధికారులకు సమర్పించే పనిలోపడ్డారు. జిల్లా ఖజానా శాఖ పరిధిలో 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయి. అదేవిధంగా 9 ఉప ఖజానా శాఖల పరిధిలో మండల కార్యాలయాలతో పాటు మిగిలిన జిల్లా శాఖ కార్యాలయాలకు సంబంధించి చెల్లింపులు చేపడుతున్నారు. బుధవారం చివరిరోజు కావడంతో ఆయా కార్యాలయాలన్నీ బిల్లుల సమర్పణలతో కిటకిటలాడాయి. కొన్నిచోట్ల చిన్నపాటి తప్పిదాల కారణంగా బిల్లులు సమర్పించలేదు. ఉద్యోగులకు మే నెల వేతనాలు కూడా ఈ నెల 25లోపు రానున్నాయి. అంతేకాకుండా జూన్ నెల 2న అపాయింట్మెంట్ తేదీ ఉన్నందున ఒకటోతేదీకి సంబంధించిన వేతనం కూడా ఈలోపు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగులు నిధులు వెనక్కి.. అపాయింట్మెంట్ తేదీ నాటికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి(డీడీఓ)ల ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉండాలి. అయితే చెల్లింపుల ప్రక్రియ పూర్తయినప్పటికీ.. మిగులు నిధులుంటే వాటిని ఈ నెల 27తేదీ లోపు సంబంధిత ఉన్నతాధికారి కార్యాలయంలో జమ చేయాల్సి ఉంటుంది. దీంతో మిగులు లెక్కలు తేల్చడంలో డీడీఓలు బిజీ అయ్యారు. చిల్లిగవ్వైనా సరే మిగిలి ఉంటే వాటిని వెంటనే హెడ్ఆఫీస్ ఖాతాలో జమచేసి అందుకు సంబంధించిన రసీదులను సంంబధిత అధికారులకు చేరవేయాలని జిల్లా ఖజానా శాఖ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఉమ్మడి రాష్ట్రంలోనే కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు వి. సత్యమూర్తి హైదరాబాద్, ఉమ్మడి రాష్ర్టంలో చేసిన పనులకు రాష్ర్టం కలసి ఉన్న సమయంలోనే బిల్లులు చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు వి. సత్యమూర్తి కోరారు. విభజన నేపథ్యంలో ఆరు నెలలుగా తాము పూర్తి చేసిన ప్రభుత్వ పనులకు గానూ సుమారు రూ. 1500 కోట్లు రావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఈ బిల్లులను ఈ నెల 24లోపు చెల్లించే విధంగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సచ్చిదానందరెడ్డి, సోమ శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్ అండ్ బీలో రూ. 540 కోట్లు, ప్రాణహిత- చేవెళ్ల పనులకు గాను రూ. 500 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ నుంచి పూర్తి చేసిన పనులకు గాను రూ. 500 కోట్లు పలువురు కాంట్రాక్టర్లకు కావాల్సి ఉన్నా వాటిని మంజూరు చేయడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుపెట్టుకొని పూర్తయిన పనుల బిల్లులు పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి వచ్చినా చెల్లింపులు చేయడం లేదన్నారు. తమ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
విభజన కసరత్తు
నల్లగొండ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో విభజన కసరత్తు శరవేగంగా జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో లెక్కల విభజన ఈ నెల 24తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థ్ధిక బడ్జెట్ పరిధిలో ఉన్న చెల్లింపులన్నీ 24వ తేదీతో పూర్తికానున్నాయి. ప్రభుత్వ శాఖల పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఇతరత్రా అన్ని చెల్లింపులు అదే రోజు తెగదెంపులు కానున్నాయి. దీని కోసం అధికారులు లెక్కలు సిద్ధం చేయడంలో మునిగితేలుతున్నారు. చెల్లింపులకు సంబంధించిన ఏర్పాట్లను ట్రెజరీ శాఖలో అధికారులు పూర్తి చేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో వచ్చే నెల నుంచి బడ్జెట్ విధానం ప్రత్యేక రాష్ట్ర పరిధిలోకి రానున్నాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా విభజన లెక్కలు వేగవంతమయ్యాయి. మే 24 తర్వాత నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేటికవేనంటూ జిల్లా ట్రెజరీ శాఖకు ముందస్తు ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు నిర్ణీత సమయానికి వేతనాలు, పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు 24నే వేతనాలు అందించనున్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించనుండడంతో 24న తీసుకునే వేతనం ఆంధ్రప్రదేశ్‌లో చివరిది కానుంది. జిల్లాలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 29,462, పింఛన్‌దారులు 19,405 మంది ఉన్నారు. ప్రభుత్వ వేతనం కింద ఉద్యోగులకు నెలకు సుమారు రూ.300 కోట్లు, పెన్షనర్లకు రూ. 29.80 కోట్లు చెల్లించాలి. ఈ మేరకు జీఓ నెం. 86 విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఖాతా నుంచి తెలంగాణలోని ఉద్యోగులకు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందుకున్న ట్రెజరీ శాఖ ఉద్యో గుల జాబితా, బ్యాంకు ఖాతాలను సిద్ధం చేస్తోంది. జిల్లాలో పింఛన్‌దారులకు కూడా మే నెల చెల్లింపును ఈ నెల 24నే చేయనున్నారు. నిధులు సర్దుబాటయ్యేనా..! ప్రభుత్వ పథకాల అమలుకు వివిధ శాఖలకు ఖజానా శాఖ ద్వారా నిధులు విడుదలవుతాయి. ఉద్యోగుల జీతాల మాదిరిగానే నిధుల ఖర్చుకు కూడా ఈ నెల 24 తుది గడువుగా నిర్ణయించారు. ఆలోగా వెచ్చించిన మొత్తాన్ని అప్పజెప్పాలంటూ ఆదేశాలు వచ్చే సూచనలు ఉన్నాయని అ ధికారులు చెబుతున్నారు. ఎన్నికల హడావిడిలో ఉన్న అధికారులు నిధుల వినియోగం ఎలా..? అని తలలు పట్టుకుంటున్నారు. 13వ ఆర్థిక సంవత్సరం నిధులు గత ఆర్థిక సంవత్సరం చివరి మాసం అయిన ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు జిలా పంచాయితీ శాఖ బిల్లులు కూడా ట్రెజరీకి పంపింది. కానీ ఆర్థిక శాఖ నుంచి నిధులు రాకపోవడంతో బిల్లులు నిలిచిపోయాయి. ఈ నిధులకు సంబంధించి శనివారం జిల్లాకు రూ.19 కోట్లు వచ్చినట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. వీటిని రెండు, మూడు రోజుల్లోగా ట్రెజరీ నుంచి విడుదల చేయించి ఆ తర్వాత జిల్లా జనాభా, పంచాయతీ జనాభా ప్రాతిపదికన గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఫీజులు, ఉపకార వేతనాలు అందేనా..? ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇప్పటి వరకు పనులకు గ్రహణం ఏర్పడింది. 24వ తేదీ లోగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావాలి. అంతే వేగంగా అధికారులు వాటి చెల్లింపులు పూర్తి చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ప్రధా నం. ముందుగా విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేసిన తర్వాతే కాలేజీలకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫీజులు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ వారాంతంలోగా ఫీజుల బకాయిలు విడుదలయ్యే అవకాశం ఉందని సంక్షేమ శాఖల అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇంత స్వల్ప వ్యవధిలో భారీ మొత్తంలో నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ లేనిపోని కొర్రీలు పెడితే మాత్రం విద్యార్థులు ఇరకాటంలో పడతారు. -
జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రంలోనే రిటర్నులు
విశాఖపట్నం: అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) రిటర్నుల దాఖలు జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రం ప్రాతిపదికగానే జరగనున్నట్టు విశ్రాంత అదనపు ముఖ్య కార్యదర్శి, వాణిజ్య పన్నులకు సంబంధించి రాష్ట్రాల పునర్విభజన కమిటీ సలహాదారు అశుతోష్ మిశ్రా స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం చాంబర్ ఆఫ్ కామర్స్, ఫ్యాప్సీ, డీలర్లతో సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో వ్యాపారస్తులకు ఉత్పన్నమయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు. ఇప్పటికే అమల్లో ఉన్న అడ్వాన్స్ రూలింగ్స్ ఉభయ రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ దరఖాస్తుకు నెలాఖరు గడువు సమావేశంలో తొలుత కొత్త టిన్ నంబర్లు తీసుకునే ందుకు విధివిధానాలు, డీలర్ల హెల్ప్ డెస్క్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు నింపడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీలర్లకు అవగాహన కల్పించారు. హా ఆంధ్రప్రదేశ్/తెలంగాణా/రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ కొత్త టిన్ నంబర్ పొందవచ్చన్నారు. తమ చిరునామా, బ్యాంకు ఖాతా, పాన్ నంబర్ తదితర వివరాల్ని కూడా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువిచ్చారు. 1. ప్రస్తుతం 11 అంకెల టిన్ నంబర్లో రాష్ట్రాన్ని సూచించే రెండంకెలు 28 కాగా, కొత్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 37, తెలంగాణాకు 36 నెంబర్‌ను కేటాయించారు. 2.ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న డీలర్లకు మే 8 నాటికి టిన్ నెంబర్ జనరేట్ చేస్తారు. 3. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా జూన్ 2 తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు(ఆర్సీ) వారు పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా పంపించనున్నారు. 4.ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రంలోను, జూన్ 2 నుంచి కొత్త రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. హా కొత్త సి-ఫారాలు కూడా జూన్ 2 తర్వాతే అందిస్తారు. ఇప్పటికే తీసుకున్న పాత ఫారాలుంటే.. వాటిపై కొత్త టిన్ నెంబర్‌ను రబ్బరు స్టాంపు ద్వారా ముద్రించి వినియోగించుకోవచ్చన్నారు. -
మే జీతం ఆ నెల 24నే
25వ తేదీ నుంచి అన్ని రకాల చెల్లింపులు బంద్ మే నెలాఖరులోగా ఉమ్మడి రాష్ట్ర ఖాతాల ముగింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో మే నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపును మే 24వ తేదీనే చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా అయితే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ చెల్లింపులు ప్రతి నెల 1వ తేదీన చేస్తారు. అయితే జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం రెండుగా విడిపోతున్న నేపథ్యంలో మే నెలాఖరులోగా ఉమ్మడి రాష్ట్రం అకౌంట్లను మూసివేయూల్సి ఉంది. ఈ నేపథ్యంలో అకౌంటెంట్ జనరల్, ఆర్థిక శాఖ కలిసి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులను మే 24వ తేదీనే చేయాలని నిర్ణయించారు. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల బిల్లులను కూడా మే 24వ తేదీలోగా చెల్లించేయాలని నిర్ణయించారు. 24వ తేదీ తరువాత ఎటువంటి బిల్లులు పరిశీలనలో ఉండకూడదని, చెల్లింపులు చేయడమో లేదా తిరస్కరించడమో 24వ తేదీతో ముగిసిపోవాలని మెమోలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 25వ తేదీ నుంచి ఉమ్మడి రాష్ట్రం ఖజానా నుంచి ఎటువంటి చెల్లింపులను చేయరు. ఆ తేదీ నుంచి మే 31వ తేదీకల్లా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని రకాల అకౌంట్ల లావాదేవీలను సరిచూసి అకౌంటెంట్ జనరల్ ముగింపునిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే చెక్కులు కూడా మే 31వ తేదీలోగానే చెల్లుతాయని పేర్కొంటూ మరో మెమో జారీ చేశారు. మే నెలలో ముందుస్తు కేటాయింపులు లేకుండా అత్యవసర బిల్లులకు ఎటువంటి చెల్లింపులు చేయరాదని ఆర్థిక శాఖ పేర్కొంది. జూన్ 2వ తేదీ అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటవుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్, ఖజానా వేర్వేరుగా పనిచేయడం ప్రారంభమవుతాయి. -
తెల్లబోయిన ఎర్రజెండా
మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాలంలో 1951 ఎన్నికల్లో 12 నియోజకవర్గాలు ఉండేవి. నాలుగు ఇద్దరు ప్రతినిధుల నియోజకవర్గాలు ఉండేవి. ఒక సీటు జనరల్‌కు కేటాయించగా అదే నియోజకవర్గంలో రెండవ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించేవారు. జనరల్, రిజర్వు కేటగిరీల అభ్యర్థులు ఒకేసారి పోటీలో ఉంటారు. అందరిలో అత్యధికంగా ఓట్లు సంపాదించినవారు జనరల్ కేటగిరిలో విజేతలు అవుతారు. పోటీలో ఉన్న ఎస్సీ అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు గెలుచుకున్నవారు రిజర్వుడు స్థానం నుంచి గెలుపొందినట్టు ప్రకటిస్తారు. ఈ ప్రకారం జిల్లాలో 12 సీట్లలో 16 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం, కాకినాడ, అమలాపురం, రాజోలు ఇద్దరు అభ్యర్థుల నియోజకవర్గాలు. పిఠాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు విజయాలు సాధించారు. కాకినాడ, రాజమండ్రి, రాజోలు నియోజకవర్గాల్లో రిజర్వుడు అభ్యర్థులుగా కూడా కమ్యూనిస్టులే అసెంబ్లీకి వెళ్లారు. పిఠాపురం నుంచి ఆర్.వెంకట జగ్గారావు కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. రాజమండ్రి నుంచి చిట్టూరి ప్రభాకరచౌదరి కాంగ్రెస్‌కు చెందిన కె.ఎల్.నర్సింహారావుపై విజయం సాధించారు. కాకినాడ నుంచి చిత్తజల్లు వెంకట కృష్ణారావు కె.మోహన్‌రావుపై గెలుపొందారు. కాకినాడ రిజర్వుడు నియోజకవర్గం నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీకే చెందిన సాకా వెంకటరావు అసెంబ్లీకి వెళ్లారు. రాజోలు నుంచి అల్లూరి వెంకట కృష్ణారావు కిసాన్ మజ్దూర్ పార్టీ అభ్యర్థి ఆకుల బులిస్వామిపై గెలిచారు. రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు అసెంబ్లీకి వెళ్లారు. కమ్యూనిస్టుల విజయ పరంపర 1955 ఎన్నికల్లో కూడా కొనసాగింది. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం నుంచి జనరల్, రిజర్వుడు అభ్యర్థులుగా ఇద్దరూ కమ్యూనిస్టులే అసెంబ్లీ గుమ్మం తొక్కారు. ఈసారి రాజమండ్రి, కాకినాడ స్థానాలు కోల్పోయి, సామర్లకోట, పెద్దాపురం, రాజోలు స్థానాల నుంచి గెలుపొందారు. రాజోలు నుంచి రిజర్వుడు అభ్యర్థిగా కూడా కమ్యూనిస్టు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం నుంచి మహమ్మద్ తహసీల్ తన సమీప కమ్యూనిస్టు అభ్యర్థి శ్యామల సీతారామయ్యపై గెలుపొందారు. ద్వితీయ స్థానంలో ఉన్న సీతారామయ్య కూడా రిజర్వు అభ్యర్థిగా అసెంబ్లీకి వెళ్లారు. పెద్దాపురం నుంచి దూర్వాసుల వెంకట సుబ్బారావు తన సమీప అభ్యర్థి కృషీకార్ లోక్పార్టీకి చెందిన చల్లా అప్పారావుపై గెలుపొందారు. సామర్లకోట నుంచి పుత్సల వెంకటరావు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కృషీకార్ లోక్పార్టీకి చెందిన కాకరాల కామేశ్వరరావుపై గెలుపొందారు. రాజోలు నుంచి అల్లూరి వెంకటరామరాజు మరోసారి గెలి చారు. ప్రజాపార్టీకి చెందిన ఆకుల బాలాస్వామిపై గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు కూడా మరోసారి అసెంబ్లీకి వెళ్లారు. 1962 ఎన్నికల నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. 1967 ఎన్నికలతో వీరి శకం ముగిసింది. 1972లో సీపీఐ, సీపీఎంలు రాజమండ్రి, పెద్దాపురం, పిఠాపురం, సంపర, నగరం స్థానాల్లో పోటీచేసినా ఒక్కచోటా గెలువలేదు. అప్పటి నుంచీ మరే ఎన్నికల్లోనూ జిల్లా నుంచి కమ్యూనిస్టులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించలేకపోయారు. జిల్లా నుంచి 1962లో అనపర్తి నుంచి పాలచర్ల పరశురామన్న కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డిపై గెలుపొందారు. చిట్టూరి ప్రభాకరచౌదరి 1967లో మరోసారి రాజమండ్రి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రావుపై విజయం సాధించారు. పెద్దాపురం నుంచి ఉండవల్లి నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి కృష్ణమూర్తిపై విజయం సాధించారు. వీరిద్దరితో కమ్యూనిస్టుల జైత్రయాత్రకు జిల్లాలో తెర పడింది, నాటినుంచి కమ్యూనిస్టులను ప్రజా ఉద్యమకారులుగానే గుర్తించారు తప్ప ఓ రాజకీయ పార్టీగా పరిగణించి ఓట్లు వేయడం లేదు. కనీసం రెండు మూడు స్థానాలకు కూడా ఎగబాకలేని పరిస్థితికి చేరుకున్నారు.