మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాలంలో 1951 ఎన్నికల్లో 12 నియోజకవర్గాలు ఉండేవి. నాలుగు ఇద్దరు ప్రతినిధుల నియోజకవర్గాలు ఉండేవి. ఒక సీటు జనరల్‌కు కేటాయించగా అదే నియోజకవర్గంలో రెండవ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించేవారు. జనరల్, రిజర్వు కేటగిరీల అభ్యర్థులు ఒకేసారి పోటీలో ఉంటారు. అందరిలో అత్యధికంగా ఓట్లు సంపాదించినవారు జనరల్ కేటగిరిలో విజేతలు అవుతారు. పోటీలో ఉన్న ఎస్సీ అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు గెలుచుకున్నవారు రిజర్వుడు స్థానం నుంచి గెలుపొందినట్టు ప్రకటిస్తారు.
ఈ ప్రకారం జిల్లాలో 12 సీట్లలో 16 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం, కాకినాడ, అమలాపురం, రాజోలు ఇద్దరు అభ్యర్థుల నియోజకవర్గాలు. పిఠాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు విజయాలు సాధించారు. కాకినాడ, రాజమండ్రి, రాజోలు నియోజకవర్గాల్లో రిజర్వుడు అభ్యర్థులుగా కూడా కమ్యూనిస్టులే అసెంబ్లీకి వెళ్లారు.
పిఠాపురం నుంచి ఆర్.వెంకట జగ్గారావు కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.
రాజమండ్రి నుంచి చిట్టూరి ప్రభాకరచౌదరి కాంగ్రెస్‌కు చెందిన కె.ఎల్.నర్సింహారావుపై విజయం సాధించారు.
కాకినాడ నుంచి చిత్తజల్లు వెంకట కృష్ణారావు కె.మోహన్‌రావుపై గెలుపొందారు.
కాకినాడ రిజర్వుడు నియోజకవర్గం నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీకే చెందిన సాకా వెంకటరావు అసెంబ్లీకి వెళ్లారు.
రాజోలు నుంచి అల్లూరి వెంకట కృష్ణారావు కిసాన్ మజ్దూర్ పార్టీ అభ్యర్థి ఆకుల బులిస్వామిపై గెలిచారు. రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు అసెంబ్లీకి వెళ్లారు.
కమ్యూనిస్టుల విజయ పరంపర 1955 ఎన్నికల్లో కూడా కొనసాగింది. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం నుంచి జనరల్, రిజర్వుడు అభ్యర్థులుగా ఇద్దరూ కమ్యూనిస్టులే అసెంబ్లీ గుమ్మం తొక్కారు. ఈసారి రాజమండ్రి, కాకినాడ స్థానాలు కోల్పోయి, సామర్లకోట, పెద్దాపురం, రాజోలు స్థానాల నుంచి గెలుపొందారు. రాజోలు నుంచి రిజర్వుడు అభ్యర్థిగా కూడా కమ్యూనిస్టు ప్రాతినిధ్యం వహించారు.
భద్రాచలం నుంచి మహమ్మద్ తహసీల్ తన సమీప కమ్యూనిస్టు అభ్యర్థి శ్యామల సీతారామయ్యపై గెలుపొందారు. ద్వితీయ స్థానంలో ఉన్న సీతారామయ్య కూడా రిజర్వు అభ్యర్థిగా అసెంబ్లీకి వెళ్లారు.
పెద్దాపురం నుంచి దూర్వాసుల వెంకట సుబ్బారావు తన సమీప అభ్యర్థి కృషీకార్ లోక్‌పార్టీకి చెందిన చల్లా అప్పారావుపై గెలుపొందారు.
సామర్లకోట నుంచి పుత్సల వెంకటరావు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కృషీకార్ లోక్‌పార్టీకి చెందిన కాకరాల కామేశ్వరరావుపై గెలుపొందారు.
రాజోలు నుంచి అల్లూరి వెంకటరామరాజు మరోసారి గెలి చారు. ప్రజాపార్టీకి చెందిన ఆకుల బాలాస్వామిపై గెలుపొందారు.
ఇదే నియోజకవర్గం నుంచి రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు కూడా మరోసారి అసెంబ్లీకి వెళ్లారు.
1962 ఎన్నికల నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. 1967 ఎన్నికలతో వీరి శకం ముగిసింది. 1972లో సీపీఐ, సీపీఎంలు రాజమండ్రి, పెద్దాపురం, పిఠాపురం, సంపర, నగరం స్థానాల్లో పోటీచేసినా ఒక్కచోటా గెలువలేదు. అప్పటి నుంచీ మరే ఎన్నికల్లోనూ జిల్లా నుంచి కమ్యూనిస్టులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించలేకపోయారు.
జిల్లా నుంచి 1962లో అనపర్తి నుంచి పాలచర్ల పరశురామన్న కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డిపై గెలుపొందారు.
చిట్టూరి ప్రభాకరచౌదరి 1967లో మరోసారి రాజమండ్రి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రావుపై విజయం సాధించారు.
పెద్దాపురం నుంచి ఉండవల్లి నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి కృష్ణమూర్తిపై విజయం సాధించారు.
వీరిద్దరితో కమ్యూనిస్టుల జైత్రయాత్రకు జిల్లాలో తెర పడింది, నాటినుంచి కమ్యూనిస్టులను ప్రజా ఉద్యమకారులుగానే గుర్తించారు తప్ప ఓ రాజకీయ పార్టీగా పరిగణించి ఓట్లు వేయడం లేదు. కనీసం రెండు మూడు స్థానాలకు కూడా ఎగబాకలేని పరిస్థితికి చేరుకున్నారు.
తెల్లబోయిన ఎర్రజెండా
Published Sat, Mar 29 2014 12:30 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement
Advertisement