Madras
-
మద్రాసు @385
దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలలో చెన్నై ఒకటి. ఈ నగరం భిన్న సంస్కృతులకు ప్రతిబింబంగా నిలుస్తుంది. భారతీయతకు చిహ్నంగానూ ఈ నగరం పేరొందింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ‘మద్రాస్ డే’ నిర్వహిస్తుంటారు.తమిళనాడు రాజధాని మద్రాసును ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నారు. మద్రాసు ఏర్పడి నేటికి( 2024, ఆగస్టు 22) 385 ఏళ్లు పూర్తయ్యాయి. 1639 ఆగస్టు 22న తమిళనాడు రాజధాని మద్రాసుకి బ్రిటీష్ ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ పునాది రాయి వేసింది. అప్పట్లో దీనిని ‘మద్రాసు’ అని పిలిచేవారు. దాదాపు 70 లక్షల జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోనే 31వ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. అయితే చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నగరం రెండు వేల ఏళ్ల క్రితం నాటిది.రెండవ శతాబ్దంలో ఈ ప్రాంతం చోళ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. తోడై మండల ప్రావిన్స్‌లో మద్రాసు పట్టణం అనే చిన్న గ్రామం ఉండేది. 1639 ఆగస్టు 22న సెయింట్ ఫోర్ట్ జార్జ్ నిర్మాణంతో ఆధునిక మద్రాస్ ఉనికిలోకి వచ్చింది. దీని తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలను కూడా మద్రాసులో విలీనం చేసింది. 1639లో ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమాండల్ తీరంలోని చంద్రగిరిలో విజయనగర రాజు పెద వెంకట రాయల నుంచి కొంత భూమిని కొనుగోలు చేసింది. ఈ నేలపైనే ఆధునిక మద్రాసు పుట్టింది. ఇది వలస కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. నాటి రోజుల్లో బ్రిటీష్‌వారు మద్రాసు గ్రామాన్ని ఆ పక్కనే ఉన్న చెన్నపట్టణాన్ని కలిపి మద్రాసుగా పిలుస్తూ వచ్చారు. అయితే నాటి రోజుల్లో స్థానికులు మద్రాసును చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలిచేవారు. ఈ నేపధ్యంలోనే 1996 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం మద్రాసును అధికారికంగా ‘చెన్నై’గా మార్చింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 22న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ‘మద్రాస్ డే’ను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 1939లో మద్రాసు చరిత్రపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చరిత్రకారులు, ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. 2004 నుంచి ‘చెన్నై హెరిటేజ్ ఫౌండేషన్’ మద్రాసు దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేందుకే ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. -
NIRF rankings 2024: ఐఐటీ మద్రాస్ టాప్
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)–2024 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఓవరాల్‌తోపాటు ఇంజినీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ వరుసగా ఆరోసారి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌కు 8వ ర్యాంకు దక్కింది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరు వరుసగా 9వసారి మొదటి స్థానం సంపాదించుకుంది. అదేవిధంగా, ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం విడుదల చేశారు. ఓవరాల్ టాప్–10 జాబితాలో 8 ఐఐటీలతోపాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ చోటుసంపాదించాయి. యూనివర్సిటీల కేటగిరీలో టాప్–3లో బెంగళూరు ఐఐఎస్సీ, ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియాలున్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ తర్వాత ఐఐటీ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు ఆరు, విశాఖపట్టణంలోని ఆంధ్రా వర్సిటీకి ఏడో ర్యాంకు దక్కాయి.ఫార్మసీ విభాగంలో... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్)హైదరాబాద్ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ఈసారి మొదటి స్థానాన్ని జామియా హందర్డ్ దక్కించుకోగా బిట్స్ పిలానీ మూడో ర్యాంకు సాధించింది. లా యూనివర్సిటీల్లో నల్సార్ హైదరాబాద్‌కు మూడో ర్యాంకు దక్కింది. -
‘కొత్త నేర చట్టాలకు హిందీ పేర్లు రాజ్యాంగ విరుద్దం’
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లను పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జూలై ఒకటి నుంచి ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్. మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌ల డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. తూత్తుకుడికి చెందిన న్యాయవాది బి. రామ్‌కుమార్ ఆదిత్యన్ ఈ మూడు కొత్త చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య అధినియం-2023... ఈ మూడు చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని రామ్‌కుమార్ తన పిటిషన్లో కోరారు.దేశంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ తొమ్మిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే హిందీ అధికార భాషగా ఉందన్నారు. దేశంలో 43.63% జనాభాకు మాత్రమే హిందీ మాతృభాష అని, మిగిలిన వారు ఇతర భాషలు మాట్లాడుతుంటారని ఆయన ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, దేశంలోని మూడు ముఖ్యమైన క్రిమినల్ చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లు పెట్టడం సమంజసం కాదన్నారు. హిందీ రాని వారికి ఈ చట్టాల పేర్లు ఇబ్బందికరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. -
వైవిధ్యభరిత కథాంశంతో వస్తోన్న సరికొత్త థ్రిల్లర్ మూవీ..!
వైవిధ్యభరిత కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'వన్స్ అప్పాన్ ఏ టైమ్ మద్రాస్'. ఫ్రైడే ఫిలిం ఫాక్టరీ కెప్టెన్ ఆనంద్, బాలా, ట్రీమ్ హౌస్ హరున్, పీజీఎస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది హైపన్ లూప్ విధానంలో రూపొందుతున్న థ్రిల్లర్ కథా చిత్రమని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాలో భరత్, షాన్, రాజాజీ హీరోలుగా, విరుమాండి అభిరామి, అంజలి నాయర్, పవిత్రాలక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మానవ జీవితంలో సందర్భమే హీరో, విలన్ అని పేర్కొన్నారు. ఆయుధం ఎలాంటి పరిస్థితుల్లో మనిషి చేతికి వస్తుందన్న దాన్ని బట్టి.. ఆయుధాన్ని అతను మంచికి ఉపయోగిస్తాడా? లేదా చెడుకోసం వాడతాడా? అన్న దాన్ని బట్టే అతని జీవితం ఉంటుందన్నారు. అలా నలుగురి చేతికి అనూహ్యంగా ఒక తుపాకీ వస్తుందన్నారు. వేర్వేరు జీవన విధానంతో పయనించే ఆ నలుగురు వ్యక్తుల చేతుల్లో ఆ తుపాకీ ఎలా మారుతుంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం కథ సాగుతుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాలో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో కన్నిక, తలైవాసల్ విజయ్, అరుళ్ టి.శంకర్, పోర్కొడి, పీజీఎస్, కల్కి, సయద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కాళిదాస్, కన్నన్ ద్వయం ఛాయాగ్రహణం, నడునల్వాడై చిత్రం ఫేమ్ జోస్ ప్రాంక్లిన్ సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. -
ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ!
ప్రతీయేటా జూలై 15న స్వాతంత్ర్యసమరయోధుడు, రాజనీతిజ్ఞుడు కుమారస్వామి కామరాజ్ జయంతి వేడుకలు జరుగుతుంటాయి. కామరాజ్ రాజకీయ చతురతకు పేరుగాంచారు. జవహల్‌లాల్ నెహ్రూ మరణాంతరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా కామరాజ్ పార్టీకి సారధ్యం వహించారు. కామరాజ్ తనకు ప్రధానమంత్రికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నా ఆ అవకాశాన్ని లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీలకు కల్పించడంలో ప్రధాన భూమిక వహించారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి విశేష కృషి నాటి రోజుల్లో ఒక నేతగా, ముఖ్యమంత్రిగా కామరాజ్ మద్రాస్(ప్రస్తుతం తమిళనాడు)లో విశేష రీతిలో విద్య, వైద్యం అందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఆయన భారీగా పెట్టుబడులు కేటాయించారు. కామరాజ్ పరిపాలనా కాలంలో మద్రాస్ భారతదేశంలోనే అత్యధిక పారిశ్రామికీకరణ జరిగిన రాష్ట్రంగా పేరొందింది. ఇందుకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అందించిన భారీ సాయం దోహదపడింది. 1976లో కామరాజ్ భారత అత్యున్న పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నారు. కామరాజ్ జన్మదినాన తమిళనాడులోని అన్ని స్కూళ్లలో ‘ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డే’ని నిర్వహిస్తుంటారు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే.. కామరాజ్ నాడార్ (వెనుకబడిన కులం) కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య కూడా పూర్తి కాకుండానే తన 11 సంవత్సరాల వయస్సులో మదురై సమీపంలోని తన మామ కిరాణా దుకాణంలో పని చేశారు. ఈ సమయంలోనే అతనిలో రాజకీయాలపై, స్వాతంత్ర్య పోరాటంపై ఆసక్తి ఏర్పడింది. కామరాజ్‌ను నాటి జలియన్‌వాలాబాగ్ ఊచకోత అమితంగా కలచివేసింది. కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్‌గా చేరిన కామరాజ్ 1940లో పార్టీ మద్రాసురాష్ట్ర విభాగానికి అధిపతిగా ఎదిగారు. అతను 1954 వరకు ఈ పదవిలో కొనసాగారు. అనంతరం పార్టీ కామరాజ్‌ను మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన నాయకత్వంలోనే మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత బలం పుంజుకుంది. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. ఆరు వేల పాఠశాలలను తిరిగి తెరిపించి.. 1952లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది సి రాజగోపాలాచారి ఎంపికయ్యారు. అయితే 1954లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో రాజగోపాలాచారికి విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో అనుభవం ఉన్న నాయకుడి స్థానంలో యువ నాయకుడిని (కామరాజ్) నియమించాలని పార్టీ నిర్ణయించింది. ఆ పదవిని అధిష్టించిన కామరాజ్ తొలుత 1953లో రాజాజీ ప్రవేశపెట్టిన కుల ఆధారిత సవరించిన ప్రాథమిక విద్య పథకాన్ని రద్దు చేశారు. రాష్ట్రంలో మూతపడిన 6,000 పాఠశాలలను తిరిగి తెరిపించారు. తన పదవీకాలంలో 12,000 పాఠశాలలను నిర్మించారు. 11వ తరగతి వరకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారు. పార్టీకి కలసివచ్చిన కామరాజ్ ప్రణాళిక 1963లో నెహ్రూ అనారోగ్యంతో బాధపడుతున్న దశలో కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటిగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ‘నెహ్రూ తర్వాత ఎవరు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలోనూ మెదిలింది. అప్పుడే పార్టీని పునరుద్ధరించి, ప్రభుత్వాన్ని పటిష్టం చేసేందుకు కామరాజ్ ఒక ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వంలో ఉన్న నేతలు సంస్థాగత పనులు చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. 1963 ఆగస్టు 10న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానంలో కామరాజ్ ప్రణాళిక ఆమోదం పొందింది. శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ 1964 మే 27న నెహ్రూ మరణించారు. నెహ్రూ లాంటి వారు మరొకరు లభ్యం కారని భావించిన కామరాజ్ వివాద రహిత నేత లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టడంలో కీలకపాత్ర వహించారు. అనంతరం కామరాజ్ పార్టీని సమాఖ్య నాయకత్వ వ్యవస్థ వైపు నడిపించడానికి ప్రయత్నించారు. 1966లో శాస్త్రి కన్నుమూశారు. అనంతరం గుల్జారీలాల్ నందా కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు. నెహ్రూ, శాస్త్రిలను కోల్పోయిన క్లిష్ట సమయాలను కాంగ్రెస్ అధిగమించేందుకు కామరాజ్ విశేష కృషి చేశారు. అనంతరం శాస్త్రి వారసురాలిగా ఇందిరా గాంధీ ప్రధానిగా ఎన్నుకోవడంలో కామరాజ్ కీలక పాత్ర పోషించారు. 1966 జనవరి 24న ఇందిర ప్రధాని పదవిని అలంకరించారు. 72 ఏళ్ల వయసులో కన్నుమూత ఇందిరాగాంధీ పదవిలో ఉన్న సమయంలో ఆమె మద్దతుదారులకు, మరికొందరు పార్టీ నేతలకు మధ్య విబేధాలు పొడచూపాయి. ఇది చివరకు 1969లో పార్టీ చీలికకు దారితీసింది. పార్టీపై కామరాజు ప్రభావం తగ్గిపోయింది. 1967 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించింది. కామరాజ్ ఓటమి పాలయ్యారు. 1971లో ఇందిరను ఓడించాలని భావించిన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇందిరా కాంగ్రెస్ (రిక్విజిషన్) కాంగ్రెస్ (ఓ)ని ఘోరంగా ఓడించింది. కామరాజ్ 1975లో తన 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి.. -
విశాల్‌పై కేసును కొట్టివేసిన కోర్టు
కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వివాదంలో విశాల్‌కు నేడు స్వల్ప ఊరట లభించింది. తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని లైకా సంస్థ 2022లో మద్రాసు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ కేసుపై రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్‌ను గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అంత వరకు విశాల్ నిర్మించిన చిత్రాలను థియేటర్, ఓటీటీలలో విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!) తాజాగా కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని, తమకు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన రూ. 15 కోట్లును ఇవ్వకుండానే పలు సినిమాలను నిర్మించారని, కోర్టు ధిక్కార కేసును లైకా దాఖలు చేసింది. ఈ కేసు ఈరోజు జడ్జి ఎస్.సెలాందర్ ముందు విచారణకు వచ్చింది. తమ సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలను నిర్మించలేదని విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపి, తగిన ఆధారాలు చూపించారు. విశాల్ సినిమాలు నిర్మించినట్లు లైకా ప్రొడక్షన్స్ ఆధారాలు చూపించలేక పోయింది. దీంతో కేసును కోర్టు కొట్టి వేసింది. లైకా ప్రధాన కేసును జూన్ 26న విచారిస్తామని చెప్పి వాయిదా వేసింది. (ఇదీ చదవండి: ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను) -
విమర్శ హద్దు దాటితే వ్యవస్థకే ప్రమాదం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం, దానికి గ్రేడింగ్స్ ఇవ్వడం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని వ్యవస్థలపై నెలకొన్న అసహనానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు. ‘నా తరువాత అంతా నాశనమే’ అన్న తరహాలో కొందరు మాజీ జడ్జీల తీరు ఉందన్నారు. మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ‘కోవిడ్ కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ’ అంశంపై ఆదివారం ఆయన ఆన్లైన్ ప్రసంగం చేశారు. ‘గతంలో మన న్యాయవ్యవస్థలో భాగంగా ఉన్న కొందరిలో ఒక సమస్య ఉంది. నా తర్వాత∙అన్నీ తప్పులే జరుగుతున్నాయి అనే భావనలో వారున్నారు. ఆ భావనే ప్రమాదకరం. ఇప్పుడు మాట్లాడుతున్నవారే గతంలో చాలా తప్పులు చేశారు’ అని అన్నారు. కొంతమందికి ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఇష్టమన్నారు. హద్దులు దాటి ఆరోపణలు చేయడం ‘తప్పుడు సమాచార మహమ్మారి’ వంటిదన్నారు. విమర్శలు అవసరమే కానీ హద్దులు దాటకూడదని సూచించారు. ‘విమర్శలు హద్దులు దాటితే వ్యవస్థపై అనుమానాలు ఎక్కువవుతాయి. ఏ వ్యవస్థకయినా అది మంచిది కాదు. వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే వ్యవస్థే మనుగడలో లేకుండా పోతుంది. అప్పుడంతా అరాచకమే’ అని హెచ్చరించారు. సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న వలస కూలీల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడానికి ఒక రోజు ముందు సుమారు 20 మంది ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ రాశారు. వలస శ్రామికులపై కోర్టు చూపుతున్న నిర్లిప్తత సరికాదని వారు అందులో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఎప్పుడూ ప్రతికూల భావజాలాన్ని ప్రచారం చేసేవారు, ఇళ్లల్లో కూర్చుని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించే మేథావులు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. -
వైరస్ ఫ్రీ వస్త్రాలు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌పై పోరుకు ఐఐటీ మద్రాస్‌లోని మ్యూజ్ వేరబుల్స్ సంస్థ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. వస్త్రాలపై కరోనా వైరస్ అంటుకోకుండా చేసే నానోస్థాయి కోటింగ్ పదార్థాన్ని అ భివృద్ధి చేసింది. ఎన్95 మాస్కులు మొదలుకొని సర్జికల్ మాస్కు లు, వ్యక్తిగత రక్షణ కిట్లు.. ఆహారాన్ని పార్శిల్ చేసేందుకు వాడే బ్యాగుల్లాంటి వాటిపై ఈ కొత్త పదార్థపు పూతను పూస్తే ఆ ఉపరితలంపై పడ్డ వైరస్ వెంటనే నిర్వీర్యమైపోతుంది. ఈ నానో పూత ఉన్న వస్త్రా న్ని సుమారు అరవైసార్లు ఉతికినప్పటికీ దాని ప్రభావం ఏమాత్రం తగ్గదు. మ్యూజ్ వేరబుల్స్ అభివృద్ధి చేసిన యంత్రం కొన్ని నిమిషా ల వ్యవధిలోనే దాదాపు వంద మీటర్ల నిడివి గల వస్త్రంపై నానో పూ త పూయగలదు. అంటే.. ఈ యంత్రాన్ని వెంటనే వాణిజ్యస్థాయిలో వాడుకోవచ్చన్నమాట. కోవిడ్–19పై పోరును వేగవంతం చేసే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడి ఇన్క్యూబేషన్ సెల్లో ఏర్పాటైన సంస్థ మ్యూజ్ వేరబుల్స్. ఈ సెల్లో బోలెడన్ని స్టార్టప్ కంపెనీలు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వేర్వేరు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయని.. వీటిల్లో చౌకగా లభించే వెంటిలేటర్లు మొదలుకొని వైరస్ ఉనికిని నిర్ధారించే పరీక్షలు కూడా ఉన్నాయని ఐఐటీ మద్రాస్ ఇన్క్యూబేషన్ సెల్ సీఈవో డాక్టర్ తమస్వతి ఘోష్ తెలిపారు. ప్రస్తుతం మ్యూజ్ వేరబుల్స్ కోటింగ్ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని, వేర్వేరు వస్త్రాలపై వేర్వేరు నానో పదార్థపు పూతను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే వారం రోజుల్లోనే నానో పూత తో కూడిన వస్త్రాలు అందుబాటులోకి రానున్నాయి. మాస్కులు తయారు చేసే కంపెనీతో కలసి నానోపూత కలిగిన, ఐదు పొరల మాస్కును సిద్ధం చేస్తోంది ఈ కంపెనీ. ఒక్కో మాస్కు ఖరీదు దాదా పు రూ.300 వరకూ ఉండవచ్చని అంచనా. కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈ నానో పూత ఎంతో ఉపయోగపడుతుందని నానోపూత కలిగిన మాస్కును వాడితే వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువని మ్యూజ్ వేరబుల్స్ సీఈవో కేఎల్ఎన్ సాయి ప్రశాంత్ తెలిపారు. కరోనా వైరస్‌తోపాటు ముప్ఫై నానోమీటర్ల సైజున్న సూక్ష్మజీవులనూ ఈ కోటింగ్ నాశనం చేయగలదు. -
హలో చెన్నై.. హ్యాపీ బర్త్ డే
సాక్షి, చెన్నై : 379 ఏళ్ల క్రితం ఓ చిన్న కుగ్రామంలా ఏర్పడిన మద్రాస్ నేడు దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచింది. నాడు బ్రిటిష్ పాలకులు నాటిన మద్రాస్ మొక్క నేడు మహావృక్షమై విలసిల్లుతోంది. మద్రాస్ నగరం ఏర్పడి నేటికి 379 ఏళ్లు పూర్తయ్యాయి.. 1639 ఆగస్ట్ 22న నాటి బ్రిటిష్ అధికారి ప్రాన్సిస్ డే మద్రాస్ నగరాన్ని నిర్మించారు. ఆ తరువాత అదే నగరం బ్రిటిష్ వారికి దక్షిణ భారతంలో అతిపెద్ద వర్తక స్థావరంగా మారింది. దేశంలో 1608లో వర్తకం ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్‌లో సెయింట్ జార్జ్‌కోట ద్వారా అధికారికంగా పరిపాలన కొనసాగించింది. భారత దేశంలో బ్రిటిష్ వాళ్లు నిర్మించిన మొట్టమెదటి కట్టడం సెయింట్ జార్జ్కోటనే కావడం విశేషం. 1689లో దేశంలో తొలి మున్సిపాలిటీగా గుర్తింపుపొంది.. బ్రిటిష్ వర్తకానికి కీలక స్థావరంగా మారింది. చెన్నపట్నంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, మద్రాస్‌పట్నం, మద్రాస్‌గా మారి చివరికి చెన్నైగా పేరొందింది. బ్రిటిష్ పాలనలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర రాష్ట్రాలతో కలుపుకుని మద్రాస్ ప్రెసిడెన్సీగా గుర్తింపు పొందింది. దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తరువాత నాలుగు రాష్ట్రాలుగా విడిపోయి.. మద్రాస్ రాష్ట్రానికి రాజధానిగా మారింది. ఆ తరువాత మద్రాస్ పేరును 1969లో తమిళనాడుగా మార్చగా.. 1996లో రాజధాని పేరును చెన్నైగా మార్చారు. దేశంలో ద్రవిడ ఉద్యమానికి బీజాలు పడింది ఈ గడ్డపైనే. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకతలు మద్రాస్ సొంతం. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో ఎప్పుడూ వైవిద్యాన్ని చూపుతోంది మద్రాస్. దేశంలో ఆగ్రనాయకులుగా పేరొందిన పెరియార్ రామస్వామి నాయర్, సీ రాజగోపాల చారి, అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి ఈ గడ్డపైనే ఉద్యమ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఆగస్ట్ 22న చెన్నై వాసులు మద్రాస్ డేను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దేశ వ్యాప్తంగా మద్రాస్‌తో అనుబంధం ఉన్నవారు సోషల్ మీడియాలో ‘హ్యాపీ మద్రాస్ డే’ అంటూ శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. Happy #MadrasDay! It’s a city full of love, talent and vibrance! Glad to have spent many good memories and share a special bond with the people of #Madras! — Suresh Raina (@ImRaina) August 22, 2018 -
మైనర్ గ్యాంగ్‌రేప్ కేసులో అనూహ్య మలుపు
లక్నో, ఉత్తరప్రదేశ్: ఘాజీపూర్ మైనర్ బాలిక కిడ్నాప్, ఆత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడింది మైనర్ అని చెప్పడంతో తొలుత అతడిని జువెనైల్ (బాల నేరస్తుడు) అని నమ్మించే యత్నం జరిగింది. కానీ వైద్య పరీక్షల్లో వాస్తవం వెలుగుచూసింది. అతడు బాల నేరస్తుడు కాదని, నిందితుడి వయసు 20 ఏళ్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో కేసు అనూహ్య మలుపు తిరగనుంది. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని ఘాజీపూర్‌లో గత నెల (ఏప్రిల్) 21న స్థానిక మార్కెట్‌కు వెళ్తున్న 11 ఏళ్ల బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి, మదర్సాలో బంధించాడు. ఆ చిన్నారిపై డ్రగ్స్ ఇచ్చి కొందరు వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ యువకుడు ఆమెను ఆటోలో తీసుకెళ్లటం గుర్తించారు. అతని ఫోన్ కాల్ ఆధారంగా మదర్సాపై మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో మదర్సాలో ఉన్న యువకుడు, మౌల్వీని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అని చెప్పడంతో యువకుడిని జువెనైల్ హోమ్‌కు తరలించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించిన పోలీసులు.. చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులలో మౌల్వీ ఉండటంతో ఒక్కసారిగా మతం రంగు పులుముకుంది. కొందరు హిందువులు మౌల్వీ ఇంటిపై దాడులు చేస్తామని బెదిరించినట్లు అతడి భార్య గతంలో మీడియాకు తెలిపారు. ఓవైపు మతం రంగుతో పాటు మరోవైపు బాల నేరస్తుడు కావడం కేసు క్లిష్టంగా మారింది. కానీ తాజాగా వైద్య పరీక్షల్లో యువకుడి ఎముకల బలాన్ని చెక్ చేయగా, 20 ఏళ్ల యువకుడిగా గుర్తించడంతో కేసు అనూహ్య మలుపు తిరగనుంది. ఆ నిందితుడిని జువెనైల్ హోం నుంచి జైలుకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. -
మదర్సాలో అత్యాచారం.. మౌల్వీ అరెస్ట్
లక్నో: కథువా, సూరత్, ఉన్నావ్ ఘటనలు మరిచిపోక ముందే మరో అఘాయిత్యం చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల బాలికను మదర్సాలోకి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన యూపీని కుదిపేస్తోంది. ఈ ఘటనతో ఘజియాబాద్‌లో అలజడి చెలరేగగా.. ఆందోళనకారుల డిమాండ్‌తో మదర్సా మౌల్వీ.. గులామ్ షాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ కమిషనర్(క్రైమ్‌బ్రాంచ్)రామ్ గోపాల్ నాయక్ ధృవీకరించారు. అసలేం జరిగింది... ఏప్రిల్ 21న ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ యువకుడు ఆమెను ఆటోలో తీసుకెళ్లటం పోలీసులు గుర్తించారు. ఆ టీనేజర్ బాలిక కుటుంబానికి తెలిసిన వ్యక్తే. దీంతో అతని ఫోన్ కాల్ ఆధారంగా మదర్సాపై మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో టీనేజర్, మౌల్వీతోపాటు మరో ఇద్దరు అక్కడ ఉన్నారు. ఆ బాలికను చాపలో చుట్టి ఉంచారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించిన పోలీసులు.. ఆమె నుంచి వాంగ్మూలం సేకరించి టీనేజర్‌ను అరెస్ట్ చేశారు. మౌల్వీ అరెస్ట్‌కు డిమాండ్.. ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఒక్కసారిగా మతం రంగు పులుముకుంది. బుధవారం చిన్నగా మొదలైన ఆందోళనలు శుక్రవారం ఉదయానికి తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మౌల్వీని అరెస్ట్ చేయాలంటూ హిందూ అతివాద సంఘాలు ధర్నాలు చేపట్టాయి. హైవేలను దిగ్భందించి నిరసనలు తెలిపాయి. చివరకు బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ.. సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. పరిస్థితులు చేజారుతుండటంతో శుక్రవారం సాయంత్రం గులామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నా భర్త అమాయకుడు.. అయితే పోలీసులు మదర్సాపై దాడి చేసిన సమయంలో తన భర్త అక్కడ లేడని మౌల్వీ భార్య మీడియాకు చెబుతున్నారు. ఘటన వెలుగులోకి వచ్చాక కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ తమ ఇంటిపై దాడి చేశారని.. తన భర్తను తగలబెడతామని బెదిరించారని ఆమె తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంటిపై దాడి జరగ్గా.. సాయంత్రానికి పోలీసులు వచ్చి తన భర్తను అరెస్ట్ చేశారని ఆమె వివరించారు. మరోవైపు బాలిక వాంగ్మూలంపై పోలీసులు స్పష్టత ఇవ్వకపోవటంతో అనుమానాలు నెలకొన్నాయని మౌల్వీ భార్య చెబుతోంది. తన భర్త అమాయకుడని.. ఆయన్ని అనవసరంగా ఇరికించాలని చూస్తున్నారని ఆమె అంటోంది. -
ఉత్తరాఖండ్ మదర్సాల్లో సంస్కృత పాఠాలు
డెహ్రాడూన్: మదర్సాల్లో సంస్కృతంతోపాటు కంప్యూటర్ సైన్స్‌ను బోధించాలనే ప్రతిపాదనకు ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు (యూఎంఈబీ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మదర్సాల్లో గణితం, సైన్స్, ఆయుష్, సాంఘిక శాస్త్రాలను ఐచ్ఛికాంశాలుగా బోధిస్తున్నారు. దీంతోపాటు సంస్కృతం, కంప్యూటర్ సైన్స్‌లను ఐచ్ఛికాంశాలుగా బోధించాలనే అంశాన్ని బోర్డు ఉన్నత స్థాయి కమిటీకి నివేదిస్తామని యూఎంఈబీ డిప్యూటీ రిజిస్ట్రార్ అఖ్లాక్ అహ్మద్ తెలిపారు. అక్కడ ఓకే అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా మదర్సాల్లో అమలు చేయనున్నామన్నారు. సంస్కృతాన్ని మదర్సాల్లో బోధించాలంటూ ఉత్తరాఖండ్ మదర్సా సంక్షేమ సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
ప్రధాని మోదీ ఫొటో పెట్టం!
డెహ్రాడూన్ : ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డెహ్రాడూన్ మదర్సా కమిటీ తిరస్కరించింది. మతపరమైన కారణాలవల్ల మదర్సా ప్రాంగణంలో మోదీ ఫొటో పెట్టేది లేదని మదర్సా బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది. ముస్లిం విద్యాసంస్థలైన మదర్సాలు.. ప్రభుత్వ పర్యవేక్షణ, మార్గదర్శకంలో పనిచేయడం లేదని ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ (యూఎంఈబీ) తేల్చిచెప్పింది. మదర్సా ప్రాంగణంలో ఎటువంటి వ్యక్తుల ఫొటోలు, ఛాయాచిత్రపటాలను పెట్టేందుకు ఇస్లాం సంప్రదాయం అంగీకరించదని బోర్డు తెలిపింది. మత సంప్రదాయం ప్రకారం.. మోదీ ఫొటో సహా ఎవరి ఫొటోను మదర్సాలోకి అనుమతించమని బోర్డు పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు వల్ల విద్యావ్యవస్థకు కూడా మతం రంగు పులముకుంటుందని ఒక మదర్సా టీచర్ అన్నారు. ఇదిలావుండగా.. 2017 స్వతంత్ర దినోత్సం సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని మదర్సాల్లోనూ ప్రధాని ఫొటోను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
‘వారు బలి పశువులు కాదు’
సాక్షి, చెన్నై: ప్రభుత్వ వేడుకలు, ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలకు విద్యార్థులను తరలించడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వారు పశువులు కాదని, చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులన్న విషయాన్ని గుర్తించాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు మందలించారు. విద్యార్థులను ఈ విధమైన వేడుకలకు పంపిస్తే చర్యలు తప్పవని చెప్పింది. అంతేకాక పంపించేందుకు అనుమతి లేదని, దీనిపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు, దివంగత సీఎం ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఆదివారమైనా సరే విద్యార్థులు హాజరు కావాల్సిన పరిస్థితి. ఎక్కడైనా సీఎం పర్యటన ఉన్నా, మంత్రుల అధికారక కార్యక్రమాలు నిర్వహించినా, విద్యార్థులను పంపించి వారికి ఆహ్వానం పలికిస్తున్నారు. అంతేకాక రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టడం, ముందు వరసల్లో కూర్చోబెట్టడం వంటి చర్యలకు విద్యాశాఖ వర్గాలు పాల్పడుతున్నాయని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో సీఎం రాక ఆలస్యమైతే చాలు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పడం లేదు. ఈ వ్యవహారంపై తొలుత న్యాయవాది సూర్యప్రకాశం స్పందించారు. మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి కృపాకరణ్ ఇప్పిటికే ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈనేపథ్యంలో మార్పు ‘ఇండియా’ నినాదంతో ఆవిర్భవించి ఓ సంస్థకు చెందిన ప్రతినిధి నారాయణన్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, నేతల పనితీరు, ఎంజీఆర్ జయంతి వేడుకల్లో ఆదివారం, ఇతర సెలవు దినాల్లో సైతం విద్యార్థుల్ని తరలించటాన్ని ఆధారాలతో సహా వివరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తులు వైద్యనాథన్, ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో బెంచ్ బుధవారం విచారణకు స్వీకరించింది. వారు పశువులు కాదు: పిటిషన్‌లోని వివరాలు.. ఆధారాలను పరిశీలించిన బెంచ్ ప్రభుత్వానికి చురకలు అంటిస్తూ తీవ్రంగానే స్పందించింది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థుల్ని, పశువులుగా భావిస్తారా..? అని మండి పడ్డారు. ప్రభుత్వ వేడుకలకు విద్యార్థులను తరలించే సంస్కృతి ఏమిటంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ న్యాయవాది రాజగోపాలన్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ప్రభుత్వాన్ని వేనకేసుకు రావాల్సిన ఘనకార్యం ఇక్కడ లేదన్నారు. తమరి వాదనలు వినాల్సిన అవసరం లేదని న్యాయమూర్తులు స్పందించారు. విద్యార్థులను ఎలా ఆ కార్యక్రామాలకు పంపుతారని, అనుమతి ఎవరు ఇస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులను ప్రభుత్వ వేడుకలకు పంపితే తాము కఠినంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థులను పంపించేందుకు జారీ చేస్తున్న అనుమతులపై స్టే విధిస్తున్నామని పేర్కొన్నారు. ఇంతలో అదనపు అడ్వకేట్ జనరల్ మణిశంకర్ హాజరై వాదనల్ని వినిపించే యత్నం చేశారు. స్టేను రద్దు చేయాలని కోరారు. అయితే, ప్రభుత్వం తరపున వాదనల్ని వినే ప్రసక్తేలేదని వచ్చే వారానికి వాయిదా వేశారు. -
మదర్సాలకు నిధుల నిలిపివేత
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని 46 ఎయిడెడ్ మదర్సాలకు నిధులు నిలిపి వేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మదర్సాలు నిర్వహణలో ఆక్రమాలు చోటు చేసుకోవడం వల్లే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు గత రెండు నెలలుగా యూపీలోని మొత్తం 560 మదర్సాలను తనిఖీలు చేశారు. అందులో 46 మదర్సాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా మదర్సాలకు నిధులు నిలిపివేయడంపై ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి యోగీ ఆదినాత్యనాథ్పై విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఇతర మతాలను గౌరవించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. -
మదర్సాల్లో మువ్వన్నెల రెపరెపలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జాతీయజెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. భారత్‌ను అగ్రరాజ్యాల సరసన నిలుపాలన్న సంకల్పం తీసుకోవాలని, ఈ దిశగా ముందుకు సాగాలంటే ఉత్తరప్రదేశ్ మరింత అభివృద్ధిచెందాల్సి ఉందని ఆయన అన్నారు. ఇక ఈసారి యూపీలోని పలు మదర్సాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. లక్నోలోని ఫిరంగి మహాల్ మదర్సా, బరేలీలోని మరో మదర్సాలోనూ ముస్లిం మత పెద్దలు జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థులు పాల్గొన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనూ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. వీసీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా ఆగష్టు 15 వేడుకలను నిర్వహించాలని మదర్సా కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మదర్సాల్లో జెండా ఆవిష్కరణతోపాటు జాతీయ గేయం ఆలపించాలని సూచిస్తూ కమిటీ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. పంద్రాగష్టు సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించటంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మదర్సా శిక్ష పరిషత్‌ను కోరింది. అందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న మొత్తం 8వేల మదర్సాలన్నింటికి పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగష్టు 15న సరిగ్గా ఉదయం 8 గంటలకు రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జెండా ఆవిష్కరణ నిర్వహించి, జాతీయ గేయాన్ని ఆలపించాలని కోరింది. -
93 మదర్సాలకు ఉగ్రవాదులతో లింక్
కరాచీ: సింధ్ ప్రావిన్స్‌లో దాదాపు 93 మదర్సాలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉగ్రవాద సంస్థలతో, పాక్‌లో నిషేధించిన తీవ్ర భావజాలం ఉన్న సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఆ మదర్సాలన్నింటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి మురాద్ అలీ షా రక్షణ బలగాలకు ఆదేశించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు సింధ్ ప్రావిన్స్‌లోని పరిస్థితులపై సర్వే చేయగా అక్కడి కొన్ని మదర్సాలు ఉగ్రవాదానికి హబ్ లుగా మారాయని గుర్తించి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి మురాద్ కు వివరించాయి. దీంతో ఈ అంశంపై ప్రత్యేకంగా మంగళవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.దీనికి పాక్ రేంజర్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బిలాల్ అక్బర్, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. వీరంతా కలిసి మదర్సాలు చేస్తున్న చర్యలను తీవ్ర ఖండించారు. అలాంటి వాటిని ఏమాత్రం ప్రోత్సహించరాదని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని ఆ సమావేశంలో రక్షణ బలగాల అధికారులకు సీఎం ఆదేశించారు. త్వరలోనే అలాంటి మదర్సాలపై చర్యలు ప్రారంభం కానున్నాయి. -
హిందూ సంస్థలు పెట్టే భోజనం మాకొద్దు..!
ఉజ్జయినిః మదర్సాల్లో హిందూ సంస్థలనుంచీ వచ్చే మధ్యాహ్న భోజనాన్ని తిరస్కరిస్తున్నారన్న వార్త.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉజ్జయిని లోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న స్థానిక హిందూ సంస్థలు మదర్సాలకు కూడా అందిస్తుండగా... సుమారు 30 మదర్సాలల్లో ఇటీవల ఆ భోజనాన్ని తిప్పి కొడుతున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మదర్సాల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు. 2010 సంవత్సరం నుంచీ ఇస్కాన్ సంస్థ స్థానికంగా ఉన్న మొత్తం 315 స్కూళ్ళకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. అయితే ఇటీవల హిందూ సంస్థలనుంచీ వచ్చే భోజనాన్ని స్వీకరించవద్దని, వారు తమ నమ్మకాలను వమ్ము చేస్తున్నారని మదర్సా నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ నుంచి పిల్లలకు అందుతున్న మిడ్ డే మీల్ ను తిప్పికొట్టారు. ఇస్కాన్ నుంచి భోజనం స్కూళ్ళకు పంపే ముందు.. దేవుడికి నైవేద్యం పెడతారన్న అనుమానంతో ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు. జూలై 2016 లో ఇస్కాన్ టెండర్ ను సొంతం చేసుకున్న బీఆర్కే ఫుడ్స్, మా పార్వతి ఫుడ్స్ స్థానికంగా ఉన్న సుమారు 315 స్కూళ్ళకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుండగా.. తాజాగా 56 మదర్సాలు ఆ భోజనాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సప్లయర్స్ అందిస్తున్న భోజనాన్ని స్వీకరిస్తే.. మదర్సాలనుంచీ తమ పిల్లలను మానిపించేందుకు సైతం కొందరు తల్లిదండ్రులు సిద్ధమౌతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు మదర్సాల్లోని పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని వారికి అక్కడే వండి పెట్టాలని, ఇతర సంస్థలనుంచీ స్వీకరించవద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మిడ్ డే మీల్ నిరాకరణపై ప్రశ్నించగా.. మదర్సాల్లోని పిల్లలు ప్రత్యేక ఆహారాన్ని కోరుకుంటున్నారని, అందుకే ప్రస్తుతం అందుతున్న భోజనాన్ని నిరాకరిస్తున్నారని మదర్సా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మిడ్ డే మీల్ వివాదంపై పూర్తి విచారణ జరగాల్సి ఉంది. -
ఆ హైకోర్టులను ఇలా పిలవాలి..
న్యూఢిల్లీ: వలసవాద వాసనలను పూర్తిగా వదిలించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాంబే, కలకత్తా, మద్రాస్ హైకోర్టుల పేర్లను.. ముంబై, కోల్ కతా, చెన్నై హైకోర్టులుగా మార్చుతున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో హైకోర్టుల పేర్ల మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు చెప్పారు. బ్రిటిష్ పాలనలో ఈ మూడు మహానగరాలకు స్థిరపడ్డ పేర్లను మార్చేసి బాంబేను ముంబై, కలకత్తాను కోల్ కతా, మద్రాస్ ను చెన్నైగా మార్చుతూ గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నగరాలు పేర్లు మారినప్పటికీ హైకోర్టులకు మాత్రం పాత పేర్లే కొనసాగాయి. కోర్టుల పేర్లు కూడా మార్చాలని గతంలో పెద్ద ఎత్తున డిమాండ్ వెల్లువెత్తింది. దీనిపై సమగ్ర అధ్యయం అనంతరం రూపొందిన బిల్లు.. ఇటీవలే న్యాయశాఖ ఆమోదం పొందిందని, ఇప్పుడు కేబినెట్ కూడా ఓకే చెప్పిందని మంత్రి రవిశంకర్ తెలిపారు. భారతీయ హైకోర్టుల చట్టం (1861) ఆధారంగా కొత్త పేర్లు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
చనిపోయాడనుకుంటే కోర్టులో ప్రత్యక్షం..
- మద్రాసు హైకోర్టులో కలకలం - హత్య కేసు విచారణలో గందరగోళం సాక్షి, చెన్నై: హత్యకు గురైన వ్యక్తి బతికే ఉన్నానంటూ కోర్టుకు హాజరైన ఘటన మద్రాసు హైకోర్టులో గురువారం కలకలం రేపింది. పోలీసుల కేసు ప్రకారం...తమిళనాడు ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టిలో 2011లో కృష్ణన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి బాలు, రాము తదితర ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేశారు. కృష్ణన్ చనిపోయినట్లుగా పంచాయతీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీచేసింది. ఈ సర్టిఫికెట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఆ తరువాత గోవిందస్వామి అనే వ్యక్తి సైతం హత్యకు గురైనట్లుగా మరో డెత్ సర్టిఫికెట్‌ను పోలీసులు దాఖలు చేయడమేగాక, హత్యకు గురైన కృష్ణన్‌ను గోవిందస్వామి హత్యకేసులో సాక్షిగా చేర్చారు. కృష్ణన్ హత్యకేసులో నిందితులకు యావజ్జీవ శిక్షను విధిస్తూ ధర్మపురి సెషన్స్ కోర్టు జనవరిలో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని న్యాయమూర్తులు ఎం.జయచంద్రన్, ఎస్.నాగముత్తుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరపింది. నిందితుల తరపు న్యాయవాది రవిచంద్రన్ కోర్టుకు హాజరై, హత్యకు గురైనట్లుగా భావిస్తున్న కృష్ణన్ బతికే ఉన్నాడని, పోలీసులే ఈ కేసును తప్పుదోవ పట్టించారని వాదించారు. కృష్ణన్ బతికి ఉన్నట్లయితే కోర్టుకు హాజరుపర్చాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ కేసు గురువారం మళ్లీ విచారణకు రాగా కృష్ణన్ కోర్టుకు హాజరయ్యారు. అతన్ని జడ్జిలు విచారిస్తుండగా, ప్రభుత్వ న్యాయవాది మహారాజా మధ్యలో అడ్డుకుని అతను కృష్ణన్‌కాదు, గోవిందస్వామి, ఇతనిపై ఆంధ్రప్రదేశ్‌లో అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వాదించారు. కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అతని భార్య సైతం వాంగ్మూలం ఇచ్చిందన్నారు. కేసులోని మలుపులతో బిత్తరపోయిన న్యాయమూర్తులు, కోర్టుకు హాజరైన వ్యక్తి ఎవరు, హతులు ఎవరు, ఆత్మహత్య చేసుకున్నవారు ఎవరో తేల్చేందుకు ఐజీ లేదా డీఐజీ స్థాయి పోలీసు అధికారితో విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. -
పాక్ మదర్సాకు వెళ్లిన మహిళా ఉగ్రవాది
ముల్తాన్: కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడిన పాకిస్థానీ మహిళా ఉగ్రవాది తష్ఫీన్ మాలిక్.. గతంలో పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో గల ఓ మదర్సాకు వెళ్లి, అక్కడ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. మహిళలకు ఖురాన్ గురించి అవగాహన కల్పించే అల్- హుదా మదర్సాలో తష్ఫిన్ తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో తష్ఫిన్ కోర్సును పూర్తి చేయకుండా మధ్యలోనే మానేసినట్లు మదర్సా సిబ్బంది విచారణ అధికారులకు తెలిపారు. అల్- హుదా మదర్సా అమెరికాతో పాటు పలు దేశాల్లో శాఖలను నిర్వహిస్తుంది. అయితే ఈ సంస్థ తాలిబాన్ బావజాలాన్ని వ్యాప్తి చేస్తుందనే విమర్శలు ఉన్నా, ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు లేవు. తాజా సమాచారంతో సంస్థ కార్యకలాపాలను నిఘా అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. -
ఆమె ఫేస్ బుక్ పేజీ బ్లాక్
కోజికోడ్: మదర్సాలో లైంగిక వేధింపుల గురించి వెల్లడించిన కేరళ మహిళా జర్నలిస్ట్ వీపీ రజీనాపై సోషల్ మీడియాలో దూషణలు వెల్లువెత్తాయి. దీంతో తన ఫేస్ బుక్ పేజీని తాత్కాలికంగా బ్లాక్ చేశారు. హెడ్ లైన్స్ గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్న స్థానిక దినపత్రిక ఆమె జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. చిన్నతనంలో కోజికోడ్ మదర్సాలో చదువుకున్నప్పుడు తన సహవిద్యార్థులు లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ఉస్తాద్ లేదా టీచర్ బాలురు అందరినీ పిలిచి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు. రాత్రి తరగతుల్లో బాలికల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించేవాడని వెల్లడించారు. వేధింపులు తట్టుకోలేక చాలా మంది విద్యార్థినీ విద్యార్థులు మదర్సాకు రావడం మానుకున్నారన్నారు. దీంతో రజీనాకు వ్యతిరేకంగా, మద్దతుగా ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. అయితే విద్వేషపూరితమైన వ్యాఖ్యలకు తాను భయపడబోనని, చంపుతానని బెదిరించినా వెరవబోనని రజీనా స్పష్టం చేశారు. తాను చెప్పిందంతా వాస్తమని, అల్లా తన పక్షాన ఉన్నాడని పేర్కొన్నారు. 'పితృస్వామ్యాన్ని ఇస్లాం వ్యతిరేకిస్తుంది. కాని నేటికీ మహిళలు తమ అభిప్రాయలు వెల్లడిస్తే వారి లక్ష్యంగా చేసుకుంటున్నారు' అని రజీనా వాపోయారు. -
ద్రోణుడికి అర్జునుడు... నాకు మోహన్‌బాబు
‘స్వర్గం-నరకం’ @ 40 కొన్ని అంతే! మొదలైనప్పుడు మామూలుగా, అతి చిన్న ప్రయత్నాలుగా కనిపిస్తాయి. తీరా కొందరి జీవితాలనే మార్చేస్తాయి. ఇవాళ్టికి నలభై ఏళ్ళ క్రితం (1975 నవంబర్ 22న) రిలీజైన ‘స్వర్గం-నరకం’ అలాంటిదే! నటీ నటులంతా కొత్తవాళ్ళు... చిన్న బడ్జెట్... కలర్ సినిమాల క్రేజ్ ఊపేస్తున్న రోజుల్లో బ్లాక్ అండ్ వైట్... మద్రాస్ స్టూడియోలు దాటి బయటికొచ్చి, అంతా విజయవాడ ఇళ్ళలో షూటింగ్ ! అంచనాలేముంటాయి? కానీ, అంతకు రెండేళ్ళ పైచిలుకు క్రితం డెరైక్టరై, సక్సెస్‌ల మీద సక్సెస్లిస్తున్న డెరైక్టర్ దాసరి నారాయణరావు సరిగ్గా తన ఈ పదో సినిమాతో మొత్తం కథనే మలుపుతిప్పేశారు. రిలీజయ్యాక ప్రతిచోటా జనం మెప్పు... వసూళ్ళు... 6 కేంద్రాల్లో వంద రోజులు... ఆనక మరో 3 (హిందీ, తమిళ, మలయాళ) భాషల్లోకి రీమేక్... అవును. మొదలైనప్పుడు ‘స్వర్గం - నరకం’ చిరుజల్లు. రిలీజయ్యాక వెండితెర తుపాన్. నాలుగు దశాబ్దాల తర్వాత ఇవాళ ఒక తీపి జ్ఞాపకం. మోహన్‌బాబు సహా ఎందరో ప్రముఖ ఆర్టిస్టుల తొలి అభినయం రికార్డు చేసిన సినీచరిత్ర. మావూళ్లయ్య, పి.ఎస్. భాస్కర రావు నిర్మించిన ఈ చిత్రానికి ఇవాళ్టితో 40 ఏళ్ళు నిండాయి. నిర్మాతలతో సహా అందరికీ అభివాదం చేస్తూ దాసరి పంచుకొన్న జ్ఞాపకాల్లో కొన్ని... * అందరూ కొత్తవాళ్ళను పెట్టుకొని ‘స్వర్గం - నరకం’ తీయడానికి కారణం, ప్రేరణ - దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఆయనంటే నాకు అభిమానం. కొత్త వాళ్ళతో కలర్లో ఆయన ‘తేనెమనసులు’ తీస్తే, నేను ‘స్వర్గం-నరకం’ చేశా. అందుకే, దీన్ని ఆయనకే అంకితం చేశా. * సక్సెస్‌లలో ఉన్న నాతో సినిమాలు చేయడానికి హీరోలు రెడీగా ఉన్నా, కొత్తవాళ్ళతోనే చేయాలనుకున్నా. పత్రికల్లో ప్రకటనలు వేసి, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, కాకినాడల్లో రెండేసి రోజుల చొప్పున కొత్తవాళ్ళను టెస్ట్ చేసి, ఎంపిక చేశాం. * హైదరాబాద్‌లోని విశ్వేశ్వరరావును ‘ఈశ్వరరావు’గా, మద్రాసులోని భక్తవత్సలం నాయుడును ‘మోహన్‌బాబు’గా, విజయవాడ స్టేజ్ ఆర్టిస్ట్ ఉమను ‘అన్నపూర్ణ’గా తెరకు పరిచయం చేశా. మా స్క్రిప్ట్‌లో పాత్ర పేరు మోహన్. దానికి బాబు చేర్చి, ‘మోహన్‌బాబు’ చేశా. * నిజానికి, మోహన్ పాత్రకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి రికమండేషన్‌తో బోసుబాబు అనే కుర్రాడు వచ్చాడు. పైగా, అసోసియేట్లతో తగాదా వచ్చి మోహన్‌బాబుకు చేసిన స్క్రీన్టెస్ట్ను వాళ్ళు దాచేయడంతో, నేను చూడనే లేదు. మోహన్‌బాబు మా ఆవిడ పద్మ వద్దకు వెళ్ళి బాధపడ్డాడు. చివరకు రవిరాజా తదితరులు చెప్పడంతో, ఇద్దరిలో ఎవరు బాగా చేస్తే, వాళ్ళను సెట్స్‌లో ఫైనలైజ్ చేద్దామని బెజవాడ షూటింగ్ బస్సులో ఆఖరి నిమిషంలో బోస్బాబుతో పాటు మోహన్‌బాబును కూడా ఎక్కించాం. బోస్‌బాబు జ్వరంతో అడ్డం పడ్డాడు. మోహన్‌బాబే చివరకు ఖరారయ్యాడు. * తారలకు అందమైనబొమ్మలు తీసే ఫోటోగ్రాఫర్, అతను ప్రేమించి పెళ్ళాడిన ఆవిడ నిజజీవిత కథ నాకు తెలుసు. వృత్తిలోని అతని ప్రవర్తనను ఆమె అనుమానించింది. వాళ్ళ స్ఫూర్తితో ఈ స్క్రిప్ట్ అల్లా. * మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళేలోగా, కీ డైలాగ్స్‌తో స్క్రిప్ట్ చెప్పా. * నా దర్శకత్వంలో నేనే నటించడం మొదలుపెట్టిందీ ఈ చిత్రంతోనే. చివర్లో సందేశమిచ్చే ఆచారి పాత్రకు నా అసిస్టెంట్స్ రవిరాజా, రాజా చంద్ర, మా ఫ్రెండ్ రామచంద్రరావు, వైజాగ్‌లోని ఓ ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ల్ని ట్రై చేశా. కుదర్లేదు. చివరకు ఆ వేషం నేనే వేశా. * ఊళ్ళోని మా ఫ్రెండ్ మేనరిజమ్స్‌తో ఆచారి పాత్ర రాశా. ‘ఫినిష్’ అనే ఊత పదం పెడితే, అది జనంలో నానింది. * మా సినిమాకు ఒక్కరోజు ముందు హీరో కృష్ణ నటించిన ‘దేవుడు లాంటి మనిషి’ రిలీ జైంది. కన్నడ రాజ్ కుమార్ సూపర్‌హిట్ ‘బంగారద మనుష్య’కి రీమేక్. పైగా కలర్ సినిమా. ఆ పోటీలోనే మా సినిమా మంచి ఓపెనింగ్స్‌తో హిట్టయింది. * ‘విజయా’ నాగిరెడ్డి గారు నాతోనే ‘స్వర్గ్-నరక్’గా హిందీలో రీమేక్ చేశారు. అదే నా తొలి హిందీ సినిమా. దీన్ని తమిళంలో రాజేందర్, మలయాళంలో ఐ.వి. శశి రీమేక్ చేశారు. * ‘స్వర్గం-నరకం’ నుంచి మోహన్‌బాబుతో సాహచర్యం విడ దీయరానంత పెరిగింది. ద్రోణు డికి అర్జునుడి మీద ఎంత గురో, నాకు అతని మీద అంత గురి. * ఫిజిక్ డెవలప్ చేసి, డైలాగ్‌లో మాస్టర్‌గా, డిసిప్లిన్‌లో నంబర్1గా మోహన్‌బాబు ఎంతో ఎత్తు ఎదిగాడు. అతను వదిలేసిన ఎన్నో అవకాశాలతో చాలామంది హీరోలయ్యారు. ఏమైనా, ‘స్వర్గంనరకం’ ఓ తీపిగుర్తు. -
'అలాంటి వారికి అదే సరైన శిక్ష'
చెన్నై: నిందితులకు సరైన శిక్షలు అమలు చేయకపోవడమే బాలలపై పెరుగుతున్న అత్యాచారాలకు కారణమని తమిళనాడు హై కోర్టు అభిప్రాయపడింది. బాలలపై నేరాలకు పాల్పడుతున్న వారిని నపుంసకులుగా మార్చడమే దీనికి పరిష్కారంగా భావిస్తున్నట్లు, బాలల అత్యాచారం కేసులో పునపరిశీలనకు నమోదైన పిటీషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది. సాంప్రదాయంగా వస్తున్నటువంటి చట్టాలలో ఈ రకమైన నేరాలను నిరోధించే తరహాలో చర్యలు లేవని పేర్కొంది. నేరగాళ్లను నపుంసకులుగా మార్చడమనే చర్య కొంత అనాగరికంగా కన్పిస్తున్నప్పటికీ.. అనాగరికమైన చర్యలకు పాల్పడేవారికి ఇలాంటి శిక్షలు విధించక తప్పదని కోర్టు తెలిపింది. ఇప్పటికే పలు దేశాలలో ఈ తరహా నేరాలలో నిందితులను నపుంసకులుగా మార్చే శిక్షలు ఉన్నాయని, ఇండియాలో కూడా ఈ శిక్షను అమలు చేయాలని న్యాయమూర్తి జస్టీస్ ఎన్ కిరుబకరన్ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బాలలపై అత్యాచారాల కేసుల్లో ఉరిశిక్ష లేదా నపుంసకులుగా మార్చే శిక్షలు విధించేలా న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. గత వారం ఢిల్లీలో చిన్నారులపై దారణ సామూహిక అత్యాచారం ఘటన.. తీసుకోవసిన తక్షణ చర్యలను సూచిస్తుందని కోర్టు తెలిపింది. బాలలపై అత్యాచారాలకు పాల్పడిన వారకి పోలండ్, రష్యా, ఎస్తోనియాతో పాటు అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాలు అమలు నపుంసకులుగా మార్చే శిక్షను అమలు చేస్తుండగా, ఆసియాలో తొలిసారిగా దక్షిణ కొరియా ఈ తరహా శిక్షను అమలు చేస్తుంది. దేశంలో ఉన్నటువంటి కొందరు ఉదారవాదులు ఈ తరహా శిక్షలను వ్యతిరేకిస్తుండడాన్ని కోర్టు తప్పు పట్టింది. వారికి బాలలు ఎదుర్కునే సంఘర్షణలు తెలియని వారిగా కోర్టు అభిప్రాయపడింది. -
మదర్సాల్లో జాతీయ జెండాలు ఎగరేస్తున్నారా?
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మదర్సాలపై పలు వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో తాజాగా అలహాబాద్ హైకోర్టు మరో కీలక ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు 15, జనవరి 26న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు విద్యా సంస్థల్లోనూ జాతీయ జెండాను ఎగరవేయాలనే నిబంధన దృష్ట్యా.. రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగరవేశారనే విషయాన్ని నిర్ధారించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని విద్యా సంస్థల్లాగే మదర్సాల్లోనూ జాతీయ పండుగలప్పుడు జెండా ఎగరవేస్తున్నారా? ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇస్తున్నదా? అంటూ అలీగఢ్‌కు చెందిన అరుణ్ గౌర్ అనే వ్యక్తిని అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ యశ్వంత్ వర్మాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. మదర్సాలతోపాటు అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలు ఎగిరాయనే నిర్ధారణతోపాటు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. -
మదర్సాల ఎత్తివేతకు ప్రభుత్వ కుట్ర
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ భివండీ: మదర్సాలను ఎత్తివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దాన్ని అమలుచేయకుండా అడ్డుకుంటామని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. భివండీలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యంగంలో ప్రతి పౌరుడికి తమ ధర్మాన్ని అనుసరించి పాఠశాలలు స్థాపించుకునే అధికారం ఉందని పేర్కొన్నారు. బీజేపీ వైఖరిని ఎంఐఎం ఖండిస్తుందని, మదర్సాల ఎత్తివేత అమలుచేయకుండా అడ్డుకుంటామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం తన ఏడాది పాలనలో ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. భివండీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఒవైసీ చెప్పారు. అంతకు ముందు గాయత్రీనగర్‌లో ఎంఐఎం భివండీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న పాఠశాల స్థలాన్ని ఒవైసీ పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వారిస్ పఠాన్, భివండీ శాఖ పార్టీ పర్యవేక్షకుడు అతహర్ ఫారుఖీ, థానే జిల్లా అధ్యక్షుడు జుబేర్ షేక్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
శ్రీదేవీ రమణీయం
♦ సోల్ మేట్ బాపు-రమణల జంటలో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ జయంతి నేడు. రమణగారు చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డారు. పదో యేటే తండ్రిగారు గతించడంతో రమణగారి తల్లిగారు పిల్లలను తీసుకుని మద్రాసు వచ్చారు. అక్కడే రమణగారు ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు. చదువు అయిపోయాక మళ్లీ రాజమండ్రి వచ్చేశారు. కొన్నాళ్లు చిన్నాచితకా పనులు చేశారు. ఖాళీ సమయంలో ఇంగ్ల్లీషు పుస్తకాలు చదువుతుండేవారు. అది చూసి అక్కడి ఇంగ్లీషు దొరగారు రమణగారిని అభిమానించి ‘ఇక్కడ పని మానేసి వెళ్లి మంచి ఉద్యోగం చూసుకో’ అని పది రూపాయలు చేతిలో పెట్టి పంపించారట. ఆ పది రూపాయలు, ఒక జత బట్టలు తీసుకుని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రమణగారు మద్రాసు బయలుదేరారు. ఈ వివరాలన్నీ మనకు ఆయన ఆత్మకథలో దొరకుతాయి. అందులో లేని విషయాలు కొన్ని ఇప్పుడు ఆయన సతీమణి శ్రీదేవి మాటల్లో విందాం. సినిమాలలోకి రావడానికి ముందు రమణగారు ఏదో చిన్న పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశారు. అదేం దురదృష్టమో ఆ పత్రికను నెల్లాళ్లకే మూసేశారు. ఆ తరవాత ఆంధ్రపత్రికలో చేరారు. అక్కడ పనిచేయడం ప్రారంభించాక చాలా కథలు రాశారు. అయితే ఆంధ్రపత్రికలో కొంతకాలం పనిచేశాక రమణగారు ‘నేను ఒకరి కింద పనిచేయలేను’ అని పత్రిక నుంచి బయటకు వచ్చేశారు. ఉద్యోగం లేకపోయినా బతకగలను. జీతం కంటె విడిగానే ఎక్కువ సంపాదిస్తానని వారితో చెప్పి ఉద్యోగం మానేశారట. ఆయన అనుకున్నట్టుగానే డబ్బు కొద్దికొద్దిగా సంపాదించడం ప్రారంభించారు. మహానటులు గోవిందరాజుల సుబ్బారావు గారి దగ్గరకు చాలామంది వస్తుండేవారు. ఆయన హోమియో వైద్యులు. ఆయన తమ్ముడి కొడుకు శ్రీనివాసరావు గారే వెంకటరమణగారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పట్లో అజంతా గారు, విఏకె రంగారావుగారు, రావి కొండలరావు గారు వీరంతా స్నేహితులు. అందరూ కలిస్తే సరదాగా గడిపేవారట. ఆ తరవాత నెమ్మదిగా డబ్బింగ్ సినిమాలకి పనిచేశారు. తెలుగులో డూండీ గారి ‘రక్తసంబంధం’ మొట్టమొదటి సినిమా. అప్పటికే రమణగారు బాపుగారు అర్ధనారీశ్వరులయ్యారు. సినిమా కోసం ఏ కథ రాసినా ముందుగా బాపు గారితో చర్చించాక నాకు చెప్పేవారు. నాకు నచ్చితే బావుందని చెప్పేదాన్ని. లేకపోతే నా అభిప్రాయం నేను చెప్పేదాన్ని అంతే. గోదావరి ప్రాణాధారం రమణగారి సినిమాల్లో గోదావరి నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. రమణగారు బాల్యంలో ధవళేశ్వరం దగ్గర రాయవరంలో ఉండేవారు. అక్కడ లాంచీలు, పడవలు నడిపే వాళ్లు చాలామంది ఉండేవారు. రమణ గారి తల్లి వారందరికీ తలలో నాలుకలా ఉండేవారు. పడవ వాళ్లు దుంగలు అవీ తెచ్చి ఇస్తుంటే ఆవిడ అన్నం వండి, ఆవకాయ వేసి వాళ్లకి అన్నం పెట్టేవారు. వాళ్లు నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండటంతో రమణగారు నది ఒడ్డుకి వెళ్లి వాళ్లతోనే ఎక్కువగా ఆడుకునేవారు. ఆ పడవ వాళ్లకు రమణగారంటే చాలా ఇష్టం. వారు ఈయన్ని ఎత్తుకుని ఆడించేవారు. ఆ తరవాత మద్రాసు రావడం, మూగమనసులు చిత్రానికి ఆదుర్తి సుబ్బారావుగారితో పని చేయడం, ఆ కారణంగా గోదావరికి మళ్లీ రావడం జరిగింది. గోదావరిలో మొట్టమొదటి ఔట్‌డోర్ షూటింగ్ జరుపుకున్న చిత్రం మూగమనసులే. ఆ తరవాత చాలా సినిమాలు గోదావరిలో తీశారు. నాకు ఆయన చిత్రాలలో అందాల రాముడు అంటే చాలా ఇష్టం. ఆ సినిమా గోదావరి మీద తీసిందే. బాపూ జోడీ రమణ గారి గురించి మాట్లాడేటప్పుడు బాపు దంపతుల గురించి ప్రస్తావించకపోవడం సాధ్యం కాదు. మా జీవితంలో ఆ దంపతులు నిత్యం ఉంటారు. బాపుగారికి మా అన్నయ్య (నండూరి రామమోహనరావు) నా ఫొటో చూపిస్తే, ఆయన వెంటనే ‘మా రమణ ఉన్నాడుగా’ అన్నారట. అలా నన్నిచ్చి వివాహం చేయడానికి అంగీకరించేశారు. మా పెళ్లినాటికి నా వయసు 20, రమణగారి వయసు 32. నేను అంతవరకు ఇల్లు కదిలిందే లేదు. అటువంటిది అందరినీ వదిలేసి ఆ చిన్న పల్లెటూరు నుంచి మద్రాసు మహానగరానికి వచ్చాను. పెళ్లయిన మొదట్లో అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లేదాన్ని. ఆ తరవాత కొంత కాలానికి నేను ఇంటికి వెళ్లడమే తగ్గిపోయింది. బాపుగారి తల్లి సూర్యకాంతమ్మగారు... రమణగారిని, నన్ను సొంతమనుషుల్లా చూసుకున్నారు. మా అత్తగారు ఆదిలక్ష్మికి అందరి కంటె నేనంటేనే చాలా ఇష్టం. కోపం వస్తే మాట అనేసేవారు. అంతలోనే ప్రేమగా చూసేవారు. బంగారు భాగ్యవతి... బాపుగారి భార్య భాగ్యవతి నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించింది. ఆవిడ నా కంటె నాలుగేళ్లు పెద్ద. పెళ్లయి వచ్చిన కొత్తలో నాకు ఎలా మసలుకోవాలో తెలియక మా ఇద్దరి మధ్య మాటా మాటా వచ్చినా భాగ్యవతి పెద్ద మనసుతో సద్దుకుపోయేది. ఆ తరవాత నాకే తెలిసేది నేను చేసిన తప్పేంటో. ఏదైనా సరే భాగ్యవతి కరెక్ట్‌గా చేస్తుందని కొంతకాలానికి అర్థం చేసుకున్నాను. ఇద్దరికీ మాట వచ్చినా, ఇబ్బంది వచ్చినా... జరిగిన తప్పును ఒప్పుకోవడం వల్ల వచ్చే సుఖం నాకు తెలుసు. ధైర్యం ఎక్కువ చిత్రాలు నిర్మించినప్పుడు ఎంత ఆస్తి కరిగిపోయినా, వెంకటరమణగారు ధైర్యంగా ఉండటంతో నేను కూడా ధైర్యంగానే ఉన్నాను. బాపు గారి అండ వల్ల అంత ధైర్యంగా ఉండగలిగామేమో అనిపిస్తుంది. ఇల్లు అమ్మేసినప్పుడు ఎక్కడ ఉందామా అని ఆలోచిస్తుంటే, బాపు గారు ‘నాతో పాటే ఉండాలి’ అన్నారు. భాగ్యవతి అయితే మారు మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు భాగ్యవతి వల్లే వచ్చింది. ఇంతకంటె మించింది లేదు. ఆ విషయం గురించి ఎవ్వరూ ఒక్కమాట కూడా అడ్డు చెప్పలేదు. నా జీవితంలో నేను ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకునే విషయం ఇది. రమణగారి పుట్టినరోజు సందర్భంగా ఒకసారి అందరినీ స్మరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి బుడుగు... బాపుగారి మేనల్లుడు బాగా అల్లరి చేస్తుండేవాడు. ఇకనేం డెన్నిస్ ద మినేస్ పాత్రల ఆధారంగా బుడుగు పాత్ర పుట్టుకు వచ్చింది. రమణగారిని వాళ్ల నాన్నగారు వాళ్లు బుడుగు అని, మా పెద్ద ఆడపడుచుని బుల్లులు అని పిలిచేవారు. అలా ఆ పాత్ర పేరు నిలబడిపోయింది. మూత ఉండకూడదు... రమణ గారికి భోజనం చేసేటప్పుడు గిన్నె మీద మూత పెట్టకూడదు. అలా ఉంటే ఆయన అన్నం తినడానికి ఇష్టపడరు. మూత తీసి ఉంచి, కొద్ది కొద్దిగా వడ్డిస్తూ ఉంటే తింటారు. అప్పుడే తనకు తృప్తిగా భోజనం చేసినట్టు అనిపిస్తుందనేవారు. -
శ్రీశ్రీ జరిపిన పుస్తకావిష్కరణ
20-5-1980. అది మద్రాసు మహానగరం. టి.నగర్‌లోని జి.ఎన్.బెట్టీ రోడ్, మహాలక్ష్మీ క్లబ్. సాయంత్రం 6 గంటలు. సంకు గణపతిరావు అతిథులందరినీ వేదికపైకి ఆహ్వానించి, సుప్రసిద్ధ నటుడు కొంగర జగ్గయ్యకు మైకు అందించారు. ఆయన తన కంచుకంఠంతో సభను ఉద్దేశించి ఉపన్యసించారు. ఆ తరువాత శ్రీశ్రీ ‘మానవులం’ పుస్తకావిష్కరణ చేశారు. ఆ రోజులలో మినీ కవితలను యువకులు జోరుగా రాస్తున్నారు. ‘మానవులం’లో నేను రాసిన ఒక ఖండికను చదివారు. ‘నేను కవితా వామనుణ్ణి / నా మొదటి పాదం విశ్వనాథపైన నా రెండవ పాదం శ్రీశ్రీపైన / నా మూడవ పాదం ఆత్రేయమీద పెట్టాను అందుకే నేను ఎదగనివాణ్ణి / కవితా వామనుణ్ణి’. దీని గురించి శ్రీశ్రీ పదిహేను నిమిషాలకు పైగా వ్యాఖ్యానించారు. నాకున్న సంస్కృత పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు చాటిచెప్పారు. ఆయనకున్న సంస్కృత పరిజ్ఞానాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆనాటి సభకు నయగార కవి ఏల్చూరి సుబ్రహ్మణ్యం వారి శ్రీమతితో వచ్చారు. కొసరాజు, ముళ్లపూడి వెంకటరమణ, ఎమ్వీయల్, పి.బి.శ్రీనివాస్, కాకరాల, దేవిప్రియ కూడా సభకు విచ్చేసి, అందరూ తలో పది నిమిషాలకు పైగా మాట్లాడారు. ఎమ్వీయల్ మాట్లాడుతూ, ఇటువంటి రచనలు అలిశెట్టి ప్రభాకర్ రాస్తున్నాడని కొన్నింటిని ఉటంకించి సభకు వివరించారు. పి.బి.శ్రీనివాస్ ‘మానవులం’ మీద రాసిన సమీక్షను అందరికీ చదివి వినిపించారు. సభ రెండు గంటల్లో ముగుస్తుందని కొంగర జగ్గయ్య మలి ఉపన్యాసం చేశారు. పాత్రికేయుడు సంకు గణపతిరావు వందన సమర్పణ గావించారు. ఆ సభ విశేషమేమిటంటే శ్రీశ్రీ ఎన్నడూ లేని విధంగా పట్టు పీతాంబరాలలో వచ్చారు. సభ కిటకిటలాడింది. కె.ప్రభాకర్; ఫోన్: 9440136665 -
ఈసారి...విద్యాబాలన్
రజనీకాంత్ కొత్త సినిమాకు చకచకా సన్నాహాలు సాగిపోతున్నాయి. తాజా కబురేమిటంటే... ఆయన సరసన హీరోయిన్గా విద్యాబాలన్ ఎంపికయ్యారు. తమిళమూలాలున్న తల్లితండ్రులకు జన్మించిన ఈ ఉత్తరాదిభామ ఇలా తొలిసారిగా సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనువిందు చేయనున్నారు. తమిళంలో ఇటీవల ‘మద్రాస్’, ‘అట్ట కత్తి’ చిత్రాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత ‘కలైపులి’ ఎస్. థాను నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 1 నుంచి మలేసియాలో జరగనుంది. విశేషం ఏమిటంటే, రజనీకాంత్ సినిమా అనగానే ఎ.ఆర్. రెహమాన్ లాంటి సంగీత దర్శకులు, పి.సి. శ్రీరామ్ లాంటి సీనియర్ సాంకేతిక నిపుణులు పని చేస్తారని భావిస్తారు. కానీ, ఈ సారి రజనీ పూర్తిగా స్టైల్ మార్చేశారు. దర్శకుడు రంజిత్ వద్ద గత చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకుడు (సంతోష్ నారాయణన్), కెమేరామన్ (జి. మురళి) తదితరులనే ఈ సినిమాకూ కొనసాగించడానికి ఆయన ఒప్పుకున్నారు. మలేసియాలో 60 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుపుతారని భోగట్టా. ఆ తరువాత థాయిలాండ్, హాంగ్‌కాంగ్, చెన్నైలలో షూటింగ్ కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి, రజనీకాంత్‌తో సినిమా చేయాలన్నది నిర్మాత ‘కలైపులి’ ఎస్. థాను చిరకాల కోరిక. రజనీకాంత్ తొలిసారిగా సోలో హీరోగా నటించిన తమిళ చిత్రం ‘భైరవి’ని 1978లో పంపిణీ చేసింది - థానుయే! ‘సూపర్‌స్టార్’ అనే బిరుదును రజనీకాంత్ పేరు ముందు తగిలించింది కూడా ఆయనే. అప్పటి నుంచి ఎప్పటికైనా రజనీతో సినిమా చేయాలని థాను ఉవ్విళ్ళూరుతున్నారు. 37 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఆయన కల ఇన్నాళ్ళకు ఫలిస్తోంది. అందులోనూ ‘డర్టీపిక్చర్’, ‘కహానీ’ లాంటి సినిమాల ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టీనీ ఆకర్షించిన విద్యాబాలన్ హీరోయిన్గా నటించడం సంచలనవార్తే. మొన్న ‘కొచ్చాడయాన్’లో దీపికాపదుకొనే, నిన్న ‘లింగ’లో బాలీవుడ్ తార సోనాక్షీ సిన్హాతో స్టెప్పులేసిన రజనీ ఈసారి ఈ ‘పాలక్కాడ్ పొన్ను’తో అలరిస్తారన్న మాట. ఇంట్లో తమిళ, మలయాళాలను కలగలిపి మాట్లాడే విద్యాబాలన్‌కు కూడా ఇది కొత్త అనుభవం, సరికొత్త సంతోషం కదూ! -
'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు'
అలీగఢ్: మదరసాలపై ఓ ప్రొఫెసర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మదరసాల గురించి మాట్లాడుతూ 'అవి గే, స్వలింగ సంపర్కులకు నిలయాలు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం విద్యార్థులు బాగుపడాలంటే మదరసాలపై నిషేధం విధించాలని సూచించారు. యూనివర్సిటీలోని హిస్టరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వసీం రాజా తన వాట్సాప్ ద్వారా ఓ టీవీ ఛానల్‌కు ఈ సందేశాన్ని పంపించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులలో స్వలింగ సంపర్కులు ఉన్నారని, ఇతర మదరసాలలో కూడా ఇటువంటి వ్యవహారం నడుస్తోందంటూ ఆ ప్రొఫెసర్ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. . తాను సార్క్ దేశాల సదస్సులలో పాల్గొన్నానని, ఎప్పుడూ వర్గాలు, మతాల పునరుద్ధరణ అంశాలపై మాట్లాడుతుంటానని చెప్పారు. మదరసా అనేది మతానికి సంబంధించినది కాదని తన అభిప్రాయం అన్నారు. ఇక వాట్సాప్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా... ఆ సందేశాలు తాను పంపలేదని, తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని ప్రొఫెసర్ వసీం తెలిపారు. కాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఆ వీడియోపై విద్యార్థులు మండిపడుతున్నారు. వసీం రాజా వ్యాఖ్యలను యూనివర్సిటీ డైరెక్టర్ రషీద్ షాజ్ ఖండించారు. మదరసా విద్యార్థులు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంటారని అన్నారు. -
వర్ధమాన దర్శకుడితో రజనీకాంత్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాతి సినిమా ఏంటి? దీని మీద రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో తనకు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు శంకర్‌తో ఆయన ఒక మెగా బడ్జెట్ సినిమా చేయనున్నారని ఆ మధ్య వార్త వచ్చింది. అయితే, తాజా కబురేమిటంటే - ఆ సినిమా కన్నా ముందే ఈ సూపర్‌స్టార్ మరొక సినిమా చేయనున్నారట! ఇటీవల తమిళంలో బాగా పేరు తెచ్చుకున్న ‘మద్రాస్’, ‘అట్టా కత్తి’ చిత్రాల ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రూపొందనుందట. ఈ జూలై నెలాఖరు కల్లా ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని భోగట్టా. గత డిసెంబర్లో విడుదలైన ‘లింగ’ సూపర్‌ఫ్లాప్ అయిన తరువాత ఇప్పుడీ సినిమాతో రజనీకాంత్ తన పాత వైభవాన్ని చూపుతారా అన్నది ప్రశ్న. ఏమైనా, దేశవ్యాప్తంగా అసంఖ్యాకంగా అభిమానులున్న రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్, రంజిత్ లాంటి వర్ధమైన దర్శకుడితో సినిమా చేయనున్నారన్న వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. దర్శకుడు రంజిత్ ఈ వ్యవహారంపై ప్రకటన ఏమీ చేయలేదు కానీ, ఆయన తీసిన ‘మద్రాస్’ సినిమాపై రజనీకాంత్ గతంలో ప్రశంసల జల్లు కురిపించారు. ఆ విషయాన్ని అప్పట్లో రంజిత్ బాహాటంగా ట్విట్టర్లో ప్రకటించారు. కాబట్టి, వీళ్ళ కాంబినేషన్ ఖాయమే అన్నమాట! ఇది ఇలా ఉండగా, రంజిత్‌కు మార్గదర్శకుడైన దర్శకుడు వెంకట్ ప్రభు ‘యు మేడ్ మి రియల్ ప్రౌడ్ రంజిత్! వాట్ ఎ మూమెంట్! లవ్ యు డా!...’ అంటూ తాజాగా ట్వీట్ చేశారు. దీన్నిబట్టి, రజనీతో సినిమా ఖాయమైందనుకోవచ్చు. మరో ‘బాషా’? రంజిత్ తెరకెక్కించే కథ ఎలా ఉంటుందన్నది మరో ప్రశ్న. ‘మద్రాస్’ సినిమా లాగానే ఇందులోనూ రాజకీయ వాసనలుంటాయా అని ఒక చర్చ మొదలైంది. అయితే, ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన ‘బాషా’ తరువాత మళ్ళీ ఇందులో రజనీకాంత్ పూర్తిస్థాయి గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించే సూచనలున్నాయట! ఈ సారి తన వయసుకు తగ్గ పాత్ర చేయాలనీ, నటనకు బాగా అవకాశం ఉండే సహజమైన సినిమా చేయాలనీ రజనీ బలంగా అనుకుంటున్నారట! అందుకే, ఇతరులు చెప్పిన కథలన్నిటి కన్నా రంజిత్ చెప్పిన ఈ కథ ఆయనకు నచ్చిందట! ఇంకేం, జూలై ఆఖరులో సినిమా మొదలైతే, వీలుంటే ఈ ఏడాది చివరకల్లా మరోసారి రజనీని వెండితెరపై చూడవచ్చన్న మాట! -
ట్వీడ్ కోటు
ఆంధ్రా నాన్ - బ్రాహ్మిన్ స్టూడెంట్స్ హాస్టల్, మద్రాస్, డిసెంబర్, 1921 తెల్లని ప్లానెల్ ప్యాంటు, మోచేతుల పైకి మడిచిన లినెన్ షర్టు, సుద్దతో పాలిష్ చేసిన కాన్వాస్ బూట్లు, భుజం మీద లూజుగా తగిలించుకున్న ట్వీడ్కోటు, చేతిలో డన్లప్ రాకెట్‌తో ఈల వేస్తూ హాస్టల్ మెట్లు దిగాడు సారథి. వరండాలో పేముకుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ పేపరు తిరగేస్తున్న రమాపతిని చూస్తూనే ‘ఏం బ్రదర్! ఎన్నా సమాచారం?’ అని బల్ల మీదున్న ఆంధ్రప్రకాశిక, జస్టిస్, ద్రవిడియన్ల దొంతర లోంచి హిందూ పేపర్ బయటకి లాగి స్పోర్ట్స్ పేజీ తెరిచాడు. ‘ఏముందిరా! గాంధీజీ సహాయ నిరాకరణ పిలుపునిచ్చాక కాంగ్రెస్ ఆధ్వర్యంలో విదేశీవస్త్రాలు తగలబెట్టి ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలూ బహిష్కరించే కార్యక్రమం చేపడుతున్నాం. మన హాస్టల్లో కూడా ప్రదర్శన నిర్వహించబోతున్నాం’ అన్నాడు రమాపతి. అతడు యూనివర్సిటీలో ఎకనామిక్స్ హానర్స్ చేస్తున్నాడు. ‘నాన్సెన్స్.. హాయిగా మనవాళ్ల ప్రభుత్వముంటే నాన్ కోపరేషన్ దేనికోయ్? రాకరాక మనకీ బ్రాహ్మణ ఆధిపత్యం నుండి విముక్తి వస్తే ఇంకా కాంగ్రెస్సూ, గాంధీ అని వేలాడుతావ్? స్వాతంత్య్రమే వచ్చి కాంగ్రెస్ పాలనంటే మళ్లీ ఈ బ్రాహ్మణులని తెచ్చి నెత్తిన పెట్టుకోవడమే’ ‘జాతీయోద్యమాన్ని రాజకీయ పార్టీలతో ముడిపెట్టకు సారథీ... ఇది మన భారతీయుల మనుగడకి సంబంధించిన సమస్య. ప్రతి యేడూ మన సంపద ఎంత దేశం విడిచిపోతుందో నీకు తెలుసా? దేశం పూర్తిగా మట్టిగొట్టుకుపోయేలోగా ఈ తెల్లవాళ్లని బయటికి తోలకపోతే మనకే నష్టం. ఆ పని సాధించడానికి గాంధీజీ ఒక్కడే మనకి కనిపిస్తున్న ఆశాజ్యోతి’... ‘ఆహా! వందేళ్లుగా భూమిని నమ్ముకొని పండించినదంతా ఆ బ్రాహ్మణుల పరంజేస్తే, కనీసం మనకి ఓనమాలకి కూడా దిక్కులేదు. ఇప్పుడిప్పుడే ఇంగ్లిషు చదువుల పుణ్యమా అని కాస్త ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ ఇంగ్లిషోళ్లు ఉంటేనే మనవాళ్ల అభివృద్ధికి అవకాశం. ముందు మన యింటిని చక్కదిద్దుకొని తరువాత దేశాన్ని ఏలే పని చూస్తే మంచిది. నువ్వే చూడు ఈ మద్రాస్ రాష్ట్రంలో మన జనాభా 86 శాతం ఉంటే బ్రాహ్మణుల జనాభా 3 శాతం. కానీ మనవాళ్లు ముగ్గురు సబ్జడ్జీలయితే 15 మంది బ్రాహ్మలు. కనీసం సగం ఉద్యోగాలన్నా మనవాళ్లకి రావాలంటే మన జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఉంటేనే మంచిది’....ఎల్.ఎల్.బి ఫైనలియర్ కాగానే జ్యుడీషియల్ డిపార్ట్మెంట్లో జేరాలని సారథి ఉద్దేశ్యం. అది జస్టిస్ గవర్నమెంట్లో అయితే సానుకూలం అవుతుందని ఆశ. ‘నీతో వాదనెందుకు? దొరలా తయారయ్యావ్. ఆటకి టైం అయినట్లుంది బయలుదేరు. కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఏదో ఒకరోజు నీ అంతట నువ్వే ఆ ట్వీడ్కోటు వదిలి ఖద్దరు కడతావ్’ అని పేపర్లో తలదూర్చాడు రమాపతి. ‘అసంభవం. ఇలాంటి ఉద్యమాలన్నీ మూణ్ణాళ్ల ముచ్చట్లే. నీకే తెలిసొస్తుందిలే’ అంటూ సైకిలెక్కాడు సారథి. సిగరెట్ అంటించి హాస్టల్ మేడపై నుండి చోద్యం చూస్తున్నాడు సారథి. భరతఖండంబు చక్కని పాడియావు తెల్లవారను గడుసరి గొల్లవారు హిందువులు లేగదూడలై యేడ్చుచుండ పితుకుచున్నారు మూతులు బిగియగట్టి! మెగాఫోన్ పట్టుకొని రమాపతి శ్రావ్యంగా పాడుతుంటే చుట్టూ చేరిన విద్యార్థులంతా గొంతు కలిపారు. హాస్టల్ నుండి పాతికకి పైగ విద్యార్థులు ఖద్దరు బట్టలలో మూడురంగుల జెండాలతో ఊరేగింపుగా బయలుదేరారు. వందేమాతరం నినాదాలు మిన్నంటాయి. గేటు దాటి బయటకు అడుగుపెట్టారో లేదో పోలీసులు అడ్డువచ్చారు. వెంటనే ‘పోలీస్ గో బ్యాక్’ నినాదాలు మొదలయ్యాయి. ‘ఆగండి’ మెగాఫోన్‌లో అరిచాడు రమాపతి. ‘మమ్మల్ని ఎందుకు ఆపారో చెప్పగలరా?’ మర్యాదగా అడిగాడు. ‘పబ్లిక్ ప్రదర్శనకి అనుమతి లేదు. 144 సెక్షన్ ఉంది. శీగ్రం రూముకు పోండి’ అన్నాడు తమిళ పోలీస్ ఇన్స్పెక్టర్ లాఠీ ఝళిపిస్తూ. ‘శాంతియుతంగా చేసే ప్రదర్శన వల్ల ఎవరికీ ప్రమాదం లేదు. మేమెటువంటి న్యూసెన్స్ కలిగించడంలేదు. అందు వల్ల ఇది మీ సెక్షన్ పరిధిలోకి రాదు. ీప్లీజ్ తప్పుకోండి’ అని ఒకడుగు ముందుకేశాడు రమాపతి. ‘అడుగు ముందుకేస్తే కాళ్లు ఇరిగిడుస్తాయ్’ అంటూ లాఠీ ఎత్తాడు. ‘సరే. అలాగే కానివ్వండి’ అని ముందడుగేశాడు. ముంగాలి మీద పడిన లాఠీ దెబ్బకి అబ్బా అంటూ తూలిపడబోయాడు రమాపతి. ఆవేశంతో ముందుకి దూకిన విద్యార్థులని ఒక చేతితో వారిస్తూ ‘నాకేమైనా సరే ఆవేశపడొద్దు’ అని నచ్చచెప్పి ‘వందేమాతరం’ అంటూ మరో అడుగు ముందుకేశాడు. మరోదెబ్బ! కిందబడ్డా ‘మాకొద్దీ తెల్లదొరతనం’ అంటూ గరిమెళ్ల రాసిన గీతాన్ని పాడుతూ మళ్లీ లేచాడు. ఈసారి దెబ్బ తల మీద పడింది. నుదుటి మీద కారే నెత్తురుతో పడిపోయిన రమాపతి చేతిలోని మెగాఫోన్ అందుకొని, మేలుకోవోయ్ భరత్పుత్రా మేలుకోవోయ్ చిరచరిత్రా పిలుచుచున్నది వీరభారతి అని పాడుతూ మరో యువకుడు ముందుకొచ్చాడు. మళ్లీ లాఠీ ప్రహారాలు. కిందపడిన వాడి స్థానంలో మరొకడు. కానీ పాట మాత్రం ఆగలేదు. తోటి స్నేహితులపైన దౌర్జన్యాన్ని చూస్తూ ఉండలేక పరిగెత్తుకు వచ్చాడు సారథి. స్పృహ కోల్పోయిన రమాపతిని చేతుల్లోకి ఎత్తుకుని అలాగే మోసుకుంటూ ట్వీడ్కోటు నెత్తురులో తడుస్తున్నా లెక్కచేయకుండా ‘దిసీజ్ ఇన్టాలరబుల్’ అని అరుస్తూ పోలీసుల వంక నడిచాడు. అప్పటికే గుమికూడిన వార్తాపత్రికల ఫొటోగ్రాఫర్లు ఆరడుగుల ఎత్తూ, టెన్నిస్ ఆటవల్ల కండలు తిరిగిన శరీరంతో, రక్తమోడుతున్న స్నేహితుడిని ఎత్తుకొని వచ్చే యువకుడి ఛాయాచిత్రం తమ కెమెరాలలో బంధించేందుకు పోటీపడ్డారు. హాస్టల్ నుండి ఎగ్మోర్ ఆసుపత్రి రెండు మైళ్లు. ‘గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏ సెక్షన్ కింద అనుమతి కావాలో తెలుసుకొని రండి’ ఇంగ్లిష్‌లో దబాయిస్తూ పోలీసులని పక్కకి తోస్తూ ‘మిత్రులారా నా వెనకనే రండి’ అంటూ ముందుకి సాగాడు. అంత వరకూ చోద్యం చూస్తున్న విద్యార్థులూ చుట్టుపక్కల పౌరులూ అతనితో కలిశారు. రెండు మైళ్లు సాగిన ఆ నిరసన ఎగ్మోర్ చేరుకునేసరికి వెయ్యిమందికి పైగా పౌరులున్న ప్రభంజనంగా మారింది. గంట తర్వాత తలకి కట్టుతో ఊతకర్రతో ఆస్పత్రి బయటకి వచ్చిన రమాపతిని గాఢంగా కౌగిలించుకొని ‘నువ్వు చెప్పిందే రైటోయ్. పద నా ట్వీడ్కోటు తగలబెట్టేందుకు అవకాశం ఇస్తాను’ అంటూ పదడుగుల ఎత్తున మండుతున్న విదేశీ వస్త్రాల గుట్టపై తన ట్వీడ్కోటుని విసిరేశాడు సారథి. రమాపతి మెచ్చుకోలుగా నవ్వాడు. ‘నీ పుణ్యమా అని ఈసారి పండుగకి వెళ్లే మనవాళ్లకి లగేజీ బాధలేదోయ్ రమాపతీ’ అని తనూ నవ్వాడు సారథి. - సాయి పాపినేని ఫోన్: +91 98450 34442 -
బీఎంటీసీ బస్సులో మంటలు
బెంగళూరు(బనశంకరి) : మూడ్రోజలు క్రితం పాత మద్రాస్ రోడ్డులో బీఎంటీసీ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన మరువక ముందే గురువారం మరో ఘటన చోటు చేసుకుంది. లగ్గెరీ ఫ్లై ఓవర్‌పై వెళుతున్న బీఎంటీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి, కాలిపోయింది. కెంగేరి నుంచి యశ్వంతపురకు వెళుతున్న బీఎంటీసీ బస్సు ఉదయం 11 గంటలకు లగ్గెరీ ఫ్లై ఓవర్‌పైకి చేరుకుంది. ఆ సమయంలో బస్సు ఇంజన్లో నిప్పు రాజుకుంది. మంటలు గుర్తించిన వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపి ప్రయాణికులను కిందకు దిగాలని సూచించాడు. ప్రయాణికులు కిందకు దిగుతుండగానే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటలు చుట్టుముట్టక ముందే ప్రయాణికులు కిందకు దిగారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఘటనపై రాజగోపాల నగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మళ్లీ గ్రామానికి పోయిన కార్తీ
తొలి చిత్రం పరుత్తివీరన్‌లో కార్తీ పక్కా పల్లెవాసిగా జీవించారు. ఆ తరువాత ఆయన నగర నేపథ్య కథా చిత్రాలపై మొగ్గుచూపుతూ వచ్చారు. ఇటీవల విడుదలైన మెడ్రాస్ చిత్రంలో కూడా ఉత్తర చెన్నై యువకుడిగా ఆ పాత్రలో లీనమై నటించి ఆ చిత్రాన్ని విజయతీరాలకు చేర్చారు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం కొంబన్. ఈ చిత్రం కోసం కార్తీ మరోసారి గ్రామీణ యువకుడిగా మారిపోయారు. కొంబన్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. చిత్ర వివరాలను హీరో కార్తీ తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. అదేమిటో ఆయన మాటల్లోనే... కొంబన్ చిత్రకథను దర్శకుడు ముత్తయ్య పూర్తిగా నన్ను మనసులో పెట్టుకునే రాశారు. కుట్టి పులి చిత్రం తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం కొంబన్. అమ్మ పెంపకంలో పెరిగిన అబ్బారుుకి మామ సంరక్షణలో పెరిగిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. ఆ కుటుంబం మధ్య ప్రేమానుబంధాలు ఉండవు. ఊరు విషయాలే చిత్ర కథ. గొర్రెల వ్యాపారి కొంబయ్య పాండియన్ అనే నాకు తల్లి ఎంత ముఖ్యమో నా ఊరు శ్రేయస్సు అంతేముఖ్యం. ఊరులో జరిగే విశేషాలకైనా పంచాయతీలకైనా ముందుడేది నేనే. ఊరికొక్కడు, ఊరి కోసం ఒక్కడు లాంటి కథ కొంభన్. ఇది మదురై, రామనాథపురం ప్రాంతాల మధ్య జరిగే కథ. దర్శకుడు కథ చెప్పినప్పుడే ఆ జిల్లాల మధ్య సంస్కృతి, సంప్రదాయాల విషయంలో అంత వ్యత్యాసం ఉంటుందా? అని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చెన్నైలో ఉండి చూస్తే దక్షిణ తమిళనాడు అంతా మదురై మాదిరే తెలుస్తుంది. కొంబన్ చిత్రంలో సులక్షణ పాత్ర పోషిస్తున్నాను. ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు చోటు చేసుకోవు. గ్రామం, కుటుంబం, అనుబంధాలు ఇవే చిత్రంలో కనిపిస్తాయి. కొంచెం పగ, ప్రతీకారాలు ఉంటాయి. ముఖ్యంగా మామ, అల్లుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రం కొంబన్. హీరోయిన్గా లక్ష్మీమీనన్‌కు మినహా వేరెవరూ నటించినా ఈ చిత్రంలో పాత్ర అం తగా పండదు. అంతగా ఆమె ఆ పాత్రలో ఒదిగి పోయి నటిస్తున్నారు. మామగా రాజ్‌కిరణ్, అమ్మగా కోవై సరళ నటిస్తున్నార ని కార్తీ కొంబన్ వివరాలు వెల్లడించారు. -
వరుస ఫ్లాపుల తర్వాత కాస్త ఊరట
వరుసపెట్టి ఫ్లాపులు దండెత్తిన చాలా కాలం తర్వాత ఓ సినిమా మంచి హిట్ కావడంతో తమిళ హీరో కార్తీ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అతడు తాజాగా నటించిన తమిళ చిత్రం 'మద్రాస్'ను ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకులు కూడా మెచ్చుకుంటున్నారు. దాంతో ఇన్నాళ్లకు కార్తీ కొంచెం ఊరటగా కనిపిస్తున్నాడు. తాను ప్రతిసారీ మంచి సినిమాలే చేయాలనుకుంటాను గానీ, కొన్ని సార్లు అవి ఎందుకు ఫెయిలవుతాయో తెలియదన్నాడు. మద్రాస్ చిత్రం విడుదలైనప్పటి నుంచి తనకు అన్ని వర్గాల వాళ్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఈ సినిమాను విజయవంతం చేసినందుకు ముందుగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నాడు. రజనీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన కేథరిన్ త్రెసా నటించింది. వాస్తవానికి కేథరిన్ తెలుగులో చాలా సినిమాల్లో చేసినా ఇక్కడ మాత్రం ఆమెకు సరైన హిట్ ఒక్కటి కూడా రాలేదు. రెండు మైనస్‌లు కలిస్తే ఒక ప్లస్ అయినట్లు.. వరుస ఫ్లాపులతో బాధపడుతున్న కార్తీ, కేథరిన్ కలిసి నటించేసరికి అది కాస్తా మంచి హిట్ అయ్యింది. -
26న తెరపైకి మెడ్రాస్
ఎట్టకేలకు మెడ్రాస్ చిత్రం విడుదలకు తేదీ ఖరారైంది. కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం మెడ్రాస్. ఆయనకు జంటగా క్యాథరిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి అట్టకత్తి ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసింది. చిత్ర టైటిల్‌పై తమిళ భాషా పరిరక్షక సంఘాలు తమిళ భాషాభిమానులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడ్రాస్ను చెన్నై నగరంగా మార్చిన చాలా ఏళ్ల తరువాత మళ్లీ పాత మెడ్రాస్ను గుర్తు చేసే ఈ చిత్రం టైటిల్‌ను పెట్టడం మంచిది కాదంటూ ఘోషిస్తున్నారు. ఏదైమైనా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఓకే చెప్పింది. ఇటీవల మెడ్రాస్ చిత్రాన్ని తిలకించిన సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్‌గా ఉంటుందని యూనిట్ వర్గాలంటున్నారుు. మరో విషయం ఏమిటంటే ఈ మధ్య కార్తీ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మెడ్రాస్ చిత్రం విజయం సాధించడం కార్తీకి చాలా అవసరం. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకు ముస్తాబవుతోంది. -
ప్రవేశాలు
ఐఐటీ మద్రాస్‌లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) డిప్లొమా అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఫిట్టర్, షీట్‌మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, మెకానిక్ (మెషిన్ టూల్ మెయింటనెన్స్, డీజిల్, మోటార్ వెహికల్), ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. అర్హతలు: మెకానికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: www.iitm.ac.in అంకాలజీలో పోస్ట్ బేసిక్ డిప్లొమా తిరువనంతపురంలోని రీజనల్ కేన్సర్ సెంటర్, పోస్ట్-బేసిక్ డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్ కాలపరిమితి: ఏడాది అర్హతలు: బీఎస్సీ(నర్సింగ్) లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో డిప్లొమా ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 12 వెబ్సైట్: http://www.rcctvm.org -
చెన్నపట్నానికి 375 ఏళ్లు
చెన్నై: దక్షిణాదిలోని నగరాల్లోకెల్లా ప్రముఖ పారిశ్రామిక, వ్యాపార, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్న తమిళనాడు రాజధాని చెన్నై శుక్రవారంతో 375వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1639 ఆగస్టు 22న ఈ నగరం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని తమకు అప్పగించేలా నాటి రాజులతో బ్రిటీషర్లు ఒప్పందం కుదుర్చుకోవడంతో నాటి మద్రాస్ ఆవిర్భవించింది. ఆ తర్వాతి ఏడాదే...అంటే 1640లో బ్రిటీషర్లు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్ట్ ఇండియా కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఈ ప్రాంతం అంచెలంచెలుగా ఎదిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మద్రాస్ డే పేరిట శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నగరానికి సంబంధించి పలు విశేషాలు... ► ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగరి కోటలో మద్రాస్‌ను బ్రిటీషు పాలకులకు అప్పగించే ఒప్పందం కుదిరింది. ► మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1917లో మద్రాస్‌పై ఎండెన్ అనే జర్మనీ నౌక బాంబుల వర్షం కురిపించింది. ► ఆధునిక భారత్‌లోని తొలి నగరం ఇదే. కోల్కతాకన్నా 50ఏళ్ల తర్వాత, ముంబైకన్నా 35 ఏళ్ల తర్వాత మద్రాస్ అభివృద్ధి చెందింది. ► నేటి చెన్నై నగరాన్ని మొట్టమొదట చెన్నప్పనాయకన్ అని పిలిచేవారట. ఆ తర్వాతి కాలంలో అదే చెన్నపట్నంగా, మద్రాస్‌గా మారి చివరకు చెన్నైగా స్థిరపడింది. ► 1996లో నాటి డీఎంకే సర్కారు ఈ నగరం పేరును మద్రాస్ నుంచి చెన్నైగా మార్చారు. ► {పపంచంలోనే రెండో అతిపొడవైన మెరీనా బీచ్ చెన్నైలోనే ఉంది. ► బాలీవుడ్‌కు దీటుగా తమిళ సినీపరిశ్రమ వేళ్లూనుకుంది ఇక్కడే. -
చెన్నై మహానగరానికి 375ఏళ్లు
-
‘ది మెడ్రాస్ సాంగ్’ ఆవిష్కరణ
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాసు ఏర్పడి 375 సంవత్సరాలైన సందర్భం గా ఇక్కడి విశేషాలను, విశిష్టతను ప్రతిబింబిస్తూ మురుగప్ప గ్రూప్‌సంస్థ ఆధ్వర్యంలో రూపొందిన ‘ది మెడ్రాస్ సాంగ్’ ఆడియో, వీడియో (ఏవీ)ను సోమవారం విడుదల చేశారు. అనంతరం మీడియాకు ప్రదర్శించారు. బెంగళూరుకు చెందిన మోడల్, సినీనటి యాస్మిన్ పోనప్పపై చెన్నై నగరంలోని పలు ముఖ్యప్రాంతాలపై పాటను చిత్రీకరించారు. సెంట్రల్ స్టేషన్, సీజన్లకు అతీతంగా నిత్యం రద్దీగా ఉండే రంగనాథన్ తెరు, పట్టువస్త్రాలకు పేరెన్నికగన్న పలుషాపులు, రుచికరమైన హోటళ్లు ఇలా మద్రాసులోని ప్రాముఖ్యతలకు పాటలో అద్దంపట్టారు. చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, సంగీత కళాకారిణి సుధా రఘునాథన్, సినీదర్శకులు గౌతమ్ మీనన్, గాత్ర విద్వాంసుడు అలాప్రాజు, హరిచరణ్, నరేష్ అయ్యర్ తదితరులు పాటలో కనిపించి అలరించారు. విజయ్ప్రభాకరన్ పాట చిత్రీకరణకు దర్శకత్వం వహించగా, గేయరచనను సుబ్బు, స్వర రచనను విశాల్ చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ వైస్ చైర్మన్ ఎంఎం మురుగప్పన్ మాట్లాడుతూ, దేశంలో అనేక నగరాలున్నా మద్రాసు నగరానికి ఉన్న ప్రత్యేకతలు మిగిలిన వాటికి లేవన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న ప్రాచీన సంప్రదాయాలను నేటీకీ పాటిస్తున్న నగరంగా మద్రాసు పేరొందినట్లు తెలిపారు. విద్య, వైద్యం, నృత్య, సంగీత, సాహిత్య కళలకు మద్రాసు నగరం కాణాచిగా ఆయన అభివర్ణించారు. తాను మద్రాసులో పుట్టాను, చెన్నైలో జీవిస్తున్నానని చమత్కరించారు. చెన్నై అనేది నగరానికి పేరు మాత్రమే, మద్రాసు అనేది మనస్సుకు హత్తుకునే ఒక ఆనందకరమైన శబ్దమన్నారు. అందుకే తాము రూపొందించిన పాటకు ది మెడ్రాస్ సాంగ్ అని పేరు పెట్టామన్నారు. కస్తూరీ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రాజీవ్‌లోచన, డెరైక్టర్లు రమేష్ మీనన్ పాల్గొన్నారు. ఈ పాటను సోమవారం అర్ధరాత్రి నుంచి మురుగప్ప యూట్యూబ్‌లో వీక్షించే అవకాశాన్ని కల్పించారు. -
టేక్ టూ అనేది ఆయన డిక్షనరీలోనే లేదు!
ఎస్వీఆర్... పేరు తలచుకోగానే మనసు పులకించిపోతుంది! ఆయనను కలిసిన తొలి క్షణం... పెరిగిన పరిచయం... ఏర్పడిన అనుబంధం... ఇలా అన్నీ నా మనసులో సజీవంగా నిలిచిపోయాయి! తొలిసారి కలిసింది అక్కడే... ఆ రోజు... మద్రాసులోని వాణీమహల్లో ‘పద్మశ్రీ’ నాటక ప్రదర్శన. రచయితనూ నేనే... దర్శకుణ్ణి నేనే... హీరోని కూడా నేనే! హాలు మొత్తం నిండిపోయింది! నాటకం పూర్తికాగానే ఒకటే కరతాళ ధ్వనులు! వీటన్నిటి కన్నా, ఒక వ్యక్తి ప్రశంసలు నాలో ఉద్వేగాన్ని రేకెత్తించాయి. ‘‘వెల్డన్! నాటకం చాలా బాగా రాశావ్. ముఖ్యంగా నీ నటనలో చాలా ఈజ్ ఉంది. ఎక్కడా బిగుసుకుపోకుండా సునాయాసంగా నటించావు. రైటర్‌గా, ఆర్టిస్టుగా నీకు మంచి భవిష్యత్తు ఉంది.’’ ఈ మాటలన్నది ఓ మామూలు వ్యక్తి కాదు... మహానటుడు... అభినయ మేరునగధీరుడు... ఎస్వీ రంగారావు! నా గురువు కేవీ నందనరావు ఆహ్వానిస్తే ఆ నాటకాన్ని వీక్షించడానికి వచ్చారు ఎస్వీఆర్. అలా ‘పద్మశ్రీ’ నాటకంతో ఆయనతో పరిచయ భాగ్యం కలిగింది. ఆ తర్వాత అనుకోకుండా రెండు మూడు పెళ్లి వేడుకల్లో కలిశాం. కలిసినప్పుడల్లా నన్ను గుర్తుపట్టి పలకరించేవారు. అలా మొదలైంది మా సాన్నిహిత్యం... ఇదిలా ఉండగా ఆయన ప్రధానపాత్ర పోషించిన జగత్ కిలాడీలు’ సినిమాకు డైలాగ్‌లు రాసే అవకాశం నాకు వచ్చింది. దుర్యోధనుడు, భీముడు లాంటి రకరకాలు పౌరాణిక పాత్రలు చేసిన ఆయనను మెక్సికన్ డ్రెస్‌లో చూడటం గమ్మత్తుగా అనిపించింది. ఆ తర్వాత ‘జగత్‌జెట్టీలు’... ఈ చిత్రానికి నేనే స్క్రీన్‌ప్లే, మాటలు రాశా. సెట్లో ఉంటూ అసోసియేట్ డెరైక్టర్లా పని చేశా. ఇందులో కూడా ఎస్వీఆర్‌ది లీడ్ రోల్. ఈ క్రమంలో ఆయనతో నా సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఎస్వీఆర్ డెరైక్ట్ చేసిన ‘బాంధవ్యాలు’, ‘చదరంగం’ చిత్రాలకు నా గురువు కేవీ నందన్‌రావు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్. ఆయన ద్వారా నేను కూడా ఆ సినిమాలకు పని చేస్తూ, కొంత మేరకు స్క్రిప్టు వర్కులో పాలుపంచుకున్నా. ఎస్వీఆర్‌కి నా పనితీరు నచ్చింది. నన్నొక ఆత్మీయుడిలా చూసుకునేవారు. ఆయన ఇంటికి అప్పుడప్పుడూ వెళ్లి కాసేపు గడిపి వస్తుండేవాణ్ణి. మొదట ఆయనకే కథ చెప్పా... ఈ క్రమంలో ఓసారి ఆయనతో సూచాయగా ఒక కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. నేను దర్శకుడు కావడం కోసం నిర్మాతలకు కథలు వినిపించే ప్రయత్నంలో ఉన్నాను. కృష్ణతో ‘బందిపోటు భీమన్న’ (1969) తీసిన దోనేపూడి బ్రహ్మయ్యకు ఓ సెంటిమెంట్ కథ వినిపించాను. అది ఎస్వీఆర్‌కి చెప్పిన కథే. కానీ బ్రహ్మయ్యకు క్రైమ్ సినిమా చేయాలని ఉంది. అందుకే ఆ కథ వద్దన్నారు. మరో వైపు నిర్మాత కె. రాఘవను కలిశాను. ఆయన కూడా క్రైమ్ కథే కావాలన్నారు. కొన్ని చర్చలు కూడా జరిగాయి. ఎస్వీఆర్, కె. రాఘవ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లిద్దరి మాటల్లో నా ప్రస్తావన వస్తే, అతని దగ్గర మంచి సెంటిమెంట్ కథ ఉందని ఎస్వీఆర్ చెప్పారట. వెంటనే కె. రాఘవ నన్ను పిలిపించి కథ చెప్పమన్నారు. ఆయనక్కూడా విపరీతంగా నచ్చేసింది. అదే ‘తాత-మనవడు’! అందులో ఎస్వీఆర్‌ది రైతు రంగయ్య పాత్ర. సినిమాకు వెన్నెముకలాంటి పాత్ర. ఆయన లేకుండా సినిమాను అస్సలు ఊహించలేం! అలిగి వెళ్లిపోయారు... ఇక నా రెండో సినిమా ‘సంసారం-సాగరం’. ఇందులో ఎస్వీఆర్‌ది కాబూలీ వాలా పాత్ర. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఈ సినిమా షూటింగ్లో ఎస్వీఆర్‌తో చిన్న ఎపిసోడ్ జరిగింది... 1973 జూలై 21న మద్రాసులోని విక్రమ స్టూడియోలో షూటింగ్ మొదలు పెట్టాం. ఆరోజు ఫార్మల్గా రెండు, మూడు షాట్స్ తీశాం. మరుసటిరోజు క్లైమాక్స్ తీయాలని ప్లాన్ చేశాం. జూలై 22 ఆదివారం... సెట్లో 20 మంది ఆర్టిస్టులున్నారు. తొలి షాట్ కైకాల సత్యనారాయణ, జయంతిపై తీశాం. రెండో షాట్ ఎస్వీఆర్, జయంతిపై తీయాలి. నా అసోసియేట్ అంజిబాబుని ఎస్వీఆర్‌కి డైలాగ్ చెప్పమని పంపించాను. ఆయన ఆ డైలాగులన్నీ విని ‘‘ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలు’’ అని కొన్ని డైలాగులు తగ్గించేశారు. ‘ఆ రెండు డైలాగులూ తీసేస్తే, క్లైమాక్స్ చాలా దెబ్బ తింటుంది’ అని ఆయన దగ్గరకు వెళ్లి కన్విన్స్ చేయబోయాను. అయినా వినలేదు. ‘‘సార్... సినిమాలో మీరు నటిస్తున్న తొలి సీన్ ఇది. కానీ ఆర్డర్లో ఇది 99వ సీన్. 98 సీన్లు రాశాక నేను సీన్ రాశాను. ఈ సీన్ ఎలా ఉంటే బావుంటుందో టీమ్ అంతా చర్చించుకున్నాకనే డైలాగులు రాశాను’’ అని వివరించాను. దాంతో ఆయనకు కోపం వచ్చేసింది. విసురుగా బయటకు వెళ్లిపోయారు. కోపం తగ్గాక వస్తారని చాలాసేపు ఎదురు చూశాం. అయినా రాలేదు. ఆయనను బతిమిలాడి తీసుకురమ్మని కె. రాఘవకు చెప్పాను. ‘‘నేను క్లోజ్ ఫ్రెండ్‌ని కదా. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పాలి కానీ, అలా వెళ్ళిపోతే ఎలా? ఏం పర్లేదు... రావు గోపాలరావుని పిలిపిద్దాం. ఆ వేషం అతనితో వేయిద్దాం’’ అని రాఘవ అప్పటికప్పుడు రావుగోపాలరావుకి కబురంపారు. రావు గోపాలరావు వచ్చి మేకప్ రూమ్‌లోకి వెళ్లేసరికి అక్కడ ఎస్వీఆర్ ఉన్నారు. ఈయన ఖంగుతిని ‘‘ఊరికే... మిమ్మల్ని కలుద్దామని వచ్చానండి’’ అని చెప్పి వెళ్లిపోయారు. ఎస్వీఆర్‌కి విషయం అర్థమై రాఘవని పిలిచి చనువుతో తిట్టారు. తర్వాత ఆ సీన్ నేను చెప్పినట్టుగానే యాక్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఆయన దగ్గరకు వెళ్ళి ‘‘సారీ సార్... మీ మనసు నొప్పించాను. నాది మొండితనం కాదు. రషెష్ వచ్చాక మీకు చూపిస్తాను. అప్పుడు కూడా ఆ డైలాగులు వద్దంటే తీసేస్తాను’’ అని చెప్పాను. ఆయన కదిలిపోయి ‘‘నారాయణరావ్... నిన్ను చూసి గర్వపడుతున్నానయ్యా. డైరక్టర్ అంటే ఇలాగే ఉండాలి. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదుగుతావు... కీపిటప్’’ అని నా భుజం తట్టారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఇంకా క్లోజ్‌నెస్ పెరిగిపోయింది! ఇంతలో విషాదం..! 1974 జూలై 18... మద్రాసులో వేరే సినిమా షూటింగ్లో ఉన్నాను. ఎవరో వచ్చి వార్త చెప్పగానే నాకు కాస్సేపు గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది! షూటింగ్‌కి పేకప్ చెప్పేసి, వెంటనే ఎస్వీఆర్ ఇంటికి బయలుదేరాం. సింహం లాంటి మనిషి... అలా నిర్జీవంగా కనబడేసరికి, ఇక మళ్లీ కనబడరనే సరికి ఏడుపొచ్చేసింది. దుఃఖం ఆపుకోవడం నావల్ల కాలేదు! అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నా. ఇంటికి వచ్చాక కూడా ఆయన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన్ను బేస్ చేసుకుని ఇంకో 10 సినిమా కథలు తయారు చేసుకున్నా. అవన్నీ ఇప్పుడు అనాథలేనా? ఇంత గొప్ప నటుడితో కేవలం రెండే సినిమాలు చేసే అదృష్టం దక్కిందా నాకు? ఇలా ఏవేవో నాలో ఆలోచనలు ముప్పిరిగొన్నాయి. నో రీప్లేస్మెంట్..! నాకు తెలిసి ఎస్వీఆర్‌కి ఎలాంటి శారీరక సమస్యలు లేవు. చివరి క్షణం వరకూ అదే విగ్రహం, అదే ఠీవి! ఏమైనా చిన్నా చితకా కుటుంబ సమస్యలుండేవేమో... అది కూడా నాకు పెద్దగా తెలీదు. ఎందుకో అప్పుడప్పుడూ డిస్ట్రబ్డ్‌గా మాత్రం అనిపించేవారు. ఎస్వీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్టు అని నేను కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు. ఇది ప్రపంచమంతా ఒప్పుకునే మాట. టేక్ టూ అనేది ఆయన డిక్షనరీలోనే లేదు! ఓ విద్యార్థిలాగా డైలాగ్ పేపర్ శ్రద్ధగా చదివేవారు. అలాంటి ఆర్టిస్టుని మళ్లీ చూడలేం. ఎస్వీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే - ఆయన నటప్రపూర్ణుడు. చాలామంది తాము ఎస్వీఆర్ అంతటి నటులమని ఫీలైపోతుంటారు కానీ, ఎస్వీఆర్‌కి నో రీప్లేస్మెంట్! అంతటి నటుడు ఇక రారు... రాబోరు! ఆయనకు తగ్గ గుర్తింపు రాలేదన్నది వాస్తవమే! ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు, పురస్కారాలు రాలేదన్న వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది. అందుకు చాలా కారణాలున్నాయి. అసలు అవార్డుల ఎంపికకు చిత్రాలు పంపించాలన్న విషయంలో అప్పట్లో చాలామందికి చైతన్యం లేదు. ఎస్వీ రంగారావు, సావిత్రి, అంజలీదేవి, గుమ్మడి... ఇంతటి గొప్ప వాళ్లకి ‘పద్మ’ పురస్కారాలు దక్కకపోవడానికి కారణం ఏంటంటే... అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ల వివరాలు పూర్తిగా తెలీదు. అక్కడివాళ్లకేమో మనం పరాయివాళ్లం. వాళ్లేమో తమిళ పరిశ్రమకు చెందిన వాళ్లను రికమెండ్ చేసుకునేవారు. ఈ రకంగా కొంతకాలం గడిచిపోయింది. అయినా అవార్డులు రానంత మాత్రాన ఎస్వీఆర్ తక్కువ అయిపోరుగా?! భావితరాలకు ఆయనొక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్..! ఎస్వీఆర్... ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కిందే లెక్క! ఆయన సినిమాలు చూసి భావితరం నటులు ఎన్నో నేర్చుకోవచ్చు. పాత్రకు తగ్గ ఆహార్యం, పాత్రకు తగ్గ మాడ్యులేషన్, వీటన్నిటితో పాటు డైలాగ్స్ లేని చోట ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో... ఇవన్నీ ఆయన నటన చూసి నేర్చేసుకోవచ్చు! - సంభాషణ: పులగం చిన్నారాయణ -
ఫుట్‌బాల్ నేర్చుకుంటున్న కార్తీ
తమిళ హీరో కార్తీ కాలు కదుపుతున్నాడు. డాన్సులు ఎప్పటినుంచో చేస్తున్న ఈ యువహీరో.. ఇప్పుడు ఫుట్‌బాల్ నేర్చుకుంటున్నాడు. రంజిత్ దర్శకత్వంలో కార్తీ కొత్తగా నటిస్తున్న 'మద్రాస్' చిత్రంలో అతడు ఫుట్‌బాల్ ఆడాల్సిన అవసరం లేకపోయినా, పాత్రకు మాత్రం అవసరమని, అందుకే నేర్చుకుంటున్నాడని రంజిత్ తెలిపారు. ఉత్తర మద్రాసు ప్రాంతంలో ఉండే వాళ్ల పాత్రను కార్తీ పోషిస్తున్నాడని, అక్కడివాళ్లు ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడుతుంటారని అన్నారు. సినిమాలో కొన్ని ఫుట్‌బాల్ సన్నివేశాలు కూడా ఉండటంతో దానికోసం పదిరోజుల పాటు పూర్తిస్థాయిలో ఫుట్‌బాల్ నేర్చుకున్నాడని చెప్పారు. తాను అతడిని నేర్చుకొమ్మని చెప్పకపోయినా.. కార్తీయే అంకితభావంతో నేర్చుకుంటున్నాడన్నారు. కార్తీ చాలా మంచి నటుడని, అతడిని తెల్లవారుజామున 3 గంటలకు షూటింగుకు పిలిచినా, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేశాడని, ఒక్క బ్రేక్ కూడా తీసుకోకుండా ఏకధాటితా 30 గంటలు షూటింగ్ చేసినా ఒక్క ఫిర్యాదు కూడా అతడినుంచి లేదని రంజిత్ అన్నారు. కార్తీ సరసన కేథరీన్ ట్రెసా నటిస్తున్న మద్రాస్ చిత్రం ఉత్తర మద్రాసు ప్రాంతవాసుల జీవనచిత్రం. -
గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం
టేకులపల్లి : మండలంలోని కోయగూడెం పంచాయతీ పరిధి మద్రాస్‌తండా సమీప కొండంగులబోడు గుట్ట ప్రాంతంలో గిరిజన బాలికపై ఈనెల 12న జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో పదో తరగతి చదువుతున్న బాలుడు కూడా ఉన్నాడు. టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చిలుక రాజిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కొప్పురాయి పంచాయతీ లక్ష్మీపురం (విప్పలచెలక) గ్రామానికి చెందిన బాలిక (17) వరుసకు తమ్ముడైన కుంజా సారయ్యతో కలిసి కోయగూడెం పంచాయతీ మద్రాస్‌తండాలో ఉంటున్న వరుసకు అన్నయ్య అయిన వట్టం రామారావు ఇంటికి ఈనెల 12న సాయంత్రం ఆటోలో బయల్దేరింది. సీతారాంపురం స్టేజీ వద్ద ఆటో దిగి కొండంగులబోడు వరకు నడుచుకుంటూ వెళ్లింది. చీకటి పడుతుండటంతో మద్రాస్‌తండాకు చెందిన వరుసకు బావ అయిన ఆటో డ్రైవర్ తాటి జగదీశ్‌కు ఫోన్ చేసింది. తమను ఊరిలోకి తీసుకెళ్లేందుకు రమ్మని పిలిచింది. కాసేపటి తర్వాత వస్తానని జగదీష్ చెప్పడంతో ఆమె అక్కడే ఎదురు చూసింది. రాత్రి 7 గంటల తర్వాత తన స్నేహితుడు భూక్య రవి (మధు)తో కలిసి జగదీష్ అక్కడికి చేరుకున్నాడు. బాలిక తమ్ముడిని రవి గట్టిగా పట్టుకోగా ఆమెను రవి ఆటోలోకి లాగి కొండంగులబోడు గుట్ట పక్కన ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నలుగురు స్నేహితులకు ఫోన్ చేసి పిలి పించాడు. అక్కడికి చేరుకున్న ఆ యువకులు ఒక రి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేశారు. ఆతర్వాత హత్య చేసేందుకు యత్నించగా ఆమె ప్రతిఘటించింది. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి బాలికను ఆటోలో ఎక్కించుకుని మద్రాస్‌తండాలోని ఆమె బంధువల ఇంటి సమీపంలో వదిలిపెట్టారు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక ఎవరికీ చెప్పుకోలేదు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల అరెస్టు అత్యాచారం చేసిన పారిపోయిన యువకులు పోలీసులకు ఎట్టకేలకు చిక్కారు. ఆటోలో మద్రాస్‌తండాకు వెళ్తున్నారని సమాచారం అందుకున్న ఎస్సై ముత్తా రవికుమార్ తన సిబ్బందితో కలిసి వలపన్ని పట్టుకున్నారు. తాటి జగదీశ్‌తో పాటు భూక్య సంతోష్, భూక్య రవి(మధు), జర్పుల సురేష్‌తోపాటు ఓ బాలుడిని అరెస్టు చేశారు. వీరిలో నలుగురిని ఇల్లెందు కోర్టుకు తరలించారు. మైనర్‌ను ఖమ్మంలోని బాల నేరస్తుల కోర్టుకు పంపించారు. ఐదుగురిపై నిర్భయ కేసుతోపాటు ఫోక్సో, 366, 376డీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై రవికుమార్, సిబ్బంది సైదులు, ఉపేందర్, వాసు, అనిల్, రవిని అభినందించారు. -
చెన్నపట్నం తొలి తెలుగు ‘వాణి’
మద్రాసు ఆకాశవాణి తెలుగువారి తొలినాటి రేడియో ప్రసారాలను వెలువరించిన కేంద్రం. తెలుగునాట సరళమైన వార్తా భాష స్థిరపడటానికి మద్రాసు ఆకాశవాణి కేంద్రం చేసిన కృషి ఎనలేనిది. ‘‘నేనిప్పుడు చెన్నపట్టణం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడి నుంచి వినుచున్నరో నేను చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వినుచున్నారని తలచుచున్నాను’’ అంటూ 1938 జూన్ 16 వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కుర్మా వెంకటరెడ్డి ‘భారతదేశం - రేడియో’ అనే అం శంపై ప్రసంగించారు. అది మద్రాసు రేడియో కేంద్రం మొదలైన రోజు. అవి అక్కడి నుంచి వినిపించిన తొలి తెలుగు పలుకులు. వెంకటరెడ్డి 1937 ఏప్రిల్ 1 నుంచి జూలై 14 దాకా నాటి మద్రాసు రాష్ట్ర ప్రధానిగా అంటే ముఖ్యమంత్రిగా పని చేసినవారు. త్యాగరాజుల వారి తెలుగు కృతిని వెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా ఈ కేంద్రం ప్రసారాలను ప్రారంభించింది. పిమ్మట అప్పటి ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలచారి ఆంగ్లంలో ప్రా రంభోపన్యాసం చేశారు. అప్పటికి ఆకాశవాణి అనే మాటను అధికారికంగా వాడ లేదు, రేడియోకు పర్యాయపదంగా వాడారు. రాజాజీ తన ఉపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రసార వాహికగా మద్రాసు రేడియో పుట్టుకతోనే తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అయితే తెలుగువాడైన సి.వి. కృష్ణస్వామిసెట్టి ప్రారంభించిన మద్రాసు ప్రెసిడెన్సీ క్లబ్ 1924 జూలై 31 నుంచి కొంత కాలం ప్రసారాలను నిర్వహించింది. అది మూతపడ్డాక 1930లో మద్రాసు నగరపాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది. కానీ అవీ ఎంతో కాలం సాగలేదు. ఇంతలో 1933లో హైదరాబాదు చిరాగ్ ఆలీ సందులో మహబూబ్ ఆలీ అనే తపాలా శాఖ ఉద్యోగి 200 వాట్ల శక్తి గల రేడియో కేంద్రం ప్రారంభించారు. 1935 నుంచి నిజాం నిర్వహణలోకి పోయిన ఆ కేంద్రం కార్యక్రమాలు ఉర్దూలో ఉండేవి. ఆ కేంద్రమే 1939 జూలై నుంచి దక్కన్ రేడియోగా మారింది. కనుక 1938 జూన్ 16వ తేదీని తెలుగు ఆకాశవాణి జన్మదినంగా పరిగణించాల్సి ఉంటుంది. మద్రాసు కేంద్రం నుంచి తెలుగు ప్రసారాలే ఎక్కువగా ఉండేవని చరిత్ర చెబుతోంది. తొలి రోజులనాటి ఆ ప్రసారాలను గురించి ఆచంట జానకిరామ్ ఆత్మకథ ‘సాగుతున్నయాత్ర’లో కళాత్మకంగా, సవివ రంగా వర్ణించారు. ఆచంట జానకిరామ్, అయ్యగారి వీరభద్రరావు, సూరినారాయణమూర్తి మద్రాసు ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలకు చాలా దోహదం చేశారు. ఈ ముగ్గురిని ‘మూర్తి త్రయం’గా పేర్కొనేవారు. ఈ ముగ్గురు పాల్గొన్న ‘అనార్కలి’ తొలి తెలుగు రేడియో నాటకం. అది 1938 జూన్ 24న లైవ్‌గా మద్రాసు కేంద్రం ద్వారా ప్రసారమైందని డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ అంటారు. అనార్కలి పాత్రను భానుమతి చేశారు. నాటక రచయిత ‘వైతాళికులు’ ముద్దుకృష్ణ. చారిత్రక విషయాల పరిశోధక రచయిత, నాటి ‘భారతి’ పత్రిక ఉపసంపాదకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ చేసిన‘మయ నాగరికత’ అనే ప్రసంగం రేడియో తెలుగు ఎలా ఉండాలో విశదం చేసింది. ‘‘ఈ యుగం ఎంత చిత్రమైనదో? ఇదంతా పరిశోధన యుగం. వైజ్ఞానిక యుగం. ప్రతి విషయంలోనూ పరిశోధనే! నిప్పు, నీరు, గాలి, ధూళి ఇం తెందుకు...’’ అనే వాక్యాలను పరిశీలిస్తే రేడియో వచన ధర్మాలు సులువుగా బోధపడతాయి. జానకిరామ్ ‘ఇతర గ్రహాలలో మానవులున్నారా?’ అనే అంశంపై జడ్జిగా, చీఫ్ జస్టిస్‌గా పేరుపొందిన సర్ వేపా రామేశముతో ప్రసంగం చే యించారు. కోలవెన్ను రామకోటేశ్వరరావు మద్రాసు ఆకాశవాణి నుంచి తొలి తెలుగు రేడియో పుస్తక సమీక్షను చేశారు. 1948 డిసెంబర్ 1న విజయవాడ కేంద్రం ప్రారంభమయ్యాక మద్రాసు తెలుగు కార్యక్రమాలు తగ్గాయి. 1950 ఏప్రిల్ 1న నైజాం రేడియోను భారత ప్రభుత్వం స్వీకరించి, ఆకాశవాణిగా ప్రసారాలను కొనసాగించింది. 1963లో కడప, విశాఖపట్నం కేంద్రాలు మొదలయ్యాయి. పాతికేళ్ల క్రితం మరో ఎనిమిది జిల్లా స్థాయి రేడియో కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం మొదలైంది. నేటి వ్యాపార టీవీ చానళ్లు, ప్రైవేటు ఎఫ్ఎం రేడియో చానళ్ల ముందు ఆకాశవాణి వెలతెల పోతున్నట్టనిపించవచ్చు. కానీ టీవీ న్యూస్ చానళ్లు అరగంటలో ఇవ్వలేని వార్తా సమాచారాన్ని ఆకాశవాణి ఐదు నిమిషాల బులెటిన్లు ఇవ్వగలవు. సరళమైన వార్తా భాష స్థిరపడటానికి ఆకాశవాణి చేసిన కృషి ఎనలేనిది. నాటి ప్రసారాల ఒరవడిని అనుసరిస్తే తెలుగు చానళ్లలో పరిశుభ్రమైన తెలుగు వినే భాగ్యం కలుగుతుంది. జూన్ 16 ఆకాశవాణి మద్రాసు కేంద్రం 76వ జన్మదినం (వ్యాసకర్త ‘ఆకాశవాణి’ ప్రయోక్త) - నాగసురి వేణుగోపాల్ -
తండాలో బాలికపై సామూహిక అత్యాచారం
ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండాలో గత అర్థరాత్రి దారుణం జరిగింది. తండాకు చెందిన సునీత అనే16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆరుగురు యువకులు పరారైయ్యారు. దాంతో ఆ బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లీదండ్రులకు వెల్లడించింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
పండ్లతో అద్భుత శిల్పాలు
-
కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలి
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోస్తాంధ్రపై కులాభిమానం చూపవద్దని, సీమాంధ్ర రా ష్ట్ర రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కర్నూలు రాజధాని సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని కశిరెడ్డి శ్యాలమ్మ సత్రంలో సమితి నాయకులు వి.జనార్దన్‌రెడ్డి, జి.పుల్లయ్య, కె.చెన్నయ్య, సంజీవరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, సోమశేఖర్‌గౌడ్, పి.బి.వి.సుబ్బయ్య, సంపత్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర కమిటీ పర్యటన పూర్తి కాక మునుపే రాజధాని ఏర్పాటుకు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్ర శ్నించారు. మద్రాసు విడిపోయినప్పుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంపంతులు సూచన మేరకు అప్పట్లో కర్నూలును రాజ ధాని చేశారని, ఇక్కడ సీమాంధ్రకు రాజ ధాని పెట్టకపోతే ప్రకాశం పంతులును అవమానించిన వారవుతారని అన్నారు. కర్నూలు సీమాంధ్రకు కేంద్ర బిందువుగా లేదనే సాకుతో ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనే విషయాన్ని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, హైదరాబాదులు కూ డా ఖచ్చితమైన కేంద్ర బిందువులుగా లేవ ని గుర్తు చేశారు. ఇప్పటికే సమైక్యాంధ్ర కో సం పోరాటాలు చేశామని, రాజధాని దక్కకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం కర్నూలు రాజధాని కావాలంటూ నినాదాలు చేశారు. -
బ్రౌన్‌ని అంటారా?....
స్పందన ‘బ్రౌన్ నిఘంటువులో బ్రౌన్ కృషి ఎంత?’ అనే పేరుతో మే 3న సాక్షి సాహిత్యం పేజీలో ఒక వ్యాసం లాంటిది వచ్చింది. ఈ రచనకు కర్తలు పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు. బ్రౌన్కు మనం ఇవ్వవలసిన గౌరవం కంటే ఎక్కువ ఇస్తున్నామనీ బ్రౌన్ పట్ల తెలుగువారికి గల ఆరాధన వెనుక వలసవాద ధోరణి- అంటే బానిస ధోరణి ఉన్నదనీ బ్రౌన్ నిఘంటువులో బ్రౌన్ అవగాహన ఎంతో చెప్పడానికి అవకాశాలు లేవనీ రచయితలు అభిప్రాయపడ్డారు. బ్రౌన్ గురించి తెలుసుకోవడానికి అచ్చయిన అతని రచనలు అందరికీ అందుబాటులో ఉన్నవే. అయితే తన గురించి తాను చెప్పుకున్న విషయాలు వాస్తవాలేనని గుడ్డిగా నమ్మక్కరలేదు. బ్రౌన్ ఆలోచనా విధానాన్నీ కొంత వరకు ఆయన స్వభావాన్నీ తెలుసుకోవడానికి వేల పేజీలలో ఉన్న అచ్చుకాని ఆయన రాసుకున్న నోట్సు ఒక మంచి ఆధారం. మద్రాసు యూనివర్సిటీలోని ఓరియంటల్ మానుస్క్రిప్ట్ లైబ్రరీలో ఈ నోట్సు సంపుటాలున్నాయి. జి.ఎన్.రెడ్డి పర్యవేక్షకులుగా బంగోరె స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న బ్రౌన్ ప్రాజెక్టు (ఎస్.వి.యు, తిరుపతి) పని చేసిన కాలంలో లండన్ నుంచి వారు తెప్పించిన బ్రౌన్ నిఘంటువుకు సంబంధించిన మరికొంత నోట్సు మైక్రోఫిల్మ్ రూపంలో ఉంది. వీటిలో బ్రౌన్ ధోరణి, స్వభావం, భాష పట్ల దృక్పథం మరింత స్పష్టంగా అర్థం అవుతాయి. బ్రౌన్ పుట్టింది భారతదేశంలోని కలకత్తాలో. 12 సంవత్సరాల వరకూ అతని బాల్యం కూడా ఇక్కడే గడిచింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో కొంతకాలం బ్రిటన్‌కు వెళ్లిపోయాడు. నవయవ్వన దశలోనే బ్రిటిష్ అధికారిగా భారతదేశానికొచ్చాడు. తెలుగుతో బాటు మరికొన్ని భారతీయ భాషలూ నేర్చుకున్నాడు. వేమన పద్యాల సేకరణ, పరిష్కరణ, అచ్చులతో ప్రారంభమైన బ్రౌన్ తెలుగు సాహిత్య కృషి తెలుగు కావ్య పరిష్కరణలతో ఆగక తెలుగు నిఘంటువుల దాకా విస్తృతంగా సాగింది. బ్రౌన్ స్వభావం గమనించండి. 1. బ్రౌన్ గుంటూరు కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఏర్పడ్డ దుర్భర పరిస్థితిని వివరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రిపోర్టు పంపాడు. అందులో ఊఅకఐూఉ (కరువు) అనే మాట ఉపయోగించాడు. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహించింది. అయినా బ్రౌన్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. 2. పదాలకు అర్థాలు నిర్ణయించడంలో బ్రౌన్ తనకు సహాయకులుగా ఉన్న పండితులపై ఆధారపడటం ఒక కోణం మాత్రమే. పండితుల నుంచి సామాన్యుల దాకా అందరూ తన గురువులే అని స్వీయ చరిత్రలో చెప్పుకున్నాడు. ‘అలవోక’ అనే పదానికి రావిపాటి గురుమూర్తిశాస్త్రి బ్రౌనుకు చెప్పిన అర్థాలు స్వేచ్ఛ, అప్రయత్నము. బ్రౌన్ ఇచ్చిన అర్థాలలో వేడుకగా, విలాసముగా, ఆట్లాటగా, అవలీలగా అనేవి ఉన్నాయి. ఎవరో చెప్పిన విషయాలతోనే తృప్తి పడకుండా తనకు సంతృప్తి దొరికే దాకా పరిశీలించడం బ్రౌనుకు అలవాటు. 3. తెలుగువాడైన బహుజనపల్లి సీతారామచార్యులు తయారు చేసిన ‘శబ్ద రత్నాకరం’ 1885లో అచ్చయింది. కాని బ్రౌన్ నిఘంటువు దానికి చాలాకాలం ముందే 1852లో వచ్చింది. అయినప్పటికీ బ్రౌన్ నిఘంటువులో ఉన్న అనేక పదాలు అర్థాలు ఆ తర్వాతి కాలంలో వచ్చిన శబ్ద రత్నాకరంలో లేవు. 4. ‘మామిడి గుత్తులు’ అనే పదానికి శబ్ద రత్నాకరం ధాన్య విశేషము అని అర్థం చెప్పింది. బ్రౌను ‘వడ్లల్లో భేదము’ అని ఇచ్చాడు. 5. ‘చిక్కుడు’ అనే పదానికి బ్రౌను ఎర్ర, తెల్ల, గోరు, ఆనప, ఏనుగ, కోడి, తొండ, ఉలవ, సొన- అని తొమ్మిది రకాల చిక్కుడు భేదాలను ప్రస్తావించాడు. శబ్దరత్నాకర రచయిత ‘ఒకానొక తీగ’ అని మాత్రమే సరిపెట్టాడు. దీని వల్ల అదొక కూరగాయ అని కూడా తెలియదు. 6. ‘మున్నూరు’ అనే పదానికి శబ్దరత్నాకరంలో ‘మూడు నూఱులు’ అని మాత్రమే ఉంది. బ్రౌను దాంతోబాటు మున్నూటి కులం అని కూడా ఇచ్చాడు. 7. ‘థ’ అనే వర్ణం అనవసరం అన్నాడు బ్రౌన్. చాలాకాలానికి భద్రిరాజు కృష్ణమూర్తి కూడా అదే మాట అన్నారు. 8. శకట రేఫ (ఱ), అరసున్నాలను బ్రౌన్ ఆనాడే తొలగించాడు. పై విషయాల్ని చూస్తే బ్రౌన్ సామ్రాజ్యవాద స్వభావంతోనే ఈ పని చేశాడని అనిపిస్తుందా? తెలుగు భాషా సాహిత్యాల గురించి ఆయన ఆలోచనలలో కొన్ని తప్పులంటే ఉండొచ్చుగాని ఏదో కడుపులో పెట్టుకున్నట్టుగా మాత్రం లేవు. ‘కవులు భాషను సృష్టిస్తారు. వ్యాకరణవేత్తలు దానిని అనుసరిస్తారు’ అన్నాడు బ్రౌన్. మన వ్యాకరణవేత్తలు చాలామంది కవులకు సంకెళ్లు వేసే పద్ధతినే అనుసరించారు. మనలో వలసవాద భావాలంటే దానికి బ్రౌన్ కారణం కాదు. వ్యాసకర్తలన్నట్టు మనలో సాంస్కృతిక దైన్యం ఉంది. దాన్ని ధిక్కరించి, అధిగమించే స్వభావం కూడా కొంతమందిలోనైనా ఉంది. బ్రౌన్ చవకగా జీతాలిచ్చాడని మరో ఆరోపణ. ఇవాళ మన భూస్వాములూ, పెట్టుబడిదారులూ మన శ్రమజీవుల్ని చేసే దోపిడీ ముందు, దేశాన్ని విదేశాలకు అమ్మే మన పాలక వర్గాల స్వభావం ముందు బ్రౌన్ ఇచ్చిన ‘చవక‘ జీతాల్ని గురించి ప్రశ్నించడం చవకబారు ఆలోచన కాదా? బ్రౌన్ ఆ రోజుల్లోనే తెలుగు తాళపత్ర ప్రతులు సేకరించడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఒకసారి గుర్రం మీంచి కిందపడి కుడి చేతి బొటనవేలు దెబ్బ తింటే ఎడమ చేత్తో రాయటం అలవాటు చేసుకున్నాడు తప్ప కొన్ని నెలలైనా ఊరికే కూర్చోవడానికి ఇష్టపడలేదు. బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల కృషిని విమర్శనాత్మకంగా విశ్లేషించుకోవడం అవసరంగాని ఆ విశ్లేషణ ఈ వ్యాసకర్తలు చేసిన పద్ధతిలో మాత్రం కాదు. - వి. చెంచయ్య 9440638035 -
నయన ఓకే అన్నారు.. కానీ..
నయనతారకు కథ నచ్చింది. నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా ఆ పాత్రలో ఇప్పుడు హన్సిక నటిస్తున్నారు. విచిత్రంగా ఉంది కదూ. సినిమా అంటే అంతే. ఏ పాత్ర ఎవర్ని వరిస్తుందో చెప్పడం అసాధ్యం. జయం రవి, హన్సిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం రోమియో జ్యూలియట్. లక్ష్మణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. చిత్రంలో హీరోయిన్గా నయనతార నటించాల్సి ఉంది. ఈ భామకు దర్శకుడు కథ వినిపించారు. పాత్ర నచ్చడంతో పారితోషికం తగ్గించుకుని మరీ నటించడానికి ఓకే చెప్పారట. అయినా ఆమెను కాదని మరో క్రేజీ హీరోయిన్ హన్సికను హీరోయిన్గా ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. నయనతారకంటే హన్సికనే బెటర్ అనిపించారా? అన్న ప్రశ్నకు దర్శకుడు బదులిస్తూ నిజమే రోమియో జ్యూలియట్ చిత్రం కథను మొదట నయనతారకే చెప్పానన్నారు. ఆమెకు కథ బాగా నచ్చడంతో పారితోషికం తగ్గించుకుని నటిస్తానన్నమాట నిజమేనన్నారు. దీంతో తాను సంతోషించానని తెలిపారు. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే జయం రవి, నయనతార జంటగా ఇప్పటికే జయం రవి దర్శకత్వంలో నటిస్తున్నారని తెలిసిందన్నారు. మళ్లీ వెంటనే వీరితో రోమియో జ్యూలియట్ చిత్రాన్ని తెరకెక్కిస్తే ప్రేక్షకులు మొనాటనీ ఫీలవుతారని భావించామన్నారు. ఈ కారణంగానే నయనతార పాత్రలో హన్సికను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ విషయం గురించి నయనతారను స్వయంగా కలిసి స్పష్టంగా వివరించానన్నారు. ఆమె కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. -
గుబాళిస్తున్న మహిళావిజయం
వేసవి వచ్చిందంటే మల్లెపూలు విరగబూస్తాయి. మల్లెచెట్లు పెంచే రైతులకు చేతినిండా సొమ్ములే. ఈ విషయం గమనించిన మద్రాసు మహిళారైతులు మల్లెపూల తోటలనే నమ్ముకుని బతుకుతున్నారు. ఇలాంటి మహిళా రైతుల సంఖ్యను పెంచడం కోసం మద్రాసు ప్రభుత్వం సూక్ష్మరుణాల పేరుతో ఆర్థికసాయం చేస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మహిళారైతులు మల్లెతోటలసాగులో మంచి లాభాలను చూస్తున్నారు. ‘‘ప్రభుత్వమిచ్చే రుణంతో ఏ పంటసాగైనా చేసుకోవచ్చు. మేం మాత్రం అచ్చంగా మల్లెతోటలనే నమ్ముకుని బతుకుతున్నాం. మొక్కలు పెంచడం దగ్గర నుంచి మొగ్గలు తెంపడం వరకూ అన్ని పనులూ మేమే స్వయంగా చేసుకుంటున్నాం. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గుతోంది. అలాగే అమ్మకం కూడా నేరుగా చేసుకోవడం వల్ల దళారుల జోక్యం కూడా లేదు’’ అని చెప్పారు భాగ్యలక్ష్మి అనే మహిళారైతు. కాలానికి తగ్గ పూలను పెంచుకుంటూ లాభాలను చూస్తున్న మహిళారైతుల సంఖ్య రోజురోజుకీ పెరగాలని కోరుకుందాం! -
తెల్లబోయిన ఎర్రజెండా
మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాలంలో 1951 ఎన్నికల్లో 12 నియోజకవర్గాలు ఉండేవి. నాలుగు ఇద్దరు ప్రతినిధుల నియోజకవర్గాలు ఉండేవి. ఒక సీటు జనరల్‌కు కేటాయించగా అదే నియోజకవర్గంలో రెండవ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించేవారు. జనరల్, రిజర్వు కేటగిరీల అభ్యర్థులు ఒకేసారి పోటీలో ఉంటారు. అందరిలో అత్యధికంగా ఓట్లు సంపాదించినవారు జనరల్ కేటగిరిలో విజేతలు అవుతారు. పోటీలో ఉన్న ఎస్సీ అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు గెలుచుకున్నవారు రిజర్వుడు స్థానం నుంచి గెలుపొందినట్టు ప్రకటిస్తారు. ఈ ప్రకారం జిల్లాలో 12 సీట్లలో 16 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం, కాకినాడ, అమలాపురం, రాజోలు ఇద్దరు అభ్యర్థుల నియోజకవర్గాలు. పిఠాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు విజయాలు సాధించారు. కాకినాడ, రాజమండ్రి, రాజోలు నియోజకవర్గాల్లో రిజర్వుడు అభ్యర్థులుగా కూడా కమ్యూనిస్టులే అసెంబ్లీకి వెళ్లారు. పిఠాపురం నుంచి ఆర్.వెంకట జగ్గారావు కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. రాజమండ్రి నుంచి చిట్టూరి ప్రభాకరచౌదరి కాంగ్రెస్‌కు చెందిన కె.ఎల్.నర్సింహారావుపై విజయం సాధించారు. కాకినాడ నుంచి చిత్తజల్లు వెంకట కృష్ణారావు కె.మోహన్‌రావుపై గెలుపొందారు. కాకినాడ రిజర్వుడు నియోజకవర్గం నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీకే చెందిన సాకా వెంకటరావు అసెంబ్లీకి వెళ్లారు. రాజోలు నుంచి అల్లూరి వెంకట కృష్ణారావు కిసాన్ మజ్దూర్ పార్టీ అభ్యర్థి ఆకుల బులిస్వామిపై గెలిచారు. రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు అసెంబ్లీకి వెళ్లారు. కమ్యూనిస్టుల విజయ పరంపర 1955 ఎన్నికల్లో కూడా కొనసాగింది. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం నుంచి జనరల్, రిజర్వుడు అభ్యర్థులుగా ఇద్దరూ కమ్యూనిస్టులే అసెంబ్లీ గుమ్మం తొక్కారు. ఈసారి రాజమండ్రి, కాకినాడ స్థానాలు కోల్పోయి, సామర్లకోట, పెద్దాపురం, రాజోలు స్థానాల నుంచి గెలుపొందారు. రాజోలు నుంచి రిజర్వుడు అభ్యర్థిగా కూడా కమ్యూనిస్టు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం నుంచి మహమ్మద్ తహసీల్ తన సమీప కమ్యూనిస్టు అభ్యర్థి శ్యామల సీతారామయ్యపై గెలుపొందారు. ద్వితీయ స్థానంలో ఉన్న సీతారామయ్య కూడా రిజర్వు అభ్యర్థిగా అసెంబ్లీకి వెళ్లారు. పెద్దాపురం నుంచి దూర్వాసుల వెంకట సుబ్బారావు తన సమీప అభ్యర్థి కృషీకార్ లోక్పార్టీకి చెందిన చల్లా అప్పారావుపై గెలుపొందారు. సామర్లకోట నుంచి పుత్సల వెంకటరావు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కృషీకార్ లోక్పార్టీకి చెందిన కాకరాల కామేశ్వరరావుపై గెలుపొందారు. రాజోలు నుంచి అల్లూరి వెంకటరామరాజు మరోసారి గెలి చారు. ప్రజాపార్టీకి చెందిన ఆకుల బాలాస్వామిపై గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు కూడా మరోసారి అసెంబ్లీకి వెళ్లారు. 1962 ఎన్నికల నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. 1967 ఎన్నికలతో వీరి శకం ముగిసింది. 1972లో సీపీఐ, సీపీఎంలు రాజమండ్రి, పెద్దాపురం, పిఠాపురం, సంపర, నగరం స్థానాల్లో పోటీచేసినా ఒక్కచోటా గెలువలేదు. అప్పటి నుంచీ మరే ఎన్నికల్లోనూ జిల్లా నుంచి కమ్యూనిస్టులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించలేకపోయారు. జిల్లా నుంచి 1962లో అనపర్తి నుంచి పాలచర్ల పరశురామన్న కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డిపై గెలుపొందారు. చిట్టూరి ప్రభాకరచౌదరి 1967లో మరోసారి రాజమండ్రి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రావుపై విజయం సాధించారు. పెద్దాపురం నుంచి ఉండవల్లి నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి కృష్ణమూర్తిపై విజయం సాధించారు. వీరిద్దరితో కమ్యూనిస్టుల జైత్రయాత్రకు జిల్లాలో తెర పడింది, నాటినుంచి కమ్యూనిస్టులను ప్రజా ఉద్యమకారులుగానే గుర్తించారు తప్ప ఓ రాజకీయ పార్టీగా పరిగణించి ఓట్లు వేయడం లేదు. కనీసం రెండు మూడు స్థానాలకు కూడా ఎగబాకలేని పరిస్థితికి చేరుకున్నారు. -
వైభవంగా ‘జయ’ ఉగాది
అన్నానగర్, న్యూస్‌లైన్: మెరీనా తీరంలో జయనామ ఉగాదిని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక మద్రాసు వర్సిటీ తెలుగు విభాగం, దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం సాహితీ విభాగం, నవసాహితీ కలిసి మెరీనా రజతోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయ ఉగాది వేడుకలకు ప్రముఖ వైద్యుడు సీఎంకే రెడ్డి విశిష్ట అతిథిగా విచ్చేసి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. రాబోయే జయ ఉగాది అందరికీ మంచి చేయాలని ఆయన అభిలషించారు. మరో విశిష్ట అతిథి పెరియార్ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ, కొత్త ఆశలు, ఆశయాలతో జయ నామ ఉగాదిని ప్రారంభించాలన్నారు. ఆత్మీయ అతిథి హోదాలో వచ్చిన దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్ ప్రస్తుతం మనమంతా జయ(అమ్మ) రాష్ట్రంలో ఉన్నాం గనుక జయానికి ఎదురులేదని చలోక్తి విసిరారు. ప్రసంగాల అనంతరం అంతర్జాతీయపురస్కారం పొందిన చిత్రం మిణుగురులు సంగీత దర్శకుడు జోస్యభట్ల రాజశేఖర శర్మ, చిత్ర దర్శకుడు కె.అయోధ్యకుమార్‌కు కాట్రగడ్డ, సీఎంకే రెడ్డి, అఖిల భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు రవికోటార్కర్ అభినందన చందనం పేరిట ఘనంగా సత్కరించారు. పురస్కారం అందుకున్న శర్మ, అయోధ్యకుమార్ మాట్లాడు తూ, మద్రాసులోని తెలుగు వారికి రుణపడి పోయామన్నారు. ఈ ఉగాదిని చెన్నైలో తెలుగు వారి మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. డాక్టర్ వై బాలశౌరి రెడ్డి, గోటేటి శ్రీరామారావు, ఇ.ఎస్ రెడ్డి, ఆచార్య ఎల్.బి. శంకరరావు, కాకాని వీరయ్య, గంగరాజు మోహనరావు, ఇట్టా సాంబశివరావు, విద్వాన్ ఎస్ దశరథరామిరెడ్డి, ఆచార్య జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఆచార్య డి.చిన్ని కృష్ణయ్య, డాక్టర్ పుల్లూరి ఉమ, సరోజినీ ప్రేమ్‌చంద్, పుట్టా జయరామ్, సిహెచ్ వెంకటేశ్వరరావు వంటి సీనియర్ తెలుగు ప్రముఖులకు మాడభూషి సంపత్ కుమార్, నవ సాహితి కార్యదర్శి ఎస్వి సూర్యప్రకాశరావు, అధ్యక్షుడు దోర్నాదుల సత్యనారాయణ నేతృత్వంలో వేదికపైనున్న విశిష్ట అతిథులు ఘనంగా సన్మానించారు. సాయంత్రం 5 గంటలకు 44 మంది ప్రముఖ కవులతో ఉగాది కవితా సమేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో దశరథరామిరెడ్డి, వీరయ్య, గంగరాజు మోహనరావు, ఎల్.బి.శంకరరావు, చిన్ని కృష్ణయ్య, జివిఎస్ఆర్ కృష్ణమూర్తి, కాసల నాగభూషణం, ఉప్పలధడియం వెంకటేశ్వర్లు, గుడిమెట్ల చెన్నయ్య, వంజరపు శివయ్య, ఎ.వి శివకుమారి, వెన్నెలకంటి, సరోజినీ ప్రేమ్‌చంద్, విస్తాల శంకరరావు, కె.లక్ష్మణ, ప్రణవి, తమిళ్‌సెల్వి, ఎస్వి. సూర్య ప్రకాశ రావు, పి.ఆర్. కేశవులు, ఎం.గంగాధర ప్రసాద్, జె.కె.రెడ్డి, మొదలి శ్రీరామప్రసాద్, ఎం. కళ్యాణి, వె.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, వై.వి రాజారావు, వారణాశి శివరామకృష్ణ, కోట శ్రీరామచంద్రమూర్తి, భువనచంద్ర, ఎస్.బషీర్, టి.మోహనశ్రీ, ఉప్పలూరి విజయలక్ష్మి, కె.ఎం వీరేశ్, పి.గోపాల్, జి.ఎన్.శ్యామల, అంబృణి, ఎలిజబెత్ జయకుమారి, ఎం.మునిరత్నం, డి.వేలాయుధం, అద్దేపల్లి సుచిత్రాదేవి, పి.ఎస్. మైథిలి, బాలసుబ్రమణ్యం, ఈశ్వర కంబార, కె. శశికుమార్, ఒ.బసవరాజ్ వంటి కవులు పాల్గొని ఉగాది ప్రాశస్త్యాన్ని తెలిపే పలు కవితలను చదివారు. ఈ కవితా సమ్మేళనానికి చెన్నై ఆకాశవాణి తెలుగు విభాగం అధికారి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ కవితానుశీలన కర్తగా వ్యవహరించారు.దీనికి వై.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, మల్యాది, జేకేరెడ్డి, ఇ.ఎస్. రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రముఖ పురోహిత ద్వయం అశ్వినీ-రోహిణీ శాస్త్రీ తమ పంచాంగ శ్రవణంతో ప్రారంభించారు. మాడభూషి సంపత్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. -
బెంగళూరు హైవేపై లారీ బోల్తా; ఐదుగురు మృతి
బెంగళూరు: నగరంలోని హుబ్లికార్వార హైవేపై గురువారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా, 40మందికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది. లారీ బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన లారీలో 100మంది విద్యార్థులు మదరసా( ఉర్దూ పాఠశాల)కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగ్రాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. -
సబ్సిడీల తగ్గింపునకు మరిన్ని చర్యలు: రంగరాజన్
చెన్నై: సబ్సిడీ భారం తగ్గింపునకు మరిన్ని చర్యలు అవసరమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. ఆయా అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సదరన్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రంగరాజన్ పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును కేంద్రం జీడీపీలో 4.8%కు కట్టడి చేయగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. వస్తువులు, సేవల పన్ను 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచీ అమల్లోకి వస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్ రుణ భారం తగ్గాలి: మాంటెక్ భారత్ రుణ భారం ఐదారు సంవత్సరాల్లో తగ్గాల్సిన అవసరం ఉందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. ఇందుకు సమర్ధవంతమైన ద్రవ్య విధాన బాటను అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పారు.