చనిపోయాడనుకుంటే కోర్టులో ప్రత్యక్షం.. | murder case sensation at madras high court | Sakshi
Sakshi News home page

చనిపోయాడనుకుంటే కోర్టులో ప్రత్యక్షం..

Apr 22 2016 6:19 AM | Updated on Aug 31 2018 8:24 PM

చనిపోయాడనుకుంటే కోర్టులో ప్రత్యక్షం.. - Sakshi

చనిపోయాడనుకుంటే కోర్టులో ప్రత్యక్షం..

హత్యకు గురయ్యాడని అందరూ భావించిన ఓ వ్యక్తి.. తాను బతికే ఉన్నానంటూ కోర్టుకు హాజరైన సంఘటన మద్రాసు హైకోర్టులో గురువారం కలకలం రేపింది.

- మద్రాసు హైకోర్టులో కలకలం
- హత్య కేసు విచారణలో గందరగోళం

సాక్షి, చెన్నై: హత్యకు గురైన వ్యక్తి బతికే ఉన్నానంటూ కోర్టుకు హాజరైన ఘటన మద్రాసు హైకోర్టులో గురువారం కలకలం రేపింది. పోలీసుల కేసు ప్రకారం...తమిళనాడు ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టిలో 2011లో కృష్ణన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి బాలు, రాము తదితర ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేశారు. కృష్ణన్ చనిపోయినట్లుగా పంచాయతీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీచేసింది. ఈ సర్టిఫికెట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

ఆ తరువాత గోవిందస్వామి అనే వ్యక్తి సైతం హత్యకు గురైనట్లుగా మరో డెత్ సర్టిఫికెట్‌ను పోలీసులు దాఖలు చేయడమేగాక, హత్యకు గురైన కృష్ణన్‌ను గోవిందస్వామి హత్యకేసులో సాక్షిగా చేర్చారు. కృష్ణన్ హత్యకేసులో నిందితులకు యావజ్జీవ శిక్షను విధిస్తూ ధర్మపురి సెషన్స్ కోర్టు జనవరిలో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని న్యాయమూర్తులు ఎం.జయచంద్రన్, ఎస్.నాగముత్తుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరపింది. నిందితుల తరపు న్యాయవాది రవిచంద్రన్ కోర్టుకు హాజరై, హత్యకు గురైనట్లుగా భావిస్తున్న కృష్ణన్ బతికే ఉన్నాడని, పోలీసులే ఈ కేసును తప్పుదోవ పట్టించారని వాదించారు.

కృష్ణన్ బతికి ఉన్నట్లయితే కోర్టుకు హాజరుపర్చాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ కేసు గురువారం మళ్లీ విచారణకు రాగా కృష్ణన్ కోర్టుకు హాజరయ్యారు. అతన్ని జడ్జిలు విచారిస్తుండగా, ప్రభుత్వ న్యాయవాది మహారాజా మధ్యలో అడ్డుకుని అతను కృష్ణన్‌కాదు, గోవిందస్వామి, ఇతనిపై ఆంధ్రప్రదేశ్‌లో అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వాదించారు. కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అతని భార్య సైతం వాంగ్మూలం ఇచ్చిందన్నారు. కేసులోని మలుపులతో బిత్తరపోయిన న్యాయమూర్తులు, కోర్టుకు హాజరైన వ్యక్తి ఎవరు, హతులు ఎవరు, ఆత్మహత్య చేసుకున్నవారు ఎవరో తేల్చేందుకు ఐజీ లేదా డీఐజీ స్థాయి పోలీసు అధికారితో విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement