సాక్షి, హైదరాబాద్ : బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుపై సిట్ చేస్తున్న దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయేషా మీరాతోపాటు హాస్టల్‌లో ఉన్న విద్యార్థినుల వాంగ్మూలాన్ని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ‘ఆయేషా హత్య జరిగిన హాస్టల్‌లో 100 మంది ఉన్నారు. అలాంటి చోట ఆయేషాను తల మీద కొట్టి హత్య చేస్తే పక్కనే ఉన్నవాళ్లు ఏమీ మాట్లాడటం లేదంటే అందుకు భయమే కారణం కావచ్చు. ఇప్పుడు సాగుతున్న దర్యాప్తును చూస్తుంటే, గతంలో విచారించిన వాళ్లనే మళ్లీ విచారిస్తున్నట్లు ఉంది. నిష్పాక్షికంగా దర్యాప్తు జరపండి’ అని సిట్‌ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలతో సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న విశాఖ రేంజ్ డీఐజీ సీహెచ్ శ్రీకాంత్‌కు స్పష్టం చేసింది.
తదుపరి విచారణను జూలై 13కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పులో హైకోర్టు ధర్మాసనం నిర్ణయాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేసిందని, దీని ప్రకారం ఈ కేసును పునర్ దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మేల్కోటే, పాత్రికేయురాలు కె.సంజయ, సామాజిక కార్యకర్త వల్లూరుపల్లి సంధ్యారాణి సంయుక్తంగా హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తన కుమార్తె హత్య కేసుపై సిట్ చేసే పునర్ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేని పక్షంలో సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించాలని కోరుతూ శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాష మరో పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment