నయీమ్ హత్యల ‘ఆనవాళ్లు’ లభ్యం!
సాక్షి, హైదరాబాద్: నరహంతకుడు నయీమ్ చేతి లో హత్యకు గురైన అతడి బంధువుల శవాలను పాతిపెట్టిన ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. తన సొంత అక్క భర్త నదీమ్ అలియాస్ విజయ్‌కుమార్, సొంత తమ్ముడు అలీముద్దీన్ భార్య హీనా, అతని కూతురు చియాన్‌లతోపాటు ఇంట్లో పనిచేసే సమీప బంధువు నస్రీన్‌లను నయీమ్ హత్య చేశాడు. అయితే మిస్టరీగా ఉన్న వారి ఆచూకీని సిట్ అధికారులు గుర్తించారు. హత్యకు గురైన వారిని హైదరాబాద్ నగర శివారుల్లోనే పాతిపెట్టినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకున్న వంట మనిషి ఫర్హానా, డ్రైవర్ భార్య అఫ్సా, ఫయీమ్, షాయిన్‌లను సిట్ అధికారులు వరుసగా రెండో రోజు విచారించారు.
పుప్పాలగూడ నివాసంలో హత్యకు గురైన సొంత మనుషుల ఆచూకీపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. హత్యకు గురైన నలుగురు వ్యక్తులను ఎక్కడెక్కడ పాతి పెట్టారనే విషయంలో స్పష్టమైన ఆధారాలు సేకరించారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్.. విచారణ మధ్యలో కాసేపు బయటకు వెళ్లి వారు చెప్పిన ప్రాంతాలను పరిశీలించారు. నలుగురి శవాలను పూడ్చిపెట్టిన ప్రాంతాలను గుర్తించి క్లూస్ టీమ్స్, రెవెన్యూ అధికారులను నార్సింగ్ పోలీసుస్టేషన్‌కు రప్పించారు. గురువారం అర్ధరాత్రి వేళ వెలికి తీయాలని నిర్ణయించారు.
అదో నరక కూపం..
ఇంకా నయీమ్ అరాచకాలేమైనా ఉన్నాయా అనే దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కస్టడీలోకి తీసుకున్న నలుగురు వ్యక్తుల నుంచి నయీమ్ భాగోతాలను వెలికి తీస్తున్నారు. ఇంట్లో పిల్లలతో నయీమ్ వ్యవహరించే తీరు తెలుసుకుని విస్తుపోయారు. నయీమ్ నివాసాలు నరక కూపాలుగా మారినట్లు వెలుగు చూసింది. పిల్లలను నయీమ్ వద్దకు ఎవరు తీసుకొచ్చే వారనే దానిపైనా అధికారులు ఆరా తీశారు.
కుప్పలు, తెప్పలుగా ఆస్తులు
మరోవైపు నయీమ్‌కు సంబంధించిన ఆస్తులు తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.వేల కోట్లు విలువ చేసే ఆస్తులు బయటపడగా.. తాజాగా మరికొన్ని ఆస్తులు బయటపడుతున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో మరో 435 ఎకరాల భూమి వివరాలను నిందితులు విచారణలో వెల్లడించినట్లు తెలి సింది. హైదరాబాద్‌లో మరికొన్ని ఇళ్ల స్థలాల వివరాలు వెలుగు చూశాయి. వీటికి సంబంధించి ఆధారాలను గుర్తించేందుకు సిట్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోనే కాకుండా మరో ఐదు రాష్ట్రాల్లో నయీమ్ అక్రమాస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కస్టడీలో ఉన్న ముఖ్య అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లి గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని నయీమ్ ఆస్తులను గుర్తించాలని నిర్ణయించారు.