ayesha meera
-
ఆయేషా మీరా కేసులో సాక్షుల విచారణ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఆయేషా మీరా హత్య కేసులో పలువురు సాక్షులను సీబీఐ అధికారులు బుధవారం విచారించారు. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. 16 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నేటికీ నిందితులను పట్టుకోలేకపోవడంతో ఆమె తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసును అనేక కోణాల్లో విచారించారు. 2019లో ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయించారు. అసలు నిందితుల కోసం విచారణ వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ఆయేషా మీరా కేసును వాదించిన న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు, తాజాగా ఆయేషా మీరా కేసులో పంచనామా నిర్వహించిన కృష్ణప్రసాద్‌తో పాటు పలువురు సాక్షులను అధికారులు విచారించారు. కేసు విచారణలో తాము ఎప్పుడు పిలిచినా రావాల్సిందిగా అధికారులు సాక్షులకు సూచించారు. -
సత్యంబాబుకు పెళ్లయింది..
సాక్షి, ఖమ్మం: తొమ్మిదేళ్ల క్రితం విజయవాడలో బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసులో జైలు జీవితం గడిపి... నిర్దోషిగా విడుదలైన సత్యం బాబు ఓ ఇంటివాడయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి చర్చిలో శుక్రవారం అతడి వివాహం జరిగింది. అప్పట్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబు సుమారు తొమ్మిదేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. అనంతరం ఆ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇదిలా ఉంటే తిరుమలాయపాలెం మండలం చంద్రతండా చర్చి ఫాదర్ క్రీస్తుదాసు కుమార్తె అనితతో బంధుమిత్రుల సమక్షంలో సత్యంబాబు పెళ్లి జరిగింది. -
ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐ విచారణ వేగవంతం
-
అయేషా హత్య కేసు : ముగ్గురిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసులో విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. కేసు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు ధ్వంసం అయిన అంశంపై పి.కుమారి, పి. వెంకటకుమార్, వై సుబ్బారెడ్డిలపై కేసు నమోదు చేశారు. త్వరలో మరికొందరిపైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయేషా మీరా కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. -
అయేషా మీరా హత్య కేసు: దర్యాప్తు చేపట్టిన సీబీఐ
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయేషా మీరా కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది.ఈ మేరకు కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. మరోసారి సత్యం బాబుతో సహా కేసుతో సంబంధం ఉన్న అందరిని సీబీఐ ప్రశ్నించనుంది. -
అయేషా మీరా కేసులో కీలక మలుపు
హైదరాబాద్: సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అయేషా కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును మొదటి నుంచి విచారణ చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 2007 డిసెంబర్ 26న విజయవాడ నగరం ఇబ్రహీంపట్నంలోని దుర్గ హాస్టల్లో అయేషా మీరాపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో అయేషా మీరా తల్లితో పాటు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి.సిట్ ఇన్వెస్టిగేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు ధర్మాసనం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో శిక్ష అనుభవించిన సత్యంబాబును 2017లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెల్సిందే. అయేషా మీరా కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసం చేసిన విజయవాడ కోర్టు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని సీబీఐకి హైకోర్టులు ఆదేశాలు జారీ చేసింది. -
సహ విద్యార్థినులను ఎందుకు ప్రశ్నించలేదు?
సాక్షి, హైదరాబాద్ : బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుపై సిట్ చేస్తున్న దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయేషా మీరాతోపాటు హాస్టల్లో ఉన్న విద్యార్థినుల వాంగ్మూలాన్ని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ‘ఆయేషా హత్య జరిగిన హాస్టల్లో 100 మంది ఉన్నారు. అలాంటి చోట ఆయేషాను తల మీద కొట్టి హత్య చేస్తే పక్కనే ఉన్నవాళ్లు ఏమీ మాట్లాడటం లేదంటే అందుకు భయమే కారణం కావచ్చు. ఇప్పుడు సాగుతున్న దర్యాప్తును చూస్తుంటే, గతంలో విచారించిన వాళ్లనే మళ్లీ విచారిస్తున్నట్లు ఉంది. నిష్పాక్షికంగా దర్యాప్తు జరపండి’ అని సిట్‌ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలతో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న విశాఖ రేంజ్ డీఐజీ సీహెచ్ శ్రీకాంత్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 13కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పులో హైకోర్టు ధర్మాసనం నిర్ణయాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేసిందని, దీని ప్రకారం ఈ కేసును పునర్ దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మేల్కోటే, పాత్రికేయురాలు కె.సంజయ, సామాజిక కార్యకర్త వల్లూరుపల్లి సంధ్యారాణి సంయుక్తంగా హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తన కుమార్తె హత్య కేసుపై సిట్ చేసే పునర్ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేని పక్షంలో సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించాలని కోరుతూ శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాష మరో పిటిషన్ దాఖలు చేశారు. -
సీఎంను కలిసిన అయేషామీరా తల్లి
అమరావతి: ఆయేషా మీరా తల్లి సీఎం చంద్రబాబును కలిశారు. ఆయేషా మీరా తల్లిని నన్నపనేని రాజకుమారితో కలిసి ఆమె సీఎంను కలిశారు.తమ కుమార్తె హత్యపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.ఆయేషా హత్య కేసులో అరెస్టు అయి ఎనిమిదేళ్లు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సత్యంబాబు ఇటీవల హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలైన విషయం విదితమే