
సాక్షి, హైదరాబాద్: చదివింది ఏడో తరగతి. ఆర్థిక సమస్యలతో 2010లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయాగా చేరింది. తర్వాత ఆస్పత్రికి సూపర్‌వైజర్ అయింది. ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో ఏకంగా వైద్యురాలి అవతారం ఎత్తింది. వైద్యపరంగా కనీస అర్హతల్లేకున్నా గర్భంలోని పిండాన్ని చిదిమేసింది.
ఇదీ సైదాబాద్ డివిజన్ ఐఎస్ సదన్ సింగరేణి కాలనీ లోని గాయత్రి నర్సింగ్ హోంలో జరిగిన దారుణమైన భ్రూణహత్య ఘటనకు పాల్పడ్డ నకిలీ వైద్యురాలు సర్వారి ఉన్నీసా నేపథ్యం. సదరు ఆస్పత్రికి డాక్టర్ రచనా సింగ్ ఠాకూర్ డైరెక్టర్. ఆమె భర్త డాక్టర్ కిరణ్ కుమార్ చౌహాన్ ఎండీ. ఆర్టీసీ ఆస్పత్రిలో పెథాలజీ విభాగంలో రచనాసింగ్‌కు సర్కారీ కొలువు. ప్రైవేటుగా ఆస్పత్రి నిర్వహించేందుకు ఆమెకు చట్టపరంగా అర్హత లేదు. వీరిద్దరి సూచనల మేరకు ఉన్నీసా గర్భశ్రావం చేసింది. ఉన్నీసాకు ఏఎన్‌ఎం ఎన్.శోభ, ఆయా లక్ష్మమ్మ సహకరించారని హైకోర్టుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వ్యాజ్యంలో తెలిపారు. గాయత్రి నర్సింగ్ హోం నిర్వాకంపై అంబర్‌పేటకు చెందిన సందీప్ యాదవ్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.
భ్రూణ హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సుల్తాన్‌బజార్ సహాయ పోలీస్ కమిషనర్ ఎం.చేతనకు అప్పగించామని, మరిన్ని వివరాలకు కొంత సమయం కావాలని సీపీ హైకోర్టును కోరారు. ప్రస్తుతం గాయత్రి నర్సింగ్ హోం మూతపడి ఉందన్నారు. ఆడబిడ్డేనని తెలిసి భ్రూణహత్య చేసినట్లు ఆధారాల్లేవని, గర్భస్రావం ఎవరికి చేశారో గుర్తించలేకపోయినట్లు వివరించారు. పిండాన్ని చిదిమేసిన ఉన్నీసా, రచనా సింగ్, కిరణ్ కుమార్‌లను కూడా అరెస్ట్ చేసినట్లు నివేదించారు. వీరు ముగ్గురూ నేరాన్ని అంగీకరించారని తెలిపారు. కాగా, ఈ కేసులో తమ వాదనను తెలిపేందుకు సమయం కావాలని గాయత్రి నర్సింగ్ హోం తరఫు న్యాయవాది కోరారు. అందుకు ధర్మాసనం అనుమతిస్తూ విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment