సాక్షి, హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ‘కాల్‌డేటా’కలకలం రేపుతోంది. నిందితుల కాల్‌డేటా, పోలీసుల తీరుపై సందేహాలతో ‘సాక్షి’ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. శ్రీనివాస్ హత్య జరిగి 11 రోజులైనా నిందితుల కాల్‌డేటాను విశ్లేషించకపోవడం, కుట్రకు సూత్రధారులను గుర్తించకపోవడంపై ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
తొక్కిపెట్టారా?
శ్రీనివాస్ హత్య జరిగిన మరుసటిరోజు కొంత మందిని అరెస్టు చేయడం, తర్వాతిరోజు మరో ముగ్గురిని కటకటాల్లోని నెట్టడం జరిగింది. అంతటితో కేసు క్లోజ్ అయిందనేలా కథ నడిపించారు. కానీ హత్యకు కుట్ర ఎవరిది, నిందితులు ఎవరి ప్రోద్బలంతో హత్య కు పాల్పడ్డారన్నది పట్టించుకోలేదు. వాస్తవానికి ఏదైనా తీవ్రస్థాయి నేరం జరిగితే.. నిందితులు, వారికి సహకరించినవారు, ఆర్థిక సాయం చేసిన వారు, షెల్టర్ ఇచ్చిన వారు.. ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. నిందితుల ‘కాల్‌డేటా’ను విశ్లేషించి కేసును కుట్ర దగ్గరి నుంచి పెకలించాల్సి ఉంటుంది.
కానీ నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు సంబంధించి పోలీసులు ఈ తరహా చర్యలేవీ చేపట్టకపోవడంపై అటు రాజకీయవర్గాల్లో, ఇటు పోలీసువర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాల్‌డేటాను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో.. దర్యాప్తు అధికారుల్లో వణుకు మొదలైందని, అందుకే పారిపోవడం దాకా వెళ్లిందని చర్చ జరుగుతోంది. అయితే కాల్‌డేటాను బయటకు రాకుండా చేసిందెవరు, ఎస్పీతో పాటు డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లపై ఒత్తిళ్లు పనిచేశాయి, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా దీని వెనుక అధికార పార్టీ నేతలున్నారా.. అన్న అనుమానాలు వస్తున్నాయి.
ఈ ప్రెస్‌నోట్ అర్థమేంటి?
శ్రీనివాస్ హత్య కేసు నిందితుల ఫోన్‌కాల్ డేటాలో ఉన్న అనుమానితులను విచారిస్తామని, వారు కుట్ర లో భాగస్వాములైతే అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి, నిందితులను లోతుగా విచారిస్తామని అందులో తెలిపారు. ఇక ఈ కేసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన విచారణ, దర్యాప్తు అంతా డొల్లేనని పరోక్షం గా అంగీకరించినట్లేనా అన్న విమర్శ వస్తోంది. ఇక ఎస్పీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన సంతకం లేకపోవడంపైనా చర్చ జరుగుతోంది.
ఐజీ స్టీఫెన్ రవీంద్ర చేతికి..!
ఉన్నతాధికారులు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును ఐజీ స్టీఫెన్ రవీంద్ర చేతికి అప్పగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్పీ, ఇతర అధికారులు ఈ కేసు దర్యాప్తును గందరగోళంలో పడేయడంతో.. పారదర్శకంగా దర్యాప్తు చేసేలా ఈ చర్య చేపట్టినట్లు సమాచారం.
అసలేం జరుగుతోంది?
నల్లగొండ జిల్లాలో ఇటీవలే వరుసగా రెండు హత్యలు, వాటి దర్యాప్తులో పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపై పోలీసువర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు శాఖ ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతుంటే.. జిల్లాల్లో అధికారుల తీరు అందుకు భిన్నంగా పోలీసు శాఖ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా కనిపిస్తోందని వ్యాఖ్యలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment