సాక్షి, హైదరాబాద్: ఒక హత్య.. అనేక అనుమానాలు.. మరెన్నో ఆరోపణలు.. తూతూమంత్రంగా పోలీసుల దర్యాప్తు.. ఇలా రాష్ట్రంలో సంచలనం రేపిన నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యోదంతం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులతో నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులు వేముల సుధీర్, వేముల రంజిత్‌లు మాట్లాడిన కాల్‌డేటా శనివారం బయటపడింది. హత్య జరిగిన రోజున ఉదయం నుంచి వారు తరచూ ఫోన్‌లో మాట్లాడారని, ఘటన సమయంలోనూ ఫోన్‌కాల్స్ వెళ్లాయని వెల్లడైంది.
ఎమ్మెల్యే వీరేశం ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఈ పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగి 11 రోజులైనా పోలీసులు తగిన విధంగా ఎందుకు స్పందించడం లేదని, నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడం లేదెందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిమిష నిమిషానికీ అప్‌డేట్!
జనవరి 24వ తేదీ అర్ధరాత్రి 11:50–12:10 గంటల సమయంలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగింది. నిందితులు రాంబాబు, మల్లేశ్ ఇద్దరూ ఆ రోజున ఉదయం నుంచి వేముల రంజిత్, వేముల సుధీర్‌లతో టచ్‌లో ఉన్నట్టు వారి ఫోన్ కాల్‌డేటా పరిశీలనలో బయటపడింది. ఆ రోజున రాత్రి 7.45 గంటల సమయంలో మిర్చి బండి వద్ద జరిగిన గొడవ నుంచి శ్రీనివాస్ హత్య వరకు నిందితులు ప్రతి విషయాన్నీ సుధీర్, రంజిత్‌లకు ఫోన్‌లో వివరించినట్లు కాల్‌డేటా ప్రకారం స్పష్టమవుతోంది. వీరితోపాటు సుధీర్ స్నేహితుడు సంపత్, విష్ణు అనే మరో వ్యక్తితో సైతం నిందితులు మాట్లాడినట్టు కాల్‌డేటాలో వెల్లడైంది.
నిందితుల కాల్‌డేటా ప్రకారం..
జనవరి 24వ తేదీన రాత్రి 10:18 గంటలకు మల్లేశ్ ఫోన్ (9533423191)కు సుధీర్ ఫోన్ (7013863277) నుంచి కాల్ వచ్చింది. 39 సెకన్ల పాటు మాట్లాడుకున్నారు. సుధీర్ స్నేహితుడు సంపత్ (9966449992) నుంచి 10:20 గంటల సమయంలో మల్లేశ్‌కు ఫోన్ వచ్చింది. 16 సెకన్లు మాట్లాడుకున్నారు. అనంతరం ఈ కేసులో ఏ2గా ఉన్న రాంబాబు (9885056608) నుంచి మల్లేశ్‌కు కాల్ వచ్చింది. 34 సెకన్ల పాటు మాట్లాడుకున్నారు. తర్వాత మల్లేశ్ మరో నాలుగు నంబర్లకు కాల్ చేసి మాట్లాడాడు. అనంతరం హత్య జరగడానికి ముందు 10:59 గంటలకు విష్ణుతో, తర్వాత 11:23 గంటలకు సంపత్‌తో మాట్లాడాడు. ఇక 12:12 గంటలకు మల్లేశ్ విష్ణుతో మాట్లాడగా.. వెంటనే సంపత్ నుంచి, తర్వాత వేముల సుధీర్ నుంచి మల్లేశ్‌కు ఫోన్ కాల్స్ వచ్చాయి.
సుధీర్‌తో 21 సెకన్ల పాటు మాట్లాడిన మల్లేశ్.. శ్రీనివాస్ హత్య విషయాన్ని సుధీర్‌కు చెప్పినట్టు తెలిసింది. ఇక హత్య జరిగాక మరుసటి రోజు (జనవరి 25న) ఉదయం మల్లేశ్‌కు 9160228753, 8897647058, 8639052004, 9052525213, 9490825164, 96421841184 ఫోన్ నంబర్ల నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. ఇవన్నీ ఉదయం 7:25 గంటల నుంచి 7:27 గంటల మధ్య రెండు నిమిషాల వ్యవధిలోనే వచ్చాయి. ఇదే సమయంలో 7:26 గంటలకు వేముల రంజిత్ నుంచి మల్లేశ్‌కు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే మల్లేశ్ 8897647058 నంబర్‌కు ఫోన్ చేసి 25 సెకన్ల పాటు మాట్లాడాడు. ఆ రోజున ఉదయం 7 గంటల సమయం నుంచి మల్లేశ్ నకిరేకల్‌లోని పన్నాలగూడెంలో ఉన్నట్టు సెల్‌ఫోన్ లొకేషన్ డేటాలో బయటపడింది.
అంతకు రెండు రోజుల ముందు..
ఎమ్మెల్యే వేముల వీరేశం, వేముల రంజిత్‌ల మధ్య జనవరి 22 వరకు ఫోన్‌కాల్ సంభాషణలు, ఎస్సెమ్మెస్‌లు ఉన్నట్టు కాల్‌డేటాలో పోలీసులు గుర్తించారు. ఆ రోజున మధ్యాహ్నం 1:30 గంటలకు వారి మధ్య చివరి ఫోన్‌కాల్ ఉన్నట్టు బయటపడింది. మరోవైపు ఈ హత్య కేసులో మరో నిందితుడిగా ఉన్న చింతకుంట్ల రాంబాబుకు వేముల రంజిత్, మేరుగు గోపి, విష్ణుల మధ్య ఫోన్‌కాల్స్ వెళ్లినట్లు కాల్‌డేటాలో బయటపడింది. హత్య జరిగిన రోజు రాత్రి 9:27 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7:30 గంటల వరకు వారి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు.
ఆద్యంతం అనుమానాలే..!
ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టినప్పటి నుంచీ పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన రోజు రాత్రి 7:45 గంటల సమయంలో మిర్చి బండి దగ్గర గొడవ జరిగింది. దీంతో మిర్చి బండి యజమాని యాదయ్య నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని, అప్పుడే పోలీసులు వస్తే తన భర్త హత్య జరిగేది కాదని బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య, నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి పేర్కొన్నారు.
– వాస్తవానికి మేరుగు గోపి, ఇతరులు ఘర్షణ పడుతున్నట్టు బొడ్డుపల్లి శ్రీనివాస్‌కు తెలిసింది. దీంతో శ్రీనివాస్ తన అనుచరుడు మోహన్‌తో కలసి బైక్‌పై అక్కడికి వెళ్లారు. తర్వాత చాలాసేపైనా శ్రీనివాస్ ఇంటికి రాకపోవడంతో భార్య లక్ష్మి వెళ్లి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త కనిపించడం లేదని, మోహన్ ఫోన్ లిప్ట్ చేయడం లేదని పోలీసులకు చెప్పారు. అయితే అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న మోహన్.. శ్రీనివాస్ హత్యకు గురైనట్లు చెప్పాడు. దాంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూశారు.
– తన భర్త ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదు చేయడానికి లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాతే హత్య విషయం ఆమెకు తెలిసింది. కానీ పోలీసులు మాత్రం.. శ్రీనివాస్ హత్యకు గురైనట్లుగా ఆయన భార్య లక్ష్మి తమకు సమాచారమిచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. అంతేకాదు లక్ష్మి వాంగ్మూలం కూడా ఇప్పటివరకు తీసుకోలేదు. దీనితో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లుపై ఒత్తిళ్లు?
శ్రీనివాస్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న నల్లగొండ టూటౌన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. మాడుగుల పోలీస్‌స్టేషన్‌లో తన పిస్టల్, పోలీసు సిమ్‌కార్డు అప్పగించి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. ఆయన గుంటూరులోని ఓ రిసార్ట్‌లో శనివారం గుర్తించారు. అయితే ఇన్‌స్పెక్టర్ అదృశ్యం వెనక ఉన్న శక్తులు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్‌స్పెక్టర్‌పై తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయంటూ నల్లగొండ పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో హత్య కేసు నిందితులతో ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులు సంభాషించినట్టు బయటపడింది. కానీ వారిని అరెస్టు చేయకుండా ఇన్‌స్పెక్టర్‌పై ఒత్తిళ్లు వచ్చాయని.. మరోవైపు దర్యాప్తు తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో తాను ఉద్యోగం చేయలేనంటూ ఇన్‌స్పెక్టర్ అదృశ్యమైనట్టు చర్చించుకుంటున్నారు.
వారిని ఎందుకు విచారించడం లేదు?
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులైన రాంబాబు, మల్లేశ్‌లతో వేముల సుధీర్, వేముల రంజిత్, వారి స్నేహితులు విష్ణు, సంపత్ తరచూ మాట్లాడినట్లు కాల్‌డేటాలో వెల్లడైంది. హత్య జరిగిన సమయంలో, ముందు, తర్వాత కూడా సంభాషణలు జరిగాయి. వారిపై అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో వీరందరినీ కూడా పోలీసులు ప్రశ్నించాల్సి ఉంది. కానీ విచారించలేదు. కేవలం వేముల రంజిత్‌ను మాత్రమే, అది కూడా ఫోన్ చేసి వివరణ అడిగారు. న్యాయ సలహా, బెయిల్ విషయంపై మల్లేశ్ తనకు కాల్ చేసినట్లు రంజిత్ పోలీసులకు చెప్పారు. మరి అంతకు ముందు జరిగిన సంభాషణల సంగతేమిటని పోలీసులు విచారించలేదేమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కస్టడీ ఎందుకు కోరలేదు?
ఒక ప్రజాప్రతినిధి భర్త, చాలాఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగితే... పోలీసులు ఇప్పటికీ నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే సందేహాలు వస్తున్నాయి. జనవరి 24న రాత్రి హత్య జరిగితే.. ఇప్పటివరకు నిందితులను కస్టడీలోకి తీసుకోలేదు. ఇక 11 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో.. నిందితులు మహేశ్, దాములూరి సతీశ్, సాయి, మేరుగు గోపి, మాతంగి మోహన్, శ్రీకాంత్‌లకు బెయిల్ వచ్చింది. వారి బెయిల్‌ను రద్దు చేయాలని గానీ, మిగతా వారిని కస్టడీకి ఇవ్వాలనిగానీ పోలీసులు కోర్టును కోరకపోవడంపైనా అనుమానాలు వస్తున్నాయని శ్రీనివాస్ భార్య లక్ష్మి పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా ఉచ్చు బిగిసేనా?
కాల్‌డేటా ఆధారంగా వ్యవహారం బయటపడడంతో ఎమ్మెల్యే వీరేశం అన్న కుమారులిద్దరి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు వేగం పెంచుతున్నట్టు తెలిసింది. లక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో పోలీసు శాఖపై ఒత్తిడి పెరిగింది. వేముల సుధీర్, వేముల రంజిత్‌లతోపాటు విష్ణు, సంపత్‌లను విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కేసు దర్యాప్తు అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు.. ఈ దర్యాప్తు అధికారులతోపాటు జిల్లా ఎస్పీపై వేటు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment