మృతుడు డాగీ ప్రేమ్ (17)
హైదరాబాద్: పనీపాటా లేకుండా జులాయిగా తిరిగాడు.. వాయిదా పద్ధతిలో కొన్న బైక్‌కు డబ్బు కట్టలేక అందరి వద్ద అప్పులు చేశాడు.. ఆ అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఖరీదైన ఫోన్‌ను కొట్టేయాలని ప్లాన్ వేశాడు.. అక్కడితో ఆగకుండా నమ్మి వెంట వచ్చిన స్నేహితుడిని కర్రతో బాది.. పెట్రోలు పోసి నిప్పంటించి కాల్చివేశాడు!! గత శుక్రవారం నమోదైన మిస్సింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన డాగీ ప్రేమ్‌ను అదే ప్రాంతానికి చెందిన ప్రేమ్‌సాగర్ హత మార్చినట్లు గుర్తించారు. నిందితుడి బైక్, హత్యకు వాడిని కర్ర, కొట్టేసిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రేమ్‌సాగర్‌ను న్యాయ స్ధానంలో హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావుతో కలిసి డీసీపీ ఉమా మహేశ్వరశర్మ వెల్లడించారు.
సెల్‌ఫోన్ కొట్టేయాలని...
పాత రామంతాపూర్‌లో నివాసముంటున్న టైలర్ డాగీ సురేశ్‌కు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు డాగీ ప్రేమ్ (17) షిప్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ స్థానిక అంబేడ్కర్ సేవా సమితి కమ్యూనిటీ హాల్‌లో ఉంటున్నాడు. కమ్యూనిటీ హాల్‌కు ఎదురుగా ఉన్న డాగీ ప్రేమ్‌తో ఇతడికి స్నేహం కుదరింది. గతంలో అమెజాన్ డెలీవరీ బాయ్‌గా పనిచేసి మానేసిన ప్రేమ్‌సాగర్.. ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల వాయిదాల పద్ధతిలో కోనుగోలు చేసిన ద్విచక్రవాహనానికి సకాలంలో డబ్బులు కట్టలేక స్నేహితుల వద్ద అప్పు తీసుకొని చెల్లిస్తున్నాడు. ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో డాగీ ప్రేమ్ సెల్‌ఫోన్‌ను కొట్టేసి.. అప్పులు తీర్చాలని భావించాడు. ఈ క్రమంలో ఈ నెల 13న సాయంత్రం ఔటర్ రింగ్‌రోడ్డుపై జాలీగా స్నేహితుల కార్లలో తిరుగుదామని ప్రేమ్‌ను నమ్మించాడు. దీంతో ప్రేమ్ రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో క్రికెట్ ఆడేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు.
కర్రతో బాది.. పెట్రోల్ పోసి నిప్పంటించి..
ప్రేమ్‌సాగర్ తన బైక్ (టీఎస్08 ఈఎన్ 1874)పై ప్రేమ్‌ను తీసుకెళ్లాడు. వెంట ఓ కర్ర ఉండటంతో ఎందుకని ప్రశ్నించిన ప్రేమ్‌కు బండి టైర్ బురద తీయనడానికని చెప్పాడు. తర్వాత నాదర్‌గూల్ గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్‌లో రెండు బాటిల్స్‌లో పెట్రోల్ పోయించుకున్నాడు. ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డు వండర్‌లా ప్రధాన రహదారి వద్ద బైక్‌ను ఆపి తన స్నేహితుడిని కలుద్దామంటూ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన ప్రేమ్ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావని గట్టిగా ప్రశ్నించాడు. స్నేహితులంతా ఇక్కడికే వస్తారంటూ మాటల్లో పెట్టి కర్రతో మెడమీద పదేపదే కొట్టడంతో ప్రేమ్ స్పృహ తప్పి కిందపడ్డాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ప్రేమ్‌పై పోసి నిప్పంటించాడు. వెంటనే ప్రేమ్ సెల్‌ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి రామంతాపూర్‌కు వచ్చాడు.
అయితే ఒక్కడే తిరిగి రావడంతో తమ కొడుకు ఎక్కడని ప్రేమ్ తల్లిదండ్రులు ప్రేమ్‌సాగర్‌ను ప్రశ్నించగా.. రామంతాపూర్‌లోనే వదిలేశానని అతడు సమాధానమిచ్చాడు. రెండు రోజులైనా కుమారుడు తిరిగి రాకపోవడంతో ప్రేమ్ తండ్రి సురేశ్.. ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రేమ్ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆదిభట్లలో ఉన్న మృతదేహన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ప్రేమ్‌సాగర్ తన కుమారుడిని తీసుకెళ్లాడంటూ మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. దీంతోపాటు ప్రేమ్ కాల్‌డేటా ఆధారంగా ఎదులాబాద్‌లో ఉన్న నిందితుడు ప్రేమ్‌సాగర్‌ను పోలీసులు పట్టుకున్నారు. రోజంతా విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. చివరకు ఆ నేరాన్ని సెల్‌ఫోన్ కోసమే చేశానని ఒప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment