cell phones
-
కూతురు పుట్టిందని.. సెల్ఫోన్లు పంచిపెట్టారు!
సారంగాపూర్: కూతురు పుట్టడంతో.. మహాలక్ష్మి పుట్టిందని ఆ దంపతులు సంబరపడ్డారు. తమ సంతోషాన్ని పదిమందితో పంచుకోవాలని సంకల్పించారు. ఈ మేరకు వారు సోమవారం గ్రామంలోని 25 మంది ఆటో డ్రైవర్లకు రూ.3.5 లక్షల విలువ చేసే సెల్ఫోన్లు బహూకరించారు. మరో 1,500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దీనికి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ వేదికగా మారింది. గ్రామానికి చెందిన ఓగుల అజయ్, అనీల దంపతులకు 18 రోజుల క్రితం కూతురు జన్మించింది. దీంతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆ సంతోషంతో గ్రామంలోని ప్రతి ఆడబిడ్డకు (1,500 మంది మహిళలకు) ఇటీవల చీరలు పంపిణీ చేశారు. తాజాగా ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కటి రూ.14 వేల విలువైన సెల్‌ఫోన్ అందజేశారు.అజయ్ పెళ్లికి ముందు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.30 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. తరువాత స్వదేశానికి వచ్చిన ఆయన.. శ్రీకృష్ణ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువుకు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, ఆలయాల నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. చదవండి: ఒక్కరే టీచర్.. ఇద్దరు విద్యార్థులు -
విద్యార్థి ప్రాణం తీసిన పబ్జీ?
ఘంటసాల (అవనిగడ్డ): పరీక్షలు దగ్గర పడుతున్నందున సెల్ఫోన్లో పబ్జీ గేమ్‌కు దూరంగా ఉండాలంటూ తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం గ్రామానికి చెందిన తమ్మనబోయిన భీమరాజు, విజయనాగిని దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీపక్‌సాయి (15) శ్రీకాకుళం హైస్కూల్లో పదో తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు కళ్యాణ్ ఇదే హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో దీపక్‌సాయి చాలాబాగా చదువుతూ ఉండేవాడు. అయితే సెల్ఫోన్లో పబ్జీ గేమ్‌ను విపరీతంగా ఆడేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా అదే పనిలో ఉండేవాడు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో తల్లిదండ్రులు సెల్‌ఫోన్ వాడవద్దని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన దీపక్‌సాయి కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు. భోజనం చేసి తిరిగి ట్యూషన్‌కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. రాత్రి హైస్కూల్ వెనుక నుంచి లోపలికి ప్రవేశించి ప్రాంగణంలోని స్టేజీ పక్కనే ఉన్న భవనం రెండో అంతస్తు పిల్లర్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. శనివారం ఉదయం హైస్కూల్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన ఆయా.. విద్యార్థి మృతదేహాన్ని చూసి భయంతో హెచ్ఎంకు, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ బి.వెంకటేశ్వరరావు, చల్లపల్లి సీఐ ఎంవీ నారాయణ, సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
మీ దగ్గరున్న సెల్ఫోన్లు నేనిచ్చినవే
సాక్షి, పుట్టపర్తి అర్బన్: ‘‘మీ దగ్గర ఉన్న సెల్ఫోన్లు నేనిచ్చినవే...హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా.. బంగారు గుడ్లు పెట్టే విధంగా చేశాను..35 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు...జేబులోనుంచి రూపాయి కూడా ఖర్చు చేయకుండా అమరావతిని నిర్మించా..మీరంతా అండగా ఉండి ఆశీర్వదిస్తే అమరావతిని అభివృద్ధి బాట పడిస్తా’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగలో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని నమ్మక ద్రోహం చేశారన్నారు. రూ.లక్ష కోట్లు కొట్టేసిన మోదీ...మన వాటా ఇవ్వకుండా రూ.500 కోట్ల భిక్షం వేశానంటున్నారు. నాకు అవసరం లేదు...కావాలంటే నేనే ఆయనకు రూ.500 కోట్లు భిక్షం వేస్తానన్నారు. ఇక మన లా అండ్ ఆర్డర్‌పై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. 24 గంటలు కష్ట పడతానని...సంపద సృష్టించి చూపుతాన్నారు. పుట్టపర్తిని తీర్చిదిద్దుతా రాబోయే రోజుల్లో పుట్టపర్తిని బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 139 చెరువులకు నీళ్లు పారిస్తానంటూ గతంలో ఇచ్చిన హామీలే మళ్లీ ఇచ్చారు. బుక్కపట్నం చెరువు ముంపు భూములకు పరిహారం ఇస్తామన్నారు. పుట్టపర్తిలో జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయిస్తానన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని బ్రాహ్మణులకు, వడ్డెరలకు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప, పుట్టపర్తి నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాగా ఉదయం 10 గంటలకు పుట్టపర్తికి చేరుకోవాల్సిన సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 1 గంటకు రాగా జనం వేచి చూస్తూ అలసిపోయారు. -
సెల్‌ఫోన్ కోసమే నేరం చేశాను!
హైదరాబాద్: పనీపాటా లేకుండా జులాయిగా తిరిగాడు.. వాయిదా పద్ధతిలో కొన్న బైక్‌కు డబ్బు కట్టలేక అందరి వద్ద అప్పులు చేశాడు.. ఆ అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఖరీదైన ఫోన్‌ను కొట్టేయాలని ప్లాన్ వేశాడు.. అక్కడితో ఆగకుండా నమ్మి వెంట వచ్చిన స్నేహితుడిని కర్రతో బాది.. పెట్రోలు పోసి నిప్పంటించి కాల్చివేశాడు!! గత శుక్రవారం నమోదైన మిస్సింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన డాగీ ప్రేమ్‌ను అదే ప్రాంతానికి చెందిన ప్రేమ్‌సాగర్ హత మార్చినట్లు గుర్తించారు. నిందితుడి బైక్, హత్యకు వాడిని కర్ర, కొట్టేసిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రేమ్‌సాగర్‌ను న్యాయ స్ధానంలో హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావుతో కలిసి డీసీపీ ఉమా మహేశ్వరశర్మ వెల్లడించారు. సెల్‌ఫోన్ కొట్టేయాలని... పాత రామంతాపూర్‌లో నివాసముంటున్న టైలర్ డాగీ సురేశ్‌కు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు డాగీ ప్రేమ్ (17) షిప్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ స్థానిక అంబేడ్కర్ సేవా సమితి కమ్యూనిటీ హాల్లో ఉంటున్నాడు. కమ్యూనిటీ హాల్‌కు ఎదురుగా ఉన్న డాగీ ప్రేమ్‌తో ఇతడికి స్నేహం కుదరింది. గతంలో అమెజాన్ డెలీవరీ బాయ్‌గా పనిచేసి మానేసిన ప్రేమ్‌సాగర్.. ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల వాయిదాల పద్ధతిలో కోనుగోలు చేసిన ద్విచక్రవాహనానికి సకాలంలో డబ్బులు కట్టలేక స్నేహితుల వద్ద అప్పు తీసుకొని చెల్లిస్తున్నాడు. ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో డాగీ ప్రేమ్ సెల్‌ఫోన్‌ను కొట్టేసి.. అప్పులు తీర్చాలని భావించాడు. ఈ క్రమంలో ఈ నెల 13న సాయంత్రం ఔటర్ రింగ్‌రోడ్డుపై జాలీగా స్నేహితుల కార్లలో తిరుగుదామని ప్రేమ్‌ను నమ్మించాడు. దీంతో ప్రేమ్ రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో క్రికెట్ ఆడేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. కర్రతో బాది.. పెట్రోల్ పోసి నిప్పంటించి.. ప్రేమ్‌సాగర్ తన బైక్ (టీఎస్08 ఈఎన్ 1874)పై ప్రేమ్‌ను తీసుకెళ్లాడు. వెంట ఓ కర్ర ఉండటంతో ఎందుకని ప్రశ్నించిన ప్రేమ్‌కు బండి టైర్ బురద తీయనడానికని చెప్పాడు. తర్వాత నాదర్‌గూల్ గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్‌లో రెండు బాటిల్స్‌లో పెట్రోల్ పోయించుకున్నాడు. ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డు వండర్లా ప్రధాన రహదారి వద్ద బైక్‌ను ఆపి తన స్నేహితుడిని కలుద్దామంటూ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన ప్రేమ్ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావని గట్టిగా ప్రశ్నించాడు. స్నేహితులంతా ఇక్కడికే వస్తారంటూ మాటల్లో పెట్టి కర్రతో మెడమీద పదేపదే కొట్టడంతో ప్రేమ్ స్పృహ తప్పి కిందపడ్డాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ప్రేమ్‌పై పోసి నిప్పంటించాడు. వెంటనే ప్రేమ్ సెల్‌ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి రామంతాపూర్‌కు వచ్చాడు. అయితే ఒక్కడే తిరిగి రావడంతో తమ కొడుకు ఎక్కడని ప్రేమ్ తల్లిదండ్రులు ప్రేమ్‌సాగర్‌ను ప్రశ్నించగా.. రామంతాపూర్‌లోనే వదిలేశానని అతడు సమాధానమిచ్చాడు. రెండు రోజులైనా కుమారుడు తిరిగి రాకపోవడంతో ప్రేమ్ తండ్రి సురేశ్.. ఉప్పల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రేమ్ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆదిభట్లలో ఉన్న మృతదేహన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ప్రేమ్‌సాగర్ తన కుమారుడిని తీసుకెళ్లాడంటూ మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. దీంతోపాటు ప్రేమ్ కాల్‌డేటా ఆధారంగా ఎదులాబాద్‌లో ఉన్న నిందితుడు ప్రేమ్‌సాగర్‌ను పోలీసులు పట్టుకున్నారు. రోజంతా విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. చివరకు ఆ నేరాన్ని సెల్‌ఫోన్ కోసమే చేశానని ఒప్పుకున్నాడు. -
మీకు గుడ్ మార్నింగ్..ఫోన్‌కు బ్యాడ్ మార్నింగ్!
గుడ్‌మార్నింగ్.. శుభోదయం.. సుప్రభాత్.. కాలే వణక్కం.. ఏ భాషలో చెబితేనేం..ఉదయాన్నే ఫోన్లలో పలకరించే ఈ గుడ్‌మార్నింగ్ మెసేజ్‌లే.. మన ఫోన్‌కు బ్యాడ్మార్నింగ్గా మారుతున్నాయట. ఎలాగంటే.. లో స్టోరేజ్ స్పేస్’.. మనం ఎన్నిసార్లు ఈ మెసేజ్ చూసుంటాం. దీనికంతటికీ కారణం.. ఆ గుడ్‌మార్నింగే!! మన దేశంలోని ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒక ఫోన్ ఈ పరిస్థితి ఎదుర్కొంటోందని డేటా స్టోరేజీ సంస్థ వెస్ట్రన్ డిజిటల్ కార్పొరేషన్ తేల్చింది. అదే అమెరికాలో ప్రతి పది ఫోన్లలో ఒకదాని పరిస్థితి ఇలా ఉంది. పైగా.. ఈ శుభోదయం సందేశాన్ని మామూలుగా కాకుండా.. ఒక మంచి ఫొటో, పెయింటింగ్, ఒక ప్రముఖుడి కొటేషనో, మరికొన్ని కొత్త పద్ధతులను అనుసరిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని గూగుల్ పరిశోధనలోనూ వెల్లడైంది. ఈ మెసేజ్‌లు సూర్యోదయానికి ముందు మొదలై పొద్దున 8 గంటలకు పీక్కు చేరుకుంటున్నాయి. ఫేస్బుక్ సంస్థకు చెందిన వాట్సాప్ మెసేజింగ్ సర్వీస్‌ను దేశంలో 20 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. తమ కాంటాక్ట్ లిస్ట్ లోని వారందరికీ ఒకేసారి గుడ్‌మార్నింగ్ మెసేజ్‌ను పంపించేందుకు వీలు గా ఈ సంస్థ ఒక కొత్త స్టేటస్ మెసేజ్‌ను జోడించింది. అంతే.. ఒకేసారి వం దల మందికి మెసేజ్‌లు వెళ్లిపోతున్నాయి. మొన్నటికి మొన్న.. ఇంటర్నెట్ జామ్ అయిపోతుందా అన్న స్థాయిలో పీక్కు చేరింది. న్యూఇయర్ సందర్భంగా 2 వేల కోట్లకు పైగా నూతన సంవత్సర సందేశాలు పంపించారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదో రికార్డుగా భావిస్తున్నారు. పరిష్కారం ఇదిగో.. ఈ మెసేజింగ్ సమస్యకు పరిష్కారాన్ని కూడా గూగుల్ కనుక్కుంది. ‘ఫైల్స్గో’ అనే కొత్త యాప్ ద్వారా ఆయా ఫైల్స్‌ను తొలగించేందుకు, గుడ్‌మార్నింగ్ సందేశాలను డిలీట్ చేసేందుకు ఒక ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫీ షియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ మెసేజ్‌లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గత డిసెంబర్లో ఢిల్లీలో ఈ యాప్‌ను గూగుల్ ఆవిష్కరించింది. -
చేతుల్లో ఫోన్లు.. చేవలేని సేవలు!
అమెరికాలో వాహనాల వేగానికి సంబంధించి 1970లో ఓ పుస్తకం విడుదలైంది. ‘‘వేగమెంతైనా రక్షణ లేదు’’ అనే పేరుతో వినియోగదారుల హక్కుల నేత రాల్ఫ్‌నాడార్ రాసిన ఈ పుస్తకం... ఆటోమొబైల్ రంగంపై చేసిన దారుణమైన విమర్శ. ఆ తరవాత నాటి ప్రపంచ అతిపెద్ద టెలిఫోన్ కంపెనీ ఏటీ అండ్ టీపై కె. ఆబ్రే స్టోన్ ఓ పుస్తకం రాశారు. ‘‘సారీ! మీ గుత్తాధిపత్యం ఇక నడవదు’’ అంటూ ఆయన రాసిన పుస్తకం ఏటీ అండ్ టీకి చెంపపెట్టు. అది చూశాక మన టెలిఫోన్లు, టెలికం విభాగం పని తీరును వివరిస్తూ ‘‘ఏ అవసరమూ తీరుతుందన్న నమ్మకం లేదు’’ అని నేను రాశాను. సేవల్లో నాణ్యత దిగజారటానికి గుత్తాధిపత్యమే కారణమని దాన్లో పేర్కొన్నా... తరవాత గుత్తాధిపత్యానికి రోజులు చెల్లి, టెలికం సేవల్లోకి ప్రైవేటు రంగ కంపెనీలు ప్రవేశించాయి. నియంత్రిత పోటీ మొదలైంది. దీని పరిణామమే మనందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు. అవికూడా... దాదాపు 120 కోట్లు. కాకపోతే ఇపుడు వారాలు గడుస్తున్న కొద్దీ మొబైల్ టెలిఫోన్ సేవలు దిగజారిపోతున్నాయి. కాల్‌డ్రాప్‌లు నిత్యకృత్యమయ్యాయి. ‘‘క్షమించాలి! మీరు ప్రయత్నిస్తున్న ఫోను మా సర్వీసు ఏరియాలో లేదు. మేం ఎస్ఎంఎస్ పంపిస్తాం’’ అనేది తరచూ వింటున్నాం. కొన్నిసార్లు ‘‘మీరు ప్రయత్నిస్తున్న నంబరు అందుబాటులో లేదు’’ అనేదీ వినిపిస్తోంది. చిత్రమేంటంటే ఇలాంటి సందేశాలు మనం ఎప్పుడు, ఎక్కడ వినాల్సి వస్తుందనేది ఊహించలేం. సెల్‌ఫోన్ సేవలు ఏ అవసరాన్నీ తీరుస్తాయనే నమ్మకం లేదనుకోవటానికి కారణాలివే. విపరీతమైన పోటీ, క్రియాశీలమైన నియంత్రణ ఉన్నా ఇలా జరుగుతోంది మరి!!. మనక్కావాల్సిందల్లా ఏ అవసరాన్నయినా తీర్చగలిగే సెల్‌ఫోన్ సేవలు. అవి తీరుస్తాయనే నమ్మకం. దీన్ని కలిగించాలంటే కంపెనీలు చిత్తశుద్ధితో మరింత కృషి చేయాల్సి ఉంది. -
ఆడపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వద్దట..
మోరల్ పోలిసింగ్ అంటూ ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలకు వెళ్లే పాఠశాలలకు వెళ్లే బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా వాటిపై నిషేదం విధించాలంటూ అలీఘర్ మేయర్ శకుంతల భారతి, ఎమ్మెల్యే సంజీవ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెల్ఫోన్ల వాడకంతో బాలికలు రాంగ్ డైరెక్షన్లో వెళతారంటూ వ్యాఖ్యానించారు. మొబైల్ ఫోన్లు చేతికిస్తే లేనిపోని సంఘటనలకు దారి తీయడంతో పాటు, కలవకూడని వారిని కలిసే అవకాశం ఉందని అన్నారు. అసలు బాలికలకు సెల్ఫోన్ల అవసరం ఏంటని, వాటితో వీరికి ఏంపని అని ప్రశ్నిస్తూ..తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదని సూచనలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ రాజా ఓ అడుగు ముందుకు వేసి బాలికలకు సెల్ ఫోన్ల అవసరం లేదని అన్నారు. సెల్ఫోన్ల వల్ల లాభాలు ఉన్నప్పటికీ పాఠశాల వెళ్తున్న బాలికలకు మొబైల్ ఫోన్లు అవసరం లేదన్నారు. ఈ చర్యకు తాను మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో సెల్ఫోన్ల వినియోగాన్ని నిషేధించారని, ఈసారి తాము కూడా ఈ పద్ధతిని కచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అంతేకాకుండా మహిళలు, యువతులు వాహనాలపై వెళ్లేటప్పుడు ముఖాలకు స్కార్ఫ్ కప్పుకోవడాన్ని కూడా ఎమ్మెల్యే సంజీవ్ రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలికలు, యువతులు తమ ముఖాలను వస్త్రాలతో కప్పుకోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని అన్నారు. కాగా గతంలో మధ్యప్రదేశ్‌లోని సత్నాలో కూడా అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని బయట కనబడితే పోలీసులకు అప్పగిస్తామంటూ అప్పటి మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే అమ్మాయిలెవరైనా ముఖంపై ముసుగుతో కనపడితే సత్నా మున్సిపల్ కార్పొరేషన్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ రాజా కూడా వివాదాలకు తావిచ్చే వ్యాఖ్యలు చేశారు.